కలంకలల ఘలం ఘలలు

తమ రచనాశక్తిని మెరుగుపరచుకోవాలనే వాళ్ళు, ఫణీంద్రగారు రాసే పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు శ్రద్ధగా చదివితే – ఒక రచనని రచయిత కోణంలోంచి ఎలా చదవాలో చక్కగా బోధపడుతుంది….కొంతమందికి మంచి కథలు రాయటం వచ్చును, కాని వాటి గురించి విశ్లేషిస్తూ చెప్పటం రాకపోవచ్చు, మరికొంతమందికి విశ్లేషించటం వచ్చినా – కథలు రాయటం రాకపోవచ్చు. అందుకే, రెండూ తెలిసిన ఫణీంద్రగారి బ్లాగు ఔత్సాహికులకు ఒక పాఠ్యపుస్తకం లాటింది.

స్వతహాగా చిత్రకారుడు కాబట్టి సహజంగానే ఫణీంద్ర పదచిత్రాలంటే పడిచస్తారు. సాహిత్యంలో, ముఖ్యంగా కాల్పనిక సాహిత్యంలో ఇమేజరీకి చాలా ప్రాముఖ్యం ఉంది – ఒక కవితని, కథని లేదా నవలని, మామూలు రచన నుంచీ వేరుచేసేది ఇమేజరీనే. అయితే, దీనిని ఖచ్చితంగా నిర్వచించటం అంత తేలిక కాదు. ఫణీంద్రగారు ఇమేజరీ గురించీ, దాని ప్రాముఖ్యత గురించి చాలా వ్యాసాలలో సోదాహరణంగా, కొన్ని చోట్ల ఆవేశంగానూ, అంతకన్నా ఎంతో ఉత్సాహంగానూ చెప్తారు, వివరిస్తారు, విశ్లేషిస్తారు. ఈ మధ్య కాలంలో కాల్పనిక సాహిత్యంలో ఇమేజరీ గురించి ఇంత విస్తృతంగా ఇంకెవరూ రాయలేదేమో. తెన్నేటిసూరి ఛంఘీజ్‌ఖాన్ నవల గురించి రాస్తూ – ” ఈ నవల యొక్క దృక్చిత్ర పరిపుష్టతతో పోల్చి చూస్తే “గ్లాడియేటర్” లాంటి చిత్రాల ఇమేజరీ ఎందుకూ కొరగాదనిపిస్తుంది. గోబీ యెడారి, సారీకిహార్, మంచు తుఫాన్లూ, బంజర్ల జీవనం—మనకు ఊహామాత్రంగానైనా తెలియని లోకం—అంతా స్ఫటిక స్పష్టతతో మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తాడు రచయిత. కరాచర్, యాసుకై, తుఘ్రల్‌ఖాన్—వీళ్ళంతా రక్తమాంసాలతో సజీవంగా మన కళ్ళముందు నడుస్తారు, మాట్లాడతారు, కత్తులు దూస్తారు, కుట్రలు పన్నుతారు, ప్రాణాలు విడుస్తారు”

పదాల వెనక మాటలు దాగుంటాయి, ఆ మాటలు ఊపే ఊసుల ఉయ్యాలలో ఏవేవో ఊహలు, ఉత్తుంగ తరంగాలలా మీదకెగిసిపడుతూ, కిందకు దూకుతూ మనతో దోబూచులాడుతుంటాయి. ఒక రచయిత తను ఊహించిన ప్రపంచాన్ని సజీవంగా మనకి ‘సరఫరా’ చెయ్యటానికి చాలా కష్ట పడతాడు. ఈ ప్రక్రియని ఫణీంద్ర చాలా వ్యాసాలలో విపులంగా ప్రస్తావించారు.

మల్లాది రామకృష్ణశాస్త్రి కథలని పరిచయం చేస్తూ “సృజన-శిఖరపు పాదం దగ్గిర తడబడుతూ తచ్చట్లాడుతున్న ఒక ఔత్సాహిక ఆరోహకుడిగా, ఇలాంటి దృశ్య-చిత్రాల్ని ఆవిష్కరించడానికి తెర వెనుక ఎలాంటి ప్రయత్నం అవసర పడుతుందో నాకు ఇప్పుడిపుడే అనుభవానికొస్తుంది. అలాంటిది; ఆయనిక్కడ అలవోకగా, effortless precision తో చేస్తున్న వచన విన్యాసాలు చూస్తుంటే మూగ సంభ్రమంతో నోరెళ్ళబెట్టక తప్పింది కాదు.”

అందులోనే, మరోచోట – ” ఏ మాత్రం జటిలత్వం లేకుండా, భాషను మైనం ముద్దలా తన ఇచ్ఛానుసారంగా మలచుకొంటూ; రచయిత తన మస్తిష్కంలో రూపు దిద్దుకున్న ఒక దృశ్య-చిత్రాన్ని ఎంత తేలికగా మన దాకా బదిలీ చేయగలిగాడో కదా!… ”

“పదాల అధిక మోతాదు వల్ల దృశ్యం ఉక్కిరి బిక్కిరై, పాఠకుని దాకా చేరేసరికి అంతా అలుక్కు పోయి మొదటికే మోసం వస్తుంది. దీనికి విరుగుడుగా, వీరిరువురూ తమ వచనంలో కాలిక్యులేటెడ్‌గా కొన్ని ఖాళీలను [పాఠకుడి పూరణకే] వదిలేస్తారు; కొన్ని దృశ్య-వివరాల్ని విడిచి పెట్టేస్తారు. దీని పర్యవసానంగా, వారి వచనం చదువుతుంటే—వారు పదాల్ని పేర్చి ఒక దృశ్యాన్ని సమకూర్చినట్టుండదు; ముందే సజీవంగా ఉన్న ఒక దృశ్యం పై, మరింత స్పష్టత కోసం మాత్రమే, అక్కడక్కడా పదాల్ని వెదజల్లినట్లుంటుంది”

“ఇలా రచయిత మెదడులో ఊపిరి పోసుకున్న ఒక దృశ్యానికి కాంక్రీట్ రూపాన్నియ్యడానికి, ఆ దృశ్యానికి ఆయువు పట్టైన అంశాల్ని ఎక్యురేట్‌గా ఎన్నిక చేసుకోవడంలోనే రచయితల అసలు నైపుణ్యం బయట పడుతుంది.”

“కాఫ్కా, నబకోవ్ లాటి రచయితలని ఇంతగా ఇష్టపడే వ్యక్తికి చివరకుమిగిలేది ఎందుకు నచ్చలేదో?” అన్నారో మిత్రుడు ఓసారి. దానికి సమాధానం ఫణీంద్రగారే చాలా చోట్ల చెప్పారు. ఉదాహరణకి “…ఒక పాఠకుడిగా నేను అల్ప సంతోషిని: ఒక రచన నుండి నాకు నీతి అక్కర్లేదు; సో కాల్డ్ “భావుకత” అక్కర్లేదు; రచన ద్వారా విజ్ఞానాన్నీ, విషయ సంగ్రహణనూ ఆశించను; నా వ్యక్తిగత అభిప్రాయాల, సిద్థాంతాల, వాదాల సమర్థింపునూ ఆశించను—ఒక ముక్కలో తేల్చి చెప్పితే—ఒక రచనలో చక్కనైన శిల్పం, స్పష్టమైన చిత్ర సంచయం చాలు నాకు. వీటి ప్రామాణికంగానే నేను ఏ [కాల్పనిక] రచన యోగ్యతకైనా తూకం కడతాను. పదాల్లోకి రామని మొండికేస్తున్న గహనమైన భావోద్వేగాల్ని (abstract emotions) చెవి మెలిపట్టి లాక్కొచ్చి అక్షరాల వరుసలో పేర్చి కూర్చుండబెట్టగలిగే కలంకుశ ధారులైన రచయితలన్నా; కలాన్ని కుంచె మాదిరి వాడుకొంటూ అక్షరాల్తో బొమ్మలల్లగలిగే చిత్రకార-రచయితలన్నా—నాకు మిక్కిలి గౌరవం.”

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫణీంద్రగారి వ్యాసాలు చదివితే, ఆయన తాను చదివే ప్రతి పుస్తకాన్ని ఒక పాఠకుడిగా కాకుండా ఒక రచయితగా చదువుతారనిపిస్తుంది నాకైతే. చాలామందిమి ఒక కథో, నవలో, వ్యాసమో చదివితే – అందులో కథాంశంతో తృప్తి పడిపోతాం, మరికొంతమంది ఆ రచనలోని లోతైన భావాలని, తాత్వికతని లేక రచయిత అభిప్రాయాలని, వాదాలని ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నించవచ్చు. చాలా కొద్దిమంది మాత్రం, ఫణీంద్రలా ఆ రచన అనే మాధ్యమం ద్వారా రచయితని కలుసుకోవటానికి ప్రయత్నిస్తారు, ఫణీంద్రైతే ఆ రచన వెనుక దాగున్న రచనా ప్రక్రియని బేరీజు వేసే ప్రయత్నం చేస్తారు. ఆయనకి, రచనకన్నా, కథకన్నా, కథ ముంగిపు కన్నా – ఆ రచన ఎలా పుట్టింది, దానిని ఊహిస్తున్నప్పుడు, దానిని మాటల్లోకి, భాషలోకి అనువాదం చేస్తున్నప్పుడు రచయిత పడ్డ కష్టం ఎలాటిది – ఇలాటివన్నీ ఆయనకి కావాలి. ఈ సంగతి ఆయనే కొన్ని చోట్ల – ముఖ్యంగా పాఠకులు రాసిన వ్యాఖ్యలకి రాసిన సమాధానాలలో చాలా విపులంగానే విశ్లేషించారు కూడా.

ఈ దృష్టి ఆయన రాసే కథలలో ప్రతిఫలిస్తుంటుంది. ఫణీంద్ర రాసిన కథల్లో సన్నివేశాలని చిత్రీకరించటంలో, పాత్రల మనోభావాలని, వారనుభవిస్తున్న, లోనవుతున్న సంఘర్షణలని పట్టుకోవటంలో ఫణీంద్ర కనబరిచే ప్రతిభ అసాధారణం.

తమ రచనాశక్తిని మెరుగుపరచుకోవాలనే వాళ్ళు, ఫణీంద్రగారు రాసే పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు శ్రద్ధగా చదివితే – ఒక రచనని రచయిత కోణంలోంచి ఎలా చదవాలో చక్కగా బోధపడుతుంది. నేనెక్కువగా ఈయన వ్యాసాలు చదివేది ఇందుకోసమే. కథని నడిపించటంలో కొన్ని మెళకువలు నేర్చుకోవటానికి కూడా ఆయన రాసిన కథలు, వాటిపై వచ్చిన వ్యాఖ్యలు, వాటికాయన చెప్పే సమాధానాలు ఆకళింపుచేసుకొంటూ చదివితే, ఔత్సాహిక కథకులకి ఎంతగానో ఉపయోగపడవచ్చు. కొంతమందికి మంచి కథలు రాయటం వచ్చును, కాని వాటి గురించి విశ్లేషిస్తూ చెప్పటం రాకపోవచ్చు, మరికొంతమందికి విశ్లేషించటం వచ్చినా – కథలు రాయటం రాకపోవచ్చు. అందుకే, రెండూ తెలిసిన ఫణీంద్రగారి బ్లాగు ఔత్సాహికులకు ఒక పాఠ్యపుస్తకం లాటింది.
****

<<ముందు పేజీ     —      తరువాతి పేజీ>>

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

13 Responses to కలంకలల ఘలం ఘలలు

  1. ఫణి గారి రచనల్ని లోతుగా ఆస్వాదించడానికి ఈ మాత్రం వ్యాఖ్యానం కావాలి. ఆ పనికి మీరే సమర్ధులు గనక మరీ సంతోషించాను. కనీసం రెణ్ణెల్లపాటు మంచి విందూ మందూ నా బుర్రకి. ఈ లోపల ఫణి మరిన్ని కథలూ కవితలూ వెలువరిస్తారని ఆశ!

  2. Sowmya says:

    ఫణీంద్ర గారి బ్లాగుకి నేనూ అభిమానినే. కానీ..నాకు అర్థమైనంత వరకూ మాత్రమే చదివాను ఇన్నాళ్ళూ. ఈ టపా చూసాక..మిగితావి కూడా చదివి చూడాలి అనిపిస్తోంది.. 🙂

  3. వింజమూరి విజయకుమార్ says:

    పప్పు నాగరాజా గారి సమీక్ష చక్కగానూ, లోతుగానూ, వుంది. ముఖ్యంగా “పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో.” ఈ వాక్యం బావుంది. ఎందుకంటే రచన గమ్యం ఎప్పుడూ దాని జీవితం ముగిసిపోవడం కానేరదు. చదువరి జీవితాన్ని మరో నూతన దృక్పథంలోకి మళ్ళించి, పఠిత జీవితాన్ని పునః ప్రారభింపజేయగలగాలి.

  4. బంగారం విలువ కంసాలికే ఎరుక అని మీసమీక్ష ఋజువు చేసింది. ఒక పరిపూర్ణ సమతౌల్య సమీక్ష వ్రాసినందుకు అభినందనలు మాస్టారూ.

  5. radhika says:

    సమీక్ష చాలా బాగుంది.

  6. RSG says:

    ఫణీంద్రగారి ఎర్లీ అభిమానుల్లో నేనొకడిని. ఆయన రచనలు చదివినతర్వాత ఆ హాంగోవర్ నుంచి తేరుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది నాకు. మీ అంత లోతుగా విశ్లేషించలేనుగానీ, to be terse… he is IRREVOCABLY ADDICTIVE (:)

  7. RSG says:

    Im sorry, I meant his writings are IRREVOCABLY ADDICTIVE

  8. పార్టీలో పిత్తు-
    సమీక్షలు ఇంత బాగుండొచ్చా?
    ఉదా- నేను మహాప్రస్థానానికి చలం వ్రాసిన యోగ్యతా పత్రం చదివాను. శివుని ఇంటిముందు నందిలా బాగుంది.
    మీ సమీక్ష ఒక రకంగా పోటీపడుతుంది మూలంతోఁ, ఇంకొద్దిగా వినయంగా నిరార్భాటంగా వుంటే బాగుండేదేమో..
    ————————————————————————-

    తాయి ఆశీర్వాదగళముతోఁ వ్రాయడం మొదలు పట్టిన ఫణీంద్ర నిజంగా అదృష్టవంతులు.

    ————————————————————————-
    వేరే విషయమై
    తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి అన్నారు. నిజంగానంటారా? జీవితం మనకు ఎంత అందించగలదో ఎంత ఆశ్చర్యపఱచగలదో అన్న విషయాన్ని మీ వ్యాఖ్య కొంత చులకన చేయట్లేదూ?

  9. జీవితం ఎంత అందించగలదో అన్న ఆలోచన నిత్య సత్యమేమీ కాదు – అదొక వ్యక్తి అనుభవం, అనుభూతి మాత్రమే. ఒకడు ఏమీ అనుభవించకుండానే, ఆహా ఈ జీవితం అద్భుతం అనుకోవచ్చు, ఇంకోడు చాలా అనుభవించి కూడా నిస్సారం అనుకోవచ్చు. అంచేత ఇక్కడ అభావం కాలేదు. పనిలోపని – నీకక్కడ కావలసిన మాట “చులకన” కాదు .. బహుశా యద్దేవా, వెక్కిరించడం .. అలాంటిదేదో

  10. @ కొత్త పాళీ గారు,
    నాకు కావలసిన పదం చులకనే (తక్కువ చేసి మాట్లాడడం అన్న అర్థంలోఁ). ఏమైనా అది కాస్త అప్రస్తుతం ఇక్కడ. నేను ఆ ఊసు ఎత్తకుండా వుండాల్సింది.

    ఇంతకీ ఫణి గారి పుస్తకం అంటే గుర్తుకువచ్చింది. ఆయన ఎప్పుడో తన సృష్టిని ఇతరుల చేతుల్లో పెట్టడానికి భయపడుతున్నట్టు చెప్పారు (నాకు అస్సలు మాటలు గుర్తుకులేవు, వాటిని మఱీ వక్రీకరిస్తే క్షమించండి). కాబట్టి అలాంటివన్నీ ప్రక్కన పెట్టి నిజంగా ప్రచురించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అప్పటికి తెలుగు అచ్చు సాహిత్యానికి ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ.

    రాకేశ్వర

  11. vamsi says:

    ఈ సమీక్షకే ఇంకెవరైనా సమీక్ష రాయాలి ఏమో…
    రాకేశ్వర రావుగారు,
    గమ్యం ఏమిటో తెలిసి, ఆ దిసగా ప్రయానించే వాడికి ఆశ్చర్య పడే అవకాశం వుంటుందేమో కాని, గాలి ఏటు వీస్తే అటు నడిచే వాడికి ఆశ్చర్య పడే అవకాశం ఎక్కడ వుంటుంది??
    — వంశీ

  12. Prathap Reddy says:

    mee samiksha chaduvutunte… naku aa blog eppudu choostaana anipinchindi..!! phanindra kumar gari blog address pampagalaru…

Comments are closed.