“ఈ బ్లాగు చూసారా” అంటూ కొన్ని నెలల క్రితం ఓ స్నేహితుడు వేగు పంపారు. “లేదు, మీరు చెప్పారుగా, చూస్తా” అని అలవాటైన సందేశాన్ని అలవోకగా వేళ్ళు సన్నాయి నొక్కులు మీటటమూ, కనిపించిన లింకునల్లా మొక్కుబడిగా నొక్కడానికే పుట్టిన మూషికరాజం కలంకలలు అన్న లింకుని తెరవటమూ ఉత్తరక్షణంలో సమాంతరంగా జరిగిపోయాయి. కళ్ళు రెండూ బ్లాగుని, బ్లాగు రూపు రేఖలని తమలో ఇముడ్చుకొనే ప్రయత్నంలో ఉండగానే, “Impractically dreamy, Fantastically imaginative, Dangerously instinctive & Stubbornly reticent” అన్న స్వపరిచయాన్ని రుచి చూసిన పెదవులు కనీకనిపించకుండా విచ్చుకొని, “Redundantly repetitious అని కూడా చేరిస్తే పోలా” అని ఒకదానితో ఒకటి గుసగుసలాడుకొన్నట్టు లీలగా ఇప్పటికీ గుర్తు. కానీ …
ఎందుకనో భ్రుకుటి మాత్రం ముడిపడింది. ఆ వాక్యాన్ని నాలుగైదుసార్లు ముందునుంచీ వెనక్కీ, వెనకనుంచీ ముందుకీ పరిశీలించిన కళ్ళు రెండూ కుంచించుకొని, పాదరసంలా పరుగులు తీసే మెదడుని పట్టి లాక్కొచ్చి, ఆ వాక్యంపై బంధించటానికి తమ ప్రయత్నం తాము చేశాయి. కొన్ని క్షణాలపాటు అక్కడే గిరికీలు కొట్టిన మెదడు – “How beautiful!” అని తన నిర్ణయాన్ని పెదవులపైకి పంపింది. అంతకు ముందే స్వాతిశయాన్ని ప్రకటించిన పెదవులు రెండూ, సిగ్గుతో ముడుచుకోలేక చిర్నవ్వులు చిందించాయి.
సిందూరం రంగులో ఉన్న బ్లాగు మకుటం, ఏ భేషజమూలేని విషయసూచిక, చదువుకోటానికి వీలుగా తెరకి ఎడంపక్కనంతా, ఏ హంగులూ లేకుండా – కళ్ళకి ఏమాత్రమూ శ్రమలేకుండా చదువుకోగలిగే ఖతిపరిమాణం – ఇవన్నీ చూడగానే ఈ బ్లాగు ఏదో సీరియస్సు బ్లాగే అని తోచింది. “బయటపెట్టని రచన, అది ఎంత చిన్నదైనా, గుండెలమీద కుంపటిలాంటి ఇబ్బందిని కలగజేస్తుంది. ఇపుడు నాకో మాధ్యమం దొరికింది, కాబట్టి బయటకు సాగనంపేస్తున్నాను” అన్న వాక్యాలు చదవంగానే, ఈ బ్లాగు సామాన్యమైన బ్లాగు కాదని అర్థమయ్యింది. అప్పటి నుంచీ, కలంకలల బ్లాగారాధకులలో నేనూ ఒకణ్ణైపోయా.
ఈ మధ్య పొద్దు సంపాదకులు “కలంకలల బ్లాగుపై మీరో సమీక్ష రాసి పంపకూడదూ” అనడిగారు. “నా వల్లకాదు, ఆయన రాసే చాలా విషయాల గురించి నాకస్సలు అవగాహన లేదు, ఆయన తరచుగా ప్రస్తావించే కాఫ్కా, నబకోవ్ వంటివారి రచనలు నేనెప్పుడూ చదవలేదు, నాకు ఫిక్షను మీదంతాసక్తీ లేదు. కాబట్టి దుర్నిరీక్ష్యమైన ఆ బ్లాగుని నేను సమీక్షించలేను, కాని ఆ బ్లాగుపై నాకు గల అభిరుచిని ఆచితూచే ప్రయత్నం మాత్రం చెయ్యగలను” అని విన్నవించుకున్నాను. “ప్రొసీడైపోండి” అన్నారు పొద్దు చోదకులు.
కావున, ప్రియమైన పాఠకులారా – కలంకలలపై ఇదంతా “నాగొడవ” మాత్రమే సుమా!
****
హైదరాబాదులో, ఒక ఎడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఫణీంద్రకుమార్ గారు రాస్తున్న కలంకలలు బ్లాగు నిజంగానే మెదడుకి మేత. ఈ బ్లాగులో ఉన్న సాహిత్య వ్యాసాలనీ, కథలనీ, కవితలనీ, పుస్తక పరిచయాలనీ, అనువాదాలనీ ఒకటికి మూడు సార్లు చదవాలి. ఒకటోసారి – ఆ టపాలోని శైలి విన్యాసాలని ఆస్వాదించడానికి, రెండోసారి ఆ వ్యాసంలోగాని, కథలోగాని విషయాన్ని ఆకళింపు చేసుకోటానికి, మూడోసారి ఆ రచనలోని లోయలూ, గుట్టలూ, శిఖరాలు అధిరోహించుకుంటూ ప్రయాణం చేసి, దాని శిఖరాగ్రాన ఒంటరిగా, ధైర్యంగా, సాలోచనగా ప్రపంచాన్ని పరికిస్తున్న ఒక సౌందర్యారాధకుడిని కలుసుకోవటానికి చదవాలి.
అందరూ రాయగలరు. చాలా మంది రాస్తారు, రాస్తున్నారు. కాని రచనలు చేసే సామర్థ్యం కొంతమందికే ఉంటుంది. ఆపైన, రచనని ఒక తపస్సుగా సాధన చేసే శక్తీ, ఆసక్తీ, అంకితభావమూ మాత్రం కోటికొకరికి మాత్రమే లభించే వరమో, శాపమో.
తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవటం ద్వారా – రాసేవారినుంచీ, రాయగలిగేవారినుంచీ రచయిత వేరుపడతాడు. ఏదో బుర్రకి తోచింది, అనాలోచితంగా రాసేసే వాళ్ళ రాతల్లో, వారు కూర్చే వాక్యాల్లో పదాలు – భోజనాలు అయింతర్వాత తూము దగ్గర పనిమనిషికోసం ఎదురుచూస్తూ అస్తవ్యస్తంగా పడున్న అంట్లగిన్నెల్లా ఉంటాయి. అంతోఇంతో సాధన చేసే వారి రచనల్లోనైతే అవే పదాలు – వీధికొళాయిముందు వరసగా పేర్చిన సిల్వరు బిందెల్లా ఉండొచ్చు. అవే పదాలు ఒక మధురాతంకం రాజారాం, మరో ముళ్ళపూడి, ఇంకో మల్లాది చేతుల్లో అయితే – స్కూలు గంట కొట్టగానే, నీలం నిక్కర్లూ, తెల్ల చొక్కాల స్కూలు యూనిఫారములలో గుత్తులు గుత్తులుగా, మైదానంలో ఆడుకోటానికి సందడిగా వడి వడిగా పరుగులెత్తుకొంటూ పోతున్న పసిపాపలని గుర్తుకు తెస్తాయి. అందుకే వీరి శైలి – కోవెలకెళ్ళే దారిలో జట్లు జట్లుగా నడుస్తున్న ముత్తైదువుల పూల సజ్జల్లోంచీ కొద్దిగా తొంగి చూస్తూ, కన్నుగీటుతూ మనతో పరాచికాలాడే కనకాంబరం దండలలాగనో , అమ్మ చంక అనే ఒక సుఖాసనాన్ని అధిరోహించి, ఆమె భుజం మీదనుంచీ వెనక వచ్చే వాళ్ళతో పలకరింపుగా, చిలిపి చేష్టలు చేసే చిన్నపిల్లల్లాగనో ఉంటుంది.
ఫణీంద్రకుమార్ గారికి కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది, ఆ శైలికో విశిష్టతుంది. “ఇంత పెద్ద వాక్యాలు చదువుకోవటం కష్టంగా ఉంది” అని ఓ పాఠకుడు మొరపెట్టుకొంటే, దానికి సమాధానంగా ” ఒక వాక్యం మొదలు పెట్టామంటే పాఠకుడ్ని ఒక ఆలోచన మీదనో, దృశ్యం మీదనో ఆద్యంతం ఊరేగించి పుల్‌స్టాప్ దగ్గిర పల్లకీ నుంచి సంతృప్తుడిగా క్రిందకు దించాలన్నది నా సిద్థాంతం” అన్నారు ఫణీంద్ర. ఆ మాటలకి నిలువెత్తు సాక్ష్యాలు ఆయన రచనలలో ఎన్నో చోట్ల మనలని పలకరిస్తాయి.
నడిచే కవితలో “ఓ స్వయం సమర్థిత సౌందర్య సంవర్తమా నన్నిలా నీ సమాంతర ప్రపంచంలోకి లాగేసి ఏం చేయజూస్తున్నావు?”
మరోచోట “మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్పలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”
నేను సాహిత్యాన్ని అన్న కాఫ్కా రచనని తెలుగులోకి చేసిన అనువాదంలో “ఇలా స్వప్నాల్లో బాధ్యతారాహిత్యంగా తమ ఖడ్గాలు ఝుళిపిస్తూ, అమాయకంగా శయనిస్తున్నవారిని యథేచ్ఛగా పొడుస్తూపోయే ఈ పురాతన యుద్ధవీరుల విచ్చలవిడి విహారాన్ని ఎవరు సహిస్తారు?”
ఈ వాక్యాలు చదువుతూంటే ఏమనిపిస్తోంది? గణతంత్ర దినో్త్సవం నాడు, రాజమార్గంలో సగర్వంగా, నేపథ్యంలో వినవస్తున్న మిలటరీ బాండ్ కి అనుగుణంగా అడుగులు వేస్తూ, రాష్ట్రపతి ముందు – ఒక్క క్షణం ఆగి, వీరోచిత వందనం సమర్పించి వెంటనే ముందుకు సాగిపోయే భారత సైనిక బృందాలు చేసే కవాతు గుర్తుకు రావటం లేదూ?
ఈ బ్లాగులో, ప్రతి పదానికి ఓ నిర్దేశిత స్థలమూ, ఆకారమూ, లక్ష్యమూ ఉంటుంది, అంతేకాకుండా ప్రతిపదానికి తన పక్కనున్న పదాలతో పరిచయమూ, బాంధవ్యమూ ఉంటాయి. అవన్నీ ఒక వాక్యంలో తమ తమ నిర్దేశిత కార్యాన్ని రచయిత అభీష్టానుసారం నిర్వహించి, పాఠకుడి ముందోక్షణం తలలు వంచి, తరువాత వస్తున్న వాక్యానికి దారి చేస్తూ ముందుకు సాగిపోతాయి. పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో. అవి పయనించే దారిలో ఎదురైన ఒక బాటసారి మాత్రమే పాఠకుడు.
****
ఫణి గారి రచనల్ని లోతుగా ఆస్వాదించడానికి ఈ మాత్రం వ్యాఖ్యానం కావాలి. ఆ పనికి మీరే సమర్ధులు గనక మరీ సంతోషించాను. కనీసం రెణ్ణెల్లపాటు మంచి విందూ మందూ నా బుర్రకి. ఈ లోపల ఫణి మరిన్ని కథలూ కవితలూ వెలువరిస్తారని ఆశ!
ఫణీంద్ర గారి బ్లాగుకి నేనూ అభిమానినే. కానీ..నాకు అర్థమైనంత వరకూ మాత్రమే చదివాను ఇన్నాళ్ళూ. ఈ టపా చూసాక..మిగితావి కూడా చదివి చూడాలి అనిపిస్తోంది.. 🙂
పప్పు నాగరాజా గారి సమీక్ష చక్కగానూ, లోతుగానూ, వుంది. ముఖ్యంగా “పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో.” ఈ వాక్యం బావుంది. ఎందుకంటే రచన గమ్యం ఎప్పుడూ దాని జీవితం ముగిసిపోవడం కానేరదు. చదువరి జీవితాన్ని మరో నూతన దృక్పథంలోకి మళ్ళించి, పఠిత జీవితాన్ని పునః ప్రారభింపజేయగలగాలి.
బంగారం విలువ కంసాలికే ఎరుక అని మీసమీక్ష ఋజువు చేసింది. ఒక పరిపూర్ణ సమతౌల్య సమీక్ష వ్రాసినందుకు అభినందనలు మాస్టారూ.
సమీక్ష చాలా బాగుంది.
ఫణీంద్రగారి ఎర్లీ అభిమానుల్లో నేనొకడిని. ఆయన రచనలు చదివినతర్వాత ఆ హాంగోవర్ నుంచి తేరుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది నాకు. మీ అంత లోతుగా విశ్లేషించలేనుగానీ, to be terse… he is IRREVOCABLY ADDICTIVE (:)
Im sorry, I meant his writings are IRREVOCABLY ADDICTIVE
పార్టీలో పిత్తు-
సమీక్షలు ఇంత బాగుండొచ్చా?
ఉదా- నేను మహాప్రస్థానానికి చలం వ్రాసిన యోగ్యతా పత్రం చదివాను. శివుని ఇంటిముందు నందిలా బాగుంది.
మీ సమీక్ష ఒక రకంగా పోటీపడుతుంది మూలంతోఁ, ఇంకొద్దిగా వినయంగా నిరార్భాటంగా వుంటే బాగుండేదేమో..
————————————————————————-
తాయి ఆశీర్వాదగళముతోఁ వ్రాయడం మొదలు పట్టిన ఫణీంద్ర నిజంగా అదృష్టవంతులు.
————————————————————————-
వేరే విషయమై
తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి అన్నారు. నిజంగానంటారా? జీవితం మనకు ఎంత అందించగలదో ఎంత ఆశ్చర్యపఱచగలదో అన్న విషయాన్ని మీ వ్యాఖ్య కొంత చులకన చేయట్లేదూ?
జీవితం ఎంత అందించగలదో అన్న ఆలోచన నిత్య సత్యమేమీ కాదు – అదొక వ్యక్తి అనుభవం, అనుభూతి మాత్రమే. ఒకడు ఏమీ అనుభవించకుండానే, ఆహా ఈ జీవితం అద్భుతం అనుకోవచ్చు, ఇంకోడు చాలా అనుభవించి కూడా నిస్సారం అనుకోవచ్చు. అంచేత ఇక్కడ అభావం కాలేదు. పనిలోపని – నీకక్కడ కావలసిన మాట “చులకన” కాదు .. బహుశా యద్దేవా, వెక్కిరించడం .. అలాంటిదేదో
@ కొత్త పాళీ గారు,
నాకు కావలసిన పదం చులకనే (తక్కువ చేసి మాట్లాడడం అన్న అర్థంలోఁ). ఏమైనా అది కాస్త అప్రస్తుతం ఇక్కడ. నేను ఆ ఊసు ఎత్తకుండా వుండాల్సింది.
ఇంతకీ ఫణి గారి పుస్తకం అంటే గుర్తుకువచ్చింది. ఆయన ఎప్పుడో తన సృష్టిని ఇతరుల చేతుల్లో పెట్టడానికి భయపడుతున్నట్టు చెప్పారు (నాకు అస్సలు మాటలు గుర్తుకులేవు, వాటిని మఱీ వక్రీకరిస్తే క్షమించండి). కాబట్టి అలాంటివన్నీ ప్రక్కన పెట్టి నిజంగా ప్రచురించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అప్పటికి తెలుగు అచ్చు సాహిత్యానికి ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ.
రాకేశ్వర
ఈ సమీక్షకే ఇంకెవరైనా సమీక్ష రాయాలి ఏమో…
రాకేశ్వర రావుగారు,
గమ్యం ఏమిటో తెలిసి, ఆ దిసగా ప్రయానించే వాడికి ఆశ్చర్య పడే అవకాశం వుంటుందేమో కాని, గాలి ఏటు వీస్తే అటు నడిచే వాడికి ఆశ్చర్య పడే అవకాశం ఎక్కడ వుంటుంది??
— వంశీ
mee samiksha chaduvutunte… naku aa blog eppudu choostaana anipinchindi..!! phanindra kumar gari blog address pampagalaru…
ప్రతాపరెడ్డి గారూ, ఈ సమీక్ష రాసిననాటి బ్లాగు అడ్రసు మారింది. కొత్త అడ్రసు: http://loveforletters.blogspot.com/ సంపాదకుడు