పద్యాల గురించి చెప్పేముందు పద్యాలకీ నాకూ ఉన్నట్టి అనుబంధమేమిటో, చెప్పటానికి నాకు అర్హత ఉందో లేదో తేల్చే ప్రయత్నమే ఈ పరిచయం. సాధ్యమైనంతవరకూ అందరికీ అర్థమయ్యేలా నేడు వాడుకలో ఉన్న వ్యావహారికభాషలోనే రాయడానికి ప్రయత్నిస్తాను, అవసరమైతే వ్యాకరణాన్ని (ప్రస్తుతానికి) పక్కన పెట్టి.
నాకు గుర్తున్నంతవరకూ నాకు అసలు పద్యం రాద్దామనిపించింది నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు. అప్పుడు మతిహీనుడు అని ఒక పాఠం ఉండేది. అందులో “గర్గుఁడను విప్రుఁడొకరుడు దుర్గారాధనముఁ బెక్కు దొసగులబడచున్…” అని ఒక కంద పద్యం ఉంది. అది చూసి ఎందుకోగానీ నాకు కూడా ఒక పద్యం రాయాలనిపించింది. బహుశా నేను మా నాన్నగారి వద్ద చిన్నప్పటినుంచీ విన్న అనేక చాటువులదో లేదా పోతన భాగవత పద్యాలదో ప్రభావం కావచ్చు. మొత్తానికి ఎలా రాయాలో అప్పటివరకూ ఎక్కడా చదవలేదు. అప్పుడు నా బుర్రకి తోచినట్టుగా అదే పాఠంలో ఉన్న ఏదో రెండు మూడు కందపద్యాలు గమనించాను. ఏదో లీలగా అర్థమైంది. ఏమని? మొదటి పాదం చిన్నది, రెండోది పెద్దది. మళ్లీ మూడోది చిన్నది, నాల్గోది పెద్దది అని. ఒక పద్యం తీసుకుని ఒక్కో పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కపెట్టాను. ప్రతీ పాదానికీ అన్నే అక్షరాలు వచ్చేలా ఒక కందపద్యం రాసేశాను, ఏకలవ్యుడి మీద. ఎందుకో అప్పట్లో ఏకలవ్యుడిమీద బాగా గురి ఉండేది (ఇప్పుడు లేదని కాదు). అన్నట్టు మరో విషయం. ఇంకా చిన్నప్పుడు, అంటే ఎనిమిదో తరగతిలోకి రాకముందే, బహుశా నాల్గో తరగతిలో అనుకుంటాను, అప్పట్లో పద్యాలు బట్టీ పట్టి రాయాల్సి వచ్చేది పరీక్షల్లో. పద్యం మొత్తం బట్టీ కొట్టేసినా మళ్ళీ దాన్ని పాదాలకింద విడగొట్టి రాయాలి కదా, అసలే చిన్నతనమేమో అక్కడ వచ్చేది చిక్కంతా. పైగా క్లాసులో ఫస్ట్ రావాలి, మనని టీచరు మెచ్చుకోవాలి అన్న ధ్యాస తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు.
|
యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ. |
|
అలా ఒకసారి క్వార్టర్లీ పరీక్షలకి చదువుతూంటే ఎందుకో ఎలానో స్ఫురించింది పాదాలుగా విడగొట్టడానికి ఒక టెక్నిక్. ప్రతీ పాదానికీ రెండో అక్షరం ఒకే గుణింతంలోంచి వస్తోంది. దొరికిందిరా జుట్టు అనుకున్నాను. కానీ కొన్ని పద్యాలకి ఇలా కుదరట్లేదు. కుదరకపోతేనేం? భలే భలే, నాకు తెలియదేంటి? పరీక్షల్లో అలాంటి పద్యాలు అడిగేవారేకాదు. ఏవో కొండపల్లి చేంతాడంత పద్యాలే అడిగేవారు. మీకూ గుర్తుండే ఉంటుంది, ఉదాహరణకి “పెంపునఁ దల్లివై … … … … దాశరథీ కరుణాపయోనిధీ” అని ఇచ్చి పూరించమనేవారు. అలా దానిని ప్రాస అని పిలుస్తారని తెలియకపోయినా ప్రాస గురించి ముందే తెలియడం వలన నేను ఏకలవ్యుడిమీద రాసిన పద్యంలో ప్రాస ఉండేలానే రాసాను. ఇంకో విషయం. మా చిన్నప్పుడు (నేను ఏడో తరగతి చదవడం అయ్యింతర్వాతనుంచీ) మా ఊళ్ళో — అన్నట్టు చెప్పనే లేదు కదూ మాది అమలాపురంలెండి — భారతీయ శిక్షణా మండలి వాళ్ళు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించేవారు. వాళ్ళు కూడా పద్యాలు పాటలూ నేర్పేవారు. ఆ పద్యాల్లో ఎక్కువ సుమతీ శతకం లోవి.
అప్పుడు వాళ్ళు నేర్పిన పద్యాలు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక టెక్నిక్ స్ఫురించిందండోయ్. ఒక ఉదాహరణ చెప్తాను. “ఇచ్చునదె విద్య … వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ”, “ఎప్పుడు సంపద కలిగిన … గప్పలు పదివేలు జేరుఁ గదరా సుమతీ” లాంటి పద్యాల్లో సుమతీ అన్న పదానికి ముందు కదరా, వసుధను, నిక్కము లాంటి పదాలు వాడినప్పుడు మాత్రం పెద్ద తికమకగా ఉండేది ఏది ఎక్కడ వస్తుందో గుర్తుంచుకోడానికి. అప్పుడు గమనించిన విషయం — గప్పలు వస్తే గదరా అని వచ్చింది, వచ్చునదే వస్తే వసుధను వచ్చింది అని. బద్దెనగారు నాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోడానికి వీజీగా ఉంటుందని అలా రాసారేమో అనుకున్నాను. అందువల్ల ప్రాసకుదిరేలా రాయడమైతే రాసాను గానీ యతిని గాలికొదిలేశాను. దానిని యతి అంటారని ఒక సంవత్సరన్నర పోయినతర్వాతగానీ తెలియలేదు నాకు. యతి, గణాలు గట్రా లేవు కాబట్టి ఒక ముప్పావుగంటలో పద్యం రాసేశాను. అలా రాసిన పద్యాన్ని మా తెలుగు టీచరమ్మ విజయగార్కి చూపించాను. ఆవిడ తెగ సంబరపడిపోయి భలే రాసావురా నాన్నా అని మెచ్చేసుకుని మా హెడ్మేష్టారిక్కూడా చూపించారు. ఇంక ఆవేళ నాకు నేలమీద కాళ్ళు నిలవలేదు ఇంటికి వెళ్ళి మా నాన్నారికి దాన్ని చూపించేవరకూ.
సాయంత్రం నాన్నగారు ఆఫీసునుంచి వచ్చాక ఎగురుకుంటూ వెళ్ళి “నాన్నోయ్ నేనొక పద్యాన్ని రాశాను” అని చూపించాను. అది చూసి, అప్పుడు ఆయన చలపతిరావుగారి సులభవ్యాకరణం తెచ్చి చూపించారు. అందులో చందస్సు విభాగాన్ని తీసి, అసలు గణాలు అంటే ఏమిటో కందపద్యం అంటే ఎలా ఉంటుందో చెప్పారు. భరనభభరవ ఉత్పలమాల, నజభజజజర చంపకమాల అని ఆయన అప్పుడు చెప్పినవి ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పుడు అర్థమైంది నేను రాసినదాన్ని పద్యం అనరని. తర్వాతరోజునుంచీ స్కూల్లో నేను పద్యం రాసిన ఊసెత్తితే ఒట్టు. అలా పద్యాలు రాయడం తాత్కాలికంగా పక్కనపెట్టినా ఎప్పటికైనా అన్నీ నేర్చేసుకుని నాన్న మెచ్చుకునేలా పద్యం రాసెయ్యాలని మాత్రం మనసులో ఉండిపోయింది.
తర్వాత తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మేష్టారు రామకృష్ణగారు. ఆయన దగ్గర ఉన్న చనువుకొద్దీ ఆయన తెచ్చుకున్న పుస్తకాలు కెలికే మంచి అలవాటొకటి ఉండేది నాకు. అలా ఒకరోజు పదోతరగతి పాఠ్యపుస్తకం చూసాను. అందులో ఎక్కడో కందపద్యం గురించి ఉందని చూశాను. ఇంకేం? కోతికి మళ్ళీ కొబ్బరికాయ దొరికింది. మొత్తం చదివేశాను. నాకు పూర్తిగా అర్థంకాలేదు. అందువల్ల దీనికన్నా ముందు ఏమేం చెప్పారా అని చూసాను. గణాలు విభజన ఆటవెలది తేటగీతి ఇంకా ఏవేవో ఉన్నాయ్. ఓపిగ్గా కూర్చుని అన్నీ చదివేశాను. ఇంక ఏదో ఒక పద్యం రాయడమే తరువాయి. సందర్భమో? అప్పుడు వచ్చింది ఆగష్టు పదిహేను. వారంరోజులు కుస్తీపట్టి ఛత్రపతి శివాజీ నేతాజీ గాంధీ లాంటివాళ్ళ పేర్లు వచ్చేలా ఛచ్ఛీచెడీ ఒక ఆటవెలది రాసాను భారతదేశంమీద (నాకా పద్యం ఇప్పుడు గుర్తులేదు). దాన్ని మా క్లాసులో డెకరేట్ చేసాను కూడా. అలా ఆటవెలదితో ప్రారంభం. తర్వాత అష్టదిగ్గజాలమీద ఒకటి రాసాను. ఈ రెండూ ఏదో తవికల్లా వచ్చాయి. అందం లేదు, పలుకుతుంటే ఒక పొందిక లేదు, సొగసు సంగతి సరేసరి. పదాలకి నడ్డి విరగ్గొట్టి బలవంతాన ఒక మూలన ఇరికించినట్టుగా అనిపించేది. అప్పుడు చిన్నప్పట్నుంచీ నేర్చుకున్న ఆటవెలదులన్నీ చదివాను. ఒక నడక బోధపడింది. ఇక మొదలు ఏ పండగ వచ్చినా సరే పద్యం రాసెయ్యాల్సిందే. పైగా మా రామకృష్ణగారు కూడా ఆ పద్యాన్ని క్లాసులో పైకి చదివి నా చేత అర్థం చెప్పించి చప్పట్లు కొట్టించేవారు. అది చాలదూ అప్పట్లో మళ్ళీ మళ్ళీ రాయాలని అనిపించడానికి?
|
నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్య:స్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు. |
|
ఆటవెలదులైపోయిన తర్వాత నేను డైరెక్టుగా దూకింది మళ్ళీ కందం మీదకే. ఆ విధంగా ఛందోబద్ధంగా నేను రాసిన మొదటి కందం — “అందరి పూజలు పొందుచు కొందరికే నీదియైన కరుణను వొసగన్, నీదయ నాపై కలుగగ వందన మిదియే రఘువర వందన మిదియే” అని. హమ్మయ్య. ఈసారి నాన్న ఈ పద్యాన్ని చూసి (ఒక్క చిన్నదోషం మినహాయించి) బాగుందిరా అన్నారు. ఇంకేం ఏనుగెక్కేసినంత సంబడం. ఆ తర్వాత ఒక సీసపద్యం, రెండో మూడో ఉత్పలమాలలు, మరో రెండు ద్విపదలూ రాసాను. ఇదంతా నేను స్కూల్లో ఉన్నప్పటి మాట.
స్కూల్లో ఉన్నప్పుడే కొత్తగా పదమేదైనా తెలిస్తే దాన్ని గుర్తుంచుకోవడానికని పద్యాలు రాసేయడం ఒకటి మొదలైంది. ఒకసారి అలాగే పదో తరగతిలో ఉండగా “ఆపగ” అన్నది కూలంకషకి పర్యాయపదమని చదివాక “ఉ. ఆపగ పారినట్లు మది నా హరి మీదనె కల్గు భక్తియూ ఏ పగ కల్గకుండ ఇల ప్రేమను పంచెడిదైన స్నేహమూ మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయూ ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా” అని పద్యం రాసి మా మిత్రుడు బందా కార్తికేయకి ఇచ్చాను.
నాకు మొదటి నుంచీ కందాలంటే అభిమానమెక్కువ. రెండో క్లాసులో ఉండగా రాగయుక్తంగా కందాలని వప్పజెప్పానని మా టీచరమ్మ క్లాసులో నాచేత మిగతా వాళ్ళకి చెప్పించేది కూడా. కందాలమీదున్న ఆ అనుబంధంవల్ల నేను ఇంటర్లో ఉన్నప్పుడు అన్నీ కందాలే రాసాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారితో పరిచయం అయ్యింది. ఆయనకి చూపించేవాడిని నేను రాసిన పద్యాలన్నీ. ఆయన ఒకసారి నా పద్యాలు చూసి “పద్యం నడకను మిక్కిలి హృద్యంగా పట్టినావు యిట్టే బాగా సద్య:స్ఫూర్తికి నెలవే విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే” అని నాకో కందం రాసిచ్చి ఆశీర్వదించారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు కందాలంటే ఉన్న అభిమానం ఎంత ఎక్కువంటే మూడేళ్ళ క్రితం వరకూ నేను ఎప్పుడూ ఒక్క తేటగీతి కూడా రాసి ఎరుగను.
అలానే నేను ఇంటర్లో ఉన్నపుడు ఒకసారి మాడగుల నాగఫణిశర్మగారు ఇచ్చిన ఒక కందపద్య సమస్యని కూడా పూరించి దూరదర్శన్ కి పంపించాను (అదేమిటోగానీ నేను వీక్షించిన మొదటి, చివరి సమస్యాపూరణం కార్యక్రమం అదే). ఇప్పటికీ నన్ను బాధపెట్టే విషయం ఏమిటంటే నేను అప్పుడు పూరించిన పూరణగానీ, పోనీ ఆ సమస్యగానీ ఇప్పుడు నాకు గుర్తులేవు. అంతకు ముందు రాసిన చాలా పద్యాలు కూడా ఎక్కడ రాసానో గుర్తులేదు, ఏమైపోయాయో తెలియదు. సరీగ్ఘా అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవ్వకూడదనే ఈ మధ్యన నేను రాసిన పద్యాలని వాగ్విలాసమనే నా బ్లాగులో ప్రచురించడం మొదలుపెట్టాను (కొన్ని ప్రచురించకుండా కేవలం సేవ్ చేసిన పద్యాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం).
నేను చదివిన పుస్తకాలా? నేను చాలా బద్ధకిష్టుని. నేను పాఠ్యపుస్తకాలలో తప్పితే ఎక్కడా పద్యాలు చదివే వాడినేకాదు. ఏదో ఈ మధ్యనే మా సగోత్రీకుడైన పోతనగారి భాగవతంతో శ్రీకారంచుట్టి పూర్వకవులు రాసిన కావ్యాలు చూడడం మొదలుపెట్టాను. అందులో మొదటి స్కంధమే పూర్తికాలేదనుకోండి ఇంతవరకూ.
ఇక మా కుటుంబ నేపథ్యమంటారా? మా తాతగారైన ముక్కు శ్రీరామచంద్రమూర్తి గారికి తెలుగు సంస్కృతాలు చక్కగా వచ్చును. మా పెదతాతలు ఇద్దరూ ఉభయభాషాప్రవీణలేనట. మా పెదనాన్నగారు కూడా బోలెడు పద్యాలు రాసేవారట ఆయన చిన్నతనంలో. నా ప్రథమగురువైన మా నాన్నగారికి పద్యాలన్నా సంగీతమన్నా ఆసక్తి మెండు. నాకు తెలిసి ఆయన పద్యాలు రాద్దామని ఎప్పుడూ ప్రయత్నించనే లేదు. ఏవో కొన్ని కవితలు మాత్రం రాసారు.
ఈ మధ్య నేను రాసినవాటిలో నాకు సంతృప్తినిచ్చినవి అర్థనారీశ్వర పంచాక్షర స్తోత్రాల ఆంధ్రీకరణలూ, అవి కాక కొన్ని పద్యాలూను.
మరో విషయం ఏంటంటే నాకు సరైన సమయంలో తగిన ప్రోత్సాహం లభించింది కాబట్టిగానీ లేకపోతేనా అసలు నాకు పద్యాలు రాయగలిగే శక్తెక్కడిది? నాకు ప్రోత్సాహాన్నందించిన వారికందరికీ ముఖ్యంగా మా నాన్నగారైన త్రినాథశర్మగారికీ, విజయ మేడమ్‌కి, రామకృష్ణ మేష్టారికి, రామ్మోహన్ మేష్టారికి, మా తాతగారైన బ్రహ్మశ్రీ మంగళంపల్లి రామనరసింహమూర్తిగారికీ నేను ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
చివరిగా ఒక్క మాట. నా గురించి ఇంత విన్నాక కూడా మీకింకా నేను పద్యాల గురించి చెప్పే విషయాలమీద ఆసక్తి నిలిచే ఉంటే ఆ సంగతులన్నీ తప్పకుండా మరో మారు ముచ్చటించుకుందాం.
ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.
రాఘవా, చాలా బావుంది..రెండు అభ్యర్ధనలు – ఒకటి,సేవ్ చేసి ఉంచిన పద్యాలు ప్రచురించండి, రెండు, మరో వ్యాసము మీరు బ్లాగులో పెట్టిన పద్యాలను పరిచయం చేసి, మీకు నచ్చిన వాటి గురించి వివరాలు రాయండి (ప్రేరణ, రాయడానికి పట్టిన సమయం లాంటివి)..
రాఘవ గారూ, అద్భుతంగా రాశారు. మీరు తెలుగు సాహిత్యాభిమానులకి మంచి స్ఫూర్తి ప్రదాత అంటే అతిశయోక్తి కాదు. మీరు మంచి కావ్యాలు వ్రాసి ఖ్యాతి గడించాలని మనసారా కోరుకుంటున్నాను.
భలే తమ్ముడు
చదివాక చాలా ఆనందం గా ఉంది నాకు
మొదటి సారి నీ బ్లాగు చదవగానే “కత్తిలా ఉందే ” అనుకున్నా
అలాంటి బ్లాగు మళ్ళి చూడలే…..చూడకూడదు అనుకుంటున్నాను కూడా
నీ నుంచీ మరిన్ని పద్యాలను ఆశిస్తున్నాను
నాకూ చాలా ఆనందంగా వుంది. మా తెలుగు మాష్టారు బి.ఎ.రామ్మోహన రావు గారి గుఱించి ఇలా మీరు వ్రాసిన స్వగతంలో చదివి. ఇక కవితలతో మీకున్న వాగ్విలాసము జూసి నాకు కొంత ఈర్ష్య కలుగుతుందని ఒప్పుకోకతప్పట్లేదు.. 🙂
చాలా బాగా వ్రాశారు. నాకు పద్యాలు చదవడమంటే ఇష్టం 🙂