పరివ్యాప్త, స్త్రీ సమస్యలను ఒకచోట కూర్చిన కవిత్వ ప్రయత్న సంకలనం. ఇందులో అనేక స్త్రీ సమస్యలు వున్నాయి. భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభ – వీటన్నిటిపై స్పందించిన 100 మంది కవులు, కవయిత్రులు వున్నారు. వీరిలో లబ్ద ప్రతిష్టుల నుండి విద్యార్థుల వరకూ వున్నారు. కొత్త, పాత కలయికలతో నాలుగు తరాల కవులున్నారు. కొత్తవారికిది ప్రోత్సాహమే అయినా సమస్యాత్మక అలోచనాధారకు కొంచెం విఘాతం కలిగే అవకాశంవుంది. ఇందులోని కొన్ని కవితలు వివిధ పత్రికలలో ముద్రింపబడినప్పటికీ మొత్తంగా చూసినప్పుడు పత్రికల్లో వచ్చినవి తక్కువే కనిపిస్తాయి. సంపాదకురాలు వ్యయప్రయాసలకోర్చి ఒక్కచోట చేర్చడం, వాటిని సంకలనంగా తేవడం అభినందనీయం. స్త్రీ సమస్యలు అనగానే పురుష వ్యతిరేకత కాదు అని తనముందుమాటలో చెప్పుకున్నట్టు “మానవీయ స్పర్శ” తో చూడవలసిన అవసరాన్ని తెలియజేసాయి, ఇందులోని కవితలు. ఇంకా ఇందులో స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పే కవితలు, అమ్మగురించి చెప్పే కవితలు, వివిధ సంఘటనలకు స్పందించిన కవితలు, వేదనలు, నిర్వచనాలు, ముందడుగు వేయటానికి స్ఫూర్తినిచ్చే కవితలూ కనిపిస్తాయి.
స్త్రీల సమస్య అనగానే నాకు కొందరు స్త్రీల జీవితాలు గుర్తుకు వచ్చాయి…
నాయనమ్మ – వందయేళ్ళనాటి మాట.. మతం మార్పిడి, వెలివేత, దాడులు, వలస, వైధవ్యం, పిల్లలపోషణ, వాళ్ళచదువులు – వీటి వెనుక ఆమె కోల్పోయిన, పొందిన స్వేచ్ఛ.
అమ్మ – చదువు, వివాహం, కానుపుల వెంబడి కానుపులు, తరచుగా బదిలీలు, చాలీచాలని ఆర్థిక వెసులుబాటు – వీటి మధ్య నలిగిపోయిన మనసు స్వేచ్ఛ.
అవివాహితలుగా వున్నకొందరు – ఆర్థిక అస్థిరత, ప్రేమ వంచన, సమాజపు సూటిపోటి మాటల మధ్య జీవితం వెళ్ళదీస్తున్న జీవితం
గృహనిర్బంధపు జీవితం – ఇల్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియకుండా నిర్బంధింపబడిన వాళ్ళు వున్నారు – వాళ్ళు కోల్పోయిన స్వేచ్ఛ.
కొన్ని వేశ్యా జీవితాలు – బలవంతంగా మార్చబడే జీవితాలు, ప్రోత్సాహకంగా మార్చబడే జీవితాలు, మోసపూరితంగా మార్చబడే జీవితాలు, సరదాగా మార్చబడే జీవితాలు, ధనార్జన కోసం మార్చబడే జీవితాలు.
నాకు తెలిసిన జీవితాలు వేరొకరికి ఎలా తెలిసాయా అనేది ప్రశ్న. వ్యక్తులు, సందర్భాలు, స్థలాలు మారవచ్చుకాని సమాజంలోవున్న పరిస్థితులు ఒకేలా వున్నాయనిపిస్తుంది.
ఈ కవితల్ని చదువుతున్నప్పుడు తలెత్తే ప్రశ్నలెన్నో! రూపంలో ఎలావున్నా.., ఇంకా స్త్రీ సమస్యలకు నిర్వచనాల్ని వెదుక్కోవడం శోచనీయం.
వీటన్నిటికీ పురుషుడే కారణమా? పురుష ఆధిక్యతే కారణమా? అక్షరాస్యత లోపమా? అజ్ఞానమా? ఇంకా ఏమైనానా??
ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆలోచనల్తో బుర్రవేడెక్కుతుంది.
మరి అప్పుడప్పుడూ బయటపడే మానసిక వికృత ప్రవృత్తులకు ఏది కారణం? – అలోచించవలసిందే.
- నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే ప్రవృత్తి విద్య నేర్పే దామోదర్ జ్ఞానాన్ని కప్పివేసింది.
- ఇదే రకమైన ప్రవృత్తి మనోహర్ వుదంతం.
- వీరికి భిన్నంగా వెలుగుచూసిన వుదంతం, తిరుపతిలో ఉన్నత విద్యాసంస్థలలో బోధనచేసే (పేరు గుర్తురావటంలేదు) స్త్రీ వేశ్యా వృత్తిని ప్రోత్సహించడమే కాకుండా, కేంద్ర బిందువుగా మారటం.
ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి విద్య ఎంతవరకూ సమస్యల్ని తీరుస్తుంది అనేది సందేహమే.
కొందరు బయట పడుతుంటారు. బయటపడకుండా వేధించే వాళ్ళగురించి ఏమిటి??
ఈ విషయాలను, పరిస్థితులను చూస్తున్నప్పుడు లోపం ఎక్కడున్నదనే ప్రశ్న తలెత్తుతూ వుంటుంది.
పురుషాధిక్య భావజాలం, స్త్రీ ని భోగ వస్తువుగాను, సంతాన పునరుత్పత్తి సాధనంగానూ మాత్రమే చూడటం – ఇవి ప్రధాన కారణాలు కావచ్చు.
లింగ వివక్షతను అర్థంచేసుకోవటంలోని భావజాలాన్ని మార్చుకోవలసిన అవసరంవుంది. సమాజం లో వేళ్ళూనుకుపోయిన భావ జాలాల దృష్ట్యా చూస్తే కొన్ని రకాల స్త్రీ సమస్యలకు కేవలం పురుషుడే కాదు, స్త్రీ కూడా కారణం అని తోస్తుంది. ఈ కొత్త కోణం నుండి స్త్రీ సమస్యలని పరిష్కరించే దిశగా అడుగులువేయటానికి, ఇప్పటికే నడిచివెళ్ళిన వారి అడుగుజాడలు వెతుక్కోవటానికి ఈ సంకలనం ఉపయోగపడుతుందని, ఉపయోగపడాలని అభిలషిస్తున్నాను.
లోపలిపేజీల్లోకి తొంగిచూస్తే..
కలలప్రియదర్శిని (జాన్ హైడ్ కనుమూరి) 120పే
“ఆదినుంచి
వర్గవర్గాలుగా విభజింపబడ్డ భూమిపై
నీ శ్వాస కేర్‌మన్నప్పుడే
అవమానం కొండచిలువై
మింగాలని ప్రయత్నిస్తోంది
మింగలేనప్పుడు
ఆశలపండేదో తినేటట్టుచేస్తుంది
నడుస్తున్న దేహం వెనుక
నీడలా వెంటాడుతుంది”
బహుశ ఈ సంకలనం సారాంశం ఇదే అనిపిస్తుంది. అయితే ఛేదించే మార్గాలు, ప్రయత్నాలు, ప్రయత్నాన్వేషణలు వ్యక్తపరచిన కొన్ని పాదాలను చూద్దాం.
సంఘటనలు: సమయసమయాలలో జరిగే సంఘటనలు కాలపరిస్థితికి, మనోభావానికి అద్దం పడుతుంటాయి. ఆ సందర్భంలో స్పందించి రాసిన కవితలు సామాన్య పాఠకులకు తీవ్రంగా అనిపించినా సమస్య యొక్క తీవ్రతను, తత్వాన్ని తెలియచేస్తాయి.
ప్రతి – ఘటన – జ్వలిత (172పే) తస్లీమాపై దాడి
“పగటి నక్షత్రంలా కవితాక్షర దేహంతో
స్వేచ్ఛకోసం చేసే నాదం
నీకు అతివాదమయ్యిందా”
అని ప్రశ్నిస్తుంది.
దుఃఖైర్లాంజి – ఎండ్లూరి సుధాకర్ (159పే) ఖైర్లాంజి సంఘటన
“పైట జారితేనే ఉలిక్కిపడి
పాతివ్రత్యానికి భంగం కలిగిందనుకొనే
కలనాంగలు కదా!
సాటి స్త్రీ స్తనాలను
గొడ్డళ్ళతో అడ్డంగా నరుకుతుంటే
అడ్డుపడాల్సిందిపోయి
తల్లీకూతుళ్ళని
కళ్ళెదుటే మానభంగం చెయ్యమని
మంత్రాలు పలికిన నోళ్ళతో
మద్దతు ఎలా పలికారమ్మా”
అని ప్రశ్నిస్తాడు
బాల్స్ ఓన్లీ షుడ్ బౌన్స్ – వంశీ కృష్ణ (156పే) టెన్నిస్ బ్రా మోడలింగ్
టెన్నిస్ తారల దుస్తులపై బాల్స్ బౌన్స్ అనే నినాదంపై చెలరేగిన వివాదానికి స్పందించిన వంశీ కృష్ణ తీవ్రస్వరంతోనే నిరసనను తెలియచేసారు.
బంతులు మాత్రమే ఎగరాలి
యవ్వనోధృతిలో గర్వపడే ఆ రెండు మాంసఖండాలు మాత్రమే ఎగరాలి
.. అంటూ
ఆ రెండూ
‘బ్రా’ల మార్కెట్‌ను నూరుశాతం కైవసం చేసుకొనే
విక్రయ వ్యూహాలు మాత్రమే!
.. అని మార్కెట్ రహస్యాని తెలియచేస్తాడు
పదకొండుమంది స్త్రీలు– అరసవిల్లి కృష్ణ (136పే)
గిరిజన స్త్రీలపై పోలీసుల అత్యాచారాన్ని నిరసిస్తూ రాసిన కవితయిది.
అస్తిత్వం ఒక ప్రశ్న – దేవదానం రాజు (75పే)
ఉత్తర్ ప్రదేశ్ లో సంతాలీ ఆడపిల్లల్ని వేడుక జరిపి చంపేస్తారనే వార్త
మిగతా కవితలలో కొన్ని ఇలావున్నాయి
కవులు తమతమ కలాలకు
పదుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది
ఊరికే మనసులో మధనపడకుండా!
అంటారు శ్రీగిరిరాజు విజయలక్ష్మి(100పే).
మనమిప్పుడు పచ్చినిజాల్ని
నిక్కచ్చిగా మాట్లాడుకుందాం
……
మరింత బహిరంగంగా బరితెగించి
విపరీతంగా మాట్లాడుకోవాలి
ఈ సందర్భం ప్రకృతి విస్ఫోటిస్తున్న
కల్లోలిత దృశ్యాలది….
అని మాట్లాడవలసిన అవసరాన్ని అనిశెట్టి రజిత గుర్తుచేస్తున్నారు.
కనురెప్పల మాటున దాచుకున్న ఉప్పెనలని
ఆపి ఆపి గొంతు నరాలు తెగిపోతున్నాయి
ఎప్పుడో గుండె పగిలేతీరుతుంది …
అంటారు అనామిక (84పే)
ఇపుడున్న సామాన్య స్త్రీల గురించి శిలాలోలిత ఇలా అంటారు
“ఉదయం
అతడు…
ప్యాంటూ చొక్కా తొడుక్కొని వెళ్తాడు
ఆమె
ఇంటిని కూడా తొడుక్కొని వెళ్తుంది
నడుస్తున్న ఇల్లులా వుంటుంది”
… అనగనగా ఓ ఇల్లు (112పే)
ప్రపంచీకరణ నేపథ్యంలో దాంపత్యంకూడా కార్పొరేట్ అయిపోతున్న బాధను జ్వలిత ఇలా వెలిబుచ్చారు
సూర్యచంద్రుల కాపురం
– రాత్రింబవళ్ళ స్నేహం
నాకు సూర్యోదయంతో బతుకుతెరువు
నీకు చంద్రోదయంతో సుఖం కరువు
దాంపత్యానుబంధం అమావాస్య కారుచీకటి
కోరికలను కంట్రోల్‌చేసే రిమోట్ ఐదంకెల వేతనం
-కార్పొరేట్ దాంపత్యం (123 పే)
అమ్మకళ్ళు (46పే) గురించి అందంగా చెప్పిన మెహజబీన్ పదాలు
కలల శాలువాకప్పుకొని
నాన్నతో ఏడడుగులు నడిచినప్పుడు
అమ్మకళ్ళు స్వప్ననిక్షేపాలు
…
అక్షరాలు తెలిసిన అమ్మ
నిర్దాక్షిణ్యంగా గాయపడినప్పుడు
అమ్మకళ్ళు భాషకందని భావాలు.
స్త్రీని మహోన్నత శక్తిగా తనదైన శైలిలో మనముందుంచారు కె. శివారెడ్డి కాంక్షారణ్యంలో (45పే)
“పెద్దపులిలాంటి ఆమె, పుణ్య నదిలాంటి ఆమె
పొగరుమోతు పద్యంలాంటి ఆమె
ఆమె మన తహ తహ మన తపన
తనివితీరని దాహం
మనచేతగానితనాల అవతల మోగుతున్న జేగంట
రాత్రిపగలు రగులుతున్న అగ్నిగుండం
నిప్పుల జడివాన మనల్ని అల్లుకున్న పురాస్మృతి
… అంటూ
శివుడామె ముందు కూర్చుని
తపస్సుచేస్తున్నాడు
ఒక ప్రాకృతిక జ్ఞానాన్నివ్వమని
శరీరంతో స్వర్గారోహణ
ఎలాచెయాలో చెప్పమని
“పరివ్యాప్తమవుతున్న స్త్రీవాద కవిత్వం” అంటూ కొండేపూడి నిర్మల,
“నడిచేదీ నడిపించేదీ పరివ్యాప్త” అని రామాచంద్ర మౌళి
సరికొత్త కవితా సంపుటి పరివ్యాప్త అంటూ చేకూరి రామారావు రాసిన పరిచయవాక్యాలు వున్నాయి.
స్త్రీ సమస్యలను అర్థంచేసుకొనే నేపథ్యంలో చదవాల్సిన పుస్తకం
– దొరుకుచోటు:
అన్నిపుస్తక కేంద్రాలలోను మరియు –
జ్వలిత (విజయకుమారి దెంచనాల)
గవర్నమెంటు ఉన్నత పాఠశాల,
రామవరం, కొత్తగూడెం
-507 101.
సెల్ నం. +9989198943
జాన్ హైడ్ గారు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’, గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ‘ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. జాన్ హైడ్ గారి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.
It’s a nice review.
Simply superb.
Excellent analysis.
So much of maturity in writing.
Continue sir…..
A very good review. Review itself makes us think and ponder over the issues mentioned.
సమీక్ష బావుంది. ముఖ్యంగా ఖైర్లాంజి సంఘటన, కార్పొరేట్ దాంపత్యం, టెన్నిస్ ప్లేయర్స్ డ్రెస్స్ మీద రాసిన కవితలు చాలా బావున్నయి. వర్తమాన పరిస్థితికి అద్దం పట్టాయి
సమస్యలను వివిధకోణాలలో విడదీసారు బాగుంది కాని, కొన్ని సమస్యలకు మాత్రమే కవితలు కోట్‌చేసారు. మరికొన్ని ఇచ్చివుంటే బాగుండేదనిపించింది.
పొద్దువారు అభినందనీయులు
కనుమూరి గార్కి అభినందనలు
మీ సమీక్ష బాగుంది
ఇందులో మూడు కోణాలు నాకు అనిపించాయి
1. ఈ సమస్యల నేపద్యాన్ని దర్శించడం
2. సమకాలీనతను గుర్తుచేయడం
3. స్పందినవాళ్ళ రచనలనుండి ఎంచుకొని చూపడం.
అభినందనలు
సి.వి.కృష్ణారావు