ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

భైరవభట్ల కామేశ్వర రావు

ఇంటర్నెట్టు సమాచార ప్రచార రంగంలో ఒక విప్లవాన్ని తెచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించు ఒక దశాబ్ద కాలంగా ప్రచార సాధనంగా అది ఎంత విస్తృతిపొందిందో కూడా మనకి ఎఱుకే.

ప్రత్యేకించి, ఇంటర్నెట్లో తెలుగు వాడుక, గత నాలుగైదేళ్ళలో ఎంతో పెరిగింది. ఒకటో రెండో ఉండే ఈ-పత్రికల సంఖ్య ఇంచుమించు పదికి చేరుకుంది. తెలుగు సైట్లూ, పోర్టళ్ళూ కూడా చాలా పుట్టుకొచ్చాయి. బ్లాగుల సంగతి సరే సరి! ఇవన్నీ తెలుగు సాహిత్యానికి కాస్తో కూస్తో తమదంటూ సేవలనందిస్తూనే ఉన్నాయి. కథలూ, కవిత్వమూ, విమర్శా ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియలూ ఇంటర్నెట్లో మనకి దర్శనమిస్తున్నాయి. ఈ సాహిత్య సంపద, గణించ తగ్గ పరిమాణానికి పెరిగిందని నా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, దీని గురించి ప్రత్యేకంగా పరిశీలనా పరిశోధనా జరగాల్సిన సమయం వచ్చిందని నేననుకొంటున్నాను. ఆ దిశగా ఒక బుల్లి అడుగు, ఈ వ్యాసం. ఇది పరిశోధనా వ్యాసం కాదు, ఇది ఏ మాత్రమూ సమగ్రం కాదు. కేవలం నా పరిధిలోకి వచ్చిన అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయి కాబట్టి, నేను వెలిబుచ్చే అభిప్రాయాలు పరిపూర్ణ సత్యాలు కాకపోవచ్చు. చెయ్యాల్సిన పరిశోధన విషయం, అందరి దృష్టికీ తీసుకురావడమే నా ముఖ్యోద్దేశం.

“అసలు ఇంటర్నెట్లోని కవిత్వాన్ని గురించి ప్రత్యేకించి పరిశీలించాల్సిన అవసరం ఏముంది? కవిత్వం కవిత్వమే, అచ్చు పత్రికల్లో వస్తే ఏమిటి, ఇంటర్నెట్లో ఉంటే ఏమిటి?” అన్న ప్రశ్నలు ఎవరికైనా రావొచ్చు. సామాజిక పరిస్థితులూ, కవుల స్థితిగతులూ, ప్రచార మాధ్యమాలూ – ఇవన్నీ కవిత్వ రూపాన్నీ, వస్తువునూ ప్రభావితం చేస్తాయన్న విషయం ఆధునిక విమర్శకి కొత్త కాదు. ప్రాచీన, ఆధునిక కవిత్వాన్ని ఈ దృష్టితో చాలామంది పరిశీలించారు కూడా. ఇదే కోణంలోంచి, ఇంటర్నెట్లో వస్తున్న కవిత్వాన్ని కూడ పరిశీలించవచ్చు.

ప్రస్తుతం ఇంటర్నెట్టు అత్యధికంగా, ఉన్నత విద్య కలిగిన వాళ్ళకీ, సాఫ్టువేరు రంగంలో పనిచేసే వారికీ, పట్టణాల్లో, విదేశాల్లో నివసించేవాళ్ళకీ అందుబాటులో ఉంది. కాబట్టి, ఆయా వర్గాల్లోని ప్రజల అభిరుచులకి తగ్గ కవిత్వమే ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళకి దగ్గరగా ఉన్న జీవితమే కవితా వస్తువు అవుతోంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవన సరళీ, పుట్టిన ఊరివో పెంచిన తల్లిదండ్రులవో చిన్ననాటి జ్ఞాపకాలూ, ప్రకృతి ఆరాధనా, ప్రేమా, తాత్విక చింతనా – ఇవీ ప్రధానమైన వస్తువులు. రాజకీయ సాంఘిక అంశాలు వస్తువులుగా ఉన్న కవిత్వం తక్కువే. అది కూడా ప్రజాకళ, ప్రాణహిత, భూమిక వంటి కొన్ని పత్రికలకి మాత్రమే పరిమితం. ఈ పత్రికలు కొన్ని నిర్దిష్ట భావాలకీ, ప్రయోజనాలకీ నిబద్ధమైన పత్రికలు. ఈమాట, కౌముది వంటి పత్రికల్లో అలాటి నిబద్ధత ఏదీ కనిపించదు. కానీ వాటిల్లో సమకాలీన సామాజిక అంశాలపై వస్తున్న కవిత్వం ఇంచుమించు హుళక్కే. అచ్చు పత్రికల్లో విరివిగా కనిపించే తెలంగాణా, దళిత, మైనారిటీ, స్త్రీ వాద కవిత్వాలు ఇంటర్నెట్లో చాలా కొద్ది మోతాదుల్లోనే కనిపిస్తున్నాయి. గ్లోబలైజేషన్ని వ్యతిరేకించే కవిత్వం అసలు కనబడదు.

అంతేకాక, ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపించే చాలామంది మంచి కవుల కవిత్వం అచ్చు పత్రికల్లో అసలు కనిపించకపోవడం ఆశ్చర్యం!
ఇదంతా చాలా సహజమైన విషయంగానే కనిపిస్తుంది, దీని గురించి ఇంతలా అనుకోవాల్సిన అవసరం ఏమిటీ అని కూడా అనిపిస్తుంది. అయితే, దీని వల్ల ఒక ప్రమాదం పొంచున్నదని గుర్తించాలి. “(ఇంటర్నెట్టు) కవులకూ, పాఠకులకూ”, “(అచ్చు పత్రికల) కవులకూ పాఠకులకూ” మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వారు రెండు భిన్న వర్గాలుగా విడిపోయి, రెండు సమాంతర సాహిత్య వ్యవస్థలు ఏర్పడే పరిస్థితికి ఇది దారితియ్యవచ్చు. ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు మార్గాలను ఆలోచించాలి. ఇంటర్నెట్టు కూడా అచ్చు పత్రికలంత విస్తృతిపొంది, అన్ని వర్గాల ప్రజలకీ అందుబాటులోకి వస్తే, అలాంటి పరిస్థితి కలగకపోవచ్చు.

ఇక రూపం విషయానికి వస్తే, అచ్చు పత్రికలకీ, ఇంటర్నెట్టుకీ పెద్దగా తేడా కనిపించదు. అప్పుడప్పుడూ పద్య కవిత్వం, గేయాలూ కనిపించినా అధిక శాతం వచన కవితలే. కౌముది పత్రికలో ప్రతి నెలా “రస రేఖలు” శీర్షికతో పద్యాలు ప్రచురిస్తున్నారు. అవి భావకవిత్వం విడిచిన అడుగుల గుర్తుల్లా ఉంటున్నాయి. చాలా మంది బ్లాగుల్లో పద్యాలు రాస్తున్నారు కానీ, వాటిని కవిత్వం అనలేం.

రూపంలో “ఈ-కవిత్వాని”కీ “ఆ-కవిత్వాని”కీ మధ్య నాకు కనిపించిన పెద్ద తేడా – ఆ-కవిత్వంలో కనిపించేటంత సంక్లిష్టత ఈ-కవిత్వంలో కనిపించదు. పద చిత్రాలూ, ఉపమానాలు కనిపించినంతగా ప్రతీకాత్మకత, అధివాస్తవికత కనిపించవు. దీనికి కూడా కవి, పాఠకుల అభిరుచులే కారణమనుకోవాలి.

అచ్చు పత్రికల్లో సాధ్యంకానిదీ, ఇంటర్నెట్లో సాధ్యమైనదీ ఒకటుంది – కవి తన కవితని సొంతంగా చదివి/పాడి వినిపించడం. ఇంటర్నెట్టు పాఠకులు శ్రోతలు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అదనపు సౌకర్యాన్ని ఎవరూ ఉపయోగించుకుంటున్నట్టు లేదు. కొంత కాలం కిందట ఈమాట ఇలాటి ప్రయోగం చేసింది కానీ అదంత విజయవంతం అయినట్టు లేదు, ఎందుకో! ఈ తరహా కవిత్వ ప్రచురణ విజయవంతమై వ్యాప్తి పొందితే, కవిత్వ రూపంలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.

ఇక కవిత్వ స్థాయి గురించి. ఇదెప్పుడూ వివాదాంశమే! కవిత్వం నాలో కలిగించే, మిగిల్చే అనుభూతీ, చెప్పిన విధానంలోని విలక్షణత – ఇవీ కవిత స్థాయిని నిర్ణయించడానికి నేనుపయోగించే తూకపురాళ్ళు. వీటితో కొలిస్తే, ఇంటర్నెట్లో ఎక్కువ శాతం, తక్కువ స్థాయి కవిత్వమనే నాకనిపిస్తుంది. అయితే ఆ తక్కువ శాతం ఎక్కువ స్థాయి కవిత్వం, గొప్ప కవిత్వమే! అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిస్థితికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి, ఎక్కువ శాతం కవులు “సీరియస్” కవులు కాకపోవడం. ఇక్కడ “సీరియస్” కవులంటే, కవిత్వ రచనని తమ ప్రధానమైన వృత్తిగా లేదా ప్రవృత్తిగా తీసుకొని, నిర్విరామంగా సాధన చేస్తూ రాసేవాళ్ళు. ఇంటర్నెట్లో కవిత్వం రాసేవాళ్ళలో ఎక్కువమంది ఈ తరహాకు చెందిన వారు కారు. తమ బిజీ జీవితాల్లో కొంత ఆటవిడుపుగా, అలవోకగా కవిత్వాన్ని రాసేవారే ఎక్కువ.

ఇక రెండవ కారణం, కవితల ప్రచురణ విధానం. ముఖ్యంగా మూడు రీతుల్లో కవిత్వ ప్రచురణ జరుగుతోంది, ఇంటర్నెట్లో. ఒకటి వ్యక్తిగత బ్లాగులు, రెండు పోర్టళ్ళు, మూడు పత్రికలు. వ్యక్తిగత బ్లాగుల్లో ఎడిటింగు (వేరొకరి ద్వారా) అయ్యే ప్రసక్తే లేదు. పోర్టళ్ళలో కొద్దిగా ఉన్నా, అది ప్రచురణ స్థాయిని, యోగ్యతను నిర్ణయించడానికి కాదు, అనర్హమైన వాటిని నివారించడానికి మాత్రమే. కాబట్టి ఈ రెండు రీతుల్లోనూ, చాలానే తక్కువ స్థాయి కవిత్వం ప్రచురించ బడుతోంది. చాలమంది బ్లాగుల్లోనూ, తెలుగుపీపుల్.కాం వంటి పోర్టళ్ళలోనూ వచ్చే కవిత్వాన్ని చూస్తే ఈ సంగతి స్పష్టం అవుతుంది. వీటిల్లో బొత్తిగా కవిత్వం లేదని కాదుకానీ, వాటి ధ్యేయం మంచి కవిత్వాన్ని ప్రచురించడం కాదుకాబట్టి, అందులో అలాటి కవిత్వాన్ని ఆశించలేం. ఆవకాయ.కాంలో కొంతవరకూ మంచి కవిత్వమే కనిపిస్తోంది. అయితే అది చాలావరకూ అనుభూతి కవిత్వానికి పరిమితం అయిపోతోంది. ఎక్కువగా మంచి కవిత్వం, రివ్యూ ఎడిటింగూ ఉండే ఈ-పత్రికల్లోనే వస్తోందని చెప్పొచ్చు. అయితే వీటిల్లో కూడా, బహుశా కొత్తవాళ్ళని, ముఖ్యంగా ప్రవాసంలోని తెలుగువాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాస్త రాజీ ధోరణి కనిపిస్తోంది. ఉన్న పత్రికల్లోకెల్లా ఈమాటలోనే కాస్త మంచి కవిత్వం వస్తోందని నా అభిప్రాయం. అయితే, అందులోకూడా, కొంత కాలం క్రితం ఉన్న స్థాయి ఇటీవల కనిపించడంలేదు. అఫ్సర్, మహెజబీన్, విన్నకోట రవిశంకర్, యదుకుల భూషణ్, చంద్ర కన్నెగంటి వంటి చెయ్యితిరిగిన కవుల కవిత్వం ఒకప్పుడు ఎక్కువగా కనిపించేది. ఇప్పుడెందుకో, అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. అలా అని కొత్తవాళ్ళెవరూ బాగా రాయటం లేదని కాదు నా ఉద్దేశం. కొత్త వాళ్ళలో చాలా మంచి కవిత్వం రాస్తున్న వాళ్ళు లేకపోలేదు.

మొత్తం మీద కవిత్వ స్థాయిని పెంచడానికి దారుల్ని అన్వేషించాలి. నాకు తోచిన కొన్ని మార్గాలు:
1. అచ్చు పత్రికల్లో కన్నా, ఇంటర్నెట్లో కవులూ, పాఠకులూ ఒకరికొకరు సంభాషించుకోడం సులువు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. మంచి చర్చలు జరగాలి.
2. కౌముదిలో విన్నకోట రవిశంకర్ నిర్వహిస్తున్న “మంచి కవితతో కొంచెం సేపు” లాంటి శీర్షికలని కొత్తకవులు విధిగా చదివి, అందులోని మంచిని గ్రహించాలి.
3. చెయ్యి తిరిగిన కవుల రచనలు మరింత ఎక్కువగా ఈ-పత్రికల్లో ప్రచురించాలి.
4. ప్రసిద్ధ కవులు, విమర్శకుల ద్వారా “ఆన్లైన్ వర్క్ షాప్”లు నిర్వహించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
5. ఇంటర్నెట్లో కవిత్వం వస్తున్నంతగా, దానిపై విమర్శ కనిపించటం లేదు. ఇంటర్నెట్లోని విమర్శకులు ఈ ఖాళీని పూరించడానికి కృషి చెయ్యాలి.

మంచి కవిత్వం రాయాలనుకొనే కవులకి, విన్నకోట రవిశంకర్ కవితాత్మకంగా ఇచ్చిన సూచన “పద్యం కోసం” అన్న ఈ-కవిత చదివి ఆ తత్వాన్ని కవులందరూ జీర్ణించుకొందురుగాక!

———–

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. రాయగల శక్తి ఉన్నవారు కూడాను. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగును ఇటీవలే మొదలుపెట్టి ప్రఖ్యాతి గాంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.

About భైరవభట్ల కామేశ్వరరావు

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగులో ప్రసిద్ధి చెంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

8 Responses to ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

  1. “రెండు సమాంతర సాహిత్య వ్యవస్థలు ఏర్పడే పరిస్థితికి ఇది దారితియ్యవచ్చు. ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు మార్గాలను ఆలోచించాలి.”
    ఎందుకని?

  2. koresh says:

    miiru cheppindi correct kaani, inka kontha mandiki internet tho parichayamu leka povadamu kuda oka samasya ga undi. ee madye oka pedda rachayithrini kalisi nappudu, ee vishyamu chepithe aameku, internet touch lennatlu ga telisindi, intha chesi aame nellorulo peedda doctor kudaanu, aame gurinchi inter net lo vachina vishayamu vini aachrya poyindi kuudaanu.

  3. radhika says:

    నెట్లో మంచి కవిత్వం రావట్లేదు అని మీరు వ్యక్తం చేసే ఆవేదన సబబే.అంతర్జాలం లో రచనలు చేసేది విద్యావంతులైన సామాన్యులే.ఉసుపోక రాసేవారు,అచ్చులొ తిరస్కరింపబడిన రచనలు బ్లాగులో పెట్టుకునేవారు,ఆలోచనలు రాసుకునేవారే ఎక్కువ.అచ్చు లో వచ్చేవన్నీ నెట్లోనూ వుంచితే బాగుంటుంది.అలా చేస్తే
    రెండు సమాంతర సాహిత్య వ్యవస్థలు ఏర్పడితే వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదేమో?

  4. జాన్ హైడ్ కనుమూరి says:

    నెట్‌లో కవిత్వానికి పాఠకులు, కవులు ఎక్కువగా సాప్ట్‌వేర్ తెలిసినవారు, విద్యావంతులు మాత్రమే అని మీరే చెపుతున్నారు,
    ఇంటర్నెట్టు సమాచార ప్రచార రంగంలో ఒక విప్లవాన్ని తెచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించు ఒక దశాబ్ద కాలంగా ప్రచార సాధనంగా అది ఎంత విస్తృతిపొందిందో కూడా మనకి ఎఱుకే. ఇదీ మీరే చెపుతున్నారు.
    పోత్సహించాల్సిన అవసరాన్ని, మార్గాల్ని వెతకాల్సిన అవసరం ఎంతైనా వుంది.
    దీని వెనుకున్న వ్యయ ప్రయాసలను కూడా దృష్టించాల్సిన అవసరం, (సాంకేతికంగా, అర్థికంగా, సాహిత్యపరంగా).
    ప్రాచుర్యం కల్పించాలి.

  5. కామేశ్వర రావు says:

    నెటిజన్ గారు,
    “రెండు సమాంతర సాహిత్యవ్యవస్థలు” అన్నదాన్ని నేను కొంచెం వివరించాల్సిందేమో. విశిష్టమైన, విభిన్నమైన సాహిత్యాన్ని సృష్టించడం వేరు, వేరు కుంపటి పెట్టడం వేరు. మొదటిది ఆరోగ్యకరమైనది. రెండవది నా ఉద్దేశంలో మంచిదికాదు. ఎప్పుడైనా ఆదాన ప్రదానాలున్నప్పుడే ఎక్కువ వైవిధ్యానికి అవకాశం ఉంటుంది. ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది.
    కవి దృష్టి ఎంత విశాలమైతే, అంత మంచి కవిత్వం సృష్టించగలడని నా అభిప్రాయం.

  6. Chilakapati Srinivas says:

    రెండు సాహితీ ప్రపంచాలనీ కలపడానికి ఇంటర్నెట్‌లో వచ్చే మంచి కవితల్ని అప్పుడప్పుడయినా పుస్తక రూపంలో తీసుకురావడం అత్యవసరం.

    వ్యాసం ఒక చర్చకు మంచి ప్రారంభం. ఇంకా ఎక్కువ మంది పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను.

  7. Prasanthi says:

    నెల్లూరికి చెందిన డాక్టరు గారంటే శ్రీమతి జయప్రదగారేనా!! ఆవిడ అనుమతితో ఆవిడవి కొన్ని కవితలు, కొన్ని కథలు తెలుగుపీపుల్ డాట్ కాం లో ప్రచురించడం జరిగింది. ఆవిడైతే కనుక తెలీదు అనే అవకాశం లేదు. ఆవిడకి చూడడం తెలీదు నిజమే కానీ పెట్టిన విషయం తెలుసు.

    ప్రతి ఒక్కరూ వ్రాయడం మొదలుపెట్టినప్పటి నుంచే గొప్ప కవులు కాలేరు కదా. మరి వారి భావవ్యక్తీకరణ తోటి వారితో పంచుకుంటేనా కదా తెలిసేది లోపం ఎక్కడుంది, ఎలా అధిగమించచ్చు..ఒక అనుభూతిని ఎన్ని రకాలుగా వ్యక్తపరచచ్చు అన్న విషయం. అందుకే తెలుగుపీపుల్ డాట్ కాం ఎప్పుడూ కాస్తో కూస్తో ఆసక్తి ఉండే వారి అనుభూతులని ప్రోత్సహిస్తూ వస్తోంది.

    కవిత్వమంటే ఇదే అని ఒక పరిథి గీసి ఫలాన కవిగారి ధోరణిలో రాస్తేనే అది కవిత్వం అని వాదించే వారూ లేకపోలేదు. వారి వల్ల ప్రమాదమే.

    ఇంటర్నెట్ లో ఉండే మరో వెసులుబాటు వ్యాఖ్యలు వెనువెంటనే తెలుసుకోగలగడం. పత్రికలైతే పాఠకులకి నచ్చినా అందరూ తెలుపరు. ఒకవేళ తెలిపినా అన్నిటినీ ప్రచురించరు.

    తెలుగు కవిత్వానికి సంబంధించి ఓ ఫోరం లాంటిది ఉంటే బాగుంటుంది.

    అంతరం అవసరమా లేదా ఇబ్బందికరమా అన్నది నాకు తెలియదు. అవకాశం, ఆసక్తి ఉన్నవారు అన్నిటినీ చదువుతారు. నాకు సంబంధించినంత వరకు కవి ఏ అనుభూతితో రాసాడో ఆ అనుభూతిని పాఠకులు అనుభవించేలా చేయగలిగితే, హృదయాలని స్పందింపచేయగలిగితే అదే గొప్ప కవిత. పద్యమైనా, వచనమైనా నాకు ఇదే ప్రాతిపదిక.

  8. Gavidi Srinivas says:

    Good

Comments are closed.