విశాలమైన రోడ్డు, నాల్గు వైపులా అంతా అదే. కనుచూపు మేరా ఏమీ లేదు. రోడ్డు పై మనుషులంతా పరిగెడుతున్నారు – రకరకాల వాళ్ళు, అన్ని వయసులవాళ్ళు, ప్రక్కలకి చూడకుండా, వాళ్లతో కల్సి తనూ వేగంగా పరిగెడుతూ వుంది. ఆది అంతం లేని పరుగు. మనసు, శరీరం అలసిపోతున్నాయ్. హాయిగా తీరిగ్గా కూచుంటే బావుండు. మెల్లిగా పరుగాపి నిల్చోవటానికి ప్రయత్నించింది. నెట్టేస్తూ అందరూ వాళ్ళతో కల్సి పరిగెడితే తప్పించి వారి ముఖాలు గుర్తు పట్టలేనంత వేగంగా దూసుకు పోతున్నారు. ఒక్కతే ఒంటరిగా అయోమయంగా… ఉహు వద్దు. ఒంటరితనం భరించలేను. పరిగెత్తాలి అందరితో కల్సి జీవితాంతం ఇలాగే. చమటలు కారి పోతున్నాయ్, శరీరం స్వాధీనం తప్పుతోంది, లేని శక్తిని కూడదీసుకుంటూ మళ్లీ పరుగు. ఇంకా ఇంకా.. హమయ్య ఇప్పుడు ఒంటరితనం లేదు, ఆలోచనలూ లేవు. అసలు నేనే లేను.. పరుగొక్కటే! రన్ రన్ రన్.. ఠంగ్ ఠంగ్ ఠంగ్.. ఏంటో మోగుతోంది. అబ్బ పరిగెత్తలేక పోతున్నా, ఒక్కసారి అందరం కూర్చుంటే బాగుండు. మళ్లీ ఏదో మోగుతోంది. ఇదేంటి రోడ్డు చుట్టు గోడలు? వాళ్ళందరూ ఏరి! ఏ.సి. లోనూ నిలువెల్లా చమటలు, గొంతెండి పోతోంది. కాలింగ్ బెల్ మోత. కలా..!
అయోమయంగా లేచి వెళ్లి పాల పాకెట్ తీసుకుని చిల్లర్ లోపలేసి బెడ్ పై ఒరిగి కళ్లు మూసుకుంది. శ్రీకాంత్ లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్నట్టున్నాడు. అదంతా కలా, తను నిద్ర పోయిందా! ఎన్ని రోజులైయింది, నిద్ర పట్టి! అసలీరోజు ఏవారం? తారీకెంతో? ఏదైతే ఏంటిలే. శ్రీకాంత్ బయల్దేరినట్టునాడు.
“శైలూ వెళుతున్నా..”
“ఊ…”
డోర్ లాక్ చేసుకుని వెళుతున్న చప్పుడు. టిఫిన్, భోజనం అన్నీ బైటే. తిరిగొచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది. ఇంట్లో టిఫిన్ తినటానికి పట్టే టైమ్ లో ఓ ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యొచ్చంటాడు. ఆఫీస్ లోనే ఏదో ఒకటి తినెయ్యొచ్చు. మొన్నటిదాకా తనూ అంతేకదూ! ఇప్పుడు బయటేమీ తినలేకపోతోంది, వండడానికి ప్రయత్నిస్తే ఆ వాసనలకి వికారం; తినలేదు.
ఇప్పుడు అమ్మమ్మ ఉంటే తను చేసిన గోంగూరతో అన్నం, పులిహోర…. ఏవో పిచ్చి కోరికలు.
ప్రెగ్నెన్‌సీ, పాపాయిని పెంచటం మధురమైన అనుభవాలని చదివిందే.. మరి ఇదేంటి ఇంత నరకంగా ఉంది! ఎవరన్నా సపోర్ట్ గా ఉంటే బాగుండనిపిస్తుంది. ఏవో భయాలు, అనుమానాలు, సంశయాలు.., పంచుకోవటానికి ఎవరన్నా కావాలి. ఒంటరితనం దుర్భరంగా ఉంది. బెడ్ రెస్ట్ తప్పనిసరి అన్నారు. లేకపోతే ఇప్పుడు ఆఫీస్ లో వుండేది. ఊహ తెలిసాక ఇంట్లో ఇన్ని రోజులుండటం ఇదే మొదటి సారి. ఇంకా ఐదు నెలలు ఇంట్లో ఒంటరిగా…
చిన్నప్పుడు అమ్మమ్మ ఎప్పుడైనా వస్తే ‘మీ ఇంట్లో ఉండలేనే శైలూ. మీ అమ్మా నాన్నా, నువ్వు అంతా బైటి కెళతారు, బయటివారితో మాట్లాడ కూడదంటారు’ అనేది కదూ, ఆమె వున్న వారం రోజులూ హడావిడీ చేసేది. ‘కిటికీలు తలుపులూ మూసుకుని ఎలా వుంటున్నారో! నాకైతే ఊపిరాగి నట్టుంటుంద’ని అన్నీ బార్లా తెరిచుంచేది. వంటగది చప్పుళ్లతో సందడిగా ఉండేది. తనకి అన్నం ముద్దలు కలిపి పెట్టేది, కథలు చెప్పేది.
‘ఎంత పెద్ద ఉద్యోగం, బిజీ ఐతే మాత్రం ఒక్క పిల్ల చాలంటావేమిటే , ఇంకొక్కరుంటే దానికి తోడూ ఇంట్లో సందడీ ఉంటాయి’ అని అమ్మతో ఎప్పుడూ అనేది.
ఓసారి, ‘ఈ వూళ్లో మన వాళ్లున్నారటే వెళ్దాం’ అని, ‘వాళ్లెవ్వరూ మాకు తెలియదు నువ్వు ఎవరిళ్ళకిపడితే వారిళ్ళకి వెళ్లొద్దం’టూ విసుక్కుంటున్న అమ్మని లెక్క చేయకుండా, ‘ఆ తెలుసుకుంటే వాళ్లే తెలుస్తారు’ అని తనని తీసుకుని బయల్దేరింది. పది నిమిషాల్లో బంధుత్వాలు తిరగేసి మరగేసి వరుసలు కలుపుకొని వారికి దగ్గరి చుట్టమై పోయింది.
ఇప్పుడు తనకైతే దగ్గరి వాళ్ల వివరాలే తెలియదే! చరిత్ర తెలుసు – షాజహాన్ తల్లికి అన్న ఎవరో తెలుసు, తన వారెవరో తెలియదు. అమ్మమ్మ ఆ తరువాత ఎప్పుడొచ్చిందీ గుర్తుకు లేదు. మళ్లీ రాలేదనుకుంటా, కొడుకు దగ్గరే ఉండేది, చనిపోయినప్పుడు అమ్మే ఓ మూడు రోజులు వెళ్లినట్లు గుర్తు, పరీక్షలుండి తను వెళ్ల లేదు. ఇప్పుడెందుకో బాగా గుర్తొస్తూంది. ఆ మెత్తని ఒడిలో పడుకోవాలని ఉంది.
బెల్ మోగుతోంది. మంగ వచ్చినట్టుంది. తలుపు తీసి ముఖం కడుక్కుని ఓ బ్రెడ్ ముక్క తింటూ స్టవ్ పై టీ పడేసింది. మంగ వెలిసిపోయిన పంజాబి డ్రెస్ వేసుకుంది. సింకులో గిన్నెలు తోముతోంది.
“మంగా లంగా ఓణీ వేసుకోవా?”
“ఇప్పుడియ్యే పేషనండి. ఇదైతే పనిచేసుకోటానికి ఈలుగా వుంటది”
మంగకి టీ ఇచ్చి కప్పు పట్టుకుని హాల్లోకి వచ్చి టి వి ఆన్ చేసింది. ఏదో సీరియల్. అత్త, కోడలు, ఆడపడుచు ఒంటి నిండా నగలు, కారిపోయేంత మేకప్. క్లోజప్ లో మొహాలు, వెనక దడ దడా సంగీతం.
ఈ రోజు డేటెంతో? చెకప్ కెళ్లాలి ఒంటరిగా…. ఒక్కసారిగా ఏకాకి ఐపోయినట్టుగా ఉంది. తనకు తెల్సిన వారంతా గుంపుగా ఉన్నా ఒంటరిగానే బ్రతుకుతున్నారు. చిన్నప్పటి నుండీ ఒంటరిగానే అన్నీ చేసుకుంది. ఎన్నడూ కలగని ఫీలింగ్ ఇప్పుడెందుకు! ఈ టైంలో హార్మోన్స్ తేడాల వల్ల ఇలావుందేమో.
మంగ మిషిన్ లో బట్టలు పడేసి హడావిడిగా గదులు ఊడ్చేస్తోంది.
“ఎందుకు మంగా తొందర, ఇంటికెళ్లి ఏం చేస్తావ్?”
“ఇప్పుడు టీవీలో అక్క మొగుడు సీరియలండి. తొరగా ఎల్లి చూడాల.”
ఛానల్స్ అన్నీ మార్చి మార్చి, ఆఫ్ చేసి బెడ్ రూం లోకి వచ్చి పడుకుంది.
బీపి పెరిగినట్టుంది, కన్‌సీవ్ అయ్యిందనగానే ఎంత సంతోష పడ్డారు తను, శ్రీకాంత్! మొదట ఓనెల మామూలుగానే ఆఫీస్ కెళ్లింది. తరువాత బీపి, షుగర్ ఇంకేవేవో కంప్లైంట్స్. ఈ టైమ్ లో కొందరికి ఇలాగే అవుతుంది, డెలివరీ తరువాత నార్మల్ అవచ్చు, పూర్తి రెస్ట్ లో ఉండాలన్నారు. అమ్మకి ఫోన్ చేస్తే, ‘ఇప్పుడు లీవ్ పెడితే, నీ డెలివరీకి లీవ్ ఉండదు, డెలివరీ టైంకి ఇక్కడికిరా. ఇప్పుడు నేను చాలా బిజీ’ అంది.
ఊహ తెల్సినప్పటి నుండి ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే మొదటి సారా? ఓసారి టైఫాయిడ్ వచ్చి ఉంది కదూ, అప్పుడూ ఒంటరిగా ఉండలేక కాస్త తగ్గగానే కాలేజ్ కి వెళ్లి పోయింది. స్కూలు, కాలేజి , కోచింగ్ లు, ఎంట్రన్స్ లు. టైం వేస్ట్ చెయ్యొద్దు, అన్నింట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. అంతే మరో ఆలోచనే లేదు.
చిన్న వయసు లోనే మంచి ఉద్యోగం. దానికి ప్రతిగా పోగొట్టుకున్నవి జీవితం, స్పందన. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ అనుభూతులూ జ్ఞాపకాలూ లేవు. తన కోసమే తనకేం వచ్చు. కమ్మగా వండుకు తిందామంటే వంట సరిగా రాదు, పడుకుందామంటే నిద్రా రాదు ఇంకా వేరే ఏమన్నా చేయటానికి టైమూ లేదు, ఆసక్తీ కోరికా చచ్చిపోయాయి.
చాలా చిన్నప్పుడు కారణం లేకుండానే మనసు సంతోషంతో పొంగిపోతూ వుండేది, అది ఎప్పుడు ఎక్కడ పోగొట్టు కుంది? పెద్దయ్యే కొద్ది ఎంత సీరియస్ గా, బిజీ గా వుంటే అంత గొప్ప, గౌరవం.
పనైనట్టుంది, మంగ పిలుస్తోంది. పంపించి తలుపేస్తూ కారిడార్ లోకి తొంగి చూసింది. ఎవరూ లేరు. ఎప్పుడన్నా లిఫ్ట్ సౌండ్. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా బిజీ, పది దాటితే వాచ్ మన్ తప్పించి ఎవరూ ఉండరు. క్రింద తారస పడితే, కొందరు చిరునవ్వుతో చూస్తారు, కొందరు అదీ లేదు. అంతే, ఈ ఫ్లాట్స్ లో పరిచయాలు ఎవరి గూడులో వాళ్లు.
తలుపేసి వచ్చి కూర్చుంది. సజీవ సమాధి అయినట్టుగా వుంది. ఏదో వికారం.. వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. తిన్న బ్రెడ్, టీ వాంతయి పోయింది. కళ్లు తిరుగుతున్నాయి. మెల్లిగా వచ్చి బెడ్ పై ఒరిగింది.
మధ్యాహ్నం తినడానికేమీ లేనట్టుంది, మంగతో ఏవన్నా తెప్పించుకోవాల్సింది. రాత్రికి శ్రీకాంత్ ఏవన్నా తెస్తాడు. కాస్త నయం, మంగ లేకపోతే ఇంకా కష్ట మయ్యేది. ఇక్కడున్న ఫ్యాక్టరీలకే వెళతారు. ఇంటి పనులకు మనుషులు దొరకటం కష్టం.
ఒంటరితనం దుర్భరంగా ఉంది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు అది వెయ్యి రెట్లు అధికంగా అన్పిస్తుందేమో! ఇంకా ఐదు నెలలు.. తర్వాత.., పాపాయి. అప్పుడూ ఎవరూ వుండరేమో తోడుగా. ఉన్నా.., ఒక నెల. తరువాత ఇద్దరి పనీ చేసుకోగలదా? ఇలాగే ఇంట్లో బందీలా ఉంటే, తప్పకుండా పిచ్చెక్కుతుంది. ఒక నెల పాపాయి క్రెష్ కి, తను ఉద్యోగానికి. ఇంక ఈ పాపాయి క్రెష్ లో, స్కూల్ లో, కాలేజ్ లో పెరిగి పెద్ద దౌతుందేమో. ఆడపిల్లయితే పెద్దయ్యాక తనలాగే ఈ నరకమూ తప్పదేమో. ఓ జీవి పుట్టటం, చదువు, ర్యాంకులు, ఉద్యోగాలు – వీటి కోసమేనా, చుట్టూ అందరూ ఎలా ఉంటే అలా… మనసు చంపుకొని పెంచాలి, ఉహూ వద్దు ఇప్పటి ఈ జీవన విధానంలో బందీగా ఉన్న తనకి అసలు పిల్లలు వద్దే వద్దు. డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం ఫోన్ చెయ్యటానికి లేచింది.
——————
“చదవటం, నేర్చుకోవటం అంటే నాకు ఇష్టం. నేనింకా విద్యార్థినే. ఇంకా తెల్సుకోవలసింది ఉంది. నా చుట్టూ ఉన్న వారి సంతోషానికి పొంగిపోతాను, దుఃఖాన్ని చూసి కన్నీరవుతాను. అవే నేను రాసే కథలవుతాయి.” అని అంటారు రమ్యగీతిక. నివేదన పేరుతో బ్లాగు రాస్తూంటారు.
చాలా బాగుంది…!!! లెట్ ఇట్ గో…
కథ రాసిన విధానం బాగుంది. చివరలో పరిష్కారమే నచ్చలేదు.
కథ చెప్పిన తీరు బావుంది. కానీ సమస్యకి ఆ పరిష్కారం కాకుండా ఉండుంటే ఇంకా బావుండేదని నా ఆభిప్రాయం! ఎందుకంటే ఆ పరిష్కారం మరిన్ని శారీరక, మానసిక బాధలని కలిగించే అవకాశం ఉంది.
కొల్లూరి సోమ శంకర్
స్ర్తీల సమస్యలను స్త్రీలు మాత్రమే సరిగా గుర్తించ గలుగు తారు
ముఖ్యముగా హార్మోనుల మార్పుల వలన వారిలో కలుగు సమస్యలు పురుషుల ఊహ కి కూడా అందనివి.
ఈ కోణాన్ని చూపటం మంచి ప్రయత్నం . రచయిత్రి గారికి అభినందనలు.
సంతానం కలిగిన సంవత్సరము తమ జీవితము లోని అత్యంత ఒంటరి సమయమని బ్రిటన్ లో ఓసర్వే లో మహిళలు పేర్కొనినారని చదివాను.
ఇప్పటి నవనాగరీక జీవనము లో స్త్రీల పై ఒత్తిడి క్రమము గా పెరుగు చున్నది. స్త్రీ ల శరీర ధర్మముల దృష్ట్యా ఒత్తిడికి దూరముగా అమ్మాయిలను పెంచ వలసిన ఆవశ్యకత ఉన్నది.
ఈ కథ అందరిని ఆలోచింపజేయునట్లు గా ఉన్నది.
పలాయన వాదానికి పరాకాష్ట ఈ కధ ముగింపు.కన్నకూతురు కడుపుతో ఉంటే లీవు దొరకని తల్లి,ఆ కూతురేమో ఈజీవనవిధానములో అసలు పిల్లలే వద్దని …మూడుతరాలను ప్రస్తావించిన రచయిత్రి అమ్మమ్మ ఎందుకు కలుపుగోలుతనంగా ఉందో అమ్మాయి ఎందుకు బెంబేలెత్తుతుందో సమస్యకో పరిష్కారం అక్కడే ఉందని ఎందుకు గమనించలేకపోయారో?మన బేలతనానికి,మన ఒంటరిబతుకులకూ,మన సమాజపు లొసుగులకు,పిచ్చ్చిపరుగులు తీసే మన జీవన విధానానికి అబార్షన్ పరిష్కారమనేది ఏమేరకు సమ్మతమో నాకు వింతగా ఉంది.రేపు పిల్లలు పుట్టి ఈ జీవన విధానం లో..అనేదానికన్నా ఆఫీసు వదిలేసి ఐదు నెలలు ఒంటరిగా ఇంట్లో అన్నదే కధానాయికను ఎక్కువ బాధిస్తుందేమో?సామన్యంగా సాహిత్యం ఇలా ఉండేది అని,ఇలా ఉందటం లేదు అని,ఇలా ఉంటే బావుంటుంది అని చెప్తుంది,మరి రమ్యగీతిక గారు ఏమి చెప్తున్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది
Intrapartum Depression?
story is really touching..but solution is not correct..she has no right to do like that..how selfish she is!! sorry to say this..
అసలు నాకు ఒక అనుమానము అది ఈ కథకు సంబందించింది కాదు ఇక్కడ రాస్తునందుకు క్షమించండి.
పిల్లలను కనె విషయము లొ లేడిస్ కి సొంతనిర్ణయము తీసుకునె హక్కు ఉందా? లేదా?
లా తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా !
కథలో పరిష్కారం పై నిర్ణయం కొద్దిగా అబ్రప్టుగా వుంది. అంటే అంత సేపూ నేటి జీవనశైలుల నిఃసారం వివరిస్తూనే… ఆఖరుకి సరిపడేంత ఆలోచనా స్రవంతి లేకుండా నిర్ణయానికి వచ్చినట్లుంది. అక్కడ స్వల్పంగా పొడిగిస్తే, స్వల్ప మంచిదేమో… నా చిరభిప్రాయం మాత్రమే…
ఇక కథాంశం గురించి… “అందుకే నేను భూటాన్ వెళ్లిపోతున్నాను”.
What I understand is, the character is suffering from depression. What she needs is some help. May be her doctor should be able to help out and let her sort the problems out. Awareness of mental problems in India still seems to be a problem.
Why do doctors in India always advise pregnant women to take complete rest?
Story is good.
I can’t comment on ending of story. How can we judge?
Still Indian people didn’t turn to materialistic life. Some were turned & some were not.
In this story,if the lady become meterialistic this problem will not arise.
@Manjula
If any body want affection,
you will suggest medicines.
If any body talk about morals,
you will treat them as patients.
If any body question about materialistic life style,
you will admit them in hospital.
@Ravishankar,
I’m not a character out of Orwell’s books. To me lack of awareness of mental health problems and medical malpractices are bigger issues than materialism. Depression among pregnant woman is more common thing than you think. Staying at home and doing nothing just compounds it. I can list a few things one can do if they are forced to stay at home. She can read, learn new things, watch new movies, help out somebody or just teach street children. Not willing to do anything to change her present situation is a sign of depression and she needs help.
మీ లెట్ ఇట్ గో చదివాక ఎందుకో 2007 సాహిత్య నోబుల్ బహుమతి గ్రహీద్త డోరిస్ లెస్సింగ్ కధ ‘ఆత్మ హత్య ‘ (ఈ నెల ఈనాడు-విపుల ఆన్ లైన్ ఎడిషన్ చూడండి) గుర్తొచ్చింది. స్త్రీలు – హార్మొన్లు – సంఘర్షణలు – ఇవన్నీ ఒక సైకిల్. భవిష్యత్తు మీద భయం తో పిల్లలకి విషం పెట్టి చంపి, తాము ఆత్మహత్య చెసుకునే తల్లులు వున్నారు. మీ కధ చదివాక మనసుకి చాలా బాధ కలిగింది. మీ కధ కు వచ్చిన కామెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి.
ప్రధాన పాత్ర శైలు మనసులో సుడూలు తిరుగుతున్న ఆందోళనని పాఠకుల మనసులకి దగ్గర చెయ్యడంలో మీ కథ సఫలం ఐంది. ఈ కథ కేవలం ఆ అమ్మాయి మానసిక వేదనే కాదు, మారుతున్న మన సామాజిక విలువల మీద వ్యాఖ్యానమని కూడా పాఠకులు గమనించాలి.
badhalanu anbhavinchinavare palaricha galaru. kalavaricha galaru, maga vaallaku eppudu ardamu kaani samasya idi. one way of opinion n thinkingis such, let it not go let all sypathatic to the needy n support them n find solution the causes.
Good narration
An apt solution may still add flavor to this
రమ్యా,
ఆ పరిస్థితులలో ఆ స్త్రీ మనస్థితిని బాగా చెప్పగలిగారు.
మీరు వ్యాఖ్యలకేమి జవాబు ఇచ్చినట్లు లేరు?
“What she needs is some help. May be her doctor should be able to help out and let her sort the problems out” ఇంత వరకూ నేను మంజుల గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
అందువల్లే రచయిత్రి ఇచ్చిన ముగింపును అపార్థం చేసుకోవక్కర్లేదనుకుంటున్నాను.
ఎన్నో ఉపాయాలు ఉండవచ్చు ఒంటరితనం దూరం చేసుకోవడాని, డిప్రెషన్ నుండి బయట పడడానికి. కానీ గుర్తించ వలిన విషయం, సాధారణ మనిషి self sufficient కాదు. అందుకే ఎందరో “అన్నీ ఉన్న” వారు ఎందుకు బాధ పడతారో అర్థం చేసుకోవడం చాలా మందికి చాలా సార్లు కష్టం అవుతుంది.
మీ కథ చాలా బాగుందండీ. నేను కూడా ఒక software company లో పని చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా 4 days holiday వస్తే నాకు ఏదో ఒంటరిగా ఉన్న feeling వస్తుంది. అలాంటిది ఆ అమ్మాయి 5 months bed rest అంటే తన feelings అర్థం చేసుకోగలను. కానీ తను కేవలం office గురించి ఆలోచించి మరొక ప్రాణం అది కూడా తన రక్తం లో ఉన్న ప్రాణం తీయటం నాకు కొంచెం dis-appointment కలిగించింది. office గురించి, ఒంటరితనాన్ని గురించి ఆలోచించకుండా పుట్టబోయే తన పాప గురించి ఆలోచించి ‘తను జీవిస్తున్న ఈ జీవితం లా కాకుండా తన పాపకి కొత్త జీవితం ఇవ్వాలి తన అమ్మమ్మలాగ’ అని decide అయ్యుంటే కథ చాలా చాలా బాగుండేది. Anyways it’s a very nice story.
Pingback: లెట్ ఇట్ గో « మనసు కలలు – కొసరు కథలు
adavala mansunu baga vektha paricharu, prustham unna paristhini kuda amma ga adavali goppathanamuni baga rasaru …………..naku nachindi