మంది మన్నియమ్ – 5

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది చివరిది:

———

సూత్రము – 41 : అనన్యముగా శాసన విధేయమైన పౌరావళి.

వృత్తి :

(అ) అనన్యమనఁగా మఱుతలంపు లేకుండ.
(ఆ) శాసన విధేయత కేవలము ప్రభుత్వోద్యోగుల కుండవలసిన లక్షణముకాదు. అందరికిని ఉండవలెను. సామాన్యులలో శాసన విధేయత లేనిచో ప్రభుత్వోద్యోగులలో సైతమది మృగ్యమగును. ఏల ననఁగా వారు కూడ సామాన్యులలోనుండి వచ్చినవారే.
(ఇ) పరంపరాగతమైన సాంప్రదాయిక ప్రమాణముల పట్లఁ బ్రజలకున్న శ్రద్ధాభక్తివిశ్వాసములే ప్రభుత్వము పట్లను, దాని శాసనముల పట్లను విధేయతగా దశాంతరముఁ జెందుచున్నవి. కావున ప్రజల మత విశ్వాసములు ప్రజాస్వామ్యమునకు బలవర్ధకములే గాని తదన్యము కావు. దేనిపట్లను విశ్వాసము గాని, తాత్పర్యము గాని లేనివారినుండియే యే వ్యవస్థకైనను బెనుముప్పు పొంచియుండును. ఒకదానికిఁ దలయొగ్గుట నభ్యసించినవారు మరొకదానికిఁ దలయొగ్గుట మిక్కిలి సులభము. తద్భిన్నముగా -నొకదాని పట్లఁ దిరుగుబాటును బ్రోత్సహించినచోఁ బ్రజలు క్రమముగా నన్నింటిపైనను దిరుగఁబడెదరు. మానవ మనస్సొకచోట నొకవిధముగాను, వేఱోకచోట వేఱోక విధముగాను బ్రవర్తించునట్లు ప్రకృతి యేర్పఱింపక పోవుటయే దీనికిఁ గారణము.
(ఈ) సంప్రదాయమునకుఁ జక్కని ప్రత్యామ్నాయ మేర్పడినప్పుడు సంప్రదాయమును వ్యతిరేకింప నక్కఱలేకయే ప్రత్యామ్నాయము సుప్రతిష్ఠితమగును. ప్రత్యామ్నాయ మేర్పడనప్పుడు సంప్రదాయము నెంతగా వ్యతిరేకించినను గడకు దానినే యనుసరింపక తప్పదు.

సూత్రము – 42 : సేవోపజీవనమైన ప్రబల మధ్యతరగతి.

వృత్తి :

(అ) సేవ యనఁగా – చూ. ఈ యధ్యాయమునందలి 8 వ సూత్రమునకు వ్రాసిన వృత్తి.
(ఆ) సమాజమునందు నూటికిఁ దొంబదిమంది ధనికులే యయినను, అంతమంది దరిద్రులున్నను బ్రజాస్వామ్యమర్పడుట కడిఁది. అట్లు గాకనూటికిఁ గనీసము నలుబదిమంది చదివికొన్న మధ్యతరగతివారున్నప్పుడుప్రజాస్వామ్య సూత్రములను జక్కగాఁ బాటించుటకు వలనుపడును.
(ఇ) ఏల ననఁగా – ధనికులకు రాజకీయముల కన్న వ్యవసాయ వాణిజ్యములే ముఖ్యము. దరిద్రుల కెవరు పరిపాలించినను ఒక్కటియే. అట్లు గాక ప్రభుత్వ విధానముల నర్థము చేసికోగలదియు, వానిచేతఁ బ్రభావిత మగునట్టిదియు నగు విద్యావంత మధ్యతరగతి వర్గము రాజకీయ పరిణామములకు దీటుగా స్పందించును.
(ఈ) ఆ మధ్యతరగతి వ్యవసాయమునకో వాణిజ్యమునకో చెందినది కాక సేవావృత్తులకుఁ జెందినదై యుండుట లెస్స. సేవావృత్తులవారు తమ యజమానులను మెచ్చించు నిమిత్తము వివిధ విద్యలభ్యసించెదరు. చదివికొన్న మధ్యతరగతివర్గము తమను గమనించుచున్నదను భయము రాజకీయవాదులలో లేనిచోఁ బ్రజాస్వామ్యము రక్తికట్టదు.

సూత్రము – 43 : సమాజములో సుస్పష్టమైన శ్రమవిభజనము.

వృత్తి :

ఈ పని వీరు చేయఁదగును, ఆ పని వారు చేయఁదగును అని పనులనుబంపిణీ చేసికొనుటయే శ్రమవిభజనము.
(అ) నాగరికతా విజ్ఞానములు బాగుగా ముందునకుఁ బోయిన సమాజములయందును, జనసంఖ్య వేల లెక్కను దాఁటి కనీసము లక్షల మట్టమునకుఁజేరికొన్న సమాజములయందును, ఏటేటఁ గ్రమము దప్పక యాహార వనరులను బ్రసాదించు ప్రకృతిసంపద యున్న దేశములందును మాత్రమే శ్రమవిభజన సాధ్యము.
(ఆ) శ్రమవిభజనమున్నచోటఁ బ్రత్యేక నైపుణ్యములకున్ను, వానికి సంబంధించిన విద్యార్హతలకున్ను, వానిని సంపాదించువారికిన్ని ఒక విశిష్టమైన విలువయేర్పడును. పనిసేయించు నాయకులెవరైనను గావచ్చును గాని పనినిబ్రత్య క్షముగాఁ జేయువాఁడు మట్టుకు ఆ పనికి సంబంధించిన విద్యలోఁబ్రత్యేక నైపుణ్యమున్ను విద్యార్హతయుఁ గలిగినవాఁడే యయి యుండవలెనన్నది ప్రజాస్వామ్య నియమము. మాటిమాటికిని మారిపోవు ప్రజా స్వామ్యప్రభుత్వముల యస్థిరత నడుమ ప్రజాస్వామ్యమును సుస్థిరముగా నిలువఁబెట్టుచున్నది ఈ నియమమే.
(ఇ) శ్రమవిభజనమున్నచోట హక్కులను గూర్చియు బాధ్యతలను గూర్చియు ఖచ్చితమైన లక్ష్మణరేఖలేర్పడును. హక్కులను గాలరాఁచువారి పట్లను,బాధ్యతలను విస్మరించువారి పట్లను సమాజమునందు ద్వేషముండును.అటువంటివారికి శిక్షలు కూడ నుండును. అటువంటి వాతావరణము నాయకులచేతను, అధికారుల చేతను భయభక్తులతోఁ బనిచేయించుటకు మిక్కిలియనుకూలము.

సూత్రము – 44 : చొఱవ గల ప్రజలు.

వృత్తి :

ప్రతి విషయమునందును బ్రభుత్వ సహాయమును బ్రతీక్షింపకయు, నపేక్షింపకయుఁ స్వతంత్రమైన చొఱవఁ దీసికొను తత్త్వము గల ప్రజలున్నచోటఁ బ్రజాస్వామ్యము వర్ధిల్లును.
(అ) ప్రజలటువంటి స్థితికి రావలెనన్నచో నంతకుముందు ప్రజాసంక్షేమమేధ్యేయముగాఁ బరిపాలించిన ప్రాజ్ఞ నిరంకుశులైన దేశభక్త రాజులు గాని, దేశభక్త నియంతలు గాని యా దేశమున కుండియుండవలెను.
(ఆ) ప్రభుత్వ సహాయమును ధనరూపములోఁ గాని, వస్తురూపములోఁగాని, యనుకూల శాసనముల రూపములోఁ గాని, ప్రత్యేక కేటాయింపులరూపములోఁ గాని యాశించు పరాన్నభుక్ పరాధీన ప్రజలు లక్షలాదిగానున్న దేశము నందుఁ బ్రజాస్వామ్యము నడువదు. ప్రజలీ విధముగా భిక్షాపాత్రఁ జేపట్టి ప్రతిదానికిన్ని ప్రభుత్వమును దేవిరించు స్థితిలో నుండుటచేఁబాలక వర్గములు అడ్డు అదుపు లేనివై నిరంకుశముగాఁ జెలరేఁగిపోవును.అదియును గాక, భిక్షగాళ్ళను మఱియు బానిసలను నానాప్రాతిపదికములాధారముగా విడఁగొట్టుట మిక్కిలి తేలిక.
(ఇ) ఇట్లు ప్రభుత్వసహాయముల కెదురుసూచు సమాజములందు దానినివిరివిగాఁ బోందువారున్ను, బోత్తిగాఁ బోందనివారున్ను అని యిరుతెఱఁగులజనవర్గము లేర్పడును. కావునఁ బ్రభుత్వసహాయమును మిక్కుటముగాఁబోందువారి నిరంకుశత్వము తక్కుంగలవారికిఁ గంటగింపై యది తిరుగుబాటులకుఁ , గనీసము వర్గవైషమ్యములకుఁ దఱచుగా దారితీయును.
(ఈ) స్వతంత్రమైన చొఱవ లేనిచోట నెన్నికలలోఁ బోటిపడుటకున్నుసుప్రతిష్ఠితులైన వారికిఁ బోటిగా వ్యాపారములను నడుపుటకున్ను సైతముతగినంతమంది మనుష్యులు దొరుకరు.

సూత్రము – 45 : పట్టింపులకుఁ బరోక్షపాత్ర.

వృత్తి :

పట్టింపులనఁగాఁ గొన్ని నమ్మకముల మూలమున మనస్సులో నేర్పడు సున్నితత్వములు.
(అ) నమ్మకములకున్ను పట్టింపులకున్ను ప్రజాస్వామ్యము వ్యతిరేకము కాదు.ఏ పట్టింపును గాని యది నిషేధింపదు. కాని వానికిఁ బ్రభుత్వ వ్యవహారములలో బహిరంగ వ్యక్తీకరణమిచ్చుట యనేకములైన చిల్లర సమస్యలకు దారితీయును. కనుక వానికిఁ బ్రత్యక్షపాత్ర లేనటువంటి వాతావరణము నందుఁబ్రజాస్వామ్యప్రయోగము సత్ఫలితములిచ్చునని తాత్పర్యము.
(ఆ) ప్రజలందరికిని ఒకే విధమైన పట్టింపులు లేకపోవుట వలన వాని బహిరంగ వ్యక్తీకరణముచే ౌ్ఛుర్షణమేర్పడును. మతవిశ్వాసములున్ను పట్టింపులలో భాగము. ప్రజలందరున్ను ఒకే మతమునకఁ జెంది, యొకే దేవు నారాధించుచు, ఒకే విధమైన యుపాసనము జేయువారైనను, వారి వారి యాధ్యాత్మికానుభవములందును, దర్శనములందును బెక్కు వ్యత్యాసము లుండును. కనుక నొకరి పట్టింపు నామోదించి వేఱోకరి పట్టింపును దీఱిక సేయుటవివాదహేతువగును.
(ఇ) ప్రజాస్వామ్యమునందు దేశమునకంతటికిని ఒక యాధికారిక భాషవలెనె యొక యాధికారిక మతమును సైతము ప్రకటింపవచ్చును. కానియప్పుడు కూెడ విశ్వాసములను నేరుగాఁ బరిపాలన రంగములోనికిఁ దెచ్చుట కభ్యంతరమగును.
(ఈ) దేవుని పేరిటఁ గాని, పవిత్ర గ్రంథముల పేరిటఁ గాని ప్రమాణ స్వీకారములు సేయుటకున్ను, ప్రభుత్వ కార్యాలయాదికములలో నియమిత వేళలయందుఁ బ్రార్థనాదికములను నిర్వర్తించుటకున్ను ప్రజాస్వామ్య మడ్డుపడదు. కాని విశ్వాసములాధారముగాఁ బరిపాలన పరమైన నిర్ణయములుదీసికొనుట కభ్యంతరమగును.
(ఉ) పరిపాలనమునందుఁ బ్రతికూల జోక్యమును గలిగించికొననంత వరకుఁ బ్రజలలోఁ బట్టింపులుండుట ప్రభుత్వమునకున్ను మంచిదే. ప్రభుత్వయంత్రాంగపు సేవలు లభ్యము కాని చోట్ల సైత మట్టి విశ్వాసములు ప్రభుత్వయంత్రాంగము వలెనె పనిసేయుచుఁ బ్రజలను వారి హృదయాంతరాళమునుండియే యదుపాజ్ఞలలోఁ బెట్టునని గ్రహించునది.

సూత్రము – 46 : స్వేచ్ఛ.

వృత్తి :

ఒక కుటుంబము గాని, యట్టి యసంఖ్యాక కుటుంబముల సమూహములు గాని తాము తాముగా బ్రదుకుటకున్ను , సంఘముగా నేర్పడుటకున్ను , తాము తాముగా నాలోచించుటకున్ను, ప్రవర్తించుటకున్ను, పనిసేయుటకున్ను, ఆనందించుటకున్ను, తమకుఁ బ్రకృతి ప్రసాదించిన శక్తిసామర్థ్యములను మరియుఁ దమ పరిసరములలోని వనరులను దమ యిష్టప్రకారము వినియోగించుటకున్ను, వెచ్చించుటకున్ను మరియు నేతtసర్వ విపర్యయమునకున్ను ఆటంకములు లేకపోవుట స్వేచ్ఛ.
(అ) ఎల్ల హక్కులున్ను స్వేచ్ఛయందే పర్యవసించును.
(ఆ) స్వేచ్ఛ యున్నసమాజములందుఁ బ్రజాస్వామ్యమేర్పడును. ప్రజా స్వామ్యము స్వేచ్ఛనుగాని, హక్కులను గాని ప్రసాదింపదు కాని యున్న స్వేచ్ఛను మఱియుఁదన్మూలకమైన హక్కులను శాసనబద్ధము గావింప వచ్చును.

సూత్రము – 47 : సమానత్వము.

వృత్తి :

ఒకే ప్రజాస్వామ్యమునందలి మనుష్యులెల్లరును సమానులు. ఎవ్వరైనను, ఎంతవారైనను బుట్టుకతో నితరుల కంటె నెక్కువ గాని, తక్కువగాని కారు. మనిషికిని మనిషికిని మధ్య సమానత్వము నంగీకరింపని దేశమునఁ బ్రజాస్వామ్య మేర్పడదు.
(అ) ఏ వ్యక్తియు సమష్టి లేకుండఁ దానొక్కఁడే బ్రతుకలేఁడు. సమాజములేకుండ నతని జ్ఞానము గాని, నైపుణ్యము గాని యక్కరకు రావు. వ్యక్తియశాశ్వతము. సమాజము శాశ్వతము. అందువలన నొకఁ డెంతటి వాఁడయినప్పటికిన్ని, సమాజమున కెంతగా సేవఁ జేసినవాఁడైనప్పటికిన్ని, ఒకవిశిష్టుఁడుగా మన్నన పొందవచ్చును గాని, సమాజమున కంటె మాత్రమెట్టి పరిస్థితులలోను గొప్పవాఁడు కాఁడు. సమాజమునందు అందరునుఅటువంటివారే కనుక నందరును సమానులు.
(ఆ) అందరును సమానమే కనుక, నెన్నికలలో నందరి యీకోళ్ళ విలువయు సమానము. పౌరహక్కులు సమానము. రాజకీయ హక్కులు సమానము. సామాజిక కర్తవ్యములు సమానము. పన్నులు సమానము. అవకాశములు సమానము. ఉద్యోగముల కర్హతలు సమానము. విధులు సమానము. ఒకే విధముగాఁ బనిసేయువారందరికిన్ని చెల్లింపులున్ను, ననుమతులున్ను సమానము. నేరనిర్ధారణపద్ధతి సమానము. విచారణపద్ధతి సమానము. నేరములకు విధించు శిక్షలు సమానము.
(ఇ) ఈ సూత్రము – ప్రభువులు ప్రజల నెట్లు మన్నింపవలెనో చెప్పునుగాని సమానత్వమున కొక పరిమాణమును నిర్ణయించుటకుఁ బూనికొనదు.మచ్చునకు – అందరికిని ఆస్తి సంపాదించు హక్కు సమానముగాఁ గలదనిచెప్పును గాని యందుల కొక సర్వసామాన్యమైన యుత్తరావధిని ఖరాఖండిగాఁ బేర్కొనదు.
(ఈ) రాజకీయ సూత్రమగుటం జేసి రాజకీయేతర రంగములలో నిదిబహుళముగాఁ గద్దు. గుణోత్తరతా నిదానమునందు సమానత్వ విచారణరద్దు.
(ఉ) యంత్రాదికములు లేకపోవుట వలన నాగరికతా నిర్మాణమునకై కార్మికవర్గపు శారీరికశ్రమ మీఁద మిక్కిలి యాధారపడు సమాజములలో నీ విధమైన సమానత్వమును, మఱియు దాని నాధారముగాఁ జేసికొన్న ప్రజాస్వామ్యమును ఆచరణమునందుఁ బెట్టుట షుమారుగా నసాధ్యము.

సూత్రము – 48 : సమానులు సమానుల మధ్య సమానులు.

వృత్తి :

అందరును దమ సాటివారి నడుమ మట్టుకే సమానులు. ఇదియపవాదసూత్రము. అనఁగా దీని ముందటి సూత్రమునకు మినహాయింపు. అనఁగా – నందరును తమవంటివారి మధ్య మాత్రమే సమానులు.
(అ) ఒకఁ డితరులతో సమానమగునా? కాదా ? యనునది – ఆతఁడు ఏవ్యవస్థలో భాగమై యున్నాఁడ ను విషయముపై నాధారపడి యుండును.ఆతఁడు తాను పుట్టిపెరిగిన దేశపుఁ బ్రజాస్వామ్య వ్యవస్థలో భాగమై, యచ్చటనివసించుచున్నప్పుడు తక్కుంగల తన తోడి పౌరులెల్లరితోడను సమానుఁడు. ఆతఁడే పరాయి దేశమునకుఁ బోయినప్పుడు అచ్చటి ప్రజాస్వామ్యమునందలి సభ్యులతో సమానుఁడు కాఁడు.
(ఆ) కుటుంబ వ్యవస్థలోఁ గొడుకు తండ్రితో సమానుఁడు కాఁడు. పదవతరగ తి చదువుచున్న యొక చట్ట తన తోడి చట్టలతో మాత్రమే సమానుఁడు.పరిపాలకుల నడుమ వాణిజ్యవేత్త యసమానుఁడు. పారిశ్రామికవేత్తలనడుమఁ గార్మికుఁ డసమానుఁడు. కేవిచ్చి ప్రయాణించువారి నడుమఁనదివ్వకుండఁ బ్రయాణించువాఁ డసమానుఁడు. నైపుణ్యము గల వారి మధ్యనదిలేనివాఁ డసమానుఁడు. అనఁగా నర్హతయే పరిగణనలోనికి వచ్చుననిభావము.
(ఇ) ఆ యర్హతను గొన్నిపట్టుల శ్రమించి సంపాదింపవలసి యుండును.మఱికొన్నిపట్టుల నది పురుషకారమున కతీతమై విధివిలానముగా నొనఁగూడవలసి యుండును.

: ప్రకరణాంత గద్య :

ఇది సకలసూరిసమ్మతిపాత్ర హరితసగోత్రపవిత్ర శ్రీ తాడేపల్లి భానుమతీ వెంకటేశ్వర పుణ్యమిథున తృతీయ పుత్త్ర శ్రీ లలితా మహామాతృనిర్ణిబంధ కృపాకటాక్ష వీక్షణైక సంపద్యమాన బహుభారతీగాత్ర శ్రీమాన్ లలితాబాలసుబ్రహ్మణ్యము రచించిన మందిమన్నియమను నభినవరాజనీతి తంత్రమునందుఁ బర్యాలోకనాఖ్యమగు నాఱవ ప్రకరణము.

About తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

”నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు.

తెలుగు భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం ప్రశంసనీయమైనవి. ’తెలుగు సాహిత్యం’ బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు.

ఆయన రచనల్లో ఎక్కువ భాగం అముద్రితాలు. వాటిని తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.