-రవి వైజాసత్య
కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తెలుగు వికీపీడియన్లకు, తెలుగు బ్లాగర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రితం నెల 9వ తేదీన నాలుగవ పుట్టిన రోజు పండగ జరుపుకున్న తెలుగు వికీ గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి గురించి ఒకసారి నెమరు వేసుకొని కొత్త సంవత్సర లక్ష్యాల గురించి తెలుసుకుందాం.
గత సంవత్సరం ప్రారంభంలో 26,000 వ్యాసాలతో భారతీయ వికీపీడియాలన్నింటిలో అగ్రస్థానములో ఉన్న తెవికీ సంవత్సరకాలంలో 12 వేలకు పైగా కొత్త వ్యాసాలను జోడించుకొని 38,000 పైచిలుకు వ్యాసాలతో ప్రథమ స్థానాన్ని నిలుపుకొంది. గత సంవత్సరంలో రెండు వేలమంది దాకా కొత్త సభ్యులు చేరారు. ఒక లక్షన్నర కొత్త మార్పులు చేర్పులు, దిద్దుబాట్లు జరిగాయి. మొదటి లక్ష దిద్దుబాట్లకు చేరుకోవడానికి మూడున్నర సంవత్సరాలు పడితే, రెండవ లక్ష దిద్దుబాట్లు జరగడానికి కేవలం ఐదున్నర నెలలే పట్టడం విశేషం. అంతేకాక మిత్రుల, ప్రోత్సాహకుల సద్విమర్శలను స్వీకరించి అటు విస్తృతితో పాటు ఇటు వ్యాసాల నాణ్యత పెంచడంలో కూడా విశేష కృషి జరిగింది.
2007 జూన్‌లో ప్రారంభించిన ఈ వారపు వ్యాసం మంచి ఆదరణ పొందింది. ఇప్పటిదాకా వికీపీడియా మొదటి పేజీలో ముఫ్ఫైకి పైగా మంచి వ్యాసాలు ఎంపిక చేసి ప్రదర్శింపబడ్డాయి. ఇంకా మరెన్నో మంచి వ్యాసాలు ముందువారాలలో ప్రదర్శించడానికి ఎంపికచేయబడి వరుసక్రమంలో ఉన్నాయి.
సుడోకు, మాయాబజార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హైదరాబాదు, తళ్ళికోట యుద్ధము, అక్షరధామ్, టి.జి.కమలాదేవి, మలేరియా, ఒమన్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, భారతజాతీయపతాకం, తోలుబొమ్మలాట, ఖోరాన్, మంగళగిరి, కె.వి.రెడ్డి, నర్తనశాల, రుక్మిణీదేవిఅరండేల్, ఖర్జూరం, రూపాయి, హిందూ పత్రిక, కన్యకా పరమేశ్వరి, సంఖ్య, హంపి, వైరస్, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము, సాలూరు రాజేశ్వరరావు, మహాత్మా గాంధీ, తులసి, రౌండు టేబులు సమావేశాలు, పశ్చిమ గోదావరి, పండు, నక్సలైటు, అంతర్వేది
మీరు ఈ వారపు వ్యాసాన్ని నేరుగా మీ ఈ-మెయిలుకే తెప్పించుకోవటానికి tewiki-maiku-subscribe@googlegroups.com చిరునామాకు ఒక సందేశం పంపండి.
2007లో కృషి జరిగిన రంగాలలో ఆర్ధిక శాస్త్రము, వైద్యము, జీవశాస్త్రము ముఖ్యంగా వృక్షశాస్త్రము, క్రికెట్టు, వివిధ క్రీడలు, క్రీడాకారులు, ముస్లిం మతం, హిందూ పుణ్యక్షేత్రాలు మొదలైన విషయాలలో సభ్యులు చాలా వ్యాసాలను జోడించారు. గ్రామాల వ్యాసాలకు మార్పులు చేర్పులు, సవరణలు దాదాపు పూర్తయ్యాయి. 2008 ఏప్రిల్ కల్లా అన్ని గ్రామాలకు గణాంకాలు చేర్చే పని ముగించగలమని ఆశిస్తున్నాము. వికీపీడియా అనుబంధ ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతంతా దాదాపు గత సంవత్సరంలో జరిగినదే. క్రితం సంచికలో వాటి విశేషాలు, ప్రగతి సమీక్షించుకున్నాం కాబట్టి వాటి గురించి వచ్చే సంచికలో సవివరంగా చెప్పుకుందాం.
2008లో రాసి కంటే వాసి మీదే ఎక్కువగా కృషి చెయ్యాలని అనుకుంటున్నాము. అయినా కొత్త వ్యాసాల ఉధృతిని ఆపలేము కదా. 2008 చివరికి తెలుగు వికీపీడియా మరో 12 వేల కొత్తవ్యాసాలను జోడించుకొని 50 వేల వ్యాసాల మైలురాయి చేరుతుందని అంచనా. దీనితో పాటు ఈ సంవత్సరాంతానికి 5 లక్షల దిద్దుబాట్లు, 8 వేల మంది సభ్యులకు చేరుకుంటుంది. ఇక నాణ్యతా పరంగా సంవత్సరంతానికి చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న వ్యాసాలు ఒక వెయ్యికి పైగా జత అవుతాయనుకుంటున్నాము. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలోని వ్యాసాలలో మొలకలు 50 శాతం పైగానే ఉన్నాయి. వాటిని 2008 చివరికి 30 శాతానికి తగ్గించగలమని అంచనా. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2009 సెప్టెంబరులో తెలుగు వికీపీడియా తొలి సిడీ వెర్షన్ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమౌతుంది.
ఈ లక్ష్యాలను సాధించగలిగితే తెలుగు వికీపీడియా ఈ కొత్త సంవత్సరంలో జోరుగా ప్రగతి సాధించినట్లే. అయితే వీటిని సాధించటానికి ఎప్పటిలాగే తెలుగు వికీపీడియన్లు, బ్లాగర్లు, తెలుగు భాషాభిమానులు, పండితులు, పాత్రికేయులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరి సహకారము కావాలి.
ప్రతి ఒక్కరూ వ్యాసాలే వ్రాయాల్సిన అవసరం లేదు. మీమీ ఆసక్తిని, వీలు బట్టి ఈ క్రింది జాబితాలోని ఏదైన ఒక పని చేసి కూడా తెలుగు వికీపీడియా మీకు తోచిన సహాయము చెయ్యవచ్చు.
- వీలైనన్ని కంప్యూటర్లకు తెలుగు నేర్పించండి
- నలుగురికీ మాట చేరవెయ్యండి – ఇంకా చాలా మందికి అంతర్జాలంలో వికీపీడియా అనే విజ్ఞానపు ఖని ఉందని తెలియదు. తెలిసినా, తెలుగులో వికీపీడియా ఉందని ఇంకా చాలామందికి తెలియదు.
- తెలుగుకు సంబంధించిన విషయాలు వెతుకుతున్నప్పుడు గూగూల్లో తెలుగులో శోధించండి.
- వికీపీడియాలో మీ ఊరి గురించి వ్రాయండి
- అచ్చుతప్పులు కనిపిస్తే సంకోచించికుండా సరిదిద్దండి. – (ప్రతి వ్యాసం పైన “మార్చు” అనే లింకు పైన క్లిక్ చేసి దిద్దవచ్చు)
- ఏదైనా విషయం గురించి మంచి సమాచారం కనిపిస్తే దాని గురించి వికీపీడియా సభ్యులకు కబురందివ్వండి. (teluguwiki@yahoo.co.in)
- ఫోటోలు పంపించండి – ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు కానీ, పండుగులు, తెలుగు సంస్కృతి, మీ ఊరు మొదలిన విషయాలకు సంబంధించిన ఫోటోలు పంపించండి.
- రూపురేఖలు మార్చెయ్యండి – మీకు CSS, HTML బాగా పరిచయముంటే వికీపీడీయా సైటును అందంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి.
- సలహాలు సూచనలూ చెయ్యండి – ఉచిత సలహాలను మేము సీరియస్సుగానే తీసుకుంటాం!
- మీ అనువాద పటిమను సానబెట్టుకోండి – సవాలుగా స్వీకరించి ఇతర భాషలలో ఉన్న ఒక వ్యాసాన్ని తెలుగులోకి అనువదించండి (ఇంగ్లీషు నుండే కానక్కరలేదు)
- తెలుగు వ్రాతకు ఒక శైలి మాన్యువల్ రూపొందించడంలో సహకరించండి
- స్క్రిప్టింగు తెలుసుంటే బాట్లు వ్రాసి పనులు సులువు చెయ్యండి.
రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.
పేజీలో పైనున్న వికీపీడియా ప్రకటన బొమ్మను వికీపీడియా సభ్యుడైన దేవా తయారు చేశారు.
అధ్భుతం!
బాగుంది, బహుబాగుంది
మీ ఆశయం నెరవేరలని ఆశిద్దాం!
excellent
bagundi