మునికన్నడి సేద్యం -సమీక్ష

-రానారె

మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి – ఇదీ మునికన్నడి కుటుంబం.

ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వాలతో, బలాలతో, బలహీనతలతో, గుణాలతో ఒక్కో మనిషి సజీవంగా మన ముందు తిరుగాడినట్లే వుంటుంది.

కష్టించి పనిచెయ్యడానికి వెరపు లేని కుటుంబం. కాకపోతే, కష్టం చేసేందుకు ‘గోచిపాతంత’ కయ్య కూడా లేదు పాపం వీరికి వీళ్ల సొంత వూరు రంగంపేటలో. సంసారం పెద్దదయేకొద్దీ గింజఖర్చు పెరిగిపోయి ఆ కాపురం నిగ్గడం కష్టమౌతున్న తరుణంలో యెంగటమ్మ అన్న గుర్రప్పనాయుడు వీళ్లింటికొచ్చి, “ఈ వూరు మీకు అచ్చిరాలా. ఎంత కష్టం చేసినా బూడిదలో పోసిన వుచ్చ మాదిరి నిలకుండా పోతుండాది. ఈడ జేసే కష్టం ఆడ జేసుకోవచ్చులే వచ్చేయండి మా వూరికి. నన్ను జూపెట్టుకొని మీరు, మిమ్మల్ని జూపెట్టుకొని మీరూ బతికిపోదారి. మా వూళ్లో అద్దాలామె అని వుండలేదా, ఆమె అంపించింది నన్ను. ఆమె కయ్యను గుత్తకిస్తిందంట. మీరు చేస్తారో చెయ్యరో అడిగి కనుక్కొని రమ్మనింది” అంటాడు. అనుభవాలు చెప్పిన పాఠమో, వయసు తెచ్చిన భారమో గానీ మునికన్నడి తండ్రి వెనుకంజ వేస్తాడు. కీడెంచి మేలెంచమనే యితని ‘యెనక తొక్కుల’ తత్వానికి వెంకటమ్మ తత్వం సరిజోడు. “చేతి నిండికీ సేద్యం వుండాల్నేగాని మామా! మొగలాయి బతుకు బతకమా! అద్దాలామెకి ఎంత కయ్య వుండాది? నీటి సౌక్రిం ఎంత మటుకు? నేల మంచి నేలేనా?” అంటూ ‘మునాశపడిన’ మునికన్నడికి ఆమె ఎప్పుడూ వత్తాసే. మునికన్నడూ ధర్మడూ, “మిట్టూరుకు పోయి దీనికి మించిన బతుకు బతకదాం” అని తల్లీదండ్రిని ఉపద్ర పెట్టి మిట్టూరు చేరతారు. ఆ తరువాతి రెండేళ్ల జీవితమే ఈ నూరు పుటల నవల.

ప్రతి మనిషికీ భద్రమైన సుఖప్రదమైన జీవితాన్ని సమకూర్చుకోవాలనే ఆరాటం వుంటుంది. ఈ జీవితేచ్ఛను యీడేర్చుకోవడానికి పడే శ్రమలో ప్రతి మనిషికీ తారసపడే ఆశలు, నిరాశలు, సంతోషాన్ని కలిగించే ఘట్టాలు, ప్రలోభపెట్టే పరిస్థితులు, ఎదురయే అవమానాలు, అడ్డొచ్చే అహం, దెబ్బలుతినే ఆత్మాభిమానం, చంపుకోవలసి వచ్చే మనసు, హాయిని కూర్చే కుటుంబజీవితం, తెగిపోతామని బెదిరించే బంధుసంబంధాలు, కష్టకాలంలో ఆత్మీయతను పొంగించే రక్తసంబంధాలు, అంతలోనే వోటికుండలా కనిపించే కుటుంబ ఐక్యత, నెరవేరని ప్రణాళికలు, దైవికమనిపించే ఘటనలు, మంచికాలం గానూ చెడ్డకాలం గానూ దర్శనమిచ్చే ప్రకృతి, నెనరును కురిపించే ఆత్మీయులు, వారిని ఆనుకొని వుండే అసూయాపరులు, … ఇలా చెబుతూ పోతే యెన్నెన్నో. జీవనవ్యాపారంలోని ఈ ‘ఎన్నెన్నో’లన్నీ ఈ నవల చదివేవారి కళ్లకు కనబడతాయి. ఈ నవలకు సమీక్ష రాయడమంటే జీవితానికి సమీక్ష రాయడమే. జీవితాన్ని సమీక్షించడమంటే మాటలు కాదు కదా! అందుకే ఈ చిన్న వ్యాసాన్ని సమీక్ష అనబోవడంలేదు నేను.

ధర్మడికి తన మనుషులంటే మహా ప్రీతి. ఈ ప్రేమతో వారి నమ్మకాన్ని తిరిగి గెలుస్తూ వుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. ఇంతకు మించి ఎక్కువ చెప్పడం భావ్యంకాదు. చదివి ఆస్వాదించండి. ఈ కథలో ధర్ముడొక అద్భుతమైన పాత్ర. ఇలాంటివాడు ఇంటికొకడుంటాడనుకుంటా. బహుశా వుండాలేమో కూడా! 🙂

ప్రతి ఒక్కరికీ అన్వయించుకోకుండా స్థూలంగా చూచినా ఈ కథకు నేపథ్యం హృద్యమైన గ్రామీణ రైతు జీవితం. వసతులన్నీ సక్రమంగా కుదిరిన సేద్యగాని కష్టానికి ఆ సమాజంలో వుండే మర్యాద, స్వయం ప్రతిపత్తి, ఆ బ్రతుకులోని గౌరవం, జీవితం పట్ల అనురక్తి, ఆ సంఘజీవనంలోని మజా, శ్రమలోని సుఖం ‘మునికన్నడి సేద్యం’ పాఠకులకు రుచిచూపి, “స్వయంపోషక గ్రామస్వరాజ్యం జిందాబాద్” అనిస్తుంది. ‘రైతే రాజు’ అనే మాట ఎందుకు వాడుకలో వుండేదో అనుభవంలేనివారికి తెలియజేస్తుంది. కష్టం చెయ్యగల శక్తి వున్నా తగిన వసతులు కుదరకపోతే, ప్రకృతి అనుకూలించకపోతే, అదే సేద్యగాడు పడే వేదనను కూడా మునికన్నడి సేద్యం చవిచూపి కంటతడిపెట్టిస్తుంది. చదవడం పూర్తయ్యాక కూడా మరెన్నో ఆగని ఆలోచనలను రేపుతుంది.

రైతులమధ్య పరస్పర సహకారం ఎలా వుంటుందో చూపించే ఒక మెతుకు ఇది; పట్టి చూడండి – మునికన్నడి మడి దున్నకానికి కొన్నిదినాలు తన కాడెద్దులను యిచ్చిన చెంగమనాయుడు వొగిసులో సగానికి సగం వుండే మునికన్నడి మింద రెండు చేతులూ యేసి, “మళ్లా నీతో అక్కర బడింది రా రే” అన్నాడు. “నీ కాళ్లు, నా చేతులు – చెప్పు సామీ, చెప్పు” అన్నాడు మునికన్నడు నవ్వతా. (నువ్వు కాలితో చెప్పిన పనిని నేను చేత్తో చేసేస్తాననే కృతజ్ఞతాపూర్వక స్నేహపూరిత భావన).

ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వాలతో, బలాలతో, బలహీనతలతో, గుణాలతో ఒక్కో మనిషి సజీవంగా మన ముందు తిరుగాడినట్లే వుంటుంది. ఎనకతొక్కులు తొక్కినట్టే వుంటూ, అందువల్ల పెళ్లాంతో మాటలు పడుతూ (తమాషా తమాషాగానే), ప్రతి పనికీ సాదకబాదకాలను బేరీజు వేసే తత్వం, కొడుకులను జాగరూకులుగా వుంచుతూ, అండర్ ప్లే చేసే వ్యక్తిత్వం మునికన్నడి తండ్రిది. ఒక చోట కథకుడు (narrator?) అంటాడు – ఆయనకు పుట్టిన కొడుకు దగ్గిర ఆయన చెప్పించుకోవాల్నా? ఆ మాత్రం ఆయనకు తెలవదా ఏమి? – అని.

తన బిడ్డలు సుఖపడతారనుకుంటే ఆత్మాభిమాన్ని కొంత చంపుకోవడానికైనా సాహసించే తల్లి యెంగటమ్మ.ఈ త్యాగానికి కూడా కుటుంబగౌరవానికి దెబ్బ తగలనీయని ఆమెదైన ఒక హద్దు వుంది. అదేమిటో నేను చెప్పడం కంటే మీరు చదవడమే బాగుంటుంది. సేద్యగాళ్లను సర్కసులో జంతువులను ఆడించినట్లు ఆడించేది విద్యుత్ సరఫరా. సొంత మోటరు కల రైతులయినా సరే చాలీచాలని ఓల్టేజి ఒక్కసారి మోటరు కాయిల్ ను కాల్చిందంటే ఆ పంటలో వచ్చే రాబడికీ, పెట్టుబడికీ, మోటరు రిపేరుకూ చెల్లు వేసుకోవచ్చు. మోటరును కాల్చక పోయినా సరే, చాలీచాలని నీళ్లున్న బావుల కింద ఆ ఆట అనుభవైకవేద్యం. కరెంటోళ్ల మింద యెంగటమ్మ నిష్టూరపు మాటలు వినండి – “దొంగనాబట్టలు ఏ పొద్దన్నా పైర్లు చేసుంటే తెలిసుండును బాదలు”.

అన్నకంటే ధర్మానాయుడు చాలా చిన్నవాడు కాకపోవడంతో ‘అన్నా, వొరే’ కలబోసిన పిలుపొకటి పిలుస్తాడు. అన్నంటే కొంచెం భయం కూడా వుంది. కానీ ఆ భయాన్నెప్పుడైనా పోగొట్టుకోగలడు. మంచి మాటకారి. సంసారియైన వాడే కానీ కొంచెం పని దొంగ కూడా. వూపుమీదున్నప్పుడు ఎంత పనైనా కష్టమని తలచకుండా చేసెయ్యగలడు. పాలు పిండటం, చెట్లెక్కి ఆకు కొట్టడం వంటి కొన్ని పనుల్లో ప్రత్యేక నాపుణ్యం కలవాడు. కొత్త సావాసాలు, కొత్త విద్యలూ నేర్చుకుంటూవుంటాడు. ఎలాగైనా బతికేయగలననే నమ్మకం కలవాడు. ఈ నమ్మకాన్ని ఒకోసారి తన కుటుంబంలోనివారికి కూడా కలిగిస్తాడు. వీడు చెయ్యిదాటిపోతాడనే ఆందోళనను ఆ కుటుంబానికి కలిగిస్తూ వుంటాడు. ధర్మడికి తన మనుషులంటే మహా ప్రీతి. ఈ ప్రేమతో వారి నమ్మకాన్ని తిరిగి గెలుస్తూ వుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. ఇంతకు మించి ఎక్కువ చెప్పడం భావ్యంకాదు. చదివి ఆస్వాదించండి. ఈ కథలో ధర్ముడొక అద్భుతమైన పాత్ర. ఇలాంటివాడు ఇంటికొకడుంటాడనుకుంటా. బహుశా వుండాలేమో కూడా. 🙂

రైతులు సేద్యం మానేసి ఇతర సంపాదనల్లోకి రావాలనే (సమ్)ఉచితసలహాలు కొన్ని విన్నాం ఇటీవల. సేద్యగాడుగా బ్రతకడంలోని గౌరవాన్ని రుచి చూసినవాడు మరియు రైతుగా జీవితాన్ని ప్రేమించినవాడు – కూలీగానో మరో వృత్తిలోనికో మారవలసి వస్తే కలిగే సంఘర్షణను గొప్ప సహానుభూతితో చిత్రించడం ఈ నవలలో వుంది. వ్యవసాయానికి కాలం కాదిది, అంతకంటే సులభమైనది యేదో వొక బ్రతుకుదెరువును చూసుకోవడమే సరైన దారి అనే చేదు నిజాన్ని రచయిత చెప్పదలచారేమో. ఐతే ఈ నవల యొక్క వస్తువు కేవలం యిదేననుకోవడానికి వీల్లేదని మీకీపాటికి అర్థమయి వుంటుందని ఆశిస్తాను. దైనందిన సాంసారిక జీవితంలో ప్రతి మనిషినీ ఆనందంతో పులకరింపజేసే సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతోపాటు నవరసాలూ హృదయంగమంగా సాక్షాత్కరింపజేసిన రచన మునికన్నడి సేద్యం.

మధ్యతరగతి కుటుంబాలుగా పరిగణించబడే చాలా కుటుంబాలలోని దారిద్ర్యం ఒక రకంగా శాపం, మరో రకంగా వరం. “Poverty is a grateful boon, mother of health, remover of cares, restorer of wisdom, a possession without loss.” అన్నాడొక అనుభవజ్ఞుడు. మన దేశంలోని అత్యధికశాతమయిన గ్రామీణ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబాల జీవిత చిత్రణ ఈ నవల. భారతదేశపు సగటు జీవిని, సామాన్యుని జీవితాన్ని ఈ నవలతో కళ్లకు కట్టాడు, మహానుభావుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు.

పుస్తకాలకు:

  • విశాలాంధ్ర ప్రచురణాలయం అన్ని బ్రాంచీలూ
  • ప్రజాశక్తి బుక్ హౌస్ అన్ని బ్రాంచీలూ
  • అంతర్జాలంలో ఏవీకేయఫ్ ద్వారా లభ్యం.

—————–

రానారె (యర్రపురెడ్డి రామనాధరెడ్డి) పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

3 Responses to మునికన్నడి సేద్యం -సమీక్ష

  1. రానారె గారు,
    మీరు తప్ప ఇంకొకరు ఈ నవలను సమీక్షించి ఉంటే ఈ సమీక్ష ఇంత ‘రుసి పసిగా ‘ ఉండేది కాదబ్బా! ఇది బాగుంది, ఇది బాగ లేదు అని చెప్పడానికేం ఉంది, ఆయనెంత బాగా రాశాడో, మీరంతా బాగా పరిచయం చేసారు.

    చివర్లో మునికన్నడు రాళ్ళు కొట్టేదానికి పోయే దృశ్యం కళ్లముందు సాక్షాత్కరించి చివుక్కుమనిపిస్తుంది.

    ఇప్పుడే నామిని గారికి ఫోన్ చేసి ‘పరిచయం వచ్చింది చూడండి ‘ అని చెపితే ఆయన ‘అదంతా నాకు చాత కాదబ్బా, వచ్చే ఏడాది టాం గాడు బీటెక్ లో చేరాక కంప్యూటర్ నేర్చుకుంటాన్లే’ అన్నారు నిర్దయగా! ఈ సమీక్షని ప్రింటు తీసి ఇవాళే ఆయనకు పంపుతున్నాను.

  2. సుధాకర బాబు says:

    చక్కని రచనను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. తెలుగులో వచ్చిన అత్యుత్తమ నవలలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం. సన్నకారు వ్యవసాయానికి నిజంగా ఇప్పుడు కాలం కాదు. చిన్న కమతంతో ఎదిగినవాడు కనిపించడు. ఎదిగే అవకాశం ఇప్పుడసలే లేదు. ఎక్కడో సంపాదించి, ఆ డబ్బును వ్యవసాయంలో పెట్టినవాళ్ళ పొలాలు, ఇళ్ళు మాత్రమే కళకళ లాడుతున్నాయి.

  3. రవి says:

    ఇన్ని రోజుల తర్వాత వ్యాఖ్యానించడం ఎలాగో ఉన్నా, ఇక్కడ మాటలు చెప్పకుండ ఉండలేకున్నాను. ఈ పుస్తకం లో ఉన్నది జీవితం. అదీ అచ్చమైన ఓ సగటు రైతు జీవితం. ఇంకా చెప్పాలంటే ఓ సగటు భారతీయుని జీవితం. దారిద్ర్యం లో ఇంత సొగసూ, వొయ్యారమూ చూపించిన రచన మరొకటి కనబడదు. ఆ దృష్టి లో ఈ రచన కావ్యమే. దానికి తోడు సినబ్బ మాండలికం ఒకటి. చదువుతున్న ప్రతి పేజికొకసారైన పెదవి వంపు తిప్పకపోతే ఒట్టు.

    రైతు జీవితం “గురించి” చెప్పడం వేరు, రైతు జీవితాన్నే కళ్ళకు కట్టేలా చూపించడం వేరు. నామిని మాటల్లోనే చెప్పాలంటే, “గుడ్లు పెట్టే కోడికే గదా, గు_ నొప్పి తెలిసేది”.

Comments are closed.