భూమాత పరి’తాపం’

సంపాదకీయం

త్రివిక్రమ్

భూతాపం
వికీపీడియా కామన్స్ నుండి

మార్చి నెల వచ్చిందంటే చాలు అందరి గుండెల్లో గుబులు – ఈసారి ఎండలు ఎట్లా ఉండబోతున్నాయో అని. కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలలోనే రాత్రిళ్ళు చలి తగ్గకపోయినా పగటిపూట విరగ గాసిన ఎండలు ఎడారి వాతావరణాన్ని తలపించాయి. వాతావరణంలోని ఈ విపరీత మార్పులకు ఒక ప్రధాన కారణం భూగోళం ఏటికేడాదీ వేడెక్కుతూనే ఉండడం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. స్థానిక ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మామూలే ఐనప్పటికీ ఇటీవలి 50 సంవత్సరాల్లో భూగోళం మునుపెన్నడూ లేనంత వేగంగా వేడెక్కడం, ఆ వేడికి కారణం మానవ జనిత ఉష్ణకారక వాయువులే (anthropogenic Green House Gases) అని తేలడం ఆందోళన కలిగించే విషయాలు. ఈ గ్రీన్ హౌస్ వాయువుల్లో అతి ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్ (CO2). నీటి ఆవిరి, మీథేన్ (CH4), ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ మరికొన్ని GHGలు. బొగ్గుతో పనిచేసే (థర్మల్) పవర్ ప్లాంట్లు, ఆటోమొబైళ్ళు ఎక్కువ కార్బన్ డయాక్సైడును గాలిలోకి వదులుతాయి. పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక గడచిన రెండున్నర శతాబ్దాలలో వాతావరణంలో CO2, CH4 సాంద్రతలు క్రమంగా 31% మరియు 149% పెరిగాయి.

వాయు సాంద్రతలకు సంబంధించి ఆధారాలున్న ఆరున్నర లక్షల సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ లేదు. భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2 కోట్ల సంవత్సరాల కాలంలో CO2 సాంద్రత ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. CO2 పరిమాణంలో 75% పెరుగుదలకు కారణం ఇంధన వినియోగం కాగా మిగిలిన 25% అడవుల నరికివేత వల్ల సంభవిస్తోంది. ఈ పోకడలను బట్టి చూస్తే రానున్న శతాబ్దకాలంలో భూమి ఉష్ణోగ్రత 1.1 నుంచి 6.40C పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఉష్ణకారక వాయువులను ప్రస్తుత స్థాయిలోనే స్థిరీకరించగలిగినా రానున్న వందేళ్లలో ప్రకృతిలో విపరీత పరిణామాలు సంభవిస్తాయని అంటున్నప్పటికీ భూ ఉపరితలమ్మీద మూడొంతుల భాగాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రాలకు ఉష్ణాన్ని తమలో ఎక్కువకాలం పట్టి ఉంచే స్వభావం ఉండడం వల్ల ఈ విపరిణామాలు మరో వెయ్యేళ్ళు తమ ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు .

గత 2000 సంవత్సరాలలో ఉష్ణోగ్రత తీరుతెన్నులు (వికీపీడియా నుంచి)

ఇక ఉష్ణకారక వాయు ఉద్గారాలలో నియంత్రణ పాటించకపోతే…

భూగోళం ఇదే వేగంతో వేడెక్కితే ఏమౌతుంది? దావాగ్నులు చెలరేగుతాయి. ఎండాకాలాలు సుదీర్ఘమౌతాయి. కరువు కాటకాలు తీవ్రమౌతాయి. తుఫాన్లు, వరదలు విజృంభిస్తాయి, సహజసిద్ధమైన మంచుదిమ్మెలు (గ్లేసియర్లు) కరిగిపోతాయి. సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంతాలను ముంచేస్తాయి. అడవులు, పొలాలు, జనావాసాల్లో కొత్తకొత్తరకాల క్రిములు, వ్యాధులు వ్యాపిస్తాయి. పగడాలదీవులు, పర్వతీయ, సముద్రతీర అడవులు (మాంగ్రూవ్ లు), గడ్డిభూములు నశించడం వల్ల అనేకరకాల జీవులు నశిస్తాయి. జీవావరణంలోని వైవిధ్యం, సమతులనం దెబ్బతింటుంది. గ్లోబల్ వార్మింగ్ పోకడను అరికట్టకపోతే 2050 కల్లా పదిలక్షలకు పైగా జీవులు అంతరించిపోతాయని ఒక అంచనా.
సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే ఉత్తరధ్రువ ప్రాంతంలో ఏటా 9శాతం చొప్పున మంచు పరిమాణం తగ్గిపోతోంది.

గ్లోబల్ వార్మింగ్ వర్షపాత పరిమాణాన్ని, తీరుతెన్నులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల ఏటికేడాదీ భూవాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించి అసాధారణ ఉష్ణోగ్రతా, అతిశీతల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడే ప్రమాదముంది. అత్యుష్ణ ప్రభావాలు (heat waves) మరింత తీవ్రంగా, మరింత తరచుగా ఏర్పడుతాయి. (2003లో అత్యుష్ణ ప్రభావం వల్ల ఐరోపాలో ఇరవై వేల మందికి పైగా, మనదేశంలో 1500 మందికి పైగా చనిపోయారు.) దానిమూలంగా పంటలు పండక తీవ్రమైన ఆహారకొరతా, నీటికరువూ ఏర్పడి చాలా జనావాసాలు నివాసయోగ్యంగాక ప్రజలు భారీయెత్తున వలసలు పోవడమో, లేక పరిమిత వనరుల కోసం అపరిమితమైన పోటీ ఏర్పడి యుద్ధాలు, అరాచకాలకు పాల్పడడమో జరిగే ప్రమాదం కూడా ఉంది. ఉష్ణమండలానికే పరిమితమైన వ్యాధులు మరింత తీవ్రమౌతాయి, ఇతరప్రాంతాలకూ వ్యాపిస్తాయి.
CO2_1000_2000

గత వెయ్యేళ్లలో వాతావరణంలో CO2 పరిమాణంలో వచ్చిన మార్పు (గ్రీన్ హౌస్ వ్యాసం నుంచి)

Temp_1000_2000

అదే కాలంలో ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు (గ్లోబల్ వార్మింగ్ అడ్వైజర్ వెబ్సైటు నుంచి)

మరి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం ఏం చేస్తున్నాయి?

GHG ఉద్గారాలను నియంత్రించడానికి 1992లో రయో డి జనీరోలో జరిగిన ధరిత్రీసదస్సులో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ననుసరించి రూపొందించిన క్యోటో ప్రోటోకాల్ 16 ఫిబ్రవరి, 2005 న అమల్లోకి వచ్చింది. ఈ ప్రోటోకాల్ ప్రపంచదేశాలను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు (Annex I, Non-Annex I) అని రెండు రకాలుగా విభజించింది. Annex I దేశాలు సమష్టిగా 2012 లోపల తమ GHG ఉద్గారాలను 1990 నాటి స్థాయి కంటే 5% తక్కువకు పరిమితం చేసుకోవాలి. దీనిలో ఒక్కో దేశానికి ఒక్కో నిర్దేశిత లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోలేని దేశాలు తాము అధికంగా వదిలిన ప్రతి టన్ను GHG ఉద్గారానికీ ఒప్పందం మలిదశలో 1.3 రెట్లు emission allowances ని చెల్లించవలసివస్తుంది. ఐతే దీంట్లో వాటికి మళ్ళీ ఒక వెసులుబాటుంది: Non Annex I దేశాల్లో GHG ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే ప్రాజెక్టుల్లో Clean Development Mechanism (CDM) ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా, Annex I దేశాల నుంచి Joint Implementation, Excess Allowances లాంటి మరికొన్ని పద్ధతుల ద్వారా కార్బన్ క్రెడిట్స్ ని “కొనుక్కోవచ్చు”. అంటే Non Annex I దేశాలు ఇప్పటికిప్పుడు తమ GHG ఉద్గారాలను తగ్గించుకోవలసిన అవసరం లేనప్పటికీ అలాంటి ప్రాజెక్టులను చేపట్టినట్లైతే CDM ద్వారా ఆ దేశాలకు “కార్బన్ క్రెడిట్స్” వస్తాయి. ఆ క్రెడిట్స్ ను అవి ఆ ప్రాజెక్టుల్లో సహకారమందించే Annex I దేశాలకు “అమ్ముకోవచ్చు.” కార్బన్ క్రెడిట్స్ ని కొనుక్కున్న దేశాలు తమ GHG ఉద్గారాలను లక్ష్యాన్ని దాటి ఆ మేరకు పెంచుకోవచ్చు.

ఐతే Annex I లో ఉన్న అమెరికా లాంటి దేశాలు క్యోటో ప్రోటోకాల్ కు మోకాలడ్డుతూ “ప్రస్తుతం మేమే ఎక్కువ GHG లను వదుల్తున్నాం. సరే, భవిష్యత్తులో ఇండియా, చైనాలు కూడా మాతో పోటీ పడి వదలకపోవు కదా? అలాంటప్పుడు మేమెందుకు పరిమితులు విధించుకోవాలి? మేమే ఎందుకు కార్బన్ క్రెడిట్స్ కొనుక్కోవాలి? వాళ్ళెందుకు లాభపడాలి?” అని వితండవాదం చేస్తూ, ఈ ప్రోటోకాల్ కు దూరంగా ఉన్నాయి. దేశాలను రెండు వర్గాలుగా విభజించడాన్ని కూడా ఆ దేశాలు ఒప్పుకోవడం లేదు. “కంపు మేం చేశాం, కడగడానికి అందరూ రండి” అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. (2002లో అమెరికా CO2 ఉద్గారం 577 కోట్ల టన్నులు కాగా భారతదేశం 110 కోట్ల టన్నులు. అమెరికా జనాభా భారతదేశ జనాభాలో మూడో వంతనుకుంటే తలసరి ఉద్గారాల్లోని తేడా సుస్పష్టం.)

మనమేం చేయగలం?

ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించడం ద్వారా మనం భూగోళానికి ఎంతో మేలు చేసినవారమౌతాం. మరోవైపు ప్రధాన ఇంధన వనరు, కాలుష్య కారకం ఐన పెట్రోలు మీదే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరులైన అణువిద్యుత్తు, సౌరవిద్యుత్తు, పవన, సాగర శక్తి లాంటివాటిని వినియోగంలోకి తెచ్చేలా, GHG ఉద్గారాలను నియంత్రించే చట్టాలను రూపొందించి అమలుచేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తిసుకురావాలి. నిజానికి కావలసింది దూరదృష్టితో ఆలోచించి పర్యావరణ విపరిణామాలను అరికట్టే దిశగా గట్టి చర్యలు తీసుకునే నాయకత్వం. రాజకీయనాయకుల్లో అలాంటి చిత్తశుద్ధి కరువైనప్పుడు ప్రజలే వారిపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. ఉదాహరణకు పోయినేడాది సిడ్నీ, ముంబాయి నగరాల్లో ఇంధన వినియోగాన్ని ఒకగంటసేపు ఆపివేయడం ద్వారా ఆయా నగరాల వాసులు ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించడంలోను, తమ భావాన్ని అందరికీ తెలిసేలా వ్యక్తపరచడంలోను కృతకృత్యులయ్యారు. హైదరాబాదులో కూడా ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ అన్ ప్లగ్ (బత్తీ బంద్) కార్యక్రమాన్ని నిర్వహించడానికి TMAD సంసిద్ధమౌతోంది.

ఇవి కూడా చూడండి:

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

4 Responses to భూమాత పరి’తాపం’

  1. radhika says:

    చాలా మంచి వ్యాసం.సౌర విద్యుత్తు పై ఇప్పటికే గ్రామీణ ప్రజల్లో కూడా మంచి అవగాహన వుంది.కానీ దాని ఖరీదు చాలా ఎక్కువ అవడం వల్ల ప్రజలు దాని వైపు వెళ్ళలేకపోతున్నారు.అన్నేసి కోట్లు వృధా చేస్తున్న ప్రభుత్వం ఈ సౌర యంత్రాలను కొద్ది తక్కువ రేట్లకు అందేలా చేయగలిగితే కొంతవరకు ఉపయోగం వుంటుందనుకుంటున్నాను.
    మంచి మంచి కార్యక్రమాలను చేపడుతున్న టీమేడ్ వాళ్ళకి నా అభినందనలు.

  2. రాఘవ says:

    దీనిపై అల్ గోర్ The Inconvenient Truth అని వొక చక్కటి డాక్యుమెంటరీ కూడ వుంది.

  3. Prasanthi says:

    The Hyderabad Unplug date has been changed to May 3rd.

    This event is not organized by TMAD group. This is a people’s movement. Some of the TMAD members are working as volunteers.

    Batti Bandh and Hyderabad Unplug are different. Batti Bandh idea is to do a National Campaign – Entire India on one single day. Efforts are on in that direction. Batti Bandh date is June 15.

  4. Pingback: Top Ten voted Telugu Blog posts for the Month March 2008 on Jalleda.. | జల్లెడ బ్లాగు

Comments are closed.