జగదీష్-జ్యోతిలక్ష్మి

-అశ్విన్ బూదరాజు

“అప్పటికీ నేను చెపుతూనే ఉన్నాను తాతగారూ, జగదీషే ఏం పర్లేదని చుట్ట తాగాడు” అని జ్యోతిలక్ష్మి మా తాతగారితో చెప్పటం నాకు వినపడింది. అంతే, మా తాతగారు…

ఎప్పటిలాగే మెయిల్ చెక్ చేసుకుంటుంటే, జ్యోతిలక్ష్మి అనే పేరుతో మెయిల్ కనబడి మొదట కొంచెం భయం వేసింది. అయినా గుండె రాయి చేసుకుని ప్రింటౌట్ తీయించుకుని మరీ చదివా. ఇంతకూ మీకు జ్యోతిలక్ష్మి తెలియదు కదా! నన్ను జగదీష్, జగ్గూ అని పిలిచే జ్యోతిలక్ష్మి గురించి మీకు చెప్పే తీరాలి.

అవి బ్లాక్ అండ్ వైట్ రోజులు. నేను గుడివాడలో 6వ తరగతి చదువుతున్నాను. మేము శేషగిరిరావు గారింట్లో అద్దెకుండేవాళ్ళం. మా ఇంటి పక్కవాటాలో ఉండేది జ్యోతిలక్ష్మి. ఇద్దరం ఒకే బడి, ఒకే తరగతి. బొద్దుగా, నల్లగా, యమలోకంలో చిన్న యమభటురాలు లాగా ఉంటుంది. తనంటే నాకు చచ్చేంత భయం. అప్పట్లో తను పెట్టే హింసలకు మింగలేక కక్కలేక నానా యాతనా అనుభవించాను.

ఓ రోజు.. బడికి టైమైపోయింది. నేను అసలే హడావిడి మనిషిని. రాత్రి పైజమాకు బొందు ఎక్కించుకోవటం మరచిపోయా! బొందు కోసం హడావిడిగా తిరుగుతుంటే పెరట్లో జ్యోతిలక్ష్మి రిబ్బన్ కనపడింది. అలా దాన్ని మాయం చేసి ఇలా నా బొందుకు కట్టుకున్నా. మేమిద్దరం ఒకే సైకిల్ మీద బడికెళ్ళేవాళ్ళం. ఆరోజు ఎందుకో జ్యోతిలక్ష్మి నా మీద అనుమానపడుతూనే ఉంది. తీరా, తరగతిలో నేను చేసిన హోమ్ వర్క్ ను తనే చేసానని చూపించటం వల్ల నేను గోడకుర్చీ వేయవలసి వచ్చింది. గోడకుర్చీ వేయగానే తన బొందు బయట పడింది. అంతే, “నా రిబ్బన్ నాకిచ్చెయ్” అంటూ ఏడుపు మొదలు పెట్టింది. బొందు తీస్తే పైజమా ఊడిపోతుంది, తీయకపోతే అది ఏడుపు ఆపేటట్టులేదు. ఇంతయ్, గోరంతయ్, కొండంతయ్ అన్నట్టు ఏడుస్తూనే ఉంది. నాకు కాళ్ళూ, చేతులూ ఆడటం లేదు. ఎవరూ చూడకుండా వెంటనే రిబ్బన్ తీసి, తనకిచ్చి ఎడం చేత్తో పైజమా పట్టుకుని ఏడుస్తూ ఇంటికి పరుగుతీసా. ఇక నేను ఆ వారం మిగతా పిల్లలు ఏడిపిస్తారని బడికి వెళ్ళలేదు.

*****

ఓ సారి మా చింతాతయ్యగారు ఉగాది నాడు మా ఇద్దరికీ కన్యాశుల్కం కొనిచ్చారు. తనిలాంటి పుస్తకాలు చదవటంలో దిట్ట. ఓరోజు తను

ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్.
పొగచెట్టై జన్మించెన్
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్!

అని ఈ పద్యం చదివి వినిపించి, “రేయ్ జగ్గూ, మనకీ దున్నపోతు జన్మెందుక”ని నన్ను శతవిధాలా ప్రోత్సహించి, మా పెత్తాతయ్య సుబ్బారావు గారి దగ్గర చుట్ట దొంగిలించి మా పెరటి అరటి పొదల్లోకి తీసుకెళ్ళింది. తనే చేతులారా చుట్టను నానోటిలో పెట్టి నిప్పంటించింది. తరువాత తెలిసింది తను అంటించిన నిప్పు నా కొంపకని. గట్టిగా ఓ మారు చుట్టామృతాన్ని పీల్చొదిలా. మరుక్షణం ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ కళ్ళు తెరచి చూసేటప్పటికి మా బంధువర్గ ముఖ్యులందరూ నా చుట్టూ గుమిగూడి ఉన్నారు. పక్క గదిలో నుండి “అప్పటికీ నేను చెపుతూనే ఉన్నాను తాతగారూ, జగదీషే ఏం పర్లేదని చుట్ట తాగాడు” అని జ్యోతిలక్ష్మి మా తాతగారితో చెప్పటం నాకు వినపడింది. అంతే, మా తాతగారు ప్రళయ తాండవం చేసి నా తొడ మీద వాతపెట్టారు.

ఇంతే కాదు, బడికి వెళ్ళేటప్పుడు సైకిలు నేనే తొక్కుతానంటూ, ప్రతీరోజు నన్ను క్రిందపడేయటమే. నవీన్ గాడి క్యారేజ్ తినేసి నా మీద నెట్టెయ్యడం, బడిలో నా హోంవర్కు చూపించటం.. ఛా, ప్రతీ రోజు నాకు గోడ కుర్చీనే. మళ్ళీ మార్కుల్లో నాకన్నా ఓ రెండు మార్కులు ముందుండేది. ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకోవటానికి సిగ్గేసేన్నిసార్లు నన్ను చిత్ర, విచిత్రంగా ఏడిపించేది. మా ఏడవ తరగతిలో మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అవ్వటంతో ఎంతో ఆనందంగా వైజాగ్ వెళ్ళిపోయాను. తరువాత ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్ చేరుకున్నాను.

ఇంతకీ ఈమెయిల్ సారాంశం ఏమిటంటే “నేను బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నాను. నన్ను రిసీవ్ చేసుకో. లేకపోతే నిన్ను మీ ఆఫీస్ లోనే చంపేస్తా, ఆఫీస్‌లో పనులున్నాయి అని యధవ సాకులు చెప్పకు. గుర్తు పెట్టుకో మే 9, ఎయిర్ పోర్ట్‌కు రా. ఒకవేళ నువ్వు రాకపోతే నేను సరాసరి మీ ఆఫీస్‌కే వచ్చి అందరి ముందు నీ పాడె కట్టేస్తా, నాగురించి తెలుసు కదా!” అవును, దీని గురించి నాకు బాగా తెలుసు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మెయిల్ చేస్తోంది గదా.. ఇలానా రాసేది? ఒకవేళ నేను కనుక వెళ్ళకపోతే పాడె కట్టటమే కాదు, ఇక్కడున్న అందరి చేత ‘క్యూ’ పద్ధతిలో దండలు కూడా వేయిస్తుంది. ‘అమ్మో!’ అనుకుని లీవ్ కోసం అప్లై చెయ్యటానికి లెటర్ తీసుకున్నా.

ఇంతలో మా బాస్ బాధేశ్వరరావు “ఏమయ్యా, ఏది ఏమైనా నీకు సుడుందోయ్” అంటూ రాని నవ్వు ఒకటి నవ్వుతూ నా దగ్గరకు వచ్చాడు. ఈయన ఏలాంటి వ్యక్తో ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఒకవేళ జ్యోతిలక్ష్మి కనుక ఆఫీస్‌లో నిజంగానే నన్ను చంపి పాడె కడితే ముందుగా దండేసేది ఈయనే. అయినా, ఓ పక్కన సుడిగుండం దగ్గర కొస్తూ ఉంటే నాకు సుడుందంటాడేంటి? ఎంత లేదన్నా మన బాస్ అన్న విషయం గుర్తుకొచ్చి లేచి నించోబోతుంటే “ఏం పర్లేదు లేవోయ్, నీకు తెలుసు కదా బెంగుళూరులో మన హెడ్ ఆఫీస్ ఉందని? నన్ను అక్కడికి ట్రాన్ఫర్ చేశారు. ఓ రెండు మూడు వేలు పెరగనుంది. ఏదో మనవాడివని చెపుతున్నా, నాకు మే 12వ తారీఖు నాడు బెంగుళూరులో రిపోర్టింగ్. నాలుగు రోజుల ముందు, అంటే రేపే, నేను హైదరాబాద్ వదిలి బెంగుళూరుకు వెళుతున్నా. ఇక్కడకు మే 10వ తారీఖు నాడు కొత్త బాస్ వస్తున్నారు. నా లాగా కాదులే. వద్దన్నా లీవ్‌లు, అడక్కుండా బోనస్‌లు, -మీ ఇష్టం అనుకో. ఇంతకీ సుడి గురించి వస్తే నీ ప్రమోషన్ గురించి కూడా ఓ మాటేసుంచా. రికార్డులు చూసి ‘ఓహ్ యస్’ అంటానని మాటిచ్చారు. ఈ కంపెనీకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా నువ్వే కొత్త బాస్‌ని రిసీవ్ చేసుకోవాలి, ఏమంటావ్”, అని అన్నాడు. ఇదేదో ఇరుక్కుపోయే సమస్యలా ఉంది అనుకుంటూ, “ఇంతకీ ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి?” అని అడిగా. “ఎప్పుడంటావేంటి మే 9. అంటే ఎల్లుండే!” అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు.

*****

అయిపోయింది, అంతా అయిపోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు బామ్మ ‘వినాయకుడికి దణ్ణం పెట్టుకోరా’ అంటే పెడచెవిని పెట్టా. చివరకు ప్రమోషన్ వచ్చే సమయానికి ఆపద ముంచుకొచ్చింది. అయినా ఇప్పుడు తెలిసొచ్చి ఏం లాభం? అటొచ్చి ఇటొచ్చి చివరకు నా ఉద్యోగం మీద కొచ్చింది. బాస్‌ను రిసీవ్ చేసుకోకపోతే బాస్ దగ్గర మంచి మార్కులు పడవు. ప్రమోషన్ కు ముప్పు, అదే.. జ్యోతిలక్ష్మిని పక్కన పెడితే? అమ్మో, ఇంకేమన్నా ఉందా? తిరుగుతున్న ఫానుకే ఉరేసి చంపేస్తుంది. అఫీసుకొచ్చి అన్నంత పనీ చేస్తుంది, పరువు తీస్తుంది, పరువు పోయిన చోట అసలు పని చెయ్యలేం. మళ్ళీ అసలీ ఉద్యోగానికే ఎసరొచ్చినా వస్తుంది. అయినా ఇన్నాళ్ళ తరువాత వస్తోంది కదా ‘జగదీష్, ఎలా ఉన్నావ్, పెళ్ళైందా? చిన్నప్పుడు నిన్ను ఏడిపించినందుకు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామనుకుంటున్నాను.’ అనొచ్చు కదా? అబ్బే, ఏం లేదు. ‘వస్తావా లేకపోతే పొడిచెయ్యమంటావా?’ అంటుందా? అయినా, చిన్నప్పుడే జ్యోతిలక్ష్మికి కమ్యూనిష్టు కళలుండేవి. ఇప్పుడు ఏ ఫూలన్ దేవో, ఏ నక్సలైటు నాయకురాలో అయ్యుంటుంది, ఇక్కడేదో బాంబు పెట్టడానికి నన్ను ఓ బలిపశువుగా వాడుకోటానికి రమ్మనుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తూంటే కాళ్ళొణికిపోతున్నాయి. చేతులు తడిసిపోతున్నాయి. ప్రమోషన్ ఈ రోజు కాకపోతే రేపొస్తుంది. ముందు ఈ ఉద్యోగం కాపాడుకోవాలి అనుకుని బాధేశ్వరరావు దగ్గరకు వెళ్ళి నా బాధంతా చెప్పా. బాధేశ్వరరావ్ ముందుగా బాధపడ్డాడు, తరువాత భయపడ్డాడు, తరువాత నా పరిస్థితి చూసి జాలిపడ్డాడు. ఓ పది నిమిషాలు పాటు ఆలోచించి, “సరే, నేను చూసుకుంటాలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు మే 10వ తారీఖు నాడు ఉదయం 8:30 అయ్యేటప్పటికి ఇక్కడుండాలి” అని సల సల కాగుతున్న నూనె బాండీలో నుంచి నన్ను బయట పడేశాడు. ఆ మరుసటి రోజు జ్యోతిలక్ష్మికి మెయిల్ పెట్టా, రెండు ముక్కల్లో “వస్తున్నాను -జగదీష్ ” అని.

అయినా ఒక ఆడది చెట్టంత మగవాడిని ఇలా వణికిస్తుందా? ఆడది ఏడిస్తే “ఎందుకురా ఆడదాన్ని ఏడిపిస్తావ్?” అంటారు, అదే మగవాడు నిజంగా బాధల్లోనే ఏడిస్తే ఆడదానిలా ఏడవద్దంటారు. నా బాధేంటంటే చివరకు ఈ మాటనే వాడూ మగవాడే. అదీ ఆడదంటే. అయినా అందరూ ఒకలానే ఉంటారా ఏమిటి నాలాగా మగాడు మూగోడైతే ఆడది ఆడిస్తూనే ఉంటుంది. ఆవకాయ కూడా గట్టిగా రెండు ముద్దలు తినలేని వాడిని అల్ ఖైదాలో ఇరికించేటట్టు ఉంది. ఏ టివి ఛానెల్ క్రింద స్క్రోలింగ్‌లోనో నా పేరు చూడాల్సొస్తుందని భయంతో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.

*******

“ఏరా, జ్యోతిలక్ష్మి వస్తుందని చెప్పలేదే? తను ఫోన్ చేసింది. ఓ ఇరవై నిమిషాలలో ఫైట్ దిగుతుందట…”, అని అమ్మ చెప్పగానే ఒక్కసారిగా మెళుకువ వచ్చింది. అయిదు నిమిషాలలో రెడీ అయ్యి పది నిమిషాలలో ఎయిర్ పోర్ట్ చేరుకున్నా. మూలెక్కడో భయంగా ఉన్నా, తను చెప్పినట్టుగానే ఎరుపు చొక్కా మీద బ్లూ పాంట్ వేసుకుని మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నా. అలా ఓ 15 నిమిషాల తరువాత..

“హాయ్ జగ్గూ !” అంటూ వెనుకనుండి పిలుపు వినపడటంతో వెనక్కి తిరిగా.

అయినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో? అయినా హైదరాబాద్ లో దిగీ దిగంగానే నన్నెందుకు చూడాలనుకోవటం. చూద్దాం, రేపాదివారం వస్తానందిగా. ఇలా రకరకాల ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నా.

బాపూ బొమ్మకు ప్రాణం పోసినట్టుంది ఆ అమ్మాయి. “ఏంటి అలా ఉన్నావ్? నన్ను గుర్తుపట్టలేదా?” అ నడిగింది. జ్యోతిలక్ష్మి అని అర్థమైంది గానీ, నా నోట మాట రావట్లేదు. ఓ అందమైన కల కదిలొచ్చినట్టుంది. చాలాసేపు ఏం మాట్లాడలేక పోయాను. తన అందం నన్ను మాట్లాడనివ్వలేదు. తన అందమైన కళ్ళతో నన్ను కట్టిపడేసింది. ఇంతలో తనే “ఎలా ఉన్నావ్?” అని అనడిగింది. “నేను బానే ఉన్నాను, ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ జ్యో” అన్నాను.

“బానే ఉన్నాను గానీ, కొత్తగా ఆ జ్యో ఏమిటి?”

“చిన్నప్పుడు నువ్వే చెప్పావ్‌గా శేషగిరిరావు గొడ్లపాక వెనకాల, నిన్ను జ్యో అని పిలవమని, మరచిపోయావా?”

“ఓహ్, నీకింకా గుర్తుందే!”

“ఎలా మరచిపోతాను చెప్పు, అవన్నీ…”

“ఇంతకీ ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు?”

“అందరూ బానే ఉన్నారు. ముందు ఇంటికి పద.”

“వెయిట్, లగేజ్ ఎక్కువగా ఉంది. ఎవరన్నా కూలీని పిలవచ్చు కదా…”

“ఛా, కూలీలెందుకు? నేనున్నానుగా, ఎందుకు డబ్బుల దండగా?” అని ఆ క్షణాన కూలీనయ్యా.

రెండడుగులు వెయ్యగానే “అయ్యో, నాకు ఆ బాగ్ ఇవ్వులే, నేను మోస్తాను” అని బలవంతంగా నా చేతిలోనుండి బాగ్ లాక్కుంది.

“ఓ మంచి కాఫీ తాగుదామా? నాకు కొంచం టైడ్ గా ఉంది.”

“ఓ షూర్” అని పక్కనే ఉన్న కాఫీడేకి వెళ్ళాం.

వెళ్ళి కూర్చోగానే “జగ్గూ, నాకీరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్‌లో రిపోర్టింగ్ ఉంది, నా ఫ్రెండ్ రమ్య వస్తానంది, ఎందుకో దిగీ దిగగానే నిన్ను చూడాలనిపించింది. మీ ఇంటికి నేను ఎల్లుండి ఆదివారం వస్తా, నన్నీ విషయంలో ఇబ్బంది పెట్టకు” అంది. నేను కూడా తనని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక “సరే” ఆన్నాను. ఇంతలో తన స్నేహితురాలు రమ్య వచ్చింది. తను నా మొబైల్ నంబర్ తీసుకుంది. ఓ అరగంట సేపు మాట్లాడిన తర్వాత, నేనే దగ్గరుండి ఆటో ఎక్కించాను.

******

తన గురించే ఆలోచిస్తూ రాత్రి మంచం మీద వాలాను. చిన్నప్పటిలా లేదు తను, ఎంతో మారింది. తనతో ఉన్న అరగంటలోనే అది అర్థమైంది. నేను మోస్తుంటే తను కూడ తనవంతుగా బ్యాగ్ తీసుకుంది. కెఫేలో కూడా బిల్ తనే ఇచ్చింది. తెలిసినమ్మాయి, వీటన్నిటికీ మించి ఆ అందం. అయినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో? అయినా హైదరాబాద్ లో దిగీ దిగంగానే నన్నెందుకు చూడాలనుకోవటం. చూద్దాం, రేపాదివారం వస్తానందిగా. ఇలా రకరకాల ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నా.

******

“…కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు మే 10వ తారీఖు నాడు ఉదయం 8:30 అయ్యేసరికి ఇక్కడుండాలి.” అన్న మాటలు గుర్తొచ్చి ఒక్కసారి ఉలిక్కి పడి లేచా. టైమ్ చూస్తే 9:30 అయ్యింది, ‘ఛచ్చాన్రా దేవుడా’ అనుకుంటూ 9:45 అయ్యేసరికి ఆఫీస్ లిఫ్ట్ లో ఉన్నాను. అసలే కొత్త బాస్. ఆఫీస్ అంతా ఒక్కరోజులో చాలా మారిపోయింది. Work is worship, There is no wrong time to do the right thing. వంటి వాల్ పోస్టర్స్ అతికించున్నాయి. మార్కెట్‌లా ఉండే మా ఆఫీసంతా నీట్ గా ఉంది. అందరూ ఫార్మల్స్ లో ఉన్నారు. నేను లోపలికి రాగానే అందరూ నన్ను జాలిగా చూశారు. ఇంతలో మా ప్యూన్ పరంధామం వచ్చి మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అన్నాడు. వెంటనే అందరూ తలదించి పనిచేసుకోవడం మొదలు పెట్టారు. ‘అయినా బాధేశ్వరరావు అన్నీ చెప్పే ఉంటాడులే’ అనుకున్నా. “మే అయ్ కమిన్” అంటూ లోపలకు ఆడుగుపెట్టా.

“రండి సార్, మీ రికార్డ్సే చూస్తున్నా. ఒకరోజు ఆఫీస్ మానేటప్పుడు లీవ్ లెటర్ ఇవ్వాలని కూడా తెలియదా? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? మీరసలు చూడటానికి AGM లా ఉన్నారా? మీరే ఇలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారు? మీ డ్రస్ కోడ్ ఏది? ఎలా పడితే అలానే వస్తారా? అయినా అసలెన్నింటికి రావటం? ప్రతి రోజూ ఇంతేనా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా?” నా పరిస్థితి వర్ణనాతీతం. ఆ బాధేశ్వర్రావ్ గాడు నాకు పెద్ద హాండే ఇచ్చాడు. అడగకుండా లీవ్ లంటూ ఏవో వెధవమాటలు చెప్పాడు. ఇక్కడ పరిస్థితి చూస్తే అంతా తలకిందులుగా ఉంది. ఇంతలో నా పరిస్థితి మరీ విషమం అయ్యింది. పాత పెండింగ్ ఫైల్స్ అన్నీ బయటకు తీసి అన్నీ చెక్ చెయ్యటం, వాటి గురించి తిట్టడం, ఏడిస్తే బాగోదని ఏడవట్లేదంతే. అయినా ఆగట్లేదు. ఆగకుండా వచ్చే ఏడుపును ఎలా ఆపుకోవాలో అర్థమౌవట్లేదు. అప్పటివరకూ ఉన్న ‘మీరు’ కాస్త ‘నువ్వు’ గా మారింది. ఓ రెండు గంటల తరువాత, “ఈ ఫైల్స్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా నాకు నీ మొహం చూపించద్దు పో…” అన్న ఈ చివరి మాట తరువాత బయటకు వెళ్ళటానికి ఏదో విధంగా అవకాశం వచ్చింది. అడుగులో అడుగేసుకుంటూ బాధను మింగుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగా.

బయటకు వచ్చా. అందరూ నా వంకే చూస్తున్నారు. “ఒసేయ్ జ్యోతిలక్ష్మి! నా పాలిటి శని. మళ్ళీ ఇక్కడ G.M రూపంలో తగలడ్డావా !! ” అని నల్దిక్కులూ దద్దరిల్లేలా అరిచా.

————-

బూదరాజు అశ్విన్

బూదరాజు అశ్విన్

బూదరాజు అశ్విన్ ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ బ్లాగు ద్వారా బ్లాగు ప్రపంచానికి సుపరిచితులు. పుట్టిందీ, పెరిగిందీ బెజవాడలో. సినిమాలన్నా, సిరివెన్నెల పాటన్నా, కామెడీ అన్నా చాలా ఇష్టమని చెప్పే అశ్విన్ సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్నారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

46 Responses to జగదీష్-జ్యోతిలక్ష్మి

  1. చాలా బాగారాసారు.కధ చివరిలో మీరు పడ్డ కష్టం కనిపిస్తుంది.మరిన్ని కధలు మీ నుండి ఆశిస్తున్నాను.

  2. బావుందండి!

  3. krantigayam says:

    :))

  4. కథ ఏక బిగిన చదివించింది. జ్యోతిలక్ష్మే కాబోయే బాసవుతుందని ఊహించగలిగా, కథ మధ్యలో. కథ వేగం, చెప్పిన తీరు బాగుంది.

  5. జ్యోతిలక్ష్మే రాబోయే బాసని ముందే తెల్సింది గానీ, కథ మాత్రం మంచి బిగితో సాగింది. అశ్విన్ కి మరో సారి అభినందనలు!

  6. చాలా బాగా రాసారు 🙂

  7. meenakshi says:

    chaalaa baa raasaaru aswin garu.

  8. meenakshi says:

    aswin gaaru..miku nijangane jyo…lanti
    G.M raavalani korukuntunna..:)))

  9. ఎస్పీ జగదీష్ says:

    మీ కధనం బాగుందండి. పాపం జగదీష్… ఇంకెన్ని కష్టాలు పడాలో….

  10. sravanthi says:

    anya its good,expected end,kaani nuvvu raasave oka magaadu aadadaanini ………………………….aa maata malli magaade antaadu….,dailouge chala baaga nachndi.expecting more writings from u my brother

  11. ట్విస్ట్ తెలిసినా, కథనంతో భలే నరుక్కొచ్చారు. అభినందనలు.

  12. Purnima says:

    Well Executed. Keep writing!

  13. manasa says:

    aswin u proved urself once again.iam proud to be a friend of a very good writer.congrags aswin

  14. జాన్ హైడ్ కనుమూరి says:

    బాగుంది
    అభినందనలు.

    కొన్ని చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం వుంది.

  15. sujata says:

    ha ha . baavundandee !!!!!

  16. satyanarayana says:

    aswin….story is too good…..thanks for the funniest movements…..wish to ready many in near future…vl see ur blog as well….sorry that i am replying in english…so what happend to JO….did u meet her….give some good ending….

  17. satyanarayana says:

    ohh great story….posted the comment before going to dinner…..read the whole story…so nice…good work

  18. mooli gadu says:

    i expect this from u a more years before.ur attemptis very good. my friend Mr.M.Venkateswaran sayying that to continue in the same way.”story is very good” .ok we will meet in ur next attempt.

  19. basha says:

    mee katha lo twist kanna , kathanam bagundhi…..

  20. నా మొదటి కధను చదివి ఓపికగా కామెంట్ రాసినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరన్నట్టు కధ పాతదే మన బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలలోని అతి సాధారణమైన మామూలు విషయమే కానీ నేను సరదాగా కొంచం హాస్యం గా ప్రయత్నించాను. అంతే.

    పొద్దు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  21. sriram velamuri says:

    very good aswin,keep it up

  22. జాన్ హైడ్ కనుమూరి says:

    “ఏరా, జ్యోతిలక్ష్మి వస్తుందని చెప్పలేదే? తను ఫోన్ చేసింది. ఓ ఇరవై నిమిషాలలో ఫైట్ దిగుతుందట…”, అని అమ్మ చెప్పగానే ఒక్కసారిగా మెళుకువ వచ్చింది. అయిదు నిమిషాలలో రెడీ అయ్యి పది నిమిషాలలో ఎయిర్ పోర్ట్ చేరుకున్నా.”

    ప్రస్తుతం ఎయిర్ పోర్టు షంషాబాదులో వుంది.ఎక్కడనుంచైనా పదినిముషాలలో చేరుకోవటం ….. సులువేనా???
    నాకు తెలిసి విమానంలో సెల్ అనుమతివుండదు, కొన్ని కాసులలో వున్నా సిగ్నల్స్ అందవు …. ఇరవైనిముషాల ముందు ఫోనుచేయడం రిలైబులేనా???
    another next time……

  23. జాన్ హైడ్ కనుమూరి says:

    కూర్చోగానే “జగ్గూ, నాకీరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్‌లో రిపోర్టింగ్ ఉంది, నా ఫ్రెండ్ రమ్య వస్తానంది, ఎందుకో దిగీ దిగగానే నిన్ను చూడాలనిపించింది. మీ ఇంటికి నేను ఎల్లుండి ఆదివారం వస్తా, నన్నీ విషయంలో ఇబ్బంది పెట్టకు” అంది. నేను కూడా తనని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక “సరే” ఆన్నాను. ఇంతలో తన స్నేహితురాలు రమ్య వచ్చింది. తను నా మొబైల్ నంబర్ తీసుకుంది. ఓ అరగంట సేపు మాట్లాడిన తర్వాత, నేనే దగ్గరుండి ఆటో ఎక్కించాను
    …..ప్రస్తుతం షంషాబాదులో ఆటోలు అనుమతిలేవు.
    వేరే చాలా సౌకర్యాలు వున్నాయి
    గమనించాలి

  24. జాన్ హైడ్ కనుమూరి గారు,
    వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. మొహమాటపడకుండా చెప్పాలంటే నాకు ఏయిర్ పోర్టుకు వెల్లిన అనుభవం లేదు. అయినా చంద్ర మండలం మీద కధను రాసినవాడు చంద్రమండలం వెళ్ళక్కరలేదనుకోండీ. వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీరు చాలా పెద్దవారు, ఏన్నో అవార్డులు అందుకున్నవారు మీరు నా కధలో పొరపాటులు వెతికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకనుండి ఇలాంటి తప్పులు దొర్ల కుండా జాగ్రత్తపడతాను.

  25. జాన్ హైడ్ కనుమూరి says:

    కథలో తప్పులు వెతకాలని నా వుద్దేశం కాదు.
    మంచి కథనం వున్న కథలో చిన్న సమన్వయలోపాలు కథ బిగిని తగ్గిస్తాయని నా ఉద్దేశం. నేను మొదటిసారి చదివినప్పుడే అనిపించాయి కాని వెంటనే రాస్తే పాటకుల దృష్టి పడుతుందని రాయలేదు.
    ముందు ముందు మంచి కథలు రాయండి.

  26. Lalitha says:

    Very Nice Story.

  27. nataraj says:

    purthiga chadavaledu ra

  28. ramya says:

    🙂 🙂 బాగా రాసారండి,ఇలాగే మరిన్ని కథలు రాయండి.

  29. ప్రదీప్ says:

    చాలా బాగా రాసారు. ending ముందుగానే ఊహించినా, కథనం బావుంది. 🙂

  30. phani says:

    చాలా బాగా రాశారు…. మీరు జ్యోతిలక్ష్మి ని పోల్చే విధానం చాలా బాగా వచింది. జగదీష్-జ్యోతిలక్ష్మి పార్ట్ 2 ఎప్పుడు రాస్తున్నారు ??

  31. మొదటి ప్రయత్నం బాగుంది

  32. smarty says:

    kada chala chala bagaunidi bayya . i am sorry ne stories late ga chadivinanduku. sravanthi annatu we expect more and more from and we also know you can and you will do it… All the best..
    From;
    SMARTY

  33. lakshmi says:

    chaala bagundi.thank u. Wish u happy new year.

  34. Story is very nice excellent keep is up continue

  35. కథ చాలా బాగుంది ఇటువంటి కథలను మరెన్నో రాస్తారని ఆశిస్తున్నాను

  36. phani says:

    Aswin ne kadalu keka…..please keep on writing these type of good humour stories…

  37. Sreeniivasulu says:

    Very nice story, as long as i was reading i feel as it is happening infrount of me, thank you. Sreenivasulu

  38. Sarath says:

    Mee story chaala baavundi.Ilaage kathalu raasththoo andarni alarinchandi.Mee kathalanni kalipi oka pusthakamgaa achavvaalani aashisthoo-Baba

  39. saratchandra says:

    Aswin gaaru.. adhara gottesaaru. mee mail id ekkadana isthe chala happy gaa feel avuthaamu..

  40. Ashok says:

    ఆ వెధవకి జ్యో తో పెళ్లి చేసి పారేసి రెండో కదా రాయండి. బాగా రాసారు. మొదటి కదా కాబట్టి మీకీ అభినందనలు.

  41. Ashok says:

    ఆ వెధవకి జ్యో తో పెళ్లి చేసి పారేసి రెండో కధా రాయండి. బాగా రాసారు. మొదటి కధ కాబట్టి మీకీ అభినందనలు.:-)

  42. Sowmya V.B. says:

    నాకు కథ అంత నచ్చలేదు. కానీ, మీరు చెప్పిన విధానం, హాస్యం నచ్చింది. కీప్ రైటింగ్!
    తొలి ప్రయత్నం తరువాత మళ్ళీ ఏదీ రాసినట్లు లేరేం! 🙁

  43. sonu says:

    chala baga undi

  44. కథ బాగుందనలేను కానీ మీరు చాలా బాగా రాయగలరన్నవిషయం లోన నాకు సందేహం లేదు.రాస్తూ ఉండండి. రాటుదేల్తారు.ముందు కొన్నాళ్లు ఇటువంటి సరదా కథలే ప్రయత్నించండి.శుభం.

Comments are closed.