స్వాతికుమారిగారు ఈ సమీపదూరాలని మాకు పంపినప్పుడు – దీనిని ఏ శీర్షికలో ప్రచురించాలి అనే సమస్య వచ్చింది. కవిత శీర్షికలో వెయ్యాలంటే – ఇది కవితగాదు, వ్యాసంలో వెద్దామంటే ఇది వ్యాసమూ గాదు. అలాగని తిరస్కరించడానికీ మనసొప్పలేదు. అందుకని ఆవిడనే అడిగాం – ‘ఏ శీర్షికలో వెయ్యమన్నారు’ అని? దానికావిడ – “రసాత్మకమైన భావమేదైనా కవిత్వమే గదా? ఇది కవిత కాకపోవచ్చుగాని, నా దృష్టిలో కవిత్వమే” అన్నారు.
నిజమే – రాగ, తాళాలు లేనంతమాత్రాన కోయిల కూత పాటగాకపోతుందా?
— సంపాదకులు
సమీప దూరాలు |
-స్వాతికుమారి |
.
తెలి మంచులో తెల్లవారుఝామునే తడిసిపోయే పసి మల్లె మొగ్గ త్వరలో ధనుర్మాసానికి వీడ్కోలు చెప్పాలని తెలియక చలి లో తుళ్ళి పడుతుంటే…
అరె నీహారిక కళ్ళలోకే వచ్చిందేమిటి!
నూనెలో రంగులు కలిపి గచ్చు మీద పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే. రామాలయంలో తిరుప్పావై వినడానికి వెళ్ళిన వాళ్ళు చెరువు గట్టున స్నేహితుల్తో ఆటలాడుకున్న పిల్లలు కూడా తిరిగొస్తున్నారు. వేణ్ణీళ్ళ కాగు కింద తుక్కు పుల్లలు ఎగదోస్తూ చిరు చలికి ముడుచుకు కూచుని వీధి గుమ్మం వైపు తదేకంగా చూస్తూ ఆ ద్వారబంధాల పక్కన నీ చెప్పులుంటే ఈ సాయంత్రం ఎంత ఉల్లాసంగా ఉండేది అనుకుంటాను.
ఒక చుక్క తేనె కోసం ఈ నాలుగు పూలమొక్కల మధ్యే వేల మైళ్ళు తిరిగే తేనెటీగల్లాంటి జ్ఞాపకాలు. సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు అని నీ సమాధానం గుర్తొచ్చి సిగ్గుని కోపం లోకి అభినయించబోయి భంగపడి నవ్వుతాను. ఈ పరిమళపు పూతలన్ని ఏమంటున్నాయి? వసంతాలకేం.. వచ్చి పోతుంటాయి, మరో హేమంతానికైనా నువ్వు తోడురాకూడదూ అని కదా! ప్రేమంటే ఇంత వేదనని ఎవరు నమ్ముతారు?
ఈ నిశ్శబ్ధ ఏకాంతం, ఈ మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే! బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి. నీరెండలో నిశ్చలంగా మెరిసే కోనేటి నీరు కూడా మట్టి కుండలో చేరాక రూపు మార్చుకున్నట్టు..ఈ వియోగంలో ఎంత అందమైన దృశ్యం కూడా నాలో విషాదాన్నే నింపుతుందెందుకు. ఐనా సౌందర్యం విషాదం పరస్పరం లీనమయ్యి లేవని ఎవరు మాత్రం అనగలరు.
ఎడారిలో ఓ గడ్డి పరక సైతం కాస్త అనువు దొరగ్గానే మొలకెత్తుతుందట. ఆ మాత్రం భాగ్యం కూడా ఈ కన్నీటి చుక్కకి లేదు కదా. పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే.. వంతెన దాటుతున్నంత సేపూ వెంటపడి వచ్చే వెన్నెలని విసుక్కోక ఏం చెయ్యను ?
స్వాతి కుమారి గారి భావుకత అద్భుతం. “ఒక చుక్క తేనె కోసం ఈ నాలుగు పూలమొక్కల మధ్యే వేల మైళ్ళు తిరిగే తేనెటీగల్లాంటి జ్ఞాపకాలు”… “పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే..” వంటి ఎన్నో వ్యక్తీకరణలు మనసుని కదిలించాయి. హ్యాట్సాఫ్ టు హర్. ఇంత గొప్పగా రాసే వ్యక్తి యాంత్రిక జీవనశైలి మూలంగా రచనలకు దూరంగా ఉండడం బాధాకరం. ఆవిడ కలం నుండి ఇలాంటివి మరిన్ని జాలువారాలని ఆశిస్తూ..
– నల్లమోతు శ్రీధర్
మీ రాక చాలా ఆనందంగా వుంది.కవిత అద్భుతంగా వుంది .ఎడబాటు కొద్దిగా బాధని కలిగించేమాట వాస్తవమే అయినా ఈ కవిత చదివినవాళ్లకి మాత్రం చాలా మధురం గా అనిపిస్తుంది.
మొదలు పెట్టిన వాక్యంలో నాకు సందేహం వుంది.
ఇక్కడ రాయొచ్చా.
మెయిల్ చిరునామా ఇస్తారా?
my mail ID john000in@gmail.com
టోపీలు తీసేశాం!
మీరు ఇన్నాళ్ళు రాయకుండా ఉండటం అమానుషం.
ఐతే, ఇన్నాళ్ళ ఎదురుచూపుకి ఫలితం ఇటువంటి రచన వస్తుందంటే .. లేని ఓపిక తెచ్చుకుంటాం.
Simply superb!!!!
Very nice
ఈ రోజు ఇక్కడ ఈ కొద్ది పదాల్లో ఇమిడివున్న వొక గొప్ప అనుభూతిని చూసాను. నదిలా సరళంగా, చక్కగా, చిక్కగా తన ప్రవాహాన్ని గుండెలోతుల్లోకి ప్రసరింపచేయగలిగే కవితని చూసాను.
హేట్సాప్ టు యు స్వాతి కుమారి గారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
chaalaa baavundi swati garu… keep writing!
Beautiful!!!
ధనుర్మాసంలో
వసంతానికి హేమంతానికి మద్య
తేనెలాంటి జ్ఞాపకాలు మంచులో తడిసి
వణికించే చలితో గుండెనుకోస్తున్నంత
తీయని బాధగా వుంది.
తొలిమంచు సమయాన్నుంచి వెతచెంది, దిండు తడిసే సమయం వరకూ తిరికిన మీ అక్షరాలు మమ్మల్ని తేనెటిగలనుచేసి మైళ్ళదూరం తిప్పుతున్నాయి
సందేహం : మల్లెమొగ్గ ధనుర్మాసంలో వుండదేమో?
జాన్ గారూ, ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ వెరైటీలు అన్ని కాలాల్లోనూ పూస్తున్నై. పోనీ మల్లె పూయదు అని మీకు మరీ బలంగా అనిపిస్తే, దాని స్థానంలో సన్నజాజి అనుకోండి, ఏం పోయిందిప్పుడు? 🙂
Pingback: సమీప దూరాలు « కల్హార