పాట

-ఝాన్సీలక్ష్మి కొత్త

ఎక్కడో దూరాన
గంధర్వ గానంలా
శింజినీరవంలా
అందెలరవళిలా
ఓ పాట

ఉదయాలు దాటుకుని
హృదయాలు దోచుకొని
ఆది నాదంలా
అనంత కావ్యంలా
సాగుతూ ఈ పాట

పడవ సరంగుల తెరచాప
వాలులో
పల్లకీ బోయీల పదగమనం లో
రోలు రోకళ్ల దంపుళ్ల లో
కూలి పడుచుల గొంతుల లో
కొనసాగే ఈ పాట

దేవతార్చన వేళ భక్తి పాట
వయసు తొలి పొద్దులోవలపు
పాట
వయసు మళ్లిన వేళ తత్వాల
పాట
పసికందు నిదురించ జోల
పాట
లోకాల పాలింప లాలి పాట

మేఘ గర్జనల గమకాల తో
మెరుపు విరుపుల తురుపుల
తో
దిగంతాలలో దివ్య పరిమళం
చిలుకుతూ కొనసాగుతూనే
వుంటుంది

సుప్త చేతనల్ని
శ్రుతిమయం చేస్తూ
తప్త భావనల జలతరంగిణి లా
జీవన మర్మాల్ని
కదిలిస్తూ
జీవ సమాధుల్ని ఛేదిస్తూ
అవిశ్రాంతంగా సాగుతూనే
వుంటుంది

పాటలో పదమునై
పదములో గళమునై
గళములో గానమై
పాటలో లీనమై
పరీవ్యాప్త మైనవేళ

వినగలను
వినాకర్ణేంద్రియరహితనై
దర్శించగలను
నయనరాహిత్యనై
ఇహ పరాలన్ని మరచి
పాటలో పరిమళించిన
మంత్రద్రష్టనో
ఈ సువిశాల ఇలాతలాన
ఎల్లలే లేని అవిభక్తనో
జనన మరణ చక్రభ్రమణంలో
విడివడిన విముక్తనో

—-

కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”

About కొత్త ఝాన్సీ

కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

6 Responses to పాట

  1. radhika says:

    చాలా చాలా బాగుంది.ముఖ్యం గా 2,3,6,7 ఖండికలు చాలా బాగున్నాయి. అన్నట్టు కవయిత్రి గారి పరిచయం ఇవ్వలేదేమిటి?

  2. రాధికా ..ఖండిక అంటే ఒక పూర్తి కృతి, కాకపోతే చిన్న కృతి. ఇక్కడ ఈ పద్యం (లేదా గేయం) మొత్తం ఒక ఖండిక. ఆంగ్ల పద్యాల్లో stanza అని వ్యవహరించే పద్య భాగాల్ని మనం “చరణం” అని పిలుచుకోవచ్చు.

  3. చాలా బాగుంది పాట.

  4. radhika says:

    కొత్త పాళీ గారు thanks.

  5. teresa says:

    ఝాన్సీ లక్ష్మి గారూ,
    మీ పాట చా..లా భావుంది.
    చదూతుంటే సాఫీగాసాగిపోతున్న ప్రవాహానికి నాకొక్కచోట బ్రేకు పడింది-
    “వినగలను వినా కర్ణేంద్రియ రహితనై” అన్న వాక్యంలో double negative వినిపించింది నాకు. అది మినహా ఈ పాట మనోరంజకం.

  6. ఝాన్సీ గారూ .. శింజినీ రవంలా అనే వాడుక చాలా బావుంది.
    పద్యంలో వేర్వేరు చోట్ల కళ్ళకు కట్టిన పద చిత్రాలూ, మొత్తంగా పొందికగా ఒదిగి ఉన్న లయ ఒక గమ్మత్తైన అనుభవాన్నిస్తాయి పాఠకులకి. చివరిలో ..అదొక గమ్యంలాగా ఆవిష్కరించిన తాత్త్విక చింతన ఇహతలాన్నించి వేరే ఎత్తుకి తీసుకు వెళుతుంది.
    మీ రచనలు మరిన్ని చదవాలని ఉంది.

Comments are closed.