[రవి వైజాసత్య]
గత సంచికలో తెలుగు వికీపీడియాలోని అంతర్గత ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో వికీపీడియా కాకుండా వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులను గురించి తెలుసుకుందాం. తెలుగులో వికీపీడియా కాకుండా ఇంకా నాలుగు వికీ ఆధారిత ప్రాజెక్టులున్నాయి. ఇవి వికీపీడియా అంతగా ప్రాచుర్యం పొందకపోయినా తెలుగులో వికీపీడియా కంటే ముందే పరిగెడుతున్నవి. తెలుగు వికీపీడియా అన్ని భాషల వికీపీడియాల్లో కెల్లా 35 స్థానములో ఉంటే, ఈ అనుబంధ ప్రాజెక్టులన్నీ సంబంధిత ప్రాజెక్టులలో భారతీయ భాషలలో కెల్లా మొదటి స్థానములో ఉండటమే కాకుండా, అన్ని భాషలతో పోల్చి చూసినప్పుడు వికీపీడియా కంటే మెరుగైన స్థానములో ఉన్నవి.
తెలుగు విక్షనరీ ఒక బహుభాషా నిఘంటువు. సూత్రప్రాయంగా తెలుగు పదాలతో సహా ప్రపంచములోని అన్ని భాషా పదాలకు తెలుగులో వాటి అర్థం, వివరణ, వ్యుత్పత్తి, వాడుక తదితర పద విశేషాలన్నీ సమకూర్చబడుతాయి. ఇది సాధించగలమని నమ్మకం కుదరని వాళ్ళు కొరియన్ విక్షనరీలోని ఈ పేజీ చూడండి.
ప్రస్తుతం తెలుగు విక్షనరీలో కొన్ని పరిమిత భాషా పదాల వరకే ఎక్కువగా కృషి జరుగుతున్నా, మున్ముందు వాటిని ఇతర భాషా పదాలకు కూడా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే తెలుగు విక్షనరీలో 32 వేలకు పైగా పదాలు, వాటి అర్థాలు, వ్యాకరణ వివరాలు, ప్రయోగించే విధానం వగైరా వివరాలున్నాయి. బ్రౌణ్య ఆంగ్ల – తెలుగు నిఘంటువులోని పదాలన్నీ విక్షనరీలో చేర్చబడినవి. అంటే ఇప్పుడు మీరు బ్రౌణ్యాన్ని సులభంగా విక్షనరీలో శోధించవచ్చు. ‘ఇందులో గొప్పేముంది, బ్రౌణ్యం నాకు పలుచోట్ల లభిస్తుంది’ అని అనుకుంటున్నారా? పబ్లిక్ డొమైన్లో కల ఇతర నిఘంటువులన్నీ త్వరలోనే విక్షనరీలో చేర్చే ప్రయత్నంలో ఉన్నాము. అప్పుడు ఒకే పదానికి బ్రౌణ్యం, శంకరనారాయణ నిఘంటువు, వేమూరి వారి నిఘంటువు తదితర నిఘంటువులలో ఏకకాలములో చూసే సౌలభ్యము విక్షనరీతో చేకూరుతుంది.
అంతేకాక, ఒక పదానికి చెందిన పేజీలో అర్థం, భాషాభాగం, వ్యుత్పత్తి, సంబంధిత పదాలు మాత్రమే కాక, వీలైనవాటన్నిటికీ బొమ్మలు కూడా ఉంటాయి. వివిధ భాషలలో ఆ పదానికి అనువాదాలు ఉంటాయి. అలాగే ఒక తెలుగు పదానికి వివిధ ప్రాంతాలలో ఉండే మాండలిక పదాలను కూడా సమకూర్చుతుంది. సరళంగా ఒక్కమాటలో చెప్పాలంటే పదకోశానికి సంబంధించి వన్ స్టాప్ షాప్ కావాలన్నదే విక్షనరీ యొక్క లక్ష్యం. వివిధ నిఘంటువులు, అనువాద పదకోశాలు, వ్యుత్పత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు ఇలాంటివన్నిటినీ ఏకం చేయటం ఒక బృహత్కార్యమే. లక్ష్యం చాలా పెద్దది. కానీ, తెలుగువారందరమూ చేయికలిపితే సాధించగలమన్న నమ్మకం ఉంది. తెలుగు విక్షనరీ అన్ని భాషల విక్షనరీల్లోనూ 18వ స్థానములో ఉంది. ఈ సందర్భంగా తెలుగు విక్షనరీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సుజాత గారికి, ప్రదీపు గారికి నెనర్లు.
తెలుగు వికీసోర్స్ ఒక ఉచిత గ్రంథాలయము వంటిది. ఇదివరలో ప్రచురితమైన, కాపీహక్కుల గొడవ లేని గ్రంథాలను యథాతథంగా చేర్చే చోటు. యథాతథం అనే మాటకి ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఉంది. యాథాతథంగా ఉన్న గ్రంథానికి సభ్యులు తాత్పర్యాలు వ్రాసి తాత్పర్య సహిత సంచికను కూడా వికీసోర్సులో చేర్చే అవకాశముంది.
ఇలాంటి భావనపైనే ఆధారితమైన మిలియన్ బుక్స్ ప్రాజెక్టు (archive.org), scribd.comకు వికీసోర్స్ ఏ విధంగా భిన్నమైనది? ఈ రెండు ప్రాజెక్టులలో అనేక తెలుగు పుస్తకాలు ఉన్నా, తెలుగులో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి సాంకేతికత ఇంకా అంతగా అభివృద్ధి చెందక పోవటం మూలాన ఆ పుస్తకాలు ఫీడిఎఫ్, డీజేవీయూ మొదలైన ఫార్మాట్లలో ఉంటాయి. మనకు కావలసిన విషయము కోసం శోధించే అవకాశం లేదు.. పుస్తకమంతా తిరగేయవలసినదే. అలాగే ఒక పుస్తకములోని కొంత భాగాన్ని తీసుకోవాలనుకుంటే ఎత్తి రాసుకోవలసిందే (ముఖ్యంగా స్కాన్ చేసి పెట్టిన పుస్తకాలలో).
6,000 కు పైగా పుటలతో తెలుగు వికీసోర్స్, అన్ని భాషల వికీసొర్స్‌లలో కెల్లా 11 వ స్థానములో ఉన్నది. వికీసోర్స్ యొక్క పరిమాణము తెలుగు వికీపీడియాను అధిగమించి 40 మెగాబైట్లను చేరుకున్నది. వికీసోర్స్ ఈ స్థాయికి చేరటానికి మూలకారణమైన అన్వేషి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.
మరి, ప్రస్తుతానికీ ఆ వికీసోర్స్లో ప్రస్తుతం ఏయే పుస్తకాలున్నాయి?
అన్నమయ్య పాటలు, వేమన పద్యాలు, ఆంధ్ర మహాభారతం, కుమార శతకం, దాశరథీ శతకం వగైరా శతకాలు, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, వివిధ అష్టకాలు ఇంకా బోలెడన్ని .. గూగుల్లో తెలుగులో వెతికే అలవాటున్నవాళ్లు ఈ మధ్య వికీసోర్సు చాలా ఫలితాల్లో కనిపించడం గమనించే ఉంటారు.
తెలుగు వికీవ్యాఖ్య, హరివిల్లు బ్లాగరి శ్రీనివాసరాజు చొరవతీసుకుని ముందుకు రావటంతో ఇటీవలే పుంజుకుంటున్న ఒక కొత్త ప్రాజెక్టు. ఇది వివిధ విషయాలపై ప్రముఖ వ్యక్తులు చేసిన వ్యాఖ్యల సమాహారం. ఒక Quote book లాంటిదన్నమాట. ఇలాంటి ఆంగ్ల వ్యాఖ్యల సమాహారాలు అంతర్జాలంలో వివిధ సైట్లలో చూసే ఉంటాము. కానీ నాకు తెలిసినంతమటుకు, తెలుగులో వ్యాఖ్యల సమాహారం ఎక్కడా లేదు. కొన్ని వ్యాఖ్యల సమాహారాలు పుస్తక రూపంలో ఉన్నా, అలాంటి సమాచారంతో ఉన్న సమస్య ఏమిటో మీకు తెలిసిందే కదా . కావాలనుకున్నప్పుడు అందుబాటులో ఉండదు. కావలసిన వ్యాఖ్యను శోధించడం అంత సులువు కాదు. వికీవ్యాఖ్య రచయితలకు, కవులకు, బ్లాగరులకు నిఘంటువులాగే మంచి ఉపయుక్తమైన సాధనము. ఉదాహరణకి ఏదో టపానో, వ్యాసమో రాస్తూ, మహాత్మా గాంధీ, జిన్నాపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించాల్సి వచ్చినప్పుడు వికీవ్యాఖ్యలో మహాత్మా గాంధీ లేదా జిన్నా అని శోధిస్తే చాలు.
వికీవ్యాఖ్యలోని వ్యాఖ్యలు ఆయా వ్యాఖ్యాతలు లేదా రచయితల వారీగాను, రచనల వారీగాను, విషయము వారీగాను కూర్చి ఉంటాయి. ఉదాహరణకు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన వ్యాఖ్యలన్నీ కందుకూరి వీరేశలింగం పేజీలోను, కన్యాశుల్కంలోని వ్యాఖ్యలన్నీ కన్యాశుల్కం పేజీలోను, గిరీశం వ్యాఖ్యలన్నీ గిరీశం పేజీలోను, దున్నపోతుకు సంబంధించిన వ్యాఖ్యలు, సామెతలన్నీ దున్నపోతు పేజీలోను ఉంటాయి.
ప్రస్తుతానికి తెలుగు వికీవ్యాఖ్యలో 80 వ్యాఖ్యల పేజీలు ఉన్నాయి. తెలుగు వారికి అంతర్జాలములో ఈ అద్భుతమైన సాధనాన్ని తయారుచేసేందుకైనా, మనకు ఒక మంచి వ్యాఖ్య తారసపడినప్పుడల్లా ఇక్కడ చేర్చి సహాయపడదాం పదండి.
ప్రస్తుతం సుప్తావస్థలో ఉన్న ప్రాజెక్టు ఇది. కారణం: ఇది ఎందుకో ఇప్పటిదాకా సరిగా అర్థం చేసుకోలేకపోవటం. నడిపించే సారథి లేకపోవటం. వికీసోర్స్ ఉందిగా? మరి వికీబుక్స్ ఎందుకు? అని చాలా మందికి సందేహం కలిగే ఉంటుంది. వికీసోర్స్లో కేవలం ప్రచురితమైన పుస్తకాలను మాత్రమే చేర్చుతారు. వికీబుక్స్లో సభ్యులే పుస్తకాలను, వికీఫార్మాట్లో ఈ-పుస్తకాలను తయారుచేయవచ్చు. ఉదాహరణకు జ్యోతి గారు వంటల పుస్తకమొకటి తయారు చేయాలనుకుంటే వికీబుక్స్ సరైన స్థలం, అలాగే మన తంత్రసామాగ్రి (సాఫ్ట్‌వేర్) నిపుణులు తెలుగులో లినక్సును ఉపయోగించటం ఎలా? అని సొంతంగా ఒక ఈ-పుస్తకాన్ని ప్రకటించాలన్నా సరైన స్థలం వికీబుక్సే.
ఇలాంటివి రాసుకోవటానికి నా బ్లాగుంది కదా అని మీరు అనుకుంటే; వివిధ డిజైను కారణాల వల్ల పుస్తక ప్రచురణకి బ్లాగు అనువైన స్థలం కాదు. కొంత శ్రమపడి అనువుగా మార్చుకోవచ్చు కానీ, అనేకమంది సమన్వయముతో ఒక పుస్తకాన్ని రాస్తున్నపుడు, బ్లాగు సరైన రంగస్థలము కాదు. లేదు, నేను నా సొంత డిజైను, సొంత వెబ్‌సైటు నిర్వహించి ఒక ఈ-పుస్తకాన్ని ప్రకటిస్తానంటే అది మీ ఇష్టం. (మరి వికీబుక్స్‌లో ఉచితంగా స్థలము, అనంతమైన బ్యాండు విడ్తు)
ఇవి కాక తెలుగులో లేకపోయినా అంతర్జాలవాసులందరికీ ఒక మంచి వనరు, వికీమీడియా కామన్స్. ఇందులో కాపీహక్కులు లేని వివిధ ఫోటోలు, ఆడియో క్లిప్పింగులు ఉచితంగా లభ్యమౌతాయి. ఏదైనా ఒక విషయంపై మీ బ్లాగులోనో, వెబ్‌సైట్లోనో ఉపయోగించడానికి ఫోటోలు, రేఖా చిత్రాల కోసం వెతుకుతుంటే తప్పకుండా చూడాల్సిన సైటు ఇది.
జిహ్వకో రుచి అన్నట్లు మీకు వికీపీడియాలో వ్రాయటం అంతగా రుచించకపోయినా మీ అభిరుచికి తగ్గట్టు పై ప్రాజెక్టులలో ఒకదాన్ని ఎంచుకొని తెలుగుకు ఉడతాభక్తి సేవ చేయగలరని ఆశిస్తున్నాం.
–రవి వైజాసత్య(http://saintpal.freehostia.com/)
రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.
బాగా రాసారు. ముఖ్యంగా వికీబుక్సు గురించి చాలా బాగా వివరించారు. అసలు వికీపీడియా కంటే వికీబుక్సే ఎక్కువ ప్రాచుర్యం పొందుతుందని నాకనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ఆంగ్ల వికీపుస్తకాలలో నాకు నచ్చిన ఒకానొక పుస్తకాల అలమరను చూడండి.
Thankyou very much. Nice but very short.
Thankyou for the information of Telugu Wikisource in the 11th Place.
I hope ANVESHI will Come back again as early as possible to keep it in Top 10.
తెవీకీబుక్స్లో ఎలాంటి విషయాలు వ్రాయాలి?పాఠ్య పుస్తకాలు అని ఉంది పాఠ్యాంశాలు మాత్ర్మే వ్రాలా సభ్యులు దానిలో ఎవరూ చురుకుగా పాల్గొనటం లేదు కాబట్టి చర్చించడానికి అవకాశం తక్కువ .