ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut, Erich Rohmer లాంటి విమర్శకులు తదుపరి కాలంలో, New wave అనే సినీ ఉద్యమం ద్వారా తీసిన సినిమాలతో ఫ్రాన్సు సినిమా పరిశ్రమనే కాదు, ప్రపంచ సినిమాలన్నింటినీ ఒక కొత్త బాటన నడిపించాడు.

చాలా మంది అంటుంటారు – సినిమా తీయాలనే ఆసక్తి కలిగిన వారెవ్వరైనా మొదటగా చదవాల్సింది Aristotle రాసిన Poetics అనే గ్రంధం మరియు Andre Bazin వ్యాస మాలిక అయిన What is Cinema? అని. నా దృష్టిలో అది అక్షరాలా నిజంనిపిస్తుంది. Andre Bazin వ్యాసాలు అసాధారణ పరిశీలన మరియు అత్యుత్తమ సమాచారాల కలయికగా వుంటాయి.

Andre Bazin ఎవరో తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతుక్కుంటే ఎంతో సమాచారం దొరుకుతుంది. కానీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు Andre Bazin గురించి ఏమన్నారో తెలియచేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు Francois Truffaut మరొకరు Jean Renoir. ఫ్రెంచ్ సినిమాల గురించి ఏ మాత్రం పరిచయమున్నా, మీకు వీరిద్దరి పేర్లు ఇప్పటికే తెలిసివుంటాయి. Francois Truffaut తన మొదటి సినిమా అయినా 400 Blows తో ఫ్రాన్సులో New Wave అనే సినీ వుద్యమానికి శ్రీకారం చుట్టాడు. Jean Renoir తన సినిమాలైన The Grand Illusion, The Rules of The Game లాంటి సినిమాలతో చిరస్మరణీయుడు.. నాదృష్టిలో Citizen Kane తో పోల్చదగిన సినిమా ఏదైనా వుందంటే, అది The Rules of the Game మాత్రమే!

Andre Bazin వ్యాసాలతో కూడిన రెండు సంపుటాలు “What is Cinema” పేరుతో లభ్యమవుతున్నాయి. ఆ సంపుటాలలో, ఒక దానికి ముందు మాట రాసిన వాడు Renoir మరో దానికి Truffaut. Bazin ఎవరో, సినిమాకు ఆయన చేసిన సేవ ఎంటో తెలుసుకోవాలంటే Renoir మరియు Truffaut రాసిన పరిచయం చదివితే అర్థమవుతుంది. అందుకే వారు రాసిన పరిచయ వాక్యాలను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేసాను.

Andre Bazin గురించి Frncoise Truffaut రాసిన ముందుమాట.

సినిమా గురించి Andre Bazin రాసినంత గొప్పగా యూరోపులో మరెవ్వరూ రాయలేదు. 1948 లో నాకు మొదటి ఉద్యోగం ఇప్పించిన నాటి నుండి, అతనితో పని చేస్తూ, నేనాయనకు దత్తతిచ్చిన కొడుకయి పోయాను. ఆ తర్వాత, నా జీవితంలో జరిగిన ప్రతి మనోహరమైన విషయం ఆయన పుణ్యమే.

ఆయన నాకు సినిమాల గురించి రాయడం నేర్పించారు, తప్పులు రాస్తే సరిదిద్దారు మరియి నా మొట్టమొదటి వ్యాసాలనూ ప్రచురించారు. అంతే కాదు నేనొక సినిమా దర్శకుడు కావడానికి సహాయపడ్డారు. నా మొదటి సినిమా షూటింగ్ చేయడం మొదలుపెట్టిన రోజే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. ఆఖరి ఘడియల్లో ఆయన స్నేహితుడు Piere Leger పిలుపునందుకుని, Nogent లో వున్న ఆయనింటికి చేరుకున్నాను. నా వైపైతే చూసారు గానీ కానీ నోట మాట లేదు. భయంకరమైన భాధననుభవిస్తున్నారని మాత్రం తెలిసింది. అంతకు ముందు రోజు సాయంత్రమే టీవీలో ”Le Crime de Monsieur Lange” సినిమా చూస్తూ దర్శకుడు Jean Renoir గురించి రాస్తున్న పుస్తకం కోసం నోట్సు రాసుకున్నారు.

ఎవరైనా నన్ను Andre Bazin గురించి చెప్పండి అంటే మొదటగా నాకు గుర్తొచ్చేది, నేను అమెరికన్ పత్రికలో చూసిన వాక్యమొకటి: “The most unforgettable character I’ve met.”

Giraudoux నాటకాల్లో పాత్రల్లాగే Andre Bazin కూడా పాపం పుట్టకముందు నాటి జీవి అనిపిస్తుంది. ఈయన మంచితనం, నిజాయితీల గురించి మాకందరికీ తెలిసినప్పటికీ ఆయన మంచితనం నిరంతరం సాగే ఒక అధ్భుతం అని తోచేది. అలాగే ఆయన చేసే మంచిపనులకూ అంతులేదు. హైందవునికి గంగలో స్నానమాడడమెంత పుణ్యకార్యమో ఆయనతో మాట్లాడడమూ అంతే. ఆయన మంచితనం రుచి చూడడానికే ఒక్కోసారి నేను తెలిసిన వాళ్ళతో కావాలని గొడవకి దిగేవాడిని. అలాంటి సమయాల్లో ఆయన వారి పక్షాన చేరి వారికి అండగా నిలిచేవాడు.

లంకంత హృదయం గలిగినవాడయినప్పటికీ తర్కమే తనైన వాడాయన. Bazin స్వఛ్ఛమైన జ్ఞాని, ఉత్కృష్టమైన తార్కికుడు. హేతుబధ్ధంగా వాదించడమనే శక్తిని నమ్మిన వాడీయన. మహామహులెందరినో తన వాదంతో చిత్తుచేయడం నా కళ్ళారా చూశాను. నత్తి కారణంగా తడబడుతూ మాట్లాడినా, శ్రోతలను ఆకట్టుకోవడంలో మాత్రం ఆ లోపాలేవీ ఆయనకు అడ్డు రాలేదు. యోగ్యతలేని వాదనతో తన వద్దకొచ్చిన వాళ్ళని, ముందుగా ఆ వితర్కనీయ విషయాన్ని ఆ వచ్చిన వారు చెప్పిన దానికంటే బాగా వికసింపజేసి, ఆ తర్వాత కఠినమైన తర్కం ద్వారా ఆ వాదాన్ని కూలదోసేవాడు. Bazin ఎంతో ప్రేమగా ఆరాధించిన Sartre వ్యాసాల్లో మాత్రమే ఇటువంటి బుధ్ధి జ్ఞానము మరియు మనో సంబంధమైన యోగ్యతా కనిపిస్తాయి.

తీవ్ర అస్వస్థతతో కూడిన ఆయన ఆరోగ్యానికి సమాంతరంగానే ఆయన మనోబలమూ, గుండే ధైర్యమూ వుండేవి. వూరందరికీ తెలిసేలా అప్పులూ చేసేవాడు, మరో కంటికి తెలియకుండా దానాలూ చేసేవాడీయన. ఈయన సమక్షంలో అన్ని విషయాలూ చక్కగానూ, సరళంగానూ, స్వచ్ఛంగానూ తోచేవి. నాలుగు సీట్లున్న కారులో ఒక్కడే ప్రయాణం చేయడం ఇష్టంలేక Nogent బస్సు స్టాపులో మరో ముగ్గురిని తన కారులో ఎక్కించుకుని వారి గమ్య స్థానం చేరడంలో సహాయపడేవాడు. ఎప్పుడైనా తన కుటుంబంతో పాటు కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సివస్తే తనకి తెలిసిన పేద కుటుంబీకులెవరికైనా తన ఇంట్లో వుండే ఏర్పాట్లు చేసి వెళ్ళేవాడు. అంతేకాదు తన కారు కూడా అవసరమున్న వారెవరికైనా ఇచ్చే వెళ్ళేవాడు.

ఈయన సినిమాని ప్రేమించాడు. అంతకంటే కూడా జీవితాన్నీ ప్రేమించాడు. ఆ ప్రేమతోనే మనుషులకు, జంతువులకూ, శాస్త్రానికి, కళలకూ తన జీవితంలో స్థానం కల్పించాడు. చనిపోయే కొద్దిరోజులముందు పెద్దగా ప్రచారం లేని Romanesque చర్చ్ ల గురించి ఒక లఘు చిత్రం తీయాలనే ఆలోచనలో కూడా వున్నాడు. అతనింట్లో అన్ని రకాల పశు పక్ష్యాదులనూ పెంచుకున్నాడు. ఊసరవెల్లి, చిలుక, ఉడుత, తాబేలు, మొసలి ఇలా ఎన్నో జంతువులు ఆయనింట్లో కాపురం చేసేవి; వీటిలో కొన్నింటి పేర్లను ఎలా ఉచ్చరించాలో కూడా నాకు తెలియదు. చనిపోవడానికి కొద్దిరోజులముందు, బ్రెజిల్ కి చెందిన ఒక రకమైన తొండకు జబ్బు చేయడంతో బలవంతంగా తిండి తినిపిస్తూ “ఈ జీవి చనిపోవడం కంటే ముందే నేనే పోతానని భయమేస్తోంది” అన్నారు.

ఈ లోకం మంచిదో చెడ్డదో నేను చెప్పలేను కానీ, Andre Bazin లాంటి వారి వల్లనే ఈ లోకం మేలైనదిగా వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మంచితనమే మేలైనదని నమ్ముతూ, ఆ మంచితనాన్ని జీవితంలో అమలుపరుస్తూ జీవించడం వల్లనే ఆయనతో పరిచయం కలిగిన వారందరికీ ప్రయోజనం కలిగింది. అందుకే Andre Bazin తో గొడవలు పెట్టుకున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆయనతో సంభాషించిన వారెవరైనా, కేవలం ఒక్కసారి మాత్రమైనప్పటికీ, ఆయన్ని తమ ప్రియతమ మిత్రుడిగా భావిస్తారు. ఆయన లోని నిష్కాపట్యముతో ఎలాంటి వారైనా తమ లోని మంచిదనాన్ని ఒక్కసారైనా బయటకు తేవల్సిందే.

“ఇప్పటికీ మన మధ్యనే వున్నారు” అనో, లేదా “ఇంకా జీవిస్తూనే వున్నారు”అనో మాయ మాటలతో, బూటకపు పదజాలంతో వర్ణించడం ఆయనకి తప్పకుండా నచ్చుండేది కాదు. ఒక దారుణమైన, అత్యంత క్రూరమైన, శోకభరితమైన నిజమేంటంటే ఆయన మరణించారు; ఇక లేరు. మనం చేయగలిగిందేదైనా వుందంటే అది విలపించడం మరియు ఆయన వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదవడం. చనిపోవడానికి కొన్ని రోజుల క్రితమే ఆయన రాసిన ఒక వుత్తరంలోని ఈ విషయం చదివితే ఈయన అవలంబించిన సూక్ష్మమైన ఆగమం ఎట్టిదో తెలుస్తుంది: “Cinematheque లో మీతో పాటు Mizoguchi సినిమాలు మరోసారి చూడలేకపోయినందుకు నన్ను క్షమించండి. Mizoguchi ని మీరెంత ఇష్టపడతారో నేను అంతే విధంగా ఆయన్ని ఇష్టపడతాను. అందుకు కారణం నాకు Kurosawa ఇష్టం కావడమే. వీరిద్దరూ నాణేనికి చెరో వైపూ. చీకటేంటో తెలియకుండా మనకి వెలుగంటే ఏంటో తెలిసే అవకాశం వుందా? Mizoguchi నచ్చినంత మాత్రాన Kurosawa నచ్చకపోవడమనేది వారిద్దరినీ అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. అలా కాకుండా కేవలం Kurosawa నే ఇష్టపడేవాడు నిస్సందేహంగా గుడ్డివాడే. అలాగే కేవలం Mizoguchi నే నచ్చేవాడికి ఒక్క కన్నే వున్నట్టు లెక్క. కళలన్నింటిలోనూ కొన్ని భావగర్భితమై, ఆలోచనలు రేకెత్తించేవిగానూ వుంటే మరికొన్ని ఆలోచనకి అతీతంగానూ, భావోద్వేగాలతోనూ వుంటాయి.”

Andre Bazin గురించి Jean Renoir రాసిన ముందుమాట.

ఏ రోజుల్లో అయితే రాజులు మనసున్న మారాజులో, ఏరోజుల్లో నయితే పేద వాడి పాద పూజకు సైతం రాజులు ముందడుగువేసేవారో, ఏ రాజుల అడుగుల సవ్వడికే విపరీతమైన జాడ్యముతో బాధ పడుతున్నవారు సైతం స్వస్థత చెందేవారో, ఆ రోజుల్లో ఆ రాజుల గొప్పతనాన్ని కీర్తించడానికి కవీశ్వరులుండేవారు. కానీ చాలా పర్యాయల్లో గేయం కంటే గాయకుడు, కవిత్వం కంటే కవి, కథ కంటే కథకుడూ గొప్పగా ప్రస్తావించబడడం చుస్తూనే వుంటాం.. సినిమా విషయంలో Bazin సరిగ్గా ఇలాంటి వాడే. కానీ కథలోని ఆ భాగం భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా మూలవస్తువలన్నింటినీ ఒక సమూహంగా చేర్చడమే. నాగరికత అంటే పనికిరాని వాటిని జల్లిస్తూ వెళ్ళడమే కదా. చివరికి మేలైనదే మిగుల్తుంది. Villon రోజుల్లో Seiene నది ఒడ్డున కవులు విస్తారంగా వుండే వాళ్ళని నేనొప్పుకుంటాను. కానీ ఇప్పుడు వారంతా ఎక్కడ? ఎవరు వారంతా? ఎవ్వరికీ తెలియదు. కానీ Villon మాత్రం ఇంకా అక్కడే వున్నారు, పరిపూర్ణంగా మరియు పవిత్రంగానూ.

గతం మిగిల్చిన అపూర్వ అవశేషాలను క్రమ పర్చుకోవడంలో రాబోయే తరాల వారికి వెలకట్టలేని సాయం అందుతుంది. వారికి చేయూతగా Bazin వాళ్ళతో వుంటాడు. ఆ రోజుల్లో రాజులను కీర్తించడానికి కవీశ్వరులున్నట్టే, సినిమాకీ ఒక కవి ఉంటాడు. అప్పటి రాజులకు కవీశ్వరులు ఎలా అయితే కీర్తి కిరీటాన్ని అందజేసారో అలాగే అల్పాయుష్కుడు, అశక్తుడు, నిగర్వి, సాత్వికుడు అయిన Bazin సినిమాకీ రాజత్వం కలిగిన నూతన కల్పనాధికారాన్ని అందచేసారు. ఏ రాజుకైతే కిరీటం పొదిగి ఎంతటి గుర్తింపు నద్దిచ్చాడో అదే రాజు ధరించిన కృత్రిమమైన తళుకు బెళుకులను పీలికలు చేసి బంధాలనుంచి విముక్తి గావించి అభివృధ్ధి పథాన్ని సూచించాడు. అశుధ్ధాల నుంచి శుభ్రం చేయబడి, పరిశుధ్ధాత్మగా గావింపబడ్డ మేలైన మహరాజునే మన మనవళ్ళు మనమరాళ్ళు కలుసుకొని, తెలుసుకొని అహ్లాదోత్సాహాలు పొందుతారు. అదే సమయంలో ఆ రాజునంతటి వాడిని చేసిన ఆ కవి కూడా వారికి గోచరిస్తాడు. ఎలా అయితే గాయకుడు ఒక్కోసారి గేయం కంటే గొప్పవానిగా పరిగణించబడతాడో అలాగే వారు Andre Bazin ను మరో సారి కనుగొంటారు, ఆయన సేవల్ని శ్లాఘిస్తారు.

రాబోయే తరాల వారిపై Bazin ఎంతటి ప్రభావం కలుగచేస్తాడో అన్న విషయంలో సందేహం లేదు. సినిమా అనే ప్రక్రియ అంతమొందినప్పటికీ ఆయన సినిమా గురించి చేసిన రచనలు మాత్రం పదిలంగానే వుంటాయి. సినిమా అనే కళ ఒకటి వుండేదని రాబోయే తరాల వారికి ఈ వ్యాసాలే సాక్ష్యాలవబోతాయి కాబోలు. ఈయన రచనల ద్వారా, మానవులు తమ మనసులో ఒక తెరను ఊహించుకుని, దానిపై వేగంగా పరిగెట్టే ఒక గుర్రాన్ని, ఒక అందమైన యువతి క్లోజప్ ను, తుది శ్వాశ విడుస్తున్న ఒక వీరుని చూడగలుగుతారు. ఆ చిత్రాలకు ఎవరికి తగ్గట్టు వారు అర్థాలు వెతుక్కుంటారు. కానీ వీరందరు మాత్రం What is Cinema? గ్రంధం యొక్క నాణ్యత గురించి మాత్రం ఏకీభవిస్తారు. ఎలా అయితే గతించిపోయిన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు ఒక్కో సారి మన ఊహలకందవో అలాగే ఈ వ్యాసాలు కూడా గతించిన పోయిన సినిమా అనే కళను గురించి మనతో మాట్లాడ గలుగుతాయి, అచ్చెరువు కలుగచేస్తాయి.

రాబోయే తరాలకు Bazin వ్యాసాల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నది సత్యం. తన సమకాలీనులపై ఈయన ప్రభావమే ఆయనపై నాకీ ఉన్నత అభిప్రాయం కలిగేలా చేసింది.అందుకే నా హృదయంలో ఆయనకు ఎప్పటికీ పదిలంగా స్థానం కల్పించబడింది. ఒకప్పటి సత్పురుషులు బానిసలకు మానవ ధర్మం యొక్క విలువను తెలియచేసినట్లు గానే Bazin, మాకూ మా వృత్తి యొక్క పవిత్రతని తెలియచేసారు.

ముగింపు

సినిమాల గురించి ఆసక్తి కలిగిన వారందరూ చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి “What is Cinema?” అలాగే Gilles Deleuze అనే ఫ్రెంచ్ తత్వవేత్త రాసిన సినిమా వ్యాసాలు కూడా సినిమా అనే ప్రక్రియ కేవలం వినోదాన్నందించే సాధనంలా కాకుండా మానవ మేథస్సుని ఇనుమడింపజేసే సాధనంలా చూడడంలో వుపయోగపడతాయి. సినిమాలు తీయడంతో పాటు వాటి గురించి విశ్లేషించడం కూడా సినిమా అభివృధ్ధి చెందడంలో ఎంతో దోహదం చేస్తాయి.

అలాగే సినిమాలు తీసే దర్శకులు కూడా ఒక్కోసారి తాము చూసిన, తీసిన సినిమాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు ఇప్పుడు వెలకట్టలేని గ్రంథాలుగా మనకి లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు సత్యజిత్ రే వ్యాసాల సంపుటం “Our Films – Their Films” అయినా, Alfred Hitchcock తో Francois Truffaut చేసిన ఇంటర్వ్యూలతో కూడిన పుస్తకమైనా, Andrei Tarkovsky రచించిన Sculpting in Time అనే గ్రంథమైనా సినిమా అనే ప్రక్రియకు పవిత్రతను చేకూరుస్తాయి.

ఒక దేశం యొక్క సినిమాలలో మార్పు రావడానికి ఇలాంటి విశ్లేషణా వ్యాసంగాలు ఎంతగానో ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. www.passionforcinema.com అనే website ఈ మధ్యనే సినీ ప్రముఖులను, ప్రేక్షకులను, విశ్లేషకులను ఒక చోటికి చేర్చే ప్రయత్నంలో దాదాపు సఫలం కాగలిగింది. మూస సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మన సినీ పరిశ్రమను రేపటి రోజున ఇలాంటి ప్రయత్నాలే కాపాడతాయని నా ధృఢమైన నమ్మకం.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.)

About వెంకట్ సిద్ధారెడ్డి

వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

  1. Pingback: 24ఫ్రేములు, 64కళలు » Andre Bazin - ఒక పరిచయం

  2. [b]vahwa vahwa chala baga chala oopikatho rasinanduku meeku naa abhinandanalu

    chala kasta padi mariyu istapadi rasaru(rasarani nenu anukuntunna endukante mari vyasam ala vundi mari)

  3. xntricpundits says:

    1]chala chala thanks meeku
    2]Kastapadi chala vishayalu sekarinchi,oka manchi vyasam maa mundunchi nanduku chala thanks.
    3]Chala mundhe mee blog nee endhuku vethki pattukoledhenku kani ippudanispisthundhi.
    Englsh cinemalu,kastha burra vupayoginchi choodalsina cinemala gurinchi+a cinemala venuka unna manashula gurinchi rasthunnaru..mee krushi abhinandaniyam.

    Keep going.Awaiting the best articles from you.

    Dr.Reddy

Comments are closed.