సాధారణంగా, ఒక్కొక్క రచయితకీ ఒక్కొక్క ప్రత్యేకతా, తమదైన సంతకంలాంటి శైలీ వుంటాయి. రంగనాయకమ్మ గారి సూటి దనం, మధురాంతకంగారి సున్నితమైన శైలీ, మనకు చదవగానే అదెవరి కథో పట్టి చెప్తాయి. క్రమం తప్పకుండా చదివే పాఠకుడు తన అభిమాన రచయితని పేరు లేకున్నా పోల్చుకోగలడు. ఇరవైయవ శతాబ్దపు నాలుగో దశకంలో ఆరంభమైన సాహిత్య ప్రస్థానంలో కుటుంబరావుగారు రాసిన కథలూ నవలల్లో శైలీ, నేర్పూ ఆయనని గొప్ప కథకులలో ఒకరినిగా నిలబెట్టాయి.
సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించే రచనలే పాఠకుల అభిమానాన్ని చూరగొని పది కాలాలపాటు నిలబడతాయి. అందుకే స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాతా మన దేశంలో వున్న రాజకీయ పరిస్థితులకి అద్దం పడుతూ, వాటితోపాటే పరిణామం చెందుతూ వచ్చిన మధ్య తరగతి జీవితాల్ని అన్ని కోణాల్నించీ పరిశీలిస్తూ, విశ్లేషించిన ఆయన రచనలు ఇప్పటికీ ఎక్కువగా చదవబడుతున్నాయి. కథలో సామాజిక వాతావరణంతో పాటు, పాత్రలు కూడా నిజ జీవితానికి దగ్గరగా, నేల మీద నడుస్తేనే పాఠకులు ఆ పాత్రలతో తమను తాము అయిడెంటిఫై చేసుకోని కథలో లీనమవగలరు. సమకాలీన సంఘపు నియమాలనీ, రాజకీయ సూత్రాలనీ, ఆర్ధిక సమీకరణాలనీ నిర్మొహమాటంగా, నిజాయితీగా విమర్శిస్తూ, నిజ జీవితంలో మనకినిత్యం ఎదురయ్యే పాత్రలే ఆయన రచనలని పట్టిస్తాయి.
“నిజమైన సాహిత్యం” అనే వ్యాసంలో, సాహిత్య ప్రయోజనం ఉద్బోధా కాదూ, కళావిష్కరణా కాదూ, అంటూ ఆయన ఇలా వివరించారు.
“….జీవితాన్ని విమర్శించటం, అలంకరించటం, సాహిత్యం చేయగల ఉత్తమ కార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం. ఏ కాలపు జీవితాన్ని విమర్శించేది ఆ కాలపు సాహిత్యం. నేటి జీవితాన్ని విమర్శించలేనిదీ, నేటి భావాలను సంస్కరించలేనిదీ, నేటి జీవితాన్ని అలంకరించలేనిదీ నేటి సాహిత్యం కాదు …..”
ఈ నమ్మకంతోటే, ఆయన సమకాలీన సమాజంలో స్త్రీ-పురుష సంబంధాలనూ, ఆర్ధిక అసమానతలనూ, రాజకీయ శక్తులనూ, పిల్లల పెంపకంలోని సూక్ష్మాలనూ, వేటినీ వదలకుండా, విమర్శించి విశ్లేషించారు. తనకు తెలిసిన మధ్య తరగతి మాత్రమే కాక ఈ కథల్లో ఎన్నో వర్గాలని గురించి ఆలోచన రేకెత్తించారు. ఇన్నిరకాల పాత్రల్లోనూ, అంతర్లీనంగా ఒక స్వాతంత్ర్య కాంక్ష ప్రవహిస్తూనే వుంటూంది.
మార్క్సిస్టు సిధ్ధాంతాల మీద ఎంతో అభిమానం వున్నా ఆయన, మనిషికి వుండే ప్రబలమైన స్వేఛ్ఛా కాంక్షని హై-లైట్ చేసారు. ‘నీకేం కావాలి?’ లోని కస్తూరి అయినా, ‘స్వేఛ్ఛ ‘ లో ఇల్లు వదలి పారిపోయిన భార్య అయినా, వాళ్ళ మనుగడా, భద్రతా, సంఘంలో గౌరవం కంటే వాళ్ళ స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలకే ఎక్కువ విలువ ఇచ్చారు. చాలా వరకు కుటుంబరావు గారి పాత్రలు ఇలా తమ వ్యక్తిత్వాలని ప్రకటించుకునే ప్రయత్నంలో వుంటాయి. తనకి కావాల్సిందీ, అక్కరలేనిదీ నిర్ణయించుకునే శక్తిని మనిషినించి హరించే ఏ సాంఘిక స్థితి అయినా గర్హనీయమే. నిరాకరించే అవకాశం వుండి కూడా ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఆయన కథలన్నిటిలోనూ ఈ ఘర్షణ మనకి కనపడుతూనే వుంటుంది.
సాంఘిక నియమాలూ, ఆర్ధిక నీతులూ కత్తుల బోనులో నిలబెట్టినప్పుడు మనిషికి ఏ రకమైన స్వేచ్చ కూడా లేదని ఆయన ‘మనుషులకు గల స్వేఛ్ఛ ‘లో ఉద్ఘాటించారు. ఆ కథలో జబ్బు పడ్డ పని మనిషిమీద తారకం జాలిపడి డబ్బివ్వబోతే, ఆ పని మనిషి తల్లి తీసుకోదు, తమ నీతిని తాకట్టు పెట్టుకోవలసి వస్తుందనే భయంతో. మనిషికి మనిషి సహాయ పడాలనే వున్నా చుట్టూ వున్న కళ్ళకు కనపడని నీతి నియమాలేవో పడనివ్వటంలేదు. వాటి స్వరూపాన్నీ, ప్రభావాన్నీ ప్రశ్నించాలన్న ఆలోచన రేపారు. ఆ సందర్భంలో తారకం అతని తండ్రి తో అంటాడు, “పనిమనిషికి హెచ్చు డబ్బిచ్చే స్వేఛ్ఛ మనకు లేదూ, తీసుకునే స్వేఛ్ఛ ఆమెకు లేదూ,” అని. ఇలా చుట్టు వున్న పరిస్థితులని ప్రశ్నించే కొంచెం ఐడియలిస్టిక్ పాత్రలు కొన్ని సార్లు అసహజంగా వున్నాయా అన్న విమర్శకి సమాధానం ఇస్తూ ఆయన, ‘ కథకుడు సమస్యనిగురించి చర్చించటమే కాదు, ఆ సమస్యని పరిష్కరించగల పాత్రల గురించి కూడా రాయ గలగాలి ‘ అన్నారు.
స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలకంటే ముందు మనిషికి కావలిసింది ఆహారం. ఆ తరువాతే సాహిత్యమైనా, సంస్కారమైనా. ఈ అవసరాలే మనిషిని శాసించి, నడిపిస్తాయి. తిండి కరవైనప్పుడు మనిషి ఏం చేస్తాడు? ‘తిండి దొంగ ‘ లో వెంకాయమ్మ, ‘అట్టడుగు ‘ లో గణపతిల ప్రవర్తనకి మనం అసహ్యించుకోలేం. ఆకలికున్న శక్తి అటువంటిది అని మాత్రం అనిపిస్తుంది. తీర్చుకొని తీరాల్సిన అవసరాలకీ, స్వేఛ్ఛా కాంక్షకీ నడుమ సంఘర్షణలోంచే జీవితం పుడుతుందేమో. ‘తిండి దొంగ ‘ లో వెంకాయమ్మ కూతురింట్లో తినుబండారాలు దొంగ తనం చేసి ఆకలితో మాడుతున్న కొడుక్కివ్వటానికి అర్థ రాత్రి బయలుదేరుతుంది. ‘అట్టడుగు ‘ లో గణపతి దుర్భరమైన దారిద్ర్యాన్ని, ‘ అన్ని రకాల విశ్వాసాలనూ వదిలేసి,… బియ్యం అమ్మీ, డబ్బు వడ్డీలకిచ్చీ, డబ్బున్న వాళ్ళని పొగిడీ, కూలి జనాన్ని తిట్టీ…’ జయిస్తాడు. పరిస్థితుల చేతిలో మనిషి బానిస అనిపించే ఇలాటి కథలు ఇప్పటికీ మనం నిజ జీవితంలో చూస్తూనే వుంటాము.
కుటుంబరావుగారి కథల్లో ఆయన గాఢంగా నమ్మిన కమ్యూనిస్టు సిధ్ధాంతాలతో పాటు, జీవితానికి అతి దగ్గరగా అనిపించే ఆయన పాత్రల్లోని వాస్తవికత కూడా మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ‘పంచకళ్యాణి ‘ లోని లలితా, ‘సవతి తల్లి ‘ లోని బామ్మా, ‘అనుభవం ‘ లోని పార్వతీ మాత్రమే కాదు, ఏ పాత్రని గురించి ఆలోచించినా, “ఈ మనిషిలాంటి మనిషి నాకిదివరకే తెలుసు” అని మనం చాలా సార్లు అనుకోకుండా వుండలేం.
కథల్లో సామాజిక వాస్తవికతతో పాటు, పాత్రలు చాలా బిలీవబుల్ గా, సాధారణంగా వుండటం వల్లనే కాబోలు, ఆయన రచనలకీ, చెహోవ్ రచనలకీ అంత సారూప్యం. రచయిత తన కథల్లోని పాత్రల మనస్తత్వాలని నిజ జీవితంలోని మనుషులకి అంత దగ్గరగా చిత్రీకరించరాలంటే, చుట్టూ వున్న మనుషులనీ, వాళ్ళ ప్రవర్తనలోని మంచి చెడుల్నీ, ఆ ప్రవర్తననీ ఆలోచనలనీ ప్రభవితం చేసే సంబంధ బాంధవ్యాలనీ, వాటిని తిరిగి శాసించే సంఘ శక్తులనీ అన్నిటినీ మైక్రోస్కోపులో పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ వుండాలి. ఆ పరిశీలనలో, విశ్లేషణలోనే రచయిత పరిపక్వతా, మేధస్సూ బయట పడేవి. నిజానికి, ఇటువంటి విశ్లేషణా, అవగాహనలే సాహిత్యానికి పరమావధి అన్నారాయన.
విభిన్న వర్గాలకి చెందిన స్త్రీ పురుషుల గురించి రాయటం ఒక ఎత్తయితే, పిల్లలనీ వాళ్ళ అవసరాలనీ అర్ధం చేసుకొని రాయటం ఒక ఎత్తు. కుటుంబరావు గారు పిల్లల మనసుల గురించీ, వాళ్ళ అవగాహన గురించీ, ఆలోచించటానిక్కూడా స్వతంత్ర్యం లేని స్త్రీ జాతి పిల్లలని పెంచడాన్ని గురించీ లెక్క లేనన్ని కథలు రాసారు. చాలా వరకు ఆయన స్త్రీ పురుషుల ప్రవర్తన కృత్రిమమైనది గానూ, పిల్లల ప్రవర్తనా, ఆలోచనా స్వఛ్ఛమైనదిగానూ చిత్రీకరించారు. పిల్లలకు సంఘ నియమాలతో పని లేదు, సంబంధ బాంధవ్యాలలోని లాభ నష్టాలతో పని లేదు. ఇతర వర్గాల నించి ఆత్మ రక్షణ చేసుకోవాలసిన అవసరం లేదు. అందుకే వాళ్ళ ప్రవర్తన చాలా నిజాయితీగా, తర్క బధ్ధంగా వుంటుంది.
“…పిల్లల ఉద్రేకాలు కూడా పాటించటం వల్ల జీవితం బాగు పడుతుందేమో కానీ, చెడి పోదు. చిన్న పిల్లల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ఞానయుతంగా వుండవు గానీ, అంత మూఢంగా కూడా వుండవు…” అన్నారాయన, “ఆడ జన్మ” అనే కథలో.
చాలా చోట్ల కుటుంబరావు గారి కథల్లో ఇలాటి కాలాతీతమైన వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి. అసలు కంటే కొసరు ముద్దని, కథ కంటే ఇలాటి వ్యాఖ్యానాలు మెచ్చు కుని ఆలోచించే వాళ్ళు చాలా మందే వుండి వుంటారు. ఈ వ్యాఖ్యానాలలో మనకు జీవిత సత్యాలు గోచరిస్తాయి.
“పెళ్ళికి పెద్దలు” అనే కథలో ఆయన,
“జీవితం కాళ్ళ జెర్రి లాటిది. వెయ్యి కాళ్ళతో నడుస్తుంది, అయితే తేడా ఏమిటంటే, కాళ్ళ జెర్రికి చక చకా నడిచిపోవటం తెలుసు. జీవితానికి తెలీదు…” అంటారు. “సవతి తల్లి” కథలో, “..పరిస్థితులతో సంఘర్షణ పెట్టుకోదలచిన వాళ్ళు సాధారణంగా ఆత్మ విమర్శకి పూనుకోరు. పరిస్థితులతో రాజీ పడే వారే తరచు దానికి సిధ్ధ పడతారు, ” అంటారు. మొదటిసారి చదవగానే కాంట్రడిక్టరీగా అనిపించినా, అది నిజమేననిపిస్తుంది, మనకి మళ్ళి ఆలోచిస్తే.
సునిశిత పరిశీలనతో పాటు, సున్నితమైన హాస్యంకూడా కుటుంబరావు గారి కథల్లో కనపడుతుంది. అయితే ఎక్కువగా “సిట్యుయేషనల్ కామెడీ” కన్నా, భాష, భావాలతో ఎక్కువ హాస్యం పండిచారు. “మగవాడి దౌర్జన్యం”, “పెళ్ళికి పెద్దలు”, “పతివ్రతా మహిమ”, “దుష్ట గ్రహం”, లాటి కథల్లో మధ్య తరగతి హిపోక్రసీ మీదా, అర్ధం లేని భావ జాలం మీదా లలితమైన సెటైర్లు వేసారు.
సాహిత్యాన్ని కేవలం ఉబుసుపోకకో, సరదాకో కాక, ఆలోచింప చేసే ప్రక్రియగా నమ్మే చదువరులకూ, రచయితలకూ కుటుంబరావుగారి సాహిత్యం మంచి నీళ్ళ బావి లాటిది. ఆయన రచనలు చదివినప్పుడల్లా కొత్త అర్ధాలనిస్తాయి. వాటిల్లో కనిపించే జీవన సూత్రాలు సజీవమైనవీ. ఆ సూత్రాల గురించి అర్ధం చేసుకోవాల్సిన అవసరం మనకెంతైనా వుంది.
apweekly.comలో నలుపు-తెలుపు అనే కాలమ్ నిర్వహిస్తున్న శారద గారు అనేక తెలుగు రచనలను thulika.net కోసం ఆంగ్లంలోకి అనువదించారు. సునిశితమూ, సున్నితమూ ఐన కొ.కు. గారి శైలి తనకిష్టమనీ, తాను మార్క్సిజమ్, ఫెమినిజమ్ వగైరా ఏ ఇజాన్నీ పూర్తిగా ఆమోదించలేననీ అంటారు.