పల్ప్ ఫిక్షన్

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం.

తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ సినీ చరిత్రకు ఒక Breathless లాగా, హాలీవుడ్ సినీ చరిత్రకు ఒక Citizen Kane లాగా ఆధునిక ప్రపంచ సినీ చరిత్ర మొత్తానికి ప్రాతినిధ్యంవహించే ఒక సినిమాను ఎన్నుకోవలిసి వస్తే అది ఖచ్చితంగా Pulp Fiction సినిమానే అవుతుంది.

ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఈ సినిమా నేటికీ ఎంతో మంది విశ్లేషకులచే విశ్లేషింపబడడమే కాకుండా దాదాపు అన్ని film schools లోనూ ఈ సినిమా ఒక పాఠ్యాంశంగా భోధింపబడుతూంది. అంతేకాకుండా, ప్రపంచంలోని దాదాపు అన్ని Top 100 సినిమాల లిస్టుల్లోనూ ఈ సినిమాకు స్థానం కల్పించబడింది. కొంతమంది ఈ సినిమాను Modern Citizen Kane గా కూడా వర్ణించారు. మరో విచిత్రమేమిటంటే ఈ సినిమాకు ఒక cult status కు తీసుకెళ్ళిన అభిమానులు ఎంతమంది వున్నారో, ఈ సినిమాను చెత్త సినిమాగా తీసిపారేసి ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది వున్నారు. Pulp Fiction సినిమాకున్న ప్రత్యేకత అదే! నచ్చిన వాళ్ళకు అతిగా నచ్చేస్తుంది. నచ్చని వాళ్ళు ఘోరంగా ద్వేషిస్తారు. నచ్చినా నచ్చకపోయినా ఒక మాట మాత్రం నిజం; ఇది ప్రపంచ సినీ చరిత్రలోని అత్యంత ప్రాచుర్యం కలిగిన సినిమాలలో ఒకటి.

ప్రపంచంలోని ఎంతో మంది film enthusiasts లో ఒక cult film గా ఈ సినిమా ముద్రపడటానికి కారణాలేంటి అని వెతుక్కుంటూ వెలితే ఒక మహా సముద్రం ఈదినట్టవుతుంది. పొరలు పొరలుగా విడదీసి విశ్లేషించినా కూడా చూసిన ప్రతి సారీ ఎదో ఒక కొత్త విషయాన్ని మన ముందుంచే ఈ సినిమా గురించి కాబోయే దర్శకులే కాదు, సినిమాలంటే కొద్ది పాటి ఆసక్తి కలిగిన వారెవరైనా తప్పక తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

అసలేంటీ సినిమా యొక్క ప్రత్యేకత? మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు వున్న తేడా ఏంటి? ఈ సినిమా ఇంతటి ప్రఖ్యాతి గాంచడానికి కారణం ఏంటి? విడుదలయిన పదమూడు సంవత్సరాల తర్వాత కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి?.. లాంటి విషయాలకు సమాధానాలు అన్వేషిస్తూ ప్రపంచంలోని ఇతర విశ్లేషకుల అభిప్రాయలను తెలియచేస్తూ, తెలుగు సినీ ప్రేమికులకు Pulp Fiction సినిమా గురించి పరిచయం చేయడమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం.

ఏ సినిమానైనా విశ్లేషించే ముందు ఆ సినిమా విడుదలయిన కాలాన్ని పరిగణించి విశ్లేషించాలి. ఉదాహరణకు Godard దర్శకత్వంలో వచ్చిన French New wave నాటి తొలి సినిమాల్లో ఒకటి అయిన Breathless సినిమాను తీసుకుంటే, ఈ సినిమాను విశ్లేషించేటప్పుడు అందులో ప్రత్యేకించి చెప్పుకోవల్సిన అంశాల్లో ఒకటి, జంప్ కట్ అనబడే ఎడిటింగ్ ప్రక్రియ. ప్రతి తెలుగు సినిమాలోనూ అవసరం వున్నా లేకపోయినా జంప్ కట్ ను ఎడాపెడా వాడేస్తున్న ఈ రోజుల్లో జంప్ కట్ గురించి, Godard తన సినిమా Breathless లో ఎడిటింగ్ ద్వారా చేసిన ప్రయోగాల గురించి చెప్తే, అదేమంత పెద్ద విషయమని అనిపించకపోవచ్చు. అందుకు కారణం అది ఇప్పుడు సర్వ సాధారణమైపోవడమే. అలాగే Citizen Kane సినిమా చూస్తున్నప్పుడు అందులో ప్రత్యేకించి మనకెదురయ్యే అంశం, సినిమాటోగ్రాఫర్ వుపయోగించిన deep-focus అనబడే ప్రక్రియ. అంతవరకూ ఏ సినిమాలోను చూడనటువంటి విధంగా, నమ్మశక్యం కాని depth-of-field ను వుపయోగించడం ద్వారా ఒకే ఫ్రేములో ఒకరికంటే ఎక్కువమంది నటులను చూపించగలగడమే కాకుండా వారి వారి భావోద్వేగాలను సైతం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తేగలగడం ద్వారా Citizen Kane సినిమాతో కొత్త శకానికి నాంది పలికాడు Orson Wells. ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే లెన్సులు, కెమెరాల ద్వారా ఈ deep-focus షాట్లు తీయడం చాలా సులభమైపోయింది. కానీ ఇలా తీస్తే ప్రేక్షకుల మనోభావాల్లో కొత్త అనుభూతులు కలుగ చేయొచ్చని దాదాపు 70 ఏళ్ళకు ముందే ఆలోచించిన Orson Wells గొప్పతనం, ఆ రోజుల్లో డీప్-ఫోకస్ లాంటి ప్రక్రియను సృష్టించడం మీదే ఆధారపడి వుందనడంలో సందేహం లేదు.

పైన పేర్కొన్న Breathless, Citizen Kane సినిమాలలాగే Pulp Fiction సినిమాను విశ్లేషిస్తున్నప్పుడు మనకు మొదటగా ఎదురయ్యే విషయం ఈ సినిమాలోని కథనం. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సినీ పరిశ్రమ వ్యక్తి నోటా వినబడుతున్న Non Liner narrative విధానంలో నడుస్తుంది ఈ సినిమా యొక్క కథ.

సాధారణంగా ఈ సినిమా అయినా తీసుకుంటే దానిని మూడు అంకాలుగా చూడవచ్చు. మొదటి అంకంలో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేయడంతో సరిపోతుంది. మొదటి అంకం చివర్లో సినిమాలోని ప్రముఖ పాత్రధారి అయిన నాయకుడు అనుకోని పరిస్థితిని ఎదుర్కొని, అప్పటివరకూ స్థిరంగా వున్న జీవితం అనుకోకుండా కష్టాల కడలిలో చిక్కుకుటుంది. తన జీవితంలో ఏర్పడిన కష్టాలను ఒక్కొక్కటే చేదించుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోకి అడుగడుగునా అడ్డుపడే ఒక ప్రతినాయకుడూ వుంటాడు. రెండో అంకం ముగిసే సరికి తన కష్టాలకు కారణాలు వెతుక్కోవడమే కాకుండా ఏంచేస్తే తన కష్టాలు తీరుతాయో కూడా తెలుసుకుంటాడు నాయకుడు. ఇక మూడో అంకంలోకి వచ్చేసరికి నాయకుడు తన గమ్యం చేరడానికి ఎదురయిన అడ్డంకులన్నీ తొలగించుకోవడంలో మునిగిపోయి సినిమా ముగిసే సరికి తన లక్ష్యం సాధిస్తాడు. ఈ మూడు అంకాల క్రమాన్నే ఇంగ్లీషులో Three-Act Structure అని పిలుస్తారు. మొదటి అంకాన్ని setup అని, రెండో అంకాన్ని conflict అని మూడో అంకాన్ని resolution అనీ పిలుస్తారు. ఈ మూడు అంకాల క్రమంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి కథ మొత్తాన్ని సరళ రీతిలో చెప్పకుండా ఫ్లాష్‌బ్యాక్ లాంటి ప్రక్రియలు వుపయోగించడం ద్వారా సినిమాకు కొత్త రంగులు అద్దాలని చాలా మందే ప్రయత్నాలు చేసారు. కానీ ఇలాంటి ప్రయత్నంలో అత్యంత వున్నతమైన ప్రయోగం చేయడమే కాకుండా ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు Quentin Tarantino.

కథా పరంగా పల్ప్ ఫిక్షన్ గురించి చదవడం కంటే చూడడమే మంచిదని నా అభిప్రాయం. సరళ రీతిలో లేని కథ ఒక ఎత్తయితే ఎటువంటి సంబంధంలేని మూడు కథలు అనుకోని పరిస్థితుల్లో మూడు కథల్లోని పాత్రలు మధ్య సంకర్షణను ఏర్పరుస్తూ వారి మధ్య సంఘర్షణను సృష్టించడం నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో అదే మొదటి సారి. అందుకే ప్రపంచం మొత్తం ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.

దాదాపుగా మనం చూసే అన్ని సినిమాలు ప్రేక్షకుల మెదడుకు పెద్ద పని పెట్టవు. చాలా కొద్ది సినిమాలు మాత్రమే సినిమా చూస్తున్నంత సేపే కాకుండా, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మన మదిలో మెదులుతూనే వుండేలా చేస్తాయి. అలా చేసిన అతి కొద్ది సినిమాల్లో పల్ప్ ఫిక్షన్ ఒక్కటి అని చెప్పొచ్చు. అంతగా మన మేధస్సుకి పని పెట్టే విషయం ఏముంది ఈ సినిమాలో అంటే చెప్పడం కష్టం. విరళ రీతిలో సాగే ఈ కథ మొదటి సారి చూడగానే అన్ని విషయాలు అర్థం కావడం కొంచెం కష్టం.

పల్ప్ ఫిక్షన్ సినిమా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఈ సినిమాలోని వైవిధ్యమైన కథనం. నిజానికి ఈ సినిమాలోని కథ ఒక జిగ్‌సా పజిల్ అని చెప్పొచ్చు. మూడు విభిన్న కథలను ముక్కలు ముక్కలు చేసి మన ముందు విడి విడీ సన్నివేశాలుగా ప్రదర్శించి ప్రేక్షకుడిని సినిమాలో ఒక ముఖ్య భూమిక పోషించేలా చేసి, ఆ ప్రయత్నంలో ప్రేక్షకునికి ఒక అధ్భుత అనుభూతిని అందించడంలో సఫలం అయ్యాడు ఈ చిత్ర దర్శకుడు Quentin Tarantinio. జిగ్‌సా పజిల్ లోని ముక్కల్ని ఒక దగ్గరకు చేర్చి ఏ విధంగా చిత్రాన్ని పరిపూర్ణం చేయగలమో, అలాంటి అవకాశమే ప్రేక్షకులకు అందివ్వడం ద్వారా ప్రేక్షకుడిని కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్ర వహింపచేయడం అనేది అంతకు ముందెప్పుడూ జరగకపోవడం అనేది పల్ప్ ఫిక్షన్ సినిమాను అత్యున్నత శిఖరాలను చేరేలా చేసింది.

పల్ప్ ఫిక్షన్ కంటే ముందే Krzysztof Kieslowski అనే పోలిష్ దర్శకుడు Blind Chance అనే సినిమా ద్వారా Non linear narrative అనే ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, పల్ప్ ఫిక్షన్ సినిమాలో వున్నంత క్లిష్టంగా ఈ సినిమాలోని కథనం వుండదు.

కథనం ఒక్కటే కాదు ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశాలు చాలానే వున్నాయి. అర్థం చేసుకోగలిగితే (ఒక్కోసారి అమెరికన్ హ్యూమర్ అర్థం చేసుకోవడం మనకు కష్టమే), ఈ సినిమాలోని సంభాషణలు ఈ సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు. Bruce Wills, John Travolta, Uma Thurman, Samuel L Jackson లాంటి హాలీవుడ్ దిగ్గజాలను ఒక్క చోట చేర్చడమే కాకుండా వారు పోషించిన పాత్రలచే మాట్లాడించిన సంభాషణలు ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్.

సన్‌టైంస్ పత్రికకు సినిమా రివ్యూలు రాసే ప్రఖ్యాత సినీ విశ్లేషకుడు Roger Ebert చెప్పినట్టు ఈ సినిమా ఒక audio book గా కూడా విని ఆనందిచవచ్చు. సినిమా అనగానే పొయెటిక్ గా వుండే సంభాషణలు, ఒక సంభాషణకు బదులుగా మరో సంభాషణలా కాకుండా దాదాపుగా ప్రతి పాత్రధారి తమ సంభాషణలను ఒక చైతన్య స్రవంతిలా వల్లించడం ఈ సినిమా లోని సంభాషణల యొక్క మరో ప్రత్యేకత.

పల్ప్ ఫిక్షన్ సినిమా చూసిన చాలామంది చేసే మొదటి వాఖ్య సినిమా చాలా హింసాత్మకంగా వుందని. కానీ Quentin Tarantino హింసను చూపించకుండానే సినిమాను హింసాత్మకంగా రూపొందించారన్నది సత్యం. కాకపోతే ఆ విషయం చాలా మంది ప్రేక్షకులు గ్రహించరు. Quentin Tarantino తన మొదటి సినిమా అయిన Reservoir Dogs లో కూడా ఇదే ప్రయోగం చేసారు. Reservoir Dogs కథాపరంగా ఒక బ్యాంకు దోపిడీకి సంబంధించిన కథాంశంతో నడుస్తుంది. కానీ Oceans Eleven సినిమాలోలా దోపిడీ ఎలా చేసారు అన్న కథాంశం కాకుండా, దోపిడి చేసిన తర్వాత దొంగల ముఠా సభ్యుల మధ్య జరిగే సంఘర్షణను కథాంశంగా ఎన్నుకోవడంలోనే Quentin తన ప్రత్యేకతను చాటుకున్నారు. సరిగా అలాగే Pulp Fiction సినిమాలో కూడా హింసాత్మక సంఘటనలు చూపించకుండానే ప్రేక్షకులు చూసినట్టు ఫీల్ అయ్యేలా చేయడంలో తన పనితనాన్ని చూపెట్టారు.

ఉదాహరణకు, ఈ సినిమాలో కార్లో ఒక వ్యక్తిని కాల్చి పారేసే సన్నివేశం వుంటుంది. కాల్చడం ప్రేక్షకులు అసలు చూడనే చూడరు. కానీ ఆ వ్యక్తిని చంపేసాక రక్తసిక్తమైన దుస్తులతో వున్న హంతకులను, రక్తంతో తడిసి ముద్దయిన కారు సీటు చూపించడం ద్వారా ఆ హింసాత్మక సంఘటను మనం చూసినట్టు మన మదిలో భ్రమింపజేస్తాడు దర్శకుడు. అలాగే మరో సన్నివేశంలో ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గుర్ని కాల్చి చంపుతున్నప్పుడు మనకు కనిపించే దృశ్యం కాల్చే వాళ్ళ మొహాలే కానీ హతమౌతున్న వ్యక్తులు కాదు.

ఇలా చెప్పుకుంటూ పోతే, పల్ప్ ప్జిక్షన్ సినిమాలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. ఉదాహరణకు ఈ సినిమాలోని ఒక కథ మొత్తం ఒక బ్రీఫ్‌కేస్ చుట్టూ తిరుగుతుంది. కానీ సినిమా అంతా అయ్యాక కూడా ‘అసలా బ్రీఫ్‌కేస్ లో ఏముందని అంతమంది కొట్టుకు చస్తారో’ అర్థంకాదు. కొన్ని విషయాలను ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేస్తుంది ఈ సినిమా. ఆ విధంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులభంగా సినిమా కథను రొటీన్ గా చెప్పేయకుండా ప్రేక్షకులు నిశ్చష్టులను కాక, చైతన్యవంతుల్ని చేసి, సినిమాలో ఒక భాగస్వామిని చేసి, తనలోని ప్రేక్షకుడిని డర్శకునిగా గౌరవించాడు Quntin Tarantino.

నిజానికి పల్ప్ ఫిక్షన్ సినిమాలోని కథలు ఈ సినిమా కోసంగా రాసినవి కాదట. ఈ సినిమా తీయాలని ఆలోచన లేని రోజుల్లోనే తన మిత్రుడు (ఇప్పుడు శత్రువు) Roger Avery తో కలిసి రాసుకున్నారట. విడి విడిగా రాసిన కథలను ఒకటిగా చేర్చి ఒక సినిమాగా తీయడం ఒక అద్భుత ప్రయోగం. ఇలాంటి ప్రయోగమే Short cuts అనే సినిమా ద్వారా Robert Altman అమెరికన్ రచయిత అయిన Raymond Carver రచించిన పదికి పైగా కథలను ఎన్నుకుని వాటన్నింటిని ఒక సినిమాగా రూపొందించారు.

మనం ఎంత అరిచి గీపెట్టినా మీడియా చేసే మాయాజాలం ముందు మన నోర్లు మూతబడాల్సిందే. ఈ post modern ఎరాలో మీడియా ఎంత చెప్తే అంత. పల్ప్ ఫిక్షన్ అంతగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణాల్లో మీడియా ఒకటని నా అభిప్రాయం.

వైవిధ్యమైన సినిమాలకు పెద్దపీట వేసి ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే Cannes చిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారం లభించడంతో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఒక వైపు Cannes అవార్డు అందించిన ప్రాచుర్యం, మరో వైపు ఈ సినిమా నచ్చిన వాళ్ళు చేసిన ప్రచారంతో పాటు పత్రికలు మరియు ఇతర మీడియా కల్పించిన ప్రచారం కూడా ఈ సినిమా ఇంతటి జనాకర్షణ పొందడానికి మరో కారణం. ఈ సినిమా సాధించిన విజయం ఎంతో మంది కొత్త తరం దర్శకులను సంప్రదాయక కథన ప్రక్రియలను ఛాలెంజ్ చేసేలా చేసింది. అందుకు సాక్ష్యమే Steven Soderberg రూపొందించిన Traffic, Alexandro Gonzalez రూపొందించిన Amerros Perros, Christopher Nolan రూపొందించిన Momento, Following సినిమాలు.

పల్ప్ ఫిక్షన్ సినిమా కంటే ముందు Quentin Tarantino దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా, Reservoir Dogs కూడా ఈయన దర్శకత్వ ప్రతిభకు ఒక మంచి ఉదాహరణ. ఈ రెండు సినిమాల తర్వాత ఈయన తీసిన Jackie Brown, Kill Bill లాంటి సినిమాలు మాత్రం మొదటి రెండు సినిమాల్లోని వైవిధ్యాన్ని కనబరచలేదంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా Kill Bill హింసను stylistic గా ప్రదర్శించడంలో సఫలం కాగలిగింది కానీ పల్ప్ ఫిక్షన్ అంత గొప్ప సినిమా మాత్రం కాదని చెప్పొచ్చు. ఈ మధ్యనే Death proof అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచాడు Quentin. ఈ సినిమా పల్ప్ ఫిక్షన్ స్థాయిలో వుందో లేదో చూసిన వారెవరైనా చెప్పాలి.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.)

About వెంకట్ సిద్ధారెడ్డి

వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to పల్ప్ ఫిక్షన్

  1. ఓహో…ఈ సినిమా ఏదో ఆసక్తి కరంగా ఉంది… పరిచయం చేసినందుకు ధన్యవాదాలు…

  2. నాకెంతో ఇష్టమైన ఈ సినిమా గురించి మీ వ్యాసం అసంతృప్తి మిగ్లిచింది వెంకట్! అఫ్కోర్సు, ఈ సినిమా గురించి మాట్లాడ్డం చాలా కష్టమే, ఒప్పుకుంటాను. నేనదేమంటే టరంటినో అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పే కంటే ఈ సినిమాలో ఉపయోగించిన కథా కథన పద్ధతులు కొన్ని ఉదాహరణలతో చెప్పుంటే బాగుండేది. ఒకటి మాత్రం సూపర్ నిజం – ఈ సినిమాకి ప్రాణం డైలాగులు. 90లలో కొన్ని సీన్ల డైలాగులు మొత్తం చెప్పగలుగుతుండేవాణ్ణి.

  3. మంచి ఇంగ్లీష్ సినిమాలు చెప్పండయ్యా అని మా అమెరికన్ ఫ్రెండ్స్ ని అడిగితే, వాళ్ళిచ్చిన లిస్ట్ లో కూడా లేదీ సినిమా. బహుశా మీరన్నట్లు, ఈ సినిమా రెండు విధాలుగా ప్రాముఖ్యం పొందిందనుకుంటా. అయినా తప్పక చూస్తాను.

    ఇంకో విషయం, మీ విమర్శ చాలా బాగా ఉంది. ఓ తెలుగు పుస్తకం పైన సాహిత్య విమర్శ చేసిన లెవెల్లో, మీ భాషతో సహా. మీ సినీ సత్తా ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థం అయింది.

  4. ఈ సినిమాని నేను ఒక్కసారే చూసా అంటే చూడనట్టు లెక్కే…
    ఇందులో సెలవీ(c’est la vie) పాట మాత్రం ఒ వంద సార్లు చూసా 🙂
    సినిమా స్క్రిప్టు సూపర్.. నా లాంటి డైలాగ్ పిచ్చాళ్లకి ఈ సినిమా ఒక పండుగ !
    కిల్ బిల్ డివీడీలు వుండడం వల్ల వాటిని ఒ ఆఱేడు సార్లు చూసా. దీని డీవీడి కూడా ఎక్కడైనా సంపాదించాలి.

  5. వికట కవీ మరియూ ఈ సినిమా చూడదల్చుకున్న ఇంకెవరైనా – డయలాగుల్లో విపరీతంగా బూతులుంటాయి. ఆ పాత్రలు, ఆ కథ వాతావరణం అలాంటిదనే దృష్టితో చూడాలి ఈ సినిమాని. కొందరు “సున్నిత” మనస్కులు దడుచుకోగలరు.

    రాకేశ్వరా – సెలవీ అంటే వాళ్ళు ట్విస్ట్ చేసేప్పుడు వచ్చే పాటా? It was a teenage wedding and ..

  6. ఏం కోఇన్సిడెన్స్…
    మొన్నే ఈ సినిమా చూసా నేను. దీని గురించి రాసే టపా మధ్యలో ఉంది. శ్రమ తగ్గించారు 🙂
    ఈ సినిమా ని నేను ముందుకీ వెనక్కీ డ్రాగ్ చేస్తూ చూడాల్సొచ్చింది అక్కడక్కడా కంటిన్యువిటీ కోసం. మీరు చెప్పిన తరువాత ఇదో టెక్నిక్ అని అర్థమయ్యింది.
    ఎక్సలెంట్ అనిపించలేదు కానీ డైలాగ్స్ మాత్రం నచ్చాయి నాకు. కొత్త పాళీ గారన్నట్టు మొరటు డైలాగులుంటాయి. బూతులు ప్రవహిస్తాయి. అదీ కాకా స్టార్ కాస్ట్ నిజంఘా స్టార్సే. జాన్ ట్రవోల్టా, బ్రూస్ విల్లిస్, ఉమా థర్మన్…
    ఇంకా బైబిల్ లోంచి ఆ ప్రోస్ రిసైటల్ సమయంలో జూల్స్ ముఖంలో భావాలు కూడా నచ్చాయి.

  7. కొత్తపాళీ గారూ మీరన్నది ముమ్మాటికీ నిజం. ఈ వ్యాసం అంత బాగో లేదు. కొంచెం ఊకదంపుడే!ఎందుకో తెలియదు గానీ ఈ వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పటినుండి అన్నీ గండాలే. చాలా చెప్పాలనుకున్నను కానీ పెద్దగా ఏమీ చెప్పకుండానే ముగించాల్సి వచ్చింది. నిజానికి నేను పొద్దు వాళ్ళకి మొదట పంపిన వ్యాసం చూసుంటే మీకు తెలిసుండేది. అది మరీ ఘోరం. ఇది కొంచెం మేలు. ఈ సారికి క్షమించండి. వచ్చే నెల కొత్త వ్యాసం అయినా ఒళ్ళు దగ్గరపెట్టుకుని రాస్తాను.

  8. Giri says:

    వెంకట్,
    బావుంది.

    పల్ప్ ఫిక్షన్ నాకు అమితంగా నచ్చిన సినిమాలల్లో ఒకటి. ఇది చడవగానే నాకు ఇందులో నచ్చిన సన్నివేసాల గురించి ఇక్కడ రాసాను. వీలు దొరికినప్పుడు చదువు.
    గిరి

  9. గోపీ చంద్ says:

    మణిరత్నం యువ సినిమా చూడండి. అలానే వుంటుంది.

  10. venkat says:

    గోపీచంద్ యువ సినిమా “Amores Perros” అనే స్పానిష్ సినిమా నుంచి కాపీ. కథ కాదు కథనం.

  11. simham says:

    thank you for the technical information behind the pulp fiction movie.
    it is one of my favourat movies.
    samuels speech (dialogues)
    travolta twists (dance)
    thurman thighs (sex appeal)
    {yo man i am trying get the “praasa”}
    ‘watch’ flash back
    Zed’s chopper
    above all the man behind [tarantino]
    i have to go through several paragraphs to find the pulp fiction.(probably u could change the title of this article). seems like boasting up your technical knowledge.but educational.

  12. simham says:

    adirindi Giri.

  13. Giri’s and your reviews complement each other perfectly!

  14. Manjula says:

    I love this movie too. I have the DVD. Some of the humor in the movie is very californian. I’ll probably blog about this, sometime.

Comments are closed.