ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎయిర్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్ళే విమానం మీద Andhra Pradesh అని రాస్తారు. విమానం లోపల కూడా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యాటక స్థలాల ఛాయాచిత్రాలూ సమాచార పొత్తాలూ (booklets) లభ్యమౌతాయి. మన రాష్ట్రాన్ని సందర్శించడానికి విదేశీయులు (విరాష్ట్రీయులైన భారతీయులు కూడా) దీని మూలంగా ఉత్సుకత చూపుతారని మన ప్రభుత్వం ఆశిస్తోంది.
ప్రచారపర్వంలో ఇదో కొత్త పోకడ (trend) : ఇదో కొత్త చిట్కా (technique). సందేహం లేదు. కాని పర్యాటకమంటే కేవలం స్థలాల సందర్శనేనా ? మఱింకేమీ కాదా ? అయినా తెల్లవాళ్ళని ఆకర్షించేంత ప్రత్యేక ప్రదేశాలూ, వేరే రాష్ట్రాల్లోను దేశాల్లోను లేనంత విశిష్ట స్థలాలూ మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి, ఎంత ప్రచారం చేసుకున్నా ? అని సామాన్య మానవుడి సందేహం. మన పర్యాటక శాఖ ప్రచురించే సమాచార పొత్తాలు (booklets) గాని మీరు చూస్తే వాళ్ళు మన తెలుగు మెట్రో (హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి )లకు మాత్రమే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని గమనిస్తారు. మిగతా ప్రదేశాల్ని ఒక బొమ్మతోను ఒక గద్య (పేరాగ్రాఫ్) తోను సరిపెడతారు.
విదేశీ పర్యాటకులు ఇక్కడికొచ్చేది కేవలం మన కట్టడాల్ని చూసి మురిసిపోవడానికే నని ఎందుకనుకుంటున్నారో తెలియదు. వాస్తవం చెప్పాలంటే యుద్ధాల వల్ల కావచ్చు, మనవాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, మన పురావస్తు కట్టడాలు చాలావరకు అదృశ్యమయ్యాయి. ఉన్న ఆ కొన్ని కూడా సంపూర్ణ శిథిలావస్థకు చేరుకున్నాయి. యూరప్‌లో చాలా మధ్యయుగాల నాటి భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సంరక్షించబడుతూ ఉన్న కారణం చేత అవి మన కొత్త భవనాల కన్నా కూడా లెస్సగా బావున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసిన కళ్ళతో విదేశీయులు మనవాటిని చూడ్డం మనకు సిగ్గుచేటే తప్ప గౌరవప్రదం కాదు. అదీ గాక, వాళ్ళ నగరాల్నే మనం అనుకరిస్తూ భవనాల్నీ వీధుల్నీ రూపొందించుకుంటున్నప్పుడు వాళ్ళు మన హైదరాబాదునీ విశాఖనీ చూసి “హుర్రే” అనుకునేందుకేముంది ?
మన దేశం పట్ల ఎక్కువమంది విదేశీయులకున్న ఆకర్షణ వేరే కోణంలో ప్రసరిస్తుంది. వారిలో ఎక్కువమంది ఇండియాని చైనాతో కలిపి ద్వంద్వసమాసం చేస్తారు. అందుచేత చైనాకున్నంత ప్రాచీన నాగరికత ఇండియాక్కూడా ఉందని అందుచేత ఇండియాని కూడా ఒకసారి సందర్శించాలని వారిలో కొందరనుకుంటారు. కాని వారు ఇక్కడికొచ్చాక ఆ ప్రాచీన నాగరికత ఏమీ కనపడదు. మన గ్రామాలు కూడా నగరాలకున్న సౌకర్యాలతోను అలాంటి వేషభాషలతోనే విరాజిల్లుతున్నాయి గనుక. మన నగరాల్లో అవే కార్లు, అవే భవనాలు, అదే ఇంగ్లీషు, అవే రోడ్లు – తమ పర్యాటకంలో తాము నేర్చుకోదగిందేదీ వారికి కనపడదు. మీరు కుతూహలంతో వారిలో ఒకరిని పట్టుకుని “ఎలా ఉంది ఇండియా ?” అని అడిగితే “ఇండియానా ? ఓ, చాలా బావుంది. ఈమధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందింది” అనేస్తాడు ఆ తెల్లవాడు, ఇంకేమనాలో అర్థంకాక. మనం దిగంబరంగా గంతులెయ్యడానికి ఆ మాత్రం మెచ్చుకోలు ఒకటి చాలు.
[రెండు ఏటికొప్పాక బొమ్మలు ఫోటో: కడియాల కిషోర్ గారు (http://www.fullhyd.com)] |
మన దేశాన్ని ఇతరులు చూడరావాలంటే మన దగ్గర ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అదృష్టవశాత్తు మనకు అలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. మనదంటూ మనకో వాస్తు శిల్ప కళ ఉంది. మన సొంత వేషభాషలున్నాయి. మన సొంత మతం ఉంది. మన సొంత వైద్యశాస్త్రముంది. మనవంటూ ఎన్నో విద్వత్‌కళలూ జానపద కళలూ ఉన్నాయి. చాలా దేశాల్లాగా అమెరికాకి ఎనిమిదో నెంబరు కార్బన్ కాపీగా బతికే అవసరం మనకు లేదు. మన కళల్ని మనం కాపాడుకుంటేనే మన పర్యాటక రంగానిక్కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాని మనం విపరీత ధోరణిలో వెళుతున్నామనిపిస్తోంది.
మన సంస్కృతే మనకు అన్నం పెడుతుంది : కళలూ, మతమూ కూడు పెడతాయా ? గుడ్డ పెడతాయా ? అని అడిగేవారున్నారు. సంస్కృతిని వంటవండే మైక్రో ఓవెన్ లా భావించడం సరైన దృక్పథం కాదు. సంస్కృతి అనేది వేలాది సంవత్సరాల జీవితానుభవంతో పరస్పర విరుద్ధ అవసరాల్ని పరిణతితో సమన్వయించుకుంటూ బ్రతకగలిగిన ఒక జీవన కళ. సంస్కృతిని వదిలిపెడితే తెలివితేటలు వికసించవు. మన దేశంలో కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చిన ప్రాంతాలూ వర్గాలూ అనాదిగా మంచి సంస్కృతి గలవి. మన సంస్కృతి విశిష్టమైనదైనప్పుడు దానికి తప్పకుండా ఏదో ఒకరోజు అంతర్జాతీయ విపణి (interational market) ఏర్పడుతుంది.
సంస్కృతి మనందరిదీ : సంస్కృతి అంటే కేవలం పండితలోకపు అభిరుచులకు సంబంధించినదనే అపోహ ఒకటి ప్రబలింది. మన దేశంలో తమదంటూ ఒక ప్రత్యేక సంస్కృతి లేని వర్గమే లేదు. సంస్కృతి అంటె బాపు, విశ్వనాథ్,జంధ్యాల సినిమాలు మాత్రమే కావు. మన రాష్ట్రంలో తెలుగు కావ్య ప్రబంధాలకు భిన్నమైన జానపద గేయ ఇతిహాసాలున్నాయి. కాటమరాజు కథ, పల్నాటి వీరగాథ, దేశింగురాజు కథ, సన్యాసమ్మ కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఇవే మన ప్రజావేదాలు. ఇవే మన శ్రుతులు. ఇవి జనం నోట్లో శతాబ్దాలుగా నానుతూ మనదాకా వచ్చాయి. వీటిని పాడే పద్ధతులున్నాయి. అవి కర్ణాటక సంగీతంకంటే భిన్నమైనవి. వీటిల్లో కాటమరాజు కథ చాలా పెద్దది. అచ్చువేస్తే వెయ్యి పుటలవుతుంది. ఇది యాదవుల కుల-ఇతిహాసం. ఇప్పుడు దీన్ని పాడేవారే కరువయ్యారు.
అతిడబ్బు కళకు శత్రువు : ఎప్పుడైనా సరే, పేదవారే సంస్కృతినిర్మాతలు. ధనికులు కొత్త నాగరికతని కొత్త సాంకేతికత ద్వారా పరిచయం చెయ్యగలరు. కాని సంస్కృతిని మాత్రం నిర్మించజాలరు. మహా అయితే తమ ధనబలంతో ఉన్న సంస్కృతికి కొంతవరకు కాపలాకాయగలరు. కుటుంబం, బాధ్యత,వారసత్వం, ప్రేమ, నీతి, కృతజ్ఞత మొదలైన విలువలన్నీ పేదరికంలోంచే పుడతాయి. ఆ విధంగా సంస్కృతి కిందినుంచి పైకి ప్రవహిస్తుంది. నాగరికత పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. ఈ రోజుల్లో అయినా పేద మేస్త్రీల మురికి చేతుల్లోని పనితనమే ధనికుల ఇళ్ళకు సొగసులు దిద్ది వారి హోదాని ప్రకాశింపజేస్తోంది. పేద కళాకారులు వేసిన/చేసిన బొమ్మల్ని గోడలకు తగిలించుకుని ఊహల ఉయ్యాలలో తేలుతున్నారు ధనికులు. ఆ ఊహలు వారివికావు, వాటిని చేసిన/వేసిన పేదవాడివి.
[బుర్రకథ – వికిపీడియా నుంచి] |
యక్షగానాలూ, తోలుబొమ్మలాటలూ, కలంకారీ అద్దకాలూ, కొండపల్లి బొమ్మలూ,హరికథలూ ఏటికొప్పాక బొమ్మలూ ధింసా నృత్యాలూ, మొదలైన కళారూపాలు క్రమంగా నశిస్తూండడానికి అనేక కారణాలున్నాయి. వీటిల్లో ప్రధానమైనది బాధ్యతా రహితమైన విద్యావిధానం. అందరూ చదువుకోవాలి. బాగానే ఉంది. కాని ఆ చదువులో మనపట్ల మనకు గౌరవం కలిగించే అంశాలేవీ లేవు. పనికొచ్చే చదువు పేరుతో కెరీర్ అంటూ కేవలం డబ్బువిలువల్ని నేర్పిస్తున్నారు. ఆయా కళారూపాల మీద ఆధారపడి జీవనం సాగించే కులాలున్నాయి. చదువుకున్నవారితో పోల్చుకుంటే తమ కళ తమకే అవమానకరంగా తోస్తోంది వారికి. వారికి ఆ భావన కలక్కుండా చూడ్డంకోసం మనమేమీ ప్రయత్నిచలేదు. వారి పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఇంగ్లీషు చదువులకు వెళుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వమే వారిని బలవంతంగా చేరుస్తోంది. తమ కుటుంబకళ తమకు పట్టుబడే అవకాశం పోతోంది.
సంస్కృత నాటకాల కంటే భిన్నమైన వీథినాటకమనే ప్రక్రియ తెలుగువారిలో ఉంది. అది దాదాపుగా మరుగున పడింది. ఎన్.టి.రామారావుగారు జీవించి ఉన్న కాలంలో రాజకీయ సభల ద్వారా ఇలాంటి ప్రదర్శనాత్మక కళల (performing arts) కి ప్రాచుర్యం కలిగించాలని ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలు ఆయనతోనే ఆగిపోయాయి.
మన కళలు ఉపయోగం లేక చనిపోవడంలేదు. ఉపయోగించుకోకపోవడం చేత చనిపోతున్నాయి. మనం దేన్నీ ఉపయోగించుకోకుండా ప్రతి విషయానికీ ఒక “dead brand” కొట్టి చేతులు దులుపుకుంటున్నాం. ఇంగ్లీషు చదువులమోజులో మన సాంస్కృతిక పరిజ్ఞానం అష్ట వంకర్లు తిరుగుతోంది. కళలు వర్ధిల్లాలి. కళాకారులు మాత్రం నశించాలి. భాష వర్ధిల్లాలి. భాషాపండితులు మాత్రం నశించాలి. మతం, తత్వశాస్త్రం బతకాలి. మతగురువులు మాత్రం నశించాలి. ఇలాంటి ఒక విచిత్రమైన ఆలోచనా ధోరణిలో మనం జీవిస్తున్నాం. అయా సాంస్కృతికాంశాలు బతికి బట్ట కట్టాలంటే వాటిని నమ్ముకున్నవాళ్ళకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించక తప్పదని మర్చిపోతున్నాం. అందరూ మనలాగే ఇంగ్లీషు చదవాలని ఆశించడం చాలా తప్పు, ప్రమాదకరం కూడా !
[కొండపల్లి బొమ్మల కొలువు – ఫోటో: కడియాల కిషోర్ గారు (http://www.fullhyd.com).] |
ఒక కార్యాచరణ ప్రణాళిక : మన కళల్ని ప్రోత్సహించడం కోసం ప్రస్తుతం కొన్ని ప్రభుత్వసంస్థలు లేకపోలేదు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల్ని విస్తృతంగా అమ్మిపెట్టడం కోసం హస్తకళల అభివృద్ధి సంస్థ ఒకటి ఉంది. ప్రదర్శనాత్మక కళలు (performing arts) నేర్పడం కోసం ప్రతి విశ్వవిద్యాలయంలోను ఒక విభాగం ఉంది. కాని ఇవి సరిపోవు. ఈ ఏర్పాట్లు కళని కొనవూపిరితో బతకనివ్వడానికి మాత్రమే తోడ్పడతాయి. ఉదాహరణకు, హస్తకళల సంస్థ కళాకారులకు ఇచ్చేదెంతో తెలీదు కాని ఒక్కొక్క బొమ్మ మీద తాను మాత్రం వందలూ వేలూ సంపాదించుకుంటోంది. అందుకే లేపాక్షి షోరూముల ఉత్పత్తులు కొందరు ధనికుల సౌధాల్లో మత్రమే మనకు దర్శనమిస్తాయి. అవి కొంచెం చౌకగా లభించి అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజు కళాకారులే ధనికులవుతారు. అప్పుడు వారికి మనమిచ్చే చంకకఱ్ఱలతో పని ఉండదు.
కళల్ని సోమరితనానికి చిహ్నంగా భావించే ఔరంగజేబులు ఇప్పటికీ ఉన్నారు. కళలు కష్టజీవనానికి మరో పార్శ్వం మాత్రమే. ఒక వృత్తిని అవిచ్ఛిన్నంగా చేస్తూచేస్తూ ఉండగా అలవడిన నైపుణ్యం ఫలితంగా కళ ఉద్భవిస్తుది. కమ్మరులూ, కుమ్మరులూ, వడ్రంగులూ, సాలీలూ, కంసాలులూ – వీరందరూ ఏకకాలంలో వృత్తికారులూ, కళాకారులూ కూడా ! అయితే వృత్తి చెయ్యాలంటే అందుకు వలసిన ముడిసరుకు ప్రకృతివనర్ల ద్వారా రావాలి. మన కళాకారులకు ముడిసరుకులు అందించే వనర్లు ధనికవర్గాల దోపిడీకి గురవుతున్నాయి. కొండపల్లి బొమ్మలు చెయ్యడానికి అవసరమైన చెక్క దొరకడం ఇప్పుడు కష్టమౌతోంది. కారణం-కొండపల్లి సమీప ప్రాంతాల అడవుల్ని విచక్షణా రహితంగా కొట్టివెయ్యడం. మన కళల్ని కాపాడుకోవాలంటే మన పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే సంస్కృతి నేరుగా ప్రకృతి బిడ్డ.
మరీ ప్రమాదంలో పడ్డ కళల్ని బళ్ళలోను కళాశాలల్లోను drawing class లాంటివాటిల్లో నిర్బంధ ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టి సార్వజనీకరించాలి. క్రీడలతో పాటు కళను సైతం పై తరగతులకూ ఉద్యోగాలకూ అదనపు అర్హతగా పరిగణించాలి.
ప్రతి కళకూ జిల్లా స్థాయిలోఒక అకాడమీని ఏర్పరచి తగినన్ని నిధులు కేటాయించాలి. అందులో జిల్లాలోని కళాకారులందరూ సభ్యులుగా ఉండాలి. కళాప్రదర్శన/ఉత్పత్తి దగ్గరి నుంచి అమ్మకాలు వేతనాలు, పింఛన్లు, ఇళ్ళ స్థలాలు, శిక్షణా కార్యక్రమాలూ – అన్నీ ఆ అకాడెమీయే చూసుకోవాలి. కళాకారుల పిల్లలు కళను అభ్యసించడం తప్పనిసరి చెయ్యాలి. వీలయితే అందుకొక ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి.
(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)
యథాప్రకారం బా.సు. గారు పదునైన వ్యాసం అందించారు. సంస్కృతికిచ్చిన నిర్వచనం, కళారూపాలను పరిరక్షించడానికి సలహాలు బాగున్నాయి. ఆళ్ళగడ్డ వర్గపోరాటాలకే కాక, శిల్పకళకి కూడా పెట్టింది పేరు. దేవాలయాల్లో మనం చూసే దేవతామూర్తులు, తోరణాలు, నాయకుల విగ్రహాలు- ఇలా అనేక శిల్పాల తయారీలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. ఈవిద్య నేర్చుకోవాలంటే కనీసం 12 ఏళ్ళ శిక్షణ అవసరం. 10-12 ఏళ్ళ పిల్లలుగా మొదలెడితే యుక్తవయసోచ్చేసరికి శిల్పిగా రాణించవచ్చు. ఇక్కడ శిక్షణనిచ్చే కొందరి మీద ప్రభుత్వాధికారులు బాలకార్మికచట్టం కింద కేసులు పెట్టారు. పిల్లికీ, పిడుక్కీ ఒకటే మంత్రమా? కనీసం కళాకారులమీద గౌరవం, వారి సంజాయిషీమీద నమ్మకం చూపిస్తే బాగుండుననిపించింది. కేసులు పెట్టక పోతే లంచాలుతీసుకుని ఊరుకున్నారని రాజకీయం అవ్వచ్చని భయం వల్లనేమో అలా చేసారు. చట్టంలోనే వెసులుబాటు కల్పించడం ఉత్తమం.
mana samskruti gurinchi, kalala Aavirbhavam gurinchi, kalalu batiki batta kattalante kalakarulanu proschahinchalsina Avasaram gurinchi chala chakkaga raasaru. Pedavari kalatmakata kevalam Dhanikula Illaku sobagulu addutunnayi, prabhutwam drara prasturam jarugutunna krushi praceena kalalu kona oopirito bratakadanike saripotunnayanna rachayita maatallo, yento ardhame kaadu, avedana, samajiki spruha unnayi, Rachayitaku Abhinandanalu.
chala goppa vishyaalu chepparu, raajakiyalloki medhavulu raakapovadam, professional n corrupted politics kaaranam, abhinandanalatho,
కళకున్న ప్రాధాన్యతను, కళాకారుల జీవనాన్ని గురించి మీరు తెలిపిన విషయాలు మావంటి పరిశొధక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి వ్యాసాన్ని పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
meelanti vaalu raajakiyyalloki raavaali,leda medavullara votu veyadamu marachi pokandi, ivi paatinchaledo salahaalu raayadam maanukondi.
Ba su. garu,
mee vyaasam chala alochimpa chese vidham ga undi, nijamga ee roojulloni kalakaarula jeevitalaku addam padutundi, mana kalalu upayoginchaka povadam valle chanipotunnayani meeru rasina vyakhya chala bagundi, nijamga kala karulu unnata sthitilo gouravimpabadina rojune kalalu bratkutayi, kalakarulni vismarinchi enta krushi chesina kalalaki jeevam poyalemu.
mee blog ki dhanya vadalu
ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లో రాసినవన్నీ బ్లాగులు కావని అందరూ గమనించాలి. సంపాదకత్వం వహిస్తున్న వెబ్ పత్రికల్లో పడేవన్నీ వ్యాసాలే. ఎవరికి వారుగా తమ భావాలను (ఎవరూ అడగకపోయినా, రచనను సవరించకపోయినా) ప్రకటించేవే బ్లాగ్ అనిపించుకుంటాయి. బ్లాగ్ అనేదానికి నిర్వచనం ఇది.
Blog: an online diary; a personal chronological log of thoughts published on a Web page; also called Weblog, Web log
అందుచేత పొద్దువంటి సైట్లలో పడే వ్యాసాలని బ్లాగ్‌లు అని వ్యవహరించడం తప్పు.
ఎందుకంటే వాటన్నిటినీ ఒక సంపాదకవర్గం పరిశీలించి ప్రచురణకు ఎంపిక చేసింది కనక. వీటితో పోలిస్తే ఎవరికి తోచినట్టుగా వారు రాసుకోగలిగిన బ్లాగులు తక్కువరకమే. (ఎంపిక చేసినవన్నీ గొప్పవని కాని, చెయ్యనివన్నీ చెత్తవని కాని నా అభిప్రాయం కానేకాదు). ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్న పద్ధతిలో కాకుండా రచయితకు సంబంధించని ఇతరులు ఎంపిక చెయ్యడంలో కొంత నిష్పక్షపాత వైఖరి ఉండే అవకాశం ఎక్కువ. కాయితం మీద అచ్చు కానంత మాత్రాన వ్యాసం వ్యాసం కాకుండా పోదు. బ్లాగ్ అంటే నాలెక్కన పర్సనల్ డైరీలో రాసుకునే ఎంట్రీ వంటిదే.