కడప కథ

– త్రివిక్రమ్

కడప జిల్లాలో మొట్టమొదటి కథారచయిత భారతం నాదమునిరాజు. ఆయన 1956 లో రాసిన నీలవేణి నుంచి 2006 వరకు యాభయ్యేళ్ళ కాలంలో 55 కు మించిన కథారచయితలు రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన 46 కథల సంకలనం కడప కథ. కడప జిల్లాలో కథాసాహిత్యం గురించి 1992లో కేతు విశ్వనాథరెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం వీటికి అదనం. ఐతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పదైదేండ్లలో వచ్చిన కథల గురించి కూడా రాయించి ఉన్నట్లైతే సమగ్ర విశ్లేషణకు అవకాశముండేది.

ఇక కథల విషయానికొస్తే,ఈ 47 కథల్లో తొలి 34 సంవత్సరాల (1956 -1989 మధ్య) కాలానికి చెందినవి 14 మాత్రమే ఉండగా మిగిలిన 33 కథలు తర్వాతి 16 సంవత్సరాల (1990-2006 మధ్య) కాలానికి చెందినవి. అంటే గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో కడప జిల్లాలో కొత్త రచయితలు ఎక్కువ మంది కలం పట్టడమో, సీనియర్ రచయితలు మరింత ఉత్సాహంతో కథలు రాయడమో జరిగిందన్నమాట. మొదటి వర్గంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్, వేంపల్లి గంగాధర్ లాంటివాళ్ళుండగా చక్రవేణు, దాదా హయత్, సొదుం జయరాం, పి. రామకృష్ణారెడ్డి (తులసీకృష్ణ), మొదలైనవారు రెండవ వర్గం.

వంశీకృష్ణ అన్నట్లు ఈ సంకలనంలో “అంతర్లీనంగా కనిపించేది ఒకే ఒక అంశం. అది భూమికీ, మనిషికీ, పశువుకీ మధ్య, ఇతరేతర సామాజిక, రాజకీయ అంశాలకీ మధ్య స్పష్టాస్పష్టంగా, విడదీసీ విడదీయరాని విధంగా కనిపించే బంధాన్నీ, దాన్ని నిలుపుకోవడంలో ఎదురయ్యే అనేకానేకాంశాల పట్ల పెంపొందించుకోవలసిన అవగాహన గురించిన సమ్యక్ పరిశీలన.”

అందులోనూ ప్రత్యేకించి కడప అనగానే గుర్తొచ్చేవి కరువు, కక్షలు, కువైట్ (బతుకుతెరువు కోసం కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ). అందుకు తగినట్లే ఈ సంకలనంలో కరువు యొక్క భిన్నపార్శ్వాలను చూపే కథలు అలికిడి (శశిశ్రీ), జీపొచ్చింది (వేంపల్లి షరీఫ్), కడుపాత్రం (తవ్వా ఓబుల్ రెడ్డి రాసిన ఈ కథ సన్నపురెడ్డి నవలిక తోలుబొమ్మలాట కు మాతృక), జీవసమాధి (ఇబ్రహీం), కొత్తచిగురు (దేవిరెడ్డి వెంకటరెడ్డి), కరువురాగం (సొదుం రమణ); కక్షలకు సంబంధించి కూలిన బురుజు (కేతు విశ్వనాథరెడ్డి), చుక్క పొడిచింది (పాలగిరి విశ్వప్రసాద్), చంద్రగ్రహణం (నాగులారపు విజయసారథి), సింహము-కుక్క-పులి (చెరువు అనంతకృష్ణశర్మ), గాయం (రాధేయ); కువైట్ కథలు కువైట్ సావిత్రమ్మ (చక్రవేణు), మున్నీ బేగం (ఎన్.ఎస్.ఖలందర్), చీకటి సవ్వడి (డి.రామచంద్రరాజు), మొదలైనవి ఉన్నాయి.

ఈ సంకలనంలోని మొదటి కథ “నీలవేణి”లో కథకుడు ఒక రచయిత. అతడు నీలవేణి అనే ఒక యువతి గురించి కథ రాయడానికి కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఐతే విద్యావంతురాలైన ఈ నీలవేణి కథకుడనుకున్నట్లు బేల కాదు. ఆమె తెలివితేటలకేం కొదవలేదు. తేడా వస్తే ‘ఎవరినైనా’ నిలదీసి ముక్కుమీద పిడికిలి ఝాడించే రకం.

అంతేకాదు, ఆమె మంచి మాటకారి కూడా. చిన్నప్పుడు మత్తుపదార్థాలకే మాత్రం తీసిపోని చౌకబారు పుస్తకాలు విపరీతంగా చదివినమ్మాయే కానీ వయసొచ్చాక వాస్తవపరిస్థితులను ఆకళింపు చేసుకుని, తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుంది. ఉద్యోగం సంపాదించుకుని తనకు నచ్చినవాణ్ణే చేసుకుంది. ఐతే ఆ విషయాలేవీ తెలుసుకోకుండా ‘అలవికాని ఆశల్ని రేపుకుని జీవితంలో నికరంగా ఓడిపోయిన నీలవేణి’ కథ రాస్తూ, ‘స్త్రీపాత్ర కాబట్టి’ ఆమె మీద సానుభూతి కనబరచడం, సానుభూతి చిహ్నంగా ఆమెను చంపడం తన కర్తవ్యంగానే గాక అదొక ఫ్యాషన్ కూడా అని భావించి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడమా లేక పిచ్చిదాన్ని చేసి రాళ్ళు రువ్వించి చంపడమా అని ఆలోచిస్తున్న కథకుడికి ఆమె ధోరణి మింగుడుపడదు. ‘ఇది మీకు ధర్మమేనా మాష్టారూ?’ అని స్వయంగా ఆ నీలవేణే కట్టెదుటికి వచ్చిఅడిగినా “విద్యావివేకాలుండి కూడా వెర్రితలలు వేసేవారు, వంచింపబడి ఆత్మహత్యలకు దిగేవారు విద్యావంతులైన స్త్రీలలో లేరా?” అని ఎదురుప్రశ్నిస్తాడు. దానికామె “ఎవరో కొందరలాంటివారున్నారని స్త్రీజనోద్ధరణ అనే గోచర్మాల్ని కప్పుకుని ‘నస్త్రీ స్వాతంత్ర్యమర్హసీ’ అని గర్జించవయ్యా! పోయిందేముంది?” అని యెద్దేవా చేసి జవాబునాశించకుండా వెళ్ళిపోతుంది నీలవేణి. కడప జిల్లాలో కథాసాహిత్యం ఆలస్యంగానే ఐనా సాహిత్య ప్రయోజనమేమిటో సూచిస్తూ, ఎలాంటి సాహిత్యం రావలసిన అవసరముందో దిశానిర్దేశం చేసే నీలవేణితో మొదలై అతి త్వరలోనే శిఖరాగ్రస్థాయినందుకుంది.

నీలవేణి ప్రేరణతోనేనా అన్నట్లు ఈ సంకలనంలోనే ఉన్న ‘యంత్రం’ (రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని) కథలో ఒక వంచితురాలు అధైర్యపడిపోకుండా తనలాగ ముళ్లకంచెలో ఇరుక్కుని విలవిలలాడుతున్న అభాగినులకు చేయూతనివ్వడానికి నిశ్చయించుకుంటుంది.

‘కాలచక్రం’ (రచయిత డి.లక్ష్మీకరరాజు) కథలో ఒకప్పుడు దొంగతనం చెయ్యడాన్ని చీత్కరించుకున్నవాడే మారిన పరిస్థితుల్లో గత్యంతరం లేక దొంగతనం చేయబోయి పట్టుబడి పోలీసు కస్టడీలో ఇలా తర్కించుకుంటాడు: “ఆకలిగొన్న కడుపుకు అన్నం పెట్టనివారేనా తనను చితకబాదింది? తనలాగ వారికి ఆకలి వేస్తే దోపిడీ దొంగలను మించి దోపిడీ చేసేవారేనేమో?” ఈ ఆలోచనల్లో నుంచి “కష్టాల్లో గానీ మనిషి నిజస్వరూపం బయటపడదు.” అని తెలుసుకుంటాడు.

దీని తర్వాతిది రాచమల్లు రామచంద్రారెడ్డి ‘నీతిగానుగ’ కథ. తనకు ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్ళికి రెండు గంటలు ముందు జరిగిన పరిణామాల్లో పెళ్ళికూతురు కాసేపు కనిపించకుండా పోయి తిరిగిరావడం, ఆ సమయంలో పెళ్ళికొడుకు అక్క అక్కడికెళ్ళడం, దాని ఫలితంగా కట్నం ఎవరూ అడక్కుండానే అప్పటికప్పుడు రెండువేలు పెరగడం, చివరి నిమిషాల్లో కట్నం ఎక్కువిస్తామని ఎందుకు అంటున్నారో, అసలేం జరిగిందో తెలియని అయోమయంలో పెళ్ళి కొడుకు, అతడికి అసలు విషయం తెలియనివ్వకుండా పెళ్ళి జరిగేలా చూసేందుకు అతడి అక్క, నాన్న పడే ఆరాటం, ఫలితంగా జరగరానిదేదో జరిగిందని ఊహించి, ఈ పెళ్లితో తన పరువు మొత్తం గంగపాలైందని ఏడుచుకుంటూనే పెళ్ళి చేసుకుని, అసలేం జరిగిందో తెలియకపోయినా శోభనం రాత్రి భార్యతో డాంబికంగా “నువ్వు చెయ్యరాని తప్పు చేసినావు. ఐనా నిన్ను ఉదారంగా పెండ్లి చేసుకున్నాను.” అనే పెళ్ళికొడుకు, తన ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అప్పటికే తీర్మానించుకున్న పెళ్లి కూతురు.

స్థూలంగా ఇదీ కథ. ఈ కథ మధ్యమధ్యలో చైతన్యస్రవంతి ధోరణిలో నడుస్తుంది. తన సాహితీజీవితంలో శిల్పానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినవాడు రారా. ఐతే చక్కటి కథనసామర్థ్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా, కథలోని పాత్రలన్నిటి చేత నీతి’గానుగాడించిన’ ఈ కథ రాసేటప్పుడు మాత్రం శిల్పాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనబడదు.

ఇక సొదుం గోవింద రెడ్డి రాసిన “ప్రేమ” అనే అద్భుతమైన రెండు పేజీల కథలో ఒక పెద్దమనిషి ప్రేమ అనేది సిరిసంపదలు కలవారి సొత్తేనని (‘దీనురాండ్రను ప్రేమించడానికి తమబోంట్లకు తాహతుంది’), అవి లేనివారు ప్రేమను ప్రకటిస్తే అది ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించేనని (‘ఉత్తినే ప్రేమ ఒలకబోసుకునేందుకు దానికేమంత సిరిసంపదలు కారిపోతున్నాయని!’) భావించి దారుణంగా దెబ్బతింటాడు. (‘దయ, ప్రేమ, కరుణ – అనే గుణాలు అటు వైపు నుంచి రావడం మంచిది కాదు!’ అని తీర్మానిస్తాడు కానీ వాటిని ఎలా అడ్డుకోవాలో అతడికి తోచదు.)

ఇది పేదవారి ప్రేమకు సంబంధించిన కథైతే పేదవారి నిజాయితీకి సంబంధించిన కథ ‘జవాబులేని ప్రశ్న’ (టి.వి.బ్రహ్మం). ఆసుపత్రిలో ఉన్న తన మనవడికి జబ్బుగా ఉందని, మందుకు సరిపోయేంత డబ్బులేదని, రెండురోజుల్లో తెచ్చిస్తానని, ప్రస్తుతానికి మందిమ్మని తన మందుల షాపుకు వచ్చి వేడుకున్న ముసలామె ముక్కూ మొహం ఎరక్కపోయినా నమ్మి మందులిస్తాడు కిషన్ కుమార్. ఐతే మందు తీసుకెళ్ళి పదిరోజులైనా ఆమె తిరిగిరాదు. ఇక రాదని నిరాశ చేసుకున్న తర్వాత ఒక రోజు డబ్బివ్వడానికే వస్తుంది ఆమె. అన్నిరోజులూ ఎందుకు రాలేదో తెలుసుకున్న తర్వాత ఆమె గుర్తుపెట్టుకుని తిరిగొచ్చినందుకు కిషన్ కళ్ళలోనే కాదు పాఠకుల కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయి.

‘గట్టిగింజలు’ కథారచయితగా ప్రసిద్ధుడైన వై.సి.వి.రెడ్డి రాసిన ‘దొంగబర్రెగొడ్లు’ దీని తర్వాతి కథ. చిన్న, సన్నకారు రైతులు పండించే పంటకు బర్రెగొడ్లను మించిన ముప్పు ఎవరివల్ల కలుగుతుందో తేటతెల్లం చేస్తుంది.

పాఠకుల మనసులను కదిలించేలా మోహ్న రాసిన “రాముల వారి గుడి ముందు” కథ ఇంతకుముందు సీమకథలు సంకలనంలో కూడా వచ్చింది. ఆదెన్న అనే చాకలి రంగారెడ్డి దగ్గర నూర్రూపాయలకు చిల్లర తెచ్చుకుంటాడు. ఆ నోటును మడిచి జోబీలో పెట్టుకున్న రంగారెడ్డి ఆ విషయం మర్చిపోయి ఆదెన్న నోటివ్వలేదని ఫిర్యాదుచేస్తే, ఊళ్ళోని పెద్దలు కలిసి ఆదెన్న చెప్పేది వినిపించుకోకుండా “వాడు సెప్పేదేంది? రంగారెడ్డేం నూర్రూపాయల కాడ యింతమందిలో అపద్ధం సెప్తాడా? రంగారెడ్డి సిల్లరిచ్చి నోటడిగేది మర్చిపోయినాడు. యిదే సందని వీడు సిల్లర తీస్కొనొచ్చి యిప్పుడు యిచ్చినానని తప్పుడుకూతలు కూస్తాండాడు…సొలకాల తెగేట్లు కొడ్తే వాడే వొప్పుకుంటాడు.” అని తీర్మానిస్తారు. అప్పటికీ ఆదెన్న “తప్పు” ఒప్పుకోకపోవడంతో అతణ్ణి “కర్రు దూయమనడం” (మడక్కర్రు ఎర్రగా కాగబెట్టి దేవునిగుడికాడ రెండుసేతుల్తో పట్కోని దుసల్ల. నాను సుల్ల (అబద్ధం) సెప్పింటే నా సేతులు కాల్తాయి. నాను దొంగతనం సేసిండననుకో నా సేతులు కాలవ్), అసలు జరిగిందేమిటో ప్రత్యక్షంగా చూసిన రంగారెడ్డి జీతగాడు తన యజమానురాలి బెదిరింపుకు జడిసి నోరు మెదపలేకపోవడం, ఈ దుర్మార్గాన్నంతటినీ దగ్గరనుంచి చూసినా ఎవురికీ సెప్పను అని దేవున్తోడు ప్రమాణం చేసిన శివు అనే బడిపిల్లాడికి పంచాయతీలో ఆదెన్న మాత్రమే ఎందుకు కర్రు దూసాడో, పెద్దమనుషులు మామనెందుకు కర్రుదూయమని చెప్పలేదో, నిజం చెప్పినా ఆదెన్న చేతులెందుకు కాలాయో అర్థంకాక వొళ్ళుతెలీని జ్వరమొస్తుంది.

కుట్ర కథల రచయితగా ప్రసిద్ధుడైన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి రాసిన ‘ఓబిగాడు’ కథ ప్రత్యేకించి పేర్కొనదగ్గది. ఈ కథ ద్వారా ఈయన సాహితీలోకంలో చిరస్మరణీయుడైనాడు. కేతు చెప్పినట్లు కుసంస్కారం పట్ల వెగటు కలిగించగలిగిన పద్మనాభుడి ప్రాతినిధ్య కథగా నిలచిన ఈ కథలో విషాద, బీభత్స వాతావరణం పఠితలను ఊపిరి సలుపుకోనివ్వకుండా కమ్ముకొస్తుంది.

తెలుగు కథాసాహిత్యంలో ‘కువైట్ సావిత్రమ్మ’, ‘కసాయి కరువు’ లాంటి మాస్టర్ పీస్ లను సృష్టించిన గొప్ప కథకుడు చక్రవేణు. వాటిలో నుంచి కువైట్ సావిత్రమ్మ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కథల్లోనుంచి సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి పొందిన ‘చనుబాలు’ కథ ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి. ఉన్న ఊళ్ళో జీవనాధారం దొరక్క పొట్ట చేతపట్టుకుని కువైట్ తదితర దేశాలకు వెళ్ళేవారి వెతల గురించి మరింత మంది కథారచయితలు దృష్టిపెట్టి కథలు రాయడానికి ప్రేరణగా నిలిచిన కథ కువైట్ సావిత్రమ్మ. ఇక వ్యక్తిగతంగా తాను ఒక దళిత మహిళ చనుబాలు తాగి పెరిగినందుకే తోటివారి ముందు కించపడే ఆ ఊరి ప్రెసిడెంటుకు, దళిత-భూస్వాముల సంబంధాల గురించిన స్వస్వరూపజ్ఞానం కలగడం చనుబాలు కథాంశం. సన్నపురెడ్డి కథల్లో ఇదొక మైలురాయి.

పెన్నేటి కతల రచయితగా ప్రసిద్ధుడైన పి. రామకృష్ణారెడ్డి రాసిన ‘మనిషీ-పశువూ’ మరో గొప్ప కథ. ఈ కథలో రైతుకు-పశువుకు మధ్యనున్న అనుబంధం; రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఈ అనుబంధం వ్యక్తమయ్యే తీరులోని తేడాలే కాకుండా రాయలసీమలో స్థితిమంతులైన రైతు కుటుంబాల్లో సైతం పశువులను ఇంట్లోనే కట్టెయ్యడం, మనుషులు వాటితో సహజీవనం చెయ్యడం, బయటి ప్రాంతాల వాళ్లకు అది అనారోగ్యకారకంగానేగాక అనాగరికంగా అనిపించడం – ఇవేకాకుండా ఇక్కడ ఎవరికీ విడిగా పడగ్గదులు లేకపోవడంలోని వైచిత్రి, ఇబ్బందులను గురించి కూడా వివరంగా, నిష్పాక్షికంగా చర్చిస్తారు రచయిత.

ఇవే కాకుండా ఈతరం వారికి తమ కుటుంబాలను, జీవితాలను ధ్వంసం చేసిందని సేద్యం పైన కసిపెరగడం తట్టుకోలేని మనుషుల్లో భవిష్యత్ రైతాంగంపై, పల్లెలపై భయం గూడుకట్టుకుని ‘కరువురాగం'(సొదుం రమణ) ఆలపిస్తే, నిరుద్యోగుల వెతలను ‘అలకపాన్పు’ (ఎన్.సి.రామసుబ్బారెడ్డి), ‘రెకమెండేషన్’ (మలిశెట్టి జానకీరాం) కథలు రెండుకోణాల్లో ఆవిష్కరిస్తాయి. హాస్యానికో, లేక తమ ప్రత్యేకతలను బట్టో ఏర్పడే మారుపేర్లను అడ్డం పెట్టుకుని “ఒక బక్కోని బతుకుమింద బలవంతులేసిన మచ్చ”ను ఎత్తిచూపే ‘మచ్చ’ (కొమ్మద్ది అరుణారమణ), ముసలితనంలో తమవాళ్లనుంచే ఎదురయ్యే దయనీయమైన సమస్యలను విశదీకరించిన కరుణరసాత్మకమైన కథలు ‘ఈ గుండె కరగదు’ (ముంగర శంకరరాజు), ‘అంతరం’ (బిజివేముల రమణారెడ్డి). భూస్వామ్య భావజాలం ఎంతలోతుగా పాతుకుని ఉందో తెలిపే ‘తొందరపడి ఒక కోడి ముందే కూసింది’ (ఆరవేటి శ్రీనివాసులు), మతసామరస్యాన్ని చాటే కథ ‘మతాతీతం’ (మల్లెమాల వేణుగోపాలరెడ్డి), రాజకీయాల రైల్వేస్టేషన్లో వస్తున్న మార్పులను సూచిస్తూ అసలైన గాంధేయవాదులను లోపలికి రావద్దని హెచ్చరించే ‘రెక్కమాను’ (ఎం.వి.రమణారెడ్డి), అధికారమున్నవాడు అది లేనివాళ్లకు చేసే దుర్మార్గమైన అన్యాయాన్ని కళ్లకు కట్టే ‘ఎల్లువ’ (దాదా హయత్), ఈ ప్రాంతపు ఆచారాలకు, సంస్కృతికి సంబంధించిన కథలు ‘పాడె’ (సొదుం జయరాం), ‘శిలబండి’ ( వేంపల్లి గంగాధర్ & చెన్నా రామ్మూర్తి), ‘జీవసమాధి’ (ఇబ్రహీం), ‘కడుపాత్రం’ (తవ్వా ఓబుల్ రెడ్డి), ఒక భయానకమైన అనుభవాన్ని వివరించే ‘సిన్నిగాడి సికారి’ (బత్తుల ప్రసాద్), ‘వీడా నా కొడుకటంచు..’ అన్న మాటలను గుర్తుకుతెచ్చే ‘కుక్కకు కోపమొచ్చింది’ (రాణీ పులోమజాదేవి), ఒకే ఘటన గురించి మూడు కోణాల నుంచి చెప్పే ‘ఆ ముగ్గురూ!’ (డి.కె.చదువులబాబు), రియల్ ఎస్టేట్ ప్రభంజనంలో కొత్త భవంతుల నిర్మాణం కోసం ఉన్న కొంపలు కూల్చేస్తుంటే వాటితోబాటే కనీస మానవత్వం, అనుబంధాలు కూడా కూలిపోయి నిలువనీడ కోల్పోతున్న వారి కథ ‘కాసింత నీడ’ (ఎస్.పి.మహమూద్), విభిన్న ప్రణయకథ ‘యంగముని వ్యవసాయం’ (డా. ఎన్.రామచంద్ర) – ఇలా గొప్ప వస్తువైవిధ్యంతో అలరారే ఈ కథలన్నీ విలువైనవే. తప్పక చదవాల్సినవే.

ఐతే ఈ కథల్లో లోపాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కేశవగోపాల్ రాసిన ‘సంస్కరణ’ కథలో చెప్పదలచుకున్న విషయం మంచిదే అయినా పార్వతమ్మ కొడుకైన సీతాపతికి గతం తెలియనంతమాత్రాన నీతి, అవినీతి పట్ల అంత కరడుగట్టిన భావాలుండడం, గతం తెలిసినప్పుడు అతడు అంత తీవ్రంగా స్పందించడం అసహజంగా ఉంది.అలాగే ‘పొగ(రు) మంచు’ (కేతు బుచ్చిరెడ్డి) కథ కూడా వాస్తవానికి దూరంగా ఉంది.

కథనంలో గొప్ప చమక్కులున్న కథలు పొగ(రు) మంచు, చమత్కారం ఆధారంగా నడచిన కథలు ‘మావూరి దేవర’ (గుండం రామచంద్రారెడ్డి), ‘మార్జాలోపాఖ్యానం’ (కొమ్మిశెట్టి మోహన్) లాంటివి ఉన్నాయి. ఇవేగాక ‘అబల’ (ఆచార్య పి. నరసింహారెడ్డి) చివరికి నవ్వు తెప్పించినా ఈ సంకలనంలో పూర్తిస్థాయి హాస్యకథలు లేవు.

రారా, కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, చక్రవేణు, దాదా హయత్, పాలగిరి విశ్వప్రసాద్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, లాంటి గొప్ప కథకులు రాసినవాటిలోంచి ఒక్కొక్కటే ఎంచుకోవలసిరావడం ఏ సంకలనకర్తలకైనా కష్టమే. ఐనా కడప జిల్లాకు చెందిన కథా రచయితల గురించి, వారి రచనల గురించి, కడప జిల్లావాసుల జీవితాల గురించి తెలుసుకోవడానికి అద్భుతంగా ఉపకరించే గ్రంథం ఈ కడప కథ. అంతే కాదు, మంచి తెలుగుకథలు చదవాలనుకునేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం కూడా.

ఈ పుస్తకంలో అచ్చుతప్పులు పెద్దగా లేనప్పటికీ మాండలిక పదాలు, పదబంధాలు ఉన్నచోట్ల – యారముట్లను యూరముట్లని, “సంకలు ఎగేస్చండ్రు” అనడాన్ని “వంకలు ఎగేస్చిండ్రు” అని ఉండకుండా – మరింత జాగ్రత్తగా ప్రూఫులు చూసిఉండవలసింది.ఏమైనా ఇంత మంచి కథాసంకలనాన్ని పాఠకులకందించిన సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణకర్త “నందలూరు కథానిలయం ” రాజేంద్రప్రసాద్ అభినందనీయులు.

కడపకథ సంకలనకర్త తవ్వా ఓబుళరెడ్డి కడప.ఇన్ఫో (http://kadapa.info) వెబ్సైటుకు గౌరవ సంపాదకులు. (బ్లాగు: http://kadapainfo.blogspot.com) ఇంటర్నెట్ ప్రభావశీలతను సరిగ్గా గుర్తించిన ఈయన ఇక మీదట ఇలాంటి సంకలనాల్లోగానీ, లేదా దీంట్లోనే “మా మాట”లో చెప్పినట్లు మలికూర్పులో గానీ మరింత సమగ్రత కోసం ఇంటర్నెట్ లో వచ్చే కథలను (ఉదాహరణకు రానారె రాసిన “నత్వం శోచితుమర్హసి”) కూడా పరిగణిస్తారని ఆశించవచ్చు.

ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో లభిస్తుంది. http://kadapa.info ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. లేదా నేరుగా నందలూరు కథానిలయం, నందలూరు-516150, (కడప జిల్లా) నుంచి తెప్పించుకోవచ్చు. 419 పేజీలు గల ఈ పుస్తకం సాదా ప్రతి వెల 200/-, లైబ్రరీ ఎడిషన్ 250/-.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to కడప కథ

  1. analogstuff says:

    I liked this post. Thanks for posting in telugu.

    Can you please me how to blog in telugu. which software to use.

    Thanks in advance.

  2. ఈ సంకలనంలోని యంగముని వ్యవసాయం కథ ఆటా-2006 కథల పోటీలో బహుమతి పొందింది. ఈ కథను ఈమాట గ్రంథాలయంలో చదవవచ్చు.

Comments are closed.