-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)
(ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించబడింది.)
వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?
ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?
ఒక ఊరిని తీసుకుంటే, ఆ ఊరి అవసరాలకి అక్కడి ప్రజల చేయూతే సరిపోతుంది. ఉదాహరణకు ఊరి అవసరాలకి ఇంత మొత్తం అవసరమవుతుంది అనుకుంటే ఆ మొత్తం ఆ ఊరివారి వద్ద ఉండదా? ఉంటుంది. కానీ అందరూ కలిసి రానందువల్ల ఆయా పనులు జరగవు.
సేవా దృక్పథం ఉన్నవాళ్ళ మధ్య కూడా సహకారం, సమన్వయం లేకపోవడం పరిష్కారసాధనకు ప్రధాన అవరోధం. ప్రతి ఒక్కరు (అంటే సంస్థలు కానివ్వండి లేదా వ్యక్తులు కానివ్వండి) తమ చుట్టూ ఓ గిరిగీసుకుని ఆ వృత్తం లోపలే తిరుగుతూ ఉంటారు. అలా కాక అందరూ ఒక ఉమ్మడి వేదిక ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, ఒకరి ప్రయత్నాలకు మరొకరు సహకారం అందించుకుంటే తప్పకుండా ఓ మంచి మార్పు వస్తుంది.
[అమెరికా సభ్యుడు కార్తీక్ జలమంగళ (కుడివైపు చివర)తో బెంగుళూరు సభ్యులు రాజశేఖరుడు, పవన్]
గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా ఈ సహకార ధోరణి మొదలైతే తొందరలోనే మనం అభివృధ్ధిని సాధించగలం. సేవ అంటే ఓ రోజు చెత్త ఊడ్చడమో, పండ్లు పంచడమో కాదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ఉత్సాహంగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండడం.
ఉదాహరణకు, హైదరాబాదు జనాభాను, ఇక్కడి కంపెనీలను, సంక్షేమ హాస్టళ్ళు, ఇతరత్రా సేవా సంస్థలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఇక్కడి అవసరాలకి, ఇక్కడి ప్రజల నిధులు సరిపోతాయి. కావాల్సిందల్లా అందరి సహకారమే. తమవంతు సహకారం అందించడానికి ప్రజలు కూడా ముందుకు వస్తారు. కాకపోతే మనం వారికి నమ్మకాన్ని కలిగించాలి. అదేమీ పెద్ద పని కాదు, కష్టం కాదు. మనం అలవాటుగా చేసే సహాయమే ఇంకొంచెం నేర్పుగా చేస్తే చాలు, అని.
ఈ ఆశయం దిశగా మా గ్రూపు ప్రయత్నాలు:
మేం చేసే పనుల వల్ల మాకు ఇప్పటికే చాలా మంది పరిచయం అయ్యారు. వారికి మేం ఇది వివరించినప్పుడు ఎంతో ఆసక్తి చూపారు. తప్పకుండా కలిసి పని చేద్దాం అనుకున్నాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబరు 2007 లో పూర్తి ప్రణాళికతో మేం పనులు ప్రారంభించగలం.
[థలస్సీమియా సెషన్ అయ్యాక SHiFT సభ్యులతో కలిసి]
ఏమేం చేయొచ్చు:
1. హైదరాబాదులో ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా నిముషాల వ్యవధిలో రక్తం అందించచ్చు.
2. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో కూడా చికిత్స చేసుకునేందుకు డబ్బులు లేని పేద వారికి వారి సామాజిక స్థితిననుసరించి, వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలియచెప్పడం, అలాగే ఆసుపత్రుల వాళ్ళతో మాట్లాడి వీలైనంత తక్కువ మొత్తానికి ఆపరేషను చేయించడం, అందుకు తగిన ఆర్థిక సహాయం చేయడం.
3. చేనేత కార్మికులు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ప్రతి సంస్థలోని మానవ వనరుల విభాగం వారితో మాట్లాడి నెలకు ఒకసారి కానీ, రెండు సార్లు కానీ కార్యాలయాల్లో చేనేత వస్త్రాల ప్రదర్శన పెట్టించగలిగితే బాగుంటుంది. మనం అదే పనిగా వెళ్ళి కొనుక్కోవాలంటే కష్టం. కానీ మన దగ్గరకే వచ్చి అమ్మితే తప్పకుండా మనం కొంటాం. ఈ విధంగా చేనేత వారికి మనం సాయం చేయచ్చు. అలాగే ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవచ్చు – ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో చేనేత వాడకాన్ని పెంచాలి అని.
4. థలస్సీమియా లాంటి వ్యాధుల గురించి మనకు ఎక్కువ తెలీదు. అలాగే మన అవయవాల్ని దానం చేయగలగడం కూడా. ఇలాంటి వాటి అన్నిటి గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలి.
5. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, మానసిక, శారీరక వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వారికి జీవితం పట్ల ఆశ కలిగించాలి.
[డా. సుందర్ డా. ఉమా రతన్ తో కలిసి నిర్వహించిన మెడికల్ క్యాంపు]
6. పాత పుస్తకాలు, బట్టలు లాంటివి రెగ్యులర్ గా అందచేయచ్చు.
7. అన్నిటికీ మించి మనందరం ఒకటవాలి. ఈ విధంగా కలిసిపని చేయడం వలన అందరిలోను మనమంతా ఒకటే అనే భావన బలంగా వేళ్ళూనుకుంటుంది. మన తోటి వారి పట్ల ప్రేమానురాగాలు బలపడతాయి. వసుధైక కుటుంబమనే భావన ప్రాంతాల వారీగా పెంపొందుతుంది.
8. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా సమాజం కొరకు కృషి చేయాలి. యథా రాజా తథా ప్రజా నే కాదు. యథా ప్రజా తథా రాజా గా మార్పు తేవాలి.
చేయి చాస్తేనే కదా తెలిసేది ఆశయం అందుబాటులో ఉందో, లేదో? అందరూ కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఆయుధాలతో పోరాడడమే విప్లవం కాదు. ఆలోచనతో ఓ మంచి మార్పుకై పాటు పడడం కూడా విప్లవమే.
[ఆహార పంపిణీ]
మరువలేని సంఘటనలు:
1. శిరీష కేసులో (ఆరు సంవత్సరాల పాప – గుండె ఆపరేషను జరిగింది) ఆటో డ్రైవరు సగం డబ్బులు మాత్రమే తీసుకోవడం. కృష్ణా గారు, శిరీష కుటుంబ సభ్యులు ఆటోలో మాట్లాడుకుంటున్న మాటలు విన్న డ్రైవరు, ‘అయ్యా! నేను పేద వాడిని. మీ మాటలు విన్నాను. ఇంతకన్నా ఏమీ సహాయం చేయలేను ‘ అంటూ కేవలం సగం చార్జీ మాత్రమే తీసుకున్నాడు. ఈ విషయం కృష్ణా గారు చెప్పినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది.
2. సాయి చరణ్ (4 నెలల బాబు, క్రిటికల్ కండిషనులో గుండె ఆపరేషను) కేసు ఒక హైలైటు. యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అనిల్ సంకల్పం, సహాయం నిజంగా అనితర సాధ్యమే. ఒక రోజంతా ఆసుపత్రిలో ఉండి, నాకు అప్ డేట్ చేస్తూ, టెస్ట్ లు జరిపిస్తూ, అలాగే డాక్టర్లతోను, నారాయణా హృదయాలయా అనుబంధ సేవా సంస్థ వారితో మాట్లాడడం. తలుచుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందం వేస్తుంది. ఆ రోజు అర్థరాత్రి వరకు మేలుకునే ఉన్నాము. క్రిటికల్ ఆపరేషను సక్సెస్ అయ్యింది. బాబు ఎంతో చురుకు కూడా. ఓ డిటెక్టివ్ స్టోరీ చదివినంత ఉత్కంఠతో ఉన్నాం మా గ్రూపు అందరమూ, ఏమవుతుందా అని.
3. దీవెన విషయం కూడా అంతే. 45 రోజుల పాటు వారు నిమ్స్ లో ఉన్నారు. ఆపరేషను రోజు నేను ఆసుపత్రిలోనే ఉన్నాను. ఆ పక్క నుంచి ఒకావిడ వచ్చి, ‘దీవెన కి సంబంధించిన వారు ఎవరు రండి ‘, అనగానే నా గుండె కొన్ని క్షణాల పాటు కొట్టుకోవడం మానేసింది. ఏమి చెప్తుందిరా దేవుడా అనిపించింది. వాళ్ళ నాన్నగారు వచ్చి డబ్బులు అడిగింది అన్నా కూడా తృప్తి లేదు. డాక్టరు చెప్తే బాగుండు అని ఒకటే టెన్షను. పర్లేదు బాగుంది అని తెలియగానే అప్రయత్నంగా ఓ కన్నీటి చుక్క, ఆనందబాష్పం అనచ్చు, రాలింది. మనసెంతో తేలిక పడింది.
4. దీవెనకు మొదట్లో చాలా సీరియస్ అయింది. నేను పరుగున వెళ్ళా, వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ ఫోన్ చేసిన వెంటనే. ఆయన మందులు కొనడానికి వెళ్ళారు. ఈ పిల్ల గొంతు దగ్గర తీవ్రంగా కొట్టుకుంటూ ఉంది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఏడుపొచ్చేస్తోంది. అలాగని ఏడిస్తే ఆ పిల్ల ఇంకా భయపడుతుంది. నిజానికి నన్ను చూడగానే ఆ పిల్ల కంట్లోంచి జల జలా నీళ్ళు రాలాయి. అక్కడి నర్సులు ఈ అమ్మాయి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నేనేమో తన చేతిని గట్టిగా పట్టుకుని మనసులో బాబాని తలుచుకుంటూ ఉండిపోయాను. ఓ పది నిముషాల కల్లా గొంతు కొట్టుకునే తీవ్రత తగ్గింది. అప్పుడు మొదటిసారిగా ప్రేమ విలువ అర్థమైంది నాకు. ఆ పిల్లకి, ఎందుకో తెలీదు కానీ, నేనంటే చాలా ఇష్టం. నేను రాగానే, నన్ను చూడగానే తనకి భయం పోయింది. మామూలు స్థితికి వచ్చింది.
5. దీవెన కేసులో ప్రతి ఒక్కరం చాలా శ్రద్ధ తీసుకున్నాం. ఎంత రాత్రైనా సరే తనని కలిసే వాళ్ళు వాణీ, చైతన్య. మా గ్రూపు సభ్యులే కాదు, సభ్యుల స్నేహితులు కూడా వచ్చారు.
6. లక్ష్మీ నరసమ్మ కేసులో వాణీ, చైతన్య, జయరాం, కెకె గారు ఇలా అందరూ, ఆఫీసులో ఎంత పని ఉన్నా సరే పర్మిషను తీసుకుని, ఈ పని చేసి, లేట్ నైటు వరకు ఆఫీసులో ఉన్నారు. శనివారాలు వెళ్ళి పని పూర్తి చేసుకున్నారు.
7. అన్నిటినీ మించిన హైలైటు మా గ్రూపు రెండవ వార్షికోత్సవమే. ఈ సారి మాకు మేమే సేవ చేసుకోవాలి అనుకున్నాం. అంటే అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం. రతన్ గారు, ఉమ గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. వీడియో కూడా తీసారు. జూ పార్క్ లో జరుపుకున్నాం. మేమందరమూ ఒక కుటుంబం అన్నట్టుగా జరుపుకున్నాం.
[ద్వితీయ వార్షికోత్సవం]
చేయలేకపోయినవి:
మా గ్రూపు మొదటి యానివర్సరీకి పూర్వం టీవీ లో (ఏ ఛానలో గుర్తు లేదు) ఓ యువకుడి మరణం గురించి చూసాను. అతను బెంగుళూరు వాసి. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. తరచూ రక్తదానం చేసేవాడు. తను చేయడమే కాదు, తన స్నేహితులు, తోటి ఉద్యోగస్తుల చేత కూడా చేయించేవాడు. అతనికి యాక్సిడెంట్ అయింది. చాలా సేపటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. తరువాత ఏదో ఆసుపత్రికి తీసుకెళితే తన గ్రూపు రక్తం దొరకలేదు. కేవలం తన గ్రూపు రక్తం దొరకనందువల్లే తను చనిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం !! తరచూ రక్తదానం చేసే వ్యక్తి రక్తం దొరకక చనిపోవడమా!!
నేను అతని పేరు, ఇతర వివరాలు గుర్తుపెట్టుకోలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు అన్నం తింటూ చూసాను. కనీసం ఏ ఛానల్ లో చూసానో కూడా గుర్తు లేదు. కానీ అతని వివరాల కోసం బాగా ప్రయత్నించాను. మా బెంగుళూరు సభ్యులందరినీ అడిగాను, స్నేహితులని అడిగాను. వివరాలు దొరకలేదు. మా గ్రూపు మొదటి వార్షికోత్సవం రోజున బెంగుళూరులో అతని ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులకు ఒక మెమెంటో ఇవ్వాలి అనుకున్నాను. వాళ్ళ కొడుకు మామూలు వ్యక్తి కాదు, ఎందరికో స్ఫూర్తి. మేము అతన్ని గుర్తుపెట్టుకున్నాము అని తెలియచెప్పి వారికి కొంత ఓదార్పు నిద్దామనిపించింది. అలాగే అతని గురించి, అతను చేసిన సేవ గురించి, ఎందువల్ల అతను చనిపోవాల్సి వచ్చింది ఇత్యాది వాటికి విరివిగా ప్రచారం కల్పించి, ఆయన మరణించిన రోజుని ఓ స్మృతి దినంగా ప్రకటించాలి. ఆ రోజున మన దేశ ప్రజలందరూ ప్రమాణం చేయాలి. అతని లాగా రక్తం దొరకక చనిపోయే దుస్థితి ఇంకెవ్వరికీ కలగనివ్వమని. ఇది నా కోరిక.
ఎవరికి ఆ వ్యక్తి గురించి తెలిసినా చెప్పాలని విజ్ణ్జప్తి చేస్తున్నాను. ఎప్పటికైనా ఆయన వివరాలు సేకరించి, అనుకున్నది సాధించాలి. అందుకు మీ అందరి సహకారం మాకు కావాలి.
-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)
“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం.
ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం . ఏ . ఇంగ్లీషు చదివిన ప్రశాంతి (లేఖిని వాడి) యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.
“అన్నిటికీ మించి మనందరం ఒకటవాలి. ఈ విధంగా కలిసిపని చేయడం వలన అందరిలోను మనమంతా ఒకటే అనే భావన బలంగా వేళ్ళూనుకుంటుంది. మన తోటి వారి పట్ల ప్రేమానురాగాలు బలపడతాయి. వసుధైక కుటుంబమనే భావన పెంపొందుతుంది.ప్రభుత్వమే కాదు,ప్రజలు కూడా సమాజం కొరకు కృషి చేయాలి”అనే మీ భావన నాకు బాగా నచ్చింది.నావంతు కృషి నేను చేశాను,చేస్తాను.మానవత్వాన్ని మించిన మతం ఏదీ లేదు.
ప్రశాంతి, అందమైన మనసు, సేవా తత్పరత గల అమ్మాయి. నేను నెల్లూరు పై అనేక వ్యాసాలు రాయటానికి ఆమె దోహదపడింది. మేమిద్దరము డా.జయప్రద గారి చాంబర్లో తెలుగు యునికోడ్ గురించి చర్చించినప్పుడు, ప్రశాంతికి తెలుగు పూపిల్.కాం పై గల ప్రేమ వ్యక్తమైంది.అప్పట్లో తనకు లేఖిని గురించి తెలియదు. ఈ సంవత్సర కాలంలో,ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటుగా, లేఖిని నేర్చుకోవటం ఎంతో ముదావహం. తెలుగు యునికోడ్లో గల TMAD పై ఉన్న ఈ వ్యాసం, అంతర్జాతీయ పాఠకులకు TMAD ను, ప్రశాంతి ను దగ్గర చేసింది.