“Norman Borlaug is the living embodiment of the human quest for a hunger free world. His life is his message.”
అన్నం తినేటప్పుడు ఆ అన్నం మీ కంచంలోకి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా ఆ ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన జేబులో డబ్బులుంటే చాలు, బజారుకు పోయి మనకి కావలసిన ఆహారపదార్ధాలు కొనుక్కోవచ్చు. మన దేశంలో పండే దినుసులే కాకుండా, కేవలం ఇతర దేశాల్లో మాత్రమే పండే దినుసులు కూడా మనకి కావలసినంత కొనచ్చు. మనలో చాలా ఎక్కువమందికి ఆకలి ఒక సమస్య అని తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ సుమారు 50 -60 సంవత్సరాల క్రితం వరకు, మనదేశంతో సహా అనేక దేశాల్లో, పండే పంటల ఉత్పత్తి ప్రజల ఆకలి తీర్చడానికి సరిపోయేది కాదంటే నమ్మగలమా? వ్యవసాయ రంగ ఉత్పాదకత (productivity) తక్కువగా ఉండడమూ, తినే నోళ్ళు అతి వేగంగా పెరిగపోవడమూ, కరువు కాటకాలు, సరుకుల కోసం రేషను షాపుల ముందు బారులు తీరి నిలబడడం, తీరా తమ వంతు వచ్చే సరికి ‘నో స్టాక్’ బోర్డు, తీరని ఆకలి, అస్థి పంజరాలలాంటి మనుషులు, – చాలా ఏళ్ళపాటు ప్రపంచ దేశాల్ని కుదిపేసాయి. ఈ ఆహారసమస్య ఇప్పటికీ కొన్ని ఆఫ్రికా దేశాల్ని పట్టి పీడిస్తోంది.
ఇలాంటి భయంకరమైన ప్రపంచ ఆహార సమస్య తీర్చి, అత్యధిక జనాభా ఆకలిని తీర్చగలిగిన మార్గం హరితవిప్లవం (Green Revolution) ద్వారా సాధ్యపడింది. మేలురకపు వంగడాలని, రసాయన ఎరువుల బలంతో సాగు చేసి ఆధికదిగుబడులు సాధించే ప్రక్రియ వివిధ దేశాల్లో ఒక విప్లవవేగంతో వ్యాపించింది. దాన్నే హరితవిప్లవం అన్నారు. మెక్సికోలో గోధుమ పరిశోధనలో 20 ఏళ్ళపైబడి పనిచేసి అనేక అధికదిగుబడులిచ్చే వంగడాలను ఆవిష్కరించిన మహామనిషీ , ఋషీ అయిన శ్రీమాన్ నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ (Norman Ernest Borlaug) ఆధునిక వ్యవసాయానికీ, ఈ హరిత విప్లవానికీ పితృతుల్యుడు. ఈయన పరిశోధనల ఫలితంగా పంటదిగుబడులు స్వల్పకాలంలో రెండు మూడు రెట్లు పెరిగాయి. అనేకదేశాలు కరువు కోరల్లోంచి బయట పడ్డాయి. ఈయనకి తన కృషికి గుర్తింపుగా వివిధదేశాలనుండి అనేక అవార్డులు, పతకాలు, గౌరవ డాక్టరేటులు లభించాయి. మనదేశం నుండి భారతీయ వ్యవసాయ అనుసంధాన పరిషత్తు (ICAR), భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) లాంటి వ్యవసాయ సంబంధిత సంస్థలూ, కొన్ని విశ్వవిద్యాలయాలూ ఆయనకి డాక్టరేటులు, అవార్డులు ఇచ్చాయి. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత ఖ్యాతిగడించిన 100 మంది అమెరికా పౌరులలో ఒకరిగా కీర్తించబడిన బోర్లాగ్ కి ఈమధ్య 2006 సంవత్సరానికిగాను అమెరికా కాంగ్రెస్సనల్ బంగారుపతకం ఇవ్వడం అత్యంత సముచితం. ఒక రకంగా ఆలస్యంగా లభించిన గౌరవం. ఆయనకి లభించిన గౌరవాలలో అత్యుత్తమ గుర్తింపు 1970 లో వచ్చిన నోబుల్ శాంతి బహుమతి. వ్యవసాయ శాస్త్రానికి నోబుల్ బహుమతి లేకపోవడం వల్ల ఈయనకి శాంతి బహుమతి ఇచ్చారు. ఆయనే ఎక్కడో అన్నట్లు ఖాళీ కడుపులా, కష్టజీవితాలా ఆలంబనతో శాంతియుత ప్రపంచాన్ని నిర్మించలేము (“hunger and poverty and misery are very fertile soils into which to plant all kinds of ‘isms’ including terrorism.” -Norman Borlaug). కాబట్టి ఆయన హరితవిప్లవసారధిగా ప్రపంచశాంతికి దోహదం చేసినందువల్ల ఇంకోవిధంగా చూస్తే ఆయనకి శాంతిబహుమతి రావడం కూడా సముచితమే.
బోర్లాగ్ కి ఆసియా దేశాలతో, ముఖ్యంగా భారతదేశంతో, గాఢానుబంధం ఉంది. మన దేశంతో సహా అనేక దేశాలలో వ్యవసాయోత్పత్తి పెంచే పరిశోధనా కార్యక్రమాలకు ఈయన స్ఫూర్తిని, సహకారాన్నీ అందించాడు. అది అంత తేలికైన పని కాదు. నూతన వ్యవసాయపద్ధతులని అవలంబించేలా భారత, పాకిస్థాన్ ప్రభుత్వాధినేతలని ఒప్పించడం కన్నా గోదాలో కుస్తీ పట్టడం తేలిక అని ఆయన ఒకసారి అభివర్ణించాడు. అన్నట్లు, ఆయన గొప్ప కుస్తీవీరుడు. అంత క్లిష్టకార్యాన్ని సాధించి ఆహారోత్పత్తిలో ఈదేశాలు స్వయంసమృద్ధి సాధించడానికి దోహదం చేసాడు. ఆయన గోధుమపంటపై చేసిన పరిశోధనలను అన్వయించడం వల్ల మేలురకం వరి వంగడాలని ఆవిష్కరించగలిగారు. పంట దిగుబడి పెంచడం సాధ్యమైంది. ఇది మనరాష్ట్రం అన్నపూర్ణగా పేరొందడానికి దోహదం అయింది. సర్ ఆర్థర్ కాటన్ లాగే ఈయన కూడా మనకి ప్రాతఃస్మరణీయుడు.
నోబుల్ బహుమతి కాక ఆయనకి అనేక బహుమతులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. అది ఆయా బహుమతులకే వన్నెతెచ్చిందనడం నిస్సందేహం. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. వ్యవసాయరంగానికి నోబుల్ బహుమతి లేని లోటుతీర్చడానికి నడుంకట్టి World Food Prize ని స్థాపించి ప్రతి ఏటా ఆహారసమస్య తీర్చడానికి కృషిచేసే వ్యక్తులకి ఆయన బహుమతి ప్రదానం చేస్తున్నారు. ఈ బహుమతిని పొందిన ప్రముఖులలో మన దేశంలో హరితవిప్లవానికి సారథ్యం వహించిన డా. M.S.స్వామినాథన్ (M.S.Swaminathan), క్షీరవిప్లవ (White Revolution) సారథి వర్గీస్ కురియన్ (Dr. Verghese Kurien), విత్తనోత్పత్తి సంస్థ మహికో (MAHYCO) స్థాపకుడు శ్రీ బి.ఆర్. బర్వాలే (B.R.Barwale), బంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకు ద్వారా పేదరిక నిర్మూలనకి సూత్రధారుడైన ప్రొ. మహమ్మద్ యూనస్ (Muhammad Yunus – ఈయన కూడా బోర్లాగ్ లా నోబుల్ శాంతి బహుమతి గ్రహీత) లున్నారు. తన గుర్తింపు కోసమే తపనపడే శాస్త్రవేత్తగా కాకుండా తన తర్వాతి తరాలకి స్ఫూర్తినీ, సాంకేతికనైపుణ్యాన్నీ అందజేసే దిశలో ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. ఈ కృషిలో భాగంగా జాన్ రువాన్ (John Ruan) తో కలిసి The World Food Prize Youth Institute ను స్థాపించాడు. దాని ద్వారా ఆయన ఎందరో యువకులకి స్ఫూర్తినందిస్తున్నాడు. వ్యవసాయరంగానికి పూర్తిగా దూరమైపోయిన అమెరికన్ యువతకి ఈసంస్థద్వారా ఆహారసరఫరా, ఆహారోత్పత్తుల మధ్యనున్న సంబంధాన్ని గుర్తుచేయడానికి ఈయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. కొంతమంది ఉన్నతపాఠశాల విద్యార్ధులని వివిధ అభివృద్ధిచెందుతున్న దేశాలకు స్వల్పవ్యవధి శిక్షణకై పంపడం ద్వారా తాను పొందిన ఉత్తేజం భావితర నిర్మాతలు కూడా పొందగల అవకాశాన్ని కల్పిస్తున్న దార్శనికుడీయన. నిజంగా ఆయన జీవితమే ఒక గొప్ప సందేశం.
ఆసియా దేశాలకు తనవంతు సహాయ, సహకారాలందించిన బోర్లాగ్ ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఆహారభద్రత చేకూర్చడానికి తన శక్తియుక్తులు ఉపయోగిస్తున్నారు. విత్తనం, రోడ్ల ద్వారానే ఆహారసమస్య తీర్చడం సాధ్యపడుతుందని నమ్మిన బోర్లాగ్ ముందు ముందు బయోటెక్నాలజీయే వ్యవసాయాభివృద్ధికి పట్టుకొమ్మవుతుందని విశ్వసిస్తున్నారు. ఆహారోత్పత్తి పెంచడానికి, జనాభా పెరుగుదలనరికట్టడానికి పనిచేసే సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఆకలిని జయించగలమని ధృఢంగా నమ్మారు. అంతేకాక, వ్యవసాయాభివృద్ధికోసం చేసే పరిశోధనలకై విశ్వవ్యాప్తంగా ప్రభుత్వపరంగా చేసే ఖర్చు కాలక్రమేణా తక్కువవడం పట్ల నిరశన వ్యక్తపరిచారు. ఈఅంశం వేలాది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొంటున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకొంటుంది. వ్యవసాయపరిశోధనలపై చిన్నచూపు, ఆకలి సమస్య పై హ్రస్వదృష్టి, ప్రభుత్వాల నిర్లిప్తత, సంబంధిత వ్యక్తుల చిత్తశుద్ధిలోపం, వ్యవసాయ దినుసుల (inputs) కల్తీ వంటి కారణాలనేకం ఉన్నాయి. ఈరకమైన కారణాలవల్ల ఎంత సాంకేతిక ప్రగతైనా సరే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాక, ఒక బిలియన్ పైబడి ఉన్న జనాభాగల దేశానికి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ఒక పెనుబాధ్యత.
బోర్లాగ్ పరిశోధనలవల్ల చేకూరిన ఫలాలు ఇప్పటిదాకా ఆహారభద్రతని అందించడంలో తోడ్పడ్డాయి. కానీ ఆఫలాలు పూర్తిగా మొత్తమందరికీ అందుబాటులోకి రాలేదు. అంతేకాకుండా పెరిగిన జనాభా, తగ్గిన ప్రభుత్వ ఆదరణ, తరిగిన వనరుల దృష్ట్యా మున్ముందు ఆకలి సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ప్రజలందరి ఆకలీ తీర్చగలగడం మనం బోర్లాగ్ కి ఇవ్వగల ఉత్తమబహుమతి.
(వ్యవసాయార్థికరంగ ప్రాచార్యులు (ప్రొఫెసర్) సత్యసాయి కొవ్వలి తెలుగు బ్లాగరుల్లో ప్రముఖులు. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని, సుదీర్ఘకాలం నుంచి బ్లాగుతున్నవారిని బ్లాగ్భీష్ములు అని కొత్త పదబంధాలను ప్రయోగించారు. హాస్యాన్ని బాగా పండించగల చమత్కారప్రియులు. గళ్లనుడికట్టును వాయువేగంతో నింపడంలోను, జనరంజకమైన గళ్లనుడికట్టును రూపొందించడంలోను నేర్పరులు. )
ఇంతటి మహనీయ వ్యక్తికి జోహార్లు.
ఎందుకనో మన ప్రసార/ప్రచార మాధ్యమాలలో ఇలాంటి విషయాలకు చాలా తక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. ఇంత గొప్ప వ్యక్తిని గురించిన వ్యాసం ఇన్నాళ్లూగా నేను చూడలేదంటే, కేవలం మాధ్యమాలను తప్పుపట్టి లాభం లేదనిపిస్తోంది. బోర్లాగ్ మహాశయునికి సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరుగాక!