ఉపోద్ఘాతం
అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి?
నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆలోచనలకు సరిగ్గా సరిపోయేలా ఒకాయన సినిమా పత్రికనొకదాన్ని నడిపేవాడు. ప్రపంచంలోని మంచి సినిమాలను ఫ్రాన్సు ప్రజల దగ్గరకు తేవాలని నిర్ణయించుకుని తన పత్రిక ద్వారా సినిమా సమీక్షలు, విశ్లేషణలు చేస్తుండేవాడాయన. మన దేశంలో మంచి సినిమాలెలాగూలేవు కనీసం ప్రపంచంలోని మంచి సినిమాల గురించైనా తెలుసుకున్నట్టవుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికాఫీసుకి వచ్చి ఎలాగో వుద్యోగాలు సంపాదించారా కుర్రాళ్ళు. ఈ సినిమా పిచ్చోళ్ళ పనేంటంటే మంచి సినిమాలు చూడడం, వాటి గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం. ఇటలీ లోని neo-realism సినిమాలు, అమెరికాకు చెందిన Hitchcock, Howard Hawks లాంటి దర్శకుల చిత్రాలను చూసి విశ్లేషించే వారు ఈ కుర్రాళ్ళంతా! వీరితో పాటే రాస్తూ వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వుండేవాడా పత్రికా యజమాని.
అవేమో ఇప్పటి రోజులు కావాయే! DVDలు, CDలు, వీడియో టేపులు దొరకని రోజులవి. మరి అమెరికా, ఇటలీ లాంటి దేశాల సినిమాలు ఫ్రాన్సుకి తెప్పించుకుని చూడాలంటే అషామాషీ విషయం కాదు. ‘మరి వీరికి ప్రపంచపు సినిమాలన్నీ చూసే అవకాశం ఎలా కలిగిందబ్బా’, అనుకుంటున్నారా? ఆ కుర్రాళ్ళ అదృష్టవశాత్తూ వారికో పెద్ద మనిషితో పరిచయం ఏర్పడింది. వీళ్ళకే సినిమా పిచ్చనుకుంటే , వీళ్ళ పిచ్చికి వంద రెట్లు ఎక్కువ ఈ పెద్దాయన సినిమా పిచ్చి. ప్రపంచంలో ఎక్కడెక్కడో విడుదలయ్యే సినిమాలను తెచ్చి ఒక film club ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శించేవాడు. వీరందరూ రాత్రి ఇక్కడ సినిమాలు చూడడం, పగలు పత్రికాఫీసులో సమీక్షలు, విశ్లేషణలు రాయడంతో తమ సినీదాహాన్ని తీర్చుకునే వారు. ఇలా కొన్నాళ్ళు సాగాక ఒక రోజు “సినిమాల గురించి ఇంత తెలుసుకున్నాం కదా! మనమే ఎందుకు మంచి సినిమాలు తీయకూడదు” అని ఆలోచన కలిగింది వాళ్ళలో. వీరి ఆలోచనలను ఆ film club నడిపే అతను, సినిమా పత్రిక నడిపే అతను బాగా ప్రోత్సహించారు.
ఆ కుర్రాళ్ళందరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ తమ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఏడేళ్ళలో షుమారు 32 సినిమాలు తీసారీ కుర్రాళ్ళు. ఈ సినిమాల ద్వారా ఫ్రాన్సు దేశ సినీ పరిశ్రమలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ సినిమా తీసే విధానాలకు కొత్త మార్గాలు కల్పించి మార్గ దర్శకులయ్యారు. అందుకే వీరిని నవతరంగపు దర్శకులన్నారు. వీరు తీసిన సినిమాలను నవతరంగపు సినిమాలన్నారు.
ట్రఫౌట్ సినిమా “జూల్స్ ఎట్ జిమ్” లో ఒక దృశ్యం (వికీపీడియా నుండి సేకరణ) |
ఎవ్వరీ కుర్రాళ్ళు? వీరిని ప్రోత్సహించిన ఆ పత్రిక యజమాని ఎవ్వరు? వీరికి సినీ జ్ఞానోదయం కలుగచేసిన ఆ film club వ్యవస్థాపకుడెవ్వరు? మొన్న మొన్నటి వరకూ నా సైటు http://24fps.co.in లోనూ, ఈ మధ్యనే ఇక్కడ పొద్దులోనూ నవతరంగమనీ, new wave అనీ నేను రాస్తూనే వున్నప్పటికీ అసలేంటీ నవతరంగం? ప్రస్తుత తెలుగు సినిమా వున్న పరిస్థితుల్లో ఈ ఉద్యమ ప్రస్తావన అవసరమా? మనకీ ఒక new wave వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం.
Andre Bazin మరియు new wave
సినిమా అంటే కేవలం ఒక వినోద సాధనంగా భావింపబడుతున్న రోజుల్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమా కూడా ఒక కళే అని అందరినీ ఒప్పించే స్థాయికి తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సినిమాలు తీయకుండా కేవలం సినిమాలు చూస్తూ, వాటిని విమర్శిస్తూ మరియు విశ్లేషిస్తూ ప్రజల్లో సినిమా అంటే ఒక గౌరవ భావాన్ని కలగ చేసిన వ్యక్తి Andre Bazin.
సినిమాపై తనకున్న విపరీత ప్రేమతో సినిమాలే జీవితంగా గడిపి తన ఆలోచనలను అందరికీ తెలిపే ఉద్దేశంతో Jacques Doniol-Valcroze మరియు Lo Duca లతో కలిసి Cahiers du Cinema అనే సినిమా పత్రిక ఏర్పాటు చేసి ఆ పత్రిక ద్వారా మంచి సినిమాల గురించి ప్రజలకు తెలియచేయడమే కాకుండా మంచి సినిమాలు తీయాలనుకున్న యువకులకు తన పత్రిక ఆఫీసునే సినిమా పాఠశాలగా మార్చివేసారు.
Jean Renoir, Howard Hawks, Hitchcock లాంటి దర్శకుల శైలిని ప్రపంచానికి తెలియచేసి, సినిమా దర్శకుడు కూడా ఒక పుస్తక రచయితతో సమానంగా తన భావాలను వెండితెరపై చిత్రరూపంలో లిఖించవచ్చని తన auteur theory లో సిధ్ధాంతపరిచి, సినిమాలో జీవమున్న నటుల ద్వారా మాత్రమే కాకుండా, నిర్జీవమైన వస్తువుల ఉపయోగం ద్వారా కూడా ప్రేక్షకులలో భావోద్వేగాన్ని కలుగచేయొచ్చని తన mise-en-scene ఆలోచన ద్వారా తెలియపరిచాడు.
ఈయనే లేకపోతే ఫ్రాన్సులో అసలు new wave ఉద్యమం వచ్చివుండేదా అని అనుమానం కలుగుతుంది. కొత్త తరహా సినిమాలు తీయాలన్న నవ యువ దర్శకులకు మార్గదర్శిగా నిలిచి, వారిని అనుక్షణం ప్రోత్సహిస్తూ new wave వుద్యమానికి పితామహునిగా నిల్చాడు Andre Bazin. కానీ మొదటి new wave సినిమా అయిన 400 blows సినిమా విడుదలకు ముందే, కేవలం 40 ఏళ్ళ వయసులో తను కన్న కలలు నిజమవడం కళ్ళారా చూడకుండానే మరణించాడు. Truffaut తీసిన 400 blows అనే సినిమా ఈయనకి అంకితం చేసారంటే new wave ఉద్యమంలో Andre bazin పాత్రను మనం అర్థం చేసుకోవచ్చు.
బాజిన్ (వికీపీడియా నుండి సేకరణ) |
ఈయన తన వ్యాసాల ద్వారా సినిమా ప్రపంచానికి చేసిన సేవ అత్యున్నతమైనది. ప్రపంచ సినిమా చరిత్రలో Andre Bazin పేరును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈయన రాసిన విశ్లేషణా వ్యాసాలు ఎంత గొప్పవో చెప్పాలంటే ఫ్రెంచ్ సినిమా దర్శకుడైన Jean Renoir మాటలనొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. Andre Bazin రాసిన సినీ వ్యాసమాలిక అయిన what is cinema అనే పుస్తకపు ముందుమాటలో Jean Renoir ఈ విధంగా అంటారు; “the essays of Bazin will survive even if the cinema does not.”
సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క సారయినా ఈయన రాసిన What is cinema అనే పుస్తకం చదివితే సినిమాకున్న గొప్పదనమేంటో తెలుస్తుంది. సినిమాలు తీసేవారే కాకుండా చూసే వాళ్ళు కూడా తప్పక చదవలసిన పుస్తకం What is cinema.
Henri Langlois మరియు new wave
ప్రపంచంలో అతిపెద్ద సినిమా అభిమాని ఎవరంటే నిస్సందేహంగా Henri Langlois అని చెప్పొచ్చు. ఫ్రాన్సుదేశంలో 1914 లో జన్మించిన ఈయన చిన్ననాటినుండే సినిమాలపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించాడు. సినిమాలపై వున్న విపరీతమైన అభిమానంతో 22 ఏళ్ళ వయసులో స్నేహితులయిన Jean Mitry మరియు Georges Franju లతో కలిసి ప్యారిస్ లో Cinémathèque Française అనే సినిమా క్లబ్ మరియు మ్యూజియం ఏర్పాటు చేసి ప్రపంచంలోని అరుదైన సినిమాలను ప్రదర్శించడమే కాకుండా రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీల బారిన పడకుండా ఎన్నో అరుదైన సినిమాలను సంరక్షించి ప్రపంచ సినీ రంగానికి అరుదైన సేవ చేసాడు.
మొదట్లో ముగ్గురు వ్యక్తుల శ్రమ ఫలితంగా మొదలయిన ఈ సినిమా క్లబ్ రానురానూ ప్రపంచంలోని అత్యున్నత సినీ మ్యూజియం మరియు సినిమా క్లబ్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది. 1930లలో మొదలు పెట్టినప్పుడు కేవలం 10 సినిమాలతో మొదలయ్యి 1970 ల నాటికి 60000 ల సినిమాలను ఈ సినిమాలయం సేకరించి సంరక్షించిందంటే సామాన్యమైన విషయం కాదు. వీరి శ్రమను గుర్తించి ఫ్రెంచ్ ప్రభుత్వం నిధులు అందచేసి Cinémathèque Françaiseను అభివృధ్ధి చేయడంలో తోడ్పడింది.
సినీ జగత్తుకు Henri Langlois చేసిన సేవ ఎట్టిదంటే, 1968లో ఈయనను Cinémathèque Française అధ్యక్షునిగా దింపివేయడమే కాకుండా అప్పటి వరకూ అందుతున్న నిధులను కూడా ఆపేయమని అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి Andre Malraux ఉత్తర్వు జారీ చేసినప్పుడు Henri Langlois కు సినీ జగత్తులోని ఎంతో మంది అండగా నిలవడమే కాకుండా, ఫ్రాన్సులో ప్రతి ఏడు జరిగే Cannes సినిమా ఉత్సవాన్ని కూడా జరగకుండా ఆపేశారు. సినిమా తీసే ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ సినిమా ప్రదర్శన మరియు పరిరక్షణలకై ఈయన చేసిన సేవలకు గుర్తుగా ఆస్కారు అవార్డుకూడా ప్రదానం చేసారు.
మొదట్లో చిన్న సినిమా క్లబ్ గా మొదలయిన Cinémathèque Française రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత సినీ అభిమానులకు మంచి సినిమాలు చూడడానికి, వాటిని గురించి చర్చించుకోవడానికి ఒక వేదికగా నిల్చింది. ఫ్రాన్సులోని సినిమా అభిమానులకు ప్రపంచ సినిమాపై ఆసక్తి కలిగించి వారిలో కొత్త ఆలోచనలు కలిగించి తద్వారా ఆ అభిమానులు సినీ విమర్శకులుగా మారడానికి, ఆ సినీ విమర్శకులు new wave దర్శకులు గా మారడానికి, Andre Bazin స్థాపించిన Cahiers du Cinema పాత్ర ఎంతుందో Henri Langlois స్థాపించిన Cinémathèque Française అంతే వుంది. అందుకే ఈ నవతరంగపు దర్శకులను children of cinematheque అని అనేవారంట.
టెక్నాలజీ మరియు new wave
1960ల నాటికి యూరోపు, మరియు అమెరికాలలో టెక్నాలజీ బాగా ఊపందుకుంది. అందులో భాగంగానే అప్పటివరకూ రాజ్యమేలుతున్న భారీ కెమెరాలు పోయి భుజంపై మోసుకెళ్ళగలిగేలా తక్కువ బరువు కలిగిన కెమెరాలు వాడుకలోకి వచ్చాయి. ఈ కెమెరాలను ఉపయోగించడం ద్వారా క్రేన్, డాలీ లాంటి పరికరాల అవసరం లేకుండానే కెమెరాను తమ ఇష్టానుసారం ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎటువైపు కావాలంటే అటువైపుకి తీసుకెళ్ళి సినిమాలను తీయడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే new wave దర్శకులు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా zoom lens ద్వారా పాత్రలను ప్రేక్షకులకు దగ్గరగానూ, అవసరమైనప్పుడు దూరంగానూ చూపించడానికి అవకాశం కలిగింది. అప్పుడప్పుడే లబ్దిలోకి వచ్చిన portable sound recording యంత్రాలనుపయోగించి డైలాగులను అప్పటికప్పుడు రికార్డ్ చేయగలిగే అవకాశం కలగడంతో అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న డబ్బింగ్ ప్రక్రియ అవసరం లేకుండా చేసుకున్నారు. అలాగే స్టూడియోల్లో ఉపయోగించే భారీ లైట్ల అవసరం లేకుండా కొత్తరకమైన ఫిల్మ్ stock ఉపయోగించి సహజమైన వెలుతురులోనే సినిమాలు చిత్రీకరించి మంచి ఫలితాలు పొందగలిగారు. ఈ విధంగా టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తమకనుకూలంగా మలచుకున్నారు new wave దర్శకులు.
ఈ విధంగా కెమెరా, లైటింగ్, సౌండ్ విభాగాల్లో నవీన పోకడలు సృష్టించుకోవడంతో పాటు ఎడిటింగ్ విభాగంలో jump cut లాంటి అత్యంత నూతన ప్రక్రియలు తమ సినిమాల ద్వారా ఆవిష్కరించారు. ఇవన్నీ టెక్నాలజీ ద్వారా సులభతరమైన ప్రక్రియలు.
ఫిలాసఫీ మరియు new wave
New-wave సినిమా దర్శకులలో ఒకరయిన Alain Resnais సినిమాలు తీసే విధానం ఎందుకు మారాలి అని చెప్తూ ఈ విధంగా అంటాడు. “A classic film cannot translate the real rhythm of modern life. Modern life is fragmented, everyone feels that. Painting, as well as literature, bears witness to it. So why should the cinema not do so as well, instead of clinging to the traditional linear narrative”. ఆయనన్నట్టుగానే రెండు ప్రపంచ యుధ్ధాల్లో నలిగిపోయిన జీవితాలు క్లాసికల్ సినిమాల్లో చూపించడం జరిగేది కాదు.
రెండు ప్రపంచ యుధ్ధాల్లో అర్థం లేకుండా కోల్పోయిన లక్షల మంది ప్రాణాలు, ఛిన్నాభిన్నమైన జీవితాలు యూరోపు దేశ ప్రజల మనస్తత్వాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాయి. దేశాధిపత్యం కోసం జరిగిన యుధ్ధాలు ప్రజల బతుకుల్లో మిగిల్చేది కడగండ్లు మాత్రమే అని ప్రజలు తెలుసుకున్నారు. వైయక్తికతకు ప్రాముఖ్యత పెరిగింది. అంతా మన ఖర్మ అని భావించకుండా ఎవరి బాధలు, అనందాలకు వారే కారణమని భావించారు. ఈ భావనలో తప్పు – ఒప్పు తేడాలను పక్కనపెట్టారు. వ్యక్తి సుఖమే ముఖ్యం. ఆ సుఖం కోసం ఏమైనా చేయొచ్చు అని నిర్ణయించుకున్న ప్రజలు సాటి మనుషులతో సంబంధం లేకుండా self కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలయ్యింది. దాంతో ప్రజల్లో సంబంధ బాంధవ్యాలు లోపించాయి. ఎవరి బతుకు వాళ్ళదయింది. జీవితం గజిబిజిగా మారిపోయింది. ఆ గజిబిజి గందరగోళాన్ని సినిమాగా రూపొందించాలంటే తమ సినిమాలు జీవితంలాగానే చైతన్యవంతంగా వుండాలని new wave దర్శకులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వీరి సినిమాలో సీన్లెప్పుడూ డ్రామాలాగా కాకుండా నిజజీవితానికి దగ్గరగా వుంటాయి. వ్యక్తి స్వాతంత్ర్యం గురించి Jean Paul Sartre లాంటి తత్వవేత్తలు నిర్వచించిన అస్థిత్వవాదాన్ని తమ సినిమాల్లోకి తెచ్చారు అప్పటి దర్శకులు.
New wave సినిమాల ద్వారా దర్శకులు తాము నిర్దేశించిన సూత్రాలకు ఒక ఫిలాసఫీని కూడా సృష్టించడం ద్వారా తమ సినిమాలకొక వివేచనాత్మక హోదాను సంపాదించి పెట్టారు. ఫ్రాన్సులోని ప్రజల జీవితాల్లో కొరవడిన సృజనాత్మకత, రసాత్మకత మరియు వివేచనాత్మకతలను తమ సినిమాల ద్వారా పూడ్చారు నవ తరంగం దర్శకులు.
New wave దర్శకులు మరియు సినిమాలు
జీన్-లక్ గోడార్డ్ (వికీపీడియా నుండి సేకరణ) |
1950-60 దశాబ్దపు చివరిరోజుల్లో ప్రపంచదేశాలెన్నింటిలోనో నవ్యత లోపించిన పాత తరహా సినిమాలకు గుడ్‍బై చెప్పేసి కొత్త తరహా సినిమాలను సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలన్నింటిలోను అత్యంత ప్రఖ్యాతి గాంచినది “La Nouvell Vague”. New-wave లేదా నవతరంగం అని దీనర్థం. 1950లలో ఫ్రాన్స్ లో మొదటి సారిగా ఈ new wave (La Nouvelle Vague) అన్న పదం సృష్టించబడింది. అక్కడ ఎగిసిన ఈ నవతరంగం దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని తన సృజనాత్మక వెల్లువలో ముంచెత్తింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు పదిమంది నవ యువ కళకారులు కళపై, ప్రత్యేకించి సినిమాపై తమకున్న పిచ్చిని, ప్రేమను తమ తమ సినిమాల ద్వారా వ్యక్తపరచాలనే ప్రయత్నంలో ఎగిసిందీ తరంగం. అదే French New Wave. ఈ ఉద్యమానికి మూలకారకులలో ముఖ్యులు François Truffaut, Jean-Luc Godard, Claude Chabrol, Jacques Rivette మరియు Eric Rohmer.
ఫార్ములా సినిమాలు, రొటీన్ కథలు, స్టూడియో యజమానుల గుత్తాధిపత్యం లాంటి రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న French సినిమాకో కొత్త దిశని నిర్దేశించాలనే ఉద్దేశంతో Cahiers du cinema అనే పత్రికలో సినిమా విమర్శకులైన కొంతమంది యువకులు తమ సినిమాలతో ఫ్రెంచ్ సినీ పరిశ్రమలో కొత్త ఊపిరి నింపారు. ఈ నవతరంగపు దర్శకులు Cahiers Du Cinemaలో సినిమాలను విశ్లేషించడమే కాకుండా ప్యారిస్ లోని Cinémathèque Française అనే సినిమా క్లబ్బులో ప్రపంచ సినిమాలన్నీ ఏకధాటిగా చూసేవారు. ఇక్కడ పెరిగిన పరిచయాలు వారిని ఒక తాటిపై నడిపించాయి. సాటి వారి సహాయంతో ఇక్కడి దర్శకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఒకరి సినిమాల్లో మరొకరు సహాయం చేసుకుంటూ ఫ్రాన్సు సినిమాలకే కాదు ప్రపంచపు సినిమాలన్నింటికీ కొత్త ఊపిరినిచ్చారు. సినీ ఉద్యమానికి కారకులయ్యారు.
పైన పేర్కొన్న దర్శకులే కాకుండా Agnes Varda, Alain Resnais, Alain Cavalier, Chris Marker, Louis Malle లాంటి దర్శకులు కూడా ఈ నవతరంగపు అలలకు శక్తినిచ్చారు.
ఫ్రెంచ్ new wave గురించి తెలుసుకోవాలనుకున్న వారెవరైనా ముందుగా Jean Luc Godard రూపొందించిన Breathless , Truffaut తీసిన 400 blows, Agnes Varda తీసిన Cleo from 5 to 7 మరియు Alain Resnais దర్శకత్వం వహించిన Hiroshima Mon’amour సినిమాలు చూడాల్సిందే!
ముగింపు
షుమారు పది మంది నవతరంగం దర్శకులు దాదాపు పదేళ్ళపాటు 60 కి పైగా సినిమాలను తీసి ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా సంచలనాన్ని సృష్టించారు. కానీ దాదాపు పదేళ్ళపాటు సాగిన ఈ ఉద్యమం 1970 ల మధ్యలో చల్లబడింది. చాలా మంది ఈ ఉద్యమం కేవలం కొన్నాళ్ళపాటే సాగి ఆ తర్వాత విఫలమైందని విమర్శలు చేసినప్పటికీ new wave ఉద్యమం ద్వారా ప్రపంచ సినిమాలో జరిగిన మార్పులను గమనిస్తే ఈ ఉద్యమం విఫలమైందని అంగీకరించలేము.
మనం కొన్న కొత్త చొక్కాను కొన్నాళ్ళు మాత్రమే కొత్త చొక్కాగా భావిస్తాము కానీ ఆ చొక్కా వున్నన్నాళ్ళూ కొత్త చొక్కా అనుకోముగా! అలాగే పదేళ్ళపాటు సినిమాలో కొత్త ప్రక్రియలను సృష్టించిన నవ యువ దర్శకులు పదే పదే కొత్త పద్ధతులను సృష్టించడం కష్టమే, అలా వారు చేయాలనుకోవడమూ తప్పే! new wave సినిమాల ద్వారా బయటపడ్డ వినూత్న సినీ ప్రక్రియలు మరియు టెక్నిక్‍లు కాలక్రమంలో కమర్షియల్ main stream సినిమాలలో కూడా పొందుపరచడంతో new wave ఉద్యమం ద్వారా సాధించాల్సిన ఫలితాలు పొందినట్టయింది. ఈ విధంగా చూస్తే new wave ఉద్యమం నూటికి నూరుపాళ్ళు విజయం సాధించినట్టే!
తుదిపలుకు
అనగనగా ఒక భారత దేశం. ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం. ఇక్కడి ప్రజలకు సినిమాల పిచ్చి. ఇక్కడి ప్రజలు ఖండాతరాలు దాటి వెళ్ళి వేర్వేరు రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నప్పటికీ ఇక్కడి సినిమాలు మాత్రం రాష్ట్ర సరిహద్దులైనా దాటలేకపోతున్నాయి. ఇక్కడ నిత్యం మండే స్వార్ధపు మంటల్లో పడి సినిమా అనే కళ బూడిదయిపోయింది. ఆ విషయం గ్రహించిన వాళ్ళు తెలుగు సినిమాలు చూడడం మానేశారు. కొంతమంది ఆవేశపడిపోయి రోజూ సినీ పరిశ్రమను నిందిస్తున్నారు. కానీ ఇక్కడా ఎప్పుడోకప్పుడు ఒక నవతరంగం రాకపోదా? వాడిపోయిన సినీ పుష్పం మళ్ళీ వికసించకపోదా?
ఏమో కాలమే దీనికి సమాధానం చెప్పాలి!
నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.
బాగుంది. అలాగే దీనిని వికీపరం చేస్తే ఒక చక్కటి తెలుగు వ్యాసం అవుతుంది, మిగతా వాళ్ళం దీన్ని ఇంకా తవ్వుకుంటూ వెళ్తాం 🙂
Nenu Traffaut vi konni cinemaalu choosanu. He’s amazing. Mana telugu cinemaala gurinchi emi raaya daluchukoledu. Kaani monnati Grahanam, siraa choosaaka manaki kooda kastha bhavishyatthu undemo anipistondi.