డా.టి.యల్.యస్.భాస్కర్ తెలుగు డయాస్పోరాకు సంబంధించిన అంశాలలో అధ్యయనం చేస్తున్నారు. తీరిక వేళల్లో telugudiaspora.com అనే వెబ్సైటు నడుపుతూ ప్రస్తుతం Encycloapeadia of Telugu Diaspora తయారు చేయడం లో నిమగ్నమై ఉన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారి సంస్కృతి, భాష గురించి తన అనుభవాలు, అనుభూతులు ఇక్కడ వివరిస్తున్నారు. తెలుగు డయాస్పోరా గురించి పొద్దులో ఆయన చెబుతున్న కబుర్లలో ఇది మొదటిది.
“జో అచ్యుతానంద జో జో ముకుందా!”
ఈ కీర్తన వింటే ఎంతో హాయిగా ఉంటుంది కదా! మా సమన్విత్ కి ఇప్పుడు ఆరు నెలలు నిండి ఏడో నెల వచ్చింది. ఈ మధ్యనే ఈ కీర్తన కూడా బాగా గుర్తుకు వస్తోంది. ఎప్పుడయినా వాడు పడుకోకపోతే ఈ కీర్తనని పాడమని మా అవిడని అడుగుతాను. ఎప్పుడో ఈ కీర్తనని చిన్నప్పుడు నా మేనత్తలు పాడటం బాగా గుర్తు. తరువాత చాలా సార్లు కేసెట్లో కూడా విన్నాను. కాని ఈ కీర్తనని సామూహికంగా ఒక 60-70 మంది గుడిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ముందు ఆలపిస్తుంటే…ఆహా…ఎంత హాయి…ఆ వేంకటేశ్వర స్వామికి…వింటున్న మనకి…(విద్యుత్ దీపాలన్నీ ఆపి స్వామి వారి సన్నిధి లో ఉన్న ఒకే ఒక దీపం వెలుగుతూ…). అయితే పాడుతున్న ఏ ఒక్కరికీ తెలుగు రాదండి…నమ్మశక్యంగా లేదా? అయితే ఇక చదవండి…
శుక్రవారం, సాయంత్రం 5 గంటలు కావొస్తుంది. ‘6 గంటలయితే అంతా నిశ్శబ్దమే’ అని చెప్పిన రామ నరసింహులు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే టేబిల్ మీద ఉన్న నా నోటు పుస్తకం, కెమేరా పట్టుకొని విష్ణు మందిరం ప్రాంగణంలోనే నేనుంటున్న అతిథి గృహం నుంచి గబగబా గుడి వైపు పరిగెత్తా. మారిషస్ దేశంలో ఉన్న సెయింటు పియర్లో ఉన్న ఈ విష్ణు మందిరం 1923 లో కట్టించారు. విగ్రహమూర్తులు అంతకన్నా ముందే పూజింపబడుతూ ఉన్నా, 1923 లో మండేసర్ ఆల్మా షుగర్ ఎస్టేట్ అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన లూయి డి సోర్నే సహకారంతో, విష్ణు మందిరానికి ప్రస్తుత రూపు వచ్చింది. 1923కు ముందు, తరువాత మన తెలుగు వారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.
ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 దాకా స్వామి వారి విశేష పూజ జరుగుతాది. ఉద్యోగ రీత్యా మరియు ఇతరత్రా కారణాల వలన వారమంతా ఎంత బిజీగా ఉన్నా, శుక్రవారం 6 గంటలకి అందరు పూజకి సమావేశం అవుతారు.
6 గంటలకి సమావేశం అయిన తరువాత, మొదటగా భజన ఉంటాది. దీన్ని భజన గుంపు నిర్వహిస్తారు. భజన గుంపు ప్రతీ మంగళవారం సమావేశమై మనము చెప్పుకున్న శుక్రవారపు సంకీర్తనకి అభ్యాసం చేస్తారు. భారతదేశం నుంచి తెప్పించుకున్న ఆడియో కేసెట్ల నుంచి తీసుకుని, రోమన్ స్క్రిప్టులో వ్రాసి, పాడటానికి వీలుగా చేసుకుంటారు. కీర్తనల/పాటల పత్రాలని శుక్రవారం సమావేశంలో ముందుగా పంచిపెడతారు కూడా. భజన జరుగుతున్నపుడు సమావేశం అయిన మన తెలుగు వారందరూ కీర్తనలని/పాటలని రోమన్ స్క్రిప్టులో చూసి పాడతారు. అలాగే, భజన గుంపు వారు, ఆసక్తి చూపిస్తున్న వారికి కీర్తనలు, పాటలు నేర్పి శుక్రవారం పూజలో పాడటానికి వీలు కల్పిస్తారు. ఈ గుంపులో మృదంగం, తబలా, వయోలిన్ వంటి అంశాలలో కూడా శిక్షణ ఇస్తారు. ఇలా ఎంతో మంది గాయకులను, వాయిద్యకారులను తయారుచేసారు. సమారు 40 నిమిషాల పాటు జరిగే ఈ భజనలో అందరూ చాలా చురుగ్గా పాల్గొని పాడతారు. విచిత్రం ఏమిటంటే వీరిలో 90 శాతం మందికి పాడుతున్న దానికి అర్థం తెలీదు! కానీ ఎంతో భక్తితో దైవ సన్నిధిలో తెలుగులో పాడటాన్ని వీళ్ళు ఒక వరంగా భావిస్తారు.
భజన తరువాత ఆచార్యుల వారి ప్రవచనం ఉంటాది. మనం పూజారి అంటాం. వేంకటాచార్యుల వారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి విష్ణు మందిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ శుక్రవారం ఒక 10-15 నిమిషాల పాటు ప్రవచనం ఉంటాది. మన పురాణాల నుంచి సమాచారాన్ని సమీకరించి వాటిలో ఉన్న నీతిని కొన్ని కధల ద్వారా చెప్తారు. వేంకటాచార్యుల వారి తెలుగు ప్రవచనాన్ని అక్కడున్న అందరికీ సుపరిచితులైన సంజీవ అప్పడు గారు ఫ్రెంచి క్రియోల్ లోకి అనువదించి అందరికీ అర్ధం అయ్యేటట్టు చూస్తారు. అన్నిటికన్నా వారి పూర్వీకుల భాష అయిన తెలుగు వినటంలో వారు చాలా అనందం పొందుతారు. కొన్ని అరుదైన సందర్భాలలో వేంకటాచార్యుల వారు మన ఆచార వ్యవహార పద్ధతులను ఆంగ్లంలోకి అనువదించి చెప్తారు. ఆచార్యుల వారు మన తెలుగు వారు వాడే ఫ్రెంచి క్రియోల్ కూడా నేర్చుకొనే ప్రయత్నం ఆరంభించారు. ప్రవచనం తరువాత హారతి ఉంటాది. మహా విష్ణువుని దీవెనలు అందరికి…
తరువాత గుడిలో అన్ని విద్యుత్ దీపాలు ఆపేస్తారు. శ్రీ మహా విష్ణువుని సన్నిధిలో ఒక అఖండ దీపం వెలుగుతున్న సమయంలో అందరూ…
“జో అచ్యుతానంద జో జో ముకుందా!” కీర్తనను ఆలపిస్తారు. ఎంత బాగా పాడతారో…
తరువాత గుడి తలుపులు మూసి, అక్కడ ఉన్న ప్రాంగణంలో ప్రసాదాన్ని పంచిపెడతారు. ఒక్కో శుక్రవారం ఒక్కో కుటుంబం వారు ప్రసాదం బాధ్యత తీసుకొంటారు.
శెలవా మరి!…ఇంకోసారి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం.
This essay is an eye opener for me. I was amused to learn about culture and tradition of telegu people outside India. Inspite of geographic and language barriers they are trying to uphold their cultural roots is a lesson for us. Hope to see more writings from Dr.TLS Bhaskar and Wishing him all the best for his future endeavours..
This sort of research gives hope to all telugu people around the globe to Live happy life and feel at home every time.
We want Dr. TLS Bhakar write more and more and make people round the world to feel happy for being telugu People.
All our best wishes and regards to him.
Bhaskar, thats a great article about Telugus in Mauritus…..
byt the way are you from HCU? I think I have seen you there….I was an MCA student at HCU from 99-02…
telugu vaaari patla vaarikunna prema chaala goppadi. telugu ki inta seva chestrunna mee MAARISHUS teamki naa dhanyavaadamulu