బ్లాగ్బాధితుల సంఘం

jyothi.bmpఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.

————–

*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .

ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !.

మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు అంటే ఇష్టం ..సరే ..బానే ఉంది. ఆరునెలల క్రింద వరకు మా వారు ఆఫీసు నుండి రాగానే హాయిగా కబుర్లు చెబుతూ నేను చేసిన పకోడీలు తింటూ టీ త్రాగి పేపర్ ఓసారి తిరగేసి ..వంట చేస్తున్న నాతో కబుర్లాడుతూనే పిల్లల హోంవర్క్ చేయించేవారు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి లేదా అలా వాకింగుకి వెళ్ళి వచ్చేవాళ్ళం . అప్పుడప్పుడు సెకండ్ షోకి కూడా వెళ్ళేవాళ్ళం. కాని ఇప్పుడు???.

అసలు ఎవడు చూపించాడో కాని ఈ తెలుగు రాయడం . బ్లాగు రాయడం. ముందు నెట్ సెంటర్ కెళ్ళి రెండు మూడు గంటలు కూర్చునేవారు. తరువాత వాయిదా పద్ధతిలో కంప్యూటర్ కొన్నారు. రాగానే బట్టలు మార్చుకుని మొహం కడిగి ఏమోయ్ టీ అంటూ ఆర్డరేసి దాని ముందు సెటిల్ అయ్యేవారు. కొత్తలో అది ఎలా వాడాలో నేర్చుకుని మెల్లగా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుని బ్లాగులు చదవడం మొదలెట్టారు. ఒక మంచిరోజు చూసి బ్లాగు మొదలెట్టి రాయడం మొదలెట్టారు. నేను వంటతో సతమతమవుతూ పిల్లల హోంవర్క్ చేయించేదాని. పోనీలే మన మాతృభాష కదా మంచిదే అని…టిఫిన్ లేకుండానే టీ ఇచ్చినా అలాగే కూర్చునేవారు. చూద్దాం అడుగుతారో లేదో అని నేను ఎన్ని రోజులు చూసా! ఊహూ…సర్లే నాకే పని తప్పింది అని ఊరకున్నా.

ఆఫీసులో అన్ని బ్లాక్ చేసి ఉంటాయంట. అందుకే ఇంటికి రాగానే ముందుగా కంప్యూటర్ స్విచ్చి ఆన్ చేస్తూ చెప్పులు విప్పుతారు. ముందుగా తను రాసిన టపాకు వచ్చిన కామెంట్స్ చదవడం , తర్వాత కూడలి, తేనేగూడు ఇలా అన్ని మెయిల్స్ చూసేసరికి రెండుగంటలు. అయన వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో , ఎవరెలా ఉన్నారో ఎమీ పట్టదు. ప్చ్ ….ఇవన్నీ నాకెలా తెలుసనుకుంటున్నారా? ఆడవాళ్ళం ఒకసారి ఒకే పని చేయం కదండీ. నా పని చేస్తూనే ఆయన మీద ఓ కన్నేసి చూస్తుంటా. ఎవరైనా ఆడాళ్లతో చాటింగ్ గట్రా చేస్తున్నారేమో అంత ధీర్ఘంగా కూర్చుంటే అని సందేహం కూడా కలిగింది. పోనీలే పోనీలే అని ఊరుకుంటే ఈ బ్లాగ్పిచ్చి పెరుగుతూనే ఉంది. పైగా ఇంటికొచ్చిన ప్రతి వారితో బ్లాగులగురించి ముచ్చట్లు. మా తమ్ముడికి కూడా చెప్పబోతుంటే వాడిని పంపేసా వెళ్ళరా మీ ఆవిడ ఎదురుచూస్తుందని. నా కష్టాలు తెలిసి తెలిసి వేరొకరిని పడనిస్తానా.

ఇవన్నీ చేసి నా వ్రేళ్ళు లాగుతున్నాయి కాస్త జండూబామ్ రాయవే అంటారు రాత్రి ..తిక్క రేగి నేను పెట్టను అని పడుకుంటా .మీరే చెప్పండీ. ఇదేమన్నా బావుందా. ఆ కంప్యూటర్ నాకు సవతి అయినట్టుంది . ఎప్పుడో దాని కనెక్షన్లన్నీ పీకి పడేస్తాను. కాని అన్నేసి వేలు పోసి కొన్నది కదా మనసు రాదు. రాసుకోండి, చదువుకోండి నేనొద్దనను. మరీ అలా నన్ను పిల్లలను గాలికొదిలేసి అందులోనే మునిగిపొమ్మన్నారా? ఇలాగే మా కాలనీలో నాలాంటి బాధితులు ఓ పదిమంది దొరికారు. సరే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే మేమందరం ఏకమై ఆలోచించాలి. అని సంఘం పెట్టుకున్నాము.

ఓ రోజు ఒకతను వచ్చి “నేను కూడా బ్లాగ్బాధితుడినే . నన్ను చేర్చుకోండి మీ సంఘంలో” అన్నారు . ఆశ్చర్యపోయాము. ఆడాళ్ళవల్ల కూడా బాధింపబడే మొగుళ్ళూన్నారా అని. అతను చెప్పింది విని వెంటనే చేర్చుకున్నాం ..ఇంతకీ ఏమన్నాడో తెలుసా?? “నేను ఆఫీసుకెళ్ళాక బోరు కొడుతుందంటే నా కంప్యూటర్ నేర్పించా … మెల్లిగా బ్లాగు రాయడం నేర్చుకుంది. ప్రొద్దున లేచి మొహం కడుక్కుని టీ తాగుతూ కూడలి చూస్తుంది. అప్పటికింకా ఎవరూ లేవరు . తర్వాత వంట పనీ అదీ త్వరగా పూర్తి చేసి నేను ఆఫీసుకెల్లేది ఆలస్యం మళ్ళీ ఆన్ చేసి అన్నీ చదువుతూ కూర్చుంటుంది. ఇల్లు సర్దేది లేదు . దుమ్ము దులిపేది లేదు. మద్యాహ్నం కాస్త పడుకుంటుందేమో. తన బ్లాగులో కొత్త కొత్త విషయాలు రాయడానికి పుస్తకాలు కొనిమ్మని నాతో పోరు .నేను తెచ్చినవి నచ్చలేదంటే తననే తీసికెళ్ళి దుకాణంలో వదిలేసి చూసుకో నేను బిల్లు కడతా అని పేపర్ చదువుతూ కూర్చున్నా. పోనీలే మాతృభాషాభిమానం కదా అని . ఇప్పుడు పలు రకాల టిఫిన్లు చేయదు. ఎక్కడికన్నా వెళదామంటే మీరెళ్ళండి నేను రాసుకోవాలి . అంటుంది. ఒక్కడిని పార్కుకో సినిమాకో వెళ్ళనా. ఏం చేయాలో తోచటం లేదు . కాస్త మీరన్నా ఉపాయాలు చెప్పండి. మా సంసారాన్ని నిలబెట్టండి.” అంటు వాపోయాడు .

ఇది చదివే వాళ్ళంతా మా సంఘం గురించి మీ భార్యలకు కాని, భర్తలకుకాని చెప్పరని తెలుసు. కాని వారి వద్దకు ఎలా చేరాలో మాకు తెలుసు కాని మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాము . బ్లాగులు రాసుకోండి ఎవరూ వద్దనరూ. అందులోను మన తేనెకన్నా తీయనైన మాతృభాష. కాని కాస్త మీ భార్యలు , భర్తలు, పిల్లల గురించి పట్టించుకోండి. ఇలాగే ఉన్నారనుకోండి . పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.

పద్మజ
ప్రెసిడెంట్…

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

10 Responses to బ్లాగ్బాధితుల సంఘం

  1. Sowmya says:

    మరి స్టూడెంటు పిల్లకాయల కథో?
    చదువు మానేశి బ్లాగులు రాస్తూ పోయే బ్లాగర్లు ఎవరూ లేరా?

  2. radhika says:

    అమ్మో మావారు వచ్చే టైం అయింది.త్వరగా ఈ పేజీ క్లోజ్ చేసేయాలి.లేకపోతే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడయిపోతారు.

  3. జ్యోతి గారు, మరి భార్యభర్తలిద్దరూ ఈ వ్యసనానికి (used in lighter sense)బానిసలైతే? అమ్మో…ఇల్లు పిచ్చుక గూడు లా అవుతాదేమో?

  4. jyothi says:

    అలాంటివారున్నారుగా. సిరిమువ్వగారు ఆవిడ భర్త ప్రముఖ బ్లాగర్లు. ఐతే వాళ్ళింట్లో బాధితులు వాళ్ళ పిల్లలే కదా….

  5. అసలు బ్లాగ్భాదితుల సంఘం పెడదామనుకుని దానికి ముందుగా అసలు బ్లాగులు ఎలా ఉంటాయో చదివి అప్పుడు పెడదామని బ్లాగుల వైపు వచ్చి నేనూ ఓ బ్లాగర్ని అయిపోయా. మా పిల్లల్ని మాత్రం బాధితుల్ని చేయలేదండి!! చేయను కూడా, ఎందుకంటే నేను ఈ బ్లాగు వ్యసనానికి బందీని కాను కనుక.

  6. madhu says:

    ఇలాంటి శీర్షికల వల్ల పొద్దు చదవాలంటెనే చాలా చిరాకొస్తుంది. జ్యోతి గారి అన్ని రచనలూ ఇలానె వుంటున్నై.పొద్దు ఆదరణ పెంచుకోవాలంటె ఇలాంటి cheap articles ప్రచురించడం మానాలి. నేనేదో జ్యొతి గారి వ్యతిరేకినో లేక పొద్దు వ్యతిరేకినొ కాదు. నాకు తెలిసిన చాలామంది పాఠకులు
    కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.

  7. chavakiran says:

    మధు గారూ,

    నేను వ్యక్తిగత విషయాలు ఎక్కడా బ్లాగుల్లో చర్చించకూడదని ఓ నియమం పెట్టుకున్నాను కానీ మీ కామెంటు చూసిన తరువాత కొద్దిగా సడలించుకుంటున్నాను!

    మా ఆవిడ ఈ సంఘం పెడతానని నన్ను రోజూ బెదిరిస్తూ ఉంటుంది 🙁

    జ్యోతి గారి ఇతర రచనలు కూడా బాగుంటాయి. కనపడౌటలేదు, ఇంటర్నెట్టు మొత్తం ఓ రౌండేసి వచ్చినది.

    కానీ నాలో ఉన్న షెర్లాక్ హోంస్ ఈ కామెంటు వ్రాసినదెవరో అని తెగ ఆలోచిస్తున్నాడు బయట పెట్టేయమంటార?

  8. nagaraja says:

    ఇలా (బ్లాగ్, వెబ్) అడ్రస్ లేకుండా కామెంట్లు వ్రాసే వారికి ఏం సమాధానం వ్రాయాలో ఏమో?

  9. మధుగారూ, మీ అభిప్రాయం మీది – ఎవరూ కాదనలేదు. దానికి “చాలా మంది పాఠకుల” అభిప్రాయం వత్తాసు తెచ్చుకోడం దేనికీ? పొద్దులో హాస్యం జ్యోతిగారి కలంపోటుతోనే పొద్దు పొడిచిందని వేరే చెప్పక్కర్లేదు. నాకు తెలిసిన చాల మంది పాఠకులు బ్లాగర్లు కూడా ఇదే చ్ప్పారు. 🙂

  10. jyothi says:

    ఇప్పుడే నేను తెలుసుకున్న వార్త..ఇందులో చేరిన బ్లాగ్బాధితుడు ఎవరో తెలుసా??మావారే…పాపం. మరి ఆయన పని బిజీలో ఉండి నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనెలా ఫీలయ్యానంట.సర్లే ఆయనకు కావల్సినవి చేసి పెడితే పోలా!. నా పని నేను చేసుకుంటూ.

Comments are closed.