సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.
————————
మీ బాసుకు మీలో నచ్చని పది వికారాలు..ఇవీ…
బాస్ ని తిట్టుకోని వారు, పేర్లు పెట్టని వారు వుంటారంటే ఆశ్చర్యమే. ప్రతి ఒక్కరికి తన పై అధికారిలో నచ్చని చెత్త లక్షణాలు చాలా వుంటాయి. అయితే ఒక్కసారి అవతలి ఒడ్డు నుంచి మన వైపు చూస్తే ఎలా వుంటుంది?
ఇటీవల గార్డియన్ పత్రిక ఒక విశేష వ్యాసాన్ని ప్రచురించింది. అదేంటంటే మీ బాస్ కు నచ్చని పది లక్షణాలు ఏమిటి ? అని . అంటే ఇక్కడ బాస్ కోసం పని చెయ్యమని ఉద్దేశం కాదు. ఒక వుద్యోగం చేసేటప్పుడు వుండకూడని లక్షణాలను ఏరటమే ఈ వ్యాసం తాలుకా లక్ష్యం . అవి ఏమిటో చూద్దాం.
౦౧. ఆలస్యం
ఆలస్యాన్ని అస్సలు సహించలేరంట బాసులు. “బస్సు లేటయింది”, ” ఇస్త్రీ బట్టలు లేవు”, “పాప ఏడ్చింది” ఇలాంటివి వింటే కంపరమెత్తిపోతుందంట . ఎందుకంటే ఇవే విషయాలను మీలానే చాలా మంది అమాయకపు మొహాలతో చెప్తూ వుంటారు. అవి విని వినీ బాసుకు మండక ఇంకేమవుతుంది? ఆడ బాసులకైతే మరీ అరికాలి మంట నెత్తికెక్కుతుంది.
౦౨. ప్రయత్న లోపం
ప్రతీ దానికి బాస్ చెపితే చేద్దాం అని గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే వారంటే బాసులకు తెగ అసహ్యం అంట. ప్రతీ పనికి సలహాలు అడగటం, వారిని CC లో పెట్టి మెయిల్లు రాయటం కూడా చాలా అసహనాన్ని కలిగిస్తుంది. వీడొక చవట అనుకునే ప్రమాదం వుంది.
౦౩. విపరీత ప్రయత్నం
సీతను చూసి రమ్మంటే, లంకను కాల్చి వస్తే రాముడు సంతోషించాడేమో గానీ, బాసులకు వొళ్లు మండుతుందంట. ఒకటి చెయ్యమంటే వంద పనులు చేసి అసలుకే ఎసరు తెచ్చేవారంటే ఎవరికయినా కాలుతుంది కదా మరి.
౦౪. విపరీతమైన అసంతృప్తి, చెవులు కొరుక్కోవటం
ఎన్ని సదుపాయాలు కలిగించినా “ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది” అనటం, వెనుక చెవులు కొరుక్కోవటం అస్సలు నచ్చదు.
౦౫. అవిశ్వాసపాత్రులు
ఏ బాసుకూ నచ్చని వాళ్ళు విశ్వాస పాత్రంగా కనిపించని వారు. అంటే ఎదురు ప్రశ్నించేవారు కాదు గానీ , వెనుక వెనుక గోతులు తవ్వేవారన్న మాట .
౦౬. చురుకుదనం లేక పోవటం , ఆసక్తి చూపకపోవడం
పైనవే కాక, ఈ పని నాది కాదులే అని అంటీ ముట్టనట్లు వ్యవహరించటం, సమావేశాలలో నిద్ర పోవటం లాంటివి పరమ చిరాకు.
౦౭. స్నేహం
బాసులతో మితి మీరిన స్నేహం వారికి నచ్చదు. ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని తన తల మీదకెక్కడ ఎక్కుతారో అని ప్రతీ బాసుకు భయం వుంటుంది . హద్దులలో వుంటేనే బాసుకు మీరంటే ఇష్టం.
౦౮. ఆలవోకగా అబద్ధాలు
ఎన్ని సాకులైనా చెప్పి మీరు ఆఫీస్ మానెయ్యొచ్చు కానీ మీరు చెప్పిన సాకులు, అబద్ధాలు మీ బాసు నమ్ముతాడనుకోవటం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే .
౦౯. చిన్నపిల్లలా?
చిన్నపిల్లల్లా ప్రతీ దానికి రిపోర్టు చెయ్యటం, అది బాగులేదు, ఇది ఇలా లేదు అని ఫిర్యాదులు చెయ్యటం లాంటివి బాసులకు చాలా చిన్న పిల్లల లక్షణాలుగా కనిపిస్తాయి. అవి వాళ్ళకు నచ్చవు కూడా.
౧౦. అసలుకే ఎసరు
మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి, ఇరకాటాలనుంచి రక్షించే బాసులు, వాళ్ల సీటు మీద మీ కన్ను పడిందని తెలిస్తే మాత్రం క్షమించరు. మీరైనా అంతే కదా? ఏమంటారు ?
ఇవండీ బాసు పురాణంలో కొన్ని ప్రధాన విషయాలు…త్వరలో వుద్యోగులు అసహ్యించుకునే బాసులు ఎలా వుంటారో చూద్దాం .
చెప్పిన సాకే మళ్ళీ మళ్లీ చెప్పే ఉద్యోగులను చూస్తే బాసుకు..వికారమేంటి..వాంతులు అయిపోతాయి…సాకుల్లో కూడా వెరైటీలేని ఉద్యోగులకు ఉద్యోగం దండగంటాన్నేను
నిజమేనండీ, సాకులు చెప్పడంలో కాస్త సృజనాత్మకత ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తవి సృష్టించి చెబుతుండాలి మరి. ఈ సంగతి పక్కనబెడితే, ఇక్కడ చెప్పినవన్నీ ఉపయోగపడే విషయాలు. గార్డియన్ సుధాకరునకు కృతజ్ఞతలు.
ఆ మధ్యనెప్పుడో WSJ లో అనుకుంటా పనికి ఆలస్యంగా వచ్చినందుకు జనాలిచ్చిన సంజాయిషీల్లో గొప్ప సృజనాత్మకంగా ఉన్నవి ఓ పది వేశారు – ఆ తరవాత చాలాకాలం ఆ లిస్టు ఈ-మెయిళ్ళలో తిరుగుతూ ఉండేది.
సుధాకర్ గారూ, ఇవి చదువుకుని నవ్వుకున్నా, వీటిల్లో చాలా నిజం కూడా.
ఇప్పటి బాసు ఒకప్పడు ఇవన్ని చెప్పిన/చేసిన వాడే కద.
భాస్కర్ గారి మాట నిప్పు లాంటి నిజం 🙂
“my boss (8055) is a jewish Carpenter” deeniki rondaakulu ekkuve