బ్లాగుల పేరడీ – 2

బ్లాగుల పేరడీ – 1 కి విపరీతమైన స్పందన వచ్చింది. పేరడీల గురించి అప్పుడే చెప్పాం “ఎవరి మీదైతే పేరడీ రాశామో వాళ్ళు మెచ్చుకున్నప్పుడే ఆ పేరడీ విజయవంతమైనట్లు” అని. ఆ తొలి విడత పేరడీ ప్రయోగం ఒక్క రానారె విషయంలో తప్ప మిగిలిన అందరి విషయంలో ఆయా బ్లాగరుల ప్రశంసలు పొందింది. రానారె ‘ఇది నా స్టైలు కాదు’ అని నేరుగా చెప్పకపోయినా ‘ఇంకొకరి చేత రాయించవలసింది’ అన్నారు. తేడా ఎక్కడొచ్చిందో చరసాల గారు అక్కడే చెప్పేశారు – “రానారె అయితే పెదపంతులు అనేదానికి బదులు పెదయ్యవారు అనేవారేమొ” అని.

ఇక ఈసారి మరికొందరు బ్లాగ్వరుల బ్లాగుల పేరడీలు ఇస్తున్నాం. వీటితో పాటు కొందరి వ్యాఖ్యలు కూడా!

మొదట ఏ పేరడీ ఏ బ్లాగుదో కనుక్కోమని పాఠకులను కోరాం. ఐతే అలా కనుక్కోవలసిరావడం పాఠకుల రసాస్వాదనకు భంగం కలిగిస్తున్నందున ఏ పేరడీ ఏ బ్లాగుదో చెప్పేస్తున్నాం. ప్రయత్నించినవారందరికీ అభినందనలు!
—————————————————–

1. చీమను చంపితే తప్పేంటి?: రాత్రి నన్ను చీమ కుట్టింది. సహజంగానే నేను దాన్ని చంపేసి ఊడ్చేసాను. సృష్టిలో ప్రతి జీవికీ ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. ఒక చెంపను కొడితే రెండోదాన్ని చూపించే రోజులు పోయాయి. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను – ఇదే నేటి సూత్రం. నిజానికి ఇది నేటి సూత్రం కాదు, అతి పురాతన సూత్రం. జీవులు పుట్టినప్పటి నుండి పాటింపబడుతున్న సిద్ధాంతం. ప్రకృతి జీవికి నేర్పిన పాఠం. కాదనేందుకు మనమెవరం? అశోకుడు కళింగులపై దండెత్తితే వాళ్ళు లొంగిపోయారా? చచ్చేదాకా పోరాడలేదా? అలెగ్జాండరుతో పురుషోత్తముడు యుద్ధం చెయ్యలేదా? హిట్లరు దెబ్బను కాసుకునేందుకు దాదాపు యూరపు మొత్తం ఏకమై ఎదుర్కోలేదా? పాకిస్తాను నుండి ఎదురవనున్న పోటీని ఎదుర్కొనేందుకు భారత్ బాంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా నిలబెట్టడం, చైనా టిబెట్ ను ఆక్రమించడం, అమెరికాను వియత్నామ్ మట్టికరిపించడం, సద్దామ్ నుండి వచ్చే ముప్పును నివారించేందుకు బుష్షు ఇరాక్ ను అక్రమించడం.. ఇవన్నీ ఆ కోవలోవే! చీమను మనం చంపకపోతే అది మనలను కుడుతుంది. మన మంచం మీదకు చీమలు చేరితే దాన్ని ఎండలో వేసి చీమలను మాడ్చేస్తామా లేక జీవకారుణ్య సిద్ధాంతం వాడి దిండూ దుప్పటి తీసుకెళ్ళి కింద పడుకుంటామా? ఒకవేళ అలా పడుకున్నా అక్కడికి వచ్చి కుట్టకుండా ఉంటాయా? నన్ను కుట్టిన చీమను చంపక వదలను, అది నా పద్ధతి! లేకపోతే అదీ మళ్ళీ కుడుతుంది నన్ను.

అమెరికా నుండి ఉత్తరం ముక్క

2. చీమకాటు – బాసుపోటు: చీమ ప్రసక్తి రాగానే నాకు రెండేళ్ళ కిందట జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. నేను హైదరాబాదులో ఓ MNC కంపెనీలో పనిచేసే రోజులవి. మా పెద్దాయన (అంటే మా బాసులెండి) కూడా అందరితోపాటే ఆఫీసు కాంటీనులో తినేవాడు. నేను మా కోటిగాడు మాత్రం ఆయన తిన్నాకో, తినేముందో వెళ్ళి తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనతో మాత్రం తినేవాళ్ళం కాదు. ఆయన కంట పడేవాళ్ళమే కాదు. ఎందుకంటే.. యాసుకు యెనకా, పెద్దాయనకు పక్కనా ఉండొద్దంటారు కదండీ.. అందుకన్నమాట! పైగా మా కోటిగాడికి ‘బాస్వరం’ ఉంది. బాస్వరం అంటే బాసును చూస్తే జ్వరం రావడం అనే రోగం అన్నమాట. ఇన్ని బాధలు ఉండగా ఆయనకు ఎదురవడం ఎందుకు చెప్పండి. పొరపాటున మేం తింటూ ఉండగా ఆయన వచ్చాడనుకోండి.. తప్పించుకోడానికి కూడా మా కోటిగాడో మార్గం కనిపెట్టాడు. క్యాంటీనులో టేబులు తుడిచే రంగాగాడు మేము తింటున్నంతసేపూ వరండాను ఓకంట కనిపెట్టి ఉండి బాసు వస్తూంటే వెంటనే చెప్పేవాడు. మేం ఛక్ మని మా మా పళ్ళేలు తీసుకుని వంటగదిలోకి పోయి అక్కడే తినేసి, అట్నుంచటే దొడ్డిదారిన వెళ్ళిపోయేవాళ్ళం. “వీళ్ళిద్దరూ క్యాంటీనులో ఎప్పుడూ కనబడరెందుకబ్బా” అనేది మా పెద్దాయనకు పెద్ద పజిలు.

ఓ సారిలాగే మేం తింటూ ఉండగా పెద్దాయన రానే వచ్చాడు. రంగాగాడు మాకు చెప్పేసరికి కాస్త ఆలస్యమైంది. మేం పళ్ళేలు సర్దుకుని వంటగదిలోకి పారిపోయేలోగా ఆయన డైనింగు హాల్లోకి ఎంటరైపోయాడు. మేం వంటగదిలోకి పారిపోవడం చూడనే చూసాడు. గభాలున ఆయన కూడా వంటగదిలోకి పరుగెత్తుకొచ్చాడు. అది చూసిన మేము చటుక్కున సరుకుల బస్తాల చాటుకు వెళ్ళి మాయమై పోయాము. పాపం తెగ వెతికాడు గానీ మేం కనపడలా! మరి, మేమా మజాకానా!? పళ్ళేల్లో మిగిలింది అక్కడే తినేద్దామని కోటిగాడి చెవిలో గుసగుసగా అన్నాను. తొడ మీద ఛర్రుమంది. పీకల్దాకా కోపమొచ్చింది నాకు. “ఎందుకురా గిచ్చుతావు” అని గుసగుసగా అరిచాను. “నన్ను రెండు తొడలమీదా గిచ్చి, తిరిగి నన్నే అంటావా” అని వాడు పేద్దగా అరిచాడు. ఈలోగా తొడలమీదే కాక వీపు, కాళ్ళు చేతులు మొదలైన శరీర భాగాలన్నిటి మీదా గిచ్చడం మొదలైంది. ఒక మనిషికి ఒకే సారి అన్నిచోట్ల గిచ్చడం సాధ్యం కాదు కాబట్టి, అప్పుడు మా ఇద్దరికీ అర్థమైంది, మేము చీమల పుట్ట మీదే కూచ్చున్నామని. చెరో పొలికేక పెట్టుకుంటూ పళ్ళేలు గిరాటేసి, సరుకుల బస్తాల వెనక నుండి బయటికి వచ్చాం. ఎదురుగా నడుమ్మీద చేతులు పెట్టుకుని, కాళ్ళు విడదీసి పెట్టి, నిటారుగా ఆరడుగుల ఎత్తున నిలుచున్న మా పెద్దాయన, మొహమ్మీద ఘోరమైన పజిలింగు లుక్కుతో – అదేదో సినిమాలో మెల్కోటే లాగా!

“క్మాన్ ప్రసాద్, వాట్స్ రాంగ్ విత్యూ గైస్?” అని అంటున్నాడు. చీమల బాధలో మాకవి వినబడితేనా? వెంటనే ఆయన్ని ఓ పక్కకు నెట్టేసి, పరిగెత్తుకుంటూ పోయి అక్కడి బాత్రూములో దూరి ఒళ్ళంతా కడుక్కున్నాక కూడా తపన పూర్తిగా తీరలేదు. చీమకాటు కంటే బాసుపోటే నయమని అప్పుడు అర్థమైంది మాకు!

ప్రసాదం

3. చీమ చతురత: మొన్నొక రోజున రాత్రి భోంచేసాక మంచమ్మీద మేను వాల్చి, చిదానందంగా బాలమురళిగారి గంధర్వ గానాన్ని వింటూ అలౌకికస్థితిలో ఉన్నాను. బయట వర్షం పడుతోంది. కాస్సేపటి కిందటి వరకు హోరున కురిసిన వర్షం ఇప్పుడు చిరుజల్లుగా పడుతోంది. గదిలో నుండి బయటికి ప్రసరిస్తున్న వెలుతురులో చినుకులు తళతళా మెరుస్తున్నాయి. తెరచిన కిటికీల్లోంచి చల్లని తెమ్మెరలు. గదిలో మంద్రంగా “ఎందరో మహానుభావులు..” ఈ జీవితానికిది చాలు అనిపించేంటంత హాయి. మంచాన్ని కిటికీకి దగ్గరగా జరుపుకుని బయటకు చూస్తున్నాను. కిటికీలో గ్రిల్లుకు బయటి వైపున వాన నీళ్ళు నిలిచి ఉన్నాయి. ఆ నీళ్ళలో..

ఓ అశ్వత్థ పత్రం తేలుతూ ఉంది. ఆ ఆకు మీద – ఓ చీమ! చిన్నప్పుడు చందమామ పుస్తకంలో సృష్టి పుట్టుక గురించి చదివిన కథ గుర్తుకు వచ్చింది. నిజానికి గుర్తుకొచ్చింది కథ కాదు, ఆ కథకు శంకర్ వేసిన బొమ్మ – ఓ పెద్ద మర్రి ఆకు మీద పసి బాలుడు కాలు మీద కాలు వేసుకుని పడుక్కుని ఉన్న బొమ్మ! వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువు! అచ్చు అలాగే ఈ రావి ఆకు మీద చీమ! భగవానుడి పదకొండో అవతారం కాదు గదా ఈ చీమ!! నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. సీడీప్లేయరు లోంచి “వటపత్రశాయికీ వరహాల లాలీ..” అంటూ సుశీల గారి గొంతు ప్రవహిస్తూంది.

చీమ నీళ్ళ బారిన పడకుండా కాపాడుదామని, ఆకును జాగ్రత్తగా నీళ్ళలోంచి బయటికి తీసి, కిటికీ ఈవలకు తెచ్చి, మంచమ్మీద పెట్టాను. సీడీ ప్లేయరు సీడీని మార్చేసింది. “ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..” గది నిండా ఘంటసాల గళం. ఈ పాట వింటున్నప్పుడల్లా ఘంటసాల గారు నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. పాటలో లీనమైతే అలాగే ఉంటుందేమో! ఎంత చురుకైనదో ఈ చీమ, నేనా పాట గురించి ఆలోచిస్తూ ఉండగానే చకచకా నడుస్తూ ఆకు దిగింది, పక్క మీద పరుగెడుతూ నేను చూసుకునే లోపు నా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది. నా కాలి కిందపడి అది నలిగిపోతుందేమో అని తప్పుకునే లోగా నన్ను కుట్టనే కుట్టింది. సరిగ్గా మోకాలు మీద అది కుట్టిన చోట తీవ్రమైన బాధ! చీమ ఎక్కడుందా అని చూసాను. కనబడితేగా!

వెనక్కి వాలి, దిండుకు చేరి మోకాలును రుద్దుకుంటూ ఉండగా పాట మారింది.. బాలూ గారు పాడుతున్నారు “బ్రోచేవారెవరురా..”

శ్రీకారం

4. చీమ కుట్టింది. కానీ ఎవరిని?: రాత్రి నన్ను చీమ కుట్టింది. మామూలుగా ఎవరికైనా పై వాక్యంలో ప్రముఖంగా కనిపించే భాగం “చీమ కుట్టింది” అనేదే! అయితే ఆ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. “నన్ను” అనే మాటను గమనించండి.

కుట్టడం చీమ సహజ గుణం. ప్రతీ జీవికీ స్వాభావికమైన గుణాలు కొన్ని ఉంటాయి అని ఓషో చెప్పారు. బుద్ధుడూ, ఏసూ, కృష్ణుడూ కూడా అదే మాటను అనేక రకాలుగా, అనేక భాషల్లో చెప్పారు. కాబట్టి చీమ కుట్టడం విశేషమెఏమీ కాదు, అది స్వాభావికమే! మరి విశేషమేంటో చెప్పుకోబోయే ముందు, చీమ కాటుకు పర్యవసానాలు చెప్పుకుందాం.. చీమ కుడితే ఏమౌతుంది? నెప్పి పుడుతుంది. రుద్దు కుంటాం, దద్దురొస్తుంది, మందు రాసుకుంటాం. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోతుంది. ఈ బాధలన్నీ ఎవరికి? కుట్టించుకున్నవారికి, కుట్టిన చీమకు కాదు! కాబట్టి మొదట రాసిన వాక్యంలో ప్రముఖమైన పదం ఏమిటి? “నన్ను” అనే మాట! ఈ “నా” అనే భావనే ప్రమాదకరమైనది. కేవలం కొన్నాళ్ళు నివసించడానికి ఆత్మ ఎంచుకున్న తొడుగే ఈ దేహం! ఈ దేహానికి కలిగే బాధలను తనవిగా ఆత్మ భావించరాదు. వచ్చేటపుడు ఒట్టిచేతుల్తోటే వచ్చాం, పోయేటపుడు అలాగే పోతాం. కానీ, మధ్యలో వచ్చే ఈ “నా” అనే భావనలే మనకు ఎంతో చెరుపు చేస్తాయి. చీమ “నన్ను” కుట్టింది అని అనుకోబట్టే కదా మనకు నెప్పి పుట్టేది?! అదే చీమ కుట్టింది అని మాత్రమే అనుకుంటే నెప్పి పుట్టేదా? లేదు! అంచేత నేను, నా, నన్ను అనే భావనలను విడనాడితే చీమ కుట్టిన నెప్పి మనకు ఉండదు అని నేను భావిస్తున్నాను. చీమ కుట్టకుండా జాగ్రత్త పడేవాడు ఉత్తముడు, కుట్టాక నన్ను కాదులెమ్మనుకునేవాడు మధ్యముడు, కుట్టింది బాబోయ్ అని ఏడ్చేవాడు అధముడు. నేను చెప్పాల్సింది చెప్పాను, వినకపోతే విననివాళ్ళ ఖర్మ.

తెలుగునేల

5. చీమ కుట్టింది – పీడాబోయింది:
చీమ నన్నూ కుట్టింది. కానీ బ్లాగులు రాయలేదే! వికీపీడియాలో రాసుకుపోయాను. తాగుబోతు లాగా వికీబోతును నేను. చీమకాటుకు సరైన మందు వికీపీడియాలో రాయడమే..
“భవిష్యత్తులో చీమ కుట్టకుండా ఉండాలంటే, ఒకవేళ కుట్టినా నెప్పి పుట్టకుండా ఉండాలంటే, ఒకవేళ పుట్టినా వెంటనే తగ్గిపోవాలంటే, ఒకవేళ తగ్గకున్నా ఆసుపత్రి పాలు గాకుండా ఉండాలంటే, ఒకవేళ పాలైనా, ప్రాణహాని లేకుండా ఉండాలంటే..వికీపీడియాలో వ్యాసాలు రాయండి. ఫలితం కనబడకపోతే ఇంకా రాయండి, ఇంకా ఇంకా రాయండి.”

క్రికెట్ పిచ్చిగాళ్ళను ఎర్ర చీమల చేత కుట్టిస్తే బాగుంటుంది. క్రికెట్ కాటుకు చీమ దెబ్బ! అన్నమాట. మనవాళ్ళు క్రికెట్ లో ఓడిపోయారనే బాధను ఈ విధంగా తేలిగ్గా మర్చిపోవచ్చు.
చీమ కాటుకు గురైన దురదృష్టవంతులు మన బ్లాగరులు కాగా, వారి బ్లాగులకు బలైన అభాగ్యుణ్ణి నేను. వారి టపాలు చదివి నాకు తోచిన కొన్ని వ్యాఖ్యలు రాస్తున్నాను.

1. చీమ కుడితే నెప్పి పుట్టక ఏం పుట్టుద్ది? రోట్లో చెయ్యెట్టి వేలు నలిగిందని వాపోతే ఎలా?
2. ఆడదైనా, మగదైనా చీమ చీమే, ఏది కుట్టినా నెప్పి ఒకటే. నిప్పు మనదే గదా అని చేత్తో పట్టుకుంటే కాలకుండా ఉంటుందా?
3. తన దాకా వస్తే గానీ తెలియదట! చీమ కుడితే పుట్టే నెప్పి అందరికీ ఒకటే, అందరూ అబ్బా అనే అంటారు!
4. చీమ కుడితే శారీరక బాధ మాత్రమే ఉంటుందనుకున్నాను, ఇలా పిచ్చి వాగుడు కూడా ఉంటుందనుకోలేదు
5. కంప్యూటరు లేనివాళ్ళు ఈ స్క్రీనుషాట్లను ఎలా తెరవాలో కూడా రాస్తే బాగుండేది.

ఈ బ్లాగులన్నీ చదివాక నాకో సినిమా టైటిలు తట్టింది, చూడండి. (పక్కది టాగ్ లైను!)
చీమ కాటుకు బ్లాగు దెబ్బ – నెప్పి తగ్గకపోతే మీ ఖర్మ!

పూతరేక్స్

6. Ant’s bite:
మా ఉషాకిరణ్ పిల్లలు మరీ తెలివి మీరి పోతున్నారు. ఇవ్వాళ ఓ విశేషం జరిగింది. తనను పక్కన ఉన్నవాడు గిచ్చాడని ఒకబ్బాయి ఫిర్యాదు చేసాడు. వాడేమో ‘లేదు టీచర్, నేను గిచ్చలేదు, వాణ్ణి చీమ కుట్టింది’ అని అన్నాడు. ఇద్దరూ నాయెదటే వాదించుకున్నారు కాసేపు. అయినా చీమ కుడితే గిచ్చినట్లు ఎందుకుంటుందిరా, నువ్వు గిచ్చే ఉంటావు అని అన్నాను. దానికి వాడు “మీకు తెలీదు టీచర్, రెండూ ఒకలానే ఉంటాయి” అని వాదించాడు. నాకు నోట మాట రాలేదు. అప్పుడు గట్టిగా వాదించలేక పోయాను గానీ, మరుసటి రోజు క్లాసులో వాడికి గట్టిగా చెప్పగలిగాను, ఆ రెండూ ఒకేలా ఉండవని. ఏమైందంటే..

ఆ రాత్రి.. సాయంత్రం ఆ పిల్లవాడు అన్నమాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎంత ధైర్యం ఈ కాలం పిల్లలకు? మీకు తెలీదు అని టీచరుతోటే వాదించగలుగుతున్నారు. అయినా, వాడన్నట్లు చీమ కుట్టడం, గిచ్చడం ఒకేలా ఉంటాయా? నా ఆలోచనలు చీమల వైపు మళ్ళాయి. సరిగ్గా ఆ క్షణంలో చీమ కుట్టిన నెప్పి అనుభవం లోకి వచ్చింది నాకు. కుడి కాలి చిటికెన వేలుమీద కుట్టిన చోట మొదలైన నెప్పి నిదానంగా ఒళ్ళంతా పాకుతూ ఉంటే స్పష్టంగా తెలుస్తూంది నెప్పి నడక. శరీరమంతా గోక్కోవాలన్నంత తహతహ. గిచ్చితే పుట్టే నెప్పి ఈ నెప్పిలో సహస్రాంశమైనా ఉండదు. నిన్నటి క్లాసులో ఆ పిల్లవాడికి చీమే గనక కుట్టి ఉంటే కప్పెగిరి పోయేలా ఏడ్చి ఉండేవాడు. ఆ రెండు నెప్పులకీ పోలికే లేదని తెలిసి వచ్చింది.

సౌమ్య

7. చీమలను చూచి నేర్చుకుందాం -1 : నిన్న నన్ను చీమ కుట్టింది. విశేషమేమిటంటే మన దేశంలో ఉన్నన్ని రకాల చీమలు బహుశా మరే దేశంలోను లేవని చెప్పొచ్చు – హిందీ దేశం, తమిళ దేశంతో సహా. ఎర్రచీమలు, గండుచీమలు, నల్ల చీమలు, కరెంటు చీమలు, ఆకుచీమలు, చలిచీమలు, వాన చీమలు, ఎండచీమలు ఇలా అనేక రకాల చీమలున్నాయి మనకు. వీటన్నిటిలోను పలనాడు, కడప, వరంగల్లు ప్రాంతాల్లో కనిపించే ఎర్ర చీమలు బహు ప్రమాదకరమైనవి. ఇవి కుడితే తేలు కాటును మించి నెప్పి పుడుతుంది. అయితే చీమలను తినడం వలన కళ్ళకు మంచిదని కొందరు అంటారు. అంత తెలివి తక్కువ వాదన మరొకటి ఉండదని నా ఉద్దేశ్యం. ఎప్పుడో తెలుగు జాతి సమైక్యంగా లేని రోజుల్లో హిందీ దురహంకార సామ్రాజ్యవాదులు ప్రవేశపెట్టిన భావజాలమిది. ఇటువంటి ప్రమాదకర ధోరణిని విడనాడవలసిన అవసరాన్ని తెలుగు జాతి గుర్తించాలి. ఇకపోతే చీమల నుండి తెలుగుజాతి నేర్చుకోవాల్సింది బోలెడుంది. ముఖ్యంగా వాటి లోని సమైక్య భావం, క్రమశిక్షణ. తెలుగు వారు వాటి సమైక్యతలో లేశమాత్రం అలవర్చుకున్నా నేడీనాడు హిందీ వారికి సామంతులుగా ఉండాల్సిన ఖర్మ పట్టేది గాదు. కనీసం, తనదారికి అడ్డొచ్చిన వారిని కుట్టి పారేసే వాటి పొగరు మనకు ఉన్నా బాగుండేది. చీమల నుండి మనం నేర్చుకోవాల్సినవి మరింత వివరంగా తరువాతి టపాలో..

తెజావా

8. ఎందుక్కుట్టావు?:
ఎందుకిలా చేసావు?
నీకేం అపకారం చేసాను?

నా గదిలో ఓ మూలన
నీకోసం బహు వీలున
ఇచ్చానో జాగాను
చక్కని పుట్టను కట్టుకోను

నా మంచంలో, కంచంలో
అప్పచ్చుల టిఫినుల్లో
పంచదార డబ్బాలో,
ఏడ తిరిగినా, ఏమి చేసినా
ఇదేమని నిన్ననలేదే!

ఐనా, ఎందుకీ పని చేసావు?

నా దారిన నేపోతూ
పొరపాటున నీ కడ్డొస్తే
చిటికెన వేలును కొరికేసావే
కృతఘ్నతకు తెరతీసావే!

చీమత్వాన్నొదిలేసి
మనిషిలా మారిన ఓ చీమా!
నీలోని స్వార్థాన్ని చంపేసి
కృతజ్ఞతను కప్పుకుని
మళ్ళీ చీమగ ఎప్పుడు పుడతావు?
..ఎప్పుడు పుడతావు?

రాధిక

9. చీమకాటు ఎంతో ఘాటు: అసలేమిటీ చీమల గొప్ప? పిపీలికా ఘాతం నాక లోక విహరణం అని భర్తృహరి అంతటి వాడే చెప్పాడు. చీమల కాటు ఎంత ఘాటో ఇక వేరే చెప్పాలా?అయితే చీమ కాటు వలన కలిగేదాన్ని నెప్పి అని అనరాదని చాలా మందికి తెలియదు. నేనీ విషయాన్ని మరో బ్లాగులో వివరించాను. అయితే కుట్టడం అని మనం అనుకుంటున్నది అసలు కుట్టడమే కాదని, అది ముద్దాడడమని కూడా చదివాను. ఈమధ్యే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందట. సైన్సు పేరిట ఏం చెప్పినా నమ్మాలని ఈ శాస్త్రవేత్తలు అనుకుంటారు. అన్నీ తమకే తెలుసనీ అనుకుంటారు. సైన్సుకు తెలిసింది పిపీలికమంత, తెలియనిది బ్రహ్మాండమంత. తెలియనిదాని గురించి తెలుసుకోవాలంటే మన శాస్త్రాలు చదవడం తప్ప మరో మార్గం లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సత్యం వీళ్ళెరుగుదురా అని నా సందేహం!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

10. చీమ కాటుకు మందూ మాకూ: మా సుభాస్ రాసుకుంటాడని పలకా, బలపం కొనిచ్చాను. బలపాన్ని వాడే కొత్త పద్ధతులు కనిపెట్టాడు వాడు. ఎక్కడ కంత కనబడితే అక్కడ బలపాన్ని దూర్చడం మొదలుపెట్టాడు. ముందు ముక్కులో పెట్టుకున్నాడు, కష్టమ్మీద దాన్ని బయటికి తీసాను. కాసేపటి తరువాత చూస్తే హాల్లో మూలన ఏదో చిన్న కంతలో దూర్చాడు. తీసిద్దాం కదా అని వేలు అందులో పెట్టాను. అది చీమ ఇల్లని నాకు తెలిసేలోగా కసుక్కున వేసేసింది ఓ చీమ. వెంటనే అమృతాంజనం రాసుకున్నాను. చప్పున తగ్గిపోయింది. చీమకుడితే అమృతాంజనం అంతటి మందు మరోటి లేదు. అమృతాంజనం అందుబాటులో లేకపోతే జిందా తిలిస్మాత్ వాడొచ్చు. నాకీ సంగతి మా నాయనమ్మ చెప్పింది. ఈ సంగతి బ్లాగు వీరులందరికీ వెంటనే చెబుదామనిపించి ఆఫీసుకు వెళ్తూ కారులో ఇది రాస్తున్నాను.

శ్రీక్ష్ణదేవరాయలు

11. చీమలొస్తున్నాయి, మీ రక్తం పట్రండి!: అసలా కుట్టిన చీమ ఏ దేశందా అని గమనించి చూసాను.. మతి పోయింది నాకు. తలమీద నక్షత్రాలు, నడ్డి మీద అడ్డగీతలు..అది అమెరికా చీమని చూడగానే తెలిసిపోతూనే ఉంది. అమెరికా వాడు ఇక్కడికొచ్చి కాసిని డబ్బులు విదిల్చి, మన దగ్గరి నుండి రక్తం తీసుకు పోయే దాని కోసం జెనెటికల్లీ ఇంజనీర్డ్ చీమలను తెచ్చాడు. ఇక మన చంద్రబాబు, వయ్యెస్సులు- వాడు మనకేదో మహోపకారం చేస్తున్నాడని నెత్తిన కూచ్చోబెట్టుకుంటున్నారు. మన బంగారం మంచిదైతే గదా, కంసాలిని అనేందుకు!

గుండెచప్పుడు

12. ఆడచీమలు, మగ అహంకారం: పొద్దున నేను చేసిన పచ్చిమిరపకాయ హల్వా ఎంత రుచిగా ఉందో చెప్పలేను. చీమలకు కూడా బాగా నచ్చినట్లుంది; తెగ చేరాయి దాని చుట్టూ! హల్వా రుచి చూడగానే ఏంటో మరి, పిచ్చెక్కినట్టు ఒకటే పరుగులు! ఆ పరుగులకు నేను అడ్డం వచ్చానని కాబోలు.. కసుక్కున వేసేసాయి, ఒకదాని వెంట మరోటి. నెప్పి అదిరిపోతోంది.
అసలు చీమ కుట్టింది, కుట్టింది అని అంటారే గానీ, చీమ కుట్టాడు అని అనరేంటి? కుట్టేవన్నీ ఆడచీమలే, మగచీమలసలు కుట్టవనా? ఎంత వలపక్షమో చూడండి.. మనిషి కంటే హీనజీవులైన జంతువులన్నిటినీ ఆడ, మగ తేడా లేకుండా స్త్రీలింగంలోనే సంబోధిస్తాం. అంటే హీనజీవులను స్త్రీ లింగాలుగా గుర్తించినట్లే కదా! ఇదీ స్త్రీజాతి పట్ల మగవాడికున్న గౌరవం!

సరే, అంతా చదివారు గదా, ఇక కింద నేనడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1. చీమలు ఆడవాళ్ళనే ఎక్కువ కుడతాయి ఎందుకు?
2. ఓ ఇంట్లోని చీమల పుట్టలో ఆ ఇంటి ఇల్లాలు వేలు దూర్చింది. అయినా చీమలు కుట్టలేదు. ఎందుకని?
3. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ప్రపంచంలో ఉన్న చీమలెన్ని ?
4. కుక్కలు భౌ, భౌ మంటాయి, పిల్లులు మ్యావ్, మ్యావ్ అంటాయి. మరి చీమలు ఏమంటాయి?
5. ఆడ చీమ జీవితకాలమెంత?
6. చీమలు గతజన్మలో ఏ పాపం చేసి ఉంటాయి?

జ్యోతి

13. చీమల పాలైన వీకెండ్: వీకెండ్ల పనీ గినీ ఏముండదు గదాని, లేటుగ నిదర లేసిన. పొద్దుగాలే లేచి చేసెడిదేముంది? లెగిసీ లెగవంగనే ఇదుగో నా బ్లాగుల రాసుడు మొదలు బెట్టిన. కంప్యూటర్ల నేను ఇట్ల టైపు చేస్తనే ఉన్న, పక్కనుండి ఏదో లైను కదులుత కానొచ్చింది. ఏందా అని చూసినా..వందలాది చీమలు. మందలుగా చీమలు. ఏడికెల్లి వచ్చినై అన్ని చీమలు? ఒక్కదానెన్క ఇంకోటి- సైనికుల మల్లె!? వస్తనే ఉన్నై, లైను తెగుతనే లేదు. అమెరికాల చీమల్ని చూసుడు ఇదే మొదటిసారి. వరంగల్ల, హన్మకొండల ఇంతకన్న పెద్ద చీమల్ని చూసినా గానీ.. హమ్మా!కుట్టింది చీమ.

జేప్స్

14. చీమలే లేని దేశంలో..: నిజానికి ఝరియాలో చీమలనేవి కంటికి కనబడవు. అబ్బే సమస్య కళ్ళది కాదు, చీమలదే! ఇక్కడ చీమలస్సలు లేవు! అయితే ఒకప్పుడు ఇక్కడ కూడా పుట్టలు పుట్టలుగా, గుట్టలు గుట్టలుగా చీమలు ఉండేవట. వాటితో రకరకాల వంటలు చేసుకు తినేవారట – చీమల వేపుడు, చీమ బిరియానీ, చీమావకాయ, చీమల ఉప్మా, ఎర్రజీమల పులుసు, చీమ నూడుల్సు – ఇలా రేపుమాపు చీమలనే తినేవాళ్ళట. ఆ తాకిడికి, దేశంలోని చీమలన్నీ అయిపోయి, చీమజాతే అంతరించిపోయిందట. ఇది మా చీమాయణం! అంచేత నాకు చీమ కుట్టలేదు!

ఆహా, చీమలు లేని ఝరియాకు కోరి వలస పోదామా అని పాడుకుంటూ బట్టలు సర్దేసుకోకండి.. అవి లేకున్నా వాటి తాతల్లాంటి దోమలు ఉన్నాయిక్కడ. ఈ దోమలే రెండింటి పనీ చేసేస్తూ ఉంటాయి. రేయనకా, పగలనకా శ్రమిస్తూ, జనాన్ని కుట్టేస్తూ ఉంటాయి. ఇక్కడివాళ్ళకు కళ్ళు ఉబ్బెత్తుగా ఎందుకుంటాయో మీకు తెలుసా? రాత్రి పూట ఈ దోమల దెబ్బకు నిదర్లుండవు కదా. అందుకని పాపం నిద్ర కోసం మొహం వాచిపోయి, అలా కళ్ళు వాచిపోయి ఉంటారన్న మాట. ఇప్పుడు చెప్పండి, ఝరియాకు ఎప్పుడొస్తారు?

సత్యశోధన

15. జనరేషను కాటు: ఏంటసలు ఈ పెద్దల దాష్టీకం? ప్రతీదానికీ మీ కుర్రకారు ఇలా అనకూడదు, అలా రాయకూడదు అని strictures పెడతారేమిటి? తల దువ్వుకుంటే తప్పు, దువ్వుకోకపోతే తప్పు, నూనె రాసుకుంటే తప్పు, రంగేసుకుంటే తప్పు. లుంగీలు కట్టుకుంటే తప్పు, లాగులు తొడుక్కుంటే తప్పు. మొన్నటికి మొన్న.. ఆఫీసు canteenలో చీమకుట్టింది. “హబ్..బా, చీమ కుట్టిందిరా” అని ఓ కేక పెట్టి, కుట్టిన చోట రుద్దుకున్నాను. నెప్పి పుడితే ఆ మాత్రం అనరా, రుద్దుకోరా!!? పక్క table దగ్గర కూచ్చున్న మా HR Manager అది విన్నాడు. అంతే ఇక క్లాసు మొదలు.. “చీమ కుట్టినంత మాత్రాన అలా అరవాలా, ఆ మాత్రం ఓర్చుకోలేక పోతే ఎలా? ఎందుకు పనికొస్తారయ్యా మీ కుర్రాళ్ళు? అదే మా generation లో అయితేనా.. తేలు కుట్టినా కిక్కురుమనే వాళ్ళం కాదు” అంటూ వాయించేసాడు. చీమ కుట్టిన బాధ కంటే ఈ వాయింపు బాధ ఎక్కువైపోయింది. (అసలు వీడో దొంగై ఉండాలి. దొంగలు తేలు కుడితే అరవరుగా!)
అన్నట్టు, నాకో పెద్ద తేలు కావాలండి, చిన్న పనుంది. ఎక్కడ దొరుకుతుందో కాస్త చెబుతారా?

ప్రవీణ్

16. చీమ కాటుకు కందం వేటు: చీమ కుట్టడం అనేది గొప్ప విషయం కాదు. అది అరుదూ కాదు. అసలు చీమ కుట్టినంత మాత్రాన మిన్ను విరిగి మీదేమీ పడిపోదు. కాకపోతే ఏ నడివీపునో కుడితేనే కాస్త కష్టంగా ఉంటుంది. వీలుగా ఉన్నచోట కుడితే మరేం ఫరవాలేదు. అడిగారూ? నాకు తెలుసు, వీలు అంటే ఏంటని మీరడుగుతారని! ఇప్పుడు చూడండి.. రాత్రి నన్నో చీమ కుట్టింది. అదృష్టవంతుడు అంబులెన్సు కింద పడ్డట్టు, చక్కటి వీలైన చోటే కుట్టిందా చీమ. సరిగ్గా కుడి మోకాలు మీద కుట్టింది. కూచ్చున వాణ్ణి కూచ్చున్నట్లే ఉండి, చేత్తో కుట్టిన చోట రుద్దుకున్నాను. కనీసం వంగునే పని కూడా లేదు. అదే ఏ వీపు మీదో కుట్టిందనుకోండి.. వీపును గోడకేసి రుద్దుకోడం తప్ప మరో మార్గం లేదు కదా! అదన్నమాట “వీలు” అంటే! అయితే ఒకటి.. అందింది కదా అని ఓ.. గోకేస్తే కందుద్ది. నైసుగా, సుతారంగా రుద్దుకోవాలన్నమాట. ‘కుట్టడం చీమ లక్షణం, గోకడం మనిషి గుణం’ అని అనకండి, గోకినపుడు కందడం చర్మధర్మం మరి!

అందింది గదా అని పడేసి గోకడం, కందింది గదా అని లేహ్యాలు నాకడం – ఇవన్నీ ఏమీ చెయ్యకండి. హాయిగా ఓ కందం అందుకోండి. నెప్పీ గిప్పీ వీజీగా మటుమాయ మౌతాయి. కందం అంటే ఏంటి, అదెలా రాయాలి, కందంలో అందమెక్కడుంది.. లాంటి ప్రశ్నలడిగారో – వెయ్యి నూట పదారు గుంజీళ్ళు తియ్యాలి, మీ ఇష్టం! మచ్చుకో కందం..

చీమల బాధకు తాళక
కోమల చర్మము గోటితొ గోకకు సుమ్మీ!
విమలత చిందే జత కం
దములల్లుము బాధ కలుగదు బ్లాగ్వీరా!

కొత్తపాళీ

17. చీమకాటుః చీమ కుట్టడం చాలా సహజం, దానిమీద ఈ టీవీ చానెళ్ళన్ని అంత సమయాన్ని ఎందుకు వృధాచేస్తున్నాయి? మరో విషయమే లేదా? చీమల గురించే చెప్పవలసి వస్తే, చీమలు కుట్టడం గురించి కాదు, చీమల పుట్టల గురించి చెప్పొచ్చు కదా? మన టీ.వి. వాళ్ళకి అంత ఆలోచనక్కెడది?

చీమల పుట్టలు, తేనెల తుట్టల వెనక చాలా మర్మం ఉంది. ఒకప్పుడు మనుషుల్లాగనే చీమలు, తేనెటీగలు కూడా చాలా గొప్ప, గొప్ప నగరాలు, సామ్ర్యాజ్యాలు స్ఠాపించేయట. కాని, ఏంత సేపూ, తిండిగురించి, బౌతికావసరాల మీదే శక్తి అంతా కేంద్రీకరించటం వల్ల, కాల క్రమంలో – ప్రకృతికి వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. చివరకి, చీమలకి, తేనెటీగలగీ మద్య చెలరేగిన ప్రపంచ యుద్దాలలో వాటి అస్తిత్వాన్ని పోగొట్టుకొని, ఇదుగో, ఇప్పుడు – అతి సూక్ష్మ రూపాలతో బతుకులీడుస్తున్నాయి.

అందుకే వాటికి, ఇప్పటికీ ఒకప్పటి క్లిష్టమైన సాంఘిక వ్యవస్త ఉన్నప్పటికీ, ఎంతసేపూ తిండి సంపాదించటం మీదనే ధృష్టి అంతా. పూర్వ జన్మ వాసనలు ఇంకా పోలేదు – అందుకే చీమలూ, తేనెటీగలూ – కొద్దిగా అలజడి జరిగినా, వాటి పుట్ట దగ్గరకి ఎవడైనా పోయినా – వెంటనే దండయాత్ర ప్రకటించెస్తాయి – మనుషుల్లాగనే.
We must remember that super specialization leads to anthills and beehives.

శోధన

వ్యాఖ్యల పేరడీ:

1. mee blaagu eMtO baaguMdaMDi. cheema kuDitae neppi puDutuMdani cakkagaa teliyajeppaaru. -రాధిక

2. అయితే అమృతాంజనం రాస్తే చీమ కుట్టిన నెప్పి తగ్గుతుందంటారు! కానీ మా భట్టుపల్లె పిలకాయలు అట్ల అనుకోగా నాకెప్పుడు వినబళ్ళా, చెవినబళ్ళా. -రానారె

3. త్రివిక్రమ్, మంచి విషయాలే చెప్పావయ్యా! చీమలకే పళ్ళుండి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. -కొత్తపాళీ

4. చీమ కుడితే నెప్పి పుట్టడం అనేది భ్రమ మాత్రమే! నెప్పి నాలుగు రకాలని బంధకుని బాధా శాస్త్రం ఘోషిస్తోంది. కీటక ఘాతం, శస్త్ర ఘాతం, నిందా ఘాతం, ప్రణయ ఘాతం -ఇవీ ఆ నాలుగు. కీటకం కుడితే పుట్టేదీ, ఆయుధం తగిలినపుడు కలిగేదీ, నిందించినపుడు పొందేదీ, ప్రణయంలో రేగేదీ అయిన నాలుగు నెప్పులే లోకంలో ఉన్నాయి. చీమ కీటకం కాదు (ఎందుక్కాదో మరోసారి వివరిస్తాను) అంచేత అది కుడితే పుట్టేది నెప్పి కాదు. కాబట్టి ఇకపై చీమ కుట్టింది, నెప్పి పుట్టింది అంటూ రాయొద్దని బ్లాగరులకు మనవి. -బాలసుబ్రహ్మణ్యం

5. ఝరియా దోమలు ఎంత మర్యాదగా ఉంటాయో మీరింతగా చెప్పాక కూడా వస్తామా? అన్నట్టు పొద్దు లో పెట్టిన మీ ఫోటో మీరు ఝరియా వెళ్ళక ముందుది అనుకుంటాను. అవునా సార్? -జ్యోతి

6. మీ వాదన నాకు అర్థం కాలేదండీ. ఇప్పుడు రానారె, ఇస్మాయిల్ ల సంగతే చూడండి.. చీమ వాళ్ళ దగ్గరికి వచ్చి కుట్టలేదు. పాపం వాళ్ళే చీమల పుట్టలో వేలు పెట్టి మరీ కుట్టించుకున్నారు. మరి శివుడు ఆజ్ఞ ఇవ్వడమే నిజమైతే ఆజ్ఞ ఎవరికి ఇచ్చినట్లు, ఏమని ఇచ్చినట్లు? కుట్టమని చీమలకా? లేక కుట్టించుకొమ్మని రానారె, ఇస్మాయిల్ లకా? -స్పందన

7. యత్ర పిపీలికం నాస్తి తత్ర రమంతి దేవతా! -ఒరెమూనా

8. కంప్యూటరు లేకుండా స్క్రీనుషాట్లు తెరిచే వీలు ప్రస్తుతానికి లేదు. కాబట్టి చీమకాటుకు నివారణ మార్గం లేనట్లే! అంచేత, కంప్యూటరు లేని వాళ్ళు చీమల జోలికి వెళ్ళకూడదు. వెళితే, వాళ్ళ ఖర్మ!
-ప్రవీణ్

9. గండు చీమలు కుడితే పేపర్లల్ల మంచిగ హెడ్డింగులు బెట్టి రాస్తరు. కరెంటు చీమలు కుడితే అస్సలు రాయరు. ఎందుకంటే గండు చీమలు అంధ్రల ఉంటయి, కరెంటు చీమలు తెలంగాణల మాత్రమే ఉంటయి, అందుకని! -జేప్స్

10. కడుపుబ్బ నవ్వుకున్నానండి. పొట్ట చెక్కలయ్యిందనుకోండి. బస్తాల చాటు నుండి బయటికి రాగానే మీ బాసు ఎదుట పడిన సీను తలచుకుంటే నాకూ సరిగ్గా “శ్రీవారికి ప్రేమలేఖ” లోని మెల్కోటే యే గుర్తొచ్చాడండి. పాత ఉద్యోగంలో ఉన్నపుడు మావారిక్కూడా అలాంటి బాసే ఉండేవాడు. ఆ విషయమూ గుర్తొచ్చింది. అయినా బాసు పక్కన కూచ్చోడం మంచిది కాదనుకుంటే సుబ్బరంగా ఏ వెనకో కూచ్చోవచ్చు గదా, అలా పారిపోయి కష్టాల్లో పడే బదులు? -సిరిసిరిమువ్వ

11. బాగా రాసారు. కానీ ప్రతీదానిలోనూ రాజకీయాలను చొప్పించడం వలన మీ బ్లాగు మరీ మొనాటనస్ గా అవుతోందని నా అభిప్రాయం! ఈ సలహా ఇచ్చే చొరవ నాకుందని అనుకుంటున్నాను.. -సి.బి.రావు

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

22 Responses to బ్లాగుల పేరడీ – 2

  1. వ్యాఖ్యలలో మొదటిది చావాగారి వ్యాక్యలకు పేరడీలగా ఉంది. మిగతావి ఎవరు రాసారో నన్ను అడక్కండి, ఎందుకంటే నేను ఎవరిదీ గుర్తుపట్టలేక పోయాను మరి 🙁

  2. బ్లాగులు:
    1. తెలియలేదు (నవీన్ గారు?)
    2. ప్రసాదం గారు
    3. శ్రీరాం గారు
    4. నాగరాజా గారు(తెనుగు.ఆర్గు)
    5. వైజాసత్య గారు
    6. సౌమ్య గారు
    7. అంభానాధ్ గారు
    8. రాధిక గారు
    9. త్యాగ గారు అయిఉండొచ్చు
    10. ఆ.సా గారు
    11. శోధన సుధాకర్ గారు
    12. జ్యోతి గారు
    13. జేప్స్ గారు
    14. సత్యసాయి కొవ్వలి గారు
    15. ప్రవీణ్ గారు
    16. కొత్తపాళీ గారు
    17. తెలియలేదు (ఇది కూడా శోధన సుధాకర్ గారిలా అనిపిస్తోంది)

    వ్యాఖ్యలు
    1. చావా గారు
    2. రానారె గారు
    3. కొత్తపాళీ గారు
    4. పప్పు నాగరాజు గారు
    5. సత్యసాయి గారు
    6. చరసాల ప్రసాదు గారు
    7. తెలియలేదు
    8. శోధన సుధాకర్ గారు
    9. దిల్ గారు
    10. ప్రసాదం గారు
    11.సి.బి.రావు గారు

  3. radhika says:

    1
    2 ప్రసాదం గారు
    3 శ్రీ రాం గారు
    4 నాగరాజ గారు
    5 వైజాసత్య గారు
    6 సౌమ్య గారు
    7
    8 రాధిక
    9 తాడేపల్లి బాలసుబ్ర్హమణ్యం గారు
    10 ఇస్మైల్ గారు
    11
    12 జ్యోతి గారు
    13
    14 సత్యసాయి కొవ్వలి గారు
    15 ప్రవీణ్ గార్లపాటి
    16 కొత్తపాళీ గారు
    17
    వ్యాక్యలు
    1
    2 రానారే
    3 చరసాల ప్రసాద్ గారు
    4 తాడేపల్లి వారు
    5
    6 లలిత గారు
    7
    8
    9 దిల్ గారు
    10 రాధిక
    11 సి బి రావు గారు

  4. సుధాకర్(శోధన) says:

    చీమను ధన్యజీవిని చేశారు 🙂

    పొద్దులో Amazon Fire Ants దాడి వెనకాల సూత్రధారి ఎవరో గానీ సరిగ్గా సరియైన చోటే చీమ కాటు తిన్నారు. 🙂

  5. నా గురించి రాసింది చదివి నాకైతే నావ్వు రాలేదు. సుధాకర్ రాసింది బావుండింది. ఐనా ఎవరేది రాసారో ఆలోచించే ఓపిక లేదు. ఈ పేరు లేని రచయితల గురించి ఆలోచించి …చించి బుర్ర వేడెక్కింది. అస్సలు పని చేయటంలేదు. నాది కూడా మిగతావాళ్ళు రాసింది చూస్తే అర్ధమయ్యింది. త్రివిక్రం…నాయనా! మళ్ళీ ఇలాంటి పేరు లేని రచనలు పెట్టకు. బుర్రలు పని చేయటంలేదు. చించలేము బాబు. బుద్ధిగా మా బ్లాగులు రాసుకుంటాము.

  6. వ్యాఖ్యలలో పదవది సరిగా చదవకపోవడం వల్ల ప్రసాదంగారేమో అనుకున్నా. ఇప్పుడు రాధిక గారి సమాధానాలు చూసిన తర్వాత అది ఆమె వ్యాఖ్యలకు పేరడీనే అనిపిస్తోంది.

  7. chavakiran says:

    modaTidi naadi kaadu anipistuMdi.

    kaameMTu kUDaa, #though it is in RTS like this 🙂 #

  8. అన్నిసార్లూ అధికస్య అధికం ఫలం అన్వయించదని ఈప్రయోగం నిరూపించింది. పేరడీలని, పజిళ్ళని కలిపితే పాఠకులకి నీరసప్రాప్తి అని తేలింది. పేర్లు, పేరడీలు పక్కపక్కనుంటే మన మెదడు కొన్ని లంకెలు తనే కల్పించి రసపూర్తి కావించి ఉండేది. నా దృష్టిలో పేర్లిచ్చేయడం, ‘అన్నగారి ఆజ్ఞ, తక్షణకర్తవ్యం’ నా బ్లాగు పేరడీకొస్తే, కొన్ని వాక్యాలలాగే వ్రాస్తాననుకంటా. శీర్షిక మాత్రం అలాగే పెట్టుండేవాణ్ణి.

  9. Sriram says:

    హహహా…పేరడీలు రాయడం బలపంతో పెట్టిన విద్య నాకు అని ఇలా రాసి పారేస్తున్నది ఎవరో 🙂 అభినందనలు మీకు.
    వెంకటరమణగారి జవాబులతో ఏకీభవిస్తాను నేను.
    మూడోది నా బ్లాగులోని ఒక కొత్త పోస్టుని పోలి ఉండడం స్పష్టంగా తెలుస్తోంది. కానీ నా బ్లాగులో పాటలన్నింటికీ వినడానికి లంకెలుంటాయి 🙂

  10. radhika says:

    ఏది ఎవరిదో కనిపెట్టే పనిలో నా బ్లాగు పేరడీ గురించి చెప్పడం మరిచాను.సూపర్ గా వుంది.ఇది ప్రస్తుతం నా బ్లాగులో వున్న మొదటి కవిత కి పేరడీ.రాసినవాళ్ళకి వేల వేల వందనాలు.చదవగానే నాకు చాలా నవ్వొచ్చింది.కానీ మరీ ఎక్కువ పేరడీలు ఇవ్వడం వల్ల,ఏవి ఎవరివో కనిపెట్టడానికి చాలా టైం పడుతుండడం వల్ల పేరడీ ఫీల్ ని కొంత మిస్ అయ్యాను.3 భాగాలుగా అందించాల్సింది.

  11. ఈ సారి మొదటి విడతలో కంటే కొంత ఎక్కువ ప్రయత్నం జరిగిందని నాకనిపిస్తోంది. నేను గుర్తించినవాటిల్లో .. వారు ఈ మధ్య రాసిన బ్లాగుల శైలిని ప్రతిబింబించే ప్రయత్నం బాగా చేశారు, అది ఫలించింది కూడా.
    ఎంతైనా first impression best impression అంటారు. మొదటి విడత చదివినప్పుడు spontaneousగా కితకితలు పెట్టినట్టు వచ్చిన నవ్వు ఈ సారి రాలేదు. రాధిక కవిత (ఐ మీన్ ఆవిడ కవితకి చీమకాటు) కి మాత్రం బలే నవ్వొచ్చింది.
    జ్యోతి గారు చెప్పినట్టు మూల బ్లాగరి ఎవరై ఉంటారో అని మెదడు తనని తాను చించుకోవటం కొంత కారణం కావచ్చు నవ్వు రాకపోవటానికి.
    దీన్నొక పజిల్ గా చెయ్యండని ఉచిత సలహా పారేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నాను. తోటి బాధిత పాఠకులకు క్షమాపణ చెప్పుకుంటూ, ఇకనైనా మూలవిరాట్టులెవరో తెల్పమని త్ర్విక్రముణ్ణి వేడుకుంటున్నాను.

  12. Sowmya says:

    మీరు ఆ ఉషాకిరణ్ అని రాయకూండా ఉండాల్సింది. అది రాసారు కాబట్టే అది నా మ్యూజింగ్స్ బ్లాగు గురించి అని నాకు అర్థం అయింది. లేకుంటే నాకు తెలిసేది కాదు!

  13. Sowmya says:

    ఎటొచ్చీ English లో టైటిల్ పెట్టి తెలుగు రాసేది నేనే కనుక.. కనుక్కోవచ్చు లెండి అందరూ. 🙂

  14. అద్భుతమైన పేరడీ!
    ఇంతకీ కొత్తపాళీ గారి కందం చంధోబద్దమేనా! ఆ కందం చదువుతున్నా, రాధిక కవిత చదువుతున్నా పడి పడీ నవ్వాను.
    అన్నీ హైలెట్టే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  15. సమంజసమైన ప్రశ్నే స్పందన గారూ!
    మీ ప్రశ్నచూశాకే భూతద్దంలో పరిశీలించాను – చీమని కాదు, కందాన్ని.
    ఛందస్సు నియమాల రీత్యా నాలుగు తప్పులున్నై.
    ఐతే గణాలు సరిపోయాయా అని లెక్కేసుకోవడం కంటే భావం బాగుందా అని చూడ్డవే నాకిష్టం. ఆ లెక్కన ఈ చీమ కందానికి ఫస్టు మార్కులు నాబుక్కులో!!

  16. lalitha says:

    చాలా బాగున్నయండి పేరడీలు. ఎంతో చిరాకులో కూడా బలే నవ్వు తెప్పించాయి.

    ధన్యవాదాలు.

    లలిత.

  17. ఇప్పుడు ఓ కే.. నాదో సందేహం. అందరిని కుట్టిన చీమ మన సిరిసిరిమువ్వగారిని ఎందుకు కుట్టలేదు. ఏంటి సంగతి. కొంపదీసి ఆవిడ ,భర్తతో కలిసి ఇలా రాయలేదు కదా? అసలే వాళ్ళిద్దరి పేర్లు చెప్పకుండా ఊరిస్తున్నారు. ఇది వాళ్ళ కుట్ర కాదు కదా పత్రిక ఎడిటర్‍తో కలిసి. ??????????

  18. ఇది వ్రాసింది ఎవరయ్యా……. ఎవరయ్యా నీవు……
    పక్షుల్లో గరుక్మంతుడు నీవా?
    జంతువులలో సింహానివి నీవా?
    చెట్టులలో మర్రి చెట్టువు నీవా?
    గింజలలో రుద్రాక్షవు నీవా?

    స్టార్లలో మెగాస్టారువు నీవా?
    అనుకరించడంలో శివారెడ్డివి నీవా?
    క్రికెట్లో పాంటింగ్ నీవా?
    వికీలో వైజాసత్యా నీవా?

    బ్లాగులలో ఎవరయ్యా నీవు?

  19. బాగున్నాయి కానీ కొంచం ఎక్కువయినట్లున్నాయి. నాకు రాధిక గారిది బాగా నచ్చింది. వైజాసత్య గారిది, ప్రసాదం గారిది కూడా బాగున్నాయి. నేను చూసేటప్పటికి ఏవి ఎవరివో పెట్టేసారు అందుకని బుర్ర చించుకోవాలిసిన పని పడలేదు.

    జ్యోతి గారూ ఈ చీమకాటు కుట్ర లో నాకెటువంటి పాత్ర లేదండి. అంత విద్వత్తు కూడా లేదు. చూడపోతే ఇదంతా ప్రతిపక్షం కుట్ర లాగుంది. ఇక చీమ నన్నెందుకు కుట్టలేదంటే అది కుట్టింది అనుభవజ్ఞులైన బ్లాగర్ల్నే అనుకుంటా. అయినా వ్యాఖ్యలలో ఓ కాటేసింది కదా!!!

  20. హహహ…
    బాగుంది. పైన కొంత మంది అన్నట్టు సంఖ్య ఎక్కువయినా రాసిన వారి పరిశీలనా దృష్టి కి మెచ్చుకోవలసిందే.

    మొదటి సారి చదివినప్పుడు “జనరేషన్” చూడగానే నాదేనేమో అనిపించింది. ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. 🙂

  21. తెజావాగారి బ్లాగు అనుకరణలో – “హిందీ దేశం, తమిళ దేశంతో సహా” అన్నది చదవగానే భలే నవ్వొచ్చింది. రాధిక గారి “కౌన్ బే తూ” కవితకి అనుకరణ ఇంకా బాగుంది. తాడేపల్లిగారి బ్లాగుకు అనుకరణ చూసి అదేదో సినిమాలో ఎలిబీశ్రీరాం పంతులును దెబ్బకొట్టడానికి సునీల్ చెప్పే పేరడీ శ్లోకం – “ఉష్ణం ఉష్ణేన శకీలా, ఉదరం వాయుట్రబులేనా, వాతం పిత్తం కఫం అన్నారు మరి పెద్దలు” గుర్తొచ్చింది. ప్రసాదం గారి బ్లాగు పేరడీ, కొత్తపాళీగారి కందం కూడా చాలా చాలా బాగున్నాయి. రానారె పేరడీ బాగాలేదన లేదు. మాంచి తమాషా విషయం. అందులో అభ్యంతరకరమైన పదాలేవీ లేవు. చెప్పేదేమిటంటే, ఆ “ఇంకొకరు” గారు నేను రాసే నుడికారానికి దగ్గరగా పెరిగిన వారు. ఆ మాండలికం తెలిసినవారు. అందువలన అలా అన్నాను. అది విజయవంతమైన పేరడీయే. కానీ మాండలికం తెలిసి రాయాలంటే ఆ ప్రాంతంలో ఆ సంస్కృతిలో పెరగాలి కదా – ఈ పేరడీ విషయంలో అది కుదరలేదు అంతే.

    ఇక విమర్శలు:
    1. ఈ మారు డోసు ఎక్కువైంది. ఒకేసారి చాలా బ్లాగులు. “అతి సర్వత్ర వర్జయేత్” అన్నారు పెద్దలు నిజంగానే. సునీల్ కాదీమాటన్నది.
    2. ఎవ్వరిదో కనుక్కోడి చూద్దాం అనే విషయంలో ఒత్తిడికి లోనయినట్లుంది. చాలా సులభంగా కనిపెట్టేసేలా కొన్నిపదాలు యథాతథంగా వాడేశారు.
    3. ఎవ్వరికి అనుకరణో చెప్పకుండా పాఠకులకే వదిలేద్దామని మొదలెట్టి, పేర్లు ఇచ్చేశారు. దీంతో వ్రతం కాస్తంత చెడిందనే చెప్పాలి. అంటే రెంటికీ చెడ్డ రేవడిలా అయింది.
    4. కొన్ని పేరడీలలో భాష కాస్త ఎబ్బెట్టుగా, అభ్యంతరకరంగా తోచింది. బ్లాగు స్థాయికి సరేగాని, పత్రిక స్థాయికి తగని పదాలు కొన్ని ఉన్నట్టనిపించిందీసారి.

  22. మంచి ప్రయత్నం

    అయితే, నేను రానారె గారి విమర్శలతో పూర్తిగా ఏకిభవిస్తున్నాను.

    ఆ అజ్ఞాత జరుక్ శాస్త్రికీ, ఆయనతో కుమ్మక్కు అయిన పొద్దుకీ అబినందనలు.

    ప్రసాదం

Comments are closed.