కబుర్లు

ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళ పట్ల ఆకర్షితులౌతారన్నది మగవాళ్ళకు ఎప్పటికీ అర్థం కాదు. పోనీ, ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళను పెళ్ళాడ్డానికి ఇష్టపడతారు: అందగాళ్ళనా?ఆస్తిపరులనా? లేక వేరే ఏవైనా అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ఈ విషయం తెలుసుకోవడానికి ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‍షైర్ వాళ్ళొక సర్వేక్షణ జరిపారు. నవమన్మథులను, వృత్తి ఉద్యోగాల్లో దిగ్విజయంతో దూసుకెళ్తున్నవారిని పెళ్ళాడడానికి ఆడవాళ్ళు అంత ఆసక్తి చూపరని ఆ సర్వేక్షణలో తేలిందట! అలాంటివాళ్ళు పెళ్ళాలను పట్టించుకోకుండా పనిలో నిమగ్నమవడమో, లేక పరస్త్రీలకు దగ్గరవడమో చేస్తారేమో…నని అమ్మాయిల అనుమానమట! హూ…ఆడవాళ్ళు మగవాళ్ళకు ఎప్పటికి అర్థమౌతారో!! ఏమైనా దీన్నిబట్టి చూస్తే పెళ్ళీడు కుర్రాళ్ళు పనిరాక్షసులవడం, అందంగా ముస్తాబవడం అంత మంచిది కాదేమో? 😉 పెళ్ళికి సిద్ధమౌతున్న తెలుగు బ్లాగులోకపు యువకులూ! వింటున్నారా?

వేలిముద్రలకు బదులు: జర్మనీలో దొంగతనానికెళ్ళిన ఒక దొంగ దురదృష్టవశాత్తూ సంఘటనాస్థలంలో ఒక వేలు తెగ్గొట్టుకున్నాడు. “ఒక వేలు పోతే మాత్రమేం…’వేలు’ వస్తున్నప్పుడు?” అని తెగినవేలి సంగతి పట్టించుకోకుండా అందినకాడికి మూటకట్టుకుని హడావుడిగా పారిపోయాడా దొంగ. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వేలిని చూసి తెగ ఆశ్చర్యపోయారు, ఆ పైన సంబరపడిపోయారు: “సాధారణంగా దొంగలు నేరం జరిగినప్రదేశంలో వేలిముద్రలు వదిలి వెళ్తుంటారు. ఈయనెవరో ఏకంగా వేలినే వదిలేసిపోయాడు” అని ఆనందంగా ప్రకటించేసి, ఆపైన నేరుగా వెళ్ళి దొంగను అరెస్టు చేశారు. బహుశా ఇప్పుడా దొంగ నాలుక కూడా తెగేలా కొరుక్కుంటున్నాడో ఏం పాడో?

పదోన్నతి కావాలా? ముందిది చెప్పండి: “తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి?” అని ఛీత్కరించాడు వేమన. చైనాలోని ఒక కౌంటీ ప్రభుత్వం అలాగే అనుకుందేమో దీన్ని తమకు తోచిన రీతిలో ఆచరించి చూపబోతోంది. ఎక్కడైనా ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలంటే పనితీరు చూస్తారు. కుదరకపోతే సీనియారిటీ చూస్తారు. కానీ చైనాలోని ఛాంగ్యువాన్ అనే కౌంటీలోని ఉద్యోగులకు మాత్రం వాళ్ళు తమ తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటున్నారనేదాన్ని బట్టి పదోన్నతిని నిర్ణయిస్తారట. ఎంత మంచి ఆలోచనో కదా? ఇందుకోసం ప్రత్యేకంగా నియమితులైన దర్యాప్తు అధికారులు ఉద్యోగుల స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారు – అందర్నీ అడిగి వాస్తవాలు కనుక్కుంటారట. ఆ వాస్తవాల్లో భాగంగా సదరు ఉద్యోగులు కుటుంబసంబంధాలకు ఎంత విలువిస్తారనే కాక వాళ్ళకు తాగుడు, జూదం లాంటి అలవాట్లేమైనా ఉన్నాయా అని కూడా ఆరా తీస్తారట.

భూమ్మీద పోటీ – అంతరిక్షంలో పరుగు:

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమ్మీద జరిగే పరుగు పందెంలో రోదసి నుంచి పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆమె ఏప్రిల్ ౧౬న జరిగిన బోస్టన్ మారథాన్ లో భూమ్మీద బోస్టన్ నగరంలో ౨౪,౦౦౦ మంది పరుగులు తీస్తున్న సమయంలోనే భూమి చుట్టూ క్షణానికి ఐదు మైళ్ళకంటే ఎక్కువ వేగంతో తిరుగుతూ భూమిని రెండుసార్లు చుట్టేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ట్రెడ్ మిల్ మీద రెండువైపులా లాప్-టాప్ కంప్యూటర్లలో భూమ్మీద జరుగుతున్న బోస్టన్ మారథాన్ పోటీలను వీక్షిస్తూ ఏకధాటిగా ౪ గంటలా ౨౪ నిమిషాల్లో ౨౬ మైళ్ళు పరిగెత్తారు. చిన్నపిల్లలు శారీరక దార్ఢ్యాన్ని పెంపొందించుకోవాలని, వ్యాయామం క్రమం తప్పక చెయ్యాలని ఆమె అన్నారు.వ్యాయామం చెయ్యడం చిన్నపిల్లలకే కాకుండా కలనయంత్ర ‘ గీకు’లకు కూడా అవసరమే కదా?

సమానత్వం వర్ధిల్లాలి:

పెళ్ళైన ఒక మగాడు పెళ్ళికానమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకోవడం నేరం కాదట కానీ పెళ్ళైన మహిళ పెళ్ళికాని మగాడితో సంబంధం కలిగి ఉండడం మాత్రం నేరమట. దానికి శిక్షగా జరిమానా గానీ, ఒక సంవత్సరం జైలుశిక్షగానీ విధిస్తారట. ఇదెక్కడి న్యాయం అనుకుంటున్నారా? ఇటీవలి వరకు ఉగాండాలో అమల్లో ఉన్న చట్టం అలాగే ఉండేది. వాళ్ళకూ అలాగే అనిపించిందేమో ఆలస్యంగానైనా తప్పు దిద్దుకున్నారు. కొంతమంది మహిళాన్యాయవాదులు పోరాడి ఆ చట్టాన్ని రద్దు చేయించారు.

పోలియో చుక్కల తీర్థం: బీహారులోని దేవాలయాల్లో పూజారులు చిన్నపిల్లలకు తీర్థప్రసాదాలకు బదులుగా పోలియో చుక్కలు వేస్తున్నారట. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజలు-ప్రభుత్వాలు కలిసి ఉద్యమస్ఫూర్తితో నిర్వహించిన మహాయజ్ఞం పోలియో చుక్కల కార్యక్రమం. అంతకు ముందు నుంచే టి.బి.ని అరికట్టడానికి DOTS లాంటి కార్యక్రమాలైతే ఉన్నాయి గానీ కనీసం టి.బి. కేసులను గుర్తించే ప్రయత్నమైనా పూర్తిస్థాయిలో జరగలేదు. పోలియో గురించి ఇంత చేసినా బీహారులో నిరుడు 650 పైగా పోలియో కేసులు బయటపడడం ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం పేదరికం కాదు – అవిద్య, అజ్ఞానం, అపోహలు, మూఢనమ్మకాలు. ఆరోగ్య కార్యకర్తలను నమ్మని ప్రజలు పూజారులను సులభంగా నమ్ముతారు. దాంతో బీహారులోని ఆరోగ్యశాఖ అధికారులు వందలాది మంది పూజారులకు పోలియో చుక్కలు వేయడంలో శిక్షణ ఇచ్చి వాళ్ళచేత పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు.

మరో మేరీ సెలెస్టే:1872లో పోర్చుగల్ తీరంలో ఒక ఓడ కనబడింది. అది వింత కాదు కానీ ఆ ఓడలో ప్రయాణీకులుగానీ, ఓడసిబ్బందిగానీ ఒక్కరుకూడా లేరు. అదే వింత అనుకుంటే వారి జాడ ఇంతవరకు కనబడకపోవడం మరీ వింత. ఆ ఓడ పేరు Mary Celeste. గతవారంలో ఆస్ట్రేలియా తీరంలో ఒక పడవ కనబడింది. దాంట్లో కూడా అచ్చం Mary Celeste లాగే ఒక్క మనిషి లేరు. కానీ ఇంజిన్ నడుస్తోంది, టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది, లాప్-టాప్ కంప్యూటర్ ఆన్ లోనే ఉంది, రేడియో, జి.పి.ఎస్. కూడా పనిచేస్తున్నాయి! ఇవన్నీ అమర్చిపెట్టుకున్నవాళ్ళేమయారోనని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెదుకులాట కూడా మొదలుపెట్టింది. రోజులు గడిచినా పోయినవారి జాడ మాత్రం తెలియలేదు! తెలుస్తుందన్న ఆశలు కూడా వదిలేసుకున్నారు.

కాఫీ సబ్బు: కాఫీ తాగనవసరం లేకుండా కేవలం స్నానం చేసినంతనే కాఫీ తాగిన ఫలితం కలిగేలా చేసే కొత్తరకం సబ్బు తయారైంది. ఆ సబ్బుతో స్నానం చేస్తే చాలు – రెండు కప్పుల కాఫీ తాగిన ప్రభావం కలుగుతుందట. అందుకోసం ఆ సబ్బులో కెఫీన్ కలిపి ప్రత్యేకంగా తయారుచేశారు. అలాగని ఆ సబ్బును చప్పరిద్దామనుకునేరు 😉

గాడిద గత్తర?: డల్లాస్ లో ఒక పెద్దమనిషి ఒక గాడిదను పెంచుకుంటున్నాడు. ఆ గాడిద భరించలేనంత బిగ్గరగా ఓండ్ర పెడుతోందని ఇంకొకాయన ఫిర్యాదు చేశాడు. దాంతో తన గాడిదగాత్రం మీరే విని నిజానిజాలు తేల్చండని ఆయన తన గాడిదను నేరుగా కోర్టులోని న్యాయమూర్తుల ఎదుటికి తెచ్చాడు. ఆ గాడిద చాలా అమాయకంగా, నెమ్మదస్తురాల్లా కనిపించి, న్యాయమూర్తులను ఆకట్టుకుంది! న్యాయమూర్తి కేసు కొట్టేయకముందే వాది, ప్రతివాదులు రాజీ కొచ్చారట.

పురాతన వృక్షం: 38 కోట్ల సంవత్సరాల క్రితం బ్రతికిన Wattieza జాతికి చెందిన చెట్టు అవశేషాలను 2004 జూన్ లో న్యూయార్క్ లోని ఒక క్వారీలో కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ పురాతన వృక్షపు అవశేషాలను జాగ్రత్తగా ముక్కముక్కా పేర్చి దాని అసలు రూపురేఖలను కనుగొనే ప్రయత్నం చేశారు. ఆ అవశేషాలు 200 కిలోగ్రాముల బరువున్నాయట. 8 మీటర్ల ఎత్తున్న ఆ చెట్టు అవశేషాలను ముక్కలు ముక్కలుగా వెలికితీసి అతికించారు. దీంతో ఫెర్న్ అనే ఈకాలపు మొక్కతో ఈ చెట్టుకు గల పోలికలు స్పష్టంగా తెలిశాయని శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు.

చింపాంజీకి పౌరహక్కులు!: వర్ణచిత్రాలనిష్టపడుతుంది, సందర్శకులను ముద్దాడుతుంది, టీవీలో వైల్డ్ లైఫ్ కార్యక్రమాలను ఆసక్తిగా చూస్తుంది. అద్దంలో అందం చూసుకుంటుంది, దాగుడు మూతలాడుతుంది, చక్కిలిగిలి పెడితే కిలకిలా నవ్వుతుంది. వీటన్నిటినీ మించి ఇప్పుడు తనకు బహుమతిగా వచ్చిన 3,400 ఆస్ట్రియన్ డాలర్లకు సొంతదారు. ఎవరో కాదు ఆస్ట్రియాలో ఉన్న 26ఏళ్ళ Hiasl అనే చింపాంజీ. ఇప్పుడు ఆ చింపాంజీకి పౌరహక్కులు వర్తింపజేయాలని కొంతమంది ఉత్సాహవంతులు కోర్టుకెక్కారు. న్యాయస్థానమేమంటుందో వేచి చూడాలి.

ఎంత కష్టం! ఎంత కష్టం!!:సరిహద్దులు-అడ్డుగోడలసలే లేని ఆకాశమార్గాన హాయిగా ఎగురుకుంటూ చైనా నుండి థాయిలాండుకొచ్చి జబ్బుపడిన పక్షి తను పుట్టిపెరిగినచోటికి తిరిగి వెళ్ళే దారి మూసుకుపోతే ఎంతకష్టం? పరాయిదేశంలో చచ్చేంత జబ్బు చేసి కోలుకున్న ఆ పక్షి ఇప్పుడు సరిగ్గా దిక్కుతోచని స్థితిలోనే ఉందేమో? థాయిలాండు వాళ్ళేమో అపస్మారకస్థితిలో ఉన్న ఒక ఏడాది వయసు రాబందుపిల్లను గమనించి దాన్ని శ్రద్ధాసక్తులతో ఆరోగ్యవంతురాల్ని చేశారు. ఇప్పుడు దాన్ని విమానంలో తిరిగి చైనాకు పంపేద్దామంటే చైనా వాళ్ళు ఆ పక్షికి థాయ్లాండులో ఏ బర్డ్ ఫ్లూ ఐనా సోకిందేమో అన్న అనుమానంతో అందుకొప్పుకోలేదట.

పైలటు తిడితే…ఫ్లైటు క్యాన్సిల్!: అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి డెట్రాయిట్ వెళ్తున్న విమానంలో పైలట్ ఒక ప్రయాణీకుడిని తిట్టాడని నార్త్ వెస్ట్ ఏర్ లైన్స్ వారు ఆ పైలట్ ను దింపేసి విమానాన్ని రద్దు చేశారు.

ప్రయాణీకులు విమానం ఎక్కుతూ ఉండగా పైలట్ తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ కాక్ పిట్ లోనుంచి బయటికి వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అతడి మాటలు (అచ్చమైన బూతులు) విమానమెక్కుతున్న ప్రయాణీకులకు స్పష్టంగా వినబడుతూ ఉన్నాయి. అతడు బయటికి రాగానే అవేం మాటలని ఒక ప్రయాణీకుడు ప్రశ్నించడంతో ఆ పైలట్ కోపం తెచ్చుకుని తిట్టాడు. దాంతో అధికారులు ఆ పైలటును ఫ్లైటు దింపేసి విమానాన్ని రద్దు చేశారు. తప్పు చేసిన పైలటు ఇంటికెళ్ళాడు సరే! మరి తామెళ్ళవలసిన విమానం రద్దై ప్రయాణీకులు ఇబ్బంది పడలేదా?

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to కబుర్లు

  1. radhika says:

    అన్ని కబుర్లు బాగున్నాయి.కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా?

  2. కబుర్లు బాగున్నాయి..

  3. ఇదీ మరీ చోద్యం, కబుర్లుచెబుతామంటే విందామనొచ్చాను. “ప్రయాణీకులు ఇబ్బంది పడలేదా?” అని నేనడుగుదామనుకొన్నాను. నాకు ఈ సీన్ లో డైలాగులేదా? :)))

  4. కబుర్లూ బాగున్నాయి, చెప్పిన శైలీ బాగుంది. అయితే కింది అనుమానాలున్నాయి.
    1) సునీతా విలియమ్స్‌ను సునితా నారాయణ్ అని ఎందుకన్నట్లు? (అసలు రోదసీలో బరువే వుండం కదా! మరి సునిత ఎలా పరుగెట్టింది? తలకు చిన్న రాకెట్ కట్టుకొని కిందికి (కిందేంటి, పైనేంటి) అదే ట్డెడ్‌మిల్ వైపు ఒత్తిడి కలిగించుకొందా? లేక ఉత్తినే కాళ్ళు కదుపుతూ వుందా?)
    2) గాడిద గత్తర — న్యాయమూర్తి కేసు కొట్టేయకముందే వాది, ప్రతివాదులు రాజీ కొచ్చారట కదా!

    –ఫ్రసాద్
    http://blog.charasala.com

  5. ప్రసాద్ గారూ,
    రోదసి లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది కానీ స్పేస్ షటిల్ లో గ్రావిటీ ఉండే రూము లను తయారు చేస్తారు. అందుకనే అందులో ప్రయాణించేవారు గాలిలో ఎగరకుండా మామూలుగా నేల మీద నడవగలుగుతారు.

  6. ప్రసాద్ గారూ!

    గత వారం రోజులుగా మేం ఊళ్ళో లేకపోవడం వల్ల మీ వ్యాఖ్యకు సమాధానమివ్వడం ఆలస్యమైంది. మీరన్నట్లు సునీతా విలియమ్స్ పేరును సునీతా నారాయణ్ అని రాయడం తప్పే! సవరించాం.
    అంతరిక్షంలో ఎలా పరుగెట్టిందో రాయడం కబుర్ల పరిధిలోని అంశం కాదని భావించడం వల్ల రాయలేదు. దానికి ప్రవీణ్ గారిచ్చిన సమాధానం సరిపోతుందనుకుంటాను.

Comments are closed.