ఆడాళ్ళూ మీకు జోహార్లు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆడాళ్ళ గురించి మగాళ్ళు చేసిన పరిశోధన ఫలితాలు చెప్పకుండా ఊరిస్తున్నారు.

—————

నా స్నేహితుడు ఈ మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడని తెలిసి అతనిని కలిసా. అతను అ.భా.భా.బా. సంఘం సెక్రటరీ అంట, మన విహారి లాగా. అతను తీసుకున్న విషయం ఏంటంటే “భార్యామణులతో బాధలు”. అతని ప్రొఫెసర్ కూడా బాధితుడే కాబట్టి రెండు నెలల్లో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. అతని పరిశోధనలో రాసిన కొన్ని విషయాలు నిజమే అనిపించింది. అవి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎవో సమాధానాలతో తమను తాము సర్దిచెప్పుకున్నారు. నేను మన పాఠకులు ఏమంటారో అని ప్రశ్నలుగానే ఇచ్చా. మగాళ్ళందరూ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు ఇది చదివి గంతులెయ్యండి. పండగ చేసుకోండి.

*. ఆడవాళ్ళు కొంటె పని చేస్తే సరదాగా చేసారంటారు. అదే మగవారు చేస్తే ఏదో ఉందనే అంటారు . ఈ భేదం ఎందుకు?

*. జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు. సరే. ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు?

*. పెళ్ళిలో ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళ పెళ్ళిలో ఎందుకు వేసుకోరు?

*. బీరువానిండా బట్టలున్నాయి. అయినా ఏదీ కట్టుకోవడానికి మనసొప్పదు. ఎందుచేత?

*. శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?

*. ఇంట్లో ఎన్నో బకెట్లున్నా, ఫ్రీగా దొరికే బకెట్ లేదన్న బాధ ఎందుకు?

*. పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?

*. చక్కగా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్ళేముందు అత్తతో ” అత్తయ్యా ! మా అమ్మదగ్గరికి వెళ్ళి రానా?” అని కోడలు ఎందుకు అడుగుతుంది?

*. “ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది?

*. పాలగిన్నెలో పాలు తీసి మిగిలిన మీగడను కూడా ఎందుకు తీస్తుంది?

*. రోడ్డుపై నడిచేటప్పుడు భర్త చేయి ఎందుకు పట్టుకుంటుంది? చేయి పట్టుకుని కూడా అడుగులో అడుగేస్తూ ఎందుకు నడుస్తుంది?

*. ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?

*. వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?

*. తాను అందంగా ఉన్నానన్న విషయం రోజూ వినాలని ఎందుకనుకుంటుంది?

*. వంట చేసిన ప్రతిసారీ ‘ఎలా ఉంది?’ అని ఎందుకు అడుగుతుంది?

*. నాలుగు నెలలపాటు కప్‍బోర్డును సామాన్లతో నింపుతుంది. ఆ తరువాత అవన్నీ పాత సామాన్లవాడికి వచ్చిన ధరకు అమ్మేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది?

*. దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?

*. ఇంట్లో పిల్లలని ఎత్తుకుంటుంది. మార్కెట్‍కుగానీ, రోడ్డుపైకి వెళ్ళినప్పుడుగానీ భర్త చేతికి పిల్లలను ఎందుకు ఇస్తుంది?

*. పాలను మరిగించడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టి అక్కడే నిలబడి, తీరా పాలు మరుగుతున్నప్పుడు వేరే పని ఎందుకు చేస్తుంది?

*. మాటి మాటికి అద్దంలో మొహం చూసుకోవడమెందుకు? మొహం మారిపోయిందనా ?

*. పుట్టింటివాళ్ళు రాగానే కూరలు ఎందుకు బాగా రుచిగా వండుతారు? అన్నం ఎందుకు మాడిపోదు ?

*. మాట్లాడకుండా కూర్చుంటే మాట్లాడమని అంటుంది. మాట్లాడుతుంటే నోరు మూసుకోమంటుంది . ఎక్కువగా కోప్పడితే కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తుంది . ఎందుకు?

*. పొరుగింటివాడిని గర్ల్‍ఫ్రెండ్‍తో తిరుగుతుండగా చూసి, భర్తపై ఓ కన్నేసి ఉంచడంలోని అర్ధం ఏమిటి ?

*. తన భర్త పేరు చెప్పి బయట అందరిని భయపెడుతూ ఆ భర్తనే ఇంట్లో భయపెట్టడం ఎందుకు?

*. భర్త జీతం మాత్రం మొత్తం కావాలి. పనిని మాత్రం కుటుంబంలో అందరూ పంచుకోవాలి . ఎందుకు?

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

5 Responses to ఆడాళ్ళూ మీకు జోహార్లు

  1. అన్నింటికీ ఒకటే సమధానం. బాస్ ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. బాస్ ఎప్పుడూ తప్పుచేయదు. ఆయినా మేం మా బాసులతో వేగడమే కాకుండా, బాసు ప్రవర్తనకి వివరణ కూడా ఇవ్వాలా? అన్యాయమండీ. సమాధానలు చెప్తే ఏ పరమ వీరచక్రో ఇస్తానంటే ప్రయత్నిస్తాం మరి. 🙂

  2. మగవాళ్ళు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగోరడం, ఒకవేళ తెలుసుకున్నా బయటపెట్టడం ఎలాంటి పనో పరమవీరచక్ర కోరడం ద్వారా సత్యసాయి గారు ఒక్కమాటలో సూచించారు. 🙂

  3. మహామహుల వ్యాఖ్యలున్నాయిక్కడ. ఇవేవీ తెలియని శతమర్కటాలు ‘కొమ్మలను’ పట్టి ఆడుకోవడం మాని మాని ఆందోళనగా చూస్తున్నాయి. మరి వీటికి సమాధానాలు ఇచ్చేవారెవరు! ఎవరైనా తెలిసికూడా చెప్పకపోయారో, చెట్టువద్దకు తిరిగివెళ్తా, తెలుసుగా భేతాళుడు ఏంచేస్తాడో.

  4. బేతాళుడేం చేస్తాడు? చెట్టెక్కి కూర్చుంటాడు. మరి మీరెందుకు రానారె గారూ చెట్టు వద్దకు తిరిగివెళ్ళడం? పెళ్ళిజోలికెళ్ళకుండా ‘కొమ్మ’లతో ఆడుకోవడానికేనా? 🙂

  5. సుగాత్రిగారు: అమ్మో ఇక్కడ నామాటకు చాలా అర్థాలొస్తున్నాయ్.
    చెట్టువద్దకు తిరిగివెళ్తా – ‘కొమ్మ’లతో మళ్లీ ఆడుకోవడానికి.
    చెట్టువద్దకు తిరిగివెళ్తా, తెలుసుగా భేతాళుడు ఏంచేస్తాడో – అంటే నేనే భేతాళుణ్ణి (!?)
    తెలిసికూడా చెప్పకపోయారో, చెట్టువద్దకు తిరిగివెళ్తా, తెలుసుగా భేతాళుడు ఏంచేస్తాడో – మీ తల వేయి వ్రక్కలవుతుందని బెదిరిస్తాడు/శపిస్తాడు.

Comments are closed.