బ్లాగుల పేరడీ – 1

తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో…

అంశం: చీమకుట్టింది

వీవెన్:

చీమ కుట్టింది, నెప్పి పుట్టింది.

పప్పు నాగరాజు

చీమాయణం:
మన బ్లాగు వీరులందరూ చీమలమీద రాసిన టపాలు చదివేక నాకు కూడా చీమ-కుట్టింది. అదే, చీమలమీద ఓ టపా రాయలనే దుర్భుద్ది పుట్టింది.మనం మనుషులం కాని మాకులం కాదుగదా – నెప్పి తెలియకపోవడానికి. చీమో, దోమో, నల్లో, బల్లో – కుడితే నొప్పి తెలియని మానవుడుంటాడా. సరిగ్గా ఇది రాస్తున్నప్పుడే నన్ను చీమ కుట్టి నాకు నెప్పి పుట్టింది. ఇంత నెప్పి పుడుతోందేమా అని చూద్దును గదా అది చీమ, ఆడ చీమ!. నేనే పాపం చేసేనని అది నన్ను కుట్టింది? ఇది గిట్టనివారి కుట్ర కాదుగద? చీమల్లో కూడా ఆడచీమలు కుడితే నెప్పి ఎక్కువగా ఉంటుందని రసవాదంలో రాసేరు. కానీ ఇదేంటి, మరీ ఇంత నెప్పి పుడుతోంది? అయితే ఆడచీమలు కుట్టేది ఆపేక్షతోనే గానీ కసితో కాదని, వాటి మనసులో ప్రేమకే తప్ప పగకు తావు లేదని మగ పురుగులు గ్రహించాలి. నేను చీమ కుట్టినచోట మా ఆవిడ చేత కాపడం పెట్టించుకోవడానికి పోతున్నా.

అంచేత రెండో భాగం వచ్చేవారం.

చదువరి:

మిగిలిన చీమలన్నీ ఒక వరుసలో పడి క్రమశిక్షణగా పోతుంటే ఈ చీమొక్కటే అడ్డదారులు వెతుకుతూంది. నేనప్పుడే అనుకున్నా.. ఇదేదో రాజకీయ చీమ లాగుందే అని. దానికి బుద్ధి చెబుదామని వేలడ్డం పెట్టా. ఇంకేముంది, అసలే రాజకీయ చీమ, పైగా దాని తప్పుడు పనులకు అడ్డం వచ్చాను కదా.. కసుక్కున కుట్టేసింది. వామ్మో అని వేలు పిసుక్కునే లోగా, కిసుక్కున ఓ నవ్వు నవ్వి, మాయమై పోయింది. హబ్బ, ఇంకా నెప్పదరగొడుతోంది.

రానారె:

మా ఈరబల్లె బళ్ళో పిలకాయలకు నేనే లీడర్నని చెపినా గదా, అందుకని మా పెదపంతులు గారు నన్ను పిల్చుకోని “ఒరే రామనాథమూ, రేపు మనమెళ్ళే విహారయాత్రలో పిలకాయలనూ నివ్వే జాగ్రత్తగా చూసుకోవాల. వాళ్ళ సంగతి నీకే అప్పజెప్తా ఉండా” అని చెప్పినాడు. ఇగ జూసుకో నా రాజా, నాకు ఇమానమెక్కినట్లా అయిపోయినాది. యాత్రకెళ్ళే ఆ పొద్దు నాకు యమా ఉశారుగా ఉండాది. పిలకాయలంతా మనం చెప్పినట్టల్లా ఇనుకుంటారు గదా, ఎందుకుండదు మరి? మా క్లాసులో ఉండే ముని రత్నం గాడికి నేనంటే మా ఉక్రోశం, వాణ్ణి కాకుండా నన్ను లీడర్ను జేసినారని. యాత్రలో తమాశైన విషయం జరిగింది. పిలగాయలంతా ఓ చోట గుమిగూడి ఉన్నారు. ఏంది జేస్తా ఉండారు అని అడుగుతా నేను ఆడికి బోయినా. మా ముని గాడు ‘ఒరే రామూ ఈ బొక్కలో నా ఉంగరం పడి పోయినాదిరా, నాకు రాడం లేదు, తీసిపెట్టవా’ అని అన్యాడు. మీరంతా తప్పుకోండిరా అని నేను ముందుకెళ్ళి ఆ బొక్కలో నా వేలు పెట్టినా. ఏమి చెప్పమంటారు? చీమ కసుక్కున కుట్టింది. కళ్ళనీళ్ళు దిరిగినాయి గానీ, నేను లీడర్ని గదా, అందుకని నీళ్ళను కళ్ళ లోకి తోసేసుకుని, ఉచ్చ బోసుకుందామని చెట్టు చాటుకు బోయి, తనివిదీరా ఏడ్సినా. పిలగాళ్ళంతా నవ్విన ఇదానం తలుసుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తాది నాకు.

విహారి:

నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది ఎర్ర చీమా,

దీనికి పొయ్యే కాలం రానూ, దీని ఆయువు మూడీ పోనూ.

– విలాప విహారి

శోధన:

ఎంతసేపూ చీమ కుట్టిందని మన గోల మనదే గానీ అసలా చీమను ముందు బాధపెట్టి అది తిరగబడి మనలను కుట్టేవరకు పరిస్థితిని తీసుకొచ్చిందెవరు అని ఆలోచించరేం? అసలు ఒక చీమకు మనిషంతవాణ్ణి కుట్టాలంటే ఎంత సాహసం కావాలి? ప్రాణాలు పోగొట్టుకునేంత వెర్రి సాహసం ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ప్రాణాధారమైనదాన్నో లేక ప్రాణం కంటే విలువైనదాన్నో కోల్పోయినప్పుడే కదా? అది ఆలోచించకుండా మనలను చీమ కుట్టిందో అని గోలపెట్టడం ఒఠ్ఠి బాధ్యతారాహిత్యం. తాను చీమకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపపడకుండా గోలపెట్టే హక్కు చీమకాటు తిన్న మనిషికెవరిచ్చారు? లోపం మనలోనే ఉంది. ఆ లోపాన్ని గురించి ఆలోచించకుండా చీమకుట్టిందని బాధపడడం పిచ్చిపని.అబ్బా……..! చీమ నన్ను కూడా కుట్టింది బాబోయ్!

ఒరెమూనా:

ఓ రోజు
ఓ రాజు
ఓ కంత
ఓ చీమ
ఓ కాటు
ఓ కేక

ఆ వేలెవరిది?
ఈ అరుపెందుకు?


కోహం?
అహం బ్రహ్మస్మి
అహం విష్ణుహు
అహమేవా ఈశ్వరహ
??

యు.వెంకటరమణ:

చీమ కుట్టడం, దద్దుర్లు రావడం, మందు పూయడం, దద్దుర్లు తగ్గిపోవడం ఎలా ఉంటుందో ఈ పోస్టు వివరంగా తెలియజేస్తుంది. ఇక్కడున్న స్క్రీనుషాట్లను ఒకదాని తరువాత ఒకటి చూసుకుంటూ వెళ్ళండి.ఈ టపాలో మామూలు ఎర్రచీమకాటు గురించి వ్రాసాను. నల్లచీమకాటుకు, గండుచీమకాటుకు, కొరివిచీమకాటుకు విడిగా టపాలు వ్రాస్తాను.
గమనిక: ఈ స్క్రీనుషాట్లలో దద్దుర్లు మాత్రమే కనిపిస్తాయి, నెప్పి కనబడదు. ఇవి అన్ని ఆపరేటింగు సిస్టముల్లోను కనిపిస్తాయి. మీకేమైనా సందేహాలుంటే, చీమ
మిమ్మల్ని కుట్టాక నాకు రాయండి.

అంతరంగం:

చీమల్లోని ఐక్యత, భావ సమైక్యతను గమనిస్తే నాకు అబ్బురమనిపిస్తుంది. తమకు కలిగిన నాడు దాచుకుని లేనినాడు వాడుకునే వాటి అలవాట్లను చూసి మనమెంతో నేర్చుకోవాలని నాకు అర్థమైంది. పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా కలిసిమెలిసి బతికే వాటి జీవిత విధానం చూసి.. మనుషులు కూడా అలా భేదభావాల్లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా బతకొచ్చు గదా అని ఆలోచనల్లో మునిగి పోయాను. ఇంతలో వేలు ఛర్రు మనిపించి ఉలిక్కి పడి చూస్తే ఏముంది.. ఓ చీమ కసుక్కున కొరికి పారిపోతోంది. హు.. వీటిలో మనుషుల లక్షణాలూ ఉన్నాయని తెలుసుకుని ఎంతో బాధపడ్డాను. అది కుట్టిన నెప్పి కంటే మనుషులకు తీసిపోని దాని ప్రవర్తన నాకెంతో బాధ కలిగించింది.

కల్హార:

చీమ కుట్టిన వెన్నెల వేళ

వెన్నెల జారుతూంది
జలతారు దారాల్లా

వెన్నెల తాగి
బరువెక్కిన కనుదోయి
మత్తులో మూసుకుపోయి
తీయని హాయిని అనుభవిస్తున్నాయి

సరిగ్గా అప్పుడు
చీమకుట్టిన చప్పుడు
చురుక్కుమన్నది చిటికెనవేలు
తళుక్కుమన్నవి కంటి కొసలు

కుట్టింది వేలినైతే
కంటి కెందుకో ఈ ప్రసవవేదన!

చీకటి కారుతూంది
కన్నుల కాటుకలా

అవీ-ఇవీ:

రాత్రి చీమ నన్ను ముద్దు పెట్టుకుంది. చీమ కుట్టడం విన్నాం గానీ ముద్దు పెట్టుకోవడమేమిటీ అని అనుకుంటున్నారా? కుట్టేందుకు అసలు చీమకు పళ్ళే లేవని మీకు తెలుసా? పళ్ళే లేకపోతే కుట్టడమేమిటి? కుట్టడమని మనమేదైతే అనుకుంటున్నామో అది కుట్టడం కాదు, అది మనలను ముద్దు పెట్టుకుంటున్నదన్నమాట! నిజం!! ముద్దుపెట్టుకున్నపుడు చీమ మీసాలు మనకు గుచ్చుకుని చురుక్కుమనిపిస్తాయి. దాన్ని మనం కుట్టడంగా అపోహ పడుతున్నాం. ఈ విషయాన్ని ఈ మధ్యే పరిశోధించి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలకు హిందూలో వచ్చిన ఈ లింకు చూడండి. కాబట్టి ఇకపై చీమ పుట్టలో వేలు పెట్టినపుడు వేలు చురుక్కు మంటే అది కుట్టిందని ఆక్రోశించకండి.. తన ఇంట్లోకి ఆహ్వానిస్తూ మిమ్మల్ని ముద్దెట్టుకుందని గ్రహించండి.

దీప్తిధార:


నేను ఇందాకటి టపాల్లో రాయడం మర్చిపోయాను. నేను బ్లాగు సమావేశాలకు హాజరవడం మొదలుపెట్టినప్పుడు లేదుగానీ నెల్లూరుకెళ్ళొచ్చాక ప్రతిసారీ నన్ను సమావేశస్థలిలో చీమలు కుడూతూనే ఉన్నాయి. అసలు నన్ను కుడుతున్నది లోకల్ చీమలు కాదు.

అవి రైల్లో నాతోబాటు ఇక్కడికొచ్చిన నెల్లూరు చీమలే. ఇది ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నెల్లూరు చీమలు కుడితే కుట్టినచోట మొదటగా మంట పుడుతుంది. ఆ తర్వాత రుద్దిన కొద్దీ చిన్న దద్దు లేస్తుంది. చీమ కుట్టిన ప్రతిసారీ నాకు అచ్చం అలానే జరుగుతోంది.

అడవిలో అర్ధరాత్రి కూడా నాకు ఇలాంటి అనుభవాలు చాలానే కలిగాయి. ఇది చీమల మీద నేను రాయబోయే 10 టపాల్లో మొదటిది. చీమల గురించి ఇన్ని టపాలు రాయడానికి ఇంకో కారణం కూడా ఉంది. మా ఇంటిపేరు ‘చీమ’కుర్తి.

(గమనికః ఈ రచనలో వాడిన ఫోటోలు flickr.com నుంచి తీసుకోబడ్డాయి.)
బ్లాగుల పేరడీ 2 కూడా చూడండి

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

54 Responses to బ్లాగుల పేరడీ – 1

  1. chavakiran says:

    శానా బాగుంది.

    ఇంతకీ వ్రాసిన ది ఎవరు బాబూ?

    విహారి గారి బ్లాగ్మిమిక్రీ చదువుతుంటే చాలా నవ్వు వచ్చినది.

    ఇహ ఒరెమూనా ది చదువుతుంటే, అవును కదూ, ఇలాగే వ్రాసేవాడినేమో అనిపించినది.

    కాకపోతే అది నాలో ఓ కోణము మాత్రమే అలా వ్రాస్తుంది అని మనవి చేసుకుంటున్నాను.

    ఇంత గొప్పగా మన బ్లాగులు చదివి చదివి పిండి ,ఉతికి ఆరేశే ఆ వీర కిశోరము ఎవరండీ?

    యండమూరి ఏదో నవల్లో (విజయానికి ఐదు మెత్లు? ) కోడి రోడ్డు దాటుతుంటే వివిధ వ్యక్తులు ఎలా స్పీచులు దంచుతారో చెప్పిన విషయం గుర్తుకు వచ్చినది

  2. అంత మందిని చీమలు కుటేసిన తరువాత నన్ను కుట్టటాని మా ఆఫీసు దరిదాపుల్లో ఎక్కడా ఒక్క చీమ కూడా కనపడలేదు నాకు. మనం ఆతమహత్యలు చేసుకోవడానికి వెళ్ళి లారీలను రైళ్ళను ఎలా గుద్దేస్తామో, చీమలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి మన్ల్ని కుటేస్తాయేమో. చీమే కదా అని అనుకుంటాం కానీ దగ్గరనుండీ చూస్తే అవి చాలా భయంకరంగా కనబడతాయండీ బాబు.

  3. అహ్హహ్హ…
    భలే చమత్కారం గా రాసారండీ. ఎవరో మహానుభావులు. దండాలు పెట్టాల్సిందే.
    కూడలి ని, తెలుగు బ్లాగులని ఔపాసన పట్టి, చీల్చి చెండాడి రాసేసారు. అమోఘమయిన ప్రయోగం.

  4. పేరడీ అంటే ఇలా ఉండాలి. చదువుతోంటే, ఆయా బ్లాగర్లే వ్రాసారా అన్న అనుమానం వచ్చింది. మంచి ప్రయోగం. మిగిలిన బ్లాగర్లకి కూడా తొందరగా చీమలు కుట్టేస్టే బాగుండును.

  5. నవ్వలేక చస్తున్నానండీ బాబూ.

  6. హహహహ చూసారా చీమ బ్లాగ్ప్రపంచంలోని అతిరధ మహారధులందరిని కుట్టింది. నా జోలికి రాలేదు. బహుశా నన్ను కుట్టితే పట్టుకుని చీమలపై పలు రకాల ఉప్మాలు, ఇడ్లీలు, దోశలు, కూరలు, పులుసులు రాసేస్తాననుకుందేమో ఆ బ్రతకనేర్చిన చీమ.

  7. నా అనుమానం ఇది రాసింది కొత్తపాళీగారు,డాక్టరుగారు,లేదా నాగరాజుగారు కని కావాలి. అలా పేరు చెప్పకుండా నవ్వించడం అస్సలు బాలేదండి.

  8. అతిరధమహారధులందరిని చీమలు కుట్టేసాయన్నమాట.
    ఉదయాన్నే బహుచక్కని పేరడీల పలహారం పెట్టారండి.చాలా చక్కని ప్రయోగం.రాసినవారికి అభినందనలు.ఎవరి పేరడీలు వాళ్ళే రాసారా అన్నట్లుగా వున్నాయి. రాసినవారి పేరు చెప్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా విహారి గారిది, ఒరెమూనా గారిది, రానారే గారిది అదుర్స్. ఇంకా నవ్వాపుకోలేకపోతున్నాను.
    మిగతావి కూడా తొందరగా పెట్టేయండి మరి.

  9. చావా గారూ,
    ఆ పుస్తకం “విజయానికి ఆరో మెట్టు” నాక్కూడా అదే ఉదాహరణ గుర్తొచ్చింది.

    ఈ ప్రయోగం super.
    ఇంకా కొన్ని ముఖ్యమైన బ్లాగులు మిగిలిపోయాయి. వాటికీ ఈసారి కుట్టిస్తారని ఆశిస్తున్నాము.(ఏం మేమేనా కుట్టించుకుని బాధ పడాలి?)

    ఇక పోతే నా బ్లాగ్ మీద రాసింది చదవగానే కొంపతీసి నేనెప్పుడో రాసుకుంది కాపీ కొట్టెయ్యలేదు కదా అన్నంత సందేహం వచ్చేసింది :).
    అంత బాగా రాశారండీ.

  10. మన్యవ says:

    నాకు రానారే, శోధన ఎంట్రీ లు బాగా నచ్చాయి. చాలా బాగా రాసారు.

  11. అద్భుతంగా వ్రాశారు. పొద్దున్నే కడుపుబ్బా నవ్వించారు :).

  12. అన్నట్టు, ఇది వ్రాసినవారెవరో తెలుసుకోవాలని మిగతా బ్లాగర్లలాగానే నాకు కూడా చాలా ఉబలాటంగా ఉంది.

  13. radhika says:

    ఇప్పుడున్న తెలుగు బ్లాగరులనందరినీ కుట్టుకుంటూ వెళితే ఆ చీమకి వాపు వస్తుంది పాపం.నాకయితె రానారె,స్వాతి,ఒరెమునా,ప్రసాద్,విహారి పేరడీలు బాగా నచ్చాయి.అందరి మాటే నా మాట.రాసినవాళ్ళకి నిజం గా వేల వేల వందనాలు.నాకయితె గురువుగారు నాగరాజు గారే రాసారనిపిస్తోంది.

  14. శేషాచలపతి says:

    కొన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, మిగిలినవి బావున్నాయి. రాబోయేవి ఎలా ఉంటాయో!!

  15. చాలా బాగా రాసారు. ప్రయొగం అదిరింది

  16. వైద్యో నారాయణో హరి!
    వందనాలయ్యా నీకు చదువరి!!

    యిపరీతంగా తలనొస్సాంది, పైగా చానా పొద్దుబొయింది, యింగ పండుకోవాల అనుకుంటాండంగా మన గుంపులో ‘సీమ’కుర్తోళ్ల జాబు గనపడె. ఓహో,, పొద్దులో ఏందో కొత్తదొచ్చింది, బాగున్నిట్టుండాదే సూజ్జాంపా అని ఇట్టొచ్చి. సామీ నిజ్జంగా జెప్తాండా “వీవెన్: చీమ కుట్టింది, నెప్పి పుట్టింది.” అనేది సూడంగానే నా తల్నొప్పి యట్టబాయనో యెగిరిపాయ. ఇంగ ఆణ్ణించి “ఆడచీమలు కుట్టేది ఆపేక్షతోనే – విలాపవిహారి – అది తిరగబడి మనలను కుట్టేవరకు పరిస్థితిని తీసుకొచ్చిందెవరు – అహమేవా ఈశ్వరహ ?? – ఇవి అన్ని ఆపరేటింగు సిస్టముల్లోను కనిపిస్తాయి – నెప్పి కంటే మనుషులకు తీసిపోని దాని ప్రవర్తన నాకెంతో బాధ కలిగించింది – కంటి కెందుకో ఈ ప్రసవవేదన! – రాత్రి చీమ నన్ను ముద్దు పెట్టుకుంది – నెల్లూరుకెళ్ళొచ్చాక ప్రతిసారీ నన్ను …” వొగోటీ వొగ నాటుబాంబు. వీవెన్, కల్హార, ఒరెమునా పేరడీలకుగాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఇయ్యాల్సిందే. కడుపు పగిలేటిగా నొగిచ్చినావు – సల్లంగుండు మారాజా(“శ్రీకృష్ణదేవరాయలు” నుంచీ కాపీ). చీమ-ఉంగరం సంగతి త్రివిక్రమ్‌తో రాయించాల్సింది.

  17. అయ్యో తప్పు సమాచారం ఇచ్చా.
    ఆ పుస్తకం మైండ్ పవర్.

  18. బ్లాగుల పేరడీ బాగు బాగు.
    అతిరథ మహారథులింకా కొందరు మిగిలే ఉన్నారు. బహుశా మలివిడతలో వస్తారేమో? ఇంకా వ్యాఖ్యలకు కూడా పేరడీలు రడీగా ఉన్నాయని ఊరిస్తున్నారు. శేషాచలపతి గారన్నట్లు కొన్ని బ్రహ్మాండంగా, మిగిలినవి బాగా ఉన్నాయి. మలివిడతలో కూడా ఇదే తూకం పాటిస్తారనుకుంటున్నా.

  19. గుంపులోకొచ్చి రావుగారొక రాయి విసిరితే రానారె దాన్నందుకున్నారు!
    ఇంతకీ అది తగిలిందా తప్పిందా? తేలేదెలా?

  20. నాగరాజు గారు రాసారని నేనుకుంటున్నాను. లేకపోతే సిముర్గ్ గారయిఉండవచ్చు.

  21. సుధాకర్(శోధన) says:

    నవ్వలేక చచ్చాం…బాబోయ్ నన్ను సరదా చీమ కుట్టింది 🙂 ముఖ్యంగా కిరణ్ చావా చీమ పద్యం అదిరింది….కల్హారాది కూడా ళోళ్ ళోల్ ళోల్

  22. సుధాకర్(శోధన) says:

    షడ్రుచులు : చీమ కుట్టు కారం

    చీమలు : ఒక రెండు (మంచి బలిసినవి, చురుక్కా వున్నవి)
    మనిషి : ఒకటి (మంచి గాఠ్ఠి కంఠం వుంటే మంచిది)

    విధానం : ముందుగా చీమలను ఒక దగ్గర కూర్చో పెట్టి, బాగా భయపెట్టాలి.

    తరువాత వాటికి ఒక రెండు పంచదార పలుకులు ఇవ్వాలి.

    అవి తినేలోగా ఆ పలుకులను తీసి శుభ్రంగా తోమి కడిగిన మనిషి తొడ మీద వుంచి..అక్కడ ఆ రెండు చీమలునూ వదలాలి.

    రెండు చీమలను రెండు దెబ్బలు తగిలించాలు..

    కర్ణపేయమైన చీమ కుట్టు కారం సిద్ధం…

  23. నాయనా సుధాకరు, అలా ఉడుక్కోకు. ఈ పాడు చీమ అందరు బ్లాగరులను కుట్టింది. రెండో భాగం వస్తుంది …ఆగు.

  24. హ్హ హ్హ నవ్వాపుకొలేక మద్యలో ఆపి మళ్ళీ చదివా!
    అబ్బబ్బ ఎవర్నాయనా ఇంత గొప్పగా రాసింది? నాకు “ఒరేమునా” పేరడీ చదువుతున్నా, “కళర” కవిత చదువుతున్నా, రానారె చెట్టుచాటుకు ఉచ్చబోయడానికెళ్ళి ఏడ్చిన ఘట్టం చదివినా (రానారె అయితే పెదపంతులు అనేదానికి బదులు పెదయ్యవారు అనేవారేమొ) నవ్వే నవ్వు. పొద్దే పొద్దు. కొనసాగించండి హవా!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  25. చాలా బాగా రాసారండి. నవ్వు ఆపుకోలెకపోయాను. అద్బుతంగా రాసారు. అందుకోండి అభినందనలు

  26. lalitha says:

    చాలా బాగా రాసారు. భలే నవ్వించారు (నవ్విస్తున్నారు).
    చాలా బాగుంది.

    లలిత.

  27. హా హా హా భలే భలే ఇప్పటికిది మూడో సారి..సూపర్

  28. Sriram says:

    భలే భలే….బ్లాగ్జరుక్ శాస్త్రి ఎవరో…అభినందనలు!

  29. జర్క్‌శాస్త్రి అని పిలవొచ్చు. జరుక్‌శాస్త్రికే చిన్న జర్క్ ఇచ్చే పేరడీ.

  30. ఎవరు వ్రాసారోగాని చాలా క్రీయేటివిటి ఉన్నవారు.

  31. సుధాకర్(శోధన) says:

    ఎంత మాటన్నారు…ఉడుక్కోవటం మా వంశంలోనే లేదు (ఇది కోత కాదు ;-))

    ఇది రాసినది మీరేనని డౌటొచ్చి మీ బ్లాగుమీద చీమ వదిలా…;-)

  32. Pingback: సోది sOdi » Blog Archive » భ్లాగర్లపై చీమల దాడి

  33. నాగరాజు పప్పు says:

    అసలు కంటే పేరడీలే బాగున్నాయి.
    రాసినది నేను కాదు.

  34. మొత్తానికి గాఢసుషుప్తావస్థలో ఉన్న నన్ను ఈ చీమ చురుక్కుమనిపించేలా కుట్టి కితకితలు పెట్టించింది. అబ్బా…ఎంతగా నవ్వానో నాకే తెలియదు. మరీ ముఖ్యంగా చావా, రానారె, నాగరాజు గారి పేరడీలు అదిరాయి. మిగతావన్నీ కూడా నవ్వించాయి…?డుముక్రవిత్రి/తిజ్యో రువానసిరా

  35. రాక రాక ఒక అవకాశ మొచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంటా.

    మీ అందరికీ నేను తెలియ చేయడమేమనగా…

    ఈ బ్లాగు పేరడీలు అన్నీ నేనే రాశననిన్నూ,
    అవి కూడా ఎంతొ కష్టప్పడి, బాధప్పడి, శ్రమప్పడి రాశాననిన్నూ,
    మార్కులన్నీ నాకే రావాలనిన్నూ,
    మీ అభినందనలన్నీ నాకే చెందాలనిన్నూ,
    మీ అందరికి బుర్ర బెండ్(శిరస్సు వంచి) చేసి విన్నవించుకుంటున్న..

    –మార్కుల విహారి ఉరఫ్ పేరడీలకు పేరడీ విహారి.

    పడిపోయారా?

    నాకింత సీను లేదు కానీ ఆ రాసిన ఆయనకి లేక ఆవిడకి ఒకటి పక్కన ఎన్నో కొన్ని సున్నాల కోట్ల వందనాలు.

    –నిజం విహారి

  36. సభాముఖంగా మనవి చేసేదేంటంటే – నేను పద్యాలకే తప్ప గద్యాలకి పేరడీలు రాయను!
    ఐనా ఇంత చమత్కారంగా రాసిన అనుకరణలు నేను రాశానని భావించినందుకు ధన్యవాదాలు.
    బ్లాగ్గజాలన్నిటికీ (దిగ్గజాలు కాదు, దిగ్గజాలైతే ఎనిమిదే ఉంటై) చీమ కుట్టించడం ఒక యెత్తైతే, సదరు గజాలన్నీ ఒకరినొకరు అనుమానించి ఆటపట్టించుకోవటం మరొక యెత్తు.
    మొత్తానికి ప్రతి పొద్దు పొడుపూ కొత్తగా ఉంటోంది – నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో!

  37. రెండో విడతలో ఏం చేస్తారంటే – పేరడీ కి నమూనా (original) ఎవరో చెప్పరు, పాఠకులే కనుక్కోవాలి పేరడీని బట్టి.

  38. ఈ బ్లాగ్జరుక్ శాస్త్రి ….జర్క్‌శాస్త్రి…”చదువరి” అని నా ఘట్టి నమ్మకం. చీమ కుడితే నెప్పిగా వుంటుందనే అనుకునేవాడినే గాని ఇంత హాయిగా వుంటుందని ఇప్పుడే తెలిసింది.
    -నేనుసైతం

  39. radhika says:

    కొత్త పాళీ గారి ఐడియా చాలా బాగుంది.ఈ సారినుండి బ్లాగరుల పేర్లు చెప్పకండి మేమే కనుక్కుంటాము.అలా కనుక్కుంటేనే కదా ఆ పేరడీ సూపర్ గా రాసినట్టు.నాగరాజు గారు నేను కాదన్నారు కాబట్టి నాకు ఇప్పుడు త్రివిక్రముడి మీద అనుమానం గా వుంది.ఇప్పటికి ఇది ఆరోసారి ఈ పోస్టు చదవడం.

  40. సుధాకర్(శోధన) says:

    వోటింగ్ మొదలుపెడదాం…

    త్రివిక్రమ్ కి నా అర వోటు

    చదువరి గారికి ఒక అర వోటు

  41. ఇది ఒకరే చేసినపనిలా లేదు. కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి పన్నిన కుట్రలా ఉంది :). దీనిపై CBI విచారణకు ఆదేశించడంగాని, అది కుదరకపోతే ఒక సిట్టింగు బ్లాగరు ఆద్వర్యంలో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టాలని నేను కోరుతున్నాను.

  42. పప్పు నాగరాజు says:

    నా అనుమానం కొవ్వలి వారేమో అని. ఇలాటి పేరడీలు కట్టడానికి కావల్సిన చతురత – అందులో ఎవర్నీ నొప్పుంచకుండా చెప్పగలిగే విజ్ఞత, చీమ కుట్టడం లాటి అంశాన్ని కూడా అన్ని కోణాల్లో ఆలోచించగలిగే నైపుణ్యం వారికున్నాయి.
    ఈ పేరడలన్నీ చదువుతుంటే, నాకెందుకో సత్యశోధన బ్లాగే కనిపిస్తోంది.

  43. మొత్తానికి ఈ బ్లాగుల పేరడీ మన బ్లాగ్లోకంలో ఓ సంచలనమే సృష్టించినట్లుంది. ఎవరా ఎవరా అని రకరకాల పలురకాల ఊహాగానాలు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఆ ఎవరో కనుక్కుని ఆ క్రెడిట్ ఏదో కొట్టేద్దామని, మరి ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందో!! పొద్దు సంపాదకులు తొందరగా ముసుగు తొలగిస్తే బాగుంటుంది. సుధాకర్ గారన్నట్లు ఇప్పటికి రూలవుట్ అయినవాళ్ళు పోగా మిగతావాళ్ళకి ఓటింగ్ పెట్టేస్తే పోద్దేమో. కొంతమంది కామెంట్స్ ఇంకా రాలా మరి ఎందుకనో!!! ఆ కోణంలో నుండి కూడా ఆలోచించి చూడుడి.

    ఎవరు రాస్తే ఏం కాని అందరికి మనసార హాయిగా నవ్వే భాగ్యం కలిగించారు. కొన్ని విషయాలు కొందరినే నవ్విస్తాయి, ఇది మాత్రం అందరిని తెగ నవ్వించేస్తుంది. ఇంకొకసారి మరొక్కసారి పొద్దు కి అభినందనలు.

  44. సుధాకర్(శోధన) says:

    ఇక్కడ వ్యాఖ్యానించని బ్లాగరులు

    ౦౧. చదువరి గారు
    ౦౨. త్రివిక్రమ్
    ౦౩. సీ.బీ.రావు గారు
    ౦౪. …ఇక్కడ జత చేయండి..

    ఇదేదో పెద్ద స్కాములా వుంది. వెంటనే ఛేదించాలి 😉

  45. ఏదోశాస్త్ర్రం చెప్పినట్లుంది- ఏదే పొద్దున్నే పొద్దులో పేరడీ చదివి ఆఉల్లాసంలో ఒరేమూనా ఇలా కూడా వ్రాయగలరు అని నాబ్లాగులో చిన్న టపా పెట్టానే కాని ఈ పరకాయ ప్రవేశం నావల్లయేనా? ఏమైనా, ఇంత తక్కువ వ్యవధిలో 44 వ్యాఖ్యలు- చూసారా, పేరడీ చేసిన గారడీ!!!!! త్రివిక్రముడా? చదువరా? to be, not to be?

  46. త్రిమూర్తుల్లో ఇంకోపేరు మరిచా- సిముర్గ్. ఇంకో విశేషం- ఎప్పుడూ మన జ్యోతిగారి ‘సరదా’కి తండోపతండాలుగా పోయే జనం ఈసారి ఇక్కడే తిష్ట వేసినట్లున్నారు.

  47. పొద్దుకొచ్చా. పొద్దున్నే వచ్చా. పొడుచుకొచ్చా. మీ పేరడీకొచ్చా. మళ్లీ చదవడానికొచ్చా. మొదలెడితే చివరాకరిదాకా ఆగలా. చీమ కుట్టిన “ప్రతిసారీ” నాకు అచ్చం అలానే జరుగుతోంది. (సిబి చక్రవర్తి రావు)

    వైద్యో నారాయణో హరి!
    వందనాలయ్యా నీకు చదువరి!!
    నేను చెప్పగలను ఇది చదువరిగారి పనేనని. ఆయనకే నా ఓటు.

  48. హహ్హహ్హా…. బాగుంది.

  49. కామేష్ says:

    నాకు ఒరెమూనా, రానారె పారడీలు బాగా నచ్చాయి. హహహహహ నవ్వలేక నవ్వలేక చాలా బాధ పడ్డానంటే నమ్మండి. నిజానికి ఈ బాధ చాలా మధురమైనది.

  50. “దొంగలు పడిన ఆరు నెలలకు కుక్క మొరగటం” చందాన తయారయ్యాను నేను. ఎక్కువ వ్యాఖ్యలున్న పోస్ట్లు జాగ్రత్తగా చూడండి చివరి వ్యాఖ్య “నవీన్ గార్ల” దే అయ్యుంటుంది 🙂

  51. Pingback: The Hidden Agenda: కూడలి « వీవెనుడి టెక్కునిక్కులు

  52. 4 ఏళ్లలో ఈ చిమ స్వరూప స్వభావాలని మార్చుకుంది,

    అప్పుడు మిమ్మల్ని అందరిని కుట్టి చచ్చిన చీమ దాని ప్రెసెంట్ జన్మలో(ఇప్పుడు)నల్ల చీమ !!

    ఇది కుట్టేది కాదు చలి చీమ !!

    నా ఒంటిని 4 WAY ROAD అనుకుని తెగ అటు ఇటు తిరుగుతూ చక్కలిగిలి పుట్టిన్చేతున్నది !!

    వామ్మో దీన్ని ఆపక పోతే ఊపిరి ఆడేలా లేదు !!

    త్వరలో రిలీజ్ అవబోతున్న రాజమౌళి “ఈగ” సినిమా చోపిస్తానని చెప్పి దీన్ని కాకా పట్టాలి !!

    పంచదార ఎక్కడుందో ఏంటో మరి !!

  53. shri says:

    చీమ కుట్టిన బ్లాగ్ పోస్టు బెస్టు గా ఉంది,అభినందనలు..

    శ్రీదేవి

Comments are closed.