నా వేసవి విశేషాలు

swathi.bmp“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి ఈసారి తన వేసవిజ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నారు:

————-

చూస్తుండగానే వేసవి మళ్ళీ వచ్చేసింది.

నవ వసంతం చైత్రానికి మావి చిగురు తాంబూలం అందించి
తానున్నంత సేపూ కోకిలమ్మ తో కబుర్ల కచేరీ చేయించి
కొద్దిగా ఎండ చురుక్కుమనగానే గుబురు వేపాకుల పందిరి వేసి
సాయంత్రమవుతుంటే మలయ సమీరాల వింజామరలు వీచి
మాపటి వేళ మరుమల్లె సుగంధాల అత్తరు నిద్రని కానుకిచ్చి
ఇలా మనకి వేసవి ని వదిలి వెళ్ళబోతుంది.

వైశాఖమంటే మండే ఎండలు, చల్లని నీళ్ళు.
పల్లెటూళ్ళలో కొత్తావకాయ పచ్చళ్ళు,తాటాకు పందిళ్ళు, పెళ్ళి సందళ్ళు.
పిల్లలకైతే వేసవి సెలవలు, అమ్మమ్మల వూళ్ళు, కొత్త ఆటలు, స్నేహాలు.
ఎండల్లో ఆడొద్దని, వడదెబ్బని అమ్మ చెప్తే అది తమని మోసం చెయ్యటానికి
చెప్పే అబద్ధమని గట్టి నమ్మకం తో రెట్టించిన ఉత్సాహం తో వీధుల్లోకి
పరుగులు.

ఇక సిటీల్లో ఐతే సమ్మర్ కాంప్ లు, ఎగ్జిబిషన్ లు.
మొత్తం మీద చివరికి ఏ మార్పూ లేనిది మాత్రం కంప్యూటర్ పక్షులకి
ప్రాజెక్ట్ లూ, చావు గీతలు( deadline లు లెండి) వీటిల్లో ఏం తేడా లేదు.
బాధ్యత పెరిగేది మాత్రం ఎంట్రన్సు సెట్లు రాసే నిమ్మిత్తం తెగ రుద్దబడే
రేపటి పౌరుల మీదే.

నా మటుకు నాకు కొన్నేళ్ళ క్రితం వరకు(ఉద్యోగమూ, వివాహమూ కాకముందనమాట)
ఎండాకాలం అంటే మనసు నిండే కాలం.
సరికొత్త ప్రేమ లో ఒక రోజు విరహం తరువాత ప్రియ సఖి ని కలవబోయే చెలికాడి
మనః స్థితి లా ఉండేది సంవత్సరాంత పరిక్షలు రాస్తున్నన్ని రోజులూ. ఆఖరి
పరిక్ష పూర్తయిన మరుక్షణం ఆఘ మేఘాలు, వురుకులు పరుగులు ఈ రెంటిలొ ఏది
ముందైతే దాని మీద సర్వోత్తమ గ్రంధాలయానికో, ఇంట్లోని పుస్తకాల అరకో
చేరేవరకి స్థిమితం దొరకదు. విజయవాడ లో ఉన్న కారణం గా ప్రతీ ఆంగ్ల
సంవత్సరాది కి పుస్తక ప్రదర్శన లో కొన్న పుస్తకాలన్నీ
తమ మౌన తపో భంగం కోసం ట్రంకు పెట్టె లో ఎదురు చూస్తూ ఉండేవి మరి.

కొత్తవాసన తో పొందికగా పేజీ ల అమరిక లో సర్దుకుని కూర్చున్న పుస్తకాన్ని
మొదటిసారి తెరిచి చూసే ఆనందానికి సాటేది. ముందుగా కొన్ని రోజులు గుబురు
మీసాల గురజాడ తాత మాటలన్ని విని పెద్దాయన్ని పంపించెయ్యగానే ఏ కొంటె
రామలింగడొ, బీర్బలో ఎక్కడ తెలివిగా మాటనేస్తారో అని వాళ్ళ కధలోసారి
ఆలకించి కొద్దిగా నిద్ర లోకి జారుకుంటే ఒక గబ్బిలపు కవితా రొద తో మళ్ళీ
అక్షరాల మెలకువ.

పెద్దన పెద్దరికాన్ని చూసి కొద్దిగా బిడియ పడినా, యండమూరి కాల్పనికాన్ని
తీవ్రంగా ఆరాధించినా, చలం కలం ధాటి కి అయోమయపడినా, శ్రిశ్రీ ని తిలక్ ని
పుస్తక స్నేహితులు గా పొందినా దీనంతటికీ కారణం తను చిరిగిన చొక్కా
వేసుకున్నా నేను కోరిన పుసకాన్ని కొనిచ్చి “నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ
విద్యతే” అని చెప్పిన నాన్న చలవే.

స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

12 Responses to నా వేసవి విశేషాలు

  1. సెభాష్! తల్లీ మీ నోటి చలవన .. ఐ మీన్ .. మీ వేసవి టపా చూసైనా మావూరి మంచు కరుగుతుందని గంపెడాశతో ఎదురు చూస్తుంటాను.
    “చావు గీతలు” – అద్భుతమైన ప్రయోగం. ఆంగ్ల నుడికారంలో ఉద్యోగం చెయ్యడాన్ని “to make a living” అనడం తెలిసిందే కదా? Your Money or Your Life అనే పుస్తకంలో రచయిత జో డొమింగెజ్ అంటాడు “You are not making a living – you are making your death!” అని.
    “తను చిరిగిన చొక్కా వేసుకున్నా నేను కోరిన పుసకాన్ని కొనిచ్చి… “ – ఈ లైను చదవగానే చాసో “ఎందుకు ఫారేస్తాను నాన్నా?” కథ గుర్తొచ్చింది, ఎందుకో?

  2. radhika says:

    మండు వేసవి లో చెమటలని తలచుకుంటే భయం వేసినా వాకిట్లో వెన్నెల దుప్పట్లు,కొబ్బరాకు బొమ్మల పెళ్ళిళ్ళు,సన్నాయి సందళ్ళు అన్నీ గుర్తుకొస్తే చల్లని పిల్లగాలి తాకిన అనుభూతికి లోనవుతాను.మీ ఈ వ్యాసం కూడా అదే అనుభూతిని కలిగించింది.

  3. విజయ says:

    వేసవి మండుదే అయినా ఎన్నో చల్లని జ్ఞాపకాలను మిగులుస్తుంది.ఏ.సి అనే కృత్రిమ వాతావరణం కల్పించుకుని ఆఫీస్ అనే బంధి ఖానాలో మగ్గిపోతున్న మనకి ఏ కాలం అయినా ఒకటే అయిపోయింది…ఇలా వ్యాసాలు చదివి ఆనందించాల్సిందే.మండు వేసవి లో మల్లె పూల జల్లులా ఉంది మీ వ్యాసం.

  4. స్వాతి గారూ,
    అద్భుతంగా ఆవిష్కరించారు.
    “సరికొత్త ప్రేమ లో ఒక రోజు విరహం తరువాత ప్రియ సఖి ని కలవబోయే చెలికాడి
    మనః స్థితి లా ఉండేది సంవత్సరాంత పరిక్షలు రాస్తున్నన్ని రోజులూ” సరిగ్గా చెప్పారు..నాకైతే ఎండాకాలం ఒంటిపూట బడి వస్తోంది అంటేనే ఈ గుబులు మదినంతా ఆక్రమించేది.
    మండే ఎండల్లో కూడా “ఎండల” మీద ఇన్ని మంచి మాటలు విసిరారు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. సిముర్గ్ says:

    మండు వేసవిలో కోలా-హలం కాకుండా, చల్లని మజ్జిగ తాగినట్టుంది. సెభాష్.
    ఇంతకు ముందు శ్రీరాం గారి ఆనందోదయం టపా గుర్తుకు వచ్చింది ఈ టపా చదువూతుంటే. సహజమైన భావుకతతో అలరారుతోంది.

  6. అభినందనలు. వేసవి గురించి చాలా చక్కగా చెప్పారు. ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాను.

    “తను చిరిగిన చొక్కా వేసుకున్నా నేను కోరిన పుసకాన్ని కొనిచ్చి”….పిల్లలు ఏమిటి అనేది పెద్దవాళ్ళని బట్టి వుంటుంది అనటానికి మీ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో.

  7. చాలా బాగుందండీ. వేసవి గురించి చాలా బాగా రాసారు.

  8. lalitha says:

    స్వాతి గారూ,
    చాలా బాగా రాసారు. ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసారు.
    నాకు “దిల్ ధూంఢ్తా హై ఫిర్ వొహీ ఫుర్సత్ కే రాత్ దిన్”
    ఆ పాట గుర్తుకు వచ్చింది.

    అందులోనూ, ఈ చరణం:

    “యా గర్మీయోం కీ రాత్ జొ పూరవాఈయాన్ చలే
    ఠండీ సఫేద్ చాదరోం పే జాగే దేర్ తక్
    తారోన్ కో దేఖ్తే రహే ఛత్ పర్ పడే హుయె”

    లలిత.

  9. మంచి పుస్తకాలు చదివే అలవాటు చేసుకొనేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న నాలాంటి వారికి “నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” అని బాగా గుర్చుచేశారు. మనోవికాసాన్ని, మంచి ఆలోచనలను, జ్ఞానాన్నీ ఇచ్చే పుస్తకాలు విరివిగా చదవడానికి అలవాటుపడాలి. ఏ కాలమైనా, సెలవుల్లో పుస్తకపఠనం మంచి ఆటవిడుపు. పోయిన సంవత్సరం వేసవి ఎండతీవ్రతను తట్టుకోలేక చల్లదనంకోసమే నేను ఆఫీసుకెళ్లిన రోజులున్నాయి.

  10. Sowmya says:

    నాకు రెపట్నుంచి summer holidays.. yippee!!! “సరికొత్త ప్రేమ లో ఒక రోజు విరహం తరువాత ప్రియ సఖి ని కలవబోయే చెలికాడి
    మనః స్థితి లా ఉండేది సంవత్సరాంత పరిక్షలు రాస్తున్నన్ని రోజులూ” – నాకు ఇలాగే ఉంది ఇప్పుడు. 🙂

  11. నాకు చిన్నప్పటి వేసవి సెలవులు గుర్తొచ్చాయి. పరీక్షలు అయిన తెల్లారే అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం. లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటే అవి గంటల్లో చదివేయడం. మళ్ళీ తెల్లారి లైబ్రరీ ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూడటం. ఇంట్లోనే చింతపిక్కలతో ఆటలు,గుజ్జనగుళ్ళూ ఆడుకోవడం. అప్పట్లో టీ.వీ లేదు. వేసవి వచ్చిందంటే మల్లెపూలతో కనీసం రెండూ మూడు సార్లు అమ్మ్తతో పూలజడ వేయించుకోవడం. పట్టుపావడా, నగలు, పూలజడతో స్టూడియో కెళ్ళి ఫోటో దిగడం.ఓహ్! మళ్ళీ వచ్చేనా ఆ రోజులు?

  12. chanti gadu says:

    mi kavitha chala bhagundi………..

Comments are closed.