కనబడుట లేదు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు గారి భర్త మీకెక్కడైనా కనిపిస్తే వాళ్ళావిడకు తెలియజేయడం మాత్రం మరవకండేం?

——————–

కనబడుట లేదు

అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గత వారం రోజులనుండి మా శ్రీవారు కనబడటం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి ‘బట్ట తలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి’ అని, ఇంకా అదేదో సినిమా చూసి ‘నాకూ ఆదివారం సెలవు కావాలి’ అని అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్ళారో ఆచూకీ తెలీటంలేదు.ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కాదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడంవల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.

* ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ,నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఎంటో మరి?

* ఎప్పుడైనా వంట బాగాలేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం ‘బాగుంది’ అనరు. కామ్‌గా తినేసి వెళ్ళిపోతారు.

* నా పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనిపాటాలేని నాలాంటివారే ‘సెంటిమెంటల్ ఫూల్స్’ గా ఉంటారని ఆయన అభిప్రాయం.

* స్నేహితులతో ఎన్ని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పదినిమిషాలు మాట్లాడటానికి టైం లేనంత బిజీ మనిషి.

* నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు లాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.

* నేను చేసిన పలావ్ నచ్చదు కాని పక్కింటోళ్ళు ఇచ్చిన పచ్చగడ్డి పచ్చడి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.

* కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునేవారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.

* మొత్తం మీద “తినడానికి”… “పడుకోవడానికి” మాత్రమే ఇల్లు ఉన్నది అన్నట్టు ప్రవర్తిస్తారు.

పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి. ప్లీజ్. మీకు రానుపోనూ ఆటో కాని బస్ చార్జీలు కాని ఇస్తాను.

ఇట్లు

వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు

హైదరాబాదు

– జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

18 Responses to కనబడుట లేదు

  1. radhika says:

    మంగతాయారు గారూ అచ్చూ ఇలాంటి పోలికలతోనే మా ఇంట్లో ఒకరున్నారు.

  2. సరదా శిర్షిక లో రాసినా ఇది చాలా సీరియస్ విషయం. మగ వాళ్ళ మనస్తత్వాన్ని ఫిల్టర్ చేసిమరీ కాఫీ పెట్టినట్టున్నారే. మీరు మర్చిపోయిన ఇంకో విషయం.. ఉద్యోగం చేసే భార్య ఇంటి పని లో ఏదైనా పొరపాటు చేస్తే “ఒక పాతిక వేలు సంపాదించినంత మాత్రాన ఆడదానికి అన్నం వండటం బరువు కాకూడదు” అని అప్పుడు కూడా మననే అనగల సమర్ధులూ ఉన్నారు. ఇంతా చేసి ఆవిడ వండింది తను తినటమే మహా భాగ్యం లా పది సార్లు బ్రతిమాలితే తప్ప తినకుండా ఎదో త్యాగం చేసినట్టు build up ఇచ్చేవారు కూడా ఉన్నారు.
    * ఈ లక్షణాలు ఉన్న వారి గురించే నేను చెబుతున్నా అండీ. మిగతా మగ మహారాజులు భుజాలు తడుముకోవద్దని మనవి.

  3. మంగతాయారు గారు చాలా పరిచయస్థులలాగా అనిపిస్తున్నారే….

  4. jyothi says:

    నాగరాజుగారు, డౌట్ పడకండి. అది నేనే …ఆ పేరు బాలేదని ఈ మధ్యే జ్యోతి అని మార్చుకున్నా. కాస్త సాయం చేయండి మరి.

  5. శేషాచలపతి says:

    కొన్నేళ్ళ తరువాత ప్రశాంతత అనుభవంలోకి వచ్చిన ఆ మానవుడికి ఆ మాత్రం సుఖం దక్కనీయకుండా “పట్టుకొచ్చి అప్పజెప్ప” మనడం అన్యాయం మంగతాయారు గారూ!

  6. male chauvinist అనే పదం ఉంది కానీ ఇక్కడ female chauvinist అనే పదాన్ని వాడాలనిపిస్తుంది 🙂

  7. lalitha says:

    మంగ తాయారు గారూ,

    ఈ లక్షణాలు ఉండే ఎంతో మందిలో మీ వారిని పోల్చుకోవడం ఎలాగండీ?

    లలిత.

  8. మీ ఆయన చదవడనేనా మీకింత ధైర్యం? 🙂

    –ప్రసాద్
    http://blog.charasala.com

  9. lalitha says:

    ఆయన చదువుతారనే ఆశతో రాశారేమో?

    లలిత.

  10. సిముర్గ్ says:

    ప్రియాతి ప్రియమైన తాయారూ,
    ఎక్కడ ఉన్నా ఎమైనా,
    మనమెవరికి వారే వేరైనా
    నీ సుఖమే నే కోరుకున్నా
    నినువీడి అందుకే నే వెళుతున్నా

    నా కోసం వెతకొద్దు, వెతింకించొద్దు… ప్లీజ్.

  11. గృహస్థాశ్రమం ముగించేశారేమో!?

    నమ్మకురా ఇల్లాలు పిల్లలూ బొమ్మలురా జీవా, తోలు బొమ్మలురా జీవా!
    మోహమెందుకూ దేహంపై ఇది తోలుతిత్తిరా జీవా, ఉత్త గాలితిత్తిరా జీవా!!

    అని పాడుకొంటూ ఎవరైనా కనిపిస్తే ఆరాతీస్తాను. 🙂

  12. అన్నట్టు “కనబడుటలేదు” శీర్షిక కింద ఫోటో ఏదో పెట్టినట్టున్నారు, అది నిజంగానే కనబడుటలేదు. (లింక్ సమస్యో లేక నా ఫైర్‌వాల్ నిరోధించిందో).

  13. jyothi says:

    ఏవండి, మీరు రాకపోతే పోయారు. ఉద్యోగం చేసుకోండి. ముప్పావు జీతం ఇంటికి పంఫండి.లేదా నేనే మీ బాసు దగ్గర తీసుకుంటాను. ఇంటద్దె,పాలబిల్లు,పిల్లలఫీజులు ఎలా కట్టాలి. ఎవరిని ఒక్క పైసా అడగను. ఇవ్వకపోయారో కేసు పెడతా.మీ ఇష్టం.మీరు సన్యాసం పుచ్చుకుంటారో, మీకిష్టమైన స్నేహితుడి దగ్గర ఉంటారో మీ ఇష్టం. నేనూ చూస్తా ఎవరెన్ని రోజులు తిండి పెడతారో? అతడి పెళ్ళాం ఇద్దరిని తన్ని తగలేస్తుంది. దూల తీరిపోతుంది.హోటల్ తిండి మీకు అసలే పడదు మరి.

    నాకు చాలా మందిమహిళలు రాస్తున్నారు. మా ఇంట్లోనూ ఇలాంటి క్యారెక్టర్ ఉందే అని….

    రానారె,
    మా వారి ఫోటో మంచిది లేదయ్యా! అందుకే ఇవ్వలా. ఐనా అందులో అంత ప్రత్యేకత ఏమి లేదులే….

    మంగతాయారు..

  14. Ranganadh says:

    hi. ide modatisaari ikkadiki raavatam .. madhyataragati purusha punguvunni kachi vadposi raasesaaru! ade chetto TV serials..shoppimg & gossiping vyamohamlo padi mogudu .pillalaki kasintha vediga ..fresh ga vndi pettatam papamanukuntunna stree murtulaki kooda o churaka antidduroo!

  15. Srinivas says:

    mee kashtaalu cooste aamadhya google veediyollo coosina ee naatika gurtoccimdi.

    http://video.google.com/videoplay?docid=3040431879741107069

  16. జ్యోతి గారూ మీ ఈ వ్యాసం ఆంధ్రభూమి లో మక్కీ కి మక్కీ కాపీ అయింది(అల్లరి శీర్షిక అనుకుంట). ప్రైజు కూడా గెలుచుకుంది.

  17. పోనీలెండి. హాస్యం ఎవరి సొత్తు కాదు. అందరు నవ్వుకుంటే చాలు.

  18. బావుందండి టపా.
    అలమేలు మంగ తాయారు పేరు నాకు అతిగా నచ్చే తెలుగు పేరు. అమ్మాయి పుడితే ఆ పేరే పెడతా… 🙂

Comments are closed.