సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.
————————
మన తెలుగు బ్లాగులలోనే ఎవరో పురాణాలలో ఒకొక్కరికి ఆయుష్షు అన్నేసి సంవత్సరాలేంట్రా బాబు అని ఆశ్చర్యపడ్డారొకసారి . నిజానికి నాకు కూడా ఆ అభూత కల్పనలు చదివితే నవ్వు వస్తుంటుంది. వేల సంవత్సరాలు బతికిన పురాణ పురుషుల కథలు నిజమేనా అనిపిస్తూ వుంటుంది.
అయితే ఒక్క సారి ఇప్పుడు మనం చెప్పుకో బోయే వృక్షరాజం తాలుకా కథ చూస్తే కళ్ళు, నోరు తెరుచుకోక మానవు .
ఈ వృక్ష రాజం పేరు మెథుసెలాహ్. ఒక బ్రిష్టల్ కోన్ పైన్ చెట్టు . ఈ పేరు ఎందుకు పెట్టారంటే బైబిల్ లో ఎక్కువ కాలం (దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల కాలం) బతికిన పురుషుడి పేరే ఇది. అయితే ఈ చెట్టు మాత్రం అతని రికార్డుని కాలితో తన్నింది. ప్రస్తుతం దాని వయస్సు ….4767 సంవత్సరాలు. అక్షరాల నాలుగు వేల సంవత్సరాల పైమాటే. ఇప్పుడు తెరుచుకున్న నోరు మీరు మూసుకోమని మా విన్నపం . 🙂
ఈ వయస్సును ఆ చెట్టు కాండపు వలయాలను మైక్రోస్కోప్ లో పరిశీలించి లెక్క కట్టారు.
ఈ చెట్టు తాత గారుండేది : అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం లో, వైట్ మౌంటైన్స్ పైన …సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో… అయితే ఇది వుండే ఖచ్చితమైన ప్రదేశాన్ని అత్యంత గోప్యంగా వుంచారు, ఆ చెట్టు యొక్క పవిత్రత, విలువలను కాపాడేందుకు . అయితే అక్షాంశాలు, రేఖాంశాలు (N 37° 22.724 W 118° 09.941) మాత్రం చూచాయగా తెలుపబడ్డాయి. ఇవి ఒక పెద్ద అడవిని సూచిస్తాయి . అందులో నాలుగు వేల సంవత్సరాలు దాటిన చెట్లనేకం వున్నాయి. అందుకో ఎక్కడో ఒక చోట మన మెథుసెలాహ్ ఠీవిగా బతుకుతుంది. ఈ మధ్యనే సర్ రిచర్డ్ అటెన్ బరో షో (డిస్కవరీ ఛానల్ ) లో అతను ఈ చెట్టుని అతి దగ్గర నుంచి చూపాడు. ఆ స్థాయి వున్న వారే ఆ చెట్టు దగ్గరకు పోగలరని అర్ధం అయింది కదా?
ఇక, ఈ బ్రిష్టల్ కోన్ పైన్ చెట్ల గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం…
ఆయిష్షు అయితే ఎక్కువేమో గానీ, ఈ చెట్లు ఆజానుబాహువులు మాత్రం కావట. ఇవి ఒక రకంగా అడవులలో పెరిగే మరుగుజ్జు వృక్షాలు. వంద సంవత్సరాలలో మహా అయితే ఒక ఇంచి కాండం పెరుగుతుందంట. ఇలా ఎందుకవుతుందంటే.. పది , పదిహేను వేల అడుగుల ఎత్తులో, ఆ చలి గాలులలో, పనికి రాని మట్టిలో ఆ మాత్రం పెరగటమే ఒక గొప్ప. ఆ ఎత్తులలో పెరిగేవి కేవలం ఈ జాతి చెట్లు మాత్రమే. డార్విన్ మహాశయుని సిధ్ధాంతం ప్రకారం అన్నింటిని తట్టుకుని వుండటం వలనే అన్ని సంవత్సరాలు బ్రతక గలిగాయన్నమాట .
మనం ఇక్కడ చెప్పుకుంటున్న వృక్షరాజం తాలుకా జీవితంలో జరిగిన కొన్ని విశేషాలు ఒక డైరీలో రాస్తే?
మెథుసెలాహ్ పుట్టుక : గ్రేట్ పిరమిడ్లు కట్టడం పూర్తి అయ్యింది (2600 BC)
600 వ పుట్టిన రోజు : స్టోన్ హెంజ్ కట్టడం పూర్తి అయ్యింది (2000 BC)
800 వ పుట్టిన రోజు : కంచు యుగం మొదలవుతోంది (1800 BC)
1100 వ పుట్టిన రోజు : మధ్య అమెరికాలో మాయా నాగరికత వేళ్ళూనుకుంటోంది (1500 BC)
1300 వ పుట్టిన రోజు : మోసెస్ హీబ్రులను ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్ కు తరలించాడు . (Ten Commandments – 1300 BC)
400 వ పుట్టిన రోజు : గ్రీకులు ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్నారు ( 1194 BC)
1800 వ పుట్టిన రోజు : ఇనుప యుగం మొదలయ్యింది ( 800 BC)
2100 వ పుట్టిన రోజు : గౌతమ బుధ్ధుడు బౌధ్ధమతాన్ని భారతదేశంలో స్థాపించాడు , ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు ( 528 BC)
2500 వ పుట్టిన రోజు : ప్రఖ్యాత రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ పుట్టాడు . (128 BC)
2600 వ పుట్టిన రోజు : జీసస్ క్రైస్ట్ పుట్టాడు .
3200 వ పుట్టిన రోజు : మొహమ్మద్ ఇస్లామ్ మతాన్ని స్థాపించాడు ( 610 AD)
4370 వ పుట్టిన రోజు : క్రిష్టఫర్ కొలంబస్ అనే వాడు ఇండియాని వెతుకుతూ అమెరికాని కనిపెట్టాడు . (1492 AD)
4400 వ పుట్టిన రోజు : అమెరికా స్వాతంత్ర్యం పొందింది .
4766 వ పుట్టిన రోజు : తెలుగు బ్లాగర్లు కోకొల్లలుగా బ్లాగులు రాయటం మొదలు పెట్టారు . (2006 AD)
ఈ వృక్షరాజం వున్న అడవిని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇప్పుడు చెప్పండి. మనం దేవుళ్ళని చెప్పుకునే వారికే తాత లాంటిది ఈ చెట్టు . ఇదే చెట్టు మన దేశంలో వుండి వుంటేనా… ఈ పాటికి పూర్తిగా దాని చుట్టూతా దారాలు, పసుపు , మట్టి, రిబ్బన్లు , వుయ్యాలలు, గుడులు గట్రా కట్టి, చంపి పారేసి వుండే వాళ్లం కదా 😉
చాల బాగుంది. అద్భుతంగాను వుంది
ఇంత వృద్ధ వృక్షరాజం గురించి తెలిపినందుకు ధన్యవాదములు. నాకు మన అంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా లోని “తిమ్మమ్మ మర్రిమాను” అనే మహ వృక్షరాజం గురించి తెలుసు. నేను సుమారు పదకొండు సంవత్సరాల క్రితం చూసాను. మరిన్ని వివరాల కోసం ఈ లంకెను దర్శించండి http://www.anantapur.com/travel/thimmamma.html.
రాజేంద్ర ఆలపాటి