తెలుగు బ్లాగుల్లో చరసాల గారి అంతరంగానిదో విశిష్ట స్థానం. పొద్దు లో తెలుగుబ్లాగులను సమీక్షించే ఉద్దేశంతో ప్రారంభించిన బ్లాగు శీర్షిక శ్రీకారం చుట్టుకున్నది అంతరంగంతోనే!! మాటల్లో సూటిదనానికి, నిశితమైన విశ్లేషణకు చిరునామా అంతరంగం. అంతరంగం బ్లాగరి చరసాల ప్రసాద్ గారి అంతరంగావిష్కరణ బానిసత్వం గురించి:
అసలీ బానిస పదం భాష పుట్టినప్పుడే పుట్టినట్లుంది. బానిసత్వం మనిషికి వూహ తెలిసినప్పటి నుండి వుంది. బలవంతుడు బలహీనుణ్ణి చెరపట్టడం అనాది నుండీ వుంది.
మన ఇతిహాసాల్లో, పురాణాల్లో చెలికత్తెల వ్యవహారం వుంది. దాస దాసీల గురించి వుంది. కూతురికి పెళ్ళి చేసినప్పుడు తనతో పాటు తన చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం వుంది. వజ్రవైఢూర్యాలతో పాటు దాసదాసీలను కానుకగా ఇవ్వడం వుంది. ఈ బానిసల జీవితమంతా యజమానుల సేవలోనే గడిచిపోతుంది. వారికంటూ స్వంత జీవితముండేది కాదు. పిల్లలను కనే హక్కు, పెళ్ళి చేసుకునే హక్కు లేదు.
రోమన్ సామ్రాజ్యంలో
యుద్ధాలలో బందీలుగా చిక్కిన వారిని చాలా మట్టుకు చంపేసేవాళ్ళు. పౌరులను కూడా చంపడమో, బందీలుగా పట్టుకోవడమో చేసేవాళ్ళు. ఇలా బందీలుగా దొరికిన వాళ్ళు బానిసలుగా అమ్ముడయ్యేవారు. బలవంతులు, పరాక్రమ వంతులను గ్లాడియేటర్స్ గా మార్చేవారు. ఈ గ్లాడియేటర్ క్రీడను మన కోళ్ళ పందేలతో పోల్చవచ్చు. పందెం కోడిని పెంచినట్లే వీళ్ళకు మంచి తిండి పెట్టి, ఒక్కోసారి వాళ్ళకు బానిస స్త్రీలను కూడా సరఫరా చేసేవారు. కోళ్ళ ఫారం లాగా ఇలాంటి గ్లాడియేటర్లని పెంచే సముదాయాలు వుండేవి, వీరికి యుద్ధ మెళకువలు నేర్పి ప్రతిరోజూ అభ్యాసం చేయించేవారు. ఒక్కోసారి ఇటువంటి అభ్యాసాలలో కూడా కొందరు చనిపోయేవారు. యుద్ధాలలో వీరమరణం చెందడం గౌరవప్రదంగా భావించినట్లే ఈ గ్లాడియేటర్ పోరాటాలలో మరణించడం గౌరవప్రదమైనదని వాళ్ళకు నూరిపోసేవారు. ఒకే యజమాని దగ్గర గ్లాడియేటర్లు స్నేహితులుగా మెలిగిన వారైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడి చనిపోయేవాళ్ళు.
మగ వాళ్ళ పరిస్థితే అలా వుంటే ఇక ఆడ బానిసల సంగతి చెప్పక్కర లేదు. ఇంటి పనుల దగ్గరనుండీ వంటి పనుల వరకూ వారిని వుపయోగించుకొనే వారు.
గ్రీసులో…
గ్రీకు నాగరికతలో బానిసలు ప్రధాన పాత్ర వహించారు. ఇళ్ళల్లో, గనుల్లో, పొలాల్లో, ఓడల్లో మామూలు పనుల నుండీ అతి ప్రమాదకరమైన పనులన్నీ చేసేవారు.
ఇంచుమించు గ్రీకు జనాభా అంతమంది బానిసలు కూడా వుండేవారట. ఎంతమంది బానిసలను కలిగివుంటే అంత గొప్పవారుగా పరిగణించబడేవారు. యుద్ధాల్లో బందీలుగా చిక్కిన వారిని, ఓడిపోయిన పౌరులనీ బానిసలుగా అమ్మేవారు. ఒక్కోసారి అక్రమ సంబంధాల వల్ల పుట్టిన పిల్లలని ఏ తోవపక్కనో పడేస్తే గుర్తించిన వారు ఆ పిల్లలని బానిసలుగా పెంచుకొనేవారు. అప్పుతీర్చలేనప్పుడు, కష్టకాలంలో ధనం అవసరమైనప్పుడూ తమ స్వంత పిల్లలనే బానిసలుగా అమ్మేయడమూ కద్దు.
ఈజిప్టు లో
ఇక్కడ కూడా చరిత్రకు అందని రోజులనుండీ బానిసత్వం వుంది. బానిసలతోనే పిరమిడ్లు నిర్మించి వుంటారని కూడా నమ్ముతున్నారు. పెద్ద పెద్ద ప్రభుత్వ వుద్యోగులూ, పూజారులూ ఎక్కువ మంది బానిసలను వుంచుకొనేవారు. యుద్ధాలలో గెలిచి తెచ్చిన యుద్ధఖైదీలను రాజు వివిధ వుద్యోగులకూ, దేవాలయాలకూ అప్పగించేవాడు. వ్యాపార లావాదేవీల్లో బానిసల మారకమూ వుండేది. బానిసలకూ యజమానులకూ మధ్య సత్సంబంధాలు వున్న సందర్భాల్లో యజమానులు బానిసలని పెళ్ళి చేసుకొని బానిసత్వం నుండి విముక్తి కలిగించడము వుండేది. యజమాని చనిపోయిన సందర్భాల్లో మిగిలిన ఆస్తిలానే బానిసలనూ వారసులు పంచుకొనేవారు. పంచుకోలేని సందర్భాల్లో నెలలో పనిరోజులని పంచుకొనేవారు. ఉదాహరణకు ఒక బానిసను ఇద్దరు పంచుకోవలసి వచ్చినపుడు పదిరోజులు ఒకరిదగ్గరా, ఇంకో పది రోజులు ఇంకొకరి దగ్గరా పనిచేయాలి.
బానిసలు పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించబడ్డా యజమానులకీ వారిపట్ల చూపవలసిన బాధ్యతలు వుండేవి. బానిసల పిల్లలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత యజమానిదే. పిల్లలతో కష్టమైన పనులు చేయంచకూడదు. ఇంకా కోర్టుల్లో బానిసలను మిగతా పౌరుల్లా చూడకపోయినా వారి సాక్ష్యానికీ విలువ ఇచ్చేవారు.
19 వ శతాబ్దంలో కట్టిన సూయెజ్ కాలువ తవ్వకానికి కూడా అర్థ బానిసలని వుపయోగించుకున్నారు. అదెలా అంటే అప్పుడున్న ఈజిప్టు ప్రభుత్వం సూయెజ్ కాలువ నిర్మాణానికి కావలిసిన కార్మికులను సరఫరా చేస్తానని సూయెజ్ కాలువ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. ఒక్కో గ్రామంలో యాభైమందిని కలిపి ఒక గుంపుగా తయారు చేస్తుంది. ఏ గుంపు ఏ నెలలో సూయెజ్ కాలువ కొరకు (ఉచితంగా) పనిచేయాలో నిర్దేశిస్తుంది. ఆ పనిచేసిన వారందరికీ ఆహారం తప్ప మరేమీ భృతి ఇవ్వడం వుండదు. నిర్దేశించిన సమయం తర్వాత ఇంకో గుంపు వచ్చి ఈ గుంపు స్థానంలో పని చేస్తుంది. ఇలా కొన్ని లక్షల మంది పది పన్నెండేళ్ళపాటు పని చేస్తే సూయెజ్ కాలువ తయారయ్యింది. ఒక అంచనా ప్రకారం కనీసం లక్ష మంది ఈ కాలువ పనిలో మరణించి వుంటారు.
అమెరికాలో…
బానిసత్వం ప్రపంచం నలుమూలలా వున్నా ఒక్క అమెరికాలో వున్న బానిసత్వమే అందరినీ ఆకర్షించింది. బహుశా అమెరికాలో బానిసత్వం పూర్తిగా వ్యాపారాత్మకంగా నడవడం వల్లనేమో! లేక చట్టబద్ధమైన బానిసత్వం అప్పటికే ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన యూరోపియన్ దేశాలలో నిషేధించబడటం వల్లనేమో!
అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడి పొలాల్లో మొరటు పనులు చేయలేక మొదట స్థానిక రెడ్ ఇండియన్స్‌ను బానిసలుగా వాడకోవడం మొదలేట్టారు. అయితే వీరు లొంగి వుండకపోవడం వల్లా, భౌగోళిక పరిసరాలు వారికి కొట్టిన పిండి గనుక తప్పించుకుపోవడం కూడా ఎక్కువగా వుండేది. అప్పుడు ఆఫ్రికా నీగ్రోల మీద వీరి కన్ను పడింది. అప్పటికే నౌకలమీద దూర దేశాలు వెళ్ళడం సాధ్యమయివుండటం వల్ల నల్లవారిని పట్టుకొని అమెరికాలో అమ్ముకొనే దళారులు ఎక్కువయ్యారు. యూరోప్ నుండి వచ్చిన తెల్లవారికి అమెరికా దక్షిణ ప్రాంతపు వేడికి తట్టుకోవడం, తట్టుకొని పొలాల్లో పని చేయడం దుర్భరం అయ్యింది. ఇలాంటి చోట్ల నల్లవారు బాగా పని చేసేవారు.
రేవు పట్టణాల్లో బానిసల సంతలుండేవి. ఇక్కడ బానిసలని కట్టేసో లేక గుపులుగానో వుంచేవారు. అక్కడికి వచ్చిన బేర గాళ్ళు వాళ్ళ పళ్ళు చూసి, మచ్చలు చూసి, చిన్న చిన్న పరీక్షలు పెట్టి ఎంత ధర వెచ్చించవచ్చునో ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఆ తర్వాత జరిగే వేలం పాటలో వారిని వేలం పాడి కొనుక్కొనేవారు. ఇలా కొనుక్కున్న బానిసలను దూర ప్రాంతానికి తరలించాలంటే మధ్యమధ్యలో బస చేయాల్సి వస్తుంది కదా, అందుకని వూరూరికీ బానిసల కారాగారాలు వుండేవి. కొద్దిపాటి రుసుము చెల్లించి బానిసలను ఇక్కడ వుంచి మరుసటి రోజు తీసుకపోవచ్చును.
బానిసను పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించారు. బానిసని కొట్టేటప్పుడు పొరపాటున మరణించినా లేదా కావాలని చంపినా చట్టం యజమానిని దండించదు. యజమానికి సౌలభ్యంగా ఎన్నో బానిస చట్టాలు వచ్చాయి. ఏ బానిసైనా యజమానిని వదిలి పారిపోతే, ఆ బానిసని పట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయం చేస్తుంది.
బానిసలని శిక్షించడానికి శిక్షా కేంద్రాలుండేవి. బానిస సరిగ్గా వినయం చూపట్లేదనో, చెప్పినంత పనిచేయలేదనో కారణాన ఈ శిక్షా కేంద్రాలకు పంపేవారు. ఇక్కడ యజమాని చెప్పిన శిక్ష కొద్దిగా రుసుము తీసుకొని అమలు జేసేవారు (కొరడా దెబ్బలు కొట్టడం లాంటివి).
అయితే బానిసత్వానికి అనుకూలంగా వున్నట్లే వ్యతిరేకంగా ఎందరో వుండేవారు. బానిసల అవసరం లేని, పారిశ్రామిక ఉత్తరాదివారు బానిసత్వాన్ని వ్యతిరేకించారు. పారిపోయిన బానిసలకు రహస్యంగా సహాయం చేసి సరిహద్దు దాటించేవారు (అప్పుడు సరిహద్దులోని కెనడాలో బానిసత్వం లేదు).
చివరికి ఈ అభిప్రాయ భేదాలు చిలికి చిలికి అంతర్యుద్ధానికి దారి తీశాయి. లింకన్ దృఢ నాయకత్వంలో జరిగిన ఈ అయిదేళ్ళ పోరాటంలో ఉత్తరాది రాష్ట్రాలు గెలిచి బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాయి.
అయినా… పందొమ్మిదవ శతాబ్దం 60వ దశకంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉద్యమం లేవదీసేవరకూ నల్లవాళ్ళకి ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక బస్సులూ, బెర్తులూ వుండేవి. కింగ్ జూనియర్ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా వుద్యమించి నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు సాధించారు.
ఇలా ప్రతిచోటా అనాదిగా బానిసత్వం వుంది. బలహీనుణ్ణి బలవంతుడు వాడుకోవడం, పెత్తనం చెలాయించడం వుంది. అందుకేనేమో శ్రీశ్రీ “ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” ఆంటారు.
ఇక మన దేశం విషయానికి వస్తే…
అలెక్జాండర్ ది గ్రేట్ తో వచ్చిన ఏరియన్ అనే పెద్దాయన “అదేం చిత్రమో గానీ ఇండియాలో బానిసనేవాడు లేడు. ఇక్కడ బానిసలే లేరు.” అని తన “ఇండికా” లో వ్రాసుకొన్నారు. బహుశా అప్పటి సామాజిక చిత్రాన్ని తన పాశ్చాత్య కళ్ళతో చూడటం వల్ల పాశ్చాత్య తరహా బానిసత్వం లేదని ఆశ్చర్యపోయేడేమో గానీ బానిసత్వం ఇండియాలో అప్పుడూ వుంది ఇప్పుడూ వుంది.
వేదకాలంలో యాగాలలో మనిషిని బలిచ్చే సంప్రదాయం వుంది. శునశ్శేపుని వృత్తాంతం ఇందుకు వుదాహరణ. అయితే మనదేశంలో బానిస వ్యవహారం ఇతర దేశాలకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇతర దేశాల్లో డబ్బు పెట్టి బానిసను కొని అతనికి స్వేచ్చని ఇచ్చేవారు. బానిసలు వున్నత పదవులూ నిర్వహించేవారు. బానిసలను బహిరంగ మార్కెట్లలో విక్రయించేవారు. అయితే ఇండియాలో ఇలాంటివి జరిగినట్లు పెద్దగా ఆధారాలు లేవు. నాకు తెలిసి ఒక సత్య హరిశ్చంద్రుడి కథలోనే “అమ్మడం” అనే ప్రసక్తి వస్తుంది. ఆ కథలో ఒక రాజే తన భార్యను అమ్మి, తనకు తాను అమ్ముడు పోవడమే వింత! ఈ కథను బట్టి అలా అమ్మడం అప్పటికే వున్నట్లు అనుకోవచ్చు. లేదంటే హరిశ్చద్రుడు అమ్ముతానంటే ప్రజలు తిరస్కరించడమో, అది అతి హేయమైన చర్యగా పరిగణించి కొనడానికెవరూ ముందుకు రాకపోవడమో జరగాలి.
పాశ్చాత్య తరహా బానిసత్వం ఇక్కడ లేక పోవడానికి, వున్నా ఎదగకపోవడానికి కారణం బహుశా వ్యవస్థీకృతమైన కుల వ్యవస్థ అయ్యుండవచ్చు.
కుల వ్యవస్థలో బానిస వ్యవస్థలోలాగే వృత్తి పనుల వాళ్ళు వున్న వాళ్ళకి వూడిగం చేస్తారు. కులాచారం, కుల ధర్మం పేరుతో ఏ కులంలో పుట్టిన వాణ్ణి ఆ కులానికి సంబంధించిన పనికి పరిమితం చేశారు. ఇదేమని ప్రశ్నించే వీలులేకుండా “కర్మ” సిద్ధాంతము పేరుతో ఎవరికి వారు లోబడి వుండేలా చేశారు.
బహిరంగంగా వేలం వేసే పద్ధతికి ఋజువులు తక్కువగా వున్నా పరిచారకులనీ, చెలికత్తెలనీ దానంగా ఇవ్వడం మాత్రం అన్ని కాలాలలోనూ వుంది. ఆడపిల్లకు పెళ్ళి చేసి ఆమెతో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం నిన్నా మొన్నటి వరకూ నడిచిన వ్యవహారమే.
ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా వుండేదేమో తెలియదు గానీ తెలంగాణాలో “ఆడబాప” ఆచారం వుండేది. (ఇప్పుడు కూడా వుందా?) పెళ్ళికూతురుతో పాటు ఓ దాసి కూడా వెళ్ళేది. ఆ అల్లుడికి పెళ్ళికూతురు మీదలాగే ఈ దాసి మీద కూడా హక్కులుండేవి. ఇంకా అధ్వాన్నమైన భాగమేమంటే ఇంటికి వచ్చిన అతిథుల కోర్కెలు కూడా ఈ ఆడబాపలు తీర్చాలి. ఈ ఆడబాపలకు పుట్టిన ఆడపిల్లలు మళ్ళీ ఆడబాపలుగా ఇంకో ఇంటికి వెళితే మగబిడ్డలు జీవిత పర్యంతమూ ఆ యింటిపనులు చేస్తూ పనివాళ్ళుగా (బానిసలుగా) వుండేవారు.
ఇప్పటికీ బాకీలు తీర్చలేక కొడుకునో, కూతురునో పనిలో పెట్టడం జరుగుతూ వుంది. ఏళ్ళకేళ్ళు పనిచేసినా వడ్డీ తీరని సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీవితాంతం బానిసగా పడివుండటం తప్ప వారి జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడో అక్కడ ఒకటీ అరా వార్తా పత్రికల ద్వారా తెలిస్తే తప్ప ప్రజల్లో వీటి గురించి పెద్దగా పట్టింపు లేకుండా వుంది.
బానిసత్వం విషయంలో మనదేశమేమీ తీసిపోలేదు కాకపోతే గతంలో నామోషీ అనుకున్న ఇలాంటి విషయాలు కప్పిపెట్టడం మనకు పరిపాటే. పౌరాణిక కథలు ఎంత వరకు చారిత్రకమైనవో నాకు తెలియదు కానీ చరిత్రలో పశ్చాత్యులు ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి దిగుమతి చేసుకుంటే మనం తూర్పు తీరం నుండి బానిసలను దిగుమతి చేసుకున్నాం. ఈ బానిసల కొనుగోలుకు వివిధ రాజుల మధ్య పోటే ఉండేదన్న విషయానికి ఎన్నో ఆధారాలున్నయి. ఆఫ్రికా నుండి వచ్చిన బానిసల సంతతి వారిని ఇప్పటికీ గుజరాత్ మొదలైన ప్రదేశాలలో చూడవచ్చు..వీళ్లను సిడీలు అంటారు. వనపర్తి రాజు పరమేశ్వరరావు 2000 పైచిలుకు ఆఫ్రికా బానిసలను కూర్చి ఒక ప్రత్యేక దళాన్ని తయారు చేసి నిజాంకి బహుకరించాడు. ఈ దళానికి ఆఫ్రికన్ కావల్రీ గార్డ్స్ అని పేరు. హైదరాబాదులో వీరు స్థిరపడిన ప్రదేశాన్ని ఇప్పటికీ ఏ.సీ.గార్డ్స్ అంటారు. ఇలాంటివి తవ్వితే కొల్లలు. (ఇథియోపియా నుండీ బానిసగా వచ్చి స్వతంత్రుడై రాజ్యాన్ని చేజిక్కించుకొన్న మాలిక్ అంబర్ కథ చాలా ఆసక్తికరమైనది)
రవి గారూ,
నిజమేనండి. మన కవులకు కావల్సింది రాజులు, అంతఃపురాలూ కాదంటే ఇంద్ర భోగాలూ, అప్సరసలూ. అటు చైనా యాత్రీకుడో ఇటు పోర్చుగీసు యాత్రికుడో రాస్తే తప్ప సవ్యమైన చరిత్ర మనకెక్కడ ఏడ్చింది.
ఇప్పుడున్న చాలా మందీ “మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి” అనేరకమే! పాత తప్పులు తెలుసుకొని వివేకంగా సాగుదాం అనేది లేదు.
ఇప్పటికీ విభిన్న రూపాలలో సాగుతున్న దాస్యం. ఈనాటి ఈనాడులో వార్త
అప్పు: 40కేజీల బియ్యం
దాస్యం: జీవిత కాలం
http://www.eenadu.net/story.asp?qry1=12reccount=30
–ప్రసాద్
http://blog.charasala.com
ఎందుకో తెలీదు ఈ వ్యాసం చదువుతుంటే వణుకు వచ్చింది.అన్ని బాగా చెప్పారు కానీ మన దేశం దగ్గరకొచ్చేసరికి కొన్ని దాచిపెట్టారనిపించింది.ఇండియాలో బానిసత్వం గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది అనుకుని వుంటారు అంతేనా?
ఇంకా భయంకరమైన నిజమేమిటంటే చాల మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో నిన్న మొన్నటి తరం వరకు ఎంతో మంది గృహిణులు దాదాపు బానిసలే.
మన చరిత్రని పాశ్చాత్య కళ్ళద్దాలతో చూసుకోవాలనే తహతహ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వాడబడే పదజాలాన్ని మనవాళ్ళకి వర్తింపజేద్దామనే కుతూహలం కూడా ఎక్కువగా ఉంది.ప్రతి సమాజంలోను ఆర్థికంగా ఉన్నతులూ నిమ్నస్థులూ ఉంటారు. అంతమాత్రాన ఒకరిని యజమానులని ఇంకొకరిని బానిసలని ఖరాఖండీగా చెప్పలేము. ఇతర దేశాల్లో అమలులో ఉన్న తరహా బానిసత్వం మన దేశంలో ఉన్నట్లు నిరూపించే ఆధారాలేవీ లేవు. దొరుకుతున్న ఆధారాలు అనుమానాస్పదాలే తప్ప నిక్కచ్చిగా లేవు.కుల విచక్షణ ఉన్న మాట నిజం. అది ఈ రోజు కూడా ఉంది.కాని దాన్ని ఇతర దేశాల్లోని బానిసత్వంతో సమానం చెయ్యలేం. ఏతావతా మన దేశంలో బానిసత్వం ఎప్పుడూ లేదు. అరణంగా వచ్చిన కవులూ దాసీలూ నిజాం రాజుకు బహుమానంగా సమర్పించబడ్డ నీగ్రో సైన్యాలు (పాశ్చాత్య అర్థంలో) బానిసలే అని అలా treat చెయ్యబడ్డారని ఖచ్చితంగా చెప్పలేం.
Slave trade/Slavery used to take place mostly the in aftermath of foreign invasions in the societies of yore. So, it was not a normal way of life even in those societies. Mere fact of dealing in people is inadequate to establish the prevalence of slavery, unless the practice is accompanied by certain other features like state endorsement of slave trade, violence in the hands of free citizens. forced labour and other inhuman forms of treatment and total suspension of the victims’ human rights which includes severe curbs on physical mobility and exercise of free will.
మంచి వ్యాసం..అన్ని దేశాల గురించి చెప్పారు కానీ…మొత్తం ప్రపంచ దేశాలనే బానిసలుగా చేసుకున్న బ్రిటీష్ వారి గురించి చెప్పలేదేం?
రాధిక గారూ,
ఇండియాలో బానిసత్వం మీదే ప్రముఖంగా రాయాలనుకున్నాను కానీ ఆక్కడనుండీ మొదలెట్టేసరికి తీరా ఇక్కడికొచ్చాక అసలుది కొసరు చేశాను! 🙁 నిజమే ఇండియాలో బానిసత్వం మీద ఇంకా రాయాల్సింది.
స్వాతి గారూ,
నిన్నమొన్నటి తరం అని ఎందుకండి ముసుగేస్తారు. ఇప్పటికీ ఎంతో మంది స్త్రీలు మగాడికి బానిసలే, కాకుంటే పాతివ్రత్య ధర్మానికి. మన దేశపు మహిళల గురించి రాయాలని పరిశోదిస్తున్నాను. చదవాల్సింది ఇంకా చాలా వుంది ఆ కోణంలో.
బాల సుబ్రమణ్యం గారూ,
మీనుంటీ ఇలాంటి వాఖ్యే వస్తుందని ఇక్కడి నా మితృడితో సవాలు విసిరాను. మీరు నన్నే గెలిపించారు. 🙂 కృతజ్ఞతలు.
నిన్నా మొన్నటి వరకూ నాకూ నా దేశం అంటే ఆదర్శదేశమనీ, ఎక్కడా లేని ధర్మం ఈ భారతావనిలోనే వెలిసిందనీ, ఎప్పటికైనా ధర్మచింతనకు భారతీయుల తర్వాతే ఎవ్వరైనా అని అబిప్రాయముండేది. స్వదేశాన్ని, స్వధర్మాన్ని అభిమానించడంలో తప్పులేదు కానీ ఆ అభిమానం దురభిమానంగా వుండకూడదు. మన తప్పొప్పులను మనం తెలుసుకుంటేనే మనం సరైన వారిమవుతాం.
పాశ్చాత్య కళ్ళద్దాలతో చూడాలన్న తహతహ కాదిది. ఇక్కడి (అమెరికాలో) బానిసత్వం గురించి తెలుసుకున్నాక సహజంగానే మన దేశంలో అయితే ఇది లేదా? ఇన్ని దేశాలలో వుండీ మన దేశంలో లేకుంటే లేకపోవడానికి కారణమేంటి? వుంటే అది ఏ రూపంలో వుండేది లాంటి ప్రశ్నలు వేసుకోమా? నేనూ అలాంటి ప్రశ్నలే వేసుకొన్నాను. తీరా చూస్తే మనం దీన్ని ఇప్పుడూ చూస్తున్నాం ఇండియాలో కాకపోతే వాడే పదజాలమే వేరు. దాసి, దాసుడు, వెట్టి లాంటి పదాలు వాడతాం. నేను చెప్పిందీ ఇదే కదా పాశ్చాత్య తరహా బానిసత్వం లేకపోయినా కుల వ్యవస్థ ఆ తరహా బానిసత్వాన్ని వ్యవస్థీకరించిందని.
మాలా మాదిగలు ఇతర నిమ్న కులాలూ ఇన్ని వేల సంవత్సరాలుగా చేసింది బానిసత్వం కాదా? కాకపోతే మనం వాళ్ళలా బజారులో అమ్మలేదు, కొనలేదు. ఒక కుటుంబంగా వుండనిచ్చామే గానీ నీ జీవితాంతం పెద్దకులాలకు ఊడిగం చేయాల్సిందే అన్నాం. చేయకపోతే కులబహిష్కారాలు, సంఘ బహిష్కారాలూ చేశాం. నాలుకలు కోశాం, చెవుల్లో సీసం పోశాం (ఇవి పాశ్చాత్యులకు తెలుసో లేదో!). వర్ణ సంకరం కూడదన్నాం, నీకు పుట్టిన వాడు నీకులా మళ్ళి ఊడిగం చేయాల్సిందే అన్నాం. పదాలు వేరవ్వచ్చుగాక పాశ్చాత్యుల బానిసత్వపు రూపానికి, మన కులవ్యవస్థ దాస్యానికి తేడా ఏముంది? అక్కడ ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ఇక్కడ సంఘం మతం పేరుతో చాతుర్వర్ణ ధర్మం పేరుతో చట్టాలు చేసింది.
మా వూర్లో నా చిన్నప్పుడు కూడా మంగలి రోజూ వచ్చి అడిగిన ప్రతివాడికీ గడ్డం గీకడం దగ్గరనుండీ, జుట్టు కత్తరించడం వరకూ చేసి ఎవరో ఓకరు అన్నం పెడితే తిని వెళ్ళేవాడు. అలాగే చాకలి అందరి గుడ్డలూ తీసుకెళ్ళి వుతికి ఆ రాత్రి బుట్ట పట్టుకొచ్చి అన్నం పట్టుకెళ్ళేవాడు. మాదిగ తెల్లారగట్టా వచ్చి ఎద్దులతో దున్నడానికో, నీళ్ళు పారగట్టడానికో, ఇంకో పనికో వెళ్ళేవాడు. వీళ్ళేవరికీ కూలీ ఇచ్చేది లేదు. పెట్టింది తినాలి ఏ పండుగకో దేబిరిస్తే ఇంత విదిల్చడమే! మహా అంటే పంట కోసినప్పుడు ఒక్కొకరి భాగానికి ఇంతని రైతు దయాధర్మం మీద ఇస్తాడు. ఇంత గొడ్డు చాకిరీ చేసి చివరికి ఆ రోజు రైతు బిక్ష మీద ఆధారపడాల్సిందే. ఆ తాలు తూర్పెత్తుకొని అందులో గింజలు ఏరుకోవాల్సిందే! ఇదంతా వెట్టి చాకిరీ, బానిసత్వం (కాకుంటే అంతకంటే హీనమయింది) కాదా?
అమ్మవారి పేరు చెప్పి దేవదాసీలని జీవితాంతం తమ కోరికలు తీర్చుకోవడం కోసం వాడుకుంటే అది సెక్సు బానిసత్వం కాదా? పాశ్చాత్య పదం సెక్సు బానిసత్వం అంటేనే మీకు అంత రొషం వచ్చి “దేవదాసి” అంటే రాకపోతే దానికి నేనేం చేయను?
విజయా గారూ,
నిజమే బ్రిటిష్ గురించి చెప్పలేదు. నిజానికి మనదేశంలో బానిసత్వం గురించి రాయడం నా లక్ష్యం కానీ చివరికి దాన్ని సరిగ్గా వ్యక్తం చేయలేదేమొ!
–ప్రసాద్
http://blog.charasala.com
మొన్న ఆదివారం స్పీల్‌బర్గ్ సినిమా “అమిస్టాడ్” చూశాను. అందులో బానిసలను “ప్రాపర్టీ” అని సంబోధిస్తూ కోర్టుల్లో వారిని సొంతం చేసుకోవడానికి విచారణలు జరిగే నేపధ్యంలో బానిసత్వాన్ని నిర్మూలించే దిశగా ప్రయత్నించే కొందరు వ్యక్తుల పోరాటాన్ని, బానిసలను కలిగి ఉండటం తమకు సహజముగా సంక్రమించిన హక్కు అని వాదించేవారిని, ఈ నేపధ్యంలో ఆ బానిసల మనసుల్లోని రదన ఇవన్నీ మనసుకు నేరుగా తగిలేలా చూపించారు. నరజాతి చరిత్ర సమస్తం … అన్న శ్రీశ్రీ మాటలు కాలపరీక్షకు నిలబడతాయనడంలో సందేహంలేదు.
బాలసుబ్రమణ్యంగారి మొదటి (తెలుగు) వ్యాఖ్యలోని మొదటి వాక్యంతప్పితే మిగతా విషయంతో చాలావరకూ నేను ఏకీభవిస్తాను. ఐతే మనదేశంలో బానిసత్వం లేనేలేదంటే అంత తేలికగా ఒప్పుకోబుద్ధికాదు నాకు. గొడ్లలాగా బందెలదొడ్డిలో బానిసలను తోలి బంధించలేదుగానీ, దాదాపు అంతటి బానిసత్వం మనదేశంలో పల్లెల్లో చూశాం. “కొల్లాయిగట్టితేనేమి” అన్న రచనలో తెలంగాణప్రాంతంలో దీని గురించిన విషయాలు తెలుస్తాయని విన్నాను.
వ్యాసంలో ఇంకా రాయవలసింది చాలా ఉన్నా, అర్థాంతరంగా ఆపేసినట్లు అనిపించింది.భారతదేశంలో ఉన్న అస్పృ శ్యతకీ , ఇతరదేశాల్లో ఉన్న బానిసత్వానికీ చాలా పోలికలు ఉన్నాయి. అయినంతమాత్రం చేత రెండూ ఒకటి కాదు. బానిసత్వానికి విముక్తి ఉంటుంది. కులానికి నిర్మూలన కూడా ప్రశ్నా ర్థకమే! ఒక సామాజిక సమస్య మీద దృష్టి మళ్ళించేలా చేయగలిగారు. అభినందనలు. రవి వైజాసత్యగారు హైదరాబాదు లో ఎ.సి. గార్డ్స్ మీద ఒక కొత్త విషయన్ని తెలపడానికి మీ వ్యాసం తోడ్పడింది. వీరికి కూడా అభినందనలు. చివరిగా, ఇలాంటి విషయాలు రాసేటప్పుడు ఆధారాలను వెల్లడించే పద్ధతిలో రాస్తే ఆ రచనకు మరింత శాస్త్రీయత చేకూరుతుందనుకుంటున్నాను.
నాలుకలు కొయ్యడాలూ చెవుల్లో సీసం పొయ్యడాలూ నిబంధనల రూపంలో సంస్కృత శ్లోకాల్లో చూస్తున్నాం. ఎవరైనా ఏ కాలంలోనైనా వాటినిఎవరి మీదనైనా అమలు జరిపారా ? అనేది ఇంతవరకు తెలియలేదు. అసలు అలాంటివెప్పుడూ అమలు జరగలేదు. జరిగితే శూద్రులు పై కులాల వాళ్ళని లక్షల సంఖ్యలో నరికి పారేసి ఉండేవారు.
నాకు ఒక ప్రత్యేక కులం మీద ద్వేషం ఉండి, సంస్కృత శ్లోకాలు రాసే ప్రతిభ కూడా అందుకు జతైతే సీసం పొయ్యడమేంటి-ఏకంగా ఆ కులస్థుల్ని సలసల కాగే నూనెలో వేయించాలని శ్లోకాలు రాసేస్తాను. అది అమలు జరుగుతుందా ? ఈ నమ్మకం ఒక వెఱ్ఱి. అంతే.
ఈ ఆరోపణలు మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చెయ్యబడ్డవి. ధర్మశాస్త్రాలన్నీ తమ కాలంలోని పరపతి గల వర్గాల ఆదర్శ స్వప్నాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.(మన భారత రాజ్యాంగంతో సహా). కాని అవి నిజంగా తమ కాలపు సమాజానికి ప్రతిబింబాలవుతాయా ? అనేది సందేహాస్పదం.ఒక పుస్తకాన్ని లేదా ఒక వ్యక్తిని ఏకైక ఆధారంగా తీసుకుని తీర్పులివ్వ బూనుకోవడం అంతిమంగా మన దేశాన్ని మనమే అపార్థం చేసుకోవడమౌతుంది.దేనికైనా corroborative evidence కూడా తోడవ్వాలి.
నేనేమీ కరుడుగట్టిన దేశభక్తుణ్ణి కాను. India గురించి బ్రాహ్మణుల గురించి నేను చేసే విమర్శలు చాలా ఉన్నాయి.అయితే అవి నేను అందరితోను పంచుకో దల్చుకోలేదు.
ఇండియాలో బానిసత్వం గురించి చెప్పాలంటే 1947 aug 15 తరువాత నుంచే చెప్పాలి. ఖచ్చితంగా అయితే ఇండియన్ రిపబ్లిక్ ఏర్పడిన తరువాతే “ఇండియా” లేదా “భారతదేశం” అని చెప్పవచ్చు. ఆ లెక్కన మనకు ఈ బానిసల చరిత్ర అంతగా లేనట్లే లెక్క. అయితే భారతీయులలో అంతర్లీనంగా బానిస మనస్త్వత్వం మాత్రం వుంది. కులాలతో సంభంధం లేకుండా…అది రాజులు, బ్రిటీష్ వారి కాలం నుంచి మనలో పాతుకు పోయింది.
సర్ అనకుండా మాట్లాడలేకపోవటం…దొరగారు ఇంకా పోలీస్ శాఖలో బతికే వుండటం ఇందులు ఉదాహరణలు.
అంటరానితనాన్ని,కులవివక్షతను బానిస తనం గాటన కట్టడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అది వేరే దురాచారం. సంఘపరమెన దురాచారం.వ్యక్తిగతమైన బానిసత్వాన్ని గానీ, వంశపారంపర్య బానిసత్వాన్ని గానీ ఎవరూ ఇక్కడ అంటకట్టలేరు.ఇప్పుడు అయితే గియితే వున్న బానిసత్వం బాల కార్మికులు, పని వాల్లు. ఈనాడు మీరన్న మాలా, మాదిగలన్న వారికి కూడా చిన్న చిన్న పిల్లలు ఇల్లలో పని పిల్లలుగా వున్నారు.అంత ఎందుకు ఒకప్పుడు అంటరానివారిగా వున్న వారికి కూడా అంటరాని వారు వున్నారు. నాకు తెలిసిన ఒకరి ఇంట్లో పని మనిషిని కనీసం హాల్లోకి రానివ్వరు. వంట గదికి మాత్రమే దొడ్డిదారిన ప్రవేశం.
“బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ” అన్నారు గానీ ఈ నాటి స్వరూపం సరిగా మాట్లాడలేదు మరి.
ఎప్పటి సంగతులో కూడా ముఖ్యమే అయినా ఈ నాటి పరిస్థితులు, ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా సరిదిద్దాలి లాంటివి కూడా రాస్తే బావుండేది.
మనం మాట్లాడుకోవడమే కాదు కదా, మనకు తోచిన పద్ధతిలో ఎడ్యుకేట్ చెయ్యడం కూడా ముఖ్యమే.
good essay…..
i would you like share with you some gruesome slave trade that took in our area long back…..
ఫ్రెంచి యానాం లో జరిగిన బానిస వ్యాపారం
అన్న నే రాస్తున్న ఒక వ్యాసంలోంచి కొన్ని పారాగ్రాఫులు
యేట్స్ ఎపిసోడ్ (1762): బానిసలను ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలుదేరే తారీఖు దగ్గర పడేకొద్దీ, ….. యానాం వీధులలో తిరిగే యాచకులను, యానాంలో సరుకుల కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్థులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారు.
యానాం పెద్దొర సొన్నరెట్ మాత్రం ఒక లేఖలో “ ఇంగ్లీషు వారు కూడా ఈ బానిసవ్యాపారంలో ఉన్నారనీ, ఒకసారి ఓ ఇంగ్లీషు నౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని” చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు.
రీయూనియన్ లోని చెరుకు తోటలలో పని చేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కార్మికులను తీసుకోవటానికి పొరుగు రాజ్యాన్నేలే బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కార్మికులను రిక్రూట్ చేసుకోవటం మొదలెట్టింది.
and it goes on like that
i will soon publish this essay in my blog.
thank you
bollojubaba