తెలుగు బ్లాగుల్లో శోధనది ఓ ప్రత్యేక స్థానం. రాసికీ వాసికీ కూడా ఎన్నదగ్గది. పలువురు బ్లాగర్లే కాక, బ్లాగు సంఘాలు కూడా అంగీకరించిన మాట ఇది. ఈ బ్లాగులోని జాబులు క్లుప్తంగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, సమకాలీన విషయాల గురించి ఉంటాయి, తెలుగు సాహిత్యం గురించి ఉంటాయి.
శోధన 2005 మార్చి 31 న మొదలైంది. చాన్నాళ్ళపాటు నిదానంగా నడుస్తూ వచ్చిన బ్లాగు, 2006 మధ్యలో వేగం పుంజుకుంది. ప్రస్తుతం తెలుగులో అత్యంత ఎక్కువ జాబులు క్రమం తప్పకుండా ప్రచురించేవాటిలో ఇది ఒకటి. నెలకు 20 దాకా జాబులను వెలయించే బ్లాగు, శోధన. రాసి మెండుగా ఉన్నంత మాత్రాన, నాణ్యతలో లోపమేమీ లేదు. చక్కటి భాషలో, విభిన్న అంశాల గురించి, ఒరిజినలు జాబులు ఉండే బ్లాగు ఇది.
సామాజికాంశాలు: శోధనను శోధించేటపుడు ముందుగా పరిశీలించాల్సింది సామాజికాంశాల గురించి. సమకాలికమైన రాజకీయ, సామాజిక అంశాలు శోధన నిశిత దృష్టిని దాటిపోవు. మందుల షాపుల వాళ్ళు సమ్మె గానీ, రోడ్లపై ప్రజల అక్రమశిక్షణ, ప్రభుత్వ అక్రమ చొరబాట్లు, ఎన్నికలు, అవినీతి, రాజకీయ సిత్రాలు,.. అన్నీ శోధన బ్లాగులో చోటు చేసుకుంటాయి. ఈ అంశాలపై శోధన వ్యాఖ్యలు చురుక్కుమంటూ ఉంటాయి. మచ్చుకు కొన్ని..
- “నకిలీ ఎరువు అమ్మితే అయిదు వందల జరీమానా లేదా ఆరు నెలల ఖైదు…దాదాపు ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కు విధించే శిక్షతో సమానం. కాని ఆ నేరం విలువ ఒక నిండు ప్రాణం కావచ్చు….” –కోడి ప్రేమ
- “అయితే ఏంటంటా గొప్ప? తొమ్మిది రోజులు కష్టపడి, కిలోల కొద్ది ఆభరణాలు ధరించి, రక రకాలుగా ఊరేగి నిద్ర కూడా లేకుండా భక్తులకు అలసి సొలసి దర్శనమిస్తే తొమ్మిది కోట్లు వచ్చాయి పాపం.” “…స్వామీ వింటున్నారా? ఈ నగరంలో మందుబాబులందరూ కలసి అక్షరాలా రోజుకు మూడున్నర కోట్లు మధుపాత్రకు సమర్పిస్తారు…. అంటే తొమ్మిది రోజులలో ముప్ఫైరెండు కోట్లు…:-)…పాపం గాంధీ గారు కూడా ఈ రాబడి ఒక్క రోజు ఆపలేకపోయారు.” –శ్రీవారి ఆదాయం : తొమ్మిది కోట్లు
- “…మీరు మీ వీ.ఐ.పి వాహనాలలో వస్తే మేమందరం గంటలు ఆగి మరి దారి ఇస్తున్నామే? మరి మీరు మా జీవిత గమనాన్ని ఎందుకు స్థంభింప చేస్తారు?” – తెరాస బందు గురించి నల్ల రాజకీయాలు లో
- “పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే, కనీసం మధ్య తరగతి ప్రజలు “అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా” అని సంతోష పడతారు.” – మండుతున్న ధరలపై పావుకిలో పేరు మార్చాలి లోని వ్యంగ్యోక్తి
సుధాకర్ సామాజిక స్పృహకు, ఆలోచనా దృష్టికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే!
శోధన లో తరచూ కనిపించే ఇతర అంశాలు, భాష, సాహిత్యం. ఈ బ్లాగరి, పుస్తకాలు బాగా చదువుతారనిపిస్తుంది. పుస్తకాల గురించి కొన్ని టపాల్లో ప్రత్యేకించి రాసారు. ఒక జాబులో ఇలా రాసుకున్నారు.. “ఎప్పుడు బ్లాగు చెయ్యాలన్నా, ఎవేవో పిచ్చి పిచ్చి విషయాలు, పనికి రాని రాజకీయాలు బుర్రలో కొట్టుకుని చివరకి నా చేతి పైన విజయం సాధించి వాటి గూర్చి రాయించుకునేవి. వాటిని జయించాలంటే, ఒకటి మన సంఘం లో కుళ్లు పట్టించుకోకూడదు. (ఇది మనకు కష్టమయిన పని). రెండవది, తెగ పుస్తకాల తో సావసం చెయ్యటం. నేను రెండవ మార్గం ఎంచుకున్నాను.”
సుధాకర్ “దర్గామిట్ట కథలు” పుస్తకంపై పొద్దులో సమీక్షా వ్యాసం రాసారు.
శోధన బ్లాగరుల అభినందనలే కాక బ్లాగు సంఘాల పురస్కారాలనూ అందుకుంది.
- 2006 జూలై లో భాషా ఇండియా వారి ఉత్తమ తెలుగు బ్లాగు పురస్కారాన్ని గెలుచుకుంది.
- 2006 సంవత్సరానికి ఇండీబ్లాగీస్ వారి ఉత్తమ తెలుగు బ్లాగు పురస్కారాన్ని గెలుచుకుంది.
నాణ్యత పరంగా శోధనకు లభించిన కితాబులివి. సుధాకర్ శోధనతో పాటు మరో తెలుగు బ్లాగు, ఓ ఫోటో బ్లాగు, మూడు ఇంగ్లీషు బ్లాగులు కూడా రాస్తారు. అవి:
- http://coolclicks.blogspot.com
- http://jagannaatakam.blogspot.com
- http://savvybytes.com
- http://sevencolorsoflife.blogspot.com/
- http://suds.spaces.live.com
శోధన గురించి రాసాక, ఇక శోధకుడి గురించి కొంత..
సాఫ్టువేరు నిపుణుడైన సుధాకర్, తన సాంకేతిక ప్రజ్ఞను నెట్లో తెలుగు వ్యాప్తికై వినియోగిస్తూ కింది పనులు చేపట్టారు.
- ఫైరుఫాక్సు బ్రౌజరు కోసం తెలుగు పట్టీని సృష్టించారు. వివిధ తెలుగు వెబ్ సైట్ల లింకులన్నీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందించారు.
- ఈ-తెలుగు సంఘం కార్యదర్శిగా ఉంటూ సంఘం రూపు దిద్దుకునేందుకు కృషి చేసారు. సంఘం చేపట్టిన పలు అంశాలను http://wiki.etelugu.org వెబ్ సైటులో సమన్వయపరచే బాధ్యతను స్వీకరించారు.
- ఈమధ్యే పొద్దులో వివిధ అనే శీర్షికను నిర్వహించే బాధ్యతను చేపట్టారు.
కంప్యూటరు , సాఫ్టువేరు, ఇంటర్నెట్టు వ్యవహారాల గురించి తెలుగులో రచనలు పెద్దగా లేవు. తెలుగు బ్లాగరులు ఎక్కువ మంది కంప్యూటరు నిపుణులే గానీ, వారి సాంకేతిక రచనలు ఎక్కువగా ఇంగ్లీషులోనే ఉంటూ ఉంటాయి. (సాంకేతికాలను ఇంగ్లీషులో రాయడం సౌకర్యంగా ఉండడం ఒక కారణం కావచ్చును.) తెలుగులో అటువంటి రచనలు విస్తృతంగా రావలసిన అవసరం ఉంది. అందుగ్గాను అటు సాఫ్టువేరులోను, ఇటు తెలుగు భాషలోను చెయ్యితిరిగిన వారు పూనుకోవాలి. అదృష్టవశాత్తు, తెలుగు బ్లాగరుల్లో అటువంటి సమర్థులు చాలానే ఉన్నారు. హైదరాబాదులో మైక్రోసాఫ్టు యూజరు గ్రూపును నిర్వహించే సుధాకర్, వారిలో మొదటి వరుసలో ఉంటారు. శోధనలో సాంకేతిక విషయాలు రాసినప్పటికీ అవి కేవలం స్పర్శామాత్రమే! ఈ సాంకేతిక విషయాల కోసం ఓ బ్లాగును ప్రత్యేకించి గానీ లేక శోధనలోనే గానీ విస్తృతంగానూ, వివరంగానూ సుధాకర్ రాయాలని పొద్దు కోరిక. (ఆ ‘బాధ్యత‘ ఆయనకు ఉందని కూడా పొద్దు భావన)
ఈయన ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేయగలుగుతున్నారో అని నాకు తెగ ఆశ్చర్యమేస్తుంది. అన్నింటిలోనూ ఫస్టే. చాలా విస్తృతమైన బ్లాగు..ఆవకాయ నుండి అమెరికా దాకా
మనకు శో-ధనం అన్నమాట!
అభినందనలు సుధాకర్. ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మా ఆకాంక్ష.
బ్రహ్మాచారి కాబట్టి ఏ బాదరబందీ లేదు. సో ఏక కాలంలో ఉద్యోగంతో పాటు ఇన్ని పనులు ఫస్ట్ గా చేయగలుగుతున్నారు.
శోధన ను విశ్లేషించడం,సుధాకర్ గారి గురించి వివరించడం అనవసరం.ఆయన గురించి ఆయన బ్లాగు గురించి తెలీని వాళ్ళు ఎవరువుంటారు చెప్పండి తెలుగు బ్లాగరుల్లో.మేనమామ గురించి అమ్మతో చెప్పినట్టుంది.ఆయన ఇలాగే మరిన్ని మంచి టపాలు రాస్తూ మరిన్ని బహుమతులు అందుకోవాలని కోరుకుంటున్నాను.
శోధన గురించి ఎంతవ్రాసినా తక్కువే. పేరుకితగ్గ బ్లాగు
naa computer lo firefox browser lo telugu sariga kanipinchatledu, ade IE aite no problem, edaina solution soochincha galara?
-Karthee