కాలాన్ని నిద్రపోనివ్వను

ఆచార్య ఎన్.గోపి రాసిన “కాలాన్ని నిద్రపోనివ్వను” కవితాసంపుటిపై స్వాతికుమారి సమీక్ష ఇది:

————-

పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.

మనలో చాలామంది అనుకునేలానే చచ్చిపోతున్న ఉత్తరం గురించి అక్కడ ఇలా ఉంది.

“ఫోన్లలో ఏముంది హృదయ నిశ్శబ్ధం తప్ప
నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా”
ఆసక్తి రెట్టింపవగా స్థిమితంగా చదవటం మొదలెట్టాను.

జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది కానీ “నిచ్చెనలో ఏ మెట్టూ సుఖంగా ఉండదు” అని మరోసారి గుర్తు చేశారు.

ఎన్నాళ్ళో కలిసి ఉంటుంటాం కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా?
“మనుషుల మధ్య ప్రవహించే ఎడారుల గురించే బాధ”

కవిత్వం నిజంగా అంతా విస్తృతమా అనిపించేలా
“పద్యాల్లో పట్టనంత పెద్ద ప్రపంచం ఉంటుందా
జీవితం ఇరుకైనప్పుడు మైదానాల్ని మరింత విశాలం చేసేదే కవిత్వం” అని భరోసా ఇచ్చి,
“నీ అహం నా సహనం పై బరువును మోపుతుంది” అని పాత విషయమే ఐనా సరికొత్త సమీకరణంలో చెప్పారు.

“కన్నీళ్ళు బాల్యం వైపు పరిగెడతాయి
ఎండుటాకులకు కూడా పచ్చని జ్ఞాపకాలుంటాయి”
చిన్ననాటి రోజులు గుర్తొస్తే మనందరికీ ఇలాగే అనిపిస్తుంది కదూ..

మూర్తీభవించిన ఏకాంతాన్ని కదిలించటం ఎలా?
“గాలిని ముక్కలుగా కోసే గడ్డిపోచలు ఘనీభవించిన ఏకాంతాన్ని కరిగిస్తాయి”

వెన్నెల ఏ కవిని మాత్రం ఆకర్షించలేదు?
“చంద్రుడ్ని ఎన్ని సార్లు రుద్దినా అరిగిపోడు వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది” అని ఈయన చంద్రుణ్ణి గంధపు చెక్కగా మార్చేశారు.

అత్యద్భుతమైన క్షణాల్లో మాటలు మాత్రం ఒక్కోసారి మెదలకుంటాయి.. భావావేశం ఏదైనా కానీ..
“అపూర్వ సంగమాలు అనివార్య వియోగాలు ఏవీ తిరిగి చేతికందవు
చచ్చుబడి పోయిన మాటల్ని గురించే బాధ”

విషాదాల్లోకెల్లా విషాదం ఆప్తుల మరణం. అది కూడ ఈయన కవితకి అనుభవం.
“తనకి తెలియదు. తన మరణం క్షణమైతే మా మరణం క్షణక్షణమని”.

“వర్షమంటే నాకు మేఘాల తాళపత్రాలపై లిఖిస్తున్న మహా గ్రంధంలా ఉంటుంది”
ఇంకోచోట వర్షం గురించి ఇలా గంభీరం గా అనేసి,
ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే “కలతగా ఉంది, కవిత్వం సోకినట్టుంది” అని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.

స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)

“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

5 Responses to కాలాన్ని నిద్రపోనివ్వను

  1. “స్వాతి” చినుకులు పడి ఆయన కవితలు మెరుస్తున్నాయి – ముత్యాల్లా.

  2. విజయ says:

    నిజంగా నేను ఆ పుస్తకం ఇచ్చినా మీరు సమీక్షలో చెప్పినన్ని మంచి ముత్యాలని ఏరుకోలేకపోయెదాన్నే…ఆ కవి రాసిన కవితలు, వాటికి మీరు ఇచ్చిన సమీక్ష రెండు బాగున్నాయి.

  3. radhika says:

    విజయ గారి మాటే నా మాట.చాలా మంచి సమీక్ష.మీ నుండి ఇలాంటిదేదో వస్తుందని ముందే వూహించాను.మిమ్మలిని స్వాతికుమారి అని కాకుండా సాహితికుమారి అనిపిలవాలనిపిస్తూవుంటుంది నాకు.

  4. ఆసక్తి రెట్టింపవగా స్థిమితం గా చదవటం మొదలెట్టాను – అన్న మాటతో కవిత్వాన్ని ఆస్వాదించాలంటే ఎలా చదివాలో చెప్పారు. తొందర తొందరగా వార్తాపత్రికలోని ఒక జోకును చదివినట్టు, లేదా ‘తర్వాతేమౌతుందో చూద్దా’మని ఒక కథ లేక డిటెక్టివ్ నవల చదివినట్టు కాకుండా, కవితలోని ఒక్కొక్క మాట రాయడానికి ఆ కవి మనసులో ఏయే జీవితానుభవాలు నెమరుకువచ్చి ఉంటాయో ఊహించగలుగుతూ చదివితేనే కవిత్వం అర్థమౌతుందని ఈ మధ్యనే తెలుసుకొంటున్నాను. కవి ఆలోచనలతో మన అనుభవాలను పోల్చుకోవాలంటే మన జీవితంలో ఏం జరుగుతోందో మనం ఏం చేశామో ఏం ఆలోచిస్తున్నామో ఎలా జీవిస్తున్నామో – పరుగులాపి ఒక చెట్టుకింద తీరికగా కూర్చున్నట్టు – ఆప్పుడప్పుడూ ఆత్మావలోకనం చేసుకొంటూ ఉండాలనీ, అప్పుడే జీవితము, అనుభవము, ఆత్మవిమర్శ లాంటి పెద్దమాటలకు అర్థాలు కొంతైనా బోధపడతాయనీ తెలుసుకొంటున్నాను. ఈ వ్యాసం ప్రారంభంలో స్వాతిగారిని పరిచయం చేస్తూ ఆమె రాసిన మాటలను త్రివిక్రం సందర్భానుసారంగా ఉటంకించడం అభినందనీయం. ‘కల్హార’ములో ఆ మాటలు చదివినపుడు – ఆహా ఇలాంటి మాటలు ఎలా మనసులోకి ఎలా వస్తాయి? – అనుకున్నాను. ఇక, ఈ సమీక్షలో ఆచార్య గోపిగారి “తనకి తెలియదు. తన మరణం క్షణమైతే …” అన్నది నాకు నేరుగా తాకిన అనుభవం. ఇక్కడ ఉదహరించిన కొన్ని ఉపమానాలు చూస్తే బహుశా ఎక్కడా ఎవరూ వాడి ఉండరేమో అనిపించాయి. స్వాతిగారికి కృతజ్ఞతలు.

  5. swathi says:

    రానారె గారు, నేను ఏం చెప్పానో కానీ దానికి మీ వివరణ చాలా బాగుంది.
    కవిత్వం గురించి మీరు స్వీయానుభవం తో రాసిన మాటలు అక్షర సత్యాలు.

    విజయ, రాధిక..
    మీ అభిప్రాయాలకి కృతజ్ఞతలు

Comments are closed.