PVSS శ్రీహర్ష గత కొన్ని నెలలుగా హైదరాబాదు తెలుగుబ్లాగరుల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న ఉత్సాహవంతుడు. భాషాభిమానం, సాహిత్యాభిమానం మెండుగా గల శ్రీహర్షకు శాస్త్రీయసంగీతమన్నా, కళలన్నా ప్రత్యేకమైన ఆసక్తి. ఈయన బ్లాగు కిన్నెరసాని – పేరుకు తగినట్లే ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ వ్యాసంలో శాస్త్రీయసంగీతం, కళల పట్ల తనకు ఆసక్తి ఎప్పుడు, ఎలా మొదలైందో వివరిస్తున్నారు శ్రీహర్ష. ఆస్వాదించండి:
——————-
‘ఇవాళ ఆరు నుంచి తొమ్మిదో తరగతి దాకా పిల్లలకి రెండు పీరియడ్లు క్లాసులుండవు, అంతా స్కూలు అసెంబ్లీ హాలులో హాజరు కావాలి’ అని చెప్పారు. అసెంబ్లీహాలులో ఎందుకు హాజరు కావాలో కూడా చెప్పారు కాని, రెండు పీరియడ్లు క్లాసులుండవనే మాట వినగానే కలిగిన ఆనందంలో ఎవ్వరికీ అది సరిగ్గా వినపడలేదు. థర్డ్ పీరియడ్ అవ్వగానే అందరం అసెంబ్లీ హాలుకి బయల్దేరాము. అసెంబ్లీహాలు బయట ఒక పెద్ద బ్యానరు కట్టివుంది. అందులో ఇంగ్లీషులో ఏదో పెద్ద వాక్యంలా రాసుంది. అంతగా గమనించలేదు కాని Society , Indian, Classical, Culture లాంటి కొన్ని పదాలు కనిపించాయి. నేను అప్పుడు ఆరో తరగతి చదువుతున్నాను. ఈ పదాల అర్థాలు చూచాయగా తెలుసుకాని మొత్తం బ్యానరు మీద రాసుంది అర్థంకాలేదు. గబగబా మెట్లెక్కి అసెంబ్లీహాలుకి వెళ్లాను. ఆ హడావుడంతా నాకు నచ్చిన బెంచీమీద కూర్చుందామని. తీరా పైకి వెళ్లి చూస్తే, బెంచీలన్నీ తీసేసారు. నేల మీద తివాచీలు పరిచారు. పిల్లలందర్నీ బూట్లు బయటే విడిచి లోపలికొచ్చి వరసగా కూర్చోమన్నారు. ఇదేంటబ్బా అనుకుంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాక చూస్తే ముందర స్టేజిమీద కూడా కుర్చీలు తీసేసారు. అక్కడ కొన్ని పరుపులు వేసి వాటి ముందర మైకులు సర్దుతున్నారు. వాటి వెనకాలే కింద కనిపించిన బ్యానరు, దాని పైన ఇంకో బ్యానరు కనిపించాయి. పైనున్న బ్యానరులో SPICMACAY అని రాసుంది. కిందున్న బ్యానరుని ఈసారి సావకాశంగా చదివాను. అందులో Society for Promotion of Indian Classical Music And Culture Amongst Youth అని రాసుంది. పైన బ్యానరులో ఉన్న spicmacayకి కిందది ఫుల్ ఫార్మ్ అని అర్థమయ్యింది. పూర్తి అర్థం ఏమయుంటుందబ్బా అని అలోచిస్తుంటే మా సార్ ఒకాయన మమ్మల్నందర్నీ ‘silence’ అని ఒకసారి గదమాయించి, ‘ఇప్పుడు ఇక్కడ సరోద్ వాయిద్యం కార్యక్రమం జరుగుతుంది. మీరంతా అల్లరి చేయకుండా, మాట్లాడకుండా వినాలి. మీకు ఆ వాయిద్యం గురించి వివరిస్తారు కూడా. కార్యక్రమం చివర్లో మీకు ఏవయినా డౌట్లుంటే అడగవచ్చు’ అని చెప్పారు. ‘డౌట్లు అడగండి. అప్పుడే వచ్చినాయన మిమ్మల్ని మెచ్చుకుంటారు’ అని ఆయన ఓ ఉచిత సలహా ఇచ్చారు. వెంటనే ‘అయితే నేను ఓ డౌటడగవలసిందే’ అని నిర్ణయించేసుకున్నాను.
ఓ పదినిముషాలలో కార్యక్రమం మొదలయ్యింది. నార్తిండియా దుస్తుల్లో ఒకాయన వాయిద్యాన్ని పట్టుకుని స్టేజిమీద కొచ్చారు. ఆయన వెనకే తబలా పట్టుకుని ఇంకో ఆయన కూడా స్టేజి ఎక్కారు. ఇద్దరూ మైకులు చెక్ చేసుకుని, శృతి సరిచేసుకున్నారు. అప్పుడు ఆ వాయిద్యాన్ని ఆయన తన ఒళ్లోకి తీసుకుని దీనిని సరోదంటారని, ఇందులో చాలా తీగలుంటాయని దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇంకొన్ని విషయాలు చెప్పి ఇక వాయించడం మొదలుపెట్టారు. వాయిస్తూ, మధ్య మధ్యలో వివరిస్తూ … ఎప్పుడు పట్టిందో కాని నాకు నిద్రపట్టేసింది. మళ్లీ ఒక్కసారిగా మెళుకువచ్చింది. అప్పటికి మాంచి వేగంగా వాయిస్తున్నారు సరోద్ ని. సరోద్ లో వాయిస్తున్న స్వరాలని తబలా పై పలికిస్తునాడు ఇంకొకతను. భలే పోటీలా సాగింది కొంచెంసేపు. అప్పుడు నాకు డౌటు అడగాలన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక డౌటు రెడీ చేసిపెట్టుకున్నాను. ఇంతలో కార్యక్రమం అయిపోయింది. ‘మీకు నచ్చిందా’ అని అడిగారాయన. పిల్లలెవరూ ఏమీ మాట్లాడలేదు. పక్కనుంచి మా సార్లు సైగ చేసారు. ఆయన మళ్లీ ‘Did you enjoy the programme’ అని గట్టిగా అడిగారు. మా సార్ల సైగ అర్థంచేసుకుని మేమందరం ‘Yes’ అని అరిచాము. ‘That’s good’ అన్నారాయన. మీకేమయినా డౌట్లుంటే అడగండన్నారు. ఇదే అదను కోసం కాచుక్కూచున్న నేను ముందుకి వెళ్లబోయాను. అంతలోనే ముందు వరసలో కూర్చున్న వాడొకడులేచి వెళ్లి డౌటడిగాడు. ‘వీడెవడో ఫస్ట్ ఛాన్సు కొట్టేసాడనుకున్నాను’. తరువాత నేను వెళ్లి, సరోద్ లో పక్కనున్న మీటల గురించో, లేకపోతే ఏదో ఒక తీగగురించో డౌటడిగాను. ఆయన మెచ్చుకుని వివరించారు. తెగ పొంగిపోయాన్నేను.
ఇది నేను చూసిన మొదటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. తరువాత అదే సంవత్సరంలో మరికొన్ని spicmacay కార్యక్రమాలు జరిగాయి. మొదట్లో spicmacay కార్యక్రమాలంటే, రెండు పీరియడ్లు హాయిగా క్లాసులుండవు, అసెంబ్లీహాలులో బూట్లు బయటపెట్టి కిందకూర్చుని కార్యక్రమాలు చూడాలి / వినాలి, మధ్యలో మంచి నిద్ర వస్తుంది… ఇవి నాకు గుర్తున్న విషయాలు. తరవాత పై క్లాసులకి వెళ్లాక కూడా ఏడాదికి రెండు మూడు కార్యక్రమాలకి హాజరయినట్టు గుర్తు. ఎనిమిది, తొమ్మిది తరగతులకొచ్చే సరికి spicmacay, దాని ఫుల్ ఫార్మ్ కంఠతా వచ్చాయి. దాని అర్థం కూడా కొద్ది కొద్దిగా బోధ పడటం మొదలయ్యింది. అలా spicmacay పుణ్యమాని సితార్, భరతనాట్యం, కర్ణాటక ఫ్లూటు, సంతూర్, మణిపురి, ఒడిస్సి మొ.. కార్యక్రమాలు చూసాను. అప్పటిక్కూడా, కార్యక్రమాలలో ఒకటి అర కునుకుతీయడం, మధ్య మధ్యలో కార్యక్రమం కొంచెం చూడడం, కాస్త ఉత్సాహం గలిగితే డౌటు అడగటం, ఇదే వరస.
అయితే, spicmacay కార్యక్రమాల వ్యవహారమంతా పి.మోహన్ సార్ అని మా తెలుగు మాష్టారు ఆధ్వర్యంలో, ఇంకొంతమంది సార్లుకలిసి చూసుకునేవారు. మోహన్ సార్ అంటే ఎందుకో ముందునుంచీ నాకు చాలా గౌరవం. అది కాకుండా ఈ కార్యక్రమాలలో, కళాకారులని పరిచయం చేయడం, వారిని పూలమాలతో సత్కరించడం లాంటి వాటిలో ఎప్పుడూ పిల్లలనే పురమాయించేవారు. పై క్లాసుకి వెళ్లాక మనకికూడా అలాంటి అవకాశం రాకపోతుందా అనే ఊహ కూడా నన్ను spicmacay పై ఓ కన్నేసేటట్టు చేసింది. ఇక పదకొండో క్లాసుకి వచ్చాను. మాది CBSE స్కూలుకావటంతో, పదకొండో తరగతి వాళ్లకి పబ్లిక్ పరీక్ష ఉండదు. అందువల్ల, చదువుకి సంబంధం లేని ఎలాంటి పనయినా వాళ్లకే అప్పచెప్పేవారు. అలానే spicmacay కార్యక్రమాల బాధ్యత కూడా వాళ్లకే చెప్పేవారు. ఇక పదకొండో క్లాసుకి వచ్చాక మా స్నేహితులతో కలిసి నేను కూడా spicmacay కార్యవర్గంలో ఉండే వాడిని. అవసరమయ్యినప్పుడు కళాకారుల్ని స్టేషన్లో రిసీవ్ చేసుకోవడం, వారికి భోజన, టిఫిన్ల వ్యవహారాలు చూసుకోవడం, స్టేజి పైన బ్యానర్లు కట్టడం, బొకేలు, పూలమాలలు తెప్పించడం, కళాకారుల గురించి మైకులో చదవడం, కార్యక్రమం అయిపోయక vote of thanks చదవడం …. ఇవి మేము చేసిన పనులు. దగ్గరగా కళాకారుల్ని చూడడం, వారితో మాట్లాడం సహజంగానే ఈ కార్యక్రమాల పట్ల నాకు గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచాయి. ఇలా పదకొండో తరగతిలో నేను దగ్గరుండి జరిపిన కార్యక్రమాలలో నాకు బాగా నచ్చినది, గుర్తుండిపోయినది కథకళి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి కేరళ నుంచి రామన్ కుట్టినాయర్ గారి గుంపు పదిమందికి పైనే వచ్చారు. కథకళిలో వారు చేసుకొనే అలంకారాలు, ఆ వాయిద్యాలు, ఆ హావభావాలు నన్ను బాగా ఆకర్షించాయి.
అదే ఏడాది మ స్కూలులో spicmacay స్టేట్ కన్వెన్షన్ ‘రాష్ట్ర స్థాయి సమావేశాలు’ జరిగాయి. మావంటి కార్యకర్తలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనుంచీ వచ్చారు. ఇటువంటి గొప్ప సంస్థ వెనుక వుండి నడిపించే ఉత్సాహవంతులని కలిసే అవకాశం కలిగింది. చర్చల్లో spicmacay యొక్క ఉద్దేశాల గురించి, దాని భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించారు. నేను కుదిరినంత మేరకు వాటిలో పాల్గొన్నాను. నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. అలాంటి ఒక చర్చలో నాలో కలిగిన ఉద్వేగాన్ని బయటపెట్టాను. ‘మీరు ఇంత గొప్ప ఆశయాలతో, యువతరానికి మన కళలు, సంస్కృతులని పరిచయం చేయడానికి ఎంతో కష్టపడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, గొప్పగొప్ప కళాకారులని దేశం నలుమూలలా తిప్పి స్కూళ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని, ఎంత మంది ఈ కార్యక్రమాలని శ్రద్ధగా చూస్తున్నారో, వింటున్నారో మీరు ఎప్పుడయినా ఆలోచించారా? వేరే వాళ్ల దాకా ఎందుకు, నేనే నిన్న మొన్నటి వరకూ కార్యక్రమంలో చాలా సమయం పడుకునేవాడిని. మరి అటువంటప్పుడు, మీరు పడే శ్రమ వృధా అవుతోందనుకోటంలేదా’ అని అన్నాను. అప్పుడు, ఢిల్లీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఒక తెలుగాయన నన్ను భుజం తట్టి, ‘spicmacay ఆశయం మిమ్మల్నందర్నీ పూర్తి శ్రద్ధతో మూడు గంటల కార్యక్రమాలని పాఠంలాగా విని అర్థం చేసుకునేలా చేయాలని కాదు. మీ మనస్సులోతుల్లో మన కళల పట్ల, మన సంస్కృతి పట్ల ఒక చిన్న నిప్పుని పుట్టించడమే. రేపు మీరు పెరిగి పెద్దయాక, మీకంటూ మీరు జీవిస్తున్నప్పుడు, మీలో ఉండే ఈ నిప్పు పెద్దదై మిమ్మల్ని మన సంస్కృతిని అవగాన చేసుకోడానికి, మన కళలని ఆస్వాదించడానికి పురిగొల్పితే మా ఆశయం నెరవేరినట్లే’ అని అన్నారు. ఆ మాటలు నాకు కొంచెం బోధపడి కొంత ఊరట కలిగించాయి. అయినా ఆయన ఎప్పుడో భవిష్యత్తు గురించి చెప్పారు కాబట్టి అప్పుటికి నా చింతని కొంత దాటేసాను.
స్కూలు అయిపోయి, ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక, నా అదృష్టంకొద్దీ అక్కడ కూడా spicmacay ఉంది. మొదటి రెండు సంవత్సరాలు పెద్దగా వెళ్లలేదు, ఎక్కడ చదువుకి అంతరాయం కలుగుతుందోనని. తరువాత వెళ్లాను. ఇక్కడ కూడా, spicmacay ని చూసుకుననే కనకలింగేశ్వరరావు సార్ ప్రోద్బలం చాలా తోడ్పడింది. పదిహేనొందల మంది పట్టే కాలేజి ఆడిటోరియంలో, జూనియర్లని తెప్పించి కూర్చోపెట్టినా, పట్టుమని పది వరసలు ప్రేక్షకులుండక పోయినా కార్యక్రమాలని జరిపేసామంటే, spicmacay అంటే ఆయన కుండే మొండి పట్టుదలని చూసుకునే. దానికితోడు మా క్లాసుమేట్సు కూడా ఇందులో చేరి ఎవరికి నచ్చిన రీతిలో వారు పాలుపంచుకునేవారు. ‘స్టూడెంట్ల దగ్గర పదో పరకో డబ్బులు పోగు చెయ్యండయ్యా’ అని మా సార్ అన్నప్పుడు మొహమాట పడుతూనే ఒప్పుకున్నాక, కొద్ది రోజులు చేదు అనుభవాలు ఎదురయ్యాక, విసిగిపోయి, ‘సార్, ఇలా పది, ఇరవై కోసం అందరినీ ప్రాధేయపడ్డం ఎందుకు? ఎవరినో ఒకరిని పెద్దమనిషిని పట్టుకుంటే, వెయ్యో, రెండువేలో ఇస్తారు కదా సార్?’ అనేసాను. ‘అది వేరయ్యా, ఇలా ఒక్కొక్కరినే అడిగినప్పుడు, పదిమంది లేదన్నా, ఒకరిద్దరయినా నువ్వు అడిగినందుకు ఇస్తారు. డబ్బిచ్చినందుకయినా, నువ్వు మరీ మరీ రమ్మని చెప్పినందుకయినా కార్యక్రమానికొస్తారు’ అని అన్నారు. ‘నిజమే కదా’ అని అనిపించింది. ఆ తరువాత అందరి దగ్గరికీ వెళ్లి డబ్బడగటానికి, ‘ఇవాళ spicmacay కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి’ అని క్లాసులో అనౌన్సు చెయ్యడానికి పెద్దగా జంకలేదు. అయితే, కొన్ని మంచి అనుభవాలు కూడా కలిగేవి ఈ సందర్భాలలో. మా క్లాసుమేటుని మేము క్యాంటీను దగ్గర డబ్బగినప్పుడు, ‘నాకిలాంటివి పెద్దగా ఇష్టముండవు. కాని మీరు మంచి పనేచేస్తున్నారని నాకనిపిస్తోంది, అందుకని నేను డబ్బిస్తాను’ అని చెప్పి ఓ పదో, పాతికో ఇచ్చాడు. ఇది మాకు చాలా రోజులు ఓ మాంచి టానిక్కులా పనిచేసింది.
కాలేజీ చదువు పూర్తయ్యింది. తరువాత ఉద్యోగంలో పడ్డాను. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా సాధ్యమయినంతవరకూ వెళ్తుంటాను. చిక్కడపల్లి త్యాగరాజ గాన సభయినాసరే, రవీంద్రభారతయినాసరే, హరిహరకళాభవనమయినాసరే, లేక శిల్పారామమయినా సరే. ఇలా అలవాటవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నా, స్కూల్లో spicmacay ఆశయం గురించి ఆ కార్యకర్త చెప్పిన మాటలు మాత్రం తరచూ గుర్తొస్తుంటాయి. ఇంకో విషయంకూడా గుర్తొస్తుంటుంది. ఇలా ఈ కార్యక్రమాలకి వెళ్తానని చెప్పినప్పుడు, లేక పోతే ఆ కార్యక్రమాల దగ్గర వేరే వాళ్లు కలిసినప్పుడు, తరచుగా నన్ను అడుగుతుంటారు ‘మీరు కూడా సంగీతం నేర్చుకున్నారా? మీకు సంగీతం వచ్చా?’ అని. మా కనకలింగేశ్వరరావు సార్ అనేవారు, ‘అందరూ పాడే వాళ్లే అయితే, మరి వినే వాళ్లు ఎవరయ్యా?’ అని. నిజమే, కళాకారులకి ఆస్వాదించే ప్రేక్షకులుంటేనే పాడాలనిపిస్తుంది, తమ కళను ప్రదర్శించాలనిపిస్తుంది. నా మట్టుకు నేను కళలకి ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండడం మొదటి కర్తవ్యంగా భావిస్తాను.
-PVSS శ్రీహర్ష(http://kinnerasani.blogspot.com/)
Its very intresting. Mana bhadyatanu baga gurtu chesaru, kani busy jeevitalalo manam entavaraku mana culture ki nyayam chestamu anedi ….?????
“మన కళల పట్ల, మన సంస్కృతి పట్ల ఒక చిన్న నిప్పుని పుట్టించడమే.”నిజమే ఏదో ఒక చిన్న సంఘటన చాలు ఏదయినా ఒక విషయం పై మనకి ఆశక్తి కలగడానికి.తినగ తినగ వేప తియ్యగా అయినట్టు ఇలాంటి ప్రోగ్రాములకి వెళ్ళగా వెళ్ళగా ఆశక్తి అదే వస్తుంది.మీరన్నట్టు అందరూ చేసేవాళ్ళకంటే మనలా చప్పట్ట్లు కొట్టేవాళ్ళూ వుండాలి.ఆస్వాదించడంలో వున్న ఆనందం వర్ణించలేనిది
SPICMACAY గురించి, వారి వల్ల సంగీతం పట్ల మీలో కలిగిన అభిరుచిని బాగా వివరించారు. నేను కూడా నా కాలేజి రోజుల్లో 2-3 సార్లు SPICMACAY వాళ్ళ కార్యక్రమాలకు వెళ్లాను. అవి కొంత వరకు నాలో ఉత్సాహాన్ని కలిగించాయి కాని, మీలా సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ హాజరయ్యేంత ఉత్సాహం మాత్రం కలుగలేదు.
మన భారతీయ సంస్కృతిని కాపాడి, ముందు తరాల వారికి baton లా అందచేయడం చాలా అవసరం. SPICMACAY మీకు అందుకు సహాయపడటం, మీరు దానిని ఇలా అందరికీ తెలియజేసి, మాలో కూడా ఉత్సాహాన్ని నింపడం నిజంగా అభినందనీయం.
కవితలు శేీర్శికలో ప్రదర్శిస్తున్న భాష, శైలి బాగుంటున్నాయి. నిర్వాహకులకు మనఃపూర్వక అభినందనలు. కే.బి.యస్ శర్మ.
సాహసము సేసితివిరా డింభకా! అందుకే సంగీత సరస్వతే లభించినదిరా!!
“జనులా పుత్రుని కనుగొని..” అన్నట్టు ..
ఎప్పుడో 85 లో వరంగల్లులో స్పిక మేకే మొదలు పెట్టిన గుంపులో నేను కూడా ఒకణ్ణి. హర్షలో భారతీయ సాంప్రదాయ సంగీతం మీద ఆసక్తి కలిగేందుకు నేను చేసింది ఏం లేకపోయినా REC (NIT) లో 17 ఏళ్ళ తరవాత ఇతను మా కేంపస్ వారసుడని గర్వంగా చెప్పుకుంటున్నాను.
హర్షని మొదటి సారి 2002 లో ముఖాముఖి కలవడం, ఇప్పుడు ఇలా పత్రికా ముఖంగా ఈ బ్లాగు చదవటం – చాలా ఆనందంగా ఉంది.
@ తులసిః మనం busy గా వున్నా, ఎవరి అభిరుచులను బట్టి వారు తమకు యిష్టమైన వాటి గురించి సమయాన్ని కొంచెం కేటాయిస్తారు. అలాంటి సమయంలోంచే కొంత మన కళలకు కూడా కేటాయించగలిగితే చాలేమో.
@రాధికః మీ స్పందన చక్కగా తేలిపారు. నిజమే అస్వాదించడంలో ఉండే ఆ అనుభూతే వేరు.
@వేంకట రమణః మీరు కూడా SPICMACAY కార్యాక్రమాలకు వేళ్లేవారని, అవి మీలో కొంత ఉత్సాహాన్ని కలిగించాయని తెలిసి చాలా ఆనందం కలిగింది.
@ఆదిత్యః ధన్యవాదాలు
@కొత్తపాళీః ధన్యోస్మి ప్రభూ, ధన్యోస్మి.
నిజానికి, RECలో మేము SPICMACAY కార్యక్రమాలు నిర్వహిస్తున్న చాలా సందర్భాలలో మిమ్మల్ని తరచూ తలచుకునేవారు కనకలింగెశ్వర రావు మాష్టారు గారు. మేమెప్పుడయినా డీలా పడిపోతే, మీ హయాములో మీరు లారీలేక్కి మరీ వేళ్ళి దూర దూర కాలేజీలలో సైతం SPICMACAY కార్యక్రమాలు నిర్వహించడం గురించి చెప్పి మమ్మల్ని ఉత్సాహపరచేవారు ఆయన.
ఇంకో విషయం. కాస్తో కూస్తో శాస్త్రీయ సంగీతం, కళల పట్ల అభిరుచుందని మురిసిపొయి, కూసంత గర్వపడే నాకు మీ పరిచయం తరువాత అది ఎంత పై పై అల్ప సంతోషమో తెలిసింది. ఇంకా లొతుల్లోకి వెళ్లగలిగితే ఎంత ఆస్వాదించగలమో అవగతమయింది.
‘నాకిలాంటివి పెద్దగా ఇష్టముండవు. కాని మీరు మంచి పనేచేస్తున్నారని నాకనిపిస్తోంది, అందుకని నేను డబ్బిస్తాను’ — ఈమాత్రం మనుషులున్నా చాలు. కళలకు మరణం లేదు. “నా మట్టుకు నేను కళలకి ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండడం మొదటి కర్తవ్యంగా భావిస్తాను.” అన్నారు, ఈ మాట చాలా విలువైనది. ఒక చిన్నసైజు కళాకారునిగా ‘ప్రేక్షకపాత్ర’ వహించడం ఎంత అవసరమో అనుభవపూర్వకంగా నాకు తెలుసు. SPICMACAY గురించి మీ ద్వారానే తెలిసింది. ఇలాంటి సంస్థ ఒకటి ఉండటం, కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం కలిగించే విషయం.
Sir,
Its true..in Telugu there are so many Poets & Writers than the Readers..
Anyhow..I am one of the best Readers in Telugu..Very interested to appreciate a good poem or a writing without missing..
PUTLURIR@YAHOO.COM