తెలుగుబ్లాగులు చదివేవారిలో సాలభంజికల గురించి తెలియనిదెవరికి? ఈ బ్లాగులో ఒక్కో టపా చదువుతూ ఉంటే ఎక్కడా వెనుదిరగనవసరం లేకుండానే విక్రమార్కసింహాసనంపై ఒక్కో మెట్టూ ఎక్కుతున్న అనుభూతి కలుగుతుంది. “వాక్యం రసాత్మకం కావ్యం” అంటే ఏంటో బోధపడుతుంది. ఆ బ్లాగు రాస్తున్న పప్పు నాగరాజు గారు సుఖమయదాంపత్యరహస్యాలు చెప్తున్నారిక్కడ.
———-
ఈ మధ్య బ్లాగ్రాణులూ, బ్లాగమ్మలూ మెగుళ్ళ మీదేస్తున్న జోకులూ, వాటికి బ్లాగ్పాపలు రాసే అవేదనతో కూడిన కామెంట్లూ చదువుతూంటే, పాపం నాకు చాలా జాలేసి, పోనీలే ఈ ముద్దుగుమ్మలకి మనం కొద్దిగా జ్ఞాన భిక్ష ఎందుకు పెట్టకూడదూ అనే ప్రమాదకరమైన అలోచనొకటి మదిలో మెరిసింది. చెప్పేస్తే, బ్లాగయ్యలూ, బ్లాగ్బాబులూ – “ఓరోరీ నమ్మకద్రోహీ – వేదకాలం నుంచీ పరిరక్షించుకొంటున్న మన రహస్యాలన్నీ ఇలా బట్ట బయలు చేసేస్తావా, పురుష ప్రపంచానికింత ద్రోహం చేస్తావా” అని నన్ను వెలేస్తారేమో అని భయం. అయినా కూడా, బ్లాగ్సోదరీమణుల మీద నాకున్న అభిమానం కొద్దీ కొంచెం రిస్కు తీసుకోక తప్పటం లేదు మరి.
చూడండి అమ్మలూ – మీరేంటి, ఇంకా పన్నెండో శతాబ్దంలోనే ఉండిపోయేరు? మా మగాళ్ళంతా ఈ-టివి ధారావాహికల్లో కథానాయకుల్లాగ, ఆ అనంతమైన ధారలని నిర్విరామంగా సృష్టించే ఆ-టీవీ అధినేతలాగా సుద్ద ముద్దలూ, ముద్ద పప్పులూ అనుకొంటున్నారా? మేం చాలా తెలివిమీరిపోయేమండీ.
“నువ్వు చేసిన వంట మా అమ్మ చేసినట్టులేదు” అనే తెలివితక్కువ వెధవాయిలెవ్వరూ ఇప్పుడు లేరు. అలాగని, ఏది చేసినా కిమ్మనకుండా తినేస్తాం అనుకున్నారా? ఇప్పుడో కొత్త రూటు కనిపెట్టేం. “ఇది బానేఉంది కాని అమ్మడూ, మీ అమ్మగారు చేసే ఇడ్లీలైతే మల్లిపూల దొంతర్ల లాగుంటాయి” అంటాం – నస పెట్టడానికి ఎవరమ్మైతే ఏంటి? “మా” ని, “మీ” గా మార్చీగానే, పాపం, ఆ అమాయకురాలి మొహం చింకి చాటలా అయిపోయి, తెగ సంబరపడిపోయి, అంతకన్నా ఎక్కువగా ఇన్-స్పైర్ అయిపోయి, వాళ్ళింటికి ఫోను చేసేసి, వాళ్ళమ్మ దగ్గరనుంచి ఆ రెసెపీ రహస్యం ఏదో కనేసుకొంటుంది. రెసిపీ ఎక్కడ నుంచి వస్తే మనకేంటి – కమ్మటి భోజనం కావాలి, కాని? అయితే, “మా” అంటే ఎందుకంత ఉక్రోషమో, “మీ” అంటే ఎందుకంత సంబరమో మాత్రం నాకింత వరకూ అర్ధం అయ్యి చావలేదు.
అలాగే బట్టలుతకడం కూడాను. “నీ కెందుకోయ్ ఈ శ్రమ అంతా, ఆ బరువేదో నేను మోస్తాను కదా” అని, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళలా, ఆ వాషింగ్-మెషిన్ మీట నొక్కేసే బరువు మన నెత్తినేసుకొంటే – బోలెడు లాభాలు. ఇంటి పనేదో చేసేస్తున్నాం అన్న క్రెడిట్ కొట్టీయ్యొచ్చు, ఆ పైన, దుప్పట్లూ, చీరలూ, లంగాలూ, గలేబులూ మొదట లోడులో కుక్కేసి, మన చొక్కాలు, పేంట్లకోసం “స్పెషలు” లోడొకటి తీరుబడిగా వేసుకోవచ్చు – గుండమ్మ కథ లో రమణారెడ్డి డబుల్-రోస్ట్ పెసరట్టులాగ.
మనకంటే, ఆవిడ రెండాకులు ఎక్కువే చదివింది కాబట్టి, మన దూరాలోచనలన్నీ ఓ క్రీగంట కనిపెడుతూనే ఉంటుంది కదా. “మరీ హద్దు మీరిపోకు బాసూ” అని మనకి చెప్పడానికి ఒకోసారి “ఏంటి నీ బట్టలకి స్పెషల్-లోడేసేవా? మా బాబే – మగ బుద్ది – పో…నిచ్చుకొన్నావు కాదు” అంటూ, కళ్ళోసారి చక్రాల్లా తిప్పి, మూతోసారి మిరపకాయలా విరిచి, ముక్కోసారి చిక్కుడుకాయలా చిక్కి, చీర కొంగు బొడ్లో దోపి, కయ్యానికి కాని కాలు దువ్విందనుకోండి – తడబడిపోయి, తెల్లమెఖం పెట్టక్కర్లేదనిన్నీ, కొంచెం సెన్స్-ఆఫ్-హ్యూమర్ ఉపయోగించి -“సందేహింపకుమమ్మా, రఘురాము ప్రేమనూ” అని పాటెత్తుకొని – “ఒకే బాణలి, ఒకటే లోడు, రెండు లేవులే నా విరిబోణీ” అని పేరడీ పాడేసి, అక్కడ “నా” దగ్గర ముక్కుతో సాగదీసి, అవసరమైన దానికన్నా ఓ మూడు గమకాలు ఎక్కువే పలికిస్తే, స్త్రీ హృదయం లబ లబ లాడిపోతుందనిన్నీ, అసలు విషయం మరిచిపోతుందనిన్నీ మేం కనిపెట్టేసాం. ఒకవేళ, కోపం పోయినా, ఇంకా కినుక పోక ఆవిడ కూడా (మనకెంత సెన్సాఫ్-హ్యూమరుంటుందో, అంతకన్న అవిడకి ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది – ఇది రూలు) – “రఘుకులేశుడే ధర్మము వీడి రెండు లోడులే వేసిననాడు” అనందుకుందనుకోండి, ఆవిడని అక్కడే ఆపేసి, “అమ్మణ్ణీ, అలాటి కర్ణ కఠోరమైన మాటలు నీ నోట రాకూడదు, నా చెవిన పడకూడదు” అని చల్లగా జారుకొనే ప్రయత్నం చెయ్యాలనిన్నూ, అప్పుడావిడ “మరి నేను కట్టిన పేరడీ కూడా వినవా, ప్లీజ్” అంటూ, ఆవిడేంటి, అవిడ తల్లో జేజెమ్మ కూడా మన కాళ్ళబేరానికొచ్చేస్తుందనిన్నూ కూడా మాకు బాగా తెలుసు. ఆవిడకేదైనా చెప్పాలనిపిస్తే, చెప్పేదాకా ఓర్చుకోలేదు కదా?
కొద్దిగా సమయస్ఫూర్తీ, ఇంకొంచెం స్నేహరసం పండించేమంటే, సంసారసాగరం అంతా ఆవిడొక్కర్తే అవలీలగా ఈదేస్తుందనిన్నూ, ఆ శక్తి సామర్ధ్యాలన్నీ ఆవిడకి భగవంతుడు పుట్టుకతోనే ప్రసాదించేడనిన్నూ, అందుకని మనం చక్కగా ఒడ్డున కూచుని చదరంగం ఆడుకోవచ్చుననిన్నూ కూడా మాకు అర్ధమైపోయింది. ఒకవేళ ఎప్పుడైనా, నెలకోసారి ఆవిడ కాని కించిత్ అలసిపోతే, ఓ శనివారం ఉదయం మనమే బ్రేక్-ఫాస్ట్ లోకి ఉప్మా చేసేసి, లంచులోకి కూరలు తరిగేసి, అదే చేత్తో ఆవిడ పుట్టింటి వాళ్ళ పొగడ్తలనే సొరకాయలు కూడా సున్నితంగా కోసేస్తే – (ఇది మాత్రం చాలా కష్టమైన పని – నాలాంటి వాళ్ళకైతే మరీ కత్తి మీద సామే – పుట్టింటి వాళ్ళ ప్రసక్తి రాగానే, అందులోనూ పొగడ్తలంటే – ఆవిడ ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటుంది – మనం చెప్పే ప్రతి అక్షరం అక్షరం మధ్యలో ఉన్న చీకటి పొరల్లోకీ, పదం పదం మధ్యలో ఉన్న సందుగొందులన్నింటిలోకీ టార్చిలైటేసి మరీ వెతుకుతుంది – ఏమైనా సెటైరుందేమోనని) – ఆ కష్టమంతా రాత్రికి తప్పకుండా పండుతుందనిన్నీ, ఆదివారం ఉదయం, ఆ పండిన పళ్లన్నీ మన కిష్టమైన పూరి-కూర రూపంలో మన పళ్లెంలోకొచ్చేస్తాయనిన్నూ కూడా మాకు చాలా చాలా బాగా తెలుసు.
వాన పడుతున్నప్పుడు, మాకు పకోడీలు తినాలనిపించిందనుకోండి – “పకోడి చెయ్యి” అని అర్డరివ్వటం మా తాతల పద్దతి, “పకోడీలు చేస్తావేంటి” అని అభ్యర్దించటం మా తండ్రులనాటి పాత చింతకాయ పచ్చడి. ఇప్పుటి దారి వేరు. కొంచెం సేపు కిటికీలోంచి వర్షాన్ని తిలకించి, ఆవిడనొకసారి పిలిచి, “అమ్మలూ, నీకు గుర్తుందా – మనం ఓ సారి ఊటీలో ఇలాగే వర్షం పడుతుంటే, హోటలువాడి ప్రాణాలు కొరికి వాడి చేత వేడి వేడి పకోడీలు చేయించుకొని, రూము బయట బాల్కనీలో ఒక పక్క తడసిపోతూ, పకోడీలు తిన్నాం గుర్తుందా” అని మధుర స్మృతోటి ఆవిడ మదిలో రేకెత్తిస్తే – “ఇప్పుడు చెయ్యనా” అంటూ, మన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా, పిండి కలిపేస్తుందన్న పరమ రహస్యం మాకు ఈ మధ్యనే ఎరుకలోకొచ్చింది.
ఇక పోతే, యజుశ్శాకాధ్యాయిల ఆపస్థంభ (ఆపధ్దర్మ) సూత్రాలు:
సిగరెట్టు కొనుక్కోడానికి బయటకెళుతున్నప్పుడు “ఏమైనా కావాలా” అని తలుపు దగ్గరనుంచే ఓ కేకేసి పారిపోతే, మనం పుస్తకం చదువుకొంటున్నప్పుడు పనులు చెప్పరని మాకు తెలుసు.
చిన్నదాని చిత్తంలో కొత్త చీరనే ఓ చిత్రం పడిందనుకోండి – ఆ చీర బీరువాలోకి వచ్చేదాకా మరాగదు కదా? ఆవిడ చీర కొనుక్కుంటే మన సొమ్మేం పోయిందీ, ఏమీ పోదు, కాని చిక్కేమిటంటే – “మనం ఈ శనివారం షాపింగుకెళ్తున్నాం” అని అల్టిమేటం వేసిందనుకోండి మేడంగారు – అక్కడే ఇబ్బందంతా. ఆవిడ గారితో పాటు ముప్పై షాపులు తిరిగే ఓపికెవరికుందీ? దీనిక్కుడా కొన్ని చిట్కాలున్నాయి. “రావడానికి నాకేం అభ్యంతరం లేదనుకో. కాని, నేనొస్తే, నీ కాళ్ళకడ్డం పడడం తప్పించి ఇంకేం ప్రయోజనం లేదు, అదే, నువ్వూ, మీ ఫ్రెండు శారదా కలసి వెళ్ళేరనుకో – చక్కగా మీక్కావలిసిన సెలక్షన్లు చేసుకోవచ్చూ, చీరలతో పాటు డొక్కులో-డోరు కర్టెన్లో కూడా కొనుక్కోవచ్చూ, కాఫీడేలో కాస్సేపు కూర్చొని కబుర్లూ చెప్పుకోవచ్చు” అని విశ్వనాథ్ సినిమాలో స్క్రీన్-ప్లేలాగా, అందంగా వర్ణించి, ఊరించి, ఆఖరికి – “నీకెందుకు- శారదా వాళ్ళాయన్నీ, పిల్లలని నేను చూసుకొంటాను కదా” అని మాష్టరుప్లానొకటి ఆవిడ బుర్రలోకెక్కించేం అనుకోండి – అది పారితే (పారటం అనేది చీర ముఖ్యమా, మనతో షాపింగు ముఖ్యమా అనే దానిమీద ఆధారపడుంటుంది) – మనకెన్ని లాభాలో చెప్పలేం. ఆ శారదని షాపింగుకి పిలవాలంటే, శనివారం వాళ్ళని లంచుకి పిలవాలి కదా – పప్పన్నంతో బాటు, పాయసమో, పులిహోరో కూడా మనకి దక్కుతుంది, ఆడాళ్ళిద్దరూ బయటకి పోతే, నేషనల్ జియోగ్రాఫిక్ వారి పులులూ, సింహాలూ, మొసళ్ళ వీడియోలు పిల్లల మొహాన కొట్టి, ఆ శారదా వాళ్ళాయనతో మనం ఎంచెక్కా చదరంగం ఓ రెండెత్తులేసుకోవచ్చు.
ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి గాని, అన్నీ చెప్పడం కుదరదు.
అసలు సిసలు పూర్ణ పురుష రహస్యం (రేమాండ్ కంప్లీట్ మాన్ సీక్రెట్):
స్త్రీ హృదయం అర్ధం చేసుకోవటం ఏమంత కష్టం కాదని మేం కనిపెట్టేసేం – అందులో ప్రేమానురాగాలు తప్పించి ఇంకేం ఉండవని, తోడిన కొద్దీ అవి ఊరుతుంటాయనీ, తోడకపోతే, అవి గడ్డకట్టే ప్రమాదం ఉందనే చిదంబర చిదానంద చిన్మయ రహస్యం మాకెరికే.
అందుకని అమ్మాయిలూ, మేం అంతా ఎప్పుడో – ఈ సంసారం అనే వైకుంఠపాళీలో పాములన్నీ దాటేసి, నిచ్చెనలన్నీ ఎక్కేసి పరమపదం చేరుకొని, అక్కడ వాలుకుర్చీలో కూర్చొని – హాయిగా – చుట్టకాల్చుకొనే అంత ఎత్తుకి ఎదిగిపోయేం. మీరెప్పుడైనా అక్కడికి చేరినా, అక్కడ కూడా మీ చేత పకోడీలేయించుకోడానికి ఓ అరకేజీ శెనగపిండీ, పావుకేజీ ఉల్లిపాయలూ, మిగతా సామగ్రీ అంతా ముందునుంచే సిద్దం చేసుంచేం కూడా. మీరుకూడా అక్కడకొచ్చేమాటైతే, మేం ఎలాగూ ఎదో ఒకటి – ఉప్పో, మిరపకాయో – మరచి పోతాం అని మీకు తెలుసు కదా – అవి పట్టుకొని వచ్చేయండేం?
మీ మనసుల్లోని లోతులు మేం ఎప్పుడో కనిపెట్టేశాం కాని, మా బుర్రల్లోని “ఎత్తులు” కనిపెట్టేంత ఎత్తు మీరింకా ఎదగలేదు. ఆంచేతా – మేమెప్పుడూ మీకన్నా ముందే. ఆ చంద్రిగాడిని చంకనెత్తుకొని మీ సూరిగాడి చుట్టూ చక్కర్లు కొట్టక తప్పదు మరి మీకు – అందుకే భూమాత అనే ఓ బిరుదు మీ తలకెత్తేం కూడా.
బ్లాగ్బాబులూ – ఇది స్త్రీ హృదయ రహస్యమనే ఓ ముఖ్యమైన ఉపనిషత్తు. ఇందులో అతివలకర్ధం కాకుండా మీకు మాత్రమే అర్ధమయ్యే రహస్యాలున్నాయి కదా? ఇవన్నీ చాలామందికి ఇప్పటికే తెలుసనుకోండి, ఒకవేళ తెలియక పోతే – మీకు కావాలంటే నిరభ్యంతరంగా ఉపయోగించుకోండి – కాపీరైటు సమస్యలేం లేవు.
అయితే ఒక చిన్న, అతి ముఖ్యమైన సలహా – ఈ సీక్రెట్సన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి, మేమంతా చాలా సార్లు టెస్ట్ చేసేం కూడా, కానీ, వీటిని ప్రయోగించాలంటే – టైమింగ్ చాలా ఇంపార్టెంటు. క్రికెట్టులో సిక్సరు కొట్టాలంటే – టచ్, టైమింగ్ ఎంత అవసరమో – ఈ సూత్రాలు పనిచెయ్యాలన్నా అంత టైమింగవసరం, లేకపోతే క్లీన్-బౌల్డు అయిపోతారు. అంత కంటే ముఖ్యం – మీ ఆవిడని మీరు మనసారా ప్రేమించాలి, ఆ సంగతి ఆవిడ పూర్తిగా, సంపూర్తిగా, పరిపూర్తిగా నమ్మాలి. లేకుంటే – ఈ అస్త్రాలన్నీ అతి దారుణంగా బెడిసి కొడతాయి. కాబట్టి తస్మాత్ జాగర్త.
ఈ అస్త్ర విద్య మీ సొంతం కావాలంటే మీరొక వ్రతం పాటించాలి – ఆ వ్రతం పేరు అసిధారా వ్రతం.
ఆ వ్రతవిధానంబెట్టిదనగా:
మీరావిడ మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి మిమ్మల్ని ఆవిడ చాలా గుడ్డిగా నమ్ముతుంది. ఎంత గుడ్డిగా నమ్ముతుందంటే, పెళ్ళైన మర్నాడే, విమానం ఎక్కి మీతో అమెరికా రావటానికి కూడా ఆవిడ ఒక్క క్షణం కూడా సందేహించదు. ఏ కొంచెం మీరు పప్పులో కాలేసినా – ఆవిడ నమ్మకం చెదిరిపోతుంది, ఒకసారి చెదిరిందా – మీరు దాన్ని తిరిగి జీవితంలో సంపాదించలేరు. మీరేదో పెద్ధ వెధవ పనిచెయ్యక్కర్లేదు – చాలా చిన్న వెధవ పని చేసినా చాలు ఆ నమ్మకానికి గండి పడటానికి. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటంతలో తీరని నష్టం వాటిల్లుతుంది.
ఆవిడ మీమీదుంచిన గుడ్డి నమ్మకమే – మీ మెడకానించిన కత్తి వాదర. ఆ నమ్మకం చెదరగొట్టుకోకుండా జీవించడమే మనకి కత్తిమీద సాము. ఇదే అసిధారావ్రతమంటే. వరలక్ష్మీ వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు, అట్లతద్ది నోములూ లాటి సుళువు వ్రతాలన్నీ ఆవిడ చేస్తుంది – ఈ అసిధారావ్రతం మట్టుకు మీరు ఆచరించవలసిందే – తప్పదు.
అందుకని, నటించకండి – నటించి ఆడదాన్ని, అందులోనూ కట్టుకొన్నదాన్ని ఎప్పుడూ నమ్మించలేరు. సమయస్పూర్తి అంటే, సమయానికి తగ్గ కాకమ్మ కథలు చెప్పడమని కాదు నా ఉద్దేశ్యం – మనకున్న అనురాగాన్ని సరియైన సమయంలో, సరియైన మోతాదులో, శ్రుతి మించకుండా, తాళం తప్పకుండా వ్యకపరచడమే ఆనంద సాంగత్య రాగం. ఈ రాగంలోని సప్త స్వరాలు: సంస్కారం, అనురాగం, గౌరవం, అభిమానం, ప్రేమ, ఆదరణ, నమ్మకం, స్నేహం.
మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, నేనింతకు ముందు చెప్పిన అస్త్రవిద్యా రహస్యాలన్నీ ప్రయోగోపసంహారాలతో సాంగోపాంగంగా అభ్యసించి, మీరు కూడా మిగతా మా అందరిలాగే – వైకుంఠపాళీలో పాములన్నీ దాటేసి, నిచ్చెనలన్నీ ఎక్కేసి – పరమపదం చేరుకోండి. అక్కడ మనమంతా ఎంచక్కగా చీట్లపేకో, చదరంగమో ఆడుకోవచ్చు.
మా అవిడో బ్లాగిన్సిపెక్టర్ లెండి – అప్పుడప్పుడూ నా బ్లాగు తనిఖీ చేస్తుంటుంది. అందుకే, అవిడ కళ్ళ బడకుండా – దీన్ని పొద్దులో పాతరేస్తున్నాను, ఇదీ దూరాలోచనంటే, ఏమనుకున్నారు మా పవరూ? “మేం చెప్పేస్తాం కదా” అని మీరు చంకలు గుద్దుకోనక్కరలేదు. ఒకవేళ ఆవిడ కంటబడినా అంత నష్టమేం లేదు – మావి అక్షయ తూణీరాలు.
-పప్పు నాగరాజు (http://salabanjhikalu.blogspot.com)
ఐతే బ్రతకనేర్చినవారన్నమాట.వేరీగుడ్.అందరు మొగుళ్ళూ ఇలానే ఉంటే ఎంత హాయికదా.మిగతా బ్లగ్మాహారాజులనుండి మీకు అక్షింతలు తప్పవు. కాచుకోండి.
ఎంతసేపూ పెళ్ళయిన వారి గురించే గానీ, మా లాంటి పెళ్ళి గాని వారి గురించి ఎవరూ పట్టించుకోరు. 🙁
ఇలాంటి చిట్కాలేవో మాకూ చెబితే మేమూ enjoy చేస్తాంగా 🙂
మొత్తానికి భలే రహస్యాలన్నీ కనిపెట్టేశారు.
ఇవి ఎక్కువ మంది తెలుసుకుంటే భార్యలు నొచ్చుకోకుండా మాట్లాడొచ్చు.
ఒక పక్కనుండి వెక్కిరిస్తూనే ఇంకొ పక్కనుండి ఎత్తెసారు ఆడవాళ్ళని.నిజం గా బ్రతకనేర్చిన వారే.ఏదేమయితెనే మమ్మలిని సగం అన్నా పొగిడి నందుకు ధన్యవాదాలు.వ్యాసం లో పరిపూర్ణ రహస్యం అంటూ చెప్పినదగ్గరినుండి నాకు చాలా బాగా నచ్చింది.
భలే వున్నాయే ఈ రహస్యాలు. 🙂 కాక పోతే ఇప్పటి అమ్మాయలకు ఈ సూత్రాలు నప్పుతాయా సార్?
గురూజీ, చివరిదాకా అధికారపక్షనాయకుడిలా కనబడినట్టే కనబడి క్లైమాక్స్‌లో ద్విదళాధిపత్యం వహించి రాష్ట్రపతిలాగా మారిపోయారా! మంచిదే. ఇంతకూ గార్లపాటివారికి మీ సమాధానం ఏమిటి?
ముందరి నా వ్యాఖ్య ఎందుకనో కత్తిరింపుకు గురయింది. లేకపోతే నా కంప్యూటరత్రం చేసిందో తెలియటం లేదు.
మీరిక్కడ చెప్పినవన్నీ ఈ తరం అమ్మాయిలకు వర్తిస్తాయా? ఒక్క సారి అవును అనండి…ఆనందంగా వింటాం 🙂
మీ అమ్ములపొదిలో పిచ్చిబోలెడు అస్త్రాలున్నాయండి. అన్నీ సమ్మోహనాస్త్రాలే! చూపినవిన్ని, దాచినవెన్నో!!:-)
రామనాధము (రానారె) నేరుగా అడగటానికి మొహమాటపడ్డాడు కానీ… పెళ్ల్లైన జంటలకు సాంగత్య రాగం ఉన్నట్లే బ్రహ్మచారులకు పని చేసే ఏదైనా రాగం చెబితే జనాలు సంతోషిస్తారు 🙂
మీ అమ్ములపొదిలో ఎన్ని సమ్మోహనాస్త్రాలున్నా! అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా?
మీరు రాసిన విధానం మాత్రం చాలా బాగుంది అండి. ముఖ్యంగా నాకు నచ్చిన వాక్యం “ఈ రాగంలోని సప్త స్వరాలు: సంస్కారం, అనురాగం, గౌరవం, అభిమానం, ప్రేమ, ఆదరణ, నమ్మకం, స్నేహం”. నిజంగా ఈ సప్త స్వరాలు పలికిస్తే ప్రతి సంసారం ఓ సుస్వరాల నావ అవుతుంది.
@ప్రవీణ్,రానెరె:
చేతవెన్నముద్ద, చెంగల్వపూదండ అని పాడుకొంటూ, హాయిగా బాలకాండలో ఆగిపోక, ఎందుకయ్యా యుద్దకాండ దాకా రావటమూ, ఈ అస్త్ర శస్త్రాల గొడవులునూ?
ఎవరో ఓ పరమ రామభక్తుడు రాసిన నిందా స్తుతిలో “నువ్వు బుద్దిలేని దేవుడివి, నీతో మొర బెట్టుకోవడం నాదే బుద్ది తక్కువ” అంటాడు. ఇంతకీ ఆయన గారి అభిప్రాయంలో రాముడు బుద్ది తక్కువ వాడెందుకయ్యోడో తెలుసా: పోయిన దాన్ని, వెతికి మరీ తిరిగి తెచ్చుకొన్నాట్ట.
@నవీన్,
నా మాటవిని, నువ్వు ‘సరాగాలు’ కట్టిపెట్టి – “వేయి బీట్ల కన్న షాటొక్కటి మేలయా, విశ్వధాబిరామ వినురవేమా” అన్న వేమన గారి మాట ప్రకారం వెంటనే ఓ ఇంటి వాడివైపో.
@సుధాకర్:
ఏం ఉచ్చు పన్నెరు సార్. పడిపోతాననుకొన్నారా? ఇప్పుడు అమ్మాయలు అలా ఉన్నారా అంటే ఏం చెప్పమన్నారు? ఉన్నారో, లేరో నాలాటి ముసలాళ్ళకెలా తెలుస్తుదండీ? మీలాటి వాళ్ళకే తెలియాలి గాని?
ఉన్నా, లేకపోయినా, ఉన్నారనుకొని మనం ఈ జగన్నాటకంలో ప్రొసీడయిపోడమే. సిరిసిరిమువ్వమ్మ గారు చెప్పినట్టు – మనం తోసేది బూర్లె బుట్టని వాళ్ళకి తెలిస్తేనే అందులో పడతారు – లేకపోతే పడ్డానికి వాళ్ళేమైనా పిచ్చాళ్ళా? ఎవర్నీ తక్కువంచనా వెయ్యకుండా ఉంటేనే మనకి సేఫు. ఏవంటారు?
Editor garu, I really enjoyed your magazine. I am looking forward to more of your writings.
Regards.
ఇది స్త్రీ హృదయ రహస్యోపనిషత్తా? లేక దాంపత్యోపనిషత్తా? లేక మగాడి కుట్రోపనిషత్తా?
ఇంకో విధంగా చుస్తే అన్నీ ఇందులోనే వున్నాయనిపిస్తుంది. తిడుతూ పొగడటం, పొగుడుతూ త్ట్టడం మీకు తెలిసినంత ఇంకొకరికి తెలిసినంత లేదు. ఇంతకీ మీ ఆవిడ బ్లాగులు చదవడమేనా రాయరా? బాబ్బాబు ఆమె అడ్రస్ ఇవ్వండి ఆమెకు అందజేయాల్సిన తూణీరాలు మా దగ్గర చాలా వున్నాయి.
–ప్రసాద్
http://blog.charasala.com
అపర ద్రోణులు నేడిలా దాంపత్యోపదేశం చేస్తున్నారన్నమాట!
ఈ ఏకలవ్యుడు ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నాడు!
కానీ ఇటువైపు ఉంటూనే శల్యసారథ్యం బాగానే చేశారు!
మీ ఙ్ఞానానికి,లాజిక్,కి,వివరణలకి నాజోహార్లు.మీరు అన్నీ కనిపెట్టేసివుండచ్చు,అయితే ఎప్పుడూ ప్రతిదీ మూసలోనే ఉంటుందని అనుకోవడం మీలాంటి ఙ్ఞానులకు సబబా!!స్రీ హృదయం కొద్దిగా అర్ధం చేసుకుని వుండిండచ్చు, కాని పరిపూర్ణంగా మాత్రం కాదు.ఎదుకంటే స్త్రీ ఎప్పుడూ మార్పును, కొత్తదన్నాన్ని ధ్యానిస్తుంది,శోధిస్తుంది, ఆహ్వానిస్తుంది. కాదనగలరా??
నవ్వుతూ నవ్విస్తూ చెప్పినా నాగరాజు గారి మాటలు సంసారులకీ సంసారంలో దిగబోయేవాళ్ళకీ నిజంగానే ఉపనిషద్వాక్యాలు, చిరస్మరణీయాలు, ఆచరణయోగ్యాలు.
నాగరాజుగారూ, మీ శైలి అమోఘం. ఆ పైన “ఈ విషయాన్ని నిజంగా వీళ్ళకి తెలియ చెప్పాలి, ఇది అర్థం చేసుకోకపోతే, పాపం వీళ్ళేమైపోతారో” అని తపన పడి మరీ చెబుతున్నట్టు నిజాయితీలో తడిసి మెరుస్తుంటాయి మీ మాటలు.
అమ్మ బాబోయ్ – జ్యోతి గారు మీకు అక్షింతలు తప్పవంటే ఏమో అనుకొన్నాను.ఈ ముష్టిఘాతాలతో నా వళ్ళు హూనం అయిపోతోంది.
అయ్యా, బాబూ, అమ్మా – కేవలం జోకేనంతే, ఇందులో ఫిలాసిఫీ అస్సలు లేదు. నీతిపాఠాలంతకంటే లేవు. మీరాఫీసులో టీతాగుతూ, వేరుశనగ పలుకుల్లా దీన్ని నములుకోడానికి తప్ప వేరే ఉధ్దేశ్యం లేదు.
మీరంతా సటైర్ కింగులు – మీముందు నేనంతా? ఈ మధ్య రెటోరిక్ మీద ఓ పుస్తకం చదివి – అదేదో కాస్త ట్రై చేద్దామని చేసిన ప్రయత్నం అంతే.
నేను మా ఆవిడ చేత కాపడం పెట్టించుకోడానికి పోతున్నా.
అయ్యా ఎడిటర్ గారు: మీరు ఈ వ్యాసాన్ని పాతరెయ్యకపోతే, ప్రజలంతా కలసి నన్ను పాతరేసేటట్టున్నారు. దయగల తండ్రులు – మీకైనా దయరాదా?
నాగరాజుగారు ఈ ఉపనిషత్తుని ఒక్కసారి మీ ఆవిడకు చూపించండి.మీకు కాపడం మాట ఎలాగున్నా వీపు మాత్రం సాపు కాగలదు.ఐనా మీ మగాళ్ళు తమ భార్యలు బ్లాగులు చూడరులే అనే భ్రమలో ఉండకండి.ఎమో మీ చరిత్రలన్నీ వాళ్ళు చూస్తూనే ఉండొచ్చుకదా.సిరి గారిని చూసాము కదా.శ్రీమతి బ్లాగరు.ఎవరో తెలిసిందా.ఇంకా అలాంటివాళ్ళు ఉండొచ్చు.రావొచ్చు.జాగ్రత్త.
నాగరాజుగారూ! మేం ముందే చెప్పామండీ…ఇది మగవాళ్ళకు మాత్రమేనని! వాళ్ళు వినలేదు. ఇప్పుడు మీకు మా సానుభూతి ప్రకటించడం తప్ప మేమేం చెయ్యలేం.
very nice content. your writing style is very good.
అప్పుడు సరిగా గమనించలేదుగానీ, ఈ ఉపదేశంలో చాలా చమక్కులున్నాయ్. రమణారెడ్డి డబల్రోస్టు పెసరట్టు, ఒకే బాణలీ ఒకటే లోడు… పేరడీల్లాంటివి. ఇంతకీ యజుశ్శాకాధ్యాయిలంటే ఎవరండీ?
@రానారె:
ఐదునెల్ల కిందట గమనించని రహస్యాలు ఇప్పుడు గమనిస్తున్నారంటే దాంపత్యోపనిషత్తును ఇప్పుడు కడుశ్రద్ధగా చదివి వంటబట్టించుకుంటున్నారన్నమాట. 🙂 కారణమేమిటో ఊహించవచ్చా?
“అమ్మలూ, నీకు గుర్తుందా – మనం ఓ సారి ఊటీలో ఇలాగే వర్షం పడుతుంటే, హోటలువాడి ప్రాణాలు కొరికి వాడి చేత వేడి వేడి పకోడీలు చేయించుకొని, రూము బయట బాల్కనీలో ఒక పక్క తడసిపోతూ, పకోడీలు తిన్నాం గుర్తుందా” అని మధుర స్మృతోటి ఆవిడ మదిలో రేకెత్తిస్తే – “ఇప్పుడు చెయ్యనా” అంటూ,….”
“ఈ రాగంలోని సప్త స్వరాలు: సంస్కారం, అనురాగం, గౌరవం, అభిమానం, ప్రేమ, ఆదరణ, నమ్మకం, స్నేహం.”
పైన చెప్పిన మీ మాటలు మీ ఈ టపా కే హైలైట్.
హమ్మో! నాగారజు గారు, ఈమధ్య ఎవరో బ్లాగు లో నలభీమ పాకం గురించి రాస్తే కొత్తపాళీ గారు ఇచ్చిన ఈ లింక్, వారు రాసిన మరో టపా చదివాను. ఏమైనా ఆడవాళ్ళని మరీ అల్పసంతోషులని చేసారుగా. నవ్వి నవ్వీ కడుపు నొప్పి వస్తోంది. “ఎందుకన్ని సార్లు నవ్వుతావు నేకేమన్నా పిచ్చా” అని మా బుచ్చిబాబు అడగనే అడిగారు. చదవమని అందామనుకొన్నా. కనీసం చదివైనా కొన్ని కిటుకులు తెలుస్కొంటారని. కాని పూర్తిగా చదివిన తరువాతా చిటికిన వేలికున్న నా కొంగు ముడిని విడిపించుకొని, పరమపద సోపానంలో పైకొచ్చేసి మీతో చీట్లపేకతోనో, చదరంగంతోనో సెటిల్ అయిపోతారని భయమేసి..బుచ్చిబాబు అప్పుడప్పుడు మీరు చెప్పినట్లుగా చేసే ఈ పనులన్నీ నటనా అని కాసేపు ఆలోచించాను. ప్చ్! కాదు నిజాయితిగా చేస్తారు. నేను బుచ్చిబాబు ని ఇది చదవమని మీతో చదరంగానికి పంపకూడదని గట్టిగా నిర్ణయించేసుకొన్నా!
ష్! ఈ మాట మటుకు ఎవరికీ చెప్పకండి ఇంకో చిన్న రహస్యోపనిషత్తు. మీకు చెప్పానని తెలిస్తే బ్లారమణులందరూ నామీదకి యుద్ధానికి రాగలరు. మీకెవరికీ పని చెయ్యాలనిపించలేదనుకొండి. చిన్న కిటుకు, పనిచేస్తున్న శ్రీమతి దగ్గరికెళ్ళి, “చెదరి జారినా కుంకుమ రేఖలు పెదవుల పై పడి మెరుస్తూ ఉంటే చిలిపి తలపులే మది లో మెదలి, … ” అన్నారనుకొండి.. మధ్య మధ్యలో ఇలా అందాన్ని పొగిడ్తే కూడా.. అంతటి వ్రత ఫలము దక్కుతుంది.
ఏదేమైనా ఏతా వాతా నే చెప్పొచ్చేదేమంటే, మీ అమ్ములపొదిలో అస్త్రాలు మటుకు చాలా వాడి గా ఉన్నాయి. ఒకే ఒక వాక్యం: శరములవలనే ఛతురోక్తులని చురుకుగా/ఒడుపుగా విసిరే నైజం, నైపుణ్యం మీ సొంతం. శనివారం జీడిపప్పు ఉప్మా హడావిడిలో ఉంటారన్నమాట. వాతా అంటే గుర్తొచ్చింది.. వాతలు తగ్గాయా? :)))
chaalaaa bagundi……………ramani gari coment kooda bagundi ……………
saalabhanjikalu blog not found ani vastunnadi enti……..
challa bagundi
ఇలా రహస్యాల్ని బయటికి చెప్పెయ్యడం నెనస్సలొప్పుకోను.
అర్జునుడికి విశ్వరూపం చూపిస్తున్న కృష్ణుడిని ఐమాక్స్ త్రీడీ లో చూసినట్టు ఉంది మాస్టారూ. మీరు చెప్పినట్టు టైమింగ్ చాలా ఇంపార్టెంటు. పోస్ట్ లో ఏమేమి నచ్చాయో కోట్ చేయాల్సి వస్తే మొత్తమంతా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆగిపోతున్నా కానీ….మగువల మనసును అర్ధం చేసుకోవడంలో కిటుకులను ఇంత విపులంగా వివరించినందుకు మీకు స్త్రీకృష్ణుడు అని బిరుదు ఇవ్వకుండా ఉండలేకపోతున్నా 🙂
సాహో గురువా సాహో