సత్యం వద…: జర్మనీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు దొరక్కుండా వచ్చి ఇంట్లో దాక్కున్నాడొకతను. అతనెక్కడున్నాడో తెలియదని వాళ్ళావిడ బుకాయిస్తుంటే మూడేళ్ళ కూతురు కలగజేసుకుని తన తండ్రెక్కడున్నాడో చూపించి అరెస్టు చేయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పాలని కూతురికి బోధించిన ఆ తండ్రి అందుకు బాధపడలేదు. పైగా కూతురు తన మాటలు బాగా వంటబట్టించుకున్నందుకు సంతోషిస్తున్నానన్నాడు.
*******************
తొందరగా పడుకుని తొందరగా నిద్రలేవాలని మనవాళ్ళు ఎప్పట్నుంచో చెప్తున్నారు. మనం వింటేనా? రాత్రి పూట ఎక్కువసేపు మేలుకుంటే మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన hippocampus పనితీరు దెబ్బతింటుందని, అందువల్ల ఎక్కువగా మేలుకునే పిల్లలు చదువులో వెనుకబడుతారని ఇటీవలే ఒక పరిశోధనలో కూడా తేలింది.
*******************
కొండకు రంగేయిస్తున్న ఫెంగ్ షుయ్? నైరుతి చైనాలో Lao Shou పర్వత సమీపాన గల గ్రామస్థులకు అధికారులు ఆ కొండకు ఆకుపచ్చ రంగులెందుకు వేయిస్తున్నారో అర్థం కాలేదు. మరే కారణమూ కనబడక ఆ ఊరి వాస్తు(ఫెంగ్ షుయ్)ను మార్చడానికేమోనని ఊహిస్తున్నారు!
*******************
ఈసారి అమెరికాలో ఉన్నవాళ్ళు మంచుతో బాగా ఇబ్బందిపడ్డారు. కానీ నేపాల్ రాజధాని ఖాట్మండులో 63 సంవత్సరాల తర్వాత కురిసిన మంచును చూసి చిన్నా పెద్దా అందరూ ఎంతగానో సంబరపడ్డారు. నడివయసు తల్లులు కూడా తమ పిల్లలతో కలిసి సరదాగా మంచులో ఆటలాడుకున్నారు.
*******************
వాతావరణంలో చోటుచేసుకునే స్వల్ప మార్పులను సైతం ఎప్పటికప్పుడు నిశితంగా పసికట్టి, భూమికి చేరవేసేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.
*******************
దేశంలో ప్రాథమిక విద్యా స్థాయిలో చిన్నారులకు ప్రైవేటు ట్యూషన్లు చెప్పించడం సిగ్గుచేటని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు.
*******************
ధైర్యే సాహసే లక్ష్మీ: హైదరాబాదులో ఒకామె తన మెళ్ళోని గొలుసు లాగబోయిన దొంగ మొహం మీద చాచికొట్టేసరికి వాడు లబోదిబోమంటూ కారులో పారిపోబోయి, ఆమె తన చొక్కా పట్టుకుని విడవకుండా వెంటబడేసరికి దిక్కుతోచక కారుతో గోడను గుద్దేసి, చివరికి కారునొదిలేసి పారిపోయాడు.
*******************
పొమ్మనలేక… పొగబెట్టడమనే సామెత ఉంది మనకు. ఆ ఇటాలియన్ వనితకు ఆ సామెత తెలుసో లేదో మనకు తెలియదు గానీ ఆమె మాత్రం తన మొగుడు అదేపనిగా సిగరెట్లు ఊది పారేస్తూ ఉంటే తనను పొమ్మన్నట్లే భావించి మొగుణ్ణొదిలేసింది.
*******************
కొసమెరుపు: ఈమధ్య తెలుగు బ్లాగరులు ఇనుమడించిన ఉత్సాహంతో బ్లాగుతున్నారు.
కబుర్లు బాగున్నాయి. కొసమెరుపు విషయానికి వస్తే బ్లాగులు పెరగడం, బ్లాగర్లు మంచి మంచి విషయాలు వ్రాయడం చూస్తుంటే, మంది ఎక్కువవుతున్నా, మజ్జిగ ‘చిక్కన’ ఎలా అవుతుందబ్బా అన్న అనుమానం కలుగుతుంది.
తగినంత నిద్రపోవాలనే విషయం నాకు రొజూ గుర్తుచేసేవాళ్లు కావాలేమో.
మంచు అంతగా పడకపోయినా చలికి బయటకు రాలేక ఇంట్లోనే వుండలేక చాలా ఇబ్బందిగా గడిచింది ఇక్కడి చలికాలం.
మూడు ఉపగ్రహాలలో ఒకటోరెండో విదేశాలవి అనుకుంటాను.
అమర్త్యసేన్ మాటలు చాలా విలువైనవి. జాగ్రత్తగా ఆలోచించదగిన సూచన.
ధైర్యలక్ష్మీ జిందాబాద్. కానీ ఆ సాహసం ఒకో సారి ప్రాణాలమీదకు తెస్తుంది. కనీసం గాయాలపాలు చేస్తుంది.
అనుకూలవతియైన అర్థాంగిగా తన భర్త పొగెందుకుబెడుతున్నాడో అర్తంచేసుకుని తగురీతిన మెలిగిన ఆ వనితకు అభినందనలు.
కబుర్లు బాగున్నాయి.
రానారె, మీరు చెప్తున్నది మొన్న ఇస్రో ఒకేసారి ప్రయోగించిన మూడు ఉపగ్రహాల గురించి అనుకుంటాను. కానీ కబుర్లు చెప్పేది ప్రయోగించబోయే ఉపగ్రహాల గురించి కదా?
–ప్రసాద్
http://blog.charasala.com