ప్రేమ…కథ

ismile1.jpg“తెలుగు భాషాభిమాని, రాయలసీమ ముద్దుబిడ్డ! వృత్తి రీత్యా వైద్యుణ్ణి, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని!” ఇది I’smile గారు తన బ్లాగులో రాసుకున్న పరిచయవాక్యం. అంతే కాదు, ఈయన ప్రేమ విజేత కూడా! మనకు ప్రేమ గురించి కొన్ని రహస్యాలు/ముచ్చట్లు చెప్పడానికొచ్చారు. చెవులొగ్గండి మరి:
————-
‘ప్రేమ’…ఈ రెండక్షరాల వెనుక ఉన్న భావాన్ని తెలియజెప్పటానికి ఎందరెందరో కవులు, రచయితలు, కళాకారులు, శాస్త్రజ్ఞులు ఎంతగానో తపనపడ్డారు, మథనపడ్డారు. ఇంతకూ “ప్రేమ అంటే ఏమిటి?” అన్నది మనకు పదహారు వేల వరహాల ప్రశ్న (మిలియన్ డాలర్ల ప్రశ్న!) లాగానే మిగిలిపోయింది. ఓ ప్రేమికుడిగా నాకున్న అనుభవం సముద్రంలో నీటి బొట్టంత అయినా…అందరిలాగే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చేసే చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
ప్రేమ, ఇష్టం, ఆత్మీయత, అనురాగం, స్నేహం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో భావాలలో ప్రేమను చూసుకోవచ్చు. భావకవిత్వంలో సొబగులన్నీ ఈ ప్రేమ సిరాతో వచ్చినవే! ప్రేమను అనుభవించి పలవరించాలి అన్నాడొకాయన. చలం ప్రేమలేఖల్లో ఈ పలవరింతలను చూస్తాం ఇలా…

“నీ రూపమగోచరము, నీ స్వభావము మనోభావాని కతీతము. కాని నీ కన్న నాకు హ్రుదయానుగతమేదీ లేదు. నీ నామ మనుసృతము.కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది. నా వేపు నడిచొచ్చే నీ మృదు పాద రజము అస్తమయ మేఘాలకి రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది, నా పరమావధి నీవు.నీ వుండ బట్టి, ఈ ప్రపంచ మింత సుందరమూ, హృదయాకర్షమూ…” – చలం.

ప్రేమ కోసం అజరామరమైన ప్రేమమందిరాన్ని నిర్మించాడొక ప్రేమచక్రవర్తి…
ప్రేమ కోసం మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాడొక ప్రేమపిపాసి…
ప్రేమ కోసం మరణాన్ని జయించాడొక ప్రేమసాహసి…

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య తప్పకుండా ఉంటుంది. ఈర్ష్య మనిషికి స్వభావసిద్ధంగా వచ్చిన సహజ గుణమంటాడు ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. అలా అయితే ప్రేమ కూడా అలాంటి సహజ గుణమేనా? మరైతే కొంత మందిలో కలిగే భావతీవ్రత అందరిలోనూ ఉండదేమి? ప్రేమ కూడా మన జన్యువులు నిర్దేశించే ఓ క్రియా? ఇందులో నిజమెంత? తెలుసుకుందాం రండి.

‘ఆక్సిటోసిన్’ ఈ పేరెప్పుడైనా విన్నారా? మన శరీరంలో స్రవించే హార్మోనుల్లో ఇదీ ఒకటి. ఇది మెదడులోని హైపోథలామస్ అనే భాగం నుంచి స్రవిస్తుంది. ప్రేమకు ఈ హార్మోనుకు సంబంధం ఏమిటంటారా-మనకు తెలిసి మొదటిసారి ప్రేమను ఎప్పుడు అనుభవిస్తాం? తల్లి ఒడిలో అని అందరికీ తెలుసు. అక్కడే ఉంది అసలు కిటుకంతా!

బిడ్డ తల్లిపాలు తాగుతున్నప్పుడు ఆ స్పందన చనుమొనలలోని నరాల ద్వారా మెదడుకు అంది అది ఆక్సిటోసిన్ ను రక్తంలోకి పంపి, రక్తం ద్వారా రొమ్ములోనికి చేరే ఈ హార్మోను అందులోని కండరాలను ప్రేరేపించి సంకోచింపజేసి చనుబాలను బయటకు పంపుతుంది. ఇది శరీరధర్మ శాస్త్రంలో చదివిన లాక్టేషన్ చక్రం. కానీ ఇదే హార్మోను తల్లికి, బిడ్డకు మధ్య బంధాన్ని(బాండింగ్) పటిష్టపరచడంలో సాయపడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇదే కాక తల్లిపాలల్లో రోగనిరోధకశక్తి పెంపొందించే కొన్ని రకాల స్రావాలు ఉంటాయి అందుకే తల్లిపాలు శ్రేష్ఠమనేది.

ఇందుకు కారణం మన మెదడుపై కూడా ఈ ఆక్సిటోసిన్ చూపే ప్రభావం. మెదడులో కొన్ని చోట్ల ఈ హార్మోను గ్రాహకాలు(రిసెప్టార్స్) ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి. అంటే ఆ గ్రాహక కణాలు స్పందిస్తే ప్రేమ పుట్టుకొస్తుందని తేల్చారు. అలా అయితే ఈ హార్మోనుని మనకిష్టమైన వాళ్లకిచ్చి మన మీద ప్రేమ కలిగించుకొంటే అనే చిలిపి ఊహలు అప్పుడే కొందరికి వచ్చుంటాయి. అక్కడికే వస్తున్నా!

తొలిచూపులోనే ప్రేమలో పడడం కొందరికి అనుభవమే. మరి ఇక్కడ పని చేసే మంత్రం ఏది? యవ్వనంలో ఉన్నప్పుడు మన శరీరంలో హార్మోనులు పరవళ్లెత్తుతూంటాయి. ఏదైనా అందమైన పువ్వునో, అందమైన నవ్వునో చూసినప్పుడు మనస్సులో చిన్న సంచలనం కలుగుతుంది. అలాగే అందమైన వ్యక్తిని చూసినా మనలో కలిగే ఆ భావతీవ్రతకు సిగ్గు, బిడియం, ఆలోచన అనే కొన్ని అడ్డుకట్ట వేస్తాయి. కానీ వయస్సు తోడు కోరుకొనే యవ్వనంలో ఇదే భావసంచలనం కలిగితే అప్పుడు ఆ భావాలకు ఈ ఆక్సిటోసిన్ తోఢైతే ఆ వ్యక్తి మీద కలిగే ఆరాధనా భావం కలకాలం ఉంటుందని మనం అనుకోవచ్చు.

మరి ఈ ప్రేమలు-దోమలు కుట్టకుండా బుద్ధిగా పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్న వారి సంగతేంటని అడిగేరు…దానికీ సమాధానం ఉంది. ఈ ఆక్సిటోసిన్ కామోద్దీపనం జరిగినప్పుడు కూడా ఎక్కువ పాళ్లలో రక్తంలో ఉంటుందని నిరూపణ ఉన్నది. అలా అని ఇలాగే వారి మధ్య అనుబంధం ఏర్పడుతుందని కాదు, ఇదీ ఓ కారణం అని శాస్త్రరీత్యా చెపుతున్నారు. ఇదే ఆక్సిటోసిన్ కాన్పు జరిగే సమయంలో గర్భసంచిలోని కండరాలు సంకోచింపజేసి ప్రసవం సులువుగా అయ్యేట్టు చేస్తుంది. ప్రసవవాన్ని వేగవంతం చేసేందుకు ఆసుపత్రులలో గర్భిణులకు సెలైన్ సీసాలలో ఎక్కించే సూదిమందు ఇదే!

మరీ ఇలా ప్రేమని మందుల వ్యవహారంలా మార్చేస్తున్నాడేంటీ అనుకొనేరు. ప్రేమ కలగడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు శాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నం మీకు పరిచయం చేసి ప్రేమకున్న మరో పార్శాన్ని తెలియజెప్పానంతే. ఇక భావనాత్మక ప్రేమ (రొమాంటిక్ లవ్) ఎప్పటి నుంచో ఎందరి హృదయాలనో పిండి వేస్తూ వచ్చింది. దాని గురించి మరెప్పుడైనా!
– డా.ఇస్మాయిల్ సుహేల్ పెనుకొండ (చింతు)(http://krishnadevarayalu.blogspot.com)
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

8 Responses to ప్రేమ…కథ

  1. ప్రేమకు వైద్యశాస్త్ర పరంగా మీరిచ్చిన వివరణ బాగుంది. గతవారం ఈటీవీ-2లోని తెలుగు-వెలుగు అనే కార్యక్రమంలో, million dollor questionని కోటి రూపాయల ప్రశ్న లేదా పదివేల వరహాల ప్రశ్న అనటం కంటే బేతాళ ప్రశ్న అని పిలవడం సబబుగా ఉంటుందని ఎవరో వక్త (పేరు గుర్తులేదు) అభిప్రాయం వ్యక్తం చేశారు.

  2. radhika says:

    నేను మీ ప్రేమ కధ చెపుతున్నారనుకున్నాను.ఎంత అయినా వైద్యులు కదా…ఆ బాటనే పట్టారు.కవిత్వాలు రాసేవాళ్ళంతా పిచ్చోళ్ళు..వాళ్ళలో హార్మోనుల లో తేడాల వల్ల ఎమోషన్ స్తాయి ఎక్కువ వుండి ఎక్కువ ఆలోచిస్తూ అలా రాస్తారు ..కవులనుకునే వాళ్ళందరూ ఆసుపత్రిలో తప్పక చూపించుకోవాలని మా ఊరిలోని ఒక పెద్దాయన [ఆయనా వైద్యుడే]అన్నారు.ఇప్పుడు మీరు ప్రేమ గురించి వైద్య భాషలో చెప్పి ప్రేమంటే ఇంతేనా…అంతా రసాయనిక చర్యేనా అనిపించేసారు.కానీ చాలా మంచి విజ్ఞానదాయక విషయాలు చెప్పారు.మరిన్ని విషయాల కోసం ఎదురుచూస్తూవుంటాము.

  3. రమణ గారూ,

    మీరు చెప్పింది చాలా సబబుగానే తోస్తోంది.మక్కీకి మక్కిలా కాకుండా ఇలా అర్థం స్ఫురించేలా అనువాదాలుండాలని మొన్ననే చదివాను (మీ/మా గురువు గారి దగ్గర!) ‘బేతాళ ప్రశ్న’ చాలా చక్కగా సరిపోతుంది.మీ స్పందనకు ధన్యవాదాలు.

    రాధిక గారూ,

    అమ్మమ్మా అంత త్వరగా చెప్పేస్తానా? అందులో ఓ పేద్ద సీరియల్ కు సరిపడా సరుకుంది.అదీ చెప్తానండీ త్వరలో.మీరన్న ఆ వైద్యుడెవరో కానీ నిజమే చెప్పాడు.ప్రేమ…పిచ్చిది అన్న నానుడి ఇలానే వచ్చిందేమో?కవుల సంగతికొస్తే మనకందని భావాన్ని చెప్తే వీడికి కాస్త తిక్క అనుకొనే ప్రజలు చాలా మంది ఉంటారు.మీ స్పందనకు కృతజ్ఞతలు.

  4. jyothi says:

    ఇది మరీ బాగుంది.ప్రతీ దానికి మీ డాక్టరు భాషలో ఆలోచిష్తే ఎలా అండి.ఎదో ప్రేమ కథ చెప్తారనుకుంటే దానికి ఇలా రసాయనాలు,హార్మోనులు చెప్తారా.ఎమీబాలేదు.

  5. చలం ఏమన్నాడో తెలిసి, ఆక్సిటోసిన్ ఏంచేస్తుందో కూడా తెలిసిన వ్యక్తి చెబితే ఇలా విజ్ఞానదాయకంగానూ జనరంజకంగానూ ఉంటుందన్నమాట. ప్రతి విషయాన్నీ వైద్యనేత్రంతో చూడటం మానలేరేమో డాక్టరుగారు! 🙂

  6. satyasai says:

    మీ వ్యాసం అని చూడగానే, అందులోనూ ప్రేమలాంటి మహత్తరమైన అంశంమీద అనగానే చాలా ఉత్తేజంగా చదవడం మొదలుపెట్టాను. నేను ఆశించిన విషయాలు పూర్తిగా లేవనిపించింది. ప్రేమ మిగిలిన పార్శ్వాలను కూడా పరామర్శిస్తూ ఇంకా కొన్ని ఎపిసోడ్లు వ్రాయండి ప్లీజ్ మీ వ్రాతలంటే చాలా ప్రేమ.

    మీరన్న ‘పదివేల వరహాల ప్రశ్న’ అనే ప్రయోగమే సరైనదనిపిస్తోంది. బేతాళ ప్రశ్న, యక్ష ప్రశ్న అనేవి కష్టమైన ప్రశ్నలకోసం వాడేవి.

  7. డాక్టరు నుంచీ మరో విధంగా ఎలా ఆశిస్తాము?
    ఆ మద్య నాకు వచ్చిన ఆలోచననే మీ బ్లాగు బలపరుస్తూ వుంది. (నా బ్లాగు “నేను అనగా…”)
    ప్రతి మనిషిలోనూ ఈ రసాయనాల, హార్మోనుల మిశ్రమం వివిధ రకాలుగా వుండటం వల్ల వివిధ రకాల జీవులు, వారి వివిధ ప్రవృత్తులూ ఏర్పడుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఇంకో విధంగా చెప్పాలంటే సృష్టి అంతా ఒక ఆక్సిడెంట్, ఘటన, సంఘటనో లేక దుర్ఘటనో! అలాగే ప్రేమ ఒక సంఘటన!
    రాధిక లాంటి వాళ్ళు అయితే మేము రాసేదంతా ఏవో రసాయినాల వల్లే కానీ మా మనసుల స్పందన వల్ల కాదా అని చింతించక్కర లేదు. కొందరే కవితలు రాయ గలరు, కొందరే శాస్త్రజ్ఞులు కాగలరు అది రసాయనాల వల్లే అయినా ఆ పరిస్థితులు వారిలో వున్నందుకు వారు గర్వించాల్సిందే! (గందరగోళంగా చెప్పానేమొ!)
    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. nirmala says:

    mee vyasam bagundi..chaduvutunte navvochindi..inka gatam gurthochindi..naa chinanati premikudu gurtochadu..may be tana prema axitosin de..

    its good..waiting for u r next article
    bye

Comments are closed.