అతడు అడవిని జయించాడు – డా.కేశవరెడ్డి

అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక.

అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – అడవి. నక్కలే కాదు, తానెవర్ని రక్షిస్తున్నాడో స్వయానా ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే! ఎందుకంటే “అది మొరటు జీవం, శత్రువులు శ్రేయోభిలాషులు అని చూసుకునే ఇంగితం దానికి లేదు”

ఈతకొచ్చిన పంది, మంద నుండి తప్పించుకు పోయి అడవిలో ఓ పొద మాటున ఈనుతుంది. తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ వెళ్ళిన ముసలివాడు, వెతికి, వెతికి చివరికి దాన్ని కనుక్కుంటాడు. అప్పటికే రాత్రయి పోతుంది. అది వాణ్ణి దగ్గరికి రానివ్వదు; ఈనిన పంది తాను బతికుండగా మరో జీవిని తన దాపులకు కూడా రానివ్వదు మరి! దాని దాడి నుండి ఎలానో తప్పించుకుని, పక్కనున్న చెట్టెక్కి, ఇక ఆ రాత్రంతా నక్కల బారి నుండి తన పందిని, సందమావల్లాంటి దాని సలుగులను కాపాడే ప్రయత్నం చేస్తాడు, ముసలివాడు.

నక్కలు పంది పిల్లల వాసన పసిగట్టి, వాటి కోసం ప్రయత్నాలు మొదలెడతాయి. రెండు నక్కలనైతే పంది అమాంతం పీక కొరికి చంపి పడేస్తుంది. మరో నక్కను ముసలివాడు తన ఈటెతో చంపేస్తాడు. కానీ నక్కలు ఊరుకుంటాయా, నక్కలు మరి! ఓ రెండు సలుగులను ఎత్తుకు పోనే పోతాయి. ఆ తరువాత ఏకంగా నక్కల గుంపే దాడికి తరలి వస్తుంది. ఒక్క పంది అన్ని నక్కలను ఎదుర్కోలేదు. చెట్టు మీద నుండి కిందకి దిగితే, ముసలివాడు వాటిని అదరగొట్టి తరిమెయ్యగలడు. కానీ వాడేమో చెట్టు దిగలేడు, దిగితే పంది మీదపడి చంపేస్తుంది. మరిప్పుడెలా?

అప్పుడు వస్తుంది ముసలివాడికి మెరుపులాంటి ఆలోచన. ప్రాణానికి ప్రాణమైన పందినే ఈటెతో చంపేస్తాడు. ఆ తరువాత నక్కల్ని తరిమేసి, సలుగుల్ని బుట్టకెత్తుకుని బయల్దేరుతాడు. కొన్ని గంటలపాటు జరిపే ప్రయాణంలో పాలు లేకపోవడం చేత, పంది పిల్లలు చచ్చిపోతాయి, రాబందుల పాలవుతాయి. ఇంత యుద్ధమూ చేసి ఉత్త చేతుల్తో ముసలివాడు ఇంటికి తిరిగి వస్తాడు.

ఇదీ కథ.

సాయంకాలం నుండి, మరుసటి రోజు పొద్దు పొడిచేదాకా జరిగే కథ ఇది. నిజానికి ఇది కథ కాదు. ఇదో నాటకం. ప్రతీ దృశ్యం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్లే ఉంటుంది. అతడు అడవిని జయిస్తున్న విధానం మనల్ని లీనం చేసేసుకుంటుంది. కేశవరెడ్డి రచనా కౌశల్యం మనల్ని ఊపిరి తిప్పుకోనివ్వదు. ముసలివాని కార్యకుశలత మనల్ని కట్టిపడేస్తుంది. రక్షించేందుకు ముసలివాడు కడు సమర్థుడని మనకు కథలోని ప్రతీ వాక్యమూ చెబుతూనే ఉంటుంది. అంచేతే.. నక్క రెండు కళ్ళ మధ్య నుండి దూరి, ముచ్చిలిగుంటలో నుండి బయటికి వచ్చేలా ఈటెను విసిరినపుడు, ఒక్క వేటుతో పందిని చంపినపుడు, బాకును విసిరి తోటిగువ్వను చంపినపుడు, అవలీలగా కుందేలును వేటాడినపుడు మనకేమాత్రం ఆశ్చర్యం కలగదు. అతడి పనితనంపై మనకంత నమ్మకం కలిగిస్తాడు, రచయిత!

– తన పందులను వెదుక్కుంటూ వెళ్ళే ముసలివాని నడక ఎలా ఉందో చెప్పిన వైనం (“పెద్ద అంగలు వేసుకుంటూ, చేతిలోని ఈటెను ఊపుకుంటూ అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వాడి వలె అతడు నడుస్తున్నాడు”.)
– పందిని వెతికే క్రమంలో ముసలివానికి అడవి పట్లా, అడవి జంతువుల పట్లా గల అవగాహనను తెలియ జేసిన వైనం.
– ఆకలి తీర్చుకోవడం కోసం అతడు కుందేలును వేటాడి, చెకుముకితో మంట చేసి, దాన్ని కాల్చి తిన్న విధానం.
– సుగాలోల్ల అడవిలో, అర్ధరాత్రి, వానలో, తప్పిపోయి పిచ్చిగా పరుగెత్తుకుంటూ పోతున్న ఎనుబోతును వెంటాడి, పట్టి తెచ్చిన వైనం.
ఇవీ, ఇలాంటివెన్నో.. ఇవన్నీ మనకు చెప్పేదొకటే – ముసలివాడు పందినీ, దాని పిల్లల్ని రక్షించి తీరతాడని.

కానీ పందిని స్వయంగా తానే చంపుకుని, పిల్లలు చస్తూ ఉంటే చూడవలసిన నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది, ముసలివాడికి. ఏ పందినైతే రక్షించేందుకు మిన్నూ మన్నూ ఏకం చెయ్యబూనాడో, ఆ పందినే తన చేజేతులా చంపుకుంటాడు. ఎంత చిత్రం! ముసలివాని ఈ చేష్టకు మనం నిశ్చేష్టులమౌతాం. తేరుకున్నాక ఆలోచిస్తే ఆ చర్య ఎంతో తార్కికంగా అనిపిస్తుంది. కేశవరెడ్డి రచనా చమత్కృతి అది!

ఈ నవలికలోని పరిసరాల వర్ణన మనలను ముగ్ధుల్ని చేస్తుంది. అడవి, అక్కడి చెట్లూ చేమలు, జంతువులు, పక్షులు, వాటి అలవాట్లు ఎంతో వివరంగా వర్ణిస్తాడు రచయిత. వీటిని చదువుతూ ఉంటే మనకా దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అందుకే ఓ నాటకం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మనకు. ముసలివాని లాగానే రచయితకు కూడా అడవుల్లో జీవించిన అనుభవం ఉందేమో ననిపిస్తుంది.

“నిటలాక్షుండెత్తివచ్చినన్ రానీ..” తాననుకున్నది సాధించే తీరతానన్నట్టుగా పట్టుదల చూపిన మనిషి ప్రకృతి ముందు ఓడిపోయిన విధానం ఈ కథ. ఎంతో శ్రమ పడినా పని సాధించలేకపోయిన మనిషి నైరాశ్యం, అంతలోనే తిప్పుకుని.., తరువాతి సమరానికి తయారౌతున్న విధానం ఈ కథ. పందినీ సలుగులనూ పోగొట్టుకుని గుడిసెకొచ్చి నేలపై వాలిపోయిన ముసలివాని ఆలోచనలు చూడండి..
.. అలసిన నా మనసుకు ఒకింత విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక…
ముసలివాడు సిసలైన హీరో! అతడు అడవిని జయించాడు. కేశవరెడ్డి పాఠకుల మనసుల్ని జయించాడు.

డా.కేశవరెడ్డి రాయలసీమలో పుట్టి ప్రస్తుతం నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లిలో డాక్టరుగా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత, మధురాంతకం రాజారామ్ ఇలా అంటారు: “కేశవరెడ్డి తల్లి పుట్టినూరు మావూరే. అంతటి రచయితను కన్న తల్లి మావూరి ఆడపడుచే కావడం నాకు గర్వకారణం”.

డా.కేశవరెడ్డి ఇతర రచనలు:
ఇన్ క్రెడిబుల్ గాడెస్, రాముడుండాడు రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

18 Responses to అతడు అడవిని జయించాడు – డా.కేశవరెడ్డి

  1. radhika says:

    “…..ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక”..ఎంత స్పూర్తి దాయకం గా వుందీ..మాట.చివరిలొ వచ్చిన ఈ ఒక్క మాట చాలు కవి ఆలోచనా విధానాన్ని అంచనా వేయడానికి.

  2. సమిక్ష బాగుంది. నవలని చదవాలనిపించేంత బాగుంది.

  3. మురళీ కృష్ణ కూనపరెడ్డి says:

    సుమారు 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆంధ్ర పత్రికలో ధారావాహికగా వచ్చిందీ నవల. మొదటి నాలుగైదు వారాలు చదివి ఏందీ పిచ్చి నవల … నాలుగు వారాలైనా రెండో మనిషి కనిపించడు అనుకున్నాను. కానీ సీరియల్ పూర్తయిన తర్వాత నా గదిలోకి ఎవరైనా వస్తే, వారికి ప్రస్ఫుటంగా కనిపించే పేపర్ బానర్ మీద కనిపించే అక్షరాలు…

    ‘ అతడు అడవిని జయించాడు ‘

    ఇప్పటికీ మాయింట్లో ఇంకా అది కనబడుతుంది. అంతగా ప్రభావం చేసింది నన్ను అది.

  4. చదవాలనిపించేలా రాశారు. ఈ కథ, కథనమూ మీపై చూపిన ప్రభావం సమీక్షలో కనబడుతూంది. వీరబల్లె మండల గ్రంథాలయంలో ఈ నవల పేరు కనబడుతుండేది. ఆ పేరు చూసి ఇదేదో ఇప్పటి మన మసాలా సినిమాల్లాంటి ఇల్లాజికల్ ఫాటసీ, హీరోయిజం నిండిన కథయ్యుంటుందిలెమ్మని చులకనభావం కలిగింది. ఆ పేరెందుకు పెట్టారో ఇప్పుడర్థమయ్యింది. అసలిలాంటి వైవిధ్యమైన కథావస్తువుతో వచ్చిన నవలలను వేళ్లమీద లెక్కబెట్టవచ్చునేమో!

  5. వెంటనే ఆర్డర్ చేద్దామని avkf.orgకి వెళితే అక్కడ కేశవ రెడ్డి పేరే లేదు. ఉసూరుమంటూ వెనుదిరిగా!
    వెంటనే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలబ్బా!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. Raju says:

    నిజంగా రచయిత మనల్ని…అడవిలోకి..తీసుకెల్తారు.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం…చివరి బెంచిలో కూర్చుని.. ఈ నవల చదవటం….నా జీవితంలోనే..మర్చిపోలేని రోజు. నిజంగా ఈ రచయిత..ఒక డాక్టర్ అంటే..నాకు ఇప్పటికీ నమ్మకం కుదరదు..

    కేశవ రెడ్డి గారి..మరో అత్యధ్బుత నవల ‘ సిటీ బ్యూటిఫుల్”… ఒక మెడికో జీవితంలో..ఒక రోజులో జరిగిన సంఘటనలే..ఈ నవల.

    ఈ రెండు.. నవలలు.. నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను..
    ( సాహిత్య ప్రియులు… తప్పని సరిగా చదవ వలసిన నవల లు.. ఈ రెండు..)

    కేశవరెడ్డి.. రచనలలో.

    ‘ఇన్క్రెడిబుల్ గాడెస్ ‘ నవలకు నూతలపాటి గంగాధరం సాహితి సత్కారం,

    ‘అతడు అడవిని జయించాడు ‘ – తెలుగు యూనివర్సిటీ ఉత్తమ నవల అవార్డు.

    ‘మూగవాని పిల్లన్గ్రగ్రోవి ‘ – ‘సహృదయ సాహితి అవార్డ్’ , ‘ఆర్టొస్ అవార్డ్’ ,రాచకొండ రచనా పురస్కారం’, ‘ర్రా.వి. శాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం’

    నేషనల్ బుక్ టస్ట్ వారు ‘అతడు అడవిని జయించాడు ‘ నవలను.. 14
    భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు.

  7. t.sujatha says:

    మోత్తం కధ దివిన అనుభూతి కలిగింది.సమీక్ష అంటే ఇలా ఉండాలి.ఇది ఉత్తమ నల కోవకి చెందిన రచన.

  8. Ravikiran Timmireddy says:

    Hemingway వ్రాసిన “The Old man and The Sea” కి కెశవ రేడ్డి గారి “అతడు అడవిని జయించాడు” నవలకు చాలా దగ్గరి పొలికలున్నయ్. కేశవ రెడ్డి గారిది కాపీ అని చేప్పడం నా ఉద్దేశం కాదు, అది కాపీ కాదు. కానీ రెండింటినీ చదివి చూడండి, you feel like you are reading the same story in different time-space with similar kind of emotional response. కథ, కథనం అదే కాకపొయినా అలాంటిదే అనిపిస్తుంది. వోకటి చదివిన తర్వాత మరోకటి చదివితే మొదట చదివిన కథ మళ్ళీ, మళ్ళీ గుర్థుకొస్తుంది.

    రవికిరణ తిమ్మిరెడ్డి.

  9. kbs sarma says:

    the pigmy story around pig is very interesting. the robust common sense not having in animals is common. but strangely, it is very much missing the so called humanistic society. this is kali era. I congratulate the kesava for his approach. kbs sarma.

  10. మీ సమీక్ష పుణ్యమా అని కేశవరెడ్డి రచనలు చదివాను.
    “అతడు అడవిని జయించాడు” ఎంతగా లీనమయిపోయి చదివానో! నేను ఇలాంటి విభిన్న, విశిష్ట రచన చదవడం ఇదే మొదలు. కాకపోతే ఒక మొరటు పల్లెటూరి ముసలివాడు తన అంతరంగంలో తనకు మించిన నాగరిక భాషను వాడతాడు. అయితే దీన్ని ముసలివాడి అంతరంగాన్ని రచయిత తన మాటల్లో చెప్పాడు అనుకుంటే సరిపోతుంది. ఆ పుస్తకంలోనే ఎవరో రాసిన ముందుమాటలో కూడా ఇదే సంశయం వ్యక్తమయింది.
    అయితే ఈ సమీక్ష నన్నెలా కేశవరెడ్డిని పరిచయం చేసిందో ఈ “అతడు అడవిని జయించాడు”లోని సస్పెన్సును పోగొట్టి కొంత నా ఆసక్తిని కొంత బలహీన పరచింది. ఆ పంది, సలుగులు చివరలో చనిపోతాయి అన్న విషయం తెలియకుండా ఇది చదివితే మరింత రంజుగా వుంటుంది.
    దీనితో పాటే avkf.orgలో దొరికిన మిగతా రచనలు “రాముడుండాది , రాజ్జి వుండాది”, “ఇన్ క్రెడిబుల్ గాడ్డెస్”, “సిటీ బ్యూటిఫుల్” కూడా ఎకబిగిన చదివేశాను. మొదటి రెండూ నన్ను కట్టి పడేసినంతగా “సిటీ బ్యూటిఫుల్” పడేయలేకపోయింది. బహుశా రచయితే చెప్పినట్లు ఇది సిటీ జీవితాన్నీ రాద్దాము అని పని గట్టుకొని రాసిందలా అనిపించింది. రచయిత ఆత్మ పల్లె బడుగుల జీవితాలను స్ర్జించడలో వ్యక్తమయినట్లుగా ఇక్కడ వ్యక్తం కాలేదు. “సిటీ బ్యూటిఫుల్” అంపశయ్య నవీన్ “అంపశయ్య”లా వుంటుంది.

    ఏది ఏమయితేనేం “కేశవ రెడ్డి” రచనలను పరిచయం చేసిన “పొద్దు”కు రాసిన చదువరికి కృతజ్ఞతలు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  11. “మూగవాని పిల్లన గ్రోవి” కూడా చదివాను. ఇప్పటి రైతుల ఆత్మహత్యల నేపద్యంలో చదివి తీరవలసిన నవల.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  12. కొన్ని రచనలుంటాయి. చదివినంతసేపూ విపరీతమైన ఆందోళనకి గురిచేస్తాయి. చదివి ముగించగానే మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఇక ఆ రచననీ అది చదువుతున్నప్పుడు మనలో రేగిన భావాల్నీ ఈ జన్మలో మర్చిపోలే మనిపిస్తుంది. కేశవరెడ్డిగారి “అతడు అడవిని జయించాడు” అలాంటి రచన. అలాంటిదే ఇంకోటి కాళీపట్నం రామారావు పొడుగు కథ ‘యజ్ఞం”. ఈ రచనలు perfect అని చెప్పలేం. వాటిల్లో అనేక రకాల తప్పులో, దోషాలో ఉండొచ్చు. but still …

    నవల ముగింపు గురించి సమీక్షలో రాయకుండా ఉంటే బాగుండనే ప్రసాద్ గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. సమీక్షలో ఆ భాగం సవరించి ప్రచురించొచ్చు.

    కేశవరెడ్డి కి రావిశాస్త్రి పురస్కారం ఇచ్చినప్పుడు – 2003 లో – నేను హైదరాబాదులో ఉన్నా. ఆ సభకి వెళ్ళాను. వాసిరెడ్డి సీతాదేవి, పూర్వ దిగంబరులు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ ప్రభృతులు వేదిక మీద ఉన్నారు. ఏమిటేమిటో గంటల సేపు ఉపన్యాసాలు దంచారు. ఈయన సింపుల్ గా కృతజ్ఞతలు వెల్లడించి కూర్చున్నారంతే. సభ అయ్యాక వెళ్ళి కలిశాను. వయసు యాభైకి అటూ ఇటూగా. నిరాడంబరానికి నిర్వచనం లాగా ఉన్నారు. ఒక మామూలు ఫుల్ హాండ్స్ చొక్కా పేంటు, కాళ్ళకి సగం అరిగిపోయిన హవాయి చెప్పులు. పిట్టంత మనిషి. నేను కూడా కథలు రాస్తానని తెలుసుకుని తన ఎడ్రస్ ఇచ్చి తనకు పంపించ మన్నారు. ఆయన దగ్గర సెల్లు కాదు కదా, ఇంట్లో ఫోను కూడా లేదు! తరవాత తెలిసింది – ఆయన ఒక ప్రభుత్వ లెప్రసీ సేనిటోరియం లో పని చేస్తారని. ఆయన కళ్ళల్లో అంత దయ ఎక్కణ్ణించి వచ్చిందో అప్పుడు అర్థమైనట్టు అనిపించింది.

  13. @రవికిరణ తిమ్మిరెడ్డి
    హెమింగ్వే రచనతో పోలిక సరికాదు. స్థూలంగా కథా రూపంలో పోలికలున్నా, కేశవరెడ్డి రచనలో కవిత్వముంది. హెమింగ్వే వచనం అదొక తీరు – నిస్సారం అనను కానీ, కవిత్వం మాత్రం అస్సలు ఖాదు. హెమింగ్వే కథలో ముసలాడితో మనం సానుభూతి చెందొచ్చు. కానీ కేశవరెడ్డి ముసలాడు మనల్ని తనలోకి లాగేసుకుంటాడు.

  14. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    చాలా కాలం తర్వాత అతడు అడవిని జయించాడు నవల గురించి మళ్ళీ చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. కేశవరెడ్డి గారి ఈ నవల స్వచ్ఛ్హమైన తెలుగు నవల.జీవితం లో ఎదురయ్యే సంఘటనలు, అవి కలిగించే ఆనంద విషాదాలు వీటన్నిటికీ అతీతంగా నిర్వికారంగా మనిషి తన పని తాను చేసుకుపోవాలనే తాత్విక ధోరణి, ప్రకృతి సౌందర్యం, మార్మికత, ఎన్నిటినో కేశవరెడ్డి గారు ఈ నవల్లో అత్యంత అద్భుతంగా చిత్రిస్తారు. అన్నిటికీ మించి మనిషికి ఉండాల్సిన ఆశావహ దృక్పధాన్ని ఒక నిరక్షరాస్యుడి ద్వారా చెప్పించడంలో కేశవరెడ్డి గారి చతురత అద్భుతంగా ఉంది. నిజమే జీవితాన్ని అర్ధం చేసుకోడానికి కావాల్సింది చదువు కాదు. నిరంతర పోరాటం దాన్నుంచి వచ్చే అనుభవాలూను. దాదాపు 20 యేళ్ళ తరువాత మళ్ళి ఒకసారి ఈ నవలను గుర్తు చేసుకొనే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు.

  15. ఈ నవలలోని మనిషికి ప్రతి ప్రాణీ తనలాగే జీవనపోరాటం చేస్తూ తనలాగే ఈ విశాలప్రకృతిలో భాగమై తనలాగే భావావేశాలన్నీ కలిగి ఉంటుందనే స్పృహ ఉంది. అందుకే పుట్టిందనిపించేలా ఎడతెరిలి లేకుండా కూసే తోటిగువ్వ, ఈతల కాలంలో తమ కుటుంబానికి పరబ్రహ్మస్వరూపాన్ని సంపాదించే పనిలో ప్రాణాలు పోగొట్టుకునే నక్కలు, భీమసేనుని పరాక్రమాన్ని మొరటుతనాన్ని కలిగిన పంది, అప్పుడే ఈ లోకంలోకి అడుగిడిన సలుగు సందమామలు, తన మనుమడు, తాను, తీండ్రపొదలు, బాపనచీమలు, తాను చంపి కాల్చుకు తిన్న కుందేలు … వీటన్నింటిలోనూ తనహృదయమే అందులో కలిగే స్పందనలే, అవి అన్నీ కూడా తనలాగే జీవించడానికి పడే తాపత్రయమే కనిపిస్తుంది ఆ మనిషికి. పందులను మేపుకునే అ ముసలివాడు నా ఉద్దేశంలో మానవత్వానికి, సిసలైన మనిషి తత్వానికీ నిజమైన ప్రతినిధి.

  16. chavakiran says:

    ఈ పుస్తకం ఇప్పుడు అందరికీ మరింత చేరువలో. వివరాలు ఇక్కడ, కినిగెలో అతడు అడవిని జయించాడు

Comments are closed.