తెలుగువాళ్ళు రాసే ఆంగ్ల బ్లాగుల్లో ఎన్నదగినది http://archanaamperayani.blogspot.com. అర్చన రచనల్లో హాస్యచతురత, లోతైన ఆలోచనలు పుష్కలంగా ఉంటాయి. భావస్పష్టత, తిరుగులేని భావవ్యక్తీకరణ సామర్థ్యాలు ఆమె సొత్తు. ఆమె బ్లాగులోనుంచి తీసుకున్న ఈ రచనను ఆమె అనుమతితో మీ కోసం తెలుగులోకి అనువదించి అందిస్తున్నాం.
ఆంగ్లమూలం: అర్చన http://archanaamperayani.blogspot.com/2006/02/marriage-selection-procedure.html
అనువాదం: త్రివిక్రమ్
——————————
పెళ్ళికొడుకు పరివారసమేతంగా విచ్చేశాడు. వచ్చినవాళ్ళంతా సుఖాసీనులయ్యారు.
ఇతను కాక ఇంకా రావలసిన ముగ్గురు పెళ్ళికొడుకులూ ఒకేసారి వచ్చేస్తే వాళ్ళు నలుగురూ ఒకర్నొకరు చూసుకుని “You too…” అనుకునే సన్నివేశాన్ని ఊహించుకుని పెళ్ళికూతురి తండ్రి కలవరపడుతున్నాడు.
పెళ్ళికొడుకు అప్పటికే వీళ్ళెవరికీ కనబడకుండా ఎటైనా పారిపోదామా అని చూస్తున్నాడు. తన వెంటవచ్చినవాళ్ళలో సగం మంది అతనికి తెలియనివాళ్ళే. పెళ్ళికూతురి అక్కను చూసి “ఈ అమ్మాయినా నేను చేసుకోవాల్సింది?! ఈ అమ్మాయి చూడబోతే నాకంటే పెద్దదిగా కనబడుతోందే? అసలు ఈ అమ్మాయిని చూడ్డానికి నన్ను రమ్మని బలవంతం చెయ్యడంలో అమ్మ ఉద్దేశ్యమేంటి? ఇక లాభం లేదు. అఫీసులో నా పక్క సీటు పిల్లకు ట్రై చెయ్యాలి.” అనుకుంటున్నాడు.
పెళ్ళికొడుకు తల్లి (మనసులో): ఇల్లు బానే ఉంది. ఉన్నంతలో ఇల్లు చక్కగా సర్దుకున్నారు. మనుషులు కూడా మర్యాదస్థులే కాకుండా బాగా ఉన్నవాళ్ళలానే కనిపిస్తున్నారు. ఊ…చాలా మంది కనబడుతున్నారు. పెద్ద కుటుంబమే! మావాడికి తగిన సంబంధం. ఈ సంబంధం కుదిరితే పై గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి రెండురూపాయలు వేస్తాను.
పెళ్ళికొడుకు తండ్రి (మనసులో): “రెండో ఇన్నింగ్స్ మొదలయ్యేటప్పటికైనా ఇల్లు చేరగలమా?”
(ఇదే ఆలోచన పెళ్ళికొడుకు మనసును, అతడి తమ్ముడి మనసును, పెళ్ళికూతురి తండ్రి మనసును,…ఇంకా చెప్పాలంటే అక్కడున్న మగవాళ్ళందరి మనసులను తినేస్తోంది. ఐతే ఇక్కడ నడుస్తున్నది అంతకంటే ముఖ్యమైన వ్యవహారం కాబట్టి తప్పదన్నట్టు కూర్చున్నారు.)
పెళ్ళికొడుకు తమ్ముడు (మనసులో): ఏంటో? 🙂
ఎందుకో తెలియదుగానీ ఇలాంటి సందర్భాల్లో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అత్యంత నిరాసక్త, ఉదాసీన జీవులుగా ఉంటారు. ఎప్పుడూ నిద్రమొహాలతో, ఎడతెగని ఆవులింతలతో, ఏదెలా జరిగితే మాకేమన్నట్లుంటారు.
పెళ్ళికూతురింకా రాలేదు.అమ్మాయి తండ్రి (ఏ ఒక్కరితోనో అన్నట్లు కాకుండా): “అబ్బ! ఈ మధ్య మరీ ఉక్కపోతగా/చలిగా/ముసురుపట్టి ఉంటోంది. ఐనా ఈ ఊరు పదహైదేళ్ళ కిందట ఉన్నట్లు ఇప్పుడు లేదు.”
అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి ఔనౌనన్నట్లు తలలాడిస్తూ అన్ని వైపులకూ చిరునవ్వులు రువ్వారు – ఎవరికందితే వాళ్ళందుకోండన్నట్లు. బేటన్ అందుకున్న అబ్బాయి తండ్రి రాజకీయాల గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం మొదలుపెట్టాడు. తానేమీ తక్కువతినలేదన్నట్లు అమ్మాయి తండ్రి స్థానిక ఎమ్మెల్యే గురించి, మునిసిపాలిటీ గురించి, ఇంకా ఏయే విషయాల గురించి మాట్లాడబోతే తన భార్య వినకుండా విసుగ్గా వెళ్ళిపోతుందో ఆ విషయాల గురించి ఉత్సాహంగా విమర్శలు మొదలుపెట్టాడు. ఇక ఆ ఇద్దరు పెద్ద మనుషులు బడ్జెట్ గురించి, ప్రభుత్వం గురించి, ఇంకా బోలెడు పనికిమాలిన విషయాల గురించి ఉత్సాహంగా చర్చించేశారు.
అప్పుడు:
ఏ క్షణాన్నైనా సోఫా అంచు మీది నుంచి జారి కిందపడిపోయేటట్లుండే పె.కొ.తమ్ముడు తన కాలివేళ్ళకేసి దీక్షగా చూస్తున్నాడు. అక్కడ చేరిన ముత్తైదువులకు కంగారు మొదలైంది. అప్పుడే పె.కూ. తరపు పెళ్ళిపెద్దలు రిఫ్రెష్‌మెంట్స్ తీసుకురమ్మని పె.కూ.తల్లికి పురమాయించడం ద్వారా వాళ్ళందర్నీ ఈ లోకంలోకి లాక్కొచ్చిపడేశారు. అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. పె.కూ.పక్షం క్రిస్టల్ గ్లాసులు బయటికి తీయాలా లేక చీనా కప్పులు వాడాలా అనే మీమాంసలో పడిపోయింది. పె.కొ.పక్షానికి అనీజీగా అనిపించింది: “వాళ్ళందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటే మనం తింటూ కూర్చోవాలన్నమాట. దారుణం!”
పె.కూ.తల్లి ఫలహారాలతో వచ్చింది. అందరికీ అందించమని పె.కూ.అక్కకు సైగ చెసింది. పనిలోపనిగా పరిచయం కూడా చేసేసింది: “ఈమె మా పెద్దమ్మాయి.” *టింగ్…* పె.కొ. ఈ లోకంలోకొచ్చి పడ్డాడు: “ఓహో! ఈమె పె.కూ.కాదన్నమాట! బతికించావు భగవాన్!”
“ఆమె భర్త ఫలానా కంపెనీలో పనిచేస్తాడు. మా అల్లుడని చెప్పుకోవడం కాదుగానీ అతను చాలా మంచివాడు. అతను మా అల్లుడిగా దొరకడం మా అదృష్టమనే చెప్పాలి.” ఈ మాటలతో పె.కొ.మీద ఒత్తిడి నూరింతలు పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్నవాళ్ళందరికీ అతడు ఎంత కట్నం ఆశిస్తున్నాడో తెలుసు గద! పెద్దల్లుడితో అనుకోకుండా, అనివార్యంగా వచ్చిపడిన ఈ పోలిక వల్ల ఇప్పుడతను అక్కడున్నవారందరి కళ్ళకూ కట్నం కోసం మామగార్ని పీడించే జలగలాగ కనిపిస్తాడు. భగవాన్! ఇంత మంచి పెద్దల్లుళ్ళను ఎందుకిస్తావయ్యా?
ఈ రకమైన అర్థం పర్థం లేని సంభాషణలు కాసేపు కొనసాగాక అందరినోళ్ళూ మూతపడ్డాయి- మాట్లాడుకోవడానికి టాపిక్కేమీ దొరక్క. ఇంకోపక్క పెళ్ళికొడుకు అసహనం పెరిగిపోతోంది.
[…ఇక్కడ కట్ చేస్తే…]
-:రెండవ దృశ్యం:-
“ఇక అమ్మాయిని పిలవండి” అనే మాటతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. “వధువు వస్తున్నదీ…”
అమ్మాయి: (మనసులో) ఇంతకూ వీళ్ళలో పెళ్ళికొడుకెవరు? నేను పొరపాటున వేరొకతన్ని చూసి నవ్వానంటే గో…విందా! మా అమ్మ ఇక నన్ను బతకనివ్వదు.
పె.కూ.త: ఈమె మా చిన్నమ్మాయి. ఇప్పుడు సంబంధం చూస్తున్నది ఈ అమ్మాయికే.
పె.కూ. (మనసులో): ఛా! అక్కడికి వీళ్ళేదో నన్ను చూసి ఐశ్వర్యారాయనుకున్నట్లు. అమ్మా! ఇక ఆపుతావా?
పె.కూ.త (మనసులోనే గిలగిల్లాడిపోతుంది)రామా! ఈ పిల్ల నేను చెప్పిన మాట ఒక్కటీ వినదు గదా? ఈ ఆకుపచ్చచీరెలో ఉండేదానికంటే ఇంకా నల్లగా కనబడుతోంది. మెరూన్ కలర్ చీరెలో ఐతే బాగుండేది. ఇప్పుడీ పెద్దమ్మ వాళ్ళకెలా నచ్చుతుందో ఏమో?
పె.కొ. (మనసులో): మ్…బాగుంది. కానీ ఆ అమ్మాయికి ఆ చీరెలో సౌకర్యంగా ఉన్నట్టు లేదు. అంటే ఆ అమ్మాయి మామూలుగా మాడరన్ డ్రస్సులే వేస్తుందన్నమాట.
పె.కొ.తల్లి (మనసులో): వీడు ఆ పిల్లను కన్నార్పకుండా గుడ్లగూబలాగ చూస్తున్నాడేమిటి? వాళ్ళేమనుకుంటారు?
పె.కొ.తండ్రి (మనసులో): హమ్మయ్య! అమ్మాయి వచ్చేసింది. మహా ఐతే మరో 20 నిమిషాల్లో మనం బయలుదేరవచ్చు. అదే జరిగితే రెండో ఇన్నింగ్సేం ఖర్మ? మొదటి ఇన్నింగ్స్ కూడా చూడొచ్చు.
పె.కొ.త. (మనస్సులో): ఏమిటో!
పె.కూ.చె. (మనస్సులో): ఏమిటో!
సరే! అమ్మాయి వచ్చి కూర్చుంది.
అమ్మాయి తండ్రి : ఐతే…మీరు ఫలానా కంపెనీలో పనిచేస్తున్నారన్నమాట. (మనసులో) మాటలు కలపడానికి దీన్ని మించిన తారకమంత్రం లేదు. హె హె హె……
పె.కొ. (మనసులో): తలూపితే సరిపోతుందా లేక ‘అవునండీ’ అనాలా? నేనెక్కడ పనిచేసేదీ ఆయనకు మాత్రం ఇప్పటిదాకా తెలీదా? నేను కారు గ్యారేజీలో ఫిట్టర్ నని చెబితే ఎలా ఉంటుంది? హె హె హె. భలే తమాషాగా ఉంటుంది. ఐతే తర్వాత మా అమ్మ నన్ను చంపేస్తుంది. నా సెన్సాఫ్ హ్యూమర్ ను ప్రదర్శించే సందర్భమిది కాదు. ఈ జోకేస్తే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా మురిసిపోతుంది.
పె.కూ (మనసులో): నాన్నా! అతనేం పని చేసేదీ నాకు వెయ్యిసార్లు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ అతణ్ణి ఆ ప్రశ్న ఎందుకు అడుగుతావు? ఐనా అతడో దద్దమ్మలా ఉన్నాడు. అతడి మొహమ్మీది ఎక్స్‌ప్రెషన్ చూడలేక ఛస్తున్నాను.
పె.కొ.: అవునండీ!
పె.కూ.తల్లి: అమ్మాయినేమైనా అడగాలనుకుంటే అడుగు బాబూ! మొహమాటపడకు.
పె.కొ. (మనసులో): డేటడిగితే ఎలా ఉంటుంది?
(పైకి)ఐతే మీరు ఇంజినీరింగ్ పుణెలో చేశారన్నమాట. (మనసులో) నా పాత గర్ల్ ఫ్రెండు కూడా అక్కడే చదివిందని చెప్తే ఎలా రియాక్టవుతుందో?
అమ్మాయి: అవును (మనసులో) తను ఐఐటీలో చదివానని గుర్తుచెయ్యడానికి కాకపోతే ఇప్పుడీ దిక్కుమాలిన ప్రశ్న అవసరమా?
పె.కొ.తల్లి (మనసులో): సాయి బాబా! ఈ పిల్లను వీడు ఇదెందుకడుగుతున్నట్లు? ఆ పోరంబోకు పంజాబీ పిల్లను వీడు మర్చిపోయాడనుకున్నా. ఆ పాత కథనంతా ఇప్పుడు వీడినోటివెంట కక్కించకు తండ్రీ!
పె.కొ.: నైస్ సిటీ. కదా?
పె.కూ (మనసులో): “ఔనౌను..మంచి బార్లుంటాయక్కడ.” అనిచెప్తే గురుడేమౌతాడో? హె హె హె. పిల్లోడు థ్రిల్లైపోతాడు గానీ నా సెన్సాఫ్ హ్యూమర్ ను ప్రదర్శించే సందర్భం కాదిది.
అట్లాంటి పనికిమాలిన ప్రశ్నలైపోయాక మళ్ళీ నిశ్శబ్దం.
ఇప్పుడు పెళ్ళికొడుకు తరపు పెళ్ళిపెద్దలు: “ఐతే ఆగస్టు నెల్లో ముహూర్తం పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందా అండీ?”
పె.కొ. (మనసులో కెవ్వుమన్నాడు): అమ్మాయి నచ్చిందని నేనెప్పుడన్నాను?
పె.కూ. (మనసులో కెవ్వుమంది): సరేనని నేనెప్పుడన్నాను? ఐనా ఈ మనిషి ఇంత తొందరగా అవుననేశాడంటే పెళ్ళి కోసం ఎంతకాలంగా తిరుగుతున్నాడో పాపం? కొంపదీసి అందరూ కలిసి ముడిపెట్టేస్తారా ఏమిటి?
అందరూ చెవుల్దాకా నోళ్ళు చాపి చిరునవ్వులు నవ్వారు. “ఓ తప్పకుండా!”. “అలాగే! దానికేం?” అని ఒకరిద్దరు అన్నారు. అప్పటికే పె.కొ.తండ్రి ఆలస్యం చెయ్యకుండా బయలుదేరితే మొదటి ఇన్నింగ్స్ లో సిద్ధూ కామెంటరీ కూడా వినొచ్చని లోపల్లోపలే తొందరపడిపోతున్నాడు.
“ఏ విషయం ఒక వారం లో చెప్తామండీ”
“సరేనండీ, మేం మీ మాట కోసమే ఎదురుచూస్తూ ఉంటాం.”
“ఇక మేం వెళ్ళొస్తామండీ!”, “మంచిదండీ”, “ఉంటామండీ”, “శుభం”, “నమస్కారం” లాంటి మాటలు జోరుగా అప్పజెప్పుకున్నతర్వాత రెండుపక్షాలవాళ్ళ మనసుల్లో సవాలక్ష సందేహాలు షికార్లు చేస్తూ ఉండగా ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోయారు.
వరెవ్వా! పెళ్లిచూపుల ప్రహసనంలో వాతావరణాన్ని ఇంత తమాషాగా, నిష్పాక్షికంగా (పెకూ వైపో, పెకొ వైపో మొగ్గకుండా), సహజంగా అక్కడున్న ఒక్కొక్కరి మనసు బ్రాకెట్లు తెరిచి నవ్వించిన రచన, ఆ రచనలోని పరిమళాన్ని ద్విగుణీకృతం చేసిన అనువాదమూ రెండూ అరుదైనవే. అందించినందుకు రచయిత్రి, అనువాదకులు, పొద్దు సంపాదకులు వీరందికీ కృకజ్ఞతలు.
చాలా బావుందండి !!
పడీ పడీ నవ్వాను !!
ఇంత మంచి ఆర్టికల్ రాసిన అర్చన గారికి , అనువదించి ఇచ్చిన త్రివిక్రం గారి కి జిందాబాద్ !!
పడి పడి నవ్వాను.హాస్యం చొప్పిస్తూ చెప్పినా మనుషుల అసలయిన మనోభావాలు ఆవిష్కరించిన చక్కటి కధ.ఇంత మంచి కధను అనువదించి అందించిన పొద్దుకు ధన్యవాదాలు.
భేషజాలు లేకుండా మనసులు మాట్లాడుకుంటే ఎలా వుంటుందో చాలా గమ్మత్తుగా వివరించారు.
నవ్వాపుకోలేక పోయా!
–ప్రసాద్
http://blog.charasala.com
కథ చాలా బావుంది..మరీ కడుపుబ్బేలా నవ్వక పోయినా మంచి చమత్కారం ఉందీ కథలో…
ఎటొచ్చీ ఈ పె.కూ, పె.కొ ల తోనే బాధ..అనువాదంలొ యిలా చేసారా? మూలం లో కూడా యిలాగే ఉందా?
పె.కూ,పె.కొ అన్నప్పుడల్లా మంచి రసాస్వాదన చేస్తున్నప్పుడు బ్రేకు పడుతున్న భావన…అవి వచ్చినప్పుడల్లా కథలోంచి బయటికొచ్చేస్తున్న ఫీలింగు…
యిదొక్కటే అస్సలు బాలేదు.
కథ మాత్రం బావుందండోయ్!
nice story.
Potta pagilela navvesa.
Sahajamaina sanghatanallo sandarbhochitamaina hasyanni joppinchi bachu chakkaga vrasaru.
Telugulo anuvadinchi hasyarasanni dwiguneekrutam chesina Trivikram gariki, moola katha rachayithri Archana gariki, Poddu varganiki naa krutagnatalu.
ఈ కథను అనువదిస్తున్నప్పుడు bride, bridegroom లను ప్రతిసారీ పూర్తిపదాలు రాయడానికి బద్ధకించి, ‘తర్వాత మార్చుకోవచ్చులె’మ్మని పె.కూ., పె.కొ. అని రాసుకుంటూ పోయాను. తర్వాత ఈ అనువాదాన్ని చదివిన మూలకథారచయిత్రి అర్చన “ఏ మాటకామాటే చెప్పాలంటే నా కథ కంటే మీ అనువాదమే బాగుంది” అన్నారేగానీ పె.కూ., పె.కొ.ల గురించి ఏమీ అనలేదు. దాంతో నేనూ మార్చడానికి బద్ధకించి యథాతథంగా ఉంచేశాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ చదివితే కేశవాచారి గారి బాధ నాకూ అనుభవంలోకొచ్చింది. 🙁
katha chala bavundi.
feelings anni real ga unnayii..
🙂
చాలా బాగుందండి…
మొదట, అనువాద రచన అని అంత ఆసక్తి చూపించలేదు …కాని, మొత్తం చదివాక అసలు ఇది అనువాదం అన్న విషయం మర్చిపోయాను . నేను కూడా ఆ పెళ్ళి చుపుల పరివారం లో ఒకడిని అన్న భావన కలిగింది…ఆర్చన గారికి త్రివిక్రం గారికి నా కృతజ్ఙతలు.
కథ చాలా బావుంది..మరీ కడుపుబ్బేలా నవ్వక పోయినా ok…………..