తెలుగు జాతీయవాది – అంబానాథ్

రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయంగా ఆక్రమించుకుని హిందీ దేశం అధికారం చెలాయిస్తోంది. తమదో ప్రత్యేక జాతి అని కూడా తెలుసుకోలేక తెలుగువారు హిందీ దేశానికి సామంతులుగా బతుకుతున్నారు. తెలుగువారు మేలుకుని తమ జాతీయతను గుర్తించి హిందీ దేశం నుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తితో జీవించాలి.
కొత్తగా ఉంది కదా? తెలుగుజాతీయవాది (http://telugujaatheeyavaadi2.blogspot.com/) బ్లాగు చదవని వారికి ఇది వింతగానూ ఉండొచ్చు. ఇదిగో, ఈ తెలియనితనాన్నే తెజావాలో అంబానాథ్ ఎత్తి చూపుతున్నది! మనమెంత అజ్ఞానంలో ఉన్నామంటే.. ఆయన మాటలు మనకు కొత్తగా, వింతగా అనిపించేటంత!!

భావాల రీత్యా తెలుగు బ్లాగులన్నిటిలోకీ విలక్షణమైన బ్లాగు తెలుగు జాతీయవాది. తెలుగు జాతీయవాదిని సమీక్షించాలంటే ఆ బ్లాగును మూడు కోణాల్లోంచి చూడాలి. తెలుగు జాతీయవాద భావన, తెలుగు భాష స్థితి, ఇతరేతర విషయాలు.

తెలుగు జాతీయవాద భావనకు మీరు బద్ధ వ్యతిరేకి కావచ్చు; అయినా మీరు తెజావాను ఆస్వాదిస్తారు. తెలుగు రిపబ్లిక్ అనే భావనను మీరు జీర్ణం చేసుకోలేక పోవచ్చు, కానీ తెలుగు జాతి పట్ల రచయితకున్న తీవ్ర ఉద్వేగ భరిత ఆవేశాన్ని మెచ్చకుండా ఉండలేరు. తెలుగు జాతి చరిత్రను సమీక్షిస్తూ ఓ జాబులో ఇలా అంటాడు..”శతాబ్దాల తరబడి నిరాఘాటంగా కొనసాగుతున్న తెలుగు జాతి సమైక్యం చారిత్రికంగా ఓ నిరాక్షేపమైన వాస్తవం.రెండువేల సంవత్సరాలకి ముందే ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు తెలుగుదేశాన్నంతా ఏకం చేసి 450 సంవత్సరాల పాటు పరిపాలించారు. గత వెయ్యేళ్ళలో కూడా కేవలం 170 సంవత్సరాలు మాత్రమే తెలుగు సోదరులు పరాయి పాలకుల చేతుల్లో ఒకరికొకరు దూరం చెయ్యబడ్డారు.”

అయితే ఆయన ఆవేదన ఒక స్థాయిని దాటి ఆక్రోశంగా మారిన దృష్టాంతాలూ లేకపోలేదు. హిందీ భాషను మనపై రుద్దడాన్ని నిరసిస్తూ ఓ జాబులో – “..ఇంకో మొగుడున్నాడు. ఆయన పేరు హిందీ. ఆయన 1950 నుంచి తెలుగు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అదేమంటే ఇంట్లోవాళ్ళు పిలవకపోతేనేం, బయటివాళ్ళు రాజ్యాంగబద్ధంగా నన్ను పంపించారు కాబట్టి నేను వచ్చి ఇక్కడ తిష్టవెయ్యడం సక్రమమేనని సమర్థించుకుంటాడు. మనం చెప్పకపోయినా తనకితానే ఇంటికి యజమానినని చెప్పుకుంటున్నాడు. మనం ఈయన్ని మనమ్మకి నాలుగో మొగుడుగా ఇంకా ఎంతకాలం భరించాలో తెలీకుండా ఉంది.” అని వాపోతాడు.

తెరాస నేత తెలుగుతల్లి భావనను తృణికరిస్తూ మాట్లాడినపుడు అంబానాథ్ రాసిన ఆలోచనామృతం ఆయన భావోద్వేగానికి ఓ మచ్చుతునక. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్భంగా తెరాస తలపెట్టిన బందు సందర్భంగా రాసిన ఓ బంద్ కథ లో తెలుగువారి ఐక్యతను ప్రశ్నించడాన్ని నిరసిస్తాడు.
తెలుగు “దేశం” పరంగా ఆయన భావాలు మరీ తీవ్రంగా ఉండొచ్చు; పాఠకులు సమర్థించలేకపోవచ్చు. కానీ భాష విషయంలో సహేతుకమైన ఆయన ఆవేశం, ఆవేదనను సమర్థించకుండా ఉండలేరు. తెలుగు పట్ల తెలుగువారు, ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయనంత పదునుగా ఖండించే వారు అరుదుగా కనిపిస్తారు మనకు. ఈ వాక్యం చూడండి..”తమ పిల్లల్ని దేశద్రోహులుగా పెంచుకుంటామనే హక్కు తల్లిదండ్రులకి ఏ విధంగానైతే లేదో, మాతృభాషాద్రోహులుగా పెంచుకుంటామనే హక్కు కూడా వాళ్ళకి లేదు.” తెజావా మొత్తంలోకీ సర్వోత్కృష్టమైన వాక్యమిది. భాష పట్ల అంబానాథ్ దృష్టి ఈ జాబు – తెలుగులో మాట్లాడితే జరిమానా – లో సాక్షాత్కరిస్తుంది. ఉత్తమమైన జాబు ఇది.

తెజావాలో చక్కటి తెలుగు భాష కనిపిస్తుంది. మామూలుగా వాడుకలో ఉన్న ఇంగ్లీషు పదాలకు తెలుగు మాటలను పాఠకులకు పరిచయం చేస్తూ ఉంటాడు. రెక్కమాను (సైనుబోర్డు), శకునపక్షి (డిఫీటిస్ట్), అశ్లీలాంశం (టాబూ టాపిక్).. ఇలాంటివి. అమెరికాను గంధర్వ దేశం అంటాడాయన. వెయ్యి ఇంగ్లీషు ఇడియముల్ని తెలుగులోకి అనువాదం చేసి పెట్టుకున్నాను, త్వరలో ప్రచురిస్తాను అనంటున్నాడు. ఎదురుచూస్తూ ఉంటాం.

తెలుగు జాతి భావనకే కాక అంతర్జాతీయ సమకాలీన విషయాలకు కూడా తెజావాలో చోటుంది. సద్దామ్ హుస్సేన్ ఉరితీతను గర్హిస్తూ అంబానాథ్ రాసిన సంబరపడకు.. అంబానాథ్ పరిశీలనా శక్తికి ఓ ఉదాహరణ.

అంబానాథ్ మాట బహు కరుకు. సద్దామ్ ఉరితీతను అమెరికా చేసిన హత్యగా వర్ణిస్తాడాయన. ఆ జాబులోనే ఆయనింకా ఇలా అంటాడు.. “ఇది ఓ కీలుబొమ్మ ప్రభుత్వం. ఇది అమెరికాకి అంట్లు తోమిపెట్టడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని ఓ చచ్చుదద్దమ్మల ముఠా.” పౌరుల గోప్యతపై ప్రభుత్వాల దాడిని నిరసిస్తూ ఇలా రాసాడు – “..ఉగ్రవాదుల పోరాటకారణాలేంటో వారి సమస్యలేంటో తెలుసుకోవడానికి ఇష్టపడని, వారిని చర్చలకి ఒప్పించడం చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వాలు మనల్ని రక్షించాలంటే ముందు మనమంతా వారి ముందు గుడ్డలు విప్పుకుని నిలబడాలట.ఈ మానం లేని వెధవ బతుకు బతికినా ఒకటే, ఉగ్రవాదుల చేతుల్లో చచ్చినా ఒకటే.”

పెళ్ళి చేసుకునే వయసును ప్రభుత్వం నిర్దేశించడం పై విమర్శిస్తూ ఆలోచనాత్మక విమర్శ ను బెండసాగులో మెళకువలు లో చూడవచ్చు. అలాగే మానవాళి వలసలు తగ్గాలంటూ ఆయన రాసిన జాబు కూడా ఎన్నదగినదే. చరిత్రలో వలసలు ఎప్పుడు, ఎలా జరిగాయో చర్చిస్తూ సాగుతుందా వ్యాసం

అంబానాథ్ భావాలు ఆశ్చర్యం కలిగిస్తూనే కొన్ని చోట్ల నవ్వూ తెప్పిస్తాయి. “తెలుగు రిపబ్లిక్ ఏర్పడే రోజు మరీ సుదూరంలో లేదనిపిస్తుంది.” అని రాస్తూ ఈ విషయాన్ని ప్రముఖంగా వ్యాపింపజేయాలని అంటాడు. తెజావా భావాలను ప్రచారం చేసే విధానం కూడా చెబుతాడు. ” మన కార్యాచరణ“లో – “..అందుచేత సదృశ భావజాలం గల అనేక ఇతర రకాల జాతీయవాదులతో భుజం భుజం కలిపి మార్పుకోసం కష్టపడడానికి తె.జా.వాదులు సిద్ధంగా ఉండాలి.”. “..ఈ విధమైన ముందస్తు సహకారం భవిష్యత్తులో రిపబ్లిక్కుల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలకి దారితీస్తుందని భావిస్తున్నాను.”

ఆయన భావాలు తీవ్రంగా ఉంటాయి. అయితే వాదనలో అస్పష్టత కనిపిస్తుంది. తన వాదనకు అనుకూలంగా లేని విషయాలకు ఆయన దూరం. సద్విమర్శను కూడా స్వీకరించలేని పరిస్థితి కొండొకచో కనిపించింది కూడా.

రాష్ట్ర విభజనోద్యమం గురించి రాసేటపుడు ఆయన వాదన ఏకపక్షంగా ఉంటుంది. 610 జీవోకు అనేది తప్పంటాడు, కానీ పెద్దమనుషుల ఒప్పందాన్ని తలవడు. “తెలంగాణాకి నీరుండాలే గాని ఏదో పొడిచేస్తామంటూ ఉంటారు నాయకులు.ఇక్కడ అంత భారీ స్థాయిలో పొడవడానికేమీ లేదు. తెలంగాణాలో అత్యధిక శాతం భూమి సారవంతమైనది కాదు.ఇక్కడ పండించే గోంగూరకి పులుపుండదు.గుమ్మడికాయలకి తీపి ఉండదు.గోదావరి కృష్ణ నీళ్లే కాదు వెయ్యి నదుల నీరు పారించినా ఈ భూమి స్వభావం దాదాపుగా ఇంతే.” అంటూ నిర్దాక్షిణ్య వాదన చేస్తాడు.

కారణమేంటో తెలియదు గానీ తెజావాలో పాఠకుల వ్యాఖ్యలు కనిపించకుండా పోవడం జరిగేది. బ్లాగు కూర్పు కూడా పాఠకుడికి అంత సౌకర్యంగా అనిపించదు. పాత జాబులను చదువుదామంటే లింకులగపడవు. అట్టడుగున మాత్రం నెలవారీగా పాత సంచికల లింకులు ఉంటాయి. బ్లాగును మరింత వీలుగా అమర్చవలసిన అవసరం ఉంది.

బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసే విషయంలో అంబానాథ్ చాలా సిగ్గరి. ఇతర బ్లాగుల్లో ఆయన వ్యాఖ్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. బ్లాగులో పాఠకుడు రాసే వ్యాఖ్య బ్లాగరికి అనంతమైన ఉత్తేజం ఇస్తుందనే విషయం మాత్రం మరువరాదు. తెలుగు బ్లాగరులు ఉన్నదే తక్కువ మంది కాబట్టి, ఉన్న కొద్దిమందే తమకు నచ్చిన జాబుల్లో కాస్తంత చొరవగా వ్యాఖ్యలు రాయాలి.

-శేషాచలపతి

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

5 Responses to తెలుగు జాతీయవాది – అంబానాథ్

  1. పరీక్ష కోసం రాసిన వ్యాఖ్య.

  2. అంబానాథ్ గారి రచనా శైలి చాలా బాగుంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సమర్ధంగా, నిష్కర్షగా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగల దిట్ట ఆయన. ఆయన వ్రాసిన చాలా పోష్టులు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే విధంగా ఉంటాయి.

  3. అంబానాథ్ గారి పరిశీలనా శక్తి, సంఘటనలను అనలైజ్ చేసే విధానము అద్భుతము..పాతిక సంవత్సరాల అనుభవ సారము మరి. సంబర పడకు టపాలో భాష మరీ అమెరికా ద్వేషముగా కనిపించినా వీరి ఇతర రచనలను మెచ్చుకోకుండా ఉండలేము. తెలుగు బ్లాగులకు ఈయన తనదైన వన్నె తెచ్చారు. నేను తరచూ తప్పకుండా చదివే బ్లాగులలో ఇది ఒకటి

  4. radhika says:

    ఈయన రచనలు ఆలోచి౦పచేస్తాయి.నిజాలని నిర్భయ౦గా బయటపెడతాయి.

  5. కెసీయార్, అంభానాధ్ పరస్పర విరుద్ద ఆశయాలు కలవాళ్ళైనా బాగా నిశితంగా పరిశీలిస్తే వీళ్ళిద్దరి వాదనలూ ఒకటే అని నిరూపించవచ్చు. తెజావా బ్లాగు చూసిన మొదట్లో ఆశ్చర్యపోయి ఈయన వాదన ఎలా అసంబద్దమో తెలుపుతూ పే..ద్ద వాఖ్య రాశాను ఆయన ఒకానొక బ్లాగులో. కానీ అది తర్వాత కనిపించలేదు.
    అంభానాధ్: భారత మాత నాన్సెన్స్
    కెసీయార్: తెలుగు తల్లి లేనే లేదు

    అంభానాధ్: తెలుగు జాతి వేరు, భాష వేరు
    కెసీయార్: తెలంగాణా జాతి వేరు, భాష వేరు (దుర్గ అనే ఆమె అయితే తెలుగు తెలంగాణా భాష, ఆంద్రం ఆద్రుల భాష అని చెప్పడం మీకు తెలుసు)

    అంభానాధ్: మనకు పుష్కలంగా సహజవాయు, చమురు నిక్షేపాలను కృష్నాగోదావరి బేసిన్ నుంచి హిందీ వాళ్ళు దొంగిలిస్తున్నారు
    కెసీయార్: కృష్నా, గోదావరీ నీళ్ళను మనకున్న బొగ్గును ఆంద్రా వాళ్ళు అప్పనంగా తిని తాగేస్తున్నారు

    అంభానాధ్: తెలుగు వాళ్ళకు ప్రత్యేక దేశం కావాలి.
    కెసీయార్: తెలంగీణీయులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి.

    ఇలా ఎన్నో పోలికలు వీళ్ళ వాదనల్లో వున్నా వీరి అభిమతం పూర్తిగా విరుద్దమవడం ఆశ్చర్యం కదూ!

    –ప్రసాద్
    http://blog.charasala.com

Comments are closed.