Wesley Autrey అసలైన హీరో! “నిజానికిందులో విశేషమేమీ లేదు. ఆపదలో వున్నప్పుడు ఏ మనిషైనా చేయాల్సిందిదే!” అని అతి సామాన్యంగా చెప్తున్నాడీ అసమాన్యుడు.
వేగంగా వస్తున్న రైలు బారినుండి పట్టాల మీద అపస్మారకంగా పడ్డ యువకున్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. రెండు పట్టాల మధ్యా ఆ యువకున్ని ఒడిసిపట్టుకుని పడుకుండిపోయాడు. రైలు డ్రైవరు ఆఖరి నిమిషంలో పట్టాల మీదున్న వీరిని గమనించి బ్రేకు వేసినా రెండు పెట్టెలు వీరి మీదినుండీ వెళ్ళాయి. యువకుడు క్షేమంగా వైద్యుల సంరక్షణలో వున్నాడు. అప్పటికప్పుడు తన ప్రాణాల గురించి ఆలోచించక తెగించిన వాడు కదా అసలు హీరో! (చరసాల బ్లాగు నుంచి)
సంగీతప్రియుల కోసం సరికొత్త ఉపకరణం: ఇకమీదట “ఇది లేని సంగీతప్రియులు ఉండర”ట. (ఉపకరణాల మార్కెట్ నిపుణుల ఉవాచ) ముంబాయికి చెందిన మితాషి ఎడుటెయిన్‌మెంట్ లిమిటెడ్ విడుదల చేసిన MPL 1003. ఇది 1.8 అంగుళాల LCD తెరతో చిట్టిచేతుల్లో సైతం ఇట్టే ఇమిడిపోగలదు. దీన్ని చెవికి తగిలించుకుని, లేదా విడిగా కూడా వినవచ్చు. కంప్యూటరు నుంచి లేదా వేరే ప్లేయర్ నుంచి USB కేబుల్ ద్వారా పాటలు దీంట్లోకి తెచ్చిపెట్టుకోవచ్చు. MP3, WMA, WAV ఫార్మాట్లలోని పాటలను చక్కగా వినిపిస్తుంది. AVI మరియు MP4 వీడియో ఫైళ్ళను మాత్రం ఈ ఉపకరణంతో వచ్చే CD లోని సాఫ్ట్‌వేరు సాయంతో AMV లోకి మార్చుకుని తర్వాత దీంట్లోకి తెచ్చుకోవలసి ఉంటుంది. దీని వల్ల ఫైల్ సైజు 40% వరకు తగ్గుతుందట. దీంట్లోనే 20 FM ఛానెళ్ళు, శబ్దాలను రికార్డు చేసుకుని వినే సదుపాయం, 1GB మెమరీ ఉన్నాయి. అంతా కలిపి 4,390/- కే.
కలకలం సృష్టించిన కపోతం: వెయ్యి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మ ద్వారా చెప్పవచ్చు. ఆ బొమ్మలే అబద్ధాలు ఆడుతున్నట్లు అనిపిస్తే? పోయిన్నెల్లో ఒక పావురబ్బొమ్మ మీద అలాంటి వివాదమే జరిగింది. ప్రామాణికతే ప్రాణాధారంగా భావించే పత్రిక హిందూలో వచ్చిన ఒక పావురం బొమ్మపై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలను నిగ్గుతేల్చడానికి వాళ్ళా ఫోటోను వందరెట్లు పెద్దదిచేసి చూశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
*******************
వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీలో ప్రవేశాల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలు ఇంటర్వ్యూలు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పిల్లలు, తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు పాఠశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. నర్సరీ ప్రవేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది.
*******************
రష్యాలోని వోల్గాలో జరిగిన తవ్వకాల్లో పురాతన విష్ణు విగ్రహమొకటి బయటపడింది. —ఈనాడు
కబుర్లు సరదాగాను,విజ్నానదాయకము గాను వున్నాయి.పోద్దు ఇలానే మ౦చి వ్యాసాలతో అవిరామముగా సాగిపోవాలని కోరుకు౦టున్నాను.
చైనా కుర్రాడికి ఇండియా స్వర్గ ప్రాప్తిరస్తు. కనీసం అక్కడైనా …
పిల్లికి క్రెడిట్ కార్డు పంపిన వైనం చదవగానే ఆపుకోలేనంతగా నవ్వొచ్చింది. కబుర్లు చాలా బాగున్నాయి.