కబుర్లు

Wesley Autrey అసలైన హీరో! “నిజానికిందులో విశేషమేమీ లేదు. ఆపదలో వున్నప్పుడు ఏ మనిషైనా చేయాల్సిందిదే!” అని అతి సామాన్యంగా చెప్తున్నాడీ అసమాన్యుడు.
వేగంగా వస్తున్న రైలు బారినుండి పట్టాల మీద అపస్మారకంగా పడ్డ యువకున్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. రెండు పట్టాల మధ్యా ఆ యువకున్ని ఒడిసిపట్టుకుని పడుకుండిపోయాడు. రైలు డ్రైవరు ఆఖరి నిమిషంలో పట్టాల మీదున్న వీరిని గమనించి బ్రేకు వేసినా రెండు పెట్టెలు వీరి మీదినుండీ వెళ్ళాయి. యువకుడు క్షేమంగా వైద్యుల సంరక్షణలో వున్నాడు. అప్పటికప్పుడు తన ప్రాణాల గురించి ఆలోచించక తెగించిన వాడు కదా అసలు హీరో! (చరసాల బ్లాగు నుంచి)

సంగీతప్రియుల కోసం సరికొత్త ఉపకరణం: ఇకమీదట “ఇది లేని సంగీతప్రియులు ఉండర”ట. (ఉపకరణాల మార్కెట్ నిపుణుల ఉవాచ) ముంబాయికి చెందిన మితాషి ఎడుటెయిన్‌మెంట్ లిమిటెడ్ విడుదల చేసిన MPL 1003. ఇది 1.8 అంగుళాల LCD తెరతో చిట్టిచేతుల్లో సైతం ఇట్టే ఇమిడిపోగలదు. దీన్ని చెవికి తగిలించుకుని, లేదా విడిగా కూడా వినవచ్చు. కంప్యూటరు నుంచి లేదా వేరే ప్లేయర్ నుంచి USB కేబుల్ ద్వారా పాటలు దీంట్లోకి తెచ్చిపెట్టుకోవచ్చు. MP3, WMA, WAV ఫార్మాట్లలోని పాటలను చక్కగా వినిపిస్తుంది. AVI మరియు MP4 వీడియో ఫైళ్ళను మాత్రం ఈ ఉపకరణంతో వచ్చే CD లోని సాఫ్ట్‌వేరు సాయంతో AMV లోకి మార్చుకుని తర్వాత దీంట్లోకి తెచ్చుకోవలసి ఉంటుంది. దీని వల్ల ఫైల్ సైజు 40% వరకు తగ్గుతుందట. దీంట్లోనే 20 FM ఛానెళ్ళు, శబ్దాలను రికార్డు చేసుకుని వినే సదుపాయం, 1GB మెమరీ ఉన్నాయి. అంతా కలిపి 4,390/- కే.

కలకలం సృష్టించిన కపోతం: వెయ్యి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మ ద్వారా చెప్పవచ్చు. ఆ బొమ్మలే అబద్ధాలు ఆడుతున్నట్లు అనిపిస్తే? పోయిన్నెల్లో ఒక పావురబ్బొమ్మ మీద అలాంటి వివాదమే జరిగింది. ప్రామాణికతే ప్రాణాధారంగా భావించే పత్రిక హిందూలో వచ్చిన ఒక పావురం బొమ్మపై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలను నిగ్గుతేల్చడానికి వాళ్ళా ఫోటోను వందరెట్లు పెద్దదిచేసి చూశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

*******************
“మరో ప్రపంచం! మరో ప్రపంచం పిలిచింది!!” అన్నడు శ్రీశ్రీ. ఆ మరో ప్రపంచం పైనుంచి రాళ్ళేసి పిలుస్తుందేమిటి చెప్మా? అని ఆశ్చర్యపడ్డారు న్యూ జెర్సీ వాసులు. తీరా చూస్తే అదొక గ్రహశకలమని తేలింది.
గత మంగళవారం ఎక్కణ్ణుంచో ఒక పెద్ద లోహపు ముద్ద న్యూజెర్సీలోని ఒక ఇంటికప్పును పగలగొట్టుకుని ఇంట్లో వచ్చి పడింది. అలాంటి వస్తువునింతకుముందెక్కడా చూసి ఉండకపోవడంతో దాన్ని పరీక్షలకు పంపితే తేలింది అదొక గ్రహశకలమని. ఇలాంటి గ్రహశకలాలు తరచూ సముద్రాల్లోనూ, భూమ్మీదా పడుతూనే ఉంటాయని, ఇళ్ళమీద పడడం అరుదని ఖగోళశాస్త్రవేత్తలు తెలిపారు.
*******************
డైటింగు పేరుతో కడుపు మాడ్చుకుని, దారిలో కళ్ళుతేలేసేవాళ్ళే న్యూయార్క్ లో విమానాలు తరచూ ఆలస్యం కావడానికి అతిప్రధాన కారణమట – (ట్రాక్, సిగ్నల్ సమస్యల తర్వాత).

*******************

ప్రపంచంలో మొట్టమొదట యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిగిందో చెప్పలేం గానీ సిరియా దేశంలో 6,000 యేళ్ళ క్రిందట బంకమట్టి ముద్దలతో కొట్టుకున్న ఆధారాలు దొరికాయి.
*******************
బ్యాంకులు జనాల వెంటపడి వేధిస్తున్నాయి అప్పులిస్తాం, అప్పు బిళ్ళలిస్తాం (Credit cards) అంటూ. ఆస్ట్రేలియాలో ఒక బ్యాంకువారు ఆత్రమెక్కువై ఒక పిల్లికి క్రెడిట్ కార్డిచ్చేశారట.
*******************
నగరంలో ఒకచోటి నుంచి ఇంకొకచోటికి వెళ్ళేటప్పుడు అతి తక్కువ కాలుష్యకారకమైనదారిలో వెళ్ళాలని ఎవరికుండదు చెప్పండి? స్వీడన్ కు చెందిన ఎవా ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త సరగ్గా అలాంటి దారిని సూచించే పరికరాన్నే రూపొందించారు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అది దారిలో ఉండే ట్రాఫిక్ సిగ్నళ్ళు, స్పీడ్ లిమిట్లు, ట్రాఫిక్ జామయ్యే అవకాశాలను గమనించి ఉత్తమమైన మార్గాన్ని సూచిస్తుంది. ఇలాంటి దారుల్లో వెళ్ళడం వల్ల ఇంధనం ఖర్చు 8.2% తగ్గుతుందట.
*******************
ఇంటర్వ్యూలు లేకుండానే నర్సరీలో ప్రవేశాలు: సుప్రీం
వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీలో ప్రవేశాల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలు ఇంటర్వ్యూలు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పిల్లలు, తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు పాఠశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. నర్సరీ ప్రవేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది.
*******************
ఇంటర్నెట్ పరిచయాలు చిన్నపిల్లలు, టీనేజర్ల విషయంలో ప్రమాదాలకు దారితీయొచ్చన్నది అందరికీ తెలిసిందే! ఐతే చైనాలో పదిహేడేళ్ళ కుర్రవాడొకడు తనకు ఇంటర్నెట్లో పరిచయమైన ఒక మహిళను ప్రత్యక్షంగా చూసి ఆమె తానూహించినంత అందంగా లేకపోయేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట.

*******************

రష్యాలోని వోల్గాలో జరిగిన తవ్వకాల్లో పురాతన విష్ణు విగ్రహమొకటి బయటపడింది. —ఈనాడు

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to కబుర్లు

  1. radhika says:

    కబుర్లు సరదాగాను,విజ్నానదాయకము గాను వున్నాయి.పోద్దు ఇలానే మ౦చి వ్యాసాలతో అవిరామముగా సాగిపోవాలని కోరుకు౦టున్నాను.

  2. చైనా కుర్రాడికి ఇండియా స్వర్గ ప్రాప్తిరస్తు. కనీసం అక్కడైనా …

  3. మురళీ కృష్ణ కూనపరెడ్డి says:

    పిల్లికి క్రెడిట్ కార్డు పంపిన వైనం చదవగానే ఆపుకోలేనంతగా నవ్వొచ్చింది. కబుర్లు చాలా బాగున్నాయి.

Comments are closed.