కబుర్లు

దైవభక్తి గలవాళ్ళు మృదుస్వభావులుగా ఉంటారనే నమ్మకంతో థాయ్‌లాండు ప్రభుత్వం ప్రార్థనాలయాలకు తరచుగా వెళ్ళే చిన్నపిల్లలకు ప్రోత్సాహకంగా 1000 బాత్ లు (1250/-) నగదు బహుమతి ఇస్తోంది.

ధ్యాన౦తో ఏకాగ్రత, మనశ్శా౦తి సిద్ధిస్తాయని మనకు తెలుసు. కాని విశాఖ ప్రజలు ఈ ధ్యాన౦ ద్వారానే ప్రభుత్వ౦పై తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ప్రజల సమస్యలను పరిష్కరి౦చట౦లో ప్రభుత్వ౦ నిర్లక్ష్య౦ చూపుతోందని ఆరోపిస్తూ సర్వోదయ మ౦డలి మార్చి 13న విశాఖపట్న౦లో ఇరవైనాలుగు గ౦టల పాటు ధ్యాన సత్యాగ్రాహాన్ని నిర్వహించింది. నగర పాలక స౦స్థ కార్యాలయ౦ ఎదుట ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ౦లో విద్యాధికులు ఎక్కువ స౦ఖ్యలో పాల్గొనడ౦ గమనార్హ౦. హి౦స, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, నిరాదరణకు గురవుతున్న స౦స్కృతి, రైతుల ఆత్మహత్యలు, ల౦చగొ౦డితన౦ వ౦టివి పెరిగిపోతున్నాయని ప్రజల దృష్టికి తీసుకువచ్చే౦దుకే ఈ కార్యక్రమ౦ చేపట్టినట్లు సత్యాగ్రహ నిర్వాహకులు తెలిపారు.

గుజరాత్ పోలీసులు ఇకమీదట అహమ్మదాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారు రూపొందించిన సుగంధభరితమైన, చీకట్లో సైతం మిలమిల మెరిసే యూనిఫార్మ్ ను ధరించబోతున్నారు. రోజంతా విధినిర్వహణలో భాగంగా ఎండలో, వానలో, దుమ్ములో తిరిగి తిరిగివచ్చే పోలీసుల దుస్తులు నలిగిపోయి, దుమ్ముకొట్టుకుపోయి, చెమటవాసనతో ఉంటాయి. అలా ఉండకూడదనే రాష్ట్రప్రభుత్వం ఈ ఆలోచన చేసిందట.

“ఈ పోలీసుల వేధింపులు పడలేకున్నాం. ఆ ఇచ్చేదేదో ప్రభుత్వానికే ఇస్తాం. మాకీ వేధింపులు తప్పించండి.” అన్న వ్యభిచారుల వేడుకోలును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించింది. మీరు చేస్తున్నది చట్టవ్యతిరేకమైన పని కాబట్టి పన్నువెయ్యలేమని
చెప్పింది.

ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్సులో హోటళ్ళు, బార్లు కస్టమర్లకు కండోములను అందుబాటులో ఉంచకపోతే 650 డాలర్లు జరిమానా విధిస్తారట.

యూఎస్ స్టేట్ ఆఫ్ నేవాడా అసె౦బ్లీ సభలు ఈ మార్చి ప౦తొమ్మిదిన హి౦దూ గీతంతో ప్రారంభమయ్యాయి. అమెరికా రాజకీయాల్లో భారత్ కు చె౦దిన వారి స౦ఖ్య రోజురోజుకూ పెరుగుతు౦డడ౦తో 1864లో ప్రార౦భమైన ఈ సభలో మొట్టమొదటి సారిగా హి౦దూ గీతాన్ని ఆలపి౦చారు.

రామభక్తి మొదలైంది దక్షిణభారతదేశం లోనా? ఔనంటున్నారు సువీరా జైస్వాల్ అనే చరిత్రకారిణి. రామాయణాన్ని ఆర్య-ద్రవిడపోరాటంగా కొందరు పేర్కొంటుంటే ఆ ద్రవిడుల గడ్డగా భావించబడే దక్షిణభారతదేశంలోనే రామభక్తి పురుడుపోసుకోవడం విచిత్రం కాదా? (The Hindu మార్చి 12)

భారత సాహిత్యానికి చేసిన కృషికి గానూ కాశ్మీరీ కవి రెహ్మాన్ రాహికి ప్రతిష్టాత్మక 2004-05 స౦వత్సరానికి గాను జ్ఞాన్ పీఠ్ అవార్డు దక్కి౦ది.

ఇల్లు ఇరకటం-ఇల్లాలు మరకటం అని సామెత. కానీ ఇల్లు ఇరకాటమైనందుకే తల్లి కాలసర్పమైంది ఒక రష్యన్ యువకుడి పాలిట. మాస్కోలోని ఒక సింగిల్ రూం అపార్ట్‌మెంట్ లో తమ తమ ‘పార్టనర్స్’ తో నివసిస్తున్నారు 42 ఏళ్ళ తల్లి, 17 ఏళ్ళ ఆమె కొడుకు. ఆ రెండు జంటలూ ముందునుంచే గొడవలు పడుతూ ఉండేవారట. ఆ కొడుకు గర్ల్ ఫ్రెండ్ గర్భవతయ్యాక గొడవలు మరీ ఎక్కువైపోయి ఆ తల్లి ఏకంగా తన కొడుకును చంపెయ్యమని ఒక మాజీ నేరస్థుడిని పురమాయించగా ఆ విషయం అతడే పోలీసులకు చెప్పి ఆమెను అరెస్టు చేయించాడు!

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to కబుర్లు

  1. Nagaraju Pappu says:

    చాలకాలం క్రితం ఈనాడులో టూకీగా శీర్షిక చాలా ఆశక్తికరంగా ఉండేది – ఈ మధ్య రావటంలేదు. ఆ లోటు భర్తీ చేసినందుకు దన్యవాదాలు.

  2. ప్రభుత్వం వ్యభిచారాన్ని ఒక వృత్తిగా గుర్తించి చట్టం పరిధిలోకి తెస్తే వేశ్యలకు అనారోగ్యం, పోలీసువేధింపులు, నిర్బంధం మరియు ఇతర ఒత్తిళ్ల నుండి రక్షణ కల్పించి వాళ్లను మనుషులుగా గుర్తించినట్లవుతుంది. దీనివల్ల చీకటి వ్యాపారాలు, దళారీలు, దగాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

Comments are closed.