ఎడిటింగ్ – ఒక ప్రస్తావన

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ఉపోద్ఘాతం

సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ ఎన్నోసార్లు, ఎన్నో ప్రదేశాల్లో ప్రదర్శించే అవకాశం కలుగచేసింది ఈ ప్రక్రియ. కాకపోతే ఒక సారి కెమెరా రికార్డు చేయడం మొదలుపెట్టాక అవిఛ్ఛిన్నంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు రికార్డు చేయడం కుదరదు. ఆరోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఒకే సారి పది నిమిషాలకంటే ఎక్కువ నిడివి కల ఘట్టాన్ని రికార్డు చేయడం కుదరదు. అందుకు కారణం ఒక పిల్ము రీలు కేవలం పదినిమిషాల నిడివి కలిగి వుండడమే. మొదట్లో ఇది ఒక అంతరాయం అనిపించినప్పటికీ రాను రాను ఈ అడ్డంకే సినిమా అనే ప్రక్రియ ఒక కళ గా రూపొందడానికి దోహదం చేసింది. పదినిమిషాలకు మించిన ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రించడం సాధ్యం కాదు కనుక రెండు లేదా మూడు దఫాలుగా చిత్రీకరించి, ఆ రీళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా అనుసంధించి, నిరంతరంగా ప్రదర్శించడం ద్వారా పైన పేర్కొన్న సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

అయితే ఈ ప్రక్రియలో వారు సినిమాలోని ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రీకరించక్కర్లేదని, ఒక్కోఘట్టాన్ని వివిధ పాత్రల దృష్టికోణంలో చిత్రీకరించి వాటిని ఒక పధ్ధతి ప్రకారం అనుసంధానించడం ద్వారా ప్రేక్షకుల్లో కొత్త అనుభూతలను కలుగచేయొచ్చని తెలుసుకున్నారు. మరో విశేషమేమిటంటే రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఘట్టాలను ఒక పధ్ధతి ప్రకారం మిళాయించడం ద్వారా ప్రేక్షకుల్లో ఉత్కంఠతను కలుగచేయొచ్చనీ తెలుసుకున్నారు. ఈ ప్రక్రియనే ఎడిటింగ్ అని పేర్కొన్నారు.


ఉదాహరణ:

ఒక ప్రదేశంలో ఇద్దరు దొంగలు దొంగతనం చేసే ఘట్టం జరుగుతుందనుకోండి.కానీ వారు దొంగతనం చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు వీరికోసం పోలీసు స్టేషన్ నుంచి జీపులో బయల్దేరడం మరో ఘట్టం గా ఊహించుకుంటే. ఎడిటింగ్ అనే ప్రక్రియ ద్వారా దొంగలు ఇంట్లోకి జొరబడడం, ఆ తర్వాత పోలీసులు హడావుడిగా పోలీసుస్టేషన్ నుంచి బయటకు రావడం, దొంగలు చీకట్లో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోని బీరువా దగ్గరగా నడవడం, పోలీసు జీపు వేగంగా రోడ్డు పై ప్రయాణిస్తుండడం, దొంగలు బీరువా తాళం తెరవడంలో సతమతమవడం, వేగంగా వెళ్తున్న పోలీసు జీపుకి ఒక గొర్రెల మంద అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడం, దొంగలు బీరువా తాళం తెరవడం, పోలీసులు దొంగతనం జరిగే ప్రదేశానికి చేరుకోవడం ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా రెండు వేర్వేరు సన్నివేశాలను సమీకరించి ఏకీకరించడం అనే భావన కేవలం ఎడిటింగ్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ఎడిటింగ్ అనేది సినిమా అనే ప్రక్రియకు అత్యంత ఉపయోగకరమైనదీ మరియు ఆసక్తి కరమైనదీ కూడా.

గతంలో పొద్దులో ప్రచురించిన మరో వ్యాసంలో ప్రస్తావించబడిన ఒక ఉదాహరణ ద్వారా మరో సారి ఇక్కడ ప్రస్తావించడం ద్వారా ఎడిటింగ్ యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవచ్చు.

“సినిమాలో ఎడిటింగ్ యొక్క పాత్రను తెలుసుకోవాలంటే Lev Kuleshov చేసిన ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఒక పాత్రలో వుంచిన వంటకాన్ని చూపించి ఆ తర్వాత ఒక వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి ఆకలి గొన్న వాడిగా బాగా నటించాడని చెప్పారట. ఆ తర్వాత ఒక అందమైన అమాయి చిత్రం చూపించి ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి కాంక్ష కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. అలాగే ఒక చనిపోయిన వృధ్ధ స్త్రీ శవపేటిక చూపించి ఆ తర్వాత ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి శోకం కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. నిజానికి పైన ఉదహరించిన మూడు దృశ్యాలలోనూ చూపిన వ్యక్తి మొహంలో ఎటువంటి హావభావాలు లేనప్పటికీ అంతకు ముందు చూసిన దృశ్యానితో అనుసంధానించి చూడబట్టే ప్రేక్షకులు ఒకే దృశ్యాన్ని మూడు రకాలుగా అనువదించుకునారని Lev Kuleshov తన ప్రయోగం ద్వారా నిర్ధారించారు.”

ఎడిటింగ్ లోని వివిధ అంశాలు:

ఎంపిక:

ఒక ఎడిటర్ ముఖ్యంగా చేసే పనుల్లో ఒకటి ఎంపిక. ఒక సన్నివేశాన్ని వేర్వేరు కోణాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాల్లో, చిత్రీకరిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక సన్నివేశాన్ని వేర్వేరు సార్లు, టేక్ ల రూపంలో కూడా చిత్రీకరించడం కూడా జరుగుతుంది. ఒక సన్నివేశంలో ఒక నటుడు సరిగ్గా నటించకపోవచ్చు, లేదా దర్శకుడు అనుకున్నట్టుగా లైటింగ్ కుదరకపోవచ్చు, లేదా అదే సన్నివేశాన్ని మరో రకంగా చిత్రీకరించొచ్చనే భావన దర్శకునికి కలుగ వచ్చు. పైన పేర్కొన్న కారణాలచేత ఒకే సన్నివేశం వేర్వేరు సార్లు (ఒక్కోసారి నలభై, యాభై సార్లు కూడా) చిత్రీకరించాల్సి రావొచ్చు. అయితే వీటన్నింటిలో మనకి సినిమాలో కనిపించేవి కొన్ని మాత్రమే. అయితే వాటన్నింటిలో దేన్ని సినిమాలో చేర్చాలో, ఏది చెత్తబుట్టలోకి చేరాలో మాత్రం ఎంపిక చేసేది మాత్రం ఎడిటర్ మాత్రమే. వినడానికి ఈ ఎంపిక సులభంగానే అనిపించినా ఒక్కోసారి ఇది అత్యంత కష్టంతో కూడుకున్న పని.

ఉదాహరణకు Apocalypse Now అనే సినిమా కోసం రికార్డు చేసిన సినిమా రీలు నిడివి దాదాపు వంద గంటల పైనే. కానీ ఆ వంద గంటల నుంచి మనం తెరపై చూసేది కేవలం మూడు గంటలు మాత్రమే. అంతటి నిడివి గలిగిన footage నుంచి మూడు గంటల సినిమాని తయారు చేయడంలో ఎడిటర్ Walter Murch పాత్ర ఎంతో వుందని ఆ చిత్ర దర్శకుడు Francis Ford Coppolla నే స్వయంగా ఒప్పుకుంటారు. అన్ని సినిమాల్లో ఇలాంటి పరిస్థితి వుండకపోవచ్చు. కానీ ఎలాంటి సినిమాకి ఐనా ఎంత లేదన్నా కనీసం రెండు లేదా మూడు టేక్‌ల నుంచి ఒక దాన్ని ఎన్నుకోవడమనే బాధ్యత ఎడిటర్ మీదే వుంటుంది. అయితే ఆ ఎంపిక కేవలం నటీనటుల నటన మీదే ఆధారపడివుండదు. ఎన్నుకున్న షాట్ అంతకుముందు షాట్ లోని లైటింగ్‌కి సరిపోయేలా వుండాలి. అలాగే అంతకుముందు షాట్, మరియు తర్వాత వచ్చే షాట్ లతో ఎన్నుకున్న షాట్ జ్యామితి నియమాలకు అనుగుణంగా కూడా వుండాలి.

ఉదాహరణకు మొదటి షాట్లో ఇద్దరు దొంగలు పారిపోతున్నట్టుగా తెర ఎడమవైపునుంచి కుడివైపుగా పరిగెడ్తున్నట్టుగా చూపించి, ఆ తర్వాతి సీన్లో పోలీసులు వీరిని వెంటాడుతూ తెర కుడివైపుగా నుంచి ఎడమవైపుగా పరిగెట్టడం చూపించడం చాలా తప్పు. అలా చేస్తే దొంగలు, పోలీసులు ఎదెరెదురుగా పరిగెడ్తున్నట్టుగా ప్రేక్షకుల్లో భావన కలుగుతుంది. అలాగే ఒక షాట్ ని ఎంపిక చేసేటప్పుడు ఎడిటర్ దృష్టిలో వుంచుకునే మరికొన్ని అంశాలున్నాయి. అవే పొందిక, అవిఛ్ఛిన్నిత, మరియు లయ.

పొందిక :

సినిమా అనే ప్రక్రియ ఉధ్బవించిన రోజుల్ల్లో ఒక సన్నివేశంలో ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు మరో పాత్రవైపు కెమెరా మళ్ళిస్తే సినిమా హాల్లోని ప్రేక్షకులు గొడవ చేసేవారని విన్నాను. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ప్రేక్షకులు అలా చేయడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ఏ పాత్రైతే సంభాషిస్తుందో ఆ పాత్ర కనిపించకుండా మాటలు వినిపించడం అప్పట్లో కొత్త కావడమే అందుకు కారణం. కానీ రాను రాను సినిమా చూడ్డానికి అలవాటు పడిన ప్రేక్షకులు అలాంటి వాటిని జీర్ణించుకోవడం సాధ్యమైంది. ఒక వ్యక్తి చేసే సంభాషణే కాకుండా అది వినే అవతలి పాత్ర స్పందన కూడా అవసరమైనప్పుడు పైన చెప్పినట్టు సన్నివేశాన్ని చిత్రీకరించినా ఇప్పుడు ప్రేక్షకులు అర్థం చెసుకోగలరు. కానీ ఆ సన్నివేశంలో లేని పాత్ర అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైతే మాత్రం ప్రేక్షకులు తికమక పడడం జరిగే అవకాశం వుంది. అందుకే ఎడిటర్ తను ఎన్నుకునే షాట్లు ఒకదానితో ఒకటి పొందికగా అమర్చడం జరుగుతుంది.

అవిఛ్చిన్నిత :

పాత రోజుల్లో వచ్చిన చాలా సినిమాల్లో ప్రస్తుతాన్నుంచి గతంలోకి వెళ్ళే flashback సన్నివేశాల్లో రింగులు రింగులు తిరుగుతూ ఒక సన్నివేశాన్నుండి మరో సన్నివేశానికి వెళ్ళడం చూసేవుంటారు. అలా చేయడానికి ముఖ్య కారణం ప్రేక్షకుల మదిలో స్థాన భ్రంశం అకస్మాత్తుగా కలిగినట్టుగా కాకుండా నెమ్మదిగా ఆ విషయాన్ని తెలియపర్చడం కోసమే. అంటే అక్కడ పాత్రలు, మరియు ప్రదేశంలో జరిగిన పరివర్తన అకస్మాత్తుగా కాకుండా అవిఛ్ఛిన్నంగా జరుగుతుందన్న మాట. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఆ ప్రక్రియ దాదాపుగా అంతమైనప్పటికీ ఈ పరివర్తన మాత్రం కొత్త పధ్ధతుల్లో ప్రేక్షకులకు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు ఒక పాత్ర యొక్క కంట్లోకి zoom చెయ్యడం ద్వారానో, లేదా వర్తమానంలోని సన్నివేశంలో ఆకాశం వైపుకి కెమెరా మళ్ళించి తిరిగి గతంలో జరిగే సన్నివేశం ఆకాశం వైపునుంచి కెమెరాను నేలకు మళ్ళించడం ద్వారానో సమయం మరియు స్థలాలలో జరిగిన మార్పుని ప్రేక్షకులలో భ్రమింపచేస్తారు. వాడిన ప్రక్రియ ఏదైనప్పటికీ అందులోని ఆశయం మాత్రం ఒక్కటే: ప్రేక్షకులలో అవిఛ్ఛిన్నమైన అనుభూతిని కలుగచేయడమే!

లయ :

సినిమాలు రకరకాలు. కొన్ని నేర ప్రధానంగానూ, కొన్ని హాస్య ప్రధానంగానూ, కొన్ని ప్రేమ ప్రధానంగానూ నడుస్తాయి. అయితే అన్ని రకాల సినిమాలనూ ఒకేలాగా ఎడిట్ చేయడం కుదరదు. జైలు నుంచి పారిపోయిన నేరస్థుని పట్టుకునే కథ ప్రధానంగా నడిచే సినిమా వేగంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అలాగే ఒక కుటుంబంలో జరిగే కలతల ఆధారంగా జరిగే కథలో నడక నెమ్మదిగా వుండాలని కోరుకుంటారు ప్రేక్షకులు. గత వందేళ్ళకు పైగా వచ్చిన సినిమాలను చూడగా ఏర్పడిన collective consciousness అది. అందుకే ఒక్కో రకం సినిమాలో ఒక్కో రకమైన వేగం వుండేలా ఎడిటర్ భ్రమ కలిగిస్తాడు. నేరస్తుడిని వెంటాడి పట్టుకునే సినిమాలో చివరి సీను ఊహించుకుందాం. చాలా ఏళ్ళుగా దొరకని నేరస్తుడిని ఎలాగో వెంటాడి బాగా ఎత్తైన ఒక కట్టడం మీదకు చేరుకుంటారు పోలీసులు. అక్కడ నేరస్తుడికి పారిపోయే మార్గమే లేదు. ఆ ఎత్తైన కట్టడం నుంచి దూకడమా, లేదా పోలీసులకు దొరకడమా? అలాగే పోలీసులకూ అతన్ని ప్రాణాలతో పట్టుకుంటేనే ఉపయోగం. ఇలాంటి సన్నివేశం బాగా ఎడిట్ చేస్తే ప్రేక్షకుల్లో అత్యంత ఉత్కంఠతను కలుగ చేయవచ్చు.ఉదాహరణకు ఈ కింది షాట్లు చూడండి:

1) పోలీసులనుంచి పారిపోయి అలసిపోయిన నేరస్థుడు చివరి అంతస్థు చేరి పిట్టగోడ మీది నుంచి క్రిందికి చూడడం.

2) అప్పుడే చివరి అంతస్తుకు చేరుకున్న పోలీసులు.

3) పోలీసులను చూసి కలవరపడ్డ నేరస్తుని రియాక్షన్ (క్లోజప్)

4) అతని రియాక్షన్ చూసి “దొరికావు రా, ఇప్పుడెక్కడికి పోతావు” అన్నట్టుగా ఇన్స్పెక్టర్ మొహంలో నవ్వు (క్లోజప్)

5) ఎత్తైన కట్టడం నుంచి క్రిందికి చూస్తున్న నేరస్థుడు.

6) నేరస్థుడు క్రిందికి చూసినట్టుగా అతని దృష్టి కోణం లోని ఒక షాట్.

7) మళ్ళీ ఇన్స్పెక్టర్ నవ్వు.

8 ) ఇప్పుడు నవ్వడం నేరస్థుని వంతు.

9) అతని నవ్వుకు కారణం అర్థం కాని ఇన్స్పెక్టర్ మొహంలో మార్పు.

10) ఏం చెయ్యాలో అర్థం కాక తల గోక్కుంటున్న కానిస్టేబుల్.

11) అప్పుడే అటుగా కావ్ కావ్ మంటూ ఎగురుతూ వెళ్ళిన ఒక కాకి

12) లాంగ్ షాట్ లో అందరూ కనిపించేలా ఒక నిశ్శబ్దం

పైన పేర్కొన్న 12 షాట్లను నిమిషం సేపట్లో చకచకా వచ్చేలా ఏర్పరిస్తే కథా గమనం వేగం అందుకుంటుంది.

అలాగే సంసారంలోని బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని ఒక పొడవాటి కట్టడం చేరుకున్న ఒక పాత్ర, అతన్నక్కడి నుంచి దూకకుండా ఆపే మరో పాత్ర మధ్య ఈ రకమైన నడక అవసరం లేదు. ఇక్కడ ప్రేక్షకుల్లో కలిగించాల్సింది ఉత్కంఠత కాదు, సానుభూతి, జాలి లాంటి భావాలు. అలాంటి అభిప్రాయం కలిగేలా ఈ సన్నివేశాన్ని వేగం తగ్గించి ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కో రకమైన సినిమాకు ఒక్కో రకమైన లయ ఎడిటింగ్ ద్వారా కలుగచేయొచ్చు. లయతో పాటు సినిమాలోని వేగాన్ని పెంచడానికీ తగ్గించడానికీ ఎడిటర్ కి ఉపయోగపడే మరో సాధనం సమయాధిపత్యం.

సమయాధిపత్యం :

తన ప్రేయసి కోసం ట్యాంక్ బండ్ పై ఎదురు చూస్తుంటాడు రాము. సీత ఎంతకీ రాదు. నాలుగు గంటలు కాస్త ఐదవుతుంది. ఐదు కాస్తా ఆరవుతుంది. గంటలు గంటలు గడుస్తూనే వుంటాయి కానీ ఆమె జాడే వుండదు. అతనలా ఎదురుచూస్తూనే వుంటాడు. ఇదే సీను సినిమాలో చిత్రీకరించాలనుకుంటే ప్రేక్షకులు రాము లాగే మూడు నాలుగు గంటలు స్క్రీన్ నే చూస్తూ వుండలేరు కనుక, రాము అక్కడ అంత సేపు ఎదురు చూసినట్టుగా భ్రమింపచేస్తారు. దర్శకుడు ఈ సీను చిత్రీకరించేటప్పుడు కూడా గంటల గంటలు ఈ సీను చిత్రీకరించడు. ఇక్కడ కేవలం ఎడిటింగ్ ద్వారా సమయాన్ని కుదించడమా, లేదా పొడిగించడమా అనేది జరుగుతుంది. ఉదాహరణకు పైన సీన్లో మొదట ట్యాంకు బండు దగ్గర అసహనంగా నిల్చున్న రాముని చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతున్న గడియారాన్ని ఒక దాన్ని చూపించి మరో సారి అసహనంగా నడుస్తున్న రాముని చూపించి, మళ్ళీ గడియారం చూపించి, కట్ చేసి చీకట్లో లైటు కింద అసహనంగా వాచీ చూసుకుంటున్న రాముని చూపించినప్పుడు చాలా గంటలు గడిచిన భావం ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే ఒక వ్యక్తి హత్య చెయ్యడానికి ఒక గదిలో చీకట్లో నక్కి వున్న హంతకునికి కాలం ఎంత నెమ్మదిగా గడుస్తుందో చూపించడానికి అలారం వాచీలో సెకండ్ల ముళ్ళు టిక్ టిక్ మంటూ కదలడం ఒక ఐదు సెకండ్ల పాటు చూపించినా చాలు సమయం నెమ్మదిగా కదుల్తుందని ప్రేక్షకులకి అర్థమవుతుంది. ఈ విధంగా ఎడిటర్ సమయాధిపత్యం సాధించి ప్రేక్షకులలో కలిగించాల్సిన భావాలను కలుగచేయడంలో ఉపయోగపడతాడు.

కొత్తపధ్ధతులు :

ఎడిటింగ్ అనే ప్రక్రియలో రష్యన్ దర్శకులు, మరియు ఎడిటర్ లు కనుగొన్న కొత్త పధ్ధతులు వేరొకరెవ్వరూ చేయలేదు. ఉదాహరణకు మోంటేజ్ అనే ఎడిటింగ్ ప్రక్రియ రష్యన్ లు కనుగొన్నదే. ఈ ప్రక్రియలో ఒక దానితో సంబంధం లేని కొన్ని షాట్లను వరుసగా అమర్చి చూపించడం ద్వారా వాటన్నింటిలో లేని కొత్త అర్థాన్ని ప్రేక్షకులు గ్రహించగలిగేలా చెయ్యడం ఈ ప్రక్రియ యొక్క గొప్పతనం. ఉదాహరణకు మన పాత సినిమాల్లో ఏదైనా బీభత్సమైన సన్నివేశం జరిగినప్పుడు, ఎగురుతుతున్న పక్షులు ఆగి పోవడం, ఎగిసే అలలు నిలిచిపోవడం లాంటి దృశ్యాలు ఒక దాని తర్వాత ఒకటి చూపించడం జరిగేది. ఆ చిత్రాలకూ, జరిగే సన్నివేశానికీ సంబంధం లేకపోయినప్పటికీ ఆ చిత్రాల ద్వారా జరిగిన విధ్వంసానికి లోకం క్షణం పాటు ఆగిపోయిందనే భావన మనలో కలుగుజేస్తుంది.

ఇప్పటివరకూ ఎడిటింగ్ గురించి చెప్పుకున్న అంశాలన్నీ శాస్త్రీయంగా అవలంబిస్తున్న పధ్ధతులే. కానీ ఫ్రాన్సు దేశంలో ఎగసిన నవతరంగపు సినీ ఉద్యమం కారణం ఉధ్బవించిన ఒక ఎడిటింగ్ ప్రక్రియ సినిమా అనే ప్రక్రియనే కొత్త మలుపు తిప్పింది. అదే జంప్ కట్. ఈ ప్రక్రియ లేనంతవరకూ ఎడిటర్ ప్రేక్షకులలో అవిఛ్ఛిన్నతా భావాన్ని కలుగచేయడమే బాధ్యతగా భావించినప్పటికీ ఈ జంప్ కట్ అనే ప్రక్రియ ప్రేక్షకుల ఎప్పటికప్పుడు అచ్చెరువు చెందేలా వుపయోగించడం మొదలయ్యింది. మొదట్లో ఈ ప్రక్రియ నాణ్యవంతంగా ఉపయోగించినప్పటికీ రాను, రాను అర్థం పర్థం లేకుండా ఉపయోగిస్తూ పోవడంతో చాలా సార్లు దుర్వినియోగం కూడా అవుతోంది. ఈ ప్రక్రియ గురించి వివరించాలంటే మరో వ్యాసమే అవుతుంది. మరో సారి ఈ ప్రక్రియ గురించి తీరిగ్గ తెలుసుకుందాం.

ఎడిటింగ్ ఒక కళ గా:

చాలా సార్లు ఎడిటింగ్ అనేది యాంత్రికంగా చేసే పనిలా చాలా మంది భావించినప్పటికీ ఎడిటింగ్ ప్రక్రియల్లో ఎంతో మంది చేసిన కృషి కారణంగా నేడు దీనిని ఒక కళగా భావించే వాళ్ళూ చాలామంది వున్నారు. ఒక మంచి ఎడిటర్ నాణ్యత లోపించిన దర్శకుని సినిమాని కూడా అపురూపంగా తీర్చిదిద్దిన సందర్భాలెన్నో వున్నాయి. ఒక ఎడిటర్ కేవలం ఫిల్ము ముక్కలను ఒక దగ్గరగా చేర్చే కూర్పరే కాదు సినిమాకి ఒక రూపమిచ్చే దేవుడు కూడా. అన్నింటికంటే ముందు ఎడీటర్ అనేవాడు అత్యంత మేధావంతుడై వుండాలి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఎలా దోపిడీ చేయాలో పథకం పన్నుతూ మాట్లాడే సన్నివేశం తీసుకుందాం. ముందుగా క్లోజప్ లో ఇద్దరు వ్యక్తులని చూపించి వారు గుసగుసలతో తమ పథకాన్ని ఒకర్తో ఒకరు చెప్పుకోవడం చూపించి ఆ తర్వాత లాంగ్ షాట్ లో వారిద్దరూ పోలీస్ స్టేషన్ లో వున్నట్టు, వారిని చూసి ఇన్స్పెక్టర్ “ఏంట్రా గుసగుసలాడుతున్నారు?” అని కోపంగా కేకలెయ్యడం చూపిస్తే, ఆ వ్యక్తులపై ప్రేక్షకులకు “ఔరా! ఎంత ధైర్యం వీళ్ళకి, పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం ప్లాన్ చేస్తున్నారు” అనిపిస్తుంది. అలాగే ముందు లాంగ్ షాట్లో పోలీస్ స్టేషన్ చూపించి ఆ తర్వాత వారి సంభాషణ చూపితే, ఆ వ్యక్తులపై ప్రేక్షకులకు “ఛీ, వీళ్ళకు సిగ్గు లేదు, దొంగ బుధ్ధి పోనిచ్చుకున్నారు కాదు” అనిపిస్తుంది. అయితే దర్శకుడు పైన రెండు సీన్లు చిత్రీకరిస్తాడు కానీ ప్రేక్షకుల్లో ఏ భావం కలిగించాలో అన్నది మాత్రం చాలా వరకూ ఎడిటర్ మీదే ఆధారపడుతుంది. ఒక్కోసారైతే ఎడిటర్ తీసుకున్న నిర్ణయం కారణంగా సినిమా కథంతా మారిపోయి, ఆ మార్పు బావుందనిపిస్తే సినిమా మిగిలిన భాగం రీషూట్ చేసిన సందర్భాలు కూడా వున్నాయి.

ముగింపు:

నిజానికిది ముగింపు కాదు. సినిమా అనే ప్రక్రియను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఎడిటింగ్ గురించి తెలుసుకోవడం మొదటి మెట్టు. ఎలా అయితే ఒక ఉత్పలమాల పద్యాన్ని యతి ప్రాసలు తెలియని వారికంటే, తెలిసిన వారు ఎలా ఆస్వాదించగలుగుతారో, శృతి, లయ, మనోధర్మ లాంటి అంశాలు తెలియని వారికంటే తెలిసిన వారు శాస్త్రీయ సంగీతాన్ని ఎలా ఆనందించగలుగుతారో, అదే విధంగా ఎడిటింగ్ గురించి తెలుసుకున్న వాళ్ళు సినిమా చూసే విధానమే మారిపోతుంది. కేవలం సినిమాలోని కథను మాత్రమే కాకుండా, సినిమా ప్రక్రియలోని ప్రతి సున్నిత అంశాన్ని స్పృశించ గలుగుతారు, పూర్తి స్థాయిలో ఆనందించగలుగుతారు.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకట్ సిద్దారెడ్డి సినిమా పట్ల తనకున్న ఆసక్తి రీత్యా పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తున్నారు. తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో సినిమాల గురించి రాస్తున్నారు. మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు రావాలనేది ఆయన కల.)

About వెంకట్ సిద్ధారెడ్డి

వృత్తిరీత్యా సాఫ్ట్‍వేర్ ఇంజినీరైన వెంకట్ మాటీవీలో విహారి కార్యక్రమానికి సంవత్సరం పాటు స్క్రిప్టు, ఎడిటింగు, సౌండు ఎడిటింగుచేశారు. ఆ తర్వాత 2 లఘుచిత్రాలు తీశారు. దృష్టి లాంటి మరికొన్ని చిత్రాలకు కూడా ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రసిద్ధ తెలుగు రచయిత పుస్తకాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసిద్ధ తమిళ రచయిత అశోక్ మిత్రన్ రచన ఒకదానిపై తెరహక్కులు పొందారు. అమృతాప్రీతమ్ నవల ఆధారంగా ఒక నటి గురించి డాక్యుమెంటరీ తీయాలని యోచిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to ఎడిటింగ్ – ఒక ప్రస్తావన

  1. Rohiniprasad says:

    ఎడిటింగ్ అనేది ఎంత సృజనాత్మకమైన కళో ఈ మంచి వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. సత్యజిత్ రాయ్, బిమల్ రాయ్, హృషీకేశ్ ముఖర్జీ మొదలైన ప్రముఖ డైరెక్టర్లందరికీ ఎడిటింగ్ క్షుణ్ణంగా తెలుసు. సినిమా షూట్ చేసిన తరవాత రాజ్ కపూర్ పని పూర్తయే దాకా ఎడిటర్ డెస్క్ దగ్గరే కూర్చునేవాడట. ఎందుకంటే డైరెక్టర్ ఏ ఉద్దేశంతో తీసినప్పటికీ ఎడిటర్ తన కత్తెరతోనూ, సిమెంట్‌తోనూ సన్నివేశాలని తారుమారు చేసెయ్యగలడు. వ్యాస రచయిత చెప్పినట్టు షాట్ కంటిన్యుయిటీ వగైరాల్లో ఎడిటర్ తప్పులు చేస్తే ప్రేక్షకులకి తికమకగా ఉంటుంది.

    సినిమా అనేది కళలూ, టెక్నాలజీల అద్భుత సమాగమం అనేది ఎడిటింగ్, సినిమటోగ్రఫీ మొదలైన అంశాల్లో స్పష్టం అవుతుంది. వ్యాసంలో చెప్పిన విషయాల వల్ల పాఠకులు ఎడిటర్లుగా తయారవలేరుగాని ఒక సినిమానో, టీవీ చిత్రాన్నో చూసి మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.

    ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇటువంటి వివిధ అంశాలను గురించిన తెలుగు వ్యాసాలు వాటి పరిధిని విస్తృతం చేస్తాయి. రాసినదాన్ని గురించే రాస్తున్న కవితలూ, గుడుగుడు కుంచం ఇతివృత్తాల కథలూ వగైరాల కంటే వ్యాసాలే ఆసక్తికరం అనిపిస్తాయి.

  2. విజయ says:

    అధ్బుతమైన వ్యాసం.ఇది చదివాకా ఇక నుండి సినిమా చూసేప్పుడు ఎంత వద్దనుకున్న ఎడిటింగ్ గురించి ఆలోచించకుండా ఉండలేము

  3. చాలా బాగుంది. నెనర్లు

  4. చాల ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వ్యాసం లో …. ఎడిటింగ్ సినిమాకి ఎంత ముక్యమో ఈ వ్యాసం చదివితే అర్థం అవుతుంది.

  5. Diana says:

    I’m not easily imsespred but you’ve done it with that posting.

Comments are closed.