తెలుగు నుడికారము

రానారెయర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. పొద్దు పొడుపు ఆయన రచనతోటే జరగడం మాకు గర్వకారణం. అడిగినదే తడవుగా తెలుగు నుడికారంపై చిన్న పరిశోధనలాంటిది చేసి ఈ వ్యాసం రాసిచ్చిన రామనాథరెడ్డి గారికి కృతజ్ఞతలతో ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.

——————–

‘తిక్కన పద్యమొక్కటి చక్కగ చదివిన చాలు
తెలుగుజాతి నుడికారము తెలిసికొన్న యటౌను’ -దాశరథిగారి ఒకానొక పద్యం నుండి.

‘శంరకంబాడి సుందరాచారి గారు రవీంద్రుని గీతాంజలిని అనువదించారు. మూలం లోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది.’ -తెలుగు వికీపీడియా.

‘పత్రికల్లో కృతకమైన పదాలు వాడుతున్నారు. టి.వి లలో దారుణమైన సంకర భాష వచ్చేసింది. తెలుగు నుడికారం తగ్గిపోయింది. ఆర్థం తెలియకుండానే పద ప్రయోగాలు చేసేస్తున్నారు.’ -డాక్టర్‌ కాచినేని రామారావుగారు, ఈమాట డాట్ కాం నుండి.

పల్లెటూళ్ళలోనూ సినిమాతనం, సినిమానుడికారం, సినిమాతెలుగు…’ -ఒక పెద్దాయన గమనించిన విషయం.

‘క్రింద వరసలొ కూర్చున్న మా శాస్త్రి అయ్యా అప్పారావు గారూ కాస్త ఆ గొవర్థనం కిందకి దించండి అని అరిచాదు. జనం ముసిముసి నవ్వులు చిందించారు ‘హై! హాయ్!!’ ల మధ్య ఆ అచ్చ తెలుగు నుడికారం విని ఎన్నాళ్ళయిందో!’ -ప్రొఫెసర్ అశోక్‌గారి బ్లాగు నుండి.

‘శబ్దం, అర్థం, అభివ్యక్తి, నుడికారం, వాక్య నిర్మాణం అనేవి అనువాదాల తులనాత్మక విశ్లేషణలో ప్రధాన రంగాలుగా తేలాయి. Half corved poetry in stone (The black pagoda)అనే దాన్ని ‘సగం చెక్కిన శిల్పమ్ము పగిది నాదు పద్యమియ్యది’ (1996-పలుకు చిలుక) అని అనువదించాను. poetry in stone అనే నుడికారం అనువాదకుడికి అందలేదని సమీక్షకుడు తెలియజేసాడు. ఇది సమీక్షకుడి బాధ్యత. కృతజ్ఞతలతో స్వీకరించాను.’ -ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.

ఇలా ‘నుడికారము’ అనే మాట మనకు అప్పుడప్పుడూ వినబడుతూ ఉంటుంది. ‘తెలుగు నుడికారపు సొగసు’ను గురించి రాయమని పొద్దు సంపాదకులు నన్ను కోరినపుడు, ‘నాకంత సీనుందా’ అనుకొన్నాను తెలుగు సినీనుడికారంలో. నుడికారంమంటే ఏమిటో నాకు బొత్తిగా తెలియదా అంటే మనసొప్పుకోలేదు. కొంత తెలుసు. తెలియకపోవడమేమిటి, ఆంధ్రదేశపు పల్లెటూళ్లలో పెరిగినోళ్లందరికీ ఆ నుడికారం సహజంగా అబ్బుతుంది. ఇలా అనుకొన్నాక ‘నాకు తెలిసిన నుడికారం ఏమిటి? మావూళ్లో ఎవ్వరూ నుడికారాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుకోఁగా వినలేదే!’ అని ప్రశ్నించుకొని బ్రౌణ్యములో వెతికితే ‘వాచకము, మాట, రచనము, మాటచమత్కారము’ అనే అర్థాలు కనిపించాయి. నుడువు అంటే చెప్పు(ము) అని అర్థం. నుడి అంటే మాట. సుమతీ శతక కారుడు బద్దెన ఏమన్నాడో చూడండి –

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుఁ బుట్ట నుడివెద సుమతీ!

సకల జనులు ‘ఔరా’ అనేలా నోరూరగా చవులు (రుచులు) పుట్టేలా చెబుతానన్నాడు. అన్నంతపనీ చేసి చూపాడు. ఇక్కడ ఔరా అనడం నుడికారపు సొగసు. దీనర్థం వివరించ నక్కరలేకుండానే మనందరికీ తెలుసు. ఈ శతకం నిండా మాటల చమత్కారాలెన్నో చూడవచ్చు మనం. మచ్చుకు ఈ పద్యం చూడండి:

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

నుడికారమనేది పద్యాలకు, కావ్యాలకూ, గ్రంథాలకూ, కవులకూ, పండితులకే పరిమితంకాదు. నుడికారపు ముడిసరుకు సామాన్యమానవుడు మాట్లాడే భాషే. పైన నేనుదహరించినది ఛందస్సూ యతి ప్రాసలతో అందంగా అమరిన పద్యమే కావచ్చు, కానీ అందులో వాడబడిన మాటలు అది రాయబడిన కాలంనాటి జన సామాన్యం రోజూ మాట్లాడేవే. ‘ఈ నా కొడుక్కు మిడిమేలం జాస్తి’, ‘యాల కొడకా అంత మిడిమేలం నీకు’ లాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా తొందరపాటుతో అనాలోచితంగా ప్రవర్తించినా, ఎవరికైనా త్వరగా కోపం వచ్చినా, ఎవరైనా క్షణికావేశాన్ని దాచలేక వ్యక్తపరచి తప్పుచేశాడనిపించుకొన్నా వాణ్ణి ఈ పద్ధతి మార్చుకోమనే పెద్దల బుజ్జగింపు మాటలు ఇవి. పద్యంలో ‘మిడిమేలం’ అనేది ఆ దొరయొక్క విశేషణం. అట్లాంటి వాడి కొలువున పనిచేసి అగచాట్లుపడే బదులు ‘మడిదున్నుక బ్రతుకవచ్చు’ అన్నాడు – అదీ ఎలాగంటే – మాంచి వడిగల ఎద్దులను కాడి గట్టి. వడి అంటే వేగము, హుషారు. కాడి అంటే ఎద్దులను జంటగా కూర్చి నడపడానికి వాటి మెడమీద వేసే కొయ్య. మామూలుగా కాడి అంటేనే జత ఎద్దులు అనే అర్ధం వాడకలో ఉంది. కాడిగట్టు అంటే ఎద్దులను జతగా కూర్చి సిద్దం చెయ్యమని అర్థం. వడిగల ఎద్దులతో మడిదున్నుతుంటే ‘ఇంకొంతసేపు పనిచేద్దాం అనిపిస్తుంది అంటారు. అది అనుభవైకవేద్యం.

మడి దున్నుకు బ్రతకవచ్చని ఎందుకన్నాడు? కువైట్‌కో సౌదీకో పొమ్మనొచ్చు. లేదూ – డిగ్రీ పాసయి ఏదైనా కాల్‌సెంటర్లో చేరమని చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అలా చెబితే తెలుగు నుడికారం దెబ్బతింటుందని కాదు, బద్దెనకాలం నాటికి సేద్యమే గౌరవప్రదమైన మరియు ప్రధానమైన వృత్తి కనుక, వడిగలిగిన కాడెద్దులంటే చెప్పుకోదగిన ఆస్తి కనుక. దీన్నిబట్టి మనకేమర్థమౌతుంది? నుడికారం జన జీవనంలో నుండి, వారి మాటల్లోనుండి వస్తుంది. సమాజపు జీవనవిధానం, అక్కడి వాతావరణ పరిస్థితులు, జనబాహుళ్యంచేత ఆమోదింపబడిన పద్ధతులు ఆచారాలు, ఆటపాటలు ఇవీ వారి మాటల్లో కనబడతాయి వినబడతాయి. ఒక భాషయొక్క నుడికారమనేది ఆ జాతికి సంబంధించినది. అందుకే ‘తెలుగుజాతి’ నుడికారమన్నాడు దాశరథి (వ్యాసం ప్రారంభం చూడండి). వారి మాటలలో దొర్లే చమత్కారాన్నే మనం ‘నుడికారం’ అంటాం. నుడికారమనేది ముందు ప్రజల నాలుకల నుండి ఉద్భవించి, ఆ తరువాతనే కావ్యాలలోకి చేరింది. కాబట్టి నుడికారమనేది పండితులకంటే ముందు పామరుడి సొత్తు. మాటల్లోని చమత్కారం అర్థంకావాలంటే ఆ మాటలు పుట్టిన సమాజంలో పుట్టి పెరగాల్సి వుంటుంది. ఆ సంస్కృతిని ఒంటబట్టించుకోవలసి వుంటుంది.

ఇప్పుడు సరదాగా తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూద్దాం.

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులం గల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీ సాటిగా
నరసింహక్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలవారిని శౌర్యమునుగూర్చి అల్లసాని పెద్దన చెప్పిన చెప్పిన పద్యం ఇది. పద్యం చెప్పడం పూర్తవగానే సభికులంతా భేష్ భేష్ అంటూండగా, తెనాలి రామకృష్ణుడు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటాడు. వికటకవిని కారణం అడుగుతాడు రాజు. ‘తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి రాదంటూనే, రాజకంఠీరవా! అని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది’ అంటాడు. రాజకంఠీరవమంటే సింహరాజమని అర్ధం. ఆ మాటకు పెద్దన నొచ్చుకోక నవ్వుతూ ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా! ఏదీ నువ్వొక పద్యం చెప్పు’ అంటారు. ఆ మనవడు రాయలవారి శౌర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన మత్తేభం –

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి ఏగునెడ, తన్మధ్యంబునన్‌, హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో
గలగం బారుచునేగె, నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!

ఇక్కడ మనం గమనించవలసిన మాట – ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా’. బహుశా ఆనాటి మల్లయుద్దాల నుండి వచ్చి ఉండొచ్చు ఈ ‘పట్టుబట్టడ’మనే నుడి. Good catch అనేది ఇదే సందర్భంలో ఆంగ్లేయులకు నుడి. బహుశా మల్లయుద్ధాలకన్నా బంతితో ఆడే ఆటల నుండి వారికీ నుడికారం వచ్చి ఉండొచ్చు. ఇందుకు నాకే ఆధారమూలేదు. ఇంగ్లీషువారి నుడికారం ప్రధానంగా వారికి నౌకాయానంపట్ల ఆటలపట్ల ఉన్న మక్కువతో ముడిపడిందిట. ఇది పరిశోధనా వ్వాసం కాదు. ఈ విషయం మీద నాకు కలిగిన అవగాహనకు సంక్షిప్త రూపం ఈ వ్యాసం. తప్పులుంటే మన్నించి, తెలిసిన పెద్దలెవరైనా నాకు మొట్టికాయలు వేసి నన్ను సరిదిద్దవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాను.

తెలుగు నుడికారం మన వ్యావసాయిక జీవితాలనుండి పుట్టింది.’వీడు మాట్లాడితే రాళ్ల చేలో గుంటక తోలినట్టుంటుంది’ అంటాం – విరామం లేకుండా లొడలొడా మాట్లాడేవాడిని చూసి విసుగొచ్చినపుడు. ‘గుడ్డెద్దు చేలోబడినట్టు ఊరికే గడగడా బట్టీబడితే సదువులు అబ్బవు నాయినా’ – ఒక ప్రణాళికగానీ ఆలోచనగానీ లేకుండా విపరీతంగా కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులను చూసి సానుభూతితో అనే మాట ఇది. ‘ఏమి నాయినా బొత్తిగా నల్లకప్పేసినావు’ అనేవారు నేను ముక్కావారిపల్లె హాస్టలు నుండి ఇంటికొచ్చినప్పుడు. అంటే చిక్కిపోయి అనారోగ్యంగా ఉన్నానని అర్థం. ఆవులు, ఎద్దులు ఆరోగ్యంగా ఉంటే నిగారింపుతో ఉంటాయి. వాటికేమాత్రం నలతగా ఉన్నా చర్మంలో ఆ నిగారింపు పోతుంది. వెంటనే తగిన వైద్యం చేయాలన్నమాట. ఇదీ నల్లకప్పు వేయటం అనే మాటకు మూలం.’ఈ సారి రోంత ఈకేసినాడబ్బోవ్ మీవోడు’ అన్నారు నేను కొంత కండబట్టేసరికి. ఈక వెయ్యడమనే ఈ మాటకు మూలం మన పల్లెల్లో కోడిపుంజుల మీద ఉండే మోజు. బొమ్మెలుగా ఉన్న కోళ్లు బాగా తిని నిగారించే కొత్త ఈకలను సంతరించుకొని పందేనికి సిద్ధమౌతాయన్నమాట.అదీ ఈకెయ్యడమంటే. కోడిపుంజుల పోట్లాట చూసే వుంటారు. సమ ఉజ్జీలైతే ఒకదాన్నొకటి తన్నుకొని తన్నుకొని అలసిపోతాయి. ఒకో సారి చచ్చిపోతాయి కూడా. ఒకోసారి కొంతసేపు పోరాడి రెండిటిలో ఒకటి తోక ఈకలను పైకెత్తేసి అపజయాన్నంగీకరిస్తుంది. ఆ అంగీకరించడంలోకూడా కొంత డాంబికముంటుంది. ఆటల్లో ఓటమినొప్పుకోక మొండిగా ఎదురుతిరిగే వాని చేతగానితనాన్ని – ‘వాడు కొప్పు ఎత్తేసినాడు, వదిలేయండ్రా’ అని ఎగతాళి చేస్తారు పల్లెల్లో. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!

మన రాష్ట్రప్రభుత్వానికి, ‘మార్గదర్శి’కి మధ్య నడుస్తున్న వ్యవహారం మనకందరికీ తెలిసిందే. ఆమధ్య ఒక ఆదివారం ఆంధ్రజ్యోతి ‘సరదాగా…’ శీర్షికలో రాజగోపాల్‌గారి వ్యంగ్య రచననుండి ఒక భాగం ఇక్కడ చదవండి – ‘పిచ్చివాడా! వరల్డ్‌ బ్యాంకైనా దివాలా తీస్తుందేమో కానీ మార్గదర్శి దివాలా దియ్యదు గాక తియ్యదు. మా చైర్మన్‌ రామోజీరావు గారంటే ఏమనుకున్నావు? నిప్పులాంటి నిజాయతీ ఆయనది. నాకు ఆయన మీద బోలెడంత నమ్మకం ఉంది. పైగా, ప్రతిపైసాకి నాదీ పూచీకత్తు అని చెప్పారు … వినలేదా?’
‘పైస లెవడిక్కావాలిబే … రూపాయిల సంగతి చెప్పు’ అన్నాడు యాదగిరి.
వెంకట్రావుకి ఒళ్ళు మండింది. ‘ఛప్‌ .. నోర్ముయ్‌! నీ కసలు తెలుగు నుడికారం తెలీదు. దానర్థం అదే … అయినా, అంత అవసరమైతే తన ఆస్తులన్నీ అమ్మేసైనా ఖాతాదారుల డిపాజిట్లు చెల్లిస్తానని మా చైర్మన్‌ గారు హామీ ఇచ్చారు … నేను నమ్ముతున్నాను. కందకి లేని దురద కత్తిపీట కెందుకన్నట్టు ఏ డిపాజిట్లూ లేని వాడివి … మధ్యలో నీకెందుకూ బెంగ?’
యాదగిరికి నుడికారం తెలియకపోవడానికి కారణం అతను పైసలకాలం నాటి మనిషికాకపోవడం కావచ్చు.

నేను పైన ఉదహరించిన నుడికారాల నేపథ్యాన్ని గనక వివరించి ఉండకపోయినట్లయితే, కొంతమందికి ఆ మాటల్లోని చమత్కారం అర్థమయ్యేదికాదు. ఈనాడు కంప్యూటర్లో ఈ వ్యాసం చదువుతున్నవారిలో చాలామందికి వ్యవసాయం, పశువులు, కోళ్లూ, పల్లె వాతావరణం వంటి అనుభవాలు లేకపోవడమే ఇందుకు కారణం. వారి సంస్కృతి కాస్త వేరు. వారి జీవన విధానం వేరు. రాబోయే తరాలుకూడా వ్యావసాయిక జీవనానికి దూరంగా పట్టణాల్లో సినిమాలు, టీవీలూ, ఇంగ్లీషు చదువులు, ఇతరభాషలవారి ఇరుగు పొరుగు, పోటీలు, వాటాలు అంటూ పరుగులమయమైన జీవనవిధానానికి అలవాటు పడి, ఆ వాతావరణానికి సంబంధించిన మాటలు నేర్చుకొంటూ ఉండటంతో వారి నుడికారం కూడా మారుతూ ఉంది. ముందే చెప్పుకొన్నాం కదా నుడికారం సంస్కృతి నుండి పుడుతుందని. ఈ నాడు తెలుగు నుడికారము తగ్గిపోయింది అంటే ఆశ్చర్యమేముంది? ఈనాటి మన ఆర్థిక రాజకీయ జీవనానికి ఆంగ్లం నేర్వడం తప్పనిసరి. ఈ మార్పు తప్పేమీ కాదు, తప్పేదీ కాదు. అయితే ఈమధ్య ‘అయ్యయ్యో’ అనవలసినచోట ‘oops’ అంటూంటారు కొందరు తెలుగువాళ్లు. ఇలా అనడం ఎక్కువ మందికి జుగుప్సాకరంగా అనిపిస్తే oops తెలుగులో కొత్త నుడికారం కాబోదు. ‘భాష జీవనది లాంటిది’ అన్న మాటను ఈ మధ్య చాలాచోట్ల చదివాను. కొన్ని దశాబ్దాలక్రితం బహుభార్యత్వం సంఘంలో సాధారణ విషయమైనప్పుడు ‘సవతిపోరు’ అనే మాటకు అర్థం వివరించాల్సిన పని ఉండేదికాదు. కానీ కొంతకాలానికి ‘నాకీ సవతి పోరు తప్పేలా లేదు’ అన్న మాటకు అర్థం తెలియకపోతే ఆశ్చర్యపడనక్కరలేదు.

నుడికారము ప్రాంతానికీ ప్రాంతానికీ మారుతుంది అంటారు. భాష ఒకటే అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి, ప్రజల జీవనాన్ని బట్టి నుడికారము మారుతుంది. కోస్తా తీరప్రాంతాలలో సముద్రానికి, చేపలుపట్టడానికి సంబంధించిన నుడికారం అక్కడి జాలరుల మాటల్లో వినబడుతుంది. కేరళవారి నుడికారములోనూ ఈ ప్రభావమే కనిపిస్తుందని నా మలయాళీ మిత్రుడొకరు ఉదాహరణలతో సహా వివరించారు. ‘నా బంగారు తండ్రీ!’ అని పిల్లల్ని ముద్దుచేయడం అచ్చతెలుగు నుడికారం. ఇంగ్లీషువారు ఇలాంటి మాట వాడరనుకుంటాను. అలాగే ‘ఔరా కొడుకా, అబ్బ ఏముందిది, అన్నన్నా ఎంతమాట, అమ్మా ఆశదోశ…’ ఇలాంటివెన్నో తెలుగువారి నుడులు. ఒకే మాటకు సందర్బాన్నిబట్టి అర్థాలు మారిపోవడం ఇంకో చమత్కారం. ఒక ఉదాహరణకు ‘పుట్టి’ అనే పదాన్ని చూడండి – ‘పుట్టి బుద్ధెరిగాక ఇలాంటి విచిత్రం చూడనేలేదు’, ‘వాణ్ణి నమ్మితే నీ పుట్టి మునుగుతుందంతే’, ‘పుట్టి రాగులు రెండుపుట్లు సజ్జలు’. మన పాటల్లో కనిపించే ‘నే చినదాన – వేచిన దాన’, ‘వందనాలు – వంద వందనాలు’, ‘ఈ వనమున నా జీవనమే’ లాంటి ఎన్నోమాటలగారడీలూ తెలుగుజాతి నుడికారపు సొగసులే.

చాన్నాళ్లకిందట ఆంధ్రభూమి వారపత్రికలోని భగవాన్‌గారి ఒక కార్టూను – బట్టలు సర్దేసుకుని ఇల్లువిడిచి శాశ్వతంగా వెళ్లడానికి పెట్టెతోసహా సిధ్దమైన తన భర్త కాళ్లమ్మటబడి కన్నీరుమున్నీరవుతూ ఆ అర్థాంగి అంటుంది – ‘ఛీ పాడు! పొండీ! అని సరదాగా అన్నానండీ. వా…’. నుడికారం తెలియకపోతే ఇలాగే ఉంటుందిమరి. ధర్మదాత సినిమాలో కొడుకులందరూ ముదిమిలోని తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయినపుడు వచ్చేపాట -‘ఎవ్వడికోసం ఎవడున్నాడు, పొండిరా పొండి’. వాళ్లెప్పుడో వెళ్లిపోయారుకదా, ఈయనేమిటి మళ్లీ ‘పొండిరా పొండి’ అంటాడు అనే ఆలోచన మనకురాదు. ఎందుకంటే ‘నన్ను విడిచి వెళ్లారు కదూ, అలాగే కానివ్వండ్రా’ అన్న ఆ పెద్దమనిషి ఆవేదన మన మనసుకు అందుతుంది కాబట్టి. ఆ నుడికారం మనకు తెలుసు.

విలాసంగా బ్రతికిన కవిసార్వభౌమ శ్రీనాధుడు చరమాంకంలో కష్టాల పాలయి రేనాడులో జొన్నకూడు తినలేక, బాధలోనే ఆనందాన్ని వెతుక్కోవలసిన పరిస్థితిలో ఆయన నోట జాలుసారిన ఈ చాటువు చూడండి –

గరళము మ్రింగితినంచును
పురహర గర్వింపబోకు. పో!పో!పో!
బిరుదిప్పుడు కానవచ్చెడి.
మెరిసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ!

కార్టూనులోని అర్థాంగిలాగ ఇక్కడ శ్రీనాథుడు కూడా శివుని ‘పో!’ అని మూడు మార్లు అంటున్నాడు. కష్టాలలో ఉన్న తనకు సాయంరాలేదనే బాధాపూరితమైన కినుక అది. ఆ కినుకలోనే సవాలు విసురుతున్నాడు – గరళకంఠుడనే బిరుదుంది కదా నీకు, అదేమంత గొప్పసంగతికాదు, ఈ జొన్నమెకుతులు తిను నీ బిరుదు అప్పుడు కనబడుతుంది అని. పురము అంటే లోకమని అర్థం. హరుడంటే శివుడు. శివుణ్ణి త్రిపురాంతకుడంటారు. అలాగే వసుంధరా దాస్ పాడిన’షక లక బేయ్‌బి’ పాట చివరలో ‘ఏయ్ పోవయ్యా, అడియోస్, అమీగో!’. చివరివరకూ ‘ఆశ నీకు లేనే లేదా, నువ్వు మీసమున్న చెట్టుచేమవా’ అంటూ కవ్వించి, ఇక లాభంలేదని చివరగా చిన్న అలకాస్త్రం ప్రయోగించడమన్నమాట. అందుకే ‘వీడ్కోలు, చెలికాడా!’ అంటుంది స్పానిష్ భాషలో.

ఒక్కటి మాత్రం నిజం. తెలుగు నుడికారం తగ్గిపోతోంది అనే బదులు మారుతోంది అనవచ్చేమో. తెలుగు తెలుగుగానే ఉన్నరోజులలో అచ్చతెనుగు నుడికామే ఉండేది. తెలుగు సంస్కృతభరితం అయ్యాక కూడా అది అచ్చతెనుగు నుడికారంగానే చలామణి అయింది. ఉదాహరణకు ‘రామసక్కని బంగారు బొమ్మ’. రామః అన్నది సంస్కృతపదం. ఇది స్త్రీలింగ పదమని తెలుసుకొని ఆశ్చర్యపోకండి. అయితే ఆంధ్ర, కళింగ, వంగ, మగధ లాంటి ఎన్నో దేశాలుగా వివిధ ప్రాంతీయ భాషలను కలిగి విడివడియున్న మనలను, సంస్కృతాధారమయిన ఆర్షధర్మం ఒక్కటిచేసింది అంటారు. అంటే మన ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంస్కృతం తప్పనిసరి. కావున అది ప్రాంతీయభాషలలో కలగలిసిపోయింది. ఈనాడు మన అర్థిక, రాజకీయ లావాదేవీలకు ఆంగ్లము తప్పనిసరైంది. కొన్ని అచ్చతెలుగుమాటల, కొన్ని సంస్కృతం కలిసిన తెలుగుమాటల స్థానాన్ని ఇప్పుడు ఆంగ్లం ఆక్రమించింది. మంచినీళ్లడిగే బదులు డ్రింకింగ్‌వాటరడుగుతున్నాం మరి. ఈ వాక్యం చివర ‘మరి’ లేకపోతే ఆమాట కాస్త చప్పగా ఉంటుంది గమనించారా, ఇదీ నుడికారమే మరి. నుడికారం తగ్గడమో మారడమో తనంతట తానుగా జరగడంలేదు, మనమే మార్చేస్తున్నాం.

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువులో – లోకోక్తి, లోకహితోక్తి, శాస్త్రము, శ్లోకము, సౌమ్యము లతోపాటు అడుగు, ముప్పదిరెండు అనేవి కూడా పర్యాయపదాలుగా చెప్పబడ్డాయి.

తమాషాకు ఒక సంగతి చెబుతానిక్కడ. ‘సండే అయితేనేంలాభం, ఎండమండిపోతోంది’ అని బాధపడతాం మనం. ఒక తెలుగువాడు ఆదివారాన్ని సండే అంటుంటే ఆదిత్యునికి మండదామరి. రవివారాన్ని సండే అంటే మంట రాజుకోదూ! ఇంగ్లీషువాడు ‘సన్’డే అంటుంటే ‘సన్‌’కు సంతోషమేగా. తర్కించకండి – చెప్పానుకదా తమాషాకంటున్నానని. ఈ విషయంలో కన్నడ సోదరులనుచూసి నేర్చుకోవాలి. మనం నాజూకుగా ఆంగ్లం వాడే చోట వారు కన్నడపదాలువాడి తాము కన్నడిగులమని తమ ఉనికినిచాటడం నా రెండున్నరేళ్ల బెంగళూరు వాసంలో గమనించాను. సమ్ ఇండియన్స్ ఆర్ మోర్ బ్రిటిష్ దాన్ ద బ్రిటిష్ అన్న మాటకు గర్వించక, సంస్కృతి మూలాలను చిన్నచూపుచూసే మన ఆత్మసౌందర్యాన్ని ఆంగ్లేయులే ఎద్దేవా చేస్తున్నారని గ్రహించవద్దూ మనం!?

**** **** ****

తప్పులను సరిదిద్ది ఈ వ్యాసమును రాసే ధైర్యాన్ని నాకు ప్రసాదించిన పెద్దలు, శ్రేయోభిలాషులు శ్రీ రావూరి భరద్వాజ గారికి సవినయ వందనములు, కృతజ్ఞతలతో… -రానారె.

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

43 Responses to తెలుగు నుడికారము

 1. “అదిరిందయ్యా” రానారె! (ఇది సినిమా నుడికారం).నుడికారం గురించి విడమర్చి చెప్పినందుకు అభినందనలు.చాలా చక్కని వ్యాసం!మీరింకా ఇలానే వ్రాస్తూ ఉండాలని కోరుతునాను!

 2. radhika says:

  మీ ఈ వ్యాసం చదివాకనే తెలిసింది..నేను ఎక్కువగానే నుడికారాన్ని ఉపయోగిస్తానని.అందరికీ అర్దం అయ్యేలా చక్కగా వివరించారు.అన్నట్టు ప్రాంతీయ సామెతలన్నీ నుడికారమయమే కదా?

 3. Hari Sankar says:

  Presently i have no telugu fonts in my system

  Ramanadha reddy writing very good,chepalanukundi humarsh ga cheppadam, its good…. any way

  “telugu jaati manadi – ninduga velugu jaati manadi ”

  bye Hari

 4. వామ్మో …

  ఈ రోజు ఉదయమే ఎందుకో ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం చదివా…(కొన్నాక మొదటిసారి)..దానిలోని సంపదకు ఏమీ తీసిపోనట్లుగా ఉందే. ఈ శనివారం నాకు మేతగా సరిపోతుంది:-)

 5. అభినందనలు.అచ్చ తెలుగు నుడికారంలా వుంది మీ వ్యాసం.

  ఈ తరం యువతకి ఇంత విషయ పరిజ్ఞానం వుందా అనిపించింది మీ వ్యాసం చూస్తే.

  ఇది రాసినది రానారే అని చెప్పకపోతే రాసింది మీరు అని అనుకోలేము. రాయలసీమ మాండలికం నుండి అచ్చ తెనుగు వరకు చాలా బాగా రాస్తున్నారు.

  కాస్త సమయం దొరికితే చాలు పబ్బుల లో గడిపే ఈ తరం యువకులకు మీరు స్పూర్తి కావాలి.

 6. సుధీర్, హరి, రాధికగార్లకు,
  వ్యాసం నచ్చినందుకు చాలా సంతోషము. “ప్రాంతీయము” అనిపించుకొన్నది ఏదైనా ఆ ప్రాంతపు నుడి – అనుకోవచ్చునని నాకు కలిగిన అవగాహన. ఈలెక్కన సామెతలు నుడికారమయమే కదా.

  సుధాకర్ గారు,
  శనివారం మేత – అన్నారంటే మీరింకా పూర్తిగా చదివినట్టులేదు. ఔనా?

  సిరిసిరిమువ్వగారు,
  వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ తరం యువతకు విషయపరిజ్ఞానం లేకపోవడం అనేదేమీ లేదండి. ఏ విషయంపైనైనా పరిజ్ఞానాన్ని ఇట్టే సంపాదించగల వాదర ఈ తరానికి ఉంది. అందుకు తగిన సాంకేతిక వనరులూ ఇప్పుడందుబాటులో ఉన్నాయి. పబ్బుల్లో గడిపినా చురుకైనవాళ్ళు చాలామందే ఉన్నారు. పబ్బులు, తాగుడూ, తిరుగుళ్లూ మాత్రమే లోకమైపోయిన యువత అన్ని తరాల్లోనూ ఉండేదే కదండి. నా ఉద్దేశంలో ఈతరం వారి జీవితాలపట్ల తగినంత శ్రధ్ధనే కనబరుస్తున్నారు. ప్రతివారూ వారిలోని ఏదో ఒక విలక్షణతతో మిగతావారికి స్ఫూర్తే కదా. కృతజ్ఞతలు.

 7. రానారె, నిన్ననే చదివినా మొదటి వ్యాఖ్య రాయటానికి ఎందుకో సందేహించాను. ఎందుకేముందిలే, ఈ వ్యాసం చాలా ఆలోచించి రాసినట్లున్నావు, మనం పిచ్చివాడి చేతి రాయిలాగా వ్యాఖ్య రాయకూడదూ అనే. నువ్వు మెచ్చుకోళ్ళకి, పొగడ్తలకి అలవాటు పడటం మంచిది. :-) ఒక కొశ్చెను – రావూరి భరద్వాజ గారంటే .. ప్రముఖ నవలా రచయిత .. ఇంత పొడుగు గడ్డముంటుందీ .. ఆయనా?
  సిరిసిరిమువ్వగారి కామెంటు చదివి నేనేం సమాధానం చెబుదామనుకున్నానో సరిగ్గా అదే నువ్వూ చెప్పేశావు. నేనింకో అడుగు ముందుకెళ్ళి ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తా – పబ్బుల్లో గడపటం, తెలుగు, సాంప్రదాయ కళల మీద మమకారం ఉండటం పరస్పర అభావాలు (mutually exclusive) కాదు :-)

  ఇక్కడ పాఠకులందరికీ ఒక మనవి. “అచ్చ తెనుగు” “అచ్చ తెలుగు” అనే మాటల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. భాష సంబంధమైన చర్చలో ఇదొక పారిభాషిక పదం (technical jargon). సంస్కృతంతో సంబంధం లేకుండా తెలుగు దేశీయమైన పదజాలాన్ని, భాషని అచ్చ తెనుగు అంటారు. నిజానికి అచ్చతెనుగు లో మాట్లాడినా రాసినా మనకిప్పుడు ఒక్క ముక్క అర్థం కాదు. రానారె రాసినా, మరెవరు రాసినా, వారి భాషని మెచ్చుకోవాలంటే ‘చక్కటి తెలుగు” అనో “మంచి తెలుగు” అనో అనడం మంచిది.

  సిరిసిరిమువ్వ గారి వ్యాఖ్యలో “అచ్చతెలుగు నుడికారంలా” అన్న పదబంధం చదివినప్పుడు గుర్తొచ్చింది – 80లలో వచ్చిన ఒక సినిమా పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడు – “అచ్చ తెలుగు నుడికారంలా, మచ్చలేని మమకారంలా వచ్చినదీ కవితా గానం ..” అంటూ. తెలుగు తియ్యదనాన్ని తల్చుకుంటూ .. ప్రేమనగర్ లో ఆత్రేయ పాట .. “తేట తేట తెలుగులా” కూడా నాకు చాలా ఇష్టం.

 8. ‘అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు’ ఎంత చక్కగా చెప్పావయ్యా…రానారె.’కత్తి మీద సాము’లాంటి ఈ వ్యాసాన్ని అలవోకగా రాసావు. చదివిన మా అందరికీ ‘చెక్కర పందిట్లో తేనె వాన కురిసినట్ల’య్యింది”. ఎంతైనా ‘పిట్ట కొంచెం…కూత ఘనం!’అనిపించావు.చెబాచ్!

  కొత్తపాళీ గారు అచ్చ తెనుగు గురించి అచ్చమైన మాటలు చెప్పారు.

  కానీ ‘వడ్లగింజలో బియ్యపు గింజ’అనుకోకపోతే ఓ చిన్న మాట ‘పబ్బుల్లో…’ అని సిరిసిరిమువ్వ గారన్న మాటల్లో కూడా ఈ నుడికారం ఉందేమో! అంటే ‘సమయం దొరికితే పబ్బుల్లో…’అంటే పూర్తిగా పాశ్చాత్య సంస్కతికి అలవాటుపడ్డ…అని వారి భావమేమో!

 9. కొత్తపాళీ గారికి,
  నిజమేనండి కాస్తంత భయభక్తులతో రాసిన వ్యాసమే ఇది. నుడికారమంటే ఏమిటో ఇదమిద్దంగా తెలియనివాణ్ణి. భరద్వాజగారికి నాకు తెలినది చెప్పి ఇది నుడికారమేనా అని అడగగానే, నదీప్రవాహంలాగా పదినిముషాలపాటు ఆయన చెప్పిన విషయాలకు నాకు తెలిసినది జోడించి ఇందులో రాశాను. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా విందామనిపిస్తుంది. ఇందులోని శ్రీనాథుని చాటువు నాకు మా నాయన ద్వారా అందింది. కాబట్టి ఈ మెచ్చుకోలు మాటలన్నీ వారికీ, నన్ను ఈ వ్యాసం రాయమని అడిగిన త్రివిక్రమ్ గారికీ చెందుతాయి. ఏవైనా సూచనలు, సలహాలు, విమర్శలు నాకు.

  రావూరి భరద్వాజ గారిని నేనూ చూడలేదండి. కాబట్టి గడ్డం సంగతి నాకు తెలియదు. వీరి రచనల్లో కొన్ని – పాకుడు రాళ్ళు, సౌందర్య నందనం, నాలోని నీవు, శ్రీరస్తు, ఇనుపతెరవెనుక. బడిలో చదివినది నాలుగో ఐదో తరగతి వరకు మాత్రమేనని, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో కొన్నేళ్లు పనిచేశారని (ఈ సంగతి గొల్లపూడి మారుతీరావుగారు తమ జ్ఞాపకాలలో రాసుకొన్నారు, గొల్లపూడిగారు ఆకాశవాణి కళాకారులేనని మీకు తెలిసే ఉంటుంది), స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారనీ, ఆయన బాల్యము, యవ్వనమూ కష్టాలమయమని, ఈయన రచనలపై పరిశోధన జరిపి కొందరు విద్యార్థులు డాక్టరేట్లు సంపాదించారనీ విన్నాను. 1983లో ఆయన రాసిన జీవనసమరం అనే వ్యాసాలకుగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో గౌరవింపబడ్డారని తెలుగు వికీపీడియా సమాచారము.

 10. అవునండీ బాబు. గట్టిఘా వున్న పదార్ధాలు శనివారం తీరిగ్గా నములుతూ ఆనందిస్తా..ఈ టపా వెలగపండులా వుంది :-)

 11. అద్భుతంగా రాసారండీ బాబూ…
  దీనిని ఎలా మిస్ అయ్యాను చెప్మా ?

  ఏదో లేండి. కూడలి లో కామెంట్లు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంత అందమయిన, అచ్చ తెలుగు నుడికారం మీద మీరు రాసిన వ్యాసం చదవలేకపోయేవాడినేమో.

  అసలు లాగాఫ్ అవుదామని అనుకుంటూ ఉండగా తగిలిన ఈ వ్యాసం మొత్తం పూర్తిగా చదివే వరకూ వదలలేకపోయనండీ. జోహార్లు.

  ఇలాంటి ఇంకెన్నో వ్యాసాలు, చెణుకులు, అనుభవైక సంగతులూ, తెలిసినవి, తెలుసుకొన్నవి మీరు చెప్పాలని ఆశిస్తున్నాను.

 12. బాబ్బాబూ…నా కామెంటేమయ్యింది చెప్మా!

 13. సరే మరోసారి…

  ‘అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు’ ఎంతో చక్కగా చెప్పాడు ‘రానారె’.
  ఎంతైనా ‘పిట్ట కొంచెం – కూత ఘనం’ కదా!(రావూరి గారితో పోల్చి-పిట్ట)
  ‘వడ్లగింజలో బియ్యం గింజ’ అనుకోకపోతే ‘సిరిసిరిమువ్వ’ గారి ‘పబ్బుల్లో గడిపే…’ వ్యాఖ్యలో పూర్తిగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ అనే అర్థం ఉందేమో!

 14. వార్త్తిక్ says:

  చక్కటి వ్యాసం. అందరి చేతా చదివించగలిగే గొప్ప గుణం ఉంది రానారె గారి రాతల్లో!

  అయితే “రామః … అన్నది స్త్రీలింగ పదమని తెలుసుకొని ఆశ్చర్యపోకండి” అన్న వాక్యాలు చదివి నిజంగానే ఆశ్చర్యపోయాను:-). నాకు తెలిసినంత వరకూ “రామ” శబ్దాన్ని స్త్రీ, పురుష, నపుంసక లింగాలుగా వాడవచ్చు. ప్రథమ విభక్తి లో(nominal case)పుంలింగ శబ్దం “రామః” అని, స్త్రీలింగ శబ్దం “రామా” అని, నపుంసక లింగ శబ్దం “రామం” అని రాస్తారని ఎక్కడో చదివినట్టు గుర్తు. (వినికిడి జ్ఞానమేగాని నేను సంస్కృతమెప్పుడు నేర్చుకోలేదు కాబట్టి నేను చెప్పింది తప్పు కావచ్చు).

  కొత్త పాళి గారు, అచ్చమైన తెలుగు నుడికారానికి అచ్చ తెలుగు పదాలే ఉండాల్సిన అవసరం లేదని చెప్పడానికి రానారె గారిచ్చిన “రామసక్కని బంగారిబొమ్మ” అన్న ఉదాహరణ సరిపోతుందేమో? “లైట్ తీస్కో”, “స్టైల్ కొట్టకు”, “కంపల్సరీగ రండి” వంటి ఇంగ్లీష్ పదాల వాడుకలు (Usage) తెలుగు నోటనే వినిపిస్తాయి, కాదంటారా?

  సంస్కృతంతో సంబంధం లేకుండా తెలుగు దేశీయమైన పదజాలాన్ని ఉపయోగించి రాయటం కొత్తపాళి గారు చెప్పినట్టు కష్టమైన పనే. అయితే, “చూరట్టుకు జారుతాది చిటుక్కు చిటుక్కు వానసుక్క”, “ఏతమేసి తోడిన ఏరు ఎండదు; పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు” వంటి అచ్చ తెలుగు పదాలతో రాసిన పాటలను (ఇంకా సంస్కృత పదాలు చాలా తక్కువగా కనిపించే జానపదుల పాటలు, గద్దర్ పాటలు) అర్థం చేసుకోవడం నిజంగా అంత కష్టమేమి కాదనుకుంటాను.

  సురేశ్ కొలిచాల
  (aka వార్త్తిక్)

 15. రానారే గారూ
  నేను వేరే విషయాల మీద విషయ పరిజ్ఞానం గురించి కాదండి మాట్లాడింది, ఒట్టి తెలుగు విషయం గురించే అన్నాను. ఆర్థం చేసుకుంటారనుకుంటాను.

  నాకు తెలిసిన ఒక పదిమంది యువతీ యువకులను తీసుకుంటే, వారిలో ఒకరిద్దిరికి మాత్రమే చాలా చాలా కొద్దిగా తెలుగు భాష మీద, సాహిత్యం మీద పరిజ్ఞానం వుంది. వారిని దృష్టి లో పెట్టుకొనే నేను అ మాట అన్నాను.అందరూ అలా వుండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది అంతే అని నేను అనుకుంటున్నాను.

  కొత్తపాళీ గారు,
  అచ్చ తెలుగు, అచ్చ తెనుగు అని వాడకపోవటమే మంచిది అంటున్నారు. నిజమే కాని తెలుగు దేశీయమైన పదజాలం ఎలా వుంటుందో మా బోటి వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుగుగా చలామణి అవుతుందే మా దృష్టి లో అచ్చ తెలుగు. ఆ మాట వాడటం లో తప్పు లేదనుకుంటాను.

 16. హమ్మయ్య చదవటం పూర్తి చేసా..ఇది చదివే వరకూ నాకు నుడికారమనేది తెలియదు కానీ, నేను చాలా సార్లు వాడానని అర్ధం అయింది :-)

 17. gopalreddy says:

  chala bangundi

 18. swathi says:

  వీళ్ళంతా రాశాక ఇక నాకేం మిగిలింది చెప్పండి..
  మొత్తానికి అద్భుతంగా రాశారు.

 19. వార్తిక్‌గారు,
  వెంటనే స్పందించవలసిన విషయం – రావూరివారికి చదివి వినిపించే సమయంలో ఈ వ్యాసంలోని కొన్ని భాగాలను అప్పటికింకా చేర్చలేదు. అందులో “రామః” ఒకటి. ఈ సంగతి చెప్పడంలోని ఏకైక ఉద్దేశం ఏమిటంటే ఇందులోని తప్పులకు బాధ్యత సంపూర్ణంగా నాదేనని. రామశబ్ధం గురించి మీరన్న విషయం తెలిసినవారినడిగి నేను దిద్దుకుంటానని కృతజ్ఞతాపూర్వక మనవి.

  సుధాకర్, ప్రవీణ్, సుధాస్మైల్, గోపాలన్న, స్వాతిగార్లకు ధన్యవాదాలు.
  సిరిసిరిమువ్వగారు, మీ మాట ఇప్పుడర్థమైంది. ఆ అభిరుచి కలిగించే వాతావరణం అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఔనంటారా?

 20. రామనాథమూ…ఒక మంచి రచన చేసి విపులకు పంపు. తప్పకుండా అచ్చేసుకొంటారు. తరువాత పార్టీ ఇవ్వటం మరచిపోవద్దు :)

 21. అరెరె! ఈ పోస్టు వారాంతంలో రావాడం వల్ల ఇన్ని రోజులు మిస్సయ్యాననుకుంటాను. నుడికారం అంటే కొంత తెలిసీ కొంత తెలియకా వున్న అసందిగ్దతను ఈ వ్యాసం తుడిచేసింది.
  నవీన్, రానారె వ్యాసం విపులలో వస్తే విపులకే అందం. పార్టీ విపులే ఇవాల్సి వుంటుంది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 22. నవీన్, నేను రాయగలననే ధృవీకరణపత్రం లాంటి నీ వ్యాఖ్యకు సంతోషం.
  ప్రసాద్‌గారూ, నా శ్రేయోభిలాషి మీరు. విమర్శలుంటే కూడా విసురుతుండండి. ధన్యవాదాలు.

 23. Happynadh says:

  అన్నా,

  చాలా కస్టపడి, చాలా బాగా రాసినావు. నాకయితే నుడికారమంటేనే తెలియదు.

  చిన్న సవరణ:

  “ఒకోసారి కొంతసేపు పోరాడి రెండిటిలో ఒకటి తోక ఈకలను పైకెత్తేసి అపజయాన్నంగీకరిస్తుంది.”.. కూడి పుంజు వోడి పొతే, తోక ఎత్తి కాదు, తోక ముడిచి, మెడ పైన (మెడ చుట్టూ కాదు) నాలుగు ఈకలు ఎత్తి పరిగిత్త్తుంది. ఆ నాలుగు ఈకలే కొప్పు, అదే కొప్పెత్తడం.

 24. థాంక్యూ గోనా! :) ఈ విషయంలో తలపండిన పండిట్ నువ్వేనని మరొకసారి‌ గుర్తు చేసినావ్. పురహరుని వ్యుత్పత్తి అర్థంకూడా నేను చెప్పినది ఇక్కడ అన్వయించదని తరువాత తెలిసింది. త్రిపురాంతకుడని శివుని పిలవడం వెనుక పురాణం వేరే ఉంది.

 25. lalitha says:

  రానారె గారూ,

  “రామః” స్త్రీలింగం ఎలా అయ్యిందో వివరించ గలరు. ఈ శబ్దాన్ని “అకారాంత పుంలింగ” శబ్దంగా నేర్చుకున్నాము సంస్కృతంలో. మీ వ్యాసంలో మీరు వ్రాసిందీ, వార్తిక్ గారి వ్యాఖలో చదివిందీ తప్ప రామ శబ్దానికి ఇతువంటి వివరణలు ఇంతవరకు ఎప్పుడూ తటస్థ పడలేదు. “రామం” అన్నది రామ శబ్దం ద్వితీయా విభక్తి ఏక వచనం.
  “రామం, రామౌ, రామాన్”

  ఈ సందర్భంగా ఈ శ్లోకం ప్రస్తావించాలనిపించింది. ఇందులో రామ శబ్దం అన్ని విభక్తులు, (ఏక వచనం) ఉంటాయి.

  “రామో రాజమణిః సదా విజయతే
  రామం రమేశం భజే
  రామేణాభిహతా నిశాచర చమూః
  రామాయ తస్మై నమః
  రామాత్ నాస్తి పరాయణం పరతరం
  రామస్య దాసోస్మ్యహం
  రామే చిత్త లయః సదా భవతు మే
  భో రామ! మాముద్ధర!”

  లలిత.

 26. లలితగారూ,

  ఎనిమిది నుండి పదవ తరగతి వరకూ మాకు కొంచెం సంస్కృతం నేర్పారు. అప్పుడు “ఎందుకీ ఖర్మ, ఇవి ఉపయోగపడతాయా పాడా” అనుకుంటూ చదువుకున్నవే ఈ శబ్దాలూ వాటి విభక్తి ప్రత్యయాలూను. అలా చదివిన చదువులోనుండి నాకు గుర్తున్నది రామ శబ్ధం స్తీలింగశబ్దమని. వార్తిక్‌గారు అడిగినప్పటినుండీ ప్రయత్నిస్తున్నాను ఈ సంగతి నిజమాకాదా తెలుసుకొందామని. సంస్కృతం బోధించే ఉపాధ్యాయులెవరూ నాకు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆలస్యంగానైనా నా మాట నిజమైతే మీకు వివరణో, తప్పైతే పాఠకులకు క్షమాపణో చెబుతాను. మీకు తెలిసిన ఉపాధ్యాయులుగానీ, విద్యార్థులుగానీ ఉంటే వారినడిగి లేదా పుస్తకాలు చూసి మీరైనా తెలుపగలరు. అందుకు మీకు కృతజ్ఞతలు.

 27. lalitha says:

  raanaare gaarU,

  If that is your resource, I can safely say that there is no doubt you are mistaken.

  For authenticating my explanation, let me say that I come from a family of Sanskrit teachers/ lecturers and am married into another similar family. I learnt Sanskrit as a language in high school and continued on to junior and degree college as second language.

  I sounded a wee bit skeptical earlier only because you seemed to have spent considerable time and effort on your research for the article and you seem to be in touch with knowledgeable people.

  Also, many bloggers seem to have better authority than me. I wondered why anyone wouldn’t point out such an elementary misunderstanding unless it has some percentage of truth to it somewhere.

  Regards,
  lalitha.
  p.s. “రమా” అన్నది స్త్రీలింగ శబ్దం.

 28. ఇలాంటివేవైనా ఇలాంటి వేదికలమీద రాసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలన్నది నేను నేర్చుకొన్న పాఠం. వాక్యం భలే ఉందికదూ అని నాకునేనే మురిసిపోతూ రాశాను “రామశబ్దం స్త్రీలింగమని తెలుసుకొని ఆశ్చర్యపోకండి” అని. లలితగారి మాటలనుబట్టి ఈవిషయంలో నాది తప్పని తెలుస్తోంది. రామ శబ్దం పుంలింగమట. పాఠకులు నన్ను క్షమించాలి. ఈ వ్యాసంలో ఒకచోట ఇలా అర్థించాను మొట్టికాయలకోసం:
  “ఇది పరిశోధనా వ్యాసం కాదు. ఈ విషయం మీద నాకు కలిగిన అవగాహనకు సంక్షిప్త రూపం ఈ వ్యాసం. తప్పులుంటే మన్నించి, తెలిసిన పెద్దలెవరైనా నాకు మొట్టికాయలు వేసి నన్ను సరిదిద్దవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాను.” సరిదిద్దినందుకు లలితగారికి ధన్యవాదాలు. ఇలాంటి విమర్శలు, ఒకోసారి అవి రేపే చర్చలు పత్రిక స్థాయిని పెంచేందుకు దోహదపడతాయి కూడా.

  రామలు అంటే స్త్రీలు అనే అర్థం ఉంది. ‘రామలారా’ అంటే ‘అమ్మలారా’ అని సంబోధించినట్లు అర్థం. భాగవతంలోని ఈ పద్యం చూడండి:
  అన్య మెఱుగడు; తనయంత నాడుచుంటు;
  మంచివా డీత; డెగ్గులు మానరమ్మ;
  రామలార; త్రిలోకాభి రామలార!
  తల్లులార: గుణవతీమతల్లులార;

  చిన్నికృష్ణుని ఆగడాలగురించి యశోదమ్మకు ఏకరుపెట్టే బాధిత గొల్లభామల మాటలను నమ్మనట్లుగా నటిస్తూ తన కుమారుడు అమాయకుడనీ, ఎగ్గులు (చాడీలు) మానమనీ వారికే చెబుతుందామె.

 29. lalitha says:

  రానారె గారు,

  మీ వ్యాసం బాగుంది. నేను నేర్చుకునేదే కాని వ్యాఖ్యనించగలిగే పాండిత్యం లేదు నాకు ఆ విషయం మీద. అయితే, నాకు కనిపించిన “అచ్చు పొల్లు” వంటి దాన్ని గమనించి రాశాను అంతే. ఇంకా పండితులు ఉన్నారు కదా వారెవరైనా వేరే వివరణ ఇస్తారేమో, నాకు తెలియనిది తెలుస్తుంది అని అనుకున్నాను కూడ. ఎవరూ ముందుకు రాక పోయేసరికి నా మాటల మీద మీకు నమ్మకం కుదరడం కోసం నా “వంశ చరిత్ర” చెప్పాను అంతే.

  ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు సంస్కృత పాఠాలు మొదలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకు, సందేహాలకు ఇప్పుడు సమాధానాలు అక్కడ కానీ, ఆయనను అడిగి కానీ తెలుసుకోవచ్చు ఇక పైన.

  లలిత.

 30. లలితగారు, నేనెంతమాత్రం నొచ్చుకోలేదండి. నిజానికి మీకు కృతజ్ఞుణ్ణి. చదువరులలో కొందరైనా గమనించే ఉంటారు, కానీ వార్తిక్ గారు మరియు మీరొక్కరే చెప్పారు. అందుకు సంతోషం. తాడేపల్లిగారు ఈ వ్యాసాన్ని చదవలేదేమో.

 31. సాయి says:

  మంచి వ్యాసం , మంచి విషయాన్ని ఎన్నుకొన్నారు..అన్ని ప్రాంతాల వారి నుడికారాలు ఒక దగ్గర సమకూర్చే ప్రయత్నం చేస్తే బావున్ను.
  పైన అందరి కామెంట్లు చూస్తుంటే తెలుగు సాగర మదనం జరుగుతున్నదనిపిస్తుంది.. కొందరికి కాస్త కష్టమనిపించిన చివరికి అమృతం ఉద్బవించటం ఖాయం అన్నమాట.

 32. ఒద్దిరాజు చందర్ కుమార్ says:

  చాలా మంచి వ్యాసం. చాలా కాలం తరువాత ఒక మంచి తెలుగు రచన చదివాననె అభిప్రాయం కలిగింది. రెనారె గారికి అబినందనలు.

 33. sankaram ane rajasekaram says:

  caala baagundi
  congragulations

 34. రాఘవ says:

  నాకు తెలిసినది నాకు తోచినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

  మనం కొలిచే శ్రీరాముడికి/బలరాముడికి/భార్గవరాముడికి సంబంధించిన ‘రామ’ అన్నది సంస్కృతంనుండి తెలుగులోకి వచ్చిన తత్సమమన్నమాట. అసలు సంస్కృతశబ్దం ‘రామః’ అని. తెలుగులో యీ ‘రామ’ కాక మరో ‘రామ’ కూడా వుంది, అది కూడా సంస్కృతంనుండి వచ్చినదే, కాకపోతే అది ‘రామా’ అన్న సంస్కృత శబ్దంనుండి. ‘రామా’ అన్న యీ సంస్కృతశబ్దానికి అర్థం ‘అందమైన వనిత’ అని. తెలుగు తత్సమాల్లోకి మారే దారిలో యీ రెండూ ‘రామ’ గా మారిపోయాయి. కాబట్టి,

  రామః అన్నది సంస్కృతమే. తెలుగులో రామ స్త్రీలిఙ్గవాచకమే(పుంలిఙ్గవాచకం కూడా).

  కాబట్టి లలితక్కా (నేను లలిత గారిని అక్కా అని పిలుస్తాన్లెండి) కరెక్టే, రానారె కూడా కరెక్టే! రానారె చెప్పింది తప్పెందుకుకాదో ఆయన వ్రాసిన దానిని (లేదా పై రెండు వాక్యాలని) మళ్ళీ చదివితే తెలుస్తుంది.

  బహుశః యిక యీ రామ సమస్య తొలగిపోయినట్లే అని అనుకుంటున్నాను. [రామ = అందమైన]

  తర్వాతి విషయం. అయ్యా రామనాథరెడ్డి గారూ, మీరు నొచ్చుకోనంటే వొక్ఖ మాట…

  మీరు వుటంకించిన:

  గరళము మ్రింగితినంచును
  పురహర గర్వింపబోకు పో!పో!పో!
  బిరుదిప్పుడు కానవచ్చెడి
  మెరిసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ!

  అన్న పద్యంలో నాకు రెండు ఛందోలోపాలు కనబడ్డై.

  మూడు “ఫో” లు సరిపోవేమోనని, మరొకటి అవసరమేమోనన్నది మొదటిది.
  ‘బిరుదిప్పుడు కానవచ్చెడి’ లో “డి” అక్కరలేదని రెండవది.

  ఇట్లు బుధజవిధేయుడు
  రాఘవ

 35. రాఘవ says:

  There was a mistake, the Lalitha garu that I thought and the Lalitha garu here are different it seems. Hope the address that I made doesn’t confuse the new Lalithakka! :)

 36. lalitha says:

  Rghava garu,
  I prefer being addressed by just the name. Anyway, about your explanation, can you please give some examples of usage of the feminine raamaa in Sanskrit. It will be interesting to know.

 37. నొచ్చుకోవడమా!? పొగడ్తలెంత ఉత్సాహాన్నిస్తాయో, తప్పులను సరిదిద్దుకొమ్మనే విమర్శలు అంతగానూ మేలుచేస్తాయి కదా. వాగ్విలాసులు మీరు “వొక్ఖ మాట” కాదు, వంద చెప్పవచ్చు నాకు. మీరన్నది నిజమేనండి. కారణమేమిటంటే, ఈ వ్యాసం రాసేటప్పటికి నాకు కంద’ఛందా’లు తెలియవు. తరువాత మా గురూజీ చెప్పారు. నేర్చుకున్నాను. మీ సద్విమర్శకు స్వాగతం. కృతజ్ఞతలు.

 38. padma says:

  chala bagundi. inta manchi website innirojulu telinanduku badhaga vunnadi. thanks

 39. chaithanya reddy says:

  hai ramu reddy,
  expecting next writing very soon.

 40. Sacrip says:

  Very Nice! Thanks!

 41. చంద్ర మోహన్ says:

  రానారె గారు,
  తెలుగు నుడికారం పై మీ వ్యాసం చాలా బాగుంది. భాషా విషయాలపై ఇలాంటి వ్యాసాలు విరివిగా రావాలి.అభినందనలు, మీకూ, పొద్దుకూ కూడ.

  ఇక రామ శబ్దం గురించి: ’రామ’ అన్న సంస్కృత పదం పుల్లింగం. దానికి అందమైన, ఆకర్షణీయమైన, నల్లని, తెల్లని ఇలాంటి అర్థాలున్నాయి.నల్లని వాడు, అందమైన వాడు కనుక రాముడని పేరు పెట్టారేమో! ఇక ’రామా’ అన్న స్త్ర్రీలింగ శబ్దానికి [అందమైన]స్త్ర్రీ, ప్రియమైన భార్య/ప్రేయసి వంటి అర్థాలున్నాయి.రాఘవగారు చెప్పినట్లు తెలుగులోకి వచ్చినప్పుడు రెండు పదాల అర్థాలు కలిసిపోయి ఒకే రామ శబ్దానికి అన్ని అర్థాలూ వచ్చేశాయి. శబ్ద రత్నాకరం ’రామ’ శబ్దాన్ని ఉభయ పదంగా పేర్కొంది. అనగా సంస్కృతార్థాలను, తెలుగు అర్థాలను కూడా (సందర్భాన్ని బట్టి) సూచించేది అని. తెలుగు నిఘంటువుల్లో రామ శబ్దానికి సంస్కృతంలోని రెండు శబ్దాల అర్థాలూ ఉన్నాయి. కనుక తెలుగు నుడికారం పరంగా మీరు వ్రాసింది సరియైనదే.

  శ్రీనాధుని పద్యం నాకు తెలిసిన పాఠం ఇదీ:

  గరళము మ్రింగితి ననుచును
  పురహర గర్వింపబోకు, పో!పో!పో! నీ
  బిరుదింక గాన నయ్యెడి
  మెరిసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ!

  అభినందోలత్

 42. rani says:

  తెలుగు నుడికారం గురించి ఇంత తియ్యని చర్చ జరుగుతున్నా ఇన్నాళ్ళూ చూడలేకపోవడం దురదృష్టం.
  ఎవరెన్ని చెప్పినా తెలుగు తీయనిది. మరి మీరేమిటి ? అంత తియ్యని తెలుగు వ్యాసం రాస్తూ తెలుగు నుడి కారం అంటున్నారు ?

 43. సతీష్ says:

  తొలుత నేను చెప్పాలనుకున్నది ఏమంటే ,సంకృత ,ఆంగ్ల పదాలను విరివిగా వాడటం వలన తెలుగు పదాలు మరుగున మగ్గి ,అ తరువాత కను మరుగు అయితయి.మచ్చుకగా కొన్ని నాకు తోచిన పదాలను మీ ముందుంచుతున్నను.
  చాన మంది తాము మాట్లాడే పదాలు చాలా సబ్యత తో కూడు కొన్నట్టుగ ఉహనిపిoపులతో తెలుగును తెర వెనుక ఉంచుతుండ్రు(ఉంచు తుండారు),మరి కొంత మందికి ఇవి తెలీనే లేవు.
  జలం=నీళ్ళు
  శవం =పీనుగు
  స్మశానం=వల్లకాడు
  పుస్తకం=వొయ్యి
  page=కమ్మ
  page=కమ్మ
  ఆలస్యం=జాగు
  ఫీలింగ్స్=అనిపింపులు
  భర్త=మొగడు
  భార్య=పెండ్లాం
  దర్జీ= మేర
  కాలర్=గల్ల
  address=జాడ,పత్తా(దేశికరిమ్పబడిన పదం)
  ఇంకా ఉన్నయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *