యర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తెలుగు బ్లాగుల్లో అత్యుత్తమ బ్లాగులను ఎంచవలసి వస్తే మొదటి మూడు స్థానాల్లో యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. పొద్దు పొడవడం ఆయన రచనతోటే జరగడం మాకు గర్వకారణం. అడిగినదే తడవుగా వ్యాసం రాసిచ్చిన రామనాథరెడ్డి గారికి కృతజ్ఞతలతో ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.
____________________________________
“రాము పాటలు చాలాబాగా పాడతాడు”. ఇది విననట్లే కనిపిస్తున్నాడు కానీ, ఐదేళ్ల రాముకు ఈ మాట నచ్చింది.
“ఔను. ఏదీ, నాయనా, ఒక పాట పాడు”. కొందరి ముఖాలు అప్పటికే రామును చూస్తున్నాయి “ఊ.. పాడాల్సిందే” అన్నట్లు.
గుర్తింపు. ఆ గుర్తింపు తెచ్చే ఆనందకరమైన ఇబ్బంది. అ ఇబ్బందిని దాటి కొంచెం సర్దుకొంటుండగానే తనకోసం అందరికీ మధ్యలో చోటు సిద్ధం.
అదొక సభ. అందులో ఇప్పుడు రాము ఒక సభ్యుడు. సభామర్యాదలింకా సరిగా తెలియకుండానే సభ్యసమాజంలో రేపటి పౌరుడు. కూర్చొని తనూ ఆనందిస్తూ పాడిన ఆ పాట పూర్తవగానే అభినందనల వెల్లువ, ఆ వెల్లువలోనే మరో పాట పాడాలంటూ ఎవరిదో కంఠం. ఇదే పాట మళ్లీ పాడాలని మరో అభ్యర్థన. విసుగనేది లేకుండా ఆ ఉత్సాహంలో అలా పాడేయటమే రాము పని.
ఎక్కడైనా మనకు గుర్తింపు వున్నపుడు, అది కల్పించే ఆనందాన్నీ హోదానూ అనుభవిస్తున్నపుడు, దాన్ని కాపాడుకొనే బాధ్యత కూడా మన వెన్నంటే వుంటుంది కదా. మరి ఐదేళ్ల వయసున్న రాము ఈ గుర్తింపును పోనీయకుండా ఎలా కాపాడుకోవాలి? అణకువతో మరికొంత సహనంతో తన అభిమానగణం మధ్యన మెలగటం ద్వారా. ఇలాంటి ప్రవర్తన తన వర్తమానానికి, భవిష్యత్‌కు ఎలా మేలుచేస్తుందో తల్లిదండ్రులు రాముకు అర్థమయేలా వివరించడం ద్వారా. అణకువలేమి లేక గర్వం వినాశనానికి హేతువనే విషయం విశదమయేలా తనకు వివరించగల తండ్రిద్వారా. “వినయేన శోభతే విద్యా!” మంత్రంలాంటి ఈ మాట దాని అర్థంతోసహా అవగతమయి గుర్తుండిపోయేలా చేసిన ఇతర పరిస్థితుల ద్వారా.
*** *** *** ***
వానాకాలం. మోజులు మోజులుగా వాన. కోడిపుంజులు, పెట్టలు, బొమ్మెలు (అప్పుడే యవ్వనంలోకి అడుగిడిన కోళ్లు), పిల్లలకోళ్లు అన్నీ గొడవలు మరచి వసారా కింద చేరేవి. వానవెలసినప్పుడు మరోమోజు వాన వచ్చేలోపు పురుగుల్ని దొరకబుచ్చుకొని తినడానికి వసారా కిందనుండి బయటకు వచ్చే కోడిబొమ్మెలను, మేతకోసం వాటిని తరిమేసే పిల్లలకోళ్లను, వీటిని తరమే పైకోళ్లు, ఈ మధ్యలో ఆ పురుగుల్ని పైకోళ్లనుండి దొంగిలించేసే పైలాపచ్చీసు కోళ్లు, యశస్వి యస్వీరంగారావులాగా పెద్దరికం వెలగబెట్టే ఇంటిపెద్దలాంటి పుంజు.
ఇంత కోలాహలం చేసే కోళ్లను చూడకుండా వుండలేక, గడపమీద కూర్చొని, అవ్వ నూరిన చెనిగ్గింజల ఊరిమిండి (వేరుశనగ చట్నీ), అమ్మ వేసిచ్చే పలుచని వేడిదోశలు స్టీలు గిన్నెలో వేస్కుని బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న పదేళ్ల రాముకు ఒక గదమాయింపు వినబడింది “రేయ్, గడప మింద నిలబడగూడదు, కూర్చోకూడదు. దిగు. ఇటుగానీ అటుగానీ ఉండి తిను.”
“యాఁ…!?” కొంత భయం, కొంత అసహనంతో కూడిన ఆ శబ్దానికి రాము భాషలో “ఎందుక్కూర్చోకూడదు?” అని తాత్పర్యం.
“అది నరసింహస్వామి కూర్చొన్న స్థలం. ఆయనక్కడ హిరణ్యకశిపుని పొట్టచీల్చి పేగులు మెళ్లోవేసుకొన్నాడు. దేవతలంతావచ్చి ప్రార్థించినా ఉగ్రరూపం చాలించలేదు…”
“హిరణ్యకశిపుని చంపడం ఎందుకు, గడపమింద కూర్చున్నాడనా?”
“ఓరి పిచ్చి నాయనా, అందుక్కాదు … ….కాబట్టి… … అందుగల డిందులేడను సందేహంబు వలదు, ఎందెందు వెదకిచూసిన అందందే గలడు, చక్రి సర్వోపగతుండు… కాబట్టి గడపదిగు.”
వాడు దుర్మార్గుడు కాబట్టి దేవుడు చంపాడు. అది గడపమీద జరిగింది. కాబట్టి ఎవరూ అక్కడ కూర్చొని వానను కోళ్ల మేత కీచులాటను చూడకూడదు. రాముకు ఇది చాలా అన్యాయం అనిపించింది. గడప దిగకుండానే సపోర్టుకోసం అమ్మవైపు చూశాడు. అమ్మ రాముకు దోశలు వేసే పనిలో వున్నట్లు నటిస్తోంది. నాయన వైపు చూశాడు. ఇబ్బందిగా కదిలాడు నాయన. రాముపై కాస్త చిరాకు నటిస్తూ వాకిట్లోంచి బయటికి చూస్తూ “వాకిట్లో అందరికీ అడ్డమెందుకురా లెయ్అణ్ణించి, కడవల్తో నీళ్లుబట్టుకొని గడపదాటుతుంటారు మీఅమ్మోళ్లు”. ఇది రీజనబుల్‌గా వుంది, న్యాయంగా వుంది, బాగుంది. లేవబుద్ది కాలేదు గానీ లేవక తప్పిందికాదు. రాముకిది సుప్రీంకోర్టు తీర్పు. ఇంక నో అప్పీల్.
పదేళ్ల వయసున్న రాము మనసులోని ఆ తర్వాతి ఆలోచనల సారం ఇది:
- మనసు అంగీకరించకపోయినా మన ఆహ్లాదం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టరాదు.
- నరసింహస్వామి అక్కడేదో చేశాడనికాదు, అందరికీ అడ్డం కాబట్టి గడపమీద కూర్చోకూడదు.
- అవ్వది చాదస్తం. నరసింహస్వామికి రాముపై కోపమొచ్చి ఏమైనా చేస్తాడేమోనని ఆమె భయం.
- అవ్వకు ఏదైనా ఎదురు చెప్పవలసి వస్తే అమ్మ ఆ ఇబ్బందిని తప్పించుకోవడంకోసం విననట్లు నటిస్తుంది.
- అవ్వకు ఎదురు చెప్పడం నాన్నకూ ఇబ్బందిలాగే వుంది కానీ కొంచె తెలివిగా చెప్పేస్తాడు.
- ఇలా నటించే అవసరం రాముకు లేదు. భవిష్యత్‌లో కూడా రాకుండా చూసుకోవచ్చు.
- తనకేదైనా ఆలోచన వస్తే దాన్ని విమర్శించేవారు, సమర్థించేవారు వుంటారు. తార్కికంగా ఆలోచించి, పెద్దలతో చర్చించి మనకు సరైనదనిపించే మార్గంలో నడవాలి.
- ”వినయేన శోభతే విద్యా!” అన్నారుకదా అని వయసులో పెద్దవారు చెప్పే ప్రతి మాటా గుడ్డిగా ఆచరించనవసరం లేదు.
అలాంటి తల్లిదండ్రులకు బిడ్డ కావడంవల్ల స్వతంత్రంగా ఆలోచించే గుణం పెంపొందింది రాముకు. ఇలాంటి పెంపుదల ఫలితం – కొంత విశాల దృక్పథం.
*** *** *** ***
ఇక్కడ ఇంకో రామూని తీసుకుందాం – కేవలం ఉదాహరణగా. గడపదిగమని గదమాయిస్తే “యా…!?” అని ప్రశ్నించడం, సపోర్టుకోసం వెదకడం ప్రతి రామూ చేసే పనే. ఈ రామూ గతి చూద్దాం. “సాక్షాత్తూ నాయనమ్మనే ఎదురు ప్రశ్నలు వేస్తావా, నరసింహస్వామి అంటే ఏమనుకున్నావ్, కొంచెం కూడా భయం భక్తి లేకుండాపోయింది నీకు” అని వాతలు పెట్టే తల్లిదండ్రులు . పిల్లవాని తర్కానికి తమ బెత్తంతో సమాధానం చెప్పే ఆ మాతాపితలను వారిస్తూ “వాణ్ణి కొట్టకండని”రక్షించడానికి అదే పితామహి (అవ్వ) మళ్లీ రంగంలోకి వస్తుంది.
అపుడు అయోమయానికి గురైన ఆ పిల్లవాని ఆలోచనల సారం ఇది:
- నాయనమ్మ వలన నాకు వాతలు పడినవి. ఆమె బ్రహ్మరాకాసి. అమ్మనాన్నలూ రాక్షసులే.
- “మళ్లీ నానమ్మే రక్షించిందే! తను బాధపడుతూ నన్ను ఓదారుస్తోందే! అంటే తన తప్పు అంగీకరించినట్లా?” ఏదేమైనా తర్కాన్ని తుంగలో తొక్కవలయును.
- ప్రశ్నించడం తప్పు. ప్రశ్నించినచో వొంటిపై వాతలు పడును.
- నాయనమ్మను అస్సలు ఎదురు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఆమే వచ్చి రక్షించేదాకా అమ్మానాన్న కొడుతూనే వుంటారు.
- నరసింహస్వామి పట్ల భయము, భక్తి రెండూ తప్పనిసరిగా వుండవలెను. ఎందుకనగా అవి లేకపోతే వాతలు తప్పవు.
అంతే అక్కడితో అగుతాయి ఆలోచనలు. కానీ అతని మనసు చల్లబడదు మళ్లీ అమ్మనాన్న తనని దగ్గరచేసుకొనేదాక. ఇలా ఈ రామూకు పుట్టుకతో వచ్చిన సృజనాత్మకత, తర్కించే గుణం మొగ్గలోనే కొంత తుంచివేయబడటం జరిగింది. ఈ అణచివేత ఫలితం – కొంత మానసిక అనిశ్చితి, కొంత సంకుచిత మనస్తత్వం .
*** *** *** ***
ప్రతి చిన్న ఘటన గురించీ రాము ఆలోచిస్తాడు కదా మరి.ఆలోచించి, ఆ సారంతో కొన్ని సంగతులు నేర్చుకొంటాడు. ఒక చిన్న సాధారణ దైనందిన ఘటన రెండు రకాల రామూలను తయారు చేసింది. తన ఎదుగుదలలో ఎన్ని ఘటనలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని పాఠాలు! ఈ రెండు రకాలే కాదు ఎన్నో రకాల రామూలుంటారు మనం గమనిస్తే. మన సమాజం ఇలాంటి రకరకాల రామూలతోనే కదా తయారయింది.
“నేను ఏ రకం రామూని” అని మనకు మనం ఆలోచిస్తే మనకూ అర్ధం అవుతుంది – మనం పెరిగిన పరిస్థితులు మన ఎదుగుదలపై ఎలాంటి ప్రభావంచూపాయో. మన మనసు ఎంత విశాలమో లేదా ఎంత సంకుచితమో ఆలోచనకొస్తుంది. ఈ ఆలోచన మన వ్యక్తిత్వాన్ని మరింత వికసింపజేసుకొనే అవకాశం కల్పిస్తుంది. తప్పకుండా ప్రతి రామూ కూడా “అంత మంచిది కాని” లక్షణాన్నొకదాన్నైనా అలవరచుకొని వుంటాడు – తన తల్లి లేదా తండ్రి లేదా ఇతర వ్యక్తుల ద్వారా . ఇవన్నీ మన వ్యక్తిత్వం రూపుదాల్చడంలోని మూలకాలు అవుతాయి.
*** *** *** ***
వ్యక్తి+త్వం. నీవొక వ్యక్తివి అని నీకు గుర్తుచేసే మాట. నీకు ఒక గుర్తింపునిచ్చే మాట. నీ వ్యక్తీకరణల -మాట,చేష్ట, మరే ఇతర కళారూపంలోనైనా- పరిణామాలకు నీదే బాధ్యత అని గుర్తుచేసే మాట. మనల్ని ఎదుటివారందరిలో చూడగలగటం, ఎదుటివారిలోని మన తత్వాన్ని గుర్తించడం వ్యక్తిగా అనవరతం మనం చేయాల్సినది. వ్యక్తిత్వం, గుర్తింపు, హోదా, బాధ్యత – బాగా బరువైన మాటలు మాట్లాడుతున్నాను కదా. కానీ విషయం మరీ గంభీరమైనదేమీ కాదు. మనకు కొంతైనా ఉపయోగపడేదే. ఔనంటారా?.
ఒక మంచి మనిషి పరిచయమయ్యాడని చాలా సంతోషముగా ఉన్నది – అన్నారో బ్లాగు మిత్రుడీమధ్య. మనలో చాలా మందిమి స్వభావరీత్యా మంచిమనుషులమే. కానీ చిన్న అభిప్రాయభేదం ముభావంగా మారిపోయేలా చేస్తుంది – దీనికి కారణం ఎంత చిన్నదైనా కావచ్చు. “నేననుకున్నంత మంచోడు కానట్టున్నాడితడు” అని మనకు అనిపించడానికీ, ఎదుటివారికి మన గురించి అలా అనిపించేలా చేయడానికీ కారణం సాధారణంగా చిన్నదే అయివుంటుంది, ఉదాహరణకు, ఆ ముందు రోజు రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడంతో వచ్చిన అలసట -> చికాకు . తర్కానికి లోబడి సాగే సాధారణమైన చర్చ ఒక సన్నని గీతదాటి వితండమయే పరిస్థితిలో – నేరములే తోచుచుండు.
ఈ గీతను ప్రతిరోజూ ప్రతి సందర్భంలో గుర్తించగలగడం అసాధ్యమే కావచ్చు. కానీ అదే అనుదిన లక్ష్యంగా అందరూ మనవాళ్లే అనే భావనతో కొనసాగటం ఒక మహా ప్రస్థానం. ప్రస్థానమంటే ప్రయాణమని అర్థం. ఈ మహాప్రయాణం మన వ్యక్తిత్వాన్ని మెరుగు పరచడం వైపు. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందని ఒక చైనా సామెత.
–యర్రపురెడ్డి రామనాథరెడ్డి (http://yarnar.blogspot.com/)
neanu okkosari okko raamulaa pravartistuu vuntaanu.miirannattu antaa pempakamloanea vumtumdi.caalaa cakkati vyaasam.ilantivi amdaru tappaka cadavaali.
చాలా అద్బుతంగా ఉంది వ్యాసం. చిన్న పిల్లల అలోచనా సరళిని, ఆ తర్వాత తయారయ్యే మనశి వ్యక్తిత్త్వాన్నీ కూడా చాలా చక్కగా చేప్పారు.
ఇది చదవగానే కొన్ని ఏళ్ళ క్రితం నాకు, మా తమ్ముడికి మధ్య జరిగిన సంభాశణ గుర్తోచ్చింది.
అదేంటి అంటే, ఈ పెద్ద వాళ్ళు ప్రతీ పనినీ అలా చేయాలి, ఇలా చేయాలి అని ఎందుకు చేప్తూ ఉంటారు అని !
అప్పుడు మా తమ్ముడు చెప్పిన సమాధానం ః
మనము చేసే ప్రతీ పనికీ కూడా scientific reason ఉంటుంది, కానీ చిన్న పిల్లలకి అంత scientific గా చెప్తే ఏమి అర్థం అవుతుంది ? అందుకె అలా ఏవో కాకమ్మ కథలు చెప్తూ ఉంటారు పెదవాళ్ళు అని అన్నాడు !!
అక్కడికి వాడేదో పెద్ద వాడు అయినట్టు,
అప్పుడు వాడు ఏడో తరగతి చదువుతున్నాడు…
ఎదైనా చెప్పడంలో రానారె ప్రత్యేకతే వేరు!
పెంపకం ప్రాధాన్యత గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు?
పెంపకంతో పాటే వ్యక్తిత్వాం అనేది పుట్టూకతోనే కొంత వస్తుంది (జీన్స్ ద్వారా) అని నేను నమ్ముతాను. అచ్చు అనేది ఒకటే అయినా అందుళొ పేసేది ఇనుమా, మట్టా లేక సిమెంటా అనేదాన్ని బట్టీ చివరగా ఏర్పడిన ఆకారపు దృడత్వము ఆధారపడినట్లే, తల్లిదండ్రుల పెంపకము ఒకేలా వున్నా భిన్న వ్యక్తిత్వాల వల్ల వారి బిడ్డలు భిన్నంగా తయారయ్యేది చూస్తూనే వున్నాం.
అయినా పెంపకం ప్రాధాన్యత ఎక్కువే అని నేను ప్రగాడంగా విశ్వసిస్తున్నాను.
–ప్రసాద్
http://blog.charasala.com
మంచి మాట చెప్పటం ఒక ఎత్తైతే, అదేమాట చొప్పించేలా చెప్పటం ఇంకొక ఎత్తు. మాండలికాల్లోని సొబగును అందిస్తూ వచ్చిన రానారే, విశ్లేషణసైతం సున్నితంగా – సూటిగా చెప్పడం మరింత అద్భుతం. రానారే కన్నా, రానారేని వ్రాయమని అడిగిన వ్యక్తికి నా అభినందనలు.
అమ్మ రానారె నీ లీలలు ఇంతింత కాదయ.
యాణ్ణుంచో మొదులు పెట్టి యాడికో పూడిసినావ్.
చానా బాగ సెప్పినావబ్బా.
ఈ కుర్రోడు ఎంత బాగా చెప్పీసినాడు.
ఈ పోరగాడు సక్కత్గ చెప్పిండు.
Hey bro..u r so kewl u know.
విహారి.
hhtp://vihaari.blogspot.com