మృతజీవులు – 26

-కొడవటిగంటి కుటుంబరావు

“ఒక్కసారి చూడండి బాబూ, వాడి మొద్దు మొహం! కొయ్యదుంగ కెంత తెలివి ఉంటుందో వీడికీ అంతే! కాని అలా ఏదన్నా ఉంచారో, క్షణంలో కాజేస్తాడు! ఎందుకొచ్చావురా వెధవా, ఎందుకొచ్చావంట?” అంటూ ఆయన ఆగాడు. పోష్క కూడా మౌనంతోనే సమాధానం చెప్పాడు.

“సమవార్ సిద్ధం చెయ్యమంటుంటే- ఇదుగో, ఈ తాళపు చెవి తీసుకుపోయి మాన్రకిచ్చి సామాన్ల ఇంటికి పొమ్మను. అక్కడ షెల్ఫ్ మీద అలెగ్జాంద్రస్తిపనోవ్న తెచ్చిన కేకుముక్క ఉంటుంది. టీతో తీసుకోవచ్చు… ఆగరా, మొద్దు వెధవ, మొద్దు వెధవాని! ఎక్కడికా పోత?… చెప్పేది వినక్కర్లా? కేకు పైభాగం కాస్త బూజుపట్టి ఉంటుందేమో, కత్తితో పైపైన గీకుమను, ఆ తుంపులు పారేసేవు, వాటిని కోళ్లకు వెయ్యి. అదిన్నీ, నువుమాత్రం సామన్లఇంటోకి పోకు. నా తండ్రి, పోయావంటే బెత్తంతో ఇచ్చుకుంటాను. తెలుసా కరకరా అకలి పుట్టుకు రావలిసిందే. అసలే నీకు ఆకలి జాస్తా, దాన్ని ఇంకా జాస్తి చేస్తాను! సామాన్ల ఇంటోకి అడుగు పెట్టిచూడు! కిటికీలోనుంచి అంతా చూస్తూనే ఉంటాలే!…”

బూట్లు వేసుకుని ప్రోష్క వెళ్లి పోయాక ఆయన చిచీకవ్ తో “వీళ్ళను కొంచెం కూడా నమ్మటానికి లేదు” అని అతన్నికూడా అనుమానంతో చూడనారంభించాడు. ఇంత ఉదార బుద్ధి ఆయనకు నమ్మశక్యంగా కనిపించలేదు. ఆయన తనలో ఇలా అనుకున్నాడు:

“వీడి ఎత్తుగడ ఏమిటో చచ్చినా తెలియటం లేదు. డబ్బు దుబారా చేసే వాళ్లందరిలాగే కోతలు కోసేస్తున్నాడేమో. ఊసుపోకకు ఇలా కోతలు కోసికోసి, ఇంత టీ తాగి చక్కా పోతాడు!”

అందుకని జాగ్రర్త పడ్డట్టూ అవుతుంది. ఆ మనిషిని పరీక్షించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ అమ్మకం పని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదనీ, పురుషులతో కూడిన వ్యవహారాలను గురించి ఏమీ అనుకోవటానికి లేదనీ, ఇవాళ బతికున్న వాడు రేపు ఉండడనీ అన్నాడు.

“నా భార్య స్వయంగా తయారు చేసింది. ఇల్లు చూసుకునే ముండ అంతా అవతల పారేస్తానన్నది, మూతకూడా పెట్టలేదు, పాపిష్టిది! పురుగులూ, చెత్తా పడింది అందులో. అదంతా తీసేశాను, శుభ్రంగా వుంది. మీకొక గ్లాసెడిస్తాను” అన్నాడు ప్ల్యూష్కిన్.

వ్యవహారమంతా ఈ క్షణంలో పూర్తి చెయ్యటానికి కూడా తాను సిద్ధమేననీ, తనకు కావలసిందల్లా కమతగాళ్ళ పూర్తి జాబితా మాత్రమేననీ చిచీకవ్ అన్నాడు.

దీనితో ప్ల్యూష్కిన్ కు ధైర్యం వచ్చింది. ఆయన ఏదో చేయ సంకల్పించిన వాడిలాగా కనపడ్డాడు, చివరకు నిజంగానే తాళం చెవులు తీసుకుని అలమార దగ్గిరికి వెళ్ళి తలుపు తెరిచి గ్లాసులూ, కప్పులూ తడివి, “ఇది కనిపించదేం? ఇక్కడ మంచి సారా వుంచాను, తాగేశారు గామాలు, వట్టి దొంగ వెధవలు! ఓహో, ఇదేలాగుంది!” అన్నాడు.

చిచీకవ్ కు ఆయన చేతిలో ఒకలోటా కనిపించింది. చొక్కా తొడిగినట్టు దానిమీద మందంగా దుమ్ము వున్నది.

“నా భార్య స్వయంగా తయారు చేసింది. ఇల్లు చూసుకునే ముండ అంతా అవతల పారేస్తానన్నది, మూతకూడా పెట్టలేదు, పాపిష్టిది! పురుగులూ, చెత్తా పడింది అందులో. అదంతా తీసేశాను, శుభ్రంగా వుంది. మీకొక గ్లాసెడిస్తాను” అన్నాడు ప్ల్యూష్కిన్.

తన తిండీ, తాగుడూ అయిందని చిచీకవ్ సారా నిరాకరించాడు.

“అప్పుడే తినటమూ, తాగటమూ అయిందా! ఎలాగైనా పరువు గలవాళ్ళు తెలిసిపోతూనే ఉంటారు. తినమన్నా తినరు, తిండి అదివరకే అయిపోయిందంటారు. కాని ఈ దొంగ మొహాలున్నారే, వాళ్లు వస్తే ఒకేతీరున మేపాలి… ఆ కాప్టెన్ వస్తాడు: ‘మామా తినటానికేమన్నా పెట్టు?’ అంటాడు. నేను అతని మామను కాను, నాకతను తాతా కాడు: అతనికింటి దగ్గిర తినటానికేమీ ఉండదో ఏమో, అందుకని ఇక్కడికి చక్కా వస్తాడు! ఇంతకూ ఈ పనికిమాలిన వాళ్ళ జాబితా కావాలంటారు? ఆ జాబితా ప్రత్యేకంగా ఒక కాగితం మీద రాసిపెట్టి ఉంచాను, ఈ సారి జనాభా లెక్కలప్పుడు ఆ పేర్లు కొట్టేయింతామని.”

ప్ల్యూష్కిన్ కళ్ళజోడు పెట్టుకుని కాగితాలన్నీ తడవసాగాడు. ఆయన రకరకాల కాగితాలు ఊడదీసి ఎంత దుమ్ము లేపాడంటే చిచీకవ్ కు తుమ్ము వచ్చింది. చిట్టచివరకాయన ఒక కాగితం ముక్క పైకి తీశాడు, దాన్నిండా రాసి ఉన్నది. ఆకునిండా పురుగులున్నట్టుగా ఆ కాగితం నిండా కమతగాళ్ళ పేర్లున్నాయి. అందులో అన్ని రకాల వాళ్ళూ ఉన్నారు: పరామన్ లూ, పీమెన్ లూ, పంతేలియ్ మన్ లూ, ఒక గ్రిగోరి “ఎన్నటికీ- చేరడు” కూడా ఉన్నారు. అందరూ కలిపి నూట ఇరవైకి పైగా ఉన్నారు. అంతమందిని చూసి చిచీకవ్ ఆనందించాడు. అతను ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుంటూ ఆయన కూడా పట్నానికి రావలిసి ఉంటుందన్నాడు.

“పట్నానికా? ఎలా రాను?… ఇల్లు విడిచి రావటానికి లేదే. నౌకర్లందరూ దొంగలూ, దుర్మార్గులూ కద; ఒక్క రోజులో నన్ను దోపిడీ చేసేసి చొక్కా తగిలించుకునేందుకు వంకీ కూడా లేకుండా చేసేస్తారు”.

“మీ రెరిగిన వాళ్ళెవరూ లేరూ?”

“ఎరిగిన వాళ్ళా? నే నెరిగినవాళ్ళంతా చచ్చిపోయారు, లేదా నన్ను పలకరించటం మానేశారు… ఆఁ, ఉన్నారండి! ఎందుకూ, అధ్యక్షుడు నా స్నేహితుడే, వెనక నన్ను చూడ వస్తుండేవాడు. అతను నాకు తెలియకపోవటమేం! చిన్నప్పుడిద్దరమూ కలిసి తిరిగే వాళ్ళం, కంచెలు ఎక్కేవాళ్ళం. ఎరగకేం? తప్పకుండా ఎరుగుదును… అతనికి రాయనా?”

“అవును మరి, రాయండి!”

“అతను నాకు స్నేహితుడే మరీ! బళ్ళో కలిసి చదువుకున్నాం”.

అంతలోనే ఆయన చెక్కమొహంలోకి అర్ద్రత లాటిది ఏదో పొడగట్టింది. దాన్ని అంతఃకరణ అనుకున్న అస్పష్టమైన దాని ప్రతిబింబం అనవచ్చు. నీటిలో ముణిగిపోయిన మనిషి పైకి తేలిన దృశ్యం లాటిదది- ఒడ్డునవుండే జనమంతా సంతోషంతో కేకలు పెడతారు. ఆశకొద్దీ ఆప్తులు ఒడ్డునుంచి తాడు విసురుతారు, అతని వీపుగాని, నీళ్ళలో కొట్టుకున్న చేతులు గాని మళ్ళీ కనిపిస్తాయేమోనని చూస్తారు – ఆ మనిషి మరి కనిపించడు. నీరు నిశ్చలంగా ఒక చిన్న అల కూడా లేకుండా, ముందుకన్న కూడా భయానకంగానూ, జీవరహితంగానూ కనిపిస్తుంది. అదేవిధంగా ప్ల్యూష్కిన్ మొహం ఆకాస్త ఆర్ద్రతా మాయమైనాక మరింత పెంకులాగానూ, నీచంగానూ కనబడింది.

“ఇక్కడ ఒక తెల్లకాగితం ఉండాలి, ఏమయిందో తెలియటం లేదు. నా నౌకర్లను నమ్మటానికి లేదు!” అంటూ ఆయన బల్లమీదా బల్లకిందా వెతికి, అంతటా తడివి, చిట్టచివరకు, “మాత్ర! మాత్ర!” అని కేక పెట్టాడు. ఈ కేకకు ఒక ఆడది ప్లేటులో ఎండిపోయిన కేక్ ముక్క పెట్టుకుని వచ్చింది; ఈ కేక్ గురించి పాఠకులు వినేవున్నారు. ఆ తరువాత వారిద్దరి మధ్యా ఇలా సంభాషణ నడిచింది:

“ఆ కాగితం ఎక్కడ పెట్టావే, దరిద్రముండా?”

“ఎంతొట్టుబడితే అంతొట్టు, అయ్యగారూ, సారా గ్లాసుమీద మూత పెట్టమని మీరిచ్చినది తప్ప నేనింకే కాయితమూ చూణ్ణే లేదు”

“దాన్ని కాజేశావా? నీ మొహమే చెబుతున్నదే.”

“కాజేసి ఏం చేసుకుంటానూ? దాంతో నాకేంపనీ? రాయలేనాయె, చదవలేనాయె.”

“అబద్ధాలు, దాన్ని తీసుకుపోయి శాక్రిస్టానుకిచ్చి ఉంటావు! అతడికి అక్షర జ్ఞానం ఉన్నది, అందుకని ఇచ్చివుంటావు”.

“ఏం, ఆయనకు కాయితం కావలిస్తే సంపాదించుకోలేడూ? మీ కాయితం ఎటువంటిదో ఆయనకు తెలీదు”.

“అలాగే ఉండు. నరకంలో యములవాళ్ళు నీకు ఇనుప ముళ్లు గుచ్చి నిప్పులమీద కాలుస్తారులే. ఎలా కాలుస్తారో నువే చూస్తావు!”

“నేనా కాగితం తీసుకోనప్పుడు నన్నెందుకు కాలుస్తారూ? ఇంకేమైనా ఆడబుద్ధులుంటే ఉన్నాయేమోగాని, నా కెవరూ దొంగతనం మటుకు అంటగట్టలేరు”.

“ఆ యముల వాళ్ళు నిన్ను కాలుస్తారు. ‘పాపిష్ఠిముండా, మీ యజమాన్ని మోసం చేసినందుకు అనుభవించు?’ అని నిన్ను ఎర్రని నిప్పుల మీద కాలుస్తారు”.

“అప్పుడు నే నే మంటానంటే, ‘నేనేమీ ఎరగను, ప్రమాణ పూర్తిగా ఏమీ ఎరగను’ అంటాను… మరి ఆ బల్లమీద అవతలగా అది కాగితం కాదూ? ఎప్పుడూ నన్ను వొట్టిపుణ్యానికి తిడతారు.”

ప్ల్యూష్కిన్ కు కూడా కాగితం కనిపించింది. ఆయన కొంచెంసేపు పెదవులు నములుతూ నిలబడి, “ఎందుకలా నోరు పారేసుకుంటావ్? ఒక మాటకు పది చెబుతుంది. వెళ్ళి దీపం పట్రా, వుత్తరానికి సీలు వెయ్యాలి. ఆగు! పోయి కొవ్వొత్తి పట్టుకొస్తావేమో, మెత్తని మైనం కాస్తా క్షణంలో హరించిపోతుంది. దండుగ. కాలేకొరివిని పట్టుకురా!” అన్నాడు.

కూవ్ర బయటికి వెళ్లింది. ఆ కాగితంలో కొంత దాచవచ్చు నేమో ననుకుంటూ ప్ల్యూష్కిన్ దాన్ని అటూ ఇటూ తిప్పి తిప్పి చూశాడు; చివరకు, దాన్ని రెండు చెయ్యటం బాగుండదని తేల్చుకుని కలం సిరాబుడ్డిలోని పాచిపట్టిన ద్రవంలో ముంచి – దాని అడుగున చాలా ఈగలు కూడా ఉన్నాయి – అక్షరాలు జాగర్తగా దిద్దుతూ, చేతి దూకుడును అరికడుతూ ఒక పంక్తికి ఆనించి ఇంకొక పంక్తి రాస్తూ, కాగితం మిగిలిపోతుందే అని విచారిస్తూ రాయసాగాడు.

మానవుడైన వాడు అంత అల్పత్వానికి అంత నీచానికి, అంత హైన్యతకు దిగజారిపోవటం సాధ్యమా? మనిషి అలా మారిపోగలడా? ఇలా వాస్తవ జీవితంలో జరుగుతుందా? ఆహా, జీవితంలో నిజంగా జరుగుతుంది. మనిషి ఇలా అయిపోవచ్చు. ఈనాడు ఉద్యోగంతో పొంగిపోయే యువకుడికి వార్ధక్యంలో అతని స్వరూపం ఎలా ఉండబోతుందో చూడగలిగితే దిగ్భ్రమచెంది పోతాడు. మీరు యౌవనపు మార్దనం విడిచి కఠినమైన నడివయసులో అడుగు పెట్టేటప్పుడు మీ మానవ లక్షణాలన్నిటినీ వెంటతీసుకుపోవటం మరవకండి, వాటిని దారిలో జారవిడవకండి. అవి మళ్ళీ మీకు దొరకవు. మీ ఎదుట భయంకరమైన వార్ధక్యం భయపెడుతూ నిలిచి ఉంటుంది. అది మీ కేమీ తిరిగి ఇవ్వబోదు. అంతకంటే సమాధి నయం; దాని మీద “ఇది ఒక మనిషి”అని రాసిఉంటుంది, కాని వార్ధక్యం యొక్క కరుడు గట్టిన, పలక బారిన ముఖంలో ఏమీ రాసి ఉండదు.

ప్ల్యూష్కిన్ తాను రాసిన ఉత్తరం మడుస్తూ, “మరి మీ మిత్రుల్లో పారిపోయిన వాళ్ళను కొనేవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా?” అని అడిగాడు.

చిచీకవ్ వెంటనే చెవులు రిక్కించి, “పారిపోయిన వాళ్ళు కూడా మీ వద్ద ఉన్నారా ఏమిటి?” అని అడిగాడు.

“అదేమరి, ఉన్నారు, మా బావమరిది విచారించాడు కూడా, కాని వాళ్ళజాడ తెలియలేదంటాడు. ఇంతకూ వాడు మిలటరీవాడు లెండి, ఆరెలు ఆడించటమంటే చాతనవును గాని, వ్యవహారమంటే…”

“వాళ్ళు ఎంతమంది ఉంటారో?”

“వాళ్ళూ డెబ్భైమంది దాకా ఉన్నారు.”

“ఆఁహాఁ, నిజంగానా?”

“నిజంగానే మరి! ఏటా కొంతమంది పారిపోతూనే ఉంటారు. పరమ ఆశాపాతకపు సజ్జు. ఒక చెంప నాకు తిండికే లేకుండా ఉంటే, వాళ్లు ఒళ్ళు బరువెక్కి తాగుడు మరిగారు. నిజంగా వాళ్ళకు ఎంత ఇచ్చినా తీసుకుంటానన్న మాట. కనక మీ మిత్రుడితో కాస్త చెప్పండి, పదిమందిలో ఒకడు చిక్కినా లాభపడిపోవచ్చు కమతగాడి ఖరీదు యాభై రూబుళ్ళుంటుంది, తెలుసా?”

“లేదు, నా స్నేహితుడెవడికీ ఈ సంగతి చెప్పబోవటం లేదు,” అనుకున్నాడు చిచీకవ్. అతను ప్ల్యూష్కిన్ తో అలాటి స్నేహితుడెవడూ తనకు దొరకడనీ, వ్యవహారపు ఖర్చులు అంతకన్న ఎక్కువే అవుతాయనీ, కోర్టుల్లో చిక్కుకుని బయట పడలేకపోవటంకంటే దుర్గతి ఉండదనీ, ఆయనకు నిజంగా డబ్బు ఇబ్బందిగా ఉన్న పక్షంలో, ఆయన పై గల సానుభూతి కొద్దీ, ఏదో ఒకలెక్కన… నామమాత్రపు ధరకు తీసుకుంటానన్నాడు.

“ఎంత ఇస్తారేమిటి?” అని ప్ల్యూష్కిన్ అడిగాడు, ఆయనను లోభం ఆవేశించి, ఆయన చేతులు పాదరసంలాగా వణికాయి.

“మనిషికి ఇరవై అయిదు కోపెక్కులిస్తాను.”

“మరి ఎలా కొంటావేమిటి-రొక్కానికేనా?”

“డబ్బు ముందే ఇస్తాను.”

“అయ్యా, బాబూ! నా అవసరం కాస్త గమనించి మనిషికి నలభై కోపెక్కులివ్వగూడదూ?”

“అయ్యొ మిత్రమా, మనిషికి నలభై కోపెక్కులు కాదు, అయిదువందల రూబుళ్ళచొప్పున సంతోషంగా ఇద్దును, ఎందుకంటే ఒక మంచివాడు, యోగ్యుడైన వృద్ధుడు తన మంచితనం మూలాన నష్టపోయిన సంగతి నాకు తెలుస్తూనే వున్నది?”

“నిజంగా అంతే! వాస్తవం అదే! నా మంచితనమే నన్నింత చేసింది!” అన్నాడు ప్ల్యూష్కిన్ తలవంచి, విచారంగా ఆడిస్తూ.

“చూశారా మరి, మీ సంగతి నాకు ఇట్టె తెలిసిపోయింది. అందుకని మీకు అయిదువందల రూబుళ్ళివ్వటానికైనా ఇష్టమే… అయితే నాకు శక్తి చాలదు. కావలిస్తే ఇంకొక అయిదు కోపెక్కులు వేసి మనిషికి ముఫ్పై చొప్పున ఇస్తాను.”

“సరేనండి, బాబూ, మీ ఇష్టం. కాని ఇంకొక్క రెండు కోపెక్కులు పెంచవచ్చు న్యాయంగా.”

“అలాగే కానివ్వండి, మరి రెండు కోపెక్కులు పెంచుతాను. అంతా ఎంతమంది ఉన్నారు. డెబ్భై అన్నారు కాదూ?”

“సమవార్ సిద్ధం చెయ్యమన్నానే. నిజానికి నాకు టీ అంత ఇష్టం లేదనుకోండి, తాగాలంటే తగని డబ్బు ఖర్చు, చక్కెర మండి పోతున్నది. ప్రోష్క, “సమవార్ తో పనిలేదు రా. కేక్ తీసుకుపోయి మార్వ కియ్యి, విన్నావా? దాన్ని మళ్ళీ అక్కడే పెట్టమను. పోనీ, నేనే పెడతాలే. వెళ్ళిరండి, బాబూ, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

“లేదు, అందరూ కలిపి డెబ్భై ఎనిమిదిమంది.”

“డెబ్భై ఎనిమిదీ, డెబ్భై ఎనిమిదీ ముప్ఫై రెళ్ళు…ఇరవై నాలుగు రూబుళ్ళ తొంభై ఆరు కోపెక్కులు.” లెక్కకట్టటానికి మన కథానాయకుడికి ఒక్క క్షణం కంటె ఎక్కువ పట్టలేదు. అతను లెక్కల్లో గట్టివాడు. అతను ప్ల్యూష్కిన్ చేత కమతగాళ్ళ జాబితా వేయించి డబ్బిచ్చేశాడు. ఆయన డబ్బును రెండు చేతులా పట్టుకుని, అదేదో ద్రవ పదార్థమైనట్టూ, దారిలో ఒకరికి పోతుందని భయపడ్డట్టూ, భద్రంగా తీసుకుపోయి బీరువాను చేరుకున్నాడు, అక్కడ మళ్ళీ జాగర్తగా డబ్బంతా ఎంచుకుని, తరవాత దాన్ని ఒక సొరుగులో ఉంచేశాడు. అది ఆయిన చచ్చినదాకా అందులోనే ఉంటుంది, ఆతరవాత ఆ గ్రామంలో ఉండే ఇద్దరు ప్రీస్టులు, ఫాదర్ కార్ప్, ఫాదర్ పోలికార్ప్ అనేవాళ్ళు ఆయనను పాతేయిస్తారు, ఆయన అల్లుడూ, కూతురూ, బంధువునని చెప్పుకునే ఆ కాప్టెనూ ఎంతో హర్షిస్తారు, డబ్బు పెట్టేసి వచ్చి ప్ల్యూష్కిన్ కుర్చీలో కూచున్నాడు, మాట్లాడటానికి ఆయనకు విషయమేమీ తట్టనట్టు కనిపించింది.

చేతిరుమాలు పైకి తీయటానికి చిచీకవ్ కొంచెం కదిలేసరికి ఆయన, “అప్పుడే బయలుదేరుతున్నారా ఏం?” అని అడిగాడు.

ఈ ప్రశ్న వినగానే అతనికి తనకిక్కడ ఇంకేమీ పనిలేదని జ్ఞాపకం వచ్చింది. అతను టోపీ తీసుకుంటూ, “అవును, వెళ్ళాలి” అన్నాడు.

“మరి టీ తీసుకోరూ?”

“వద్దు, ఈసారి వచ్చినప్పుడు మీతో కలిసి టీ తాగుతాను.”

“సమవార్ సిద్ధం చెయ్యమన్నానే. నిజానికి నాకు టీ అంత ఇష్టం లేదనుకోండి, తాగాలంటే తగని డబ్బు ఖర్చు, చక్కెర మండి పోతున్నది. ప్రోష్క, “సమవార్ తో పనిలేదు రా. కేక్ తీసుకుపోయి మార్వ కియ్యి, విన్నావా? దాన్ని మళ్ళీ అక్కడే పెట్టమను. పోనీ, నేనే పెడతాలే. వెళ్ళిరండి, బాబూ, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నా ఉత్తరం అధ్యక్షుడి కిస్తారుగా! అవును, అతన్ని చదవనివ్వండి, నా పాతస్నేహితుడు, చిన్ననాటి స్నేహితులమైతిమి!”

తరువాత ఈ వింత స్వరూపం, ఈ కరడుకట్టిన ముసలాడు అతిథిని గేటుదాకా సాగనంపి వెంటనే గేటుకు తాళం వేసెయ్యమని ఉత్తరులిచ్చాడు; తరువాత తన సామాన్ల ఇళ్లన్నిటి దగ్గిరా కాపలా వాళ్లు నిలబడి ఉన్నదీ లేనిదీ చూసుకొనటానికి ఒక చుట్టు తిరిగి వచ్చాడు, ఆ కాపలావాళ్లు ఇనప పలకలకు బదులు ఖాళీ పీపాలమీద కొయ్య పారలతో కొడుతూ ఉండాలి; తరువాత తన నౌకర్లు వంట ఇంట్లో సరిగా తింటున్నారో లేదో చూసే నెపంమీద వెళ్ళి ఇంత కాబేజీ పూవూ, అన్నము తినేవాడు; తరవాత అందరినీ దొంగలనీ దుర్మార్గులనీ తిట్టి తన గదికి తిరిగి వచ్చేవాడు. ఆయన ఒంటరిగా కూచుని, తనకు ఎవరూ చేయని మేలు చేసిన ఈ కొత్త మనిషికి కృతజ్ఞత ఎలా చూపుదామని నిజంగానే ఆలోచించాడు. “ఆయనకొక గడియారం ఇస్తాను. అది మంచి వెండి గడియారం, ఇత్తడిదీ, కంచుదీ కాదు, దానికేదో అయింది. కాని, అతను సరిచేయించుకోవచ్చు, ఇంకా చిన్నవాడు, గడియారం ఉంటే చూసి పెళ్ళాం సంతోషిస్తుంది. వద్దు, నా జ్ఞాపకార్థం అది అతనికి చెందేట్టు నా ‘విల్’ లో రాస్తాను,” అనుకున్నాడాయన.

అయితే మన కథానాయకుడు గడియారం లేకుండానే మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఇంత లప్పదొరకటం కేవలం అదృష్టం. నిజంగామరి చచ్చిపోయినవాళ్ళే కాకుండా పారిపోయినవాళ్ళు కూడానూ, అందరూ కలిసి రెండువందల చిల్లర! తాను ప్ల్యూష్కిన్ ఇంటికి వచ్చేటప్పుడు కొంత లాభిస్తుందనుకున్న మాట నిజమేగాని, ఇంత లాభసాటి బేరం తగులుతుందని ఏ మాత్రమూ తట్టలేదు. అందుచేత అతను దారిపొడుగునా అపరిమితానందంలో ఉన్నాడు, అతను ఈలపాట పాడాడు, వేళ్ళతో పాట వాయించాడు, చివరకు తన పిడికిళ్ళు బాకాలాగా నోటి దగ్గిర పెట్టి ఒక విచిత్రమైన పాట ఎత్తుకున్నాడు. సేలిఫాన్ ఆ పాట ఎంతో సేపు విని విని, “ఓ యబ్బ, యజమానికి పాట వచ్చేసిందే’ అనుకున్నాడు.

వాళ్ళు పట్నం చేరేసరికి మసక చీకటి పడింది. వెలుగు చీకటి లోకి అంతర్ధానమవుతున్నది. ఆకారాలు కూడా అస్పష్టమైపోతున్నాయి. అనేక రంగులుగల జెండా స్తంభం అస్పష్టమైన రంగులో కనిపిస్తున్నది. కాపలా డ్యూటీ మీద నిలబడివున్న సైనికుడి మీసాలు కళ్ళకు చాలా ఎగువగా నుదిటి పైన ఉన్నట్టున్నాయి, వాడిముక్కు అసలు కనిపించటం లేదు. బండి చేసే మోతను బట్టి, దాని కుదుపునుబట్టీ అది రాళ్లు పరిచిన దారిన పోతున్నట్టు తెలుస్తున్నది. వీధి దీపాలింకా వెలగలేదు గాని, అక్కడక్కడా ఇళ్ళ కిటికీలలో వెలుగు కనపడసాగింది. సందుల్లోనూ, వీధి మలుపులో ఒక రకమైన సంభాషణ వినబడసాగింది. సిపాయిలూ, బళ్ళవాళ్లూ, కూలివాళ్ళూ, ఆడవాళ్ళ ఆకారంలో ఎర్రశాలువలు కప్పుకుని, స్టాకింగులు లేకుండా స్లిప్పర్లు మాత్రం వేసుకుని, వీధి మలుపుల్లో గబ్బిలాలలాగా అటూ ఇటూ పరిగెత్తే వింత వ్యక్తులూ గల ప్రతి పట్టణంలోనూ ఈ సమయానికి ఇలాటి సంభాషణే వినబడుతుంది. చిచీకవ్ వీళ్ళని గమనించలేదు, చిన్న చిన్న బెత్తాలు పట్టుకుని అతి నాగరికంగా షికారునుంచి ఇళ్ళకు కాబోలు వెళుతున్న సర్కారు గుమాస్తాలను కూడా అతను గమనించలేదు. అప్పుడప్పుడు ఆశ్చర్య ప్రసంగాలూ, ఆడవాళ్ళ గొంతులూ అతని చెవిని పడ్డాయి.

“పచ్చి అబద్ధం, తాగుబోతాడా, వాడికి అంత అలుసిస్తానా?” “దెబ్బ లాడతావేం రా, నీచుడా, పోలీసుస్టేషనుకు పద, నీసంగతి చెబుతాను!” అప్పుడే నాటకం చూచి స్పెయినులోని వీధులను గురించీ, వేసవి రాత్రులను గురించీ, ఉంగరాలజుట్టూ, శితార్ వాద్యమూగల ఒక అద్భుత సుందరిని గురించీ అలోచిస్తూ వచ్చే ఇరవై ఏళ్ళ నవయువకుడి చెవిని ఇలాటి మాటలు పడితే వాడి చెవులు కమిలిపోతాయి; వాడు భావనాప్రపంచంలో, మబ్బుల్లో ఉంటాడు, లేదా ఏ షిల్లర్ మహాకవి సాన్నిధ్యంలోనో ఉంటాడు, ఇంతలో పిడుగులాగా ఈ మాటలు వాడిపైన పడతాయి. ఠకీమని వాడు భూమి మీదకి వచ్చేసి, సమీపంలో ఉన్న గడ్డి మార్కెట్టునూ, బీరుదుకాణాన్ని చూస్తాడు. మామూలు వేషంలో నిత్యజీవితం వాడిముందు కనిపిస్తుంది.

చిట్టచివరకు బండి గోతిలో పడ్డంత కుదుపుతో హోటలు గేటులోపలికి ప్రవేశించింది. పెత్రూష్క ఎదురువచ్చి, ఒక చేత్తో తన కోటు అంచులు భద్రంగా పట్టుకుని, రెండవ చేత్తో తన యజమాని దిగటానికి సహాయం చెయ్యసాగాడు. వెయిటరు భుజాన తువాలు వేసుకుని ఒక చేత్తో కొవ్వొత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు; తన యజమాని రాకకు పెత్రూష్క సంతోషించాడో లేదో ఎవరూ చేప్పలేరు. ఏమైనా వాడూ, సేలిఫానూ ఒకరికొకరు కన్ను మలుపుకున్నారు. మామూలుగా తుమ్మల్లో పొద్దుకూకినట్టుండే వాడి మొహం ఒక్క క్షణంపాటు వికసించింది.

“దొరగారు చాలాకాలానికి తిరిగొచ్చారు,” అన్నాడు వెయిటరు మెట్లమీద దీపం చూపిస్తూ.

“అవును, నువు బాగా ఉన్నావా?” అన్నాడు చిచీకవ్.

“దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను,” వెయిటరు మర్యాదగా వంగుతూ “ఎవరో లెఫ్టినెంటు, మిలిటరీ ఆయన, నిన్న వచ్చి పదహారు నంబరు గది తీసుకున్నారు.”

“లెఫ్టినెంటా?”

“ఆయనెవరో నాకు తెలీదు. ర్యజాన్ నుంచి వచ్చారు, ఎర్ర గుర్రాలు.”

“మంచిది, మంచిది. ముందు ముందుకూడా మంచిగా వుండు” అంటూ చిచీకవ్ తన గదిలోకి వెళ్ళాడు. బయటి గదికుండాపోతూ అతను పెత్రూష్కతో, “కిటికీలన్నా తెరిచి ఉంచకపోయావా?” అన్నాడు ముక్కు చిట్లిస్తూ.

“తెరిచానండీ!” అన్నాడు పెత్రూష్క, అయితే అది అబద్ధం. ఆ సంగతి యజమానికి తెలుసు, కాని దాన్ని గురించి తర్జనభర్జన చెయ్యలేదు.

ప్రయాణంలో అతను డస్సిపోయాడు. పందిపిల్ల మాంసంతో అతితేలికగా భోజనం ఆర్డరిచ్చి, భోజనం పూర్తి చేస్తూనే బట్టలు విప్పేసి, దుప్పటికింద దూరి సుఖనిద్రలో ముణిగిపోయాడు. అలాటి సుఖనిద్రలో కలలూగాని, గోమర్లూగానీ,అమితంగా అభివృద్ధి అయిన మేధస్సుగాని లేని ధన్యులకు మాత్రమే లభ్యమవుతుంది.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.