స్వరూప్ కృష్ణ:
ఇప్పుడో నది కావాలి
ఆ జీవితాలు పేవ్ మెంట్ల మీద చిగురిస్తుంటాయ్
ఇనుప రింగుల్లో శరీరాన్ని
బలవంతంగా తోసేస్తుంటాయ్
విన్యాసాలు చేస్తుంటాయ్
ఎలా జీవించాలో నేర్పుతూ మన దృష్టి నాకర్షిస్తుంటాయ్
ప్రవాహంగా సాగుతున్న నదుల మధ్య
ఎండిన చెట్లలా ఊగుతుంటాయ్
విరుద్ధంగా ఉన్నా
వైవిధ్యంగా లేదూ..
విరుధ్యమే నిజాన్ని ఆవిష్కరిస్తుంది
విరుధ్యం చూడకుండా జీవితాన్ని అక్షరీకరించడం ఎలా?
ఇలా చరిత్ర ఎన్ని పుటల్లో అనర్థాలు దాచుకుందో!
ఎండిన చెట్లను సమూలంగా
నరికివేయాలని
గొంతెత్తి అరచే గండ్ర గొడ్డళ్ళకు
చిగురింపచేయటం గురించి ఏం తెలుసు..
చిగుళ్ళను కొనగోటితో
తుంచేస్తున్నంతకాలం
నదుల మధ్య ఎండిన చెట్లు ఉంటూనే ఉంటాయ్
ఇనుపరింగులు కసరత్తులు చేస్తూనే ఉంటాయ్
దట్టమైన డాలర్లోంచి రూపాయ
రొట్టె ముక్కకు ఎగబడే
జీవితాలు కనిపించవ్…
కంప్యూటర్ చిప్స్ లో సంగీతం
ఆస్వాదించే చెవులు
ఆకలి డొక్కల ఆర్తనాదం వినలేవు…
ఇప్పుడో నది కావాలి
ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు
మూలం వేళ్ళను తడిసి
పచ్చదనం చిగురింపచేసే నది
నగరం నడి బొడ్డున
ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు
భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి
అన్నం పంచే నది
ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది…
తమ్మినేని యదుకులభూషణ్: “ఇప్పుడో నది కావాలి “అన్న వాక్యం నుండి అసలు కవిత మొదలవుతుందని నా అభిప్రాయం. ఆ పైన ఉన్న అన్ని వాక్యాలు కవిత్వానికి అక్కరకు వచ్చేవి కావు.
ఇప్పుడో నది కావాలి
ఇప్పుడో నది కావాలి
ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు
మూలం వేళ్ళను తడిసి
పచ్చదనం చిగురింపచేసే నది
నగరం నడి బొడ్డున
ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు
భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి
అన్నం పంచే నది
ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది…
ఇప్పుడు కవిత- మూర్తంగా, బలంగా వుంది !!
స్వరూప్ కృష్ణ:
లిటిల్ సోల్జర్స్
వాళ్ళు సైనికులు
లయబద్ధంగా బూట్లు చప్పుడు చేస్తూ
నడుస్తుంటారు..
వీపున కేజీల కొద్ది బరువును మోస్తూ
భవిష్యత్తు కోసం పరుగెడుతుంటారు..
పారవేసుకున్న తాజా నవ్వుల్ని
ఆ ఇసుక దిబ్బల్లో వెతుకుతూ
అసహనంతో తిరుగుతుంటారు..
పోగొట్టుకున్న ఆప్యాయతల్ని
ఆ పూలమొక్కల్లో వెతుకుతూ
కలవరంగా కలయతిరుగుతుంటారు..
తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలో
అమ్మ గోరుముద్దలు
చందమామ కోసం శోధిస్తూ
ఆబగా చూస్తు ఆశగా గెలుకుతుంటారు..
క్రమ శిక్షణ ఇనుపచువ్వల్లో
పిచ్చుకలా ఒదిగి కూచుని
స్వేచ్ఛ కోసం పరితపిస్తుంటారు..
రాత్రి పడకలో ఒంటిగా పడుకుని
కలల్లో దెయాలు, రాక్షసుల్తో
హీరోలుగా పోరాడుతుంటారు..
సూర్యుడు కళ్ళు తెరవగానే
వెలుగులో చీకట్లను అనుభవిస్తూ
దిగాలుగా రాత్రి కోసం ఎదురు చూస్తుంటారు..
ప్రేమ ఉదయించే వరకూ వారి పోరాటం సాగుతూనే ఉంటుంది
వాళ్ళు సైనికులు…
తమ్మినేని యదుకులభూషణ్:
లిటిల్ సోల్జర్స్
వాళ్ళు సైనికులు
లయబద్దంగా బూట్ల చప్పుడు
వీపున కేజీల కొద్ది బరువు
భవిష్యత్తు కోసం
పరుగెడుతుంటారు..
ఇసుక దిబ్బల్లో
అసహనంగా
పూలమొక్కల్లో
కలవరంగా
కలియతిరుగుతుంటారు..
దేనికోసమో వెతుకుతూ
క్రమ శిక్షణ ఇనుపచువ్వల్లో
పిచ్చుకలా ఒదిగి కూచుని
స్వేచ్చ కోసం పరితపిస్తుంటారు..
రాత్రి పడకలో ఒంటిగా పడుకుని
కలల్లో దెయాలు, రాక్షసుల్తో
ధైర్యంగా పోరాడుతుంటారు..
సూర్యుడు కళ్ళు తెరవగానే
వెలుగులో చీకట్లను అనుభవిస్తూ
రాత్రి కోసం ఎదురు చూస్తుంటారు..
వాళ్ళు సైనికులు…
ఈ కవితను వచన శృంఖలాలనుండి విడిపిస్తే ఇలా ఉంటుంది. అందరూ ఊహించుకోగలిగిన విషయాలను కవి వర్జించి తనదైన విలక్షణ దృష్టితో వీలయినంత క్లుప్తంగా అందించాలి. పాఠకులను తక్కువ అంచనా వేయకూడదు. వారి ఊహాశక్తిని గౌరవించి కవితాస్వాదనలో వారివంతు పాత్రను వారిని నిర్వర్తించనివ్వాలి.
చావా కిరణ్:
నేను ఒక రాత్రి నిద్రపోయి
మర్నాటి రాత్రి మేల్కొన్నాను
నేను నేను కాదు పొమ్మన్నారు!
నేను ఒక సుందర సౌధం నిర్మించి
అలసి కునుకు తీసి మేల్కొన్నాను
సౌధం కాదు, రాళ్ళగుట్ట అన్నారు!
నేనొక యుద్ధంలో ఓడినాను
మరో యుద్ధంలో గెల్చినాను
కానీ నన్ను మాత్రం ఇంకా గెలుచుకోలేదు!
నేనొక సుమధుర స్వరం స్వరపరచి
హాయిలో ఓ కునుకు తీసి మేల్కున్నాను
స్వరం కాదు పరం అన్నారు!
నేనొక అద్భుత కావ్యం వ్రాసి
ఆనందంతో మరోలోకం వెళ్ళి వచ్చినాను
కావ్యం కాదు, పిచ్చి గీతలన్నారు!
నేను ఒక రాత్రి నిద్రపోయి
మర్నాటి రాత్రి మేల్కొన్నాను
నేను నేను కాదు పొమ్మన్నారు!
కత్తి మహేష్ కుమార్:
బంగరు లేడి ఉండదని తెలిసి
సీత ఆశ అత్యాశని మరచి
విల్లుని నిమిరి
అంబులపొది బిగిసి
వడివడిగా అడుగేసావే!
ఒక్క క్షణమైనా
నీ ఆదర్శం అనుసరణీయమౌతుందని
తప్పులనుకూడా తలనెత్తుకునే తరుణమొస్తుందని
ఆలోచించావా?
అవునులే
ఎంతైనా మర్యాదా పురుషోత్తముడివి
పురుషులలో మాత్రమే ఉత్తముడివి
ప్రపంచానికి మర్యాదలు నేర్పినా
చిట్టచివరకు, పదుగురిలాంటి మొగుడివి
నీ మార్గం ఆదర్శమయింది
అవినీతికి అందలమయింది
ఆరంభం బంగారుజింకతోనైనా
మనుషుల్ని మాయజేసే ఉన్మాదమయింది
రామమార్గం రాజమార్గం అయ్యింది
(Indian Administrative Services అధికారుల్లోని అవినీతికి సంబంధించిన ఒక చర్చలో, మధ్యతరగతికి చెందిన కొత్త IAS అధికారుల పెళ్ళిళ్ళు ఎగువతరగతి మహిళలతో జరగడం వలన వారి life style కొనసాగించడానికి, లంచాలు తీసుకోవడం మొదలుపెడతారనే విషయం చెప్పడం జరిగింది. ఆ ఆలోచన ఆధారంగా పై కవిత)
స్వాతీ శ్రీపాద:
నేను మాత్రం
ఓ ఖాళీ జీవితం
తెల్ల కాగితమై ఎదురుగా చేతుల్లోవుంది.
కాలం కుంచెకు మనసునద్ది
కళాఖండాలు సృష్టిస్తారో
ఉట్టుట్టి పడవల్ను చేసి
ఎడారి ఏటి వాలుకు ఒదిలేస్తారో
అదంతా మీఇష్టం.
నాకు మాత్రం
అలల కలలపూదోట
అక్షరాల విరిబాలలు
ఊయల్లూగుతూ
నిశ్శబ్ద గమకాల్ను
గుండెను నొక్కి మరీ
పలికిస్తాయి.
కొండా కోనా దూరానికి
గీసిన పెన్సిల్ చిత్రాలా
శబ్దరాహిత్యాన్ని కొలుస్తున్నా
ఒక్కసారి.. ఒక్కసారంటే ఒక్కసారి
దరిదాపుల్ను
కంటిచూపు స్పర్శతో తడిమిచూడు
సుతారంగా రెక్కలల్లార్చే
గాలి చూపుల గిలిగింతలూ
వివరణకందని పులకింతల్ను
నిలువెల్లా రాగాలుగా మార్చుకోలేదూ?
నిలువెల్లా కదలిపోయిన మనసు
జలజలా రాల్చే పున్నాగల్ను
అదిగో అనుభవాల పొరలమధ్య పదిలంగా
పరిరక్షించుకున్నానుగా ..
ఇప్పుడూ అవి గాలి వాటుకు
సుగంధాల్ను మోసుకువస్తూనే ఉన్నాయి
ఆశల తివాచీ పరచుకు
ఆకాశం మలుపుల్లో
మరువపు చెలమల్ను
వేలికొసల పలకరింపుల్లో
పంచుకున్నది
మనసా శరీరమా?
ఏ క్షణానికాక్షణం
అనుభూతుల అమృతాన్ని
తనివితీరా తాగితాగి
అమరమైపోయిన నిన్న
నేడు నా వర్తమానం
రేపది నా అపార సౌఖ్యానంద సంపద
జీవితాన్ని పొందికగా పెదవుల వెనక మలచుకున్నాక
ప్రతిమాటా
ఓ తియ్యని మాధుర్యమే.
పునరపి జననం పునరపి మరణం
అందుకే గిర్రున తిరిగొచ్చే ఉగాదినై
నేను మళ్ళీ మళ్ళీ
కావ్య ఖండాల్ను
పరిచయం చేస్తూనే పోతాను.
పిలుపు
యుగాల గుండెగొంతుకలోంచి
ఒక పిలుపు
అస్పష్టంగా అనుకున్నా
కానేకాదు
మనసు పొరల్లోదూరి
అంతరంగ ప్రపంచాల్ను
అతలాకుతలంచేస్తూ
ఎక్కడినుండో ఓ పలకరింత…
చిన్నప్పుడు
అమ్మఒడిలో తెలిసీతెలియని బాల్యం
అమరానందలనుకుని
ఆదమరచినజాడ ఆ పలకరింపేనా?
నలుగురిలో ఒక్కరిగా
నడిసముద్రాన ఈదులాడిన
బ్రతుకు పెనుగులాటలో
రక్తం పంచుకున్న ఆత్మీయుల
స్వరమా అది?
నాచుట్టూ మకరందం కోసం
గింగిరాలు కొట్టే మరందంలా
అంతలోనే
జన్మ జన్మలకావల రూపం లేని
మమతల వల్లరి హఠాత్తుగా
ఓ ఉలికి పాటులా హెచ్చరిస్తూన్నది
చేజారిన అద్దం ముక్కలా
భళ్ళున పగిలి ముక్కలైన
జీవితం ప్రతిముక్కలో
వేలవేల ప్రతిబింబాలు
అస్పష్టంగా అదృశ్యంగా
చెవిలో పెదవులాంచి
పిలుస్తున్న ఆలాపన.
ఎక్కడో ఊహల ఎడారిలో అలసి సొలసి
ఆగిపోయిన సుధీర్ఘయానానికి
ఓగుక్కెడు స్థైర్యాన్నందిస్తూ
ఓ చల్లని ఒయాసిస్సు పిల్ల తెమ్మెర స్పర్శ
అణువణువునూ పులకరింతల
పలకరింపుల్తో అభిషేకిస్తూ
చిదిమేసిన రేపటికి
రాగాన్ని అందిస్తూ ఓ పిలుపు.
కదలికల్లేని శిలావిగ్రహంలా
సజీవత ఉరేసుకున్న
సౌందర్య శకలంలా
ఎన్నైనా ఉపమానాలు
నాచుట్టూ దీపం పురుగులై
రెక్కలు పోగొట్టుకు
మూలుగుతున్న దుర్భర రణగొణల మధ్య
అ చిన్న చురుక్కుమన్న స్పర్శ
నరాల్లోకి వెయ్యికాళ్ళతో ఎగబాకుతున్న
నిశ్చలత అనెస్తీషియా లా
ఓ చల్లని ఓదార్పు
అడుగడుగునా కనువిందు చేసే
పాదముద్రల హృదయంలో తలదూర్చి
గుసగుసలుగా పలికే స్వరం
అదేనా ఈ పలకరింపు.
నిషిగంధ:
స్వాతి శ్రీపాద గారూ, నమస్తే,
“కొండా కోనా దూరానికి
గీసిన పెన్సిల్ చిత్రాలా
శబ్దరాహిత్యాన్ని కొలుస్తున్నా” (నేను మాత్రం)
చాలా బావుందండి. నిశ్శబ్ద కవిత్వానికి అలవాటుపడిపోవడంవల్లనేమో మీ కవితల్లోని అనుభూతి మనసుకి చేరుకోవడానికి రెండు మూడుసార్లు చదవాల్సి వచ్చింది..
అలాగే, ఈ కవితలో మొదటి చరణం చివరి లైన్‌లో వచ్చిన ‘నిలువెల్లా’ మళ్ళీ వెంటనే తర్వాత చరణం మొదట్లోనే రావడం కొంచెం భావాన్ని పల్చన చేసినట్లనిపించింది..
రవిశంకర్: మీ కవితలో భావనాపటిమ బాగుంది. కాని, కవితను కొంత కుదించవచ్చు. ఉదాహరణకు, “ఎక్కడో ఊహల ఎడారిలో” అన్న స్టాంజాని పూర్తిగా తొలగించవచ్చు. అలాగే, చివర్లో అనెస్తీషియాలా అని చెప్పకుండా వదిలిపెడితే మెరుగ్గా ఉంటుంది.
తమ్మినేని యదుకులభూషణ్: కవిత్వానికి అవసరమైన భావధార ఉంది. కొంత క్లుప్తత అవసరం. బహువచన రూపాలమీద న వత్తు చేర్చడం వల్ల ఇబ్బంది. దరిదాపులు+ను దరిదాపులను అంటే సరిపోతుంది కదా. దరిదాపుల్ను అన్న రూపం బాగాలేదు. చాలాచోట్ల కనిపిస్తోంది ఈ దోషం. అలాగే పడిగట్టుపదాలను పరిహరించాలి.
స్వాతీ శ్రీపాద:
ఆద్యంతం
అనాదినుండి రేపెప్పుడో భవిష్యత్తులో
ఎదురు చూసే అంతం వరకూ
అమే కదా అన్నింటికీ ఆదీ అంతమూ కూడా….
ఎండి బీడై బీటలు వారిన సమయాన్ని
నిలువెల్లా పాలవెల్లువ జీవధారలో తడిపేస్తూ
హృదయం తీగల్ను సవరించి
దిగంతాలచుట్టూ ఊపిరి పాటల
పారిజాతాల్ను ఆరబోసినది ఆమే కదా!
నిరంతర సద్భావ సమీకరణాల్లో
సామరస్య సరిగమల్ను
గమకాలుగా పలికిస్తూ రంగుల సింగిణీలనోవైపు
సతత హరిత భావలనూ-
నైర్మల్యపు వెలుగు అలలను మరోవైపు
సమతూకం వేసేదీ ఆమేకద _విశ్వ జనని.
బూడిదైన ఆశలను ప్రోది చేసి
సంజీవనిగా సజీవతనందిస్తూ
చుట్టూ లోకానికి-ఫీనిక్స్ లా మారుస్తూ
మళ్ళీ మళ్ళీ పునర్జన్మ నిచ్చే
మాంత్రికురాలు ఆమేకదా -ఆదిశక్తి
మబ్బుమసకల్లో తూనీగల హోరులా
మమతల సందడి నీరసించి
వేళ్ళడబడిపోయిన మానవతకు
చూపుల కాంతి రెక్కలమీద
పుష్పక విమానం మీద
మాటల
అమృతాన్ని మోసుకువచ్చేదీ ఆమేకద!
వెలుగు రథ చక్రాలమీద అలవోకగా వాలి
వేలికొసల స్పర్శకే పులకించి చిగురించే
క్రొన్ననల రాగరంజిత సింధువై
ఆకాశానికీ భూమికీ మధ్య
అణువణువునూ స్వంతంచేసుకున్న
గాలి ఆమె నీరు ఆమె
వాన ఆమే వరదా ఆమే
ఆర్తిగా బ్రతుకును చుట్టేసే వెలుగే ఆమె.
మనసు అరలనిండా పదిలంగా విరబూసే
పున్నాగల గుసగుసల పరిమళం ఆమె.
చుక్కలు చుక్కలుగా
దివినుండిభువికి
ప్రవహించే పృరేమ సరిత్తు ఆమె.
ఓ చిరునవ్వు చల్లగాలి తొణకని ఓ అమృతబిందువు.
అందుకే అమె జగన్మాత.